భాష నిఘంటువులు ఆంధ్రనామసంగ్రహము
నానార్థవర్గు
క. కలు పనఁ బే రగు దధికిం
గలు పన సస్యంబులోని - గాదముపే రౌ
వెలు గండ్రు కంపకోటను
వెలుఁ గందురు ప్రభను జనులు - విశ్వాధిపతీ!
1
క. మావు లనం దగు హయములు
మావు లనం బరఁగు నామ్ర - మహిజంబు లిలం
దావు లన స్థల మొప్పును
దావు లనన్‌ వాసనలకుఁ - దగుఁ బేరు శివా!
2
క. ఇమ్మహిలోపలఁ బే రగు
గొమ్మ యనన్‌ వృక్షశాఖ - కును భామినికిం
దమ్ము లనం బే రగుఁ బ
ద్మమ్ముల కనుజన్మలకును - దరుణేందుధరా!
3
క. ఇమ్ములఁ బే రగుఁ దాటం
కమ్ములకున్‌ లేఖలకును - గమ్మ లనన్‌ నా
మమ్ము దగుం గంఠాభర
ణమ్మునకును లతకుఁ దీఁగె - నా గౌరీశ!
4
క. చెల్లును బేళ్లై ధరలోఁ
దా ళ్లనఁ సూత్రంబులకును - దాళంబులకుం
గో ళ్లనఁ గుక్కుటములకు
బేళ్లగు ఖట్వాంగములకుఁ - బేళ్లగు నభవా!
5
క. చామ యన సస్యమునకును
భామినికిని నాఖ్య యగుచుఁ బరఁగు ధరిత్రిన్‌
నామము లగుచును వెలయును
బాము లనన్‌ జన్మములకును - భంగమ్ములకున్‌.
6
తే. దంట యనఁగ నభిఖ్య యై - దనరుచుండు
జగతిలోపలఁ బ్రౌఢకు - యుగళమునకుఁ
బఱ పనంగ నభిఖ్య యౌఁ - బానుపునకు
విస్తృతమునకు శైలని-వేశ! యీశ!
7
క. తొలి యనఁగా నగు నామం
బులు పూర్వంబునకు సుషిర - మునకును ధరలో
వెలి యనఁగ బహిర్ధవళం
బులకును నామంబు శేష - భుజగవిభూషా!
8
క. నెమ్మి యనన్‌ వంజులవృ
క్షమ్మునకున్‌ బర్హికిని సు-ఖస్థితికిని నా
మమ్ముగఁ దగు నతిధీర య
హమ్మతిజనదూర! పన్న - గాధిపహారా!
9
క. పోలం బే రగుచుండును
బా లనఁగా క్షీరమునకును - భాగమునకుం
గాలనఁ బే రగు నాలవ
పాలికిఁ బాదంబునకును - బాలేందుధరా!
10
క. మే లన శుభంబు పే రగు
మే లన నుపరికిని గూరి-మికినిం బేరౌ
మే లన మెచ్చునఁ బల్కిన
యాలాపంబునకు నాఖ్య - యగు జగధీశా!
11
క. ధారుణిఁ బేరు వహించును
బూరుగు నా నూఁదువాద్య-మును శాల్మలియుం
బే రన నభిధానం బగు
హారమునకు నామమునకు - నంబరకేశా!
12
క. క ప్పన నీలిమపే రగుఁ
గ ప్పనఁగా నింటిమీఁది - కసవుకుఁ బేరౌఁ
గొ ప్పనఁ దగుఁ జాపాగ్రము
గొ ప్పగు ధమ్మిల్లమును గృ-హోపరియు శివా!
13
క. ఒక భూరుహమునకును ధమ
నికిఁ బే రగుఁ గ్రోవి యనఁగ - నెఱినట్టుల వే
ఱొక భూజమునకు నధరము
నకుఁ బే రగు మోవి యనిన - నగరాట్చాపా!
14
క. చవు లనఁగా నభిధానము
లవు షడ్రుచులకును ముత్తి-యపుటెత్తులకున్‌
భువిలోపల నామము లగు
గవులన గుహలకునుఁ బూతి-గంధంబులకున్‌.
15
తే. ఆఖ్య యై యొప్పు ధరణిలో - నపరదివస
మునకు ఛత్రంబునకు నెల్లి - యనెడినుడువు
జక్కి యనుపేరు పరఁగును - సైంధవంబు
నకు ఘరట్టంబునకు గం-దర్పదమన!
16
తే. ఆడె ననుమాట నటియించె - ననుటకును వ
చించె ననుటకు మఱియు నిం-దించెననుట
కాఖ్య యగుచును శోభిల్లు - నాలు నాఁగ
గోవులకును భార్యకును బే ర - గు న్మహేశ!
17
సీ. రజతపునఃపదా - ర్థములకును నభిధాన
మగు వెండి యన బంతి - యనఁగ గందు
కమునకు శ్రేణికి - నమరు నాహ్వయముగా
దండ యనం బుష్ప-దామమునకు
నంతికంబునకుఁ బే - రగు దొర యన నాఖ్య
యగు సదృశమునకు - నవనిపతికి
నస్త్ర సంఖ్యకు నహ - మ్మనుటకు నాహ్వయం
బగు నే ననఁగ సరి - యనఁగ సదృశ
 
తే. మునకును సమసంఖ్యకును నామ - ముగ నెసంగు
గొంతనఁగ నాహ్వయంబగుఁ - గుక్కుటాస
నంబునకుఁ గంఠంబునకును - నల్ల యనిన
రక్తనీలాఖ్య యై యొప్పు - రాజమకుట!
18
సీ. తీరంబునకు ధరి-త్రీధరంబునకు స
మాఖ్య యై యొప్పు గ - ట్టనఁగ నీశ!
కేతువునకుఁ గాంతి-కిని సమాహ్వయ మగు
డా లనంగను మేరు-శైలచాప!
శౌర్యధుర్యునకు లాం-ఛనమునకును నామ
మగు బిరు దనఁగ బ-న్నగవిభూష!
గూబ నా నాఖ్య యౌ - ఘూకంబునకుఁ గర్ణ
మూలంబునకు నవి-ముక్తనిలయ!
 
తే. యంతికంబునకును సమూ-హంబునకును
నామ మై యొప్పుఁ జేరువ - నాఁగ నభవ!
సమభిధాన మై యొప్పుఁ బి-శాచమునకుఁ
బవనమునకును గాలి య-న్పలుకు రుద్ర!
19
క. ఇలలోపల నామం బగుఁ
బలుకులు నా శకలములకు - భాషణములకున్‌
నెల యన నభిధామం బగు
జలజారికి మాసమునకు - శైలనిశాంతా!
20
సీ. అంతర్హితుండయ్యె - ననుటకు నాగతుం
డయ్యె ననుటకు స - మాఖ్య యగుచు
నలరును విచ్చేసె - ననుట యంబరకేశ!
నెఱి సమాహ్వయ మగుఁ - గఱచె ననఁగ
నభ్యాస మొనరించె ననుటకు - దంతపీ
డ యొనర్చె ననుటకు - నయుగనయన!
వెలయుఁ దప్తక్షీర - ములకు నభిజ్ఞకు
నాఖ్యయై యానవా - లనుట యీశ!
 
తే. పఱచె ననఁగ సమాఖ్య యౌ - బాధచేసెఁ
బ్రచలితుం డయ్యె ననుటకుఁ - బాండురాంగ!
పరఁగ మోహించె ననుటకుఁ - బరిమళించె
ననుట కొప్పును వలచె నా - నళికనేత్ర!
21
సీ. ఆనె నంట సమాఖ్య - యౌను వహించెఁ బా
నము చేసె ననుటకు - నగనివేశ!
చషకంబునకును దం-ష్ట్ర కు నాఖ్య యౌఁ గోర
యనఁగ శశాంకక-ళావతంస
మొక్కలీఁ డనగఁ గొ-మ్ములు లేనికరికి ము
ష్కరునకుఁ బే రగు - గరళకంఠ!
మరకతచ్ఛవికి నం-బరమున కగుఁ బేరు
పచ్చడం బనిన నం-బాకళత్ర!
 
తే. క్షితిని దురగీపతికి వృత్త-శిలకు నామ
ధేయ మై యొప్పు గుండు నాఁ - ద్రిపురహరణ!
నామ మౌ నొక్కసస్యంబు-నకును లోప
మునకుఁ గొఱ్ఱ యనంగ నం-బుదనిభాంగ!
22
సీ. తాల్చు నాఖ్యను వధూ-ధమ్మిల్ల భారంబు
గోణంబు మూల నాఁ - గుధరచాప!
గొఱ యనునాఖ్యచేఁ - గొఱలు లోపంబు మ
నోజ్ఞ వస్తువు దక్ష - యజ్ఞమథన!
నెఱి హేయపడియె న-న్వేషించె నను రెంటి
కాఖ్య యౌ రోసె నా - నసితకంఠ!
నరసె నాఁ బే రగు - నార్తి వారించె వి
మర్శించె ననుటకు - మదనదమన!
 
తే. చరణమునకు నధఃప్రదే-శంబునకు స
మాఖ్యయై యొప్పు నడుగు నా - నళికనేత్ర!
మహిని బే రగు చుండుఁ బ్ర-మాణికంబు
నకును భాషకు బాస నా - నగనివేశ!
23
సీ. నాగవాస మన ఘం-టాప్రతీకమునకు
వేశ్యల కగుఁ బేరు - విశ్వనాథ!
నామ మౌ నండంబు-నకు నంధకునకును
గ్రుడ్డనంగను రౌప్య-కుధరనిలయ!
చర్మవాద్యమున కు-ష్ణ మునకుఁ బే రగు
నుడు కనియెడునాఖ్య - యుడుపమకుట!
యభిధాన మగు మేడి - యన హలాంగమున కు
దుంబరమునకును - ధూతకలుష!
 
తే. క ల్లనఁగ శిల సురయు నౌ - గరళకంఠ!
పరఁగు నాఖ్యయు లాంగల - పద్ధతికిని
శ్రేణికిని జా లనంగ భా-సితసితాంగ!
వారిధినిషంగ! కాశీని-వాసలింగ!
24
తే. జననికిని మాతృజననికి - జనకజనని
కాఖ్య యగు నవ్వ యనఁగ నా-ర్యాసహాయ!
భగినికి జనకునకు నా-హ్వయము దనరు
నప్ప యనఁగను జంద్ర రే-ఖావతంస!
25
క. పో తనఁగ బరఁగు మహిషము
భూతలమునఁ బురుషమృగము - బురుష ఖగంబుం
దా తన ధాతృ పితామహ
మాతామహులకును నగు స-మాఖ్య మహేశా!
26
క. పుడమిని బేరు వహించును
వడిగలవాఁ డనఁగ శౌర్య-వంతుఁడు జవియున్‌
నడు మన నవలగ్నముఁ జె
న్నడరఁగ మధ్యస్థలంబు - నగు నగధన్వీ!
27
క. ఎద యనఁగ బరఁగు భీతికి
హృదయమునకు వక్షమునకు - నిల జో డనగా
నది దనరు నామ మగుచును
సదృశమునకు వర్మమునకుఁ జంద్రార్ధధరా!
28
క. నానార్థవర్గు విది స
న్మానముతో దీనిఁ జదివి-నను వ్రాసిన నా
మానవుల కబ్బు నెప్పుడు
నానార్థంబులును విశ్వ - నాథుని కరుణన్‌.
29
గద్యము. ఇది శ్రీమదేకామ్రమంత్రిపుత్త్ర కౌండిన్యగోత్రపవిత్ర,
సదారాధిత మహేశ్వర పైఁడిపాటి లక్ష్మణకవి
ప్రణీతంబైన యాంధ్రనామ సంగ్రహం బను
నిఘంటువునందు సర్వంబు నేకాశ్వాసము.
 
AndhraBharati AMdhra bhArati - AMdhra nAma saMgrahamu - bhAshha - nighaMTuvulu - AMdhranAmasaMgrahamu ( telugu andhra )