దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా

మనవి మాటలు : ఎల్లోరా

తెలుగువాఙ్మయంలో జానపద వాఙ్మయానిది ఒక ప్రత్యేక తరహా - ఒక ప్రత్యేక శాఖ!! ఇందులో రకరకాల ఛందోరీతులలో అల్లబడిన అనేక తరహాల గేయములు, పాటలు, కథలు వున్నాయి. జానపద వాఙ్మయానికి వున్న ప్రత్యేక లక్షణాలలో సూటిగా చెప్పదలచుకున్నది చెప్పడం, ఇంపుగా ప్రజల కర్థమయ్యే భాషలో రచింపబడడం!

ఈ తరహాకు చెందిన జానపద కవితలు పూర్వకాలపు రోజులలో అంతగా ఆదరింపబడినట్లు కనుపించదు. ఈనాడు మధురకవితలనదగిన యీ జానపద వాఙ్మయం తెలుగు సాహిత్యశాఖలలో ఒక శాఖగా గుర్తించబడడం, ఆదరించబడడం, పునరుద్ధరించబడడం గర్వించదగినదే!

ఇంతదాకా జానపదగేయాల సంరక్షణకు అంతగా కృషి జరుగలేదనే చెప్పవలసి యుంటుంది. జరిగిన కాస్తపని అయినా యే కొలదిమంది వ్యక్తుల ద్వారానో జరిగింది. ఈనాటికైనా సంస్థలు కదిలి వీటి పునరుద్ధరణకు పూనుకోవడం ముదావహం!

తెలుగు జానపద రచనలను సంపుటాలుగా వెలువరించదలచిన, కనీసం కొన్నివేల సంపుటాలనైనా ప్రచురించవలసి యుంటుంది. అంతటి పనిని కొలదిమంది వ్యక్తులు, ఒకటి రెండు ప్రచురణ సంస్థలు తలచుకొని సాధించే పని కాదు. అందుకు అన్ని సాహితీసంస్థలూ కదలి నిర్మాణాత్మకమయిన, నిస్వార్థమయిన కృషి చేయగలగాలి.

సేకరించడం, సరిపుచ్చడం, సంకలనంగా రూపుదిద్ది వాటికి ఒక పుస్తకరూపం యివ్వడం చాలా కష్టమయిన పని అయినా, తెలుగు ప్రాచీన కవితలను తిరిగి పునరుద్ధరించి వాటికీ నాగరికలోకంలో ఒక స్థానం కలుగజేయాలనే తలంపుతో - నేను యెన్నో సంపుటాలను సేకరించి, వాటిని సరిచూసి, వాటిని ఆంధ్రప్రజలకు అందివ్వడం కోసం కృషి చేస్తూన్నాను.

ఆ కృషి ఫలితంగా, విశాలాంధ్ర ప్రచురణాలయంవారు నా "జానపదగేయాలు" ప్రథమ సంపుటాన్ని 1954లో పుస్తక రూపంలో - చక్కని గెటప్‌లో వెలువరించి, నన్ను ప్రోత్సహించడంతో పాటు తెలుగు సాహిత్యోద్యమానికే యెంతో మేలును చేకూర్చారు.

తెలుగువారి ఆచారవ్యవహారాలనూ, జీవితసత్యాలనూ, చరిత్రలనూ కనులకు కట్టినట్లుగా వినిపించే జానపదగేయాలు సేకరించవలసిన అవసరం విశాలాంధ్ర సాధించుకున్న మనమీద ఎంతగానో వుంది. ఆ అభిప్రాయంతోనే ఎన్నో సంపుటాలను నేనూ సేకరించాను. వాటి యింపుసొంపులను (కామెంట్రీతో సహా) ఆలిండియా రేడియో (మద్రాసు) కేంద్రం నుంచి సుమారు 9 సంవత్సరాలుగా ప్రసారితం చేస్తూ వినిపిస్తున్నాను.

ఆవిధంగా ప్రచారం చేయబడిన చక్కని గేయాలను 1954లో మొదటగా పుస్తకరూపంలో వెలువరించిన విశాలాంధ్ర ప్రచురణాలయంవారే తిరిగి నా సంపుటాలనుంచి రెండవ ప్రతిని ప్రచురించి ఆంధ్రప్రజలకు అందివ్వబూనుకున్నారు.

ఇటువంటి స్వార్థరహితసేవ అన్ని వైపులనుంచీ వచ్చిననాడు తెలుగుసంస్కృతి విశ్వపీఠాన్ని అలంకరిస్తుందనటంలో సందేహం లేదు! ఇకముందు విశాలాంధ్ర ప్రచురణాలయంవారు జానపద వాఙ్మయంమీద సమీక్షాగ్రంథాలను వెలువరించి దేశి సారస్వతమును ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

నా జానపదగేయసంపుటాలను చూసి ఎంతో సంతోషంతో, ప్రోత్సహించి అడుగగానే తొలిపలుకు వ్రాసి యిచ్చిన డాక్టరు గిడుగు వెంకటసీతాపతిగారికి నా వందనాలు!

నా జానపద సంపుటాలను వరుసగా ప్రచురిస్తూ నా కృషికి చేయూతనిస్తూన్న విశాలాంధ్ర ప్రచురణాలయంవారికి, నా రచనలను ఆదరిస్తూన్న ఆంధ్రప్రజానీకానికి నా అభివందనాలు!!

"ఎల్లోరా"
1959

(గొడవర్తి భాస్కర రావు)

AndhraBharati AMdhra bhArati - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )