దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
17. కోతలపాట

అద్దరి కోతలకూ
యెల్లొద్దారే
అద్దరూపాయి
డబ్బులకూ
అసలే రానూ ...        ॥అద్ద॥

చుక్కా పొడిసిన యేలకి
సోకూ చేసుకొని
లచ్చీ నాతో రాయె
యెల్లొద్దారే ...        ॥అద్ద॥

సెవులలోనూ కమలాలెట్టి
ముత్తలాబావిలీ లెట్టీ
చుక్కాలా రయికా తొడిగీ
కరగంచు సీరాకట్టీ
కళ్లాకీ కాటూకెట్టీ
అద్దారికోతలకి
యెల్లొద్దారె ...        ॥అద్ద॥

నా సోకూ కేమిగానీ
నీ సోకూ సూసుకోరా
మూటాముల్లే కట్టూకోనీ
ముందూ నే నొత్తానూరా ...        ॥అద్ద॥

కాయా పంచలు కట్టూకోనీ
కిర్రూ చెప్పులు
తొడుగూ కోనీ
పొన్నూకర్రా చేతాబట్టీ
పోకాకత్తీ మొల్లో చెక్కి
అద్దారి కోతలకూ
ఎల్లొద్దారీ ...        ॥అద్ద॥

గిత్తా దూడని
ఎంటాబెట్టుకు
కోడీపిల్లని
సంకాబెట్టుకు
పగసుట్టేమో
నోట్లోపెట్టుకు
పొగలేత్తూనూ
లేసీ రారా
అద్దారీ కోతలకూ
యెల్లొద్దారీ ...        ॥అద్ద॥
AndhraBharati AMdhra bhArati - kootalapaaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )