దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
42. ఊడ్పులపాట

నోమినోమన్నారె తుమ్మెదా
నోమన్నాలార తుమ్మెదా
కలువరేకులెకల్లు తుమ్మెదా
కలికి సీతమ్మావి తుమ్మెదా
ఆ అందసందాలు తుమ్మెదా
అవనిలోనే లేవు తుమ్మెదా
బంతులాడబోయే తుమ్మెదా
సీమంతి సీతమ్మ తుమ్మెదా
సీత బంతులయాట తుమ్మెదా
సిలకలే సూసాయి తుమ్మెదా
సీత సెలికత్తెలే తుమ్మెదా
సిగ్గులే పొందారు తుమ్మెదా
అంతలోనా బంతి తుమ్మెదా
అరిసేతులో తడి తుమ్మెదా
జనకుడూ తెచ్చినా తుమ్మెదా
సివునింటికింటికీ తుమ్మెదా
దొరులుసూపోయింది తుమ్మెదా
సీతసెలువలను సూసి తుమ్మెదా
నవ్వుతూ పలికింది తుమ్మెదా
అమ్మ అతివాలార తుమ్మెదా
నా అందమైనా బంతి తుమ్మెదా
పెట్టికిందికి పోయె తుమ్మెదా
తీసి యివ్వారమ్మా తుమ్మెదా
సెలులు అందరుగూడి తుమ్మెదా
సేతులూ కలిపారు తుమ్మెదా
సత్తవలు సూపారు తుమ్మెదా
బలములే సూపారు తుమ్మెదా
సివదేవుడీ యిల్లు తుమ్మెదా
కదలకే పోయెనూ తుమ్మెదా
నవ్వుతూ సీతమ్మ తుమ్మెదా
అంసనాగొచ్చింది తుమ్మెదా
తామరలె సేతులూ తుమ్మెదా
అరికాళ్లు బంగారు తుమ్మెదా
అతి సులువుగాను తుమ్మెదా
అవలీల గెత్తింది తుమ్మెదా
జనకుడే సూశాడు తుమ్మెదా
దేవతలు సూశారు తుమ్మెదా
పుస్పవృష్టి కురిసె తుమ్మెదా
దేవుదుందుభులెల్ల తుమ్మెదా
దేవగోసలు సేసె తుమ్మెదా
జనకుడంతటతోను తుమ్మెదా
జానకొద్దకి వచ్చి తుమ్మెదా
సంబరముతో తాను తుమ్మెదా
తనపంతమే పలికాడు తుమ్మెదా
కన్న తల్లీ నిన్ను తుమ్మెదా
పొగడతరమూ కాదు తుమ్మెదా
దేవతలె జంకేరు తుమ్మెదా
రాచ్చసులు రానేదు తుమ్మెదా
నరులవశమూ గాదు తుమ్మెదా
నీ బలము సూడంగ తుమ్మెదా
నా మనసు పొంగానాది తుమ్మెదా
నీ బలముమించిన బలము తుమ్మెదా
నే నవని సూడాలేదు తుమ్మెదా
ఈ విల్లు విరిసేటి తుమ్మెదా
వీరునకె ని న్నిత్తు తుమ్మెదా
సీత సిగ్గుతోటీ తుమ్మెదా
సెలులతో సేరింది తుమ్మెదా
AndhraBharati AMdhra bhArati - uuDpulapaaTa jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )