భాష నిఘంటువులు ఆంధ్రనామసంగ్రహము
అవతారిక
క. శ్రీపతివంద్యు విశాలా
క్షీపతిని భజించి యిష్ట - సిద్ధులు వరుసన్‌
బ్రాపింపఁగ గణనాథుని
శ్రీపాదంబులకు నెఱఁగి - చెందిన వేడ్కన్‌.
1
క. నతభక్తలోకరక్షా
రతికిం జంచత్కృపాత - రంగితమతికిన్‌
శతమఖముఖసురనుతిసం
గతికిన్‌ మహిమోన్నతికిని - గాశీపతికిన్‌.
2
తే. అంకిత మొనర్తుఁ దెనుఁగుపే - ళ్లరసి కూర్చి
గరిమతో నాంధ్ర నామసం - గ్రహ మనంగ
నమరుకృతిఁ బైడిపాటి యే - కామ్రమంత్రి
సుతుఁడఁ గవిలక్ష్మణాఖ్యుఁడ - సుజనహితుఁడ.
3
తే. దేవమానవస్థావర - తిర్యగాఖ్య
వర్గు లొనరింతు నానార్థ - వర్గుఁ గూడ
వర్గములు గాఁగఁగూర్తు నా - హ్వయమునందు
నిడుదు వివరించునెడల సం - స్కృతపదంబు.
4
క. శ్రీలలనాధిపవంద్య! వి
శాలాక్షీ ప్రాణనాథ! - శతమఖముఖది
క్పాలాభీష్టద! సమధిక
శీలా! కాశీనివేశ! - శ్రీవిశ్వేశా!
5
AndhraBharati AMdhra bhArati - AMdhra nAma saMgrahamu - bhAshha - nighaMTuvulu - AMdhranAmasaMgrahamu ( telugu andhra )