భాష నిఘంటువులు సాంబనిఘంటువు (ఆంధ్రనామనిఘంటువు)
దేవవర్గు
సీ. ముక్కంటితొలిపట్టి - మొట్టికాయలమెప్పు
గొప్పబొజ్జగలాఁడు - గుజ్జువేల్పు
గబ్బుచెక్కిళ్ల మె-కము మోముగలసామి
కలుఁగులాయపుఁదేజి - బలుసిపాయి
గుంజిళ్ళుపెట్టించు - కొనుమేటి పిళ్లారి
కుడుముదాలుపు పెద్ద-కడుపువేలు
పొంటిపల్లుదొర ము-క్కంటిపండులమెక్కు
దేవర చిలువజం-దెములమేటి
 
తే. జమిలితల్లులబిడ్డ పె-ద్దమెయి ప్రోడ
చేఁటవీనులదణి పని-చెఱుపువాఁడు
మొదటివేలుపు వెనకయ్య - పుంజుదారి
పెద్ద యనఁ దగు గణపతి-పేళ్లు సాంబ.
2
సీ. చౌవంచమోముల - సాహేబు జాళువా
గుబ్బలివిలుకాఁడు - గిబ్బరౌతు
జక్కులదొరనేస్తి - జన్నంపుఁబగవాఁడు
పొడలలగింటముదాల్పు -పునుకదారి
వినువాఁకమోపరి - వెండికొండమనీఁడు
మినుజుట్టుదేవర - మిత్తిమిత్తి
మంచుమలల్లుఁడు - మరుగొంగ ముక్కంటి
నెలదారి ముమ్మొన-యలుఁగు మేటి
 
తే. విసపుమేఁతరి తిగప్రోలి-వేఁటకాఁడు
కప్పుటైదువపెనిమిటి - గాములదొర
వేల్పుదణిఁగన్నతఁడు గుజ్జు-వేల్పుతండ్రి
బేసికన్సామి యననీదు-పేళ్లు సాంబ.
3
సీ. వెన్నుఁడు పెరుమాళ్లు - వేకంటిసైదోడు
కవ్వపుమలదాల్పు - కఱ్ఱినేస్తి
చిలువపానుపుదంట - తెలిదీవిమన్నీఁడు
బటువుఁగైదువుజోదు - బమ్మతండ్రి
కఱివేల్పు మరునయ్య - కడలియల్లుఁడు సంకు
దారి గరుడిరౌతు - తమ్మికంటి
పదివేసములదిట్ట - యెద మచ్చగలసామి
యడుగువాఁకగలాఁడు - పుడమినంటు
 
తే. మొసలివాయొంట్లతాల్పు ర-క్కసులగొంగ
లచ్చిమగఁ డుడ్డకేలుగ-లాఁడు పుట్టు
వడుగు తామరపొక్కిలి - వాఁడు పసిఁడి
వలువతా ల్పన హరిపేరు - లలరు సాంబ.
4
సీ. తీవంచమోముల-దిట్ట తామరచూలి
తలఁపు కేళాకూళి - పులుఁగురౌతు
తగవులజడదారి-తండ్రి వేలుపుఁ బెద్ద
మాటలజవరాలి-మగఁడు నలువ
యలరులవిలుకాని-యన్న మేలిమిబొజ్జ
గలదుముదారి ప్రాఁ-బలుకులదణి
నుదురాకులెక్కఁ జె-న్నుగ వ్రాయుకరణీకుఁ
డచ్చంపుఁదమ్మిపై - నమరుజాణ
 
తే. నిక్కంపుజగంబు బ్రోచుమ-న్నీఁడు మొదటి
జాతిదొర బమ్మ దుగినఁడు - తాత జగము
లన్ని పుట్టించు మేటి త-నంతఁ గల్గు
నతఁడు పజదొర యన నజా-ఖ్య లగు సాంబ.
5
సీ. గట్టురాకొమరిత - కప్పుముత్తైదువ
మగనియందపుమేనఁ - దగినమగువ
కఱకంఠురాణి సిం - గపుఁదేజి గలచాన
వెనకయ్యతల్లి నా - వెలయు గౌరి
కలుములచెలి జిడ్డు-కడలిబొట్టియ లచ్చి
తమ్మిగద్దియబోటి - తల్లితల్లి
పెనిమిటియెద నుండు - ననబోఁడి మరుతల్లి
నెలచెలియలు లిబ్బి - నెలఁతుక సిరి
 
తే. యనఁగ లక్ష్మీసమాఖ్య లౌ - నంచతేజి
పొలఁతి తలవాఁకిట మెలఁగు-చెలువ నలువ
రాణి పలుకులజవరాలు - లచ్చికోడ
లనఁగ భారతినామంబు - లమరు సాంబ.
6
సీ. అడుగుకైదువుపుల్గు-పడగదునేదారి
యరబారతల్లుల-యరిదిబిడ్డ
వెనకయ్యవెనుకయ్య - వేల్పులదళవాయి
చిలువలబోనంపుఁ-బులుఁగురౌతు
సత్తిఁబూనువలంతి - యిత్తిగమోముల
బలియుఁడు బారచే-తులుగలాఁడు
రిక్కరక్కసుమిత్తి - ఱెల్లుకానుపు కొంచ
మల వ్రక్కలించిన - మన్నెకాఁడు
 
తే. గట్లయేలికమనుమఁడు - కప్పుతెఱవ
మేటికొమరుఁడు వేలుపు-టేటిసవతి
కొడుకు ముద్దయ్య కందుఁడు - కొమరసామి
యనఁగ గుహనామధేయంబు - లమరు సాంబ.
7
సీ. తలఁపుచూలి మరుండు - వలఱేఁడు చిలుకరౌ
తామనిచెలి గాడ్పు-టరదపుదొర
జాబిల్లియల్లుఁడు - చౌవంచతూపుల
నెఱదంట కలుముల - గరితబిడ్డ
కన్నులవిల్తుఁడు - కమ్మవిల్తుఁడు పచ్చ
విలుకాఁడు చక్కెర-వింటిజోదు
వెడవిలుతుఁడు తియ్య-విల్తుఁడు చిగురాకు
విలుకాఁడు తుంటవిల్‌-గల దునీఁడు
 
తే. తలిరువిల్తుఁడు ననవిల్తుఁ - డలరువిల్తుఁ
డించువిల్కాఁడు రాచిల్క - నెక్కురౌతు
మీను మొసలిసిడెంబుల-మేటి తేఁటి
యల్లెవాఁ డన మదనాఖ్య - లమరు సాంబ.
8
సీ. సతపేరుతత్తడి - జతతేరుగలప్రోడ
యనిఁ బడ్డనెఱబంటు - లరుగుత్రోవ
వెన్నునివలగన్ను - వేయిచేతులదిట్ట
తిగవేలుపులటెంకి - పగటిజోతి
జమునయ్య మినుమాని-కము చాయపెనిమిటి
పగలు సేయువలంతి - జగముకన్ను
నెలజోడు తమ్మిచ-క్కిలిగింత వేవెల్గు
కలువలసూడు చీఁ-కటులగొంగ
 
తే. జక్కువలయంటు మ్రొక్కుల-సొక్కుసామి
బారరూపులవేల్పు ప్రా-బల్కుసొమ్ము
పెట్టె చలిదాయ ప్రొద్దు నాఁ - బేళ్లు దనరు
లోకబాంధవునకు శివా-లోల సాంబ.
9
సీ. కఱకంఠుతలమాని-కము వేలుపులబువ్వ
జాబిల్లి మరుమామ - చందమామ
జింకతాలుపు తొగ-చెలికాఁడు జడదారి
కన్పాప రేఱేఁడు - కడలివెన్న
చుక్కలగమికాఁడు - జక్కవపగవాఁడు
చలివెల్గు రేవెల్గు - చలువజోతి
వెన్ను నెడమకన్ను - వెన్నెలరాయఁడు
నెల తమ్మిదాయ ము-న్నీటిపట్టి
 
తే. కందుగలదుండగీడు చీ-కటులమిత్తి
పంటపైరులదొర ప్రొద్దు-జంట లచ్చి
యన్న రేజోతి చం దన - నమరుచుండుఁ
గుముదమిత్రునినామధే-యములు సాంబ.
10
సీ. పదిపదులంచుల-బాఁకుఁ దాల్చుదునీఁడు
కొండలఱెక్కలు - కొట్టినదణి
జమిడియేఁ బదుల-జన్నములు చేసినమేటి
సోమాసులకుఁ దావు - సూపుజాణ
యెత్తరంపుఁజెవుల-తత్తడివజ్రీఁడు
విప్పుఱెప్పలఱేఁడు - వెల్లగౌరు
మావటీఁడు తలఁపు-మానికముగలాఁడు
నిలువెల్లఁ జూపులై - వెలయువాఁడు
 
తే. మింటిప్రోల్సామి జడదారి - యింటికోడి
పెట్టుమ్రాఁకుల వెలిగిడ్డిఁ - బెనిచినదొర
మొదటిదిక్కుసుబాదారి - మొయిలుజక్కి
సామి యన యింద్రునామముల్‌ - జరగు సాంబ.
11
సీ. తగరుబాబాసాని - దుగమోరపాదుసా
తెమ్మరచెలి యన్ని-తిండికాఁడు
నీటిబిడ్డఁడు కిత్తు - నిప్పు ముట్టఁగరాని
బలియుఁడు సతనాలు-కలదునీఁడు
కప్పుత్రోవరి తిగ-కాళ్లదేవర యగ్గి
చి చ్చింగలం బనఁ జెలఁగు వహ్ని
పోతుతత్తడిరౌతు - ప్రొద్దుకూన జముండు
మిత్తి దక్కినమేలు - మేటి జమున
 
తే. తోడు గుదెతాల్పు పెతరుల-ఱేఁడనంగఁ
గాలునిసమాహ్వయము లగు - మూలఱేఁడు
త్రిమ్మరీఁడు రక్కసి పొల-దిండి సోఁకు
మూఁకదణి నా నిరృతిపేళ్లు - పొసఁగు సాంబ.
12
సీ. పడమటిదొర నీటి-యొడయఁడు జడిసామి
మొసలిగుఱ్ఱమురౌతు - మొయిలుఱేఁడు
వల్లెత్రాఁడుగలట్టి-వాఁడు నా వరుణాఖ్య
లమరెను జింకగు-ఱ్ఱమువలంతి
బీదలపెనుబాద - యీఁద త్రాఁచులమేఁత
గందంపుమలగుఱి-కాఁడు గాడ్పు
పయ్యర తావిమో - పరి వలి మరుతేరు
సుడిగొట్టు తెమ్మర - సోఁకుబూచి
 
తే. మేనుతాల్పుల కుసురైన-మేటి నింగి
చూలి మబ్బులపగదాయ - గాలి సురఁటి
వీవనలపుట్టు దువ్వగా-వించుజాణ
కరువలి యనంగ మారుతా-ఖ్య లగు సాంబ.
13
సీ. జక్కులపాదుసా - ముక్కంటిసంగాతి
కాయకన్మేటి రొ-క్కములఱేఁడు
వానీఁడు రారాజు - వడచక్కియెకిమీఁడు
తత్తడి నెక్కెడు-దంట యనఁగ
ధనదు పేళ్లగు జడ-దారి గిబ్బసిపాయి
తిగకంటిదొర తుది-దిక్కు టెంకి
యనఁగ నీశానాఖ్య - లనువొందుఁ జిందము
కూఁతకైదువు బూరఁ -గొమ్ము సంకు
 
తే. వలమురి యనంగ శంఖము - వెలయుఁ జుట్ట
వాలు సుడివాలు వట్రువ-వాలు బటువు
వాలు పదినూఱులంచుల-వాలు బిల్ల
వా లన సుదర్శనాఖ్యలు - వఱలు సాంబ.
14
సీ. తుదచుక్క పేరిటి-తొయ్యలిపెనిమిటి
కప్పుదేవరయన్న - కలపదారి
కఱివల్వప్రోడ రోఁ-కలితాల్పు తాటిటె
క్కెము మేటిబలియుఁడు - జమునగొంగ
యన బలభద్రుపే - ళ్లగుఁ గ్రీడిచెలితేరు
పులుఁగురాయఁడు దెలి-మోముపక్కి
బొల్లిమోరపులుంగు - నల్లనయ్యరవాలు
తొడలేనివానిసై-దోడు గరుడి
 
తే. వేలుపులబువ్వఁ గొనుజోదు - వెన్నుపడగ
చిలువమేఁతరి మే లిచ్చు - పులుఁగు గరుటి
తల్లివేసట వాపిన - దంట యనఁగ
వైనతేయసమాఖ్యలు - వఱలు సాంబ.
15
సీ. వడముడి తెమ్మెర-కొడు కన భీముఁ డౌ
వేగంటికొమరుడు - వెన్నునంటు
వెన్నుమచ్చదునీఁడు - వివ్వచ్చు కవ్వడి
గెలుపు పేరుగలాఁడు - క్రీడి యనఁగ
నర్జుననామంబు - లగు ముత్తెరువులాఁడి
తెలివాఁక పొందామ-రలకుఁ బంట
కఱకంఠుతలయేఱు - పెరుమాళ్లడుగుబుగ్గ
జడదారిచెవియూట - చదలువాఁక
 
తే. తాటిటెక్కెముదణితల్లి - తాతపనఁటి
వెల్లి మినువాఁక మిన్నేఱు - వేల్పుటేఱు
ఱెల్లుకానుపుసవతిత-ల్లి యనఁ దనరు
నమరతటికిని నామధే-యములు సాంబ.
16
సీ. వేల్పుసువారంపు-విడిది వెన్నునిటెంకి
రతనాలపంట సం-ద్రంబు కడలి
పుడమిముద్దియకోక - మున్నీరు ప్రాయేఱు
మబ్బుపువ్వులవెల్లి - మామమామ
గట్టురాకొమరునిఁ - గాచిననేర్పరి
యేఱులమగఁడు రే-యింతిమామ
ముక్కంటియమ్ముల-పొది మింటిలాయంబు
తోఁటదొడ్డియొనర్చు - నీటుకాఁడు
 
తే. చందునయ లచ్చితండ్రి నా - జలధి పరఁగు
వెల్ల యేనుఁగు చౌదంతి - వేల్పుగౌరు
మొదటిహత్తి నా సురకరి - పొదలుఁ దెల్ల
జక్కి నిక్కివీనులమావు - చదలుతేజి
యనఁగ నుచ్చైశ్శ్రవము పేరు - లమరు సాంబ.
17
సీ. వేలుపుటెంకి కో-వెల దేవళము గుడి
యనఁగ దేవాలయా-ఖ్యలు చెలంగుఁ
దెఱగంట్లు జన్నంపుఁ-దిండులు జేజేలు
తొలివేల్పుపగతురు - వలుకుటల్గు
మేటులు వేల్పులు - మింటిత్రోవరులు ని
ద్దురలేనిప్రోడలు - నరలుగనని
పెద్ద లనఁగ సురా-భిఖ్యలౌ విన్ప్రోలు
వేగంటికచ్చేరి - వేల్పుటెంకి
 
తే. యనఁగ స్వర్గముపేళ్లగు - వినుమిటారు
లచ్చరలు వేల్పుచెలు లన - నమరు నమర
తరుణులకుఁ జాగరతనము - తలఁపుమాని
కమనఁ జింతామణి సమాఖ్య - లమరు సాంబ.
18
సీ. అడిగిన నొసఁగెడి-యావు జేజేగిడ్డి
చదలుతొడుకు తెల్ల-మొద వనంగ
సురగవిపేళ్లగుఁ - దెఱగంటిమ్రాఁకులు
పెట్టుమ్రాఁకులు మింటి-చెట్టు లనఁగఁ
గల్పకాఖ్య లగు వే-గంటిగొంగలు రక్క
సులు రేయిద్రిమ్మరుల్‌ - సుకురుసిసులు
వేల్పుదాయలు తొలి-వేల్పులు నా దైత్య
నామంబు లగు గాలి - గాము నెగడి
 
తే. కొరవి రాలుపు బూచి సోఁ-కుడు పిసాసి
దయ్య మనఁగఁ బిశాచాభి-ధానము లగు
నివము వలి మం చనంగను - హిమము దనరుఁ
బిడు గనఁగ జెల్లు నశనికిఁ - బేళ్లు సాంబ.
19
సీ. మిన్ను చుక్కలత్రోవ - వి న్నుప్పరము నింగి
వెన్నునియడుగు వి\న్‌-వేల్పుఁదెరువు
గాలితండ్రి బయ లా-కసము మొగులుతెన్ను
చదలు నా గగనాఖ్య - లొదవుచుండుఁ
బవలు పగలు నాఁగ - దివము పేళ్లగు రేయి
రాతిరి రే యన - రాత్రి యమరు
దెస దిక్కు కడ యన - దిశ యొప్పు నెల చంద
నఁగ మాస మమరుఁ బు-న్నమ యనంగ
 
తే. నలరుఁ బూర్ణిమకు నమాస - యమవస యనఁ
జను నమావాస్యపేరులు - సంజ సందె
యనఁగఁ దగు సంధ్యకాతపం-బునకు నెండ
ప్రొద్దు వేండ్రం బనెడిపేళ్లు - పొసఁగు సాంబ.
20
సీ. మెఱపులు మెఱుఁగులు - మించు లనఁ దటిత్తు
లగును జుక్కలు రిక్క - లనఁగఁ దార
లమరు జేజేరేని-యరదము నీటిమో
పరి మబ్బు మొయి లనఁ - బరఁగు ఘనము
తెర యల తరఁగ నాఁ - బొరయు వీచికపేళ్లు
నుఱువు నుఱు గనంగఁ - గొఱలు ఫేన
మంతస్సమాభిఖ్య-లగును లోపల లోన
లో నన బహిరాఖ్య - లొప్పును వెలి
 
తే. బయలు వెలుపల నాఁగ దీ-పంబు పేళ్లు
వఱలుచుండును జోతి తి-ర్వళిక దివ్వె
యనఁగ మందోష్ణమునకు వె-చ్చన యొకింత
వేఁడి యిసుమంతకాఁక నా - వెలయు సాంబ.
21
క. సిస్తుగ లక్షణకవి యగు
కస్తురిరంగాఖ్యుఁడను జ-గద్ధితముగ నీ
నిస్తులదైవతవర్గును
విస్తర మొనరించినాఁడ - విబుధులకరుణన్‌.
22
AndhraBharati AMdhra bhArati - sAMbanighaMTuvu - bhAshha - nighaMTuvulu - sAMba nighaMtuvu AMdhranAmanighaMTuvu ( telugu andhra )