దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా
68. ధర్మం

ముసలాడు మా తాత
పసనిమ్మ పండు
నవ్వుతూ అన్నమ్మ
నంది పూజించి
ఆ నంది పూజలకు
నీళ్లు తేవలెను
తవ్వించె మా తాత
తోవల్ల చెరువు
తోవల్ల చెరువుకి
తోడులేదనుచు
వేయించె మా తాత
ఊడలా మర్రి
ఊడలా మర్రి
ఎరువు లేదనుచు
గడుపార ఎరువెట్టి
గంగ నీరెట్టి
చెరువు పక్కన నిమ్మ
తోట వేశాడు
చుట్టు తిరుగ ఎరులెట్టి
నిమ్మ నీ రెట్టి
ఆ తోవ వెళ్ళేరు
పెద్దబావల్లు
ఆ నీరు త్రాగారు
నీడ బడ్డారు
ఆ పళ్ళు తిన్నారు
పాట పాడేరు
కూడు తిన్నట్టుగా
పళ్లు తిన్నారు
పుణ్యవంతుడి తోట
విరగ కాయాలి.
AndhraBharati AMdhra bhArati - dharmaM jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )