భాష నిఘంటువులు ఆంధ్రనామసంగ్రహము
స్థావరవర్గు
సీ. వలిదిప్ప వడఁకుగు - బ్బలి చలిమిరిమల
గట్టులఱేఁడు ముక్కంటిమామ
మంచుఁగొండన హిమక్ష్మాధరాఖ్యలు చను
వేలుపుఁగొండజే - జేలగట్టు
పుత్తడిగుబ్బలి - పునుకకంచమువాని
విల్లు నా మేరువు - పేళ్లు వెలయు
వెలిదిప్ప ముక్కంటి - మల వెండికొండ నాఁ
గైలాసపర్వతా - ఖ్యలు సెలంగు
 
తే. వెలయుఁ దరికొండ కవ్వంపు - మలయనంగ
మంథ రాఖ్యలు కడపటి - మల యనంగఁ
జుట్టుఁగొండనఁ దనరు నీ - క్షోణియందుఁ
జక్రవాళాద్రి వృషవాహా! సైల గేహ!
1
ఆ. తూర్పుఁగొండ నాఁగఁ - దొలుగట్టు నాఁగను
బొడుపుగుబ్బ లనఁగఁ - బూర్వశిఖరి
పరఁగు గ్రుంకుమెట్టు - పడమటికొండ నా
వెలయు నస్తశిఖరి - విశ్వనాథ!
2
తే. ఒప్పు గిరిపేళ్లు మల గట్టు - తిప్ప మెట్టు
కొండ గుబ్బలి నా మేరు - కుధరచాప!
ఱాయి నాఁ గల్లనంగను - ఱా యనంగ
శిల కభిఖ్యలు దగు నిల - శేషభూష!
3
తే. పల్లె కొట్టిక కొటిక కు - ప్పమ్ము నాఁగ
నూరనఁగ గ్రామనామంబు - లొప్పుచుండుఁ
బట్టణంబున కాఖ్యలు - పరఁగు చుండుఁ
బ్రో లనఁగ వీ డనంగను - శూలపాణి!
4
ఆ. ఉనికిపట్టు తావు - మనికిప ట్టిర విల్లు
తెంకి యిక్క నట్టు - టెంకి యిమ్ము
నెలవు గీము నాఁగ - నలరు నివాసదే
శంబునకును పేళ్లు - చంద్రమౌళి!
5
సి. తెంకాయ చె ట్టనఁ - డెంకాయమ్రానన
నారికేళం బొప్పు - నగనివేశ!
మావిమ్రా ననఁగను - మామిడిచె ట్టన
నామ్రభూజం బొప్పు - నభ్రకేశ!
అత్తిమ్రానన మేడి - యనఁగ నౌదుంబర
ధారుణీజం బొప్పు - మేరుచాప!
యరఁటి యనఁటి నాఁగ - నంశుమత్ఫలధారు
ణీరుహం బగు ధర - ణీశతాంగ!
 
తే. యలరుఁ దుంబీశలాటుస - మాఖ్య లాను
గంబు సొఱకాయ వదరు నా - గరళకంఠ!
తా డనంగను దాడినా - తాళభూరు
హంబునకు నాఖ్య లై యొప్పు - నంబికేశ!
6
సీ. మొక్క మోక నిసువు - మొలక మోసనఁగ నం
కురమునకును బేళ్లు - కుధరచాప!
యిగు రనఁ దలిరు నా - జిగురు నాఁ జివురనఁ
బల్లవనామముల్‌ - పరఁగు నీశ!
మ్రాననఁ జెట్టన - మ్రాఁకన భూరుహ
నామధేయము లగు - వామదేవ!
పువు పువ్వు పూ నాఁగఁ - బుప్పము విరి యల
రనఁ గుసుమాఖ్య లై - యలరు నీశ!
 
తే. గుబురు దట్టము జొంపంబు - గుంపు తఱచు
నాఁగ నిబిడంబు పేళ్లొప్పు - నందివాహ!
వల్లరిసమాఖ్య లగుచు వ - ర్తిల్లుఁ దీఁగ
తీవ తీవియ తీవె నాఁ - ద్రిపురవైరి!
7
ఆ. అగ్రమున కభిఖ్య - లగుచుండుఁ దుద సుద
కొన యనంగ వృక్ష - కోటరమున
కలరుఁ బేళ్లు తొఱట - తొలి తొఱ్ఱ తొఱ నాఁగ
నాగహార! రజత - నగవిహార!
8
ఆ. ఇక్షువున కభిఖ్య - లీక్షితిఁ గన్నుల
మ్రాను చెఱకు తియ్య - మ్రా ననంగఁ
దనరు దవ యనంగఁ - దలవాఁడె నాఁగఁ ద
దగ్రమున కభిఖ్య - లగు గిరీశ!
9
క. అగుఁ బేళ్లుత్పలమునకుం
దొగ తొవ గల్వ గలువనఁగఁ - దోయజ మొప్పుం
దగఁ దమ్మి తామ రనఁగా
మొగ డన మొగ్గ యనఁ దనరు - ముకుళంబు శివా!
10
తే. ఎసఁగుఁ జెందొవ చెందొగ - యెఱ్ఱగలువ
యనఁగ రక్తోత్పలంబు ర - క్తాబ్జ మొప్పు
నిలను గెందమ్మి కెందామ - రెఱ్ఱదామ
రనఁగఁ జెందమ్మి చెందామ - రన మహేశ!
11
క. గొడుగు గొడు వెల్లి యనఁ జె
న్న డరును ఛత్రంబు కేత - నాహ్వయము లగున్‌
సిడె మనఁగఁ డెక్కె మనఁగాఁ
బడగ యనన్‌ డా లనంగఁ - బర్వతధన్వీ!
12
క. మఱుఁ గనఁగ నోల మనఁగాఁ
మఱు వనఁగా జాటనంగ - మాటన వరుసం
బరఁగు ని వెల్ల నగోచర
ధరణీనామంబు లగుచు - దర్పకదమనా!
13
క. పొసఁగుఁ దృణాఖ్యలు పులు నాఁ
గస వనఁగాఁ బూరి యనఁగ - గడ్డి యనంగా
వసుమతిలో నెన్నంబడు
ససి సస్సెము పై రనంగ - సస్యం బభవా!
14
ఆ. తెలుపు దెల్ల వెల్ల - తెలి వెలి నాఁగ నా
హ్వయము లమరు ధవళ - వర్ణమునకుఁ
గప్పు నలుపు నల్ల - కఱ యన నాఖ్యలౌ
నీలవర్ణమునకు - నీలకంఠ!
15
ఆ. కెంపు దొగరు దొవరు - గెంజాయ యెఱుపెఱ్ఱ
యనఁగ నరుణకాంతి - కాఖ్య లయ్యె
నళిది పసుపుచాయ - యనఁగ హారిద్రవ
ర్ణమున కాఖ్య లగుఁ బి - నాకహస్త!
16
ఆ. శ్యామవర్ణమునకు - నామంబు లగుచుండుఁ
బసరుచాయ యనఁగ - బచ్చ యనఁగ
వన్నె డాలు రంగు - వన్నియ జిగి జోతి
చాయ యనఁగఁ బఱఁగుఁ - జగతిఁ గాంతి.
17
తే. మానికము లన రతనముల్‌ - నా నెసంగు
నవని మాణిక్యములకు స - మాహ్వయములు
మెఱుఁగనంగను నిగ్గు నా - మెఱయుచుండు
నాఖ్య లుత్కృష్టకాంతికి - నభ్రకేశ!
18
తే. జలధిపేళ్లగు మున్నీరు - కడలి సంద్ర
మనఁగ మడుఁగన మడువు నా - హ్రదము దనరుఁ
బరఁగు నాఱవసంద్రంబు - పాలవెల్లి
జిడ్డుకడలి పాల్కడలి నా - క్షీరజలధి.
19
క. నంజె యన మడి యనంగను
మంజుల కేదారభూ స - మాఖ్యలు వెలయం
బుంజె యనఁ జేను పొల మనఁ
గంజన మరుభూమి పేళ్లు - కాయజదమనా!
20
క. ధరణిన్‌ వివరాఖ్య లగున్‌
బొఱియ కలుగు లాఁగ బొక్క - బొంద యనంగా
దరి యొడ్డు గట్టనంగాఁ
బరఁగుం దీరంబు పేళ్లు - ప్రమథగణేశా!
21
తే. ఆస లనంగను ఱొంపి నా - నడుసనంగ
బుఱద నా నొప్పుఁ గర్దమం - బునకుఁ బేళ్లు
భూమికి సమాఖ్య లగు బువి - పుడమి నేల
మన్ను పంటవలంతి నా - మదనదమన!
22
తే. జగిలె యనఁగ నరుఁగు నాఁగ - జగతి నాఁగఁ
దిన్నె యన వేదికాఖ్యలై - యెన్నఁ దనరు
మిఱ్ఱనంగను మెరక నా - మిట్ట యనఁగ
నున్నతక్షితి కాఖ్యలై - యొప్పు నభవ!
23
తే. తనరు నిశ్రేణి తాప ని - చ్చెన యనంగఁ
దెప్ప తేపను నాఖ్యల - నొప్పుఁ బ్లవము
పరఁగు నోడనఁ గలమనఁ - దరణి ధరణిఁ
దరణిశీతాంశు శిఖినేత్ర! - ధవళగాత్ర!
24
తే. కార్ముకం బొప్పు విల్లు సిం - గాణి యనఁగఁ
దూణ మొప్పు బత్తళిక నా - దొన యనంగఁ
దరకసంబనఁ బొది యనఁ - దనరు శరము
కోల ములి కమ్ము తూఁపు నా - శూలపాణి!
25
తే. తనరుఁ బేళ్లు తనుత్రాణ - మునకుఁ గత్త
ళంబు జోడు జిరా దుప్ప - టంబు బొంద
ళంబనఁగ నాఖ్య లగు శతాం - గంబునకును
దేరు నా నరదము నాఁగ - మేరుచాప!
26
క. కన్నా కన్నను దలక
ట్టన్నను మఱి మేలుబంతి - యన్నను ధరలో
నిన్నియు శ్రేష్ఠము పేళ్లై
యెన్నంబడు రాజసభల - నిభదైత్యహరా!
27
క. సొమ్మనఁ దొడ వనఁగా రవ
ణమ్మన నగుఁ బేళ్లు భూష - ణమ్ములకును హా
రమ్ములకు నగును నభిధా
నమ్ములు పేరులన సరులు - నా శితికంఠా!
28
తే. సరము లెత్తులు దండలు - సరులనంగ
నామధేయంబు లగుఁ బుష్ప - దామములకు
వాసనకు నాఖ్యలై యొప్పు - వలపు కంపు
తావి కమ్మన యనఁగఁ గా - త్యాయనీశ!
29
క. ఒడమె యన సొమ్మనంగా
విడిముడి యన రొక్క మనఁగ - విత్తంబునకుం
బుడమిని నామము లగు నివి
యుడురాజ కళావతంస! - యురగాభరణా!
30
తే. మచ్ఛులన మిద్దె లనఁగను - మాడుగు లన
దారునిర్మితగేహముల్‌ - దనరు చుండుఁ
బరఁగు సౌధంబు మేడ యు - ప్పరిగ యనఁగ
నాగకేయూర! మౌనిమా - నసవిహార!
31
తే. పెట్టి యన మందసంబనఁ - బెట్టె యనఁగఁ
బెట్టియ యనంగఁ బేటికా - భిఖ్య లమరు
మ్రోడనంగను మోటు నా - మొద్దనంగ
వెలయు స్థాణుసమాఖ్యలు - విశ్వనాథ!
32
ఆ. విస్తృతాఖ్య లొప్పు - విప్పు తనర్పు నా
వెడఁద విరివి పరపు - వెడలు పనఁగ
దీర్ఘమునకు నామ - ధేయంబు లై యొప్పు
నిడుద చాఁపు నిడివి - నిడుపనంగ.
33
ఆ. ఈఁడు దినుసు సాటి - యెన దొర సరి జోడు
సవతు మాద్రి యుద్ది - జత తరంబు
పురుడు నాఁగ సదృశ - మున కివి యాఖ్య లౌ
వివిధగుణసనాథ! - విశ్వనాథ!
34
తే. పసిఁడి బంగరు బంగారు - పైఁడి పొన్ను
జాళువా పుత్తడి యనంగ - స్వర్ణమమరుఁ
దప్తకాంచన మమరుఁ గుం - దన మనం గ
డాని యపరంజి నా గజ - దానవారి!
35
ఆ. చిదుర తునుక తునియ - చిదురుప వ్రక్క పా
లనఁగ ఖండమునకు - నాఖ్య లమరుఁ
బ్రోగు గుప్ప వామి - ప్రోవు దిట్ట యనంగ
రాశి కాఖ్య లగు ధ - రాశతాంగ!
36
క. ఈ స్థావర వర్గుం గడు
నాస్థన్‌ వినఁ జదువ వ్రాయ - నవనీ స్థలిలో
నా స్థాణుని కృప నఖిల శు
భ స్థితులును జనుల కొదవు - భాసుర లీలన్‌!
37
AndhraBharati AMdhra bhArati - AMdhra nAma saMgrahamu - bhAshha - nighaMTuvulu - AMdhranAmasaMgrahamu ( telugu andhra )