భాష నిఘంటువులు సాంబనిఘంటువు (ఆంధ్రనామనిఘంటువు)
స్థావరవర్గు
కం. శ్రీవరదాయక పాయక
దేవరనామాంకితముగఁ - దేటపఱచెద\న్‌
స్థావరవర్గును గవితా
భావరసజ్ఞు లెద మెచ్చఁ - బశుపతి సాంబా.
1
సీ. ఇలతాల్పు గట్టు గు-బ్బలి కొండ మల తిప్ప
యన శైలనామంబు - లమరు మంచు
టిలతాల్పు వడఁకుగు-బ్బలి దుగ్గికన్నయ్య
గట్లరాయఁడు బేసి-కంటిమామ
చలికొండ వలిమల - పులుచూలితాత నా
హిమగిరినామంబు - లెఁసగుఁ బసిఁడి
గట్టు వేల్పులమన్కి-పట్టు క్రొన్నెనదారి
సింగిణి యన మేరు-శిఖరివొల్చు
 
తే. విసపుమేఁతరి బలుటెంకి - వెండికొండ
తెలిమల యనంగ రజతాద్రి - తేజరిల్లు
బటువుమల తుదగ ట్టన - బరఁగు జక్ర
వాళగిరిపేర్లు త్రిభువన-వంద్య సాంబ.
2
సీ. కవ్వపుమల తరి-గ ట్టన మందరం
బడరుఁ దూరుపుమల - పొడుపుఁదిప్ప
మొదటికొండ యనంగ - నుదయాచలం బొప్పుఁ
బడమటిమల క్రుంకు-పుడమితాల్పు
నా నస్తగిరి కగు - ఱాయి ఱా క ల్లన
బ్రస్తరాఖ్య దలిర్చుఁ - బల్లె యూరు
కుప్పం బనఁగ గ్రామ - మొప్పును బ్రోలు వీ
డనఁ బట్టణముపేరు - లలరుచుండు
 
తే. నిరవు టెంకి యునికి యిక్క - యిల్లు గీము
మనికిపట్టు బిడారు కొంప - యిలు నెలవు
నట్టు ఠా వన మందిర-నామము లగు
శంబరాహితమదభిదా-డంబ సాంబ.
3
సీ. టెంకాయచె ట్టన - టేమ్రాను నారిక
డం బన నారికే-ళంబు దనరుఁ
దా డనఁ దాళ మౌ - దాళిమ్మ దానిమ్మ
యన దాడిమియుఁ బొన్న - పొన యనంగఁ
బున్నాగముఁ దనర్చు - గన్నేరు గన్నెరు
నాఁగను గరవీర-నామము లగు
రేఁగు రే నన బద-రికిఁ జెల్లు మారెడు
బిలువ మనఁ దనర్చు - బిల్వమునకు
 
తే. జమ్మి జం బన శమి యగుఁ - జంపకంబు
దనరు సంపెఁగ సంపఁగె - యనఁగ నెల్లి
యుసిరి యుసిరిక యన ధాత్రి - కొప్పు రాగి
యనఁగ రా వన నశ్వత్థ - మొనరు సాంబ.
4
సీ. అత్తి మేడి యనంగ - నౌదుంబరం బొప్పు
మావి మామి డన నా-మ్రము దనర్చు
వెలఁగ వెలంగ నా - వెలయుఁ గపిత్థంబు
మల్లె మల్లియ నాఁగ- మల్లిక యగు
జాజి జాది యనంగ - జాతి యౌ నేరేడు
నేరెడు నా జంబు - నెగడుచుండుఁ
బాదిరి కలిగొట్టు - నాఁ దగుఁ బాటలి
పొగడ పొవ డన నొ-ప్పును వకుళము
 
తే. మ్రాఁకు మ్రాను చెట్టనఁగ ద్రు-మంబు చెలఁగు
తీఁగ తీఁగియ లతకూన - తీఁగె యనఁగ
దనరు లతపేరు పూవులు - ననలు విరులు
పువ్వు లలరులు నా సుమం-బు లగు సాంబ.
5
సీ. మొక్క మోటికి మోసు - మోక మొలక యన
నంకురనామంబు - లలరు నిగురు
తలిరు చిగురు నాఁగఁ - దగుఁ బల్లవాఖ్యలు
కొన తుద యన నగ్ర-మునకుఁ బొల్చుఁ
దొఱ తొలి తొఱ్ఱి నాఁ దరుకోటరం బొప్పుఁ
దమ్మి తామ రనఁ గం-జమ్ము పరఁగు
దొగ తొవ కలు వనఁ - దగు నుత్పలమునకు
దట్టంబు జొంపంబు - తఱుచు జీబు
 
తే. గుమురు తంపర యన నిబి-డము దనర్చు
మొగడ మొగ్గ యనం దగు - ముకుళమునకు
నిక్షుకాండంబునకుఁ బేరు - లెసఁగు చెఱకు
కనులుగలమ్రాను తియ్యమ్రా - ననఁగ సాంబ.
6
సీ. తెలుపు తెల్లన తెల్ల - తెలి వెల్ల వెలి యన
ధవళవర్ణ మెసంగుఁ - దొవరు తొగరు
కెంజాయ యెఱు పెఱ్ఱ - కెం పన రక్తవ
ర్ణమగు నల్లన కఱి - నల్ల కప్పు
నలు పన నీలవ-ర్ణము పొల్చుఁ జామనఁ
బసరుచా యన శ్యామ - మెసఁగుచుండు
నళిది పసు పనంగ - నగుఁ బీతవర్ణంబు
తేట నున్నన నున్న - తెలివి నునుపు
 
తే. నిద్ద మన స్నిగ్ధత కెసంగు - నిగ్గు డాలు
మినుకు మిన మించు నిగ తళ్కు - మెఱుఁగు చికిలి
కళుకు జిగి రంగు మెఱ పనఁ - బొలుచుఁ గాంతి
నొడ్డు దరి గ ట్టనఁగఁ గూల - మొనరు సాంబ.
7
సీ. ఆణి చినుకుఁబూస - పాని సుప్పాణి ము
త్తెము ముత్తియంబు ము-త్య మనఁ దనరు
మౌక్తికాఖ్యలు కెంపు - మానికము రతన
మనఁగ మాణిక్యాహ్వ-యంబు లలరుఁ
బగడము పవడం బ-నఁగ విద్రుమము పొల్చుఁ
బక్కిరాయనిఱాయి - పచ్చ యనఁగ
మరకతము దలిర్చు - మగఱాలు మూలఱా
లన వజ్రము లగుఁ బు-ల్లంటు ఱాయి
 
తే. కప్పుఱాయి యనఁగ నీల - మొప్పుఁ బిల్లు
పూరి చిగిరింత యేట్రింత - పొనుఁగు గడ్డి
గఱిక పచ్చిక వెణుతురు - కసవు తుంగ
విడవలి యనఁ దృణాఖ్యలు - వెలయు సాంబ.
8
సీ. ఎల్లి చుట్టువు గొడు - గెండమఱు వనంగ
ఛత్రంబు దనరు ధ్వ-జంబుపేళ్లు
టెక్యము టెక్కెము - టెక్కియము సిడంబు
పడగ డా లనఁ జెల్లు - నిడివి నిడుద
సోగ నిడువు చాఁపు - నాఁగ దీర్ఘమున కౌ
మఱుఁగు చా టోలము - మఱు వనంగ
దగుఁ బిధానాఖ్యలు - జగతి జగిలె తిన్నె
యరుఁ గన వేదిక - కమరు నేల
 
తే. ఇల పుడమి మన్ను బువి పంట-వలఁతి యనఁగ
ధరణి కగు విప్పు వెడలుపు - విరివి పఱఁపు
వెడఁద యన విస్తరాఖ్యలు - వెలఁయు బైరు
ససి యనఁగ సస్యనామము - లెసఁగు సాంబ.
9
సీ. మోడు మొరడు మొద్దు - మో టన స్థాణు వౌ
బొఱియ కలుఁగు బొక్క - బొంద లోయ
యన బిలాఖ్యలు చెల్లు - నడుసు బురద ఱొంపి
యస లనఁ బంకాఖ్య - లెసఁగు మడుఁగు
మడు వన హ్రద మొప్పుఁ - బొడ వన నున్నతం
బగు గోడ యనఁగ గు-డ్యంబు పొల్చు
సోరణగం డ్లన - మీఱు గవాక్షము
మాడుగుల్‌ మిద్దెలు - మచ్చు లనఁగ
 
తే. దారునిర్మితగృహము లౌఁ - దరకసంబు
బత్తళిక పొది దొన యనఁ - బరఁగు దూణి
పెట్టి మందసమును పెట్టె - పెట్టియ యనఁ
బేటికాభిఖ్య లగు గుణ-పేటి సాంబ.
10
సీ. ఎన జోడు మాదిరి - యీడు పురుడు మాద్రి
సాటి పాటి తరంబు - దీటు దినుసు
సరి యుద్ది ప్రతి దిన్సు - సవతు పోలిక దొర
జత యనఁగా సదృ-శమున కెసఁగుఁ
బల్లకి పల్లకీ - పాలకి పాల్కి నాఁ
బల్యంకికాఖ్యలు - పరఁగు లాలి
యుయ్యాల యుయ్యేల - యూయెల తొట్ల జో
ల యనంగ డోలికా-హ్వయము లెసఁగుఁ
 
తే. గంకటియు మంచ మనఁ జెల్లు - ఖట్వమునకుఁ
బీఁట పలక యనఁగ నొప్పుఁ - బీఠమునకు
బరణియుఁ గరాట మనుపేళ్లు - భరణి కమరు
నిచ్చెన యనంగఁ నిశ్రేణి - నెగడు సాంబ.
11
సీ. ఉలి యు క్కిను మనఁగ - నొనరు నయస్సంజ్ఞ
చెంబు రాగి యనఁ దా-మ్రం బెసంగుఁ
దగరము కరుగు డ-నఁగ సీసము రహించు
కాంస్యంబు వర్తిల్లుఁ - గం చనంగఁ
ద్రపునామ మమరుఁ బి-త్తళి యిత్తళి యనంగఁ
గుండలు చట్లు మూఁ-కుళ్లు బుడ్లు
కడవలు బానలు - పిడతల్‌ వెస ళ్లన
భాండముల్‌ తగు నాఁచు - పాఁచి యనఁగ
 
తే. శైవలం బగు నూతులు - బావు లనఁగ
వెలయుఁ గూపంబులకు గుంట - కొలను కొలఁకు
తిరుకొళం బన సరసికిఁ - బరఁగు వాఁక
యేఱు వంక వాఁ గనఁ బేరు - లెసఁగు సాంబ.
12
సీ. మీల్‌ మీలు చేఁపలు - మీనులు తెఱగంట్లు
మచ్చెము లనఁ జెల్లు - మత్స్యములకుఁ
దాఁబేలు తామేలు - నాఁ బొల్చుఁ గూర్మము
నెం డ్రెండ్రకా యన - నెసఁగుఁ గర్కి
యోడ కల మనంగ - నొనరు నావకు వాన
జడి ముసు రనఁగ వ-ర్షమున కలరు
వానఱాల్‌ వడగండ్లు - నా నొప్పుఁ గరకలు
నిసు మన నిసు కన - నిసు వనంగ
 
తే. మెఱయు సైకతనామముల్‌ - కురుజుతేనె
పుట్టతేనియ పెరతేనె - పువ్వుఁదేనె
జుంటితేనియ యనఁ దగు - సుమరసంబు
శంబధరనుత సుగుణక-దంబ సాంబ.
13
సీ. జముకాణము తివాసి - జంబుకాణ మనంగఁ
గంబళాఖ్య లగు బం-గారు హొన్ను
జాళువా పుత్తడి - మేలిమి బంగరు
పసిఁడి పొన్ను కడాని - పైఁడి యుదరి
యన సువర్ణము వొల్చు - నపరంజి కుందనం
బనఁ దప్తకనక మౌఁ - దునుక తునియ
చిదురుప చిదురు నాఁ - జెలఁగు ఖండమునకుఁ
బొది ప్రోగు వామియుఁ - బ్రోవు తిట్ట
 
తీ. కుప్ప యన రాశి కగు సంజ్ఞ - యుప్పరిగయు
మహలు మేడ యనంగ హ-ర్మ్యమగుఁ ద్రోవ
దారి తెన్ను తెరు వనఁ బ-థంబు వెలయు
రవ రజం బన లవముపే-ళ్లవును సాంబ.
14
సీ. అడవి కాన యనంగ - నటవికిఁ దగు హౌసు
తోఁట సింగారపుఁ-దోఁట నంద
వన మనంగను నుప-వన మొప్పు నడబావి
డిగ్గియ దొరు వన - దీర్ఘికి తగుఁ
బవ్వళింపు బిడారు - పడుకటి ల్లనఁ గేళి
గృహ మగు బోనపు-టిల్లు వంట
యిల్లు సువారంపు-టి ల్లనఁ బాకమం
దిరము రాజిలు దగ-తీర్పు చల్ల
 
తే. పంది లనఁ జలిపంది ల-నం దనర్చు
సలిలశాలాభిధలు నీరు-చల్ల నీరు
మజ్జిగయు జలతక్రనా-మములు విసన
కఱ్ఱ వీవన యన వృ-తంక మగు సాంబ.
15
కం. భువి నీస్థావరవర్గును
సవరణ వ్రాసినను వినినఁ - జదివిన యమ్మా
నవులను విద్యామతియై
భవశాలురఁ గా నొనర్పు - పశుపతి సాంబా.
16
AndhraBharati AMdhra bhArati - sAMbanighaMTuvu - bhAshha - nighaMTuvulu - sAMba nighaMtuvu AMdhranAmanighaMTuvu ( telugu andhra )