దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
23. పెండ్లి మాటలు

చిట్టి మీరేమిటి వారే
చిట్టెక్కా మీరేమిటి వారే
పూర్ణీ మీరేమిటి వారే
పూర్ణక్కా మీరేమిటి వారే
తామర మొగ్గల్లా.
    చిట్టీ మేం వ్యాపారులం
    చిట్టెక్కా మేం వ్యాపారులం
    పూర్ణీ మేం వ్యాపారులం
    పూర్ణక్కా మేం వ్యాపారులం
    తామర మొగ్గల్లా.
చిట్టీ మీ వ్యాపారమేమి
చిట్టెక్కా మీ వ్యాపారమేమి
పూర్ణీ మీ వ్యాపారమేమి
పూర్ణక్కా మీ వ్యాపారమేమి
తామర మొగ్గల్లా.
    చిట్టీ మేం రత్నాల వ్యాపారులం
    చిట్టెక్కా మేం రత్నాల వ్యాపారులం
    పూర్ణీ మేం రత్నాల వ్యాపారులం
    పూర్ణక్కా మేం రత్నాల వ్యాపారులం
    తామర మొగ్గల్లా.
గుజగుజరేకుల పిల్లుందా
గుజ్జారేకుల పిల్లుందా
స్వామీదండల పిల్లుందా
సహరాజులు మెచ్చే పిల్లుందా.
    గుజగుజరేకుల పిల్లుందీ
    గుజ్జారేకుల పిల్లుందీ
    స్వామీదండల పిల్లుందీ
    సహరాజులు మెచ్చే పిల్లుందీ.
గుజగుజరేకుల పిల్లాడున్నాడా
గుజ్జారేకుల పిల్లాడున్నాడా
స్వామీదండల పిల్లాడున్నాడా
సహరాజులు మెచ్చే పిల్లాడున్నాడా.
    గుజగుజరేకుల పిల్లాడున్నాడు
    గుజ్జారేకుల పిల్లాడున్నాడు
    స్వామీదండల పిల్లాడున్నాడు
    సహరాజులు మెచ్చే పిల్లాడున్నాడు.
గుజగుజరేకుల పిల్లనిస్తారా
గుజ్జారేకుల పిల్లనిస్తారా
స్వామీదండల పిల్లనిస్తారా
సహరాజులు మెచ్చగ పిల్లనిస్తారా.
    గుజగుజరేకుల కట్నమెంత
    గుజ్జారేకుల కట్నమెంత
    స్వామీదండల కట్నమెంత
    సహరాజులు మెచ్చగ కట్నమెంత?
గుజగుజరేకుల జరీకుచ్చులు
గుజ్జారేకుల చంద్రహారాలు
స్వామీదండల ఒడ్డాణం
సహరాజులు మెచ్చగ సూరీడూ.
    గుజగుజరేకుల మాకొద్దూ
    గుజ్జారేకుల మాకొద్దూ
    స్వామీదండల మాకొద్దూ
    సహరాజులు మెచ్చగ మాకొద్దూ.
గుజగుజరేకుల పిల్లడి కట్నమెంత
గుజ్జారేకుల పిల్లడి కట్నమెంత
స్వామీదండల పిల్లడి కట్నమెంత
సహరాజులు మెచ్చగ పిల్లాడి కట్నమెంత.
    గుజగుజరేకుల రవ్వుంగరాలూ
    గుజ్జారేకుల కడియములూ
    స్వామీదండల హారములూ
    సహరాజులు మెచ్చగ తురాయి.
గుజగుజరేకుల మాకొద్దూ
గుజ్జారేకుల మాకొద్దూ
స్వామీదండల మాకొద్దూ
సహరాజులు మెచ్చగ మాకొద్దూ.
    గుజగుజరేకుల చీనాంబరాలు తెచ్చాము
    గుజ్జారేకుల జల్తరురవికలు తెచ్చాము
    స్వామీదండల పండ్లూపసుపూ తెచ్చాము
    సహరాజులు మెచ్చగ పెండ్లికి వచ్చాము.
AndhraBharati AMdhra bhArati - peMDli maaTalu jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )