భాష నిఘంటువులు ఆంధ్రనామశేషము
ఆంధ్రనామశేషము - అడిదము సూరకవి
క. శ్రీగౌరీ ప్రియవల్లభ
రాగద్వేషాదిరహిత! - రమ్యచరిత్రా!
యోగిధ్యేయపదాంబుజ!
భోగివలయ! రామచంద్ర-పురవరనిలయా!
1
వ. అవధరింపుము. 2
ఆ. ఆంధ్రనామసంగ్ర-హమునందుఁ జెప్పని
కొన్ని తెలుఁగు మఱుఁగు-లన్నిఁ గూర్చి
యాంధ్రనామశేష-మను పేరఁ జెప్పెద
దీనిఁ జిత్తగింపు - దేవదేవ!
3
క. తఱి యజ్జ దనన సమయం
బుఱఁ డనఁగను సరకుసేయ-కుండె ననఁగఁ బే
ళ్లొఱ పగు గణింపఁ డనుటకుఁ
గరిచర్మాంబర! త్రినేత్ర! - గౌరీమిత్రా!
4
తే. పెంపుసెందెను దామర - తంపరయ్యెఁ
బ్రబలె నెగడెను గొనసాగె - బలిసె పెరిఁగె
ననఁగ రేకెత్తె ననఁగ బే-ళ్ళయ్యె వృద్ధి
బొందె ననుటకు శేషాహి-భూషితాంగ!
5
తే. పేర్మి యర్మిలి మక్కువ - కూర్మి నెమ్మి
నెనరు గాదిలి గారాము - నెయ్యఁ మింపు
ప్రేముడి యనుంగు ముద్దనఁ - బ్రియమునకును
నామధేయంబు లయ్యెఁ బి-నాకపాణి!
6
క. ఒనఁగూర్చె ననఁగ సమకూ
ర్చె నన\న్‌ వీల్పఱిచె ననఁగఁ - జేకూర్చెను నా
ననుకూలపఱిచె ననుటకుఁ
దనరును నామంబులై సు-ధాకరమకుటా!
7
క. చరియించె ననుట కాఖ్యలు
తిరిగెను జెరలాడె ననఁగఁ - ద్రిమ్మరె ననఁ గ్రు
మ్మరె ననఁగ మసలె ననఁగాఁ
బుర దానవహరణ! శేష-భుజగాభరణా!
8
తే. ఆఱుమూఁడయ్యెఁ గచ్చువి-చ్చయ్యె ననఁగ
బెడిసె బుసివోయె ననఁగను - జెడియె ననఁగ
నాఖ్య లగుఁ గార్యవైకల్య-మయ్యె ననుట
కంధకాసురహరణ! రౌ-ప్యాద్రిశరణ!
9
క. అలజడి నెంజిలి పిమ్మట
సిలు గుత్తలపాటు వంత-సేగి నెగుల్‌ గొం
దల మలమ టడరు గో డు
మ్మలిక వనటఁ గుందు నా న-మరు దుఃఖాఖ్యల్‌.
10
క. అరిది వెఱం గచ్చెరు వ
బ్బుర మబ్రం బనఁగఁ జిత్ర-మునకుం బేళ్లౌ
సరణికిఁ బేళ్లగుఁ ద్రోవనఁ
దెరువన దారియన బాట- తెన్నన నభవా!
11
తే. ఐదుపదిచేసె వెనుకముం-దయ్యె జుణిఁగె
వీఁగె వెన్నిచ్చె వెనుకంజ-వేసె ననఁగ
నోహటించె ననంగఁ బే-ళ్లొప్పుచుండు
నాహవపరాఙ్ముఖుం డయ్యె-ననుట కభవ!
12
తే. మోహరించెను దండెత్తె - మొనసె దాడి
చేసెఁ బోటొగ్గెఁ గోల్తలు - చేసె మాఱు
కొనియె దళమెత్తె ననఁగఁ బే-ళ్లొనరుచుండు
నాహవోద్యోగ మొనరించె-ననుట కభవ!
13
తే. ఆహవోన్ముఖతకు నోల-మాసగొనక
పిఱుతివియ కీడఁబో కనఁ - బేళ్లు దనరు
నబ్బెస మొనర్చెఁ గఱచె నా - నభ్యసించె
ననుట కభిధానములు చంద్ర-మావతంస!
14
క. వేఱొక టనఁ బై పె చ్చన
మాఱుట యిమ్మడి యనన్‌ స-మాహ్వయములు పెం
పాఱును వస్త్వంతరమున
కౌరగకేయూరసహిత-హత! మారజితా!
15
సీ. ఆఱడిపోయెను - బీఱువోయెను రిత్త
వోయెను వీసర-వోయె ననఁగ
నుడివోయెఁ బొలివోయె-సుడివోయె ననఁగను
వ్యర్థ మయ్యె నటంట - కాఖ్య లయ్యెఁ
గడిమి బీరంబు మ-గంటిమి గం డన
విక్రమాహ్వయములై - వెలయుచుండు
నాస్ఫాలన మొనర్చె - ననుటకుఁ జఱచెనా
నప్పళించె ననంగ - నాఖ్య లయ్యె
 
తే. నొగి వరుస యోలి సొరిది నా-నోజ నాఁగఁ
గ్రమమునకు నాఖ్య లయ్యెను - గాలకంఠ!
కొఱ కొఱఁత తక్కువ వెలితి - కొదవ కడమ
యనఁగ నూనంబునకు నాఖ్య - లై తనర్చు.
16
తే. నెట్టుకొనెఁ బాలుపడె నొడి-గట్టె ననఁగఁ
గడఁగెఁ దొడఁగెను జెలరేఁగెఁ - గాలుద్రొక్కెఁ
గవిసెఁ గదిసె ననంగ నా-ఖ్యలయి యొప్పు
నభిముఖుం డయ్యె ననుటకు - నగనివేశ!
17
తే. అగపడకపోయె విచ్చు మొ-గ్గయ్యె ననఁగఁ
గంటఁబడదయ్యెఁ బంచబం-గాళమయ్యె
ననఁగ దృగగోచరం బయ్యె-ననుట పేళ్లు
శయఘటితశూల! వైయాఘ్ర-చర్మ చేల!
18
క. వెలిచవి చీఁకటిత ప్పనఁ
బొలుపారఁగ జారభావ-మునకుం బేళ్లౌఁ
బులు కసటు చిలు మనంగను
మలిన మనుట కాఖ్య లయ్యె - మనసిజదమనా!
19
ఆ. వింగడం బనంగ - విపరీత మగు నుక్కి
వం బనఁగను గుత్సి-తంబు పరఁగు
నాఖ్య యగుచుఁ దనరు-నామని యనఁగను
మదమునకును జంద్ర-మఃకలాప!
20
క. ఎల యండ్రు తరుణ మనుటకుఁ
గొల యన దురితంబు పేరు - కుడియెడమ లన\న్‌
వలపలదాపల లనఁగను
బొలుపుగ నపసవ్యసవ్య-ములకుం బేళ్లౌ.
21
క. తగు నౌద్ధత్యము పేళ్లై
పొగ రన నా మనఁగఁ ద్రుళ్లు - పోతర మనఁగా
నెగడును భయంబు పేళ్లై
బెగడు దిగులు వెఱపు జంకు-బీ తలు కనఁగన్‌.
22
క. అరి యనఁ గప్పం బనఁగాఁ
గరమునకుం బేళ్లు కాఁగు-కడవ పనఁటి నాఁ
బరఁగు ఘటాఖ్యలు నమితా
మరమౌనినికాయ! భూతి-మండితకాయా!
23
తే. అలరుచుండును గొండ్లి రం-తనఁగఁ గేళి
హాని కాఖ్యలు చేటు కీ-డఱ యనంగ
హెచ్చరిక హాళి సంతసం - బెలమి వేడ్క
యనఁగ నానందమున కాఖ్య-లై తనర్చు.
24
క. సాహిణ మనఁ బాగా యన
వాహాగారంబునకును - వర్తిలుఁ బేళ్లై
వ్యూహమున కాఖ్య లయ్యెను
మోహర మన నొ డ్డనంగ - మొగ్గర మనఁగన్‌.
25
క. ఒనరించె ననఁగఁ గావిం
చె ననంగను సలిపె ననఁగ - జేసె ననంగాఁ
జను నాచరించె ననుటకుఁ
గనకాచలచాప! చంద్ర-ఖండకలాపా!
26
తే. చీఁకువా లిరు లనఁగను - జీఁకటి యనఁ
దిమిరమునకు నభిఖ్య లై - తేజరిల్లు
నాఖ్య లై తనరారు ను-పాయమునకు
సుళు వనఁగ వెర వనఁగను - సూటి యనఁగ.
27
తే. చేరువయ్యెను డాసెను - దారసిల్లె
ననఁగ సన్నిహితం బౌఁట - కాఖ్య లయ్యె
స్థూల మనుటకుఁ బేళ్లగుఁ - దోర మనఁగఁ
గడిఁది వలుఁద యనంగను - గాలకంఠ!
28
తే. వాఁడె గసుగందె ననఁ బుయి-లోడె ననఁగ
విన్నవోయె ననంగను - జిన్నవోయె
ననఁగఁ బేళ్లగు నివి ఖిన్నుఁ - డయ్యె ననుట
కంధకాసురహరణ! రౌ-ప్యాద్రిశరణ!
29
క. గరువము మురిపం బనఁగను
బరఁగున్‌ గర్వంబు పేళ్లు - భటనామము లొం
టరి లెంక బం టనంగను
బుర దానవహరణ! శేష-భుజగాభరణా!
30
క. అరదంబు తేరనంగను
బరఁగు రథంబునకుఁ బేళ్లు - పరి యన్నను గా
లరు లనఁ బదాతిసంహతి
పుర దానవహరణ! శేష-భుజగాభరణా!
31
క. సందియ మన ననుమాన మ
నం దనరును సంశయంబు-నకుఁ బేళ్లై గో
బృందాహ్వయంబు లలరును
మందనఁ గోన యనఁ జంద్ర-మఃఖండధరా!
32
క. మొన వాఁగు దండు దళ మనఁ
దనరు\న్‌ సైన్యంబు పేళ్లు - దళవాయి యన\న్‌
మొనకాఁడనంగఁ బడవా
లనఁగ\న్‌ సేనాధిపతికి - నాఖ్యలు వొలుచు\న్‌.
33
తే. మైకొనియె నియ్యకొనె నొడం-బడియె నొప్పె
ననఁగ నంగీకరించుట - కాఖ్య లయ్యె
సంఘటించుట కాఖ్యలై - జానుమీఱుఁ
జెరివెఁ దుఱిమెను గీల్కొల్పెఁ - జెక్కె ననఁగ.
34
తే. దిట్టపడియె ముక్కాఁకలు - దీరె ననఁగ
నాఱితేఱె ననం గడి-దేఱె ననఁగఁ
గసిమసంగె ననంగ నా-ఖ్యలు దనర్చు
నిపుణుఁ డయ్యె నటంటకుఁ - ద్రిపురవైరి!
35
క. తడవు వడి కా రనంగా
నడరుం గాలంబు శిథిల-మయ్యె ననుట యౌ
విడె వీడె నూడె విచ్చెను
సడలె సురలె వదలెఁ - బ్రిదిలె - జాఱె ననంగ\న్‌.
36
క. మది డెంద ముల్ల మెద యన
హృదయంబున కాఖ్యలయ్యె - నీఱం బనఁగాఁ
బొదరి ల్లనఁగ నికుంజము
సదయాంతఃకరణ! తరుణ-చంద్రాభరణా!
37
క. తెగ దినుసు తోయ మనఁగను
నెగడుఁ బ్రకారంబునకును - నెఱి నామము లై
మెగ మనఁగ మెక మనంగను
మృగమునకు నభిఖ్యలయ్యె - మేరుశరాసా!
38
క. ఎడ దవ్వు కెళ వనంగా
నడరు\న్‌ దూరంబునకు స-మాఖ్యలు నలి నాఁ
బొడి నుగ్గు తుమురు నుఱు మన
బెడఁగడరుం జూర్ణమునకుఁ - బేళ్లై శర్వా!
39
క. ప్రేరేచెను బురికొలిపెను
దారిచె ననఁ జోదనకును - దగు నాఖ్యలు పెం
పారును జంబూద్వీపము
నేరెడుదీవి తొలుదీ వ-నెడునామములన్‌.
40
క. తొలఁగెం బాసె ననంగా
నలరు\న్‌ విముఖతకుఁ బ్రాప్త - మయ్యె ననుట పే
ళ్లలమె నొదవె దక్కొనియెను
నెలకొనియె\న్‌ జెందె ననఁగ - నెక్కొనియె ననన్‌.
41
క. వెనుకఁ దరువాతఁ బిమ్మట
ననఁగా నంతట ననంగ - నంత ననంగాఁ
దనరుం బశ్చాదర్థము
కనకాచలచాప! చంద్ర-ఖండకలాపా!
42
క. పల్లఱపులు రజ్జు లనం
బ్రల్లదములనంగ వ్యర్థ-భాషణములకున్‌
బేళ్లై వర్తిలు నోలిగ
సుల్లోకజయాభిసరణ! - యురగాభరణా!
43
క. కైసేఁ తలంకరించుట
బేసి యన\న్‌ విషమమునకుఁ - బేరై వెలయు\న్‌
సేసలు దీవనబ్రా లన
భాసిలు మంత్రాక్షతలకుఁ - బర్యాయపదములై.
44
క. కోఁ రనఁ బా లన నంశం
బే ఱన వాఁక యన నదికి - నెసఁగును బేళ్లై
నీరాజనంబు పేళ్లగు
నారతి నివ్వాళి యనఁగ - నంగజదమనా!
45
ఆ. మొఱవవోయె ననఁగ - మొద్దువోయె ననంగఁ
గుంఠ మయ్యె ననుట-కుం దనర్చు
శాతమునకు నాఖ్య-లై తనరారును
జుఱుకు వాఁడి తెగువ - కఱ కనంగ.
46
సీ. యామికులకు నాఖ్య-లై ప్రవర్తిలుచుండు
నారెకు లనఁగ ద-లారు లనఁగఁ
గళ్లెంబు వాగె నాఁ-గను ఖలీనంబు పే
ళ్లలరు దంతంబు పే-రౌ డనంగఁ
దఱపి నా ముదురు నాఁ-దరుణేతరం బంట
యిం చనఁ జెఱ కన-నిక్షు వలరు
నష్టం బొనర్చె నం-టకు నాహ్వయము లయ్యెఁ
బోకార్చె ననఁగఁ గో-ల్పుచ్చె ననఁగఁ
 
తే. గుదె యనఁగ దుడ్డనంగను-గదకుఁ బేళ్లు
ఇవ మనఁగ మం చనంగను - హిమము పేళ్లు
కాన యన నడవి యనంగఁ - గాననంబు
షడ్డకుఁడు దోడియల్లుఁడు-జగిలెఁ డనఁగ.
47
క. తేనియె యన జు న్నన నభి
ధానంబులు మధువునకును-దనరుం బేళ్లై
పానకము చెఱకుపాలనఁ
గా నిక్షురసంబునకును - గంఠేకాలా!
48
క. ఉడిగెను జాలించెను నా
నడరు విరామం బొనర్చె - ననుటకుఁ బేళ్లై
తొడరుం బశ్చాద్భాగము
పెడ యనఁగా వెనుక యనఁగఁ - బిఱుఁదు యనంగన్‌.
49
క. విడుమర యన విడుదల యనఁ
గడముట్టుట యనఁగ శాంతి-గనుటకుఁ బేళ్లౌ
నెడ వంక చక్కి చో టన
నడరు స్థలంబునకు నాఖ్య-లై శితికంఠా!
50
క. చనుఁ గ్రుద్ధుఁ డయ్యె ననుటకుఁ
గినిసెఁ గనలె నలిగెఁ గోప-గించె ననంగాఁ
దనరున్‌ మర్మములకుఁ బే
ళ్లనువు లనఁగ నెఱుఁకు లనఁగ-నాయములనఁగన్‌.
51
ఆ. పరఁగు బేళ్లు కార్య-కరునకుఁ బార్పత్తె
కాఁ డనంగ మణివ-కాఁ డనంగఁ
తేజరిల్లుచుండు - దేవేరి దొరసాని
రాణి యనెడుపేళ్ల - రాజపత్ని.
52
క. మ్రింగె నన గ్రుక్క గొనియె న
నంగ\న్‌ దగుఁ గబళనం బొ-నర్చె ననుటకు\న్‌
బ్రుంగె మునింగె ననంగ న
నంగహరా! మగ్నమయ్యె-ననుటకుఁ బేళ్లౌ.
53
సీ. ఆఖ్యలై తనరు ధ-నాగారమునకు ను
గ్రాణం బనంగ బొ-క్కస మనంగ
నాస్థానమండపాహ్వయము లై తనరు హ
జారం బనంగ మో-సల యనంగ
దయకు నీరెం డభి-ధానంబు లయ్యెను
గనికర మనఁగ న-క్కటిక మనఁగ
బాల్యస్థునకుఁ బేళ్ళు-బరిఢవిల్లును బిన్న
వాఁడన గొండిక-వాఁ డనంగ
 
తే. సంధ్యకాఖ్యలు మునిమాపు-సంజ యనఁగఁ
జూద మన నెత్త మనఁగ దు-రోదరంబు
జడి యనఁగ వాన యనఁగ వ-ర్షంబు పేళ్లు
నోలి యుంకువ యన శుల్క - మొప్పు నభవ!
54
సీ. పయ్యెద యనఁగను-పైఁటయనంగ సం
వ్యానంబునకు నాఖ్య-లై తనర్చు
నొక్కపెట్ట ననంగ-నువ్వెత్తుగ ననంగ
యుగపత్పదంబున-కొప్పుఁ బేళ్లు
కవఱ లనం బాచి-క లనంగ నక్షముల్‌
బన్న మొచ్చె మనంగఁ-బరిభవంబు
వ్యాపార మగు చెయ్ద-మనఁ జెయ్ది యనఁగను
గన్ననఁ గీలనఁ-గపట చేష్ట
 
తే. కందుకము బంతి చెం డనఁ-గను దనర్చు
నఱవఱలు చిద్రుప లన ఖం-డా హ్వయములు
కాఁచువడియంబు లనఁగను-గైరవళ్ల
నంగ ఖాదిరఘుటిక ల-నంగ దమన!
55
సీ. మాగాని రాజ్యంబు-మణివ ముద్యోగంబు
చిట్టలు చిత్రముల్‌-చిలుకు శరము
ఎత్తికోలు ప్రయత్న-మీలువు మానంబు
బారి యనంగ ను-పద్రవంబు
విన్నను వనఁగఁబ్రా-వీణ్యం బెలర్చును
దార్కాణ మనఁగ ని-దర్శనంబు
నిట్టపంట యనంగ-నిష్కారణం బంట
బానసం బనఁగ మ-హానసంబు
 
తే. నామ మే కాంతమునకు మం-తన మనంగ
నంతిపుర మన శుద్ధాంత-మలరుచుండు
నుదిరి యనఁ దప్తకాంచన-మొప్పు చుండుఁ
దివురుట యభిలషించుట - దేవదేవ!
56
సీ. బిట్టు గ ట్టనఁ బెల్లు-పెద్దయుఁ దద్దయు
నురవడి పరువడి - యుద్ధవిడియుఁ
బనివడి పదపడి - బలువిడి తలకొని
నెట్టన యెంతేని - నెఱి గరంబు
లలి వారకేడ్తెఱ - పెలుచ వావిరి యన
నఱిముఱి యనఁ బొరిఁ-బొరి యనంగఁ
గడుఁజాల మిగులంగ-గాటం బనంగ న
త్యంతముగ ననుట - కాఖ్య లయ్యె
 
తే. నుడుకు సెకపెట్ట వేఁడిమి - యుబ్బ యావి
యుక్క యన నొప్పు నామంబు-లుష్ణమునకుఁ
దాల్మి యోరిమి సైరణ-తాళుకొంట
సైచు టోర్చుట యనఁగను - క్షాంతి పేళ్లు.
57
తే. పెద్దనిద్దురఁ జెందించెఁ - బిలుకుమార్చె
గీటణంచెను గుదితాల్పు - వీటి కనిచెఁ
గూలిచెను రూపుమాపెను - నేలఁ గలిపె
ననఁగ హతిచేసె ననుట కా-ఖ్యలు దనర్చు.
58
క. పరిచూర్ణ మయ్యె ననుటకు
వరుసన్‌ నామంబు లగుచు - వర్తిల్లుచుండున్‌
దుఱుమయ్యెన్‌ బరుమయ్యెన్‌
నుఱుమయ్యెన్‌ బిండియయ్యె - నుగ్గయ్యెననన్‌.
59
క. కునికె నిదురించెఁ గూర్కెను
గనుమోడ్చె ననంగ నిద్ర-గనుటకుఁ బేళ్లౌఁ
గనువిచ్చె ననఁగ మేల్కనె
ననఁగఁ బ్రబోధంబు నొందె - ననుటకుఁ బేళ్లౌ.
60
క. డులిచె వదలించె నూడ్చెను
దొలఁగించెన్‌ బాపె ననఁగ - ద్రోచె ననంగా
వెలికొత్తె ననఁగఁ బేళ్లై
యలరున్‌ విఘటనమొనర్చె - ననుటకు శర్వా!
61
క. పొలయలుక యనఁగ నెయ్యపు
టలుక యనం బ్రణయకలహ-మల రారుఁ గుచం
బుల కొప్పు నామములు గు
బ్బ లనంగాఁ జన్ను లనఁగఁ - బాలిం డ్లనఁగన్‌.
62
తే. చౌటిమున్నీ రనఁగ నుపు-సంద్ర మనఁగ
రాజిలుచు నుండు లవణవా-రాశిపేళ్లు
కాలు వన బట్టె యనఁగను - జా లనంగఁ
గుల్య కభిధాన మై పొల్చుఁ గుధరనిలయ!
63
తే. పెల్లగించెను బెకలించెఁ - బెఱికె ననఁగ
నాఖ్య లుత్పాటన మొనర్చె - ననుట కలరు
నాహ్వయంబులు ఛేదించె - ననుట కయ్యెఁ
జించె నన వ్రచ్చె నన వ్రక్క - లించె ననఁగఁ.
64
తే. కనుమొఱఁగె నేమఱించె నాఁ - గను నిగూఢ
వర్తన మొనర్చె ననుట కా - హ్వయము లడరు
మొయి లన మొగుళ్ళనంగను - మొనయు మబ్బు
లన ఘనంబుల కాఖ్యలై - యభ్రకేశ!
65
కం. పగ ఱనఁగ మార్తు రనఁగను
పగవాండ్రనఁ బగతు రనఁగ - బరిపంథికిఁ బే
ళ్లగు మెగ మనంగ మెక మన
మృగమునకు నభిఖ్య లయ్యె - మేరుశరాసా!
66
తే. ఇంకె నడుగంటె వట్టె నా - నివిరె ననఁగ
నిర్జలం బయ్యె ననుటకు - నెగడుఁ బేళ్లు
నిండె గ్రిక్కిఱిసె ననఁ బూ-ర్ణించె ననుట
కాఖ్యలై తనరారు సు-ధాంశుమకుట!
67
తే. పెచ్చు పెరిగె ననం బురి-విచ్చె మీఱె
నన విజృంభించె ననుటకు - నాఖ్య లయ్యెఁ
దిండికాఁ డనఁ దిండీఁడు - తిండిపో త
నంగ భక్షకునకు ద-నర్చుఁ బేళ్లు.
68
కం. పెనఁగొనె గిఱికొనియెను వల
గొనియెన్‌ మెలికొనియెఁ జుట్టు-కొనె సుడిగొనె నాఁ
గను నులిగొనె నన నాఖ్య ల
గును వలయిత మయ్యె ననుట-కును శితికంఠా!
69
సీ. మొగరా లన స్తంభ-ములు చిట్టకము దంభ
మెరగలి వనవహ్ని - యెడ్డె మూర్ఖుఁ
డుడుగర యుపహార - మూఱట విశ్రాంతి
మొద లని యనఁగను - మూల మనుట
తఱు లన వళులు చిం-ద మనంగ శంఖంబు
తఱ టనంగఁ గశాభి - ధాన మయ్యెఁ
దమ టనఁ గీల ప-దం బగు మె ట్టన
గాయకులకుఁ బేరు - గాణ లనఁగ
 
తే. మృత్యువునకును బే రయ్యె - మిత్తి యనఁగ
మకుటమున కాఖ్య లగు బొమి - డిక మనంగ
నోముట యనఁగఁ బోషించు - టూడిగంబు
సేవ కభిధానమై యొప్పు - శేషభూష!
70
సీ. ఎట్టకేల కనంగ - నెనయును సకృదర్థ
మఖిలం బటంటకు - నంతవట్టు
ఏకాకి యెక్క ట-నేకులు పలువురు
వేనవేల్‌ పెక్కండ్రు - వేవు రనఁగ
నలరు నోచేదర్థ-మై కానినాఁ డన
నేతాదృశులె యంట-కిట్టివారె
మిన్నక యూరక - యన్నఁ దూష్ణీ మర్థ
మనుసరించి యటంట - కగును దొట్టి
 
తే. యొండొకఁ డనంగ మఱియు వే-ఱొకఁడు లాఁతి
వాఁడు పెఱవాఁడు దక్కిన - వాఁ డనంగ
నన్యునకు నాఖ్య లగుచుఁ బెం-పారుచుండు
శయఘటితశూల! వైయాఘ్ర-చర్మచేల!
71
కం. వడి యనఁగా గాలం బగు
వడి యన వేగంబునకును వర్తిలుఁ బేరై
మడి యనఁ గేదారం బగు
మడి యనఁగా శుద్ధికిని స-మాహ్వయ మయ్యెన్‌.
72
కం. ఈ డనఁగ వయసు పే రగు
నీ డన సామ్యంబునకును - నెసఁగును బేరై
నా డన రాజ్యము పే రగు
నా డనఁ దత్కాలమం ద-నఁగఁ బెంపారున్‌.
73
కం. మొన యన సైన్యము పే రగు
మొన యనఁగా నగ్రభాగ-మునకును బే రౌ
దొన యనఁ దూణీరం బగు
దొన యన నవసానమునకుఁ - దొడరును బేరై.
74
కం. వె న్న నఁగ బీజమంజరి
వెన్న నఁ జరమాంగమునకు - వెలయును బేరై
కన్ను లనం బర్వంబులు
కన్ను లనన్‌ లోచనములు - కంఠేకాలా!
75
కం. తమ్మి యనఁ దరువిశేషము
తమ్మి యనం బంకజాభి-ధానం బయ్యెన్‌
నెమ్మి యనఁ బ్రియము పే రగు
నెమ్మి యన మయూరమునకు - నెగడుం బేరై.
76
కం. దండ యనన్‌ సాన్నిధ్యము
దండన సుమమాలికాభి-ధానం బయ్యెన్‌
మండనఁ బ్రకోష్ఠ మయెన్‌
మండన మృత్పాత్రకును స-మాహ్వయ మయ్యెన్‌.
77
కం. తెలుఁగుం గబ్బపు మర్మము
తెలుఁగు కవీంద్రులకుఁ దేట - తెల్లము గాఁగన్‌
దెలియఁగ నడిదము సూరయ
చెలువారఁగ నాంధ్ర నామ - శేషముఁ జెప్పెన్‌.
78
AndhraBharati AMdhra bhArati - AMdhra nAma shEShamu - aDidamu suurakavi - bhAshha - nighaMTuvulu - AMdhranAmashEShamu ( telugu andhra )