దేశి సాహిత్యము జానపద గేయములు జానపద గేయములు - 2 : ఎల్లోరా

తొలిపలుకు : గిడుగు వెంకట సీతాపతి

జానపదజీవతాన్ని ప్రతిఫలించే వాఙ్మయంలో జానపదగేయాలు ఉన్నతస్థానాన్ని పొందదగినవి. అందులో జానపదుల నిత్యకృత్యాలే ఎక్కువగా కనబడుతూవున్నా అవి రసవంతంగాను హృదయరంజకంగాను రచితములయినవి. మాయామర్మమెరుగని వారి జీవితాలు సహజసిద్ధములైన రాగద్వేషాలకు లోనైనా ఉదాత్తములయిన భావాలతోను, అవ్యాజములయిన ఆశయాలతోను, మృదుమధురములయిన పలుకులతోను, సరళమయిన నడవడితోను నదులలోని నిర్మలోదకములవలే ఎట్లు సాగుతూవుంటవో జానపదగేయాలు తెలియజేస్తూ ఉంటవి. ఉన్నదానితో తృప్తిచెంది, తృణం మేరువుగా చూచుకొని ఉత్సాహంతో ముందుకు పోగల శక్తి జానపదులలో యెక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ఊహాగానంలో వారు సర్వస్వతంత్రులు; మేఘాలలో బొమ్మలు చిత్రించుకోగలరు; బొమ్మలతో ప్రసంగించగలరు; ఆకాశంలో మేడలు కట్టుకోగలరు; రెక్కలు కట్టుకొని పైకి ఎగరగలరు; బ్రహ్మసృష్టికి మెరుగులు దిద్దగలరు; ధర్మదేవత అధర్మాలను అధిక్షేపించగలరు; దుష్టదేవతలకు పొలిమేరనే ఉపహారాలు పెట్టి పొమ్మనగలరు; సరసంగా సరసాలాడగలరు; పొలయలుకలు మెలుకువతో తీర్చుకొని పొత్తుపడగలరు; కష్టాలలో సుఖాలు చూడగలరు; తోడివారల సుఖదుఃఖాలు సమంగా పంచుకొని సహకరించగలరు; సంఘజీవిత మెట్లుండవలెనో నవనాగరకులకు బోధించగలరు. ఈ సద్గుణములన్నీ జానపదగేయాలలో ప్రతిబింబితము లవుతూ ఉంటవి.

జానపదగేయాలను భాషాలక్షణానికి లక్ష్యంగా లక్షణజ్ఞులు గ్రహించలేదు. వారి భాషానుశాసనము ప్రబంధాది కావ్యరచనకు వర్తింపజేసినట్లు యీ జానపద గేయాలకు వర్తింపజేయక యీ గేయాలయెడల పండితులు ఉదాసీనులై ఉండడం వల్ల మేలే కలిగినది. ఆ పండితులు ఆ శబ్దానుశాసనాలకు ఈ జానపదగేయాలను బంధించివుంటే యివి కావ్యాలవలెనే ఏ వికృత కృతక భాషలోనో రచయితములై యుండును. అట్టి దుస్థితి కలుగలేదు, కనుకనే ఇవి సరళమైన శయ్యతో సాగుతూ వచ్చినవి. అయితే, పండితుల ఆదరణ లేకపోవుటచేత ఒక కీడు కూడా కలిగినది. కావ్యాలు తాటాకులమీదికి ఎక్కినట్లు యివి ఎక్కలేదు. అందుచేత కేవలం అనుశ్రుతంగా మాత్రమే వచ్చినవేవో నిలచినవె; తక్కినవి అంతరించినవి. ఆదినుండి నేటివరకు రచితములవుతూ వచ్చిన జానపద గేయాలు, సామెతలు మొదలయినవి నిలిచివుంటే సంఘజీవితము, భాష ఎట్లు పరిణమిస్తూవచ్చినవో లెస్సగా గ్రహించగలుగుదుము. అట్టి సద్భాగ్యము మనకు లభించలేదు.

జానపద గేయాలలో గ్రహించుటకు యోగ్యమయిన విశిష్టలక్షణము ఎక్కువగా ఉన్నది కనుకనే వాటి సంగ్రహణమునకు విలువ హెచ్చినది. అట్టి జానపద గేయాలను - కాలగర్భంలో మడిసిపోయినవి పోగా, నేటికింకా పల్లెలలో జానపదుల పెదవులపై తాండవిస్తూ, వీనులవిందుగా వినబడుతూ వున్నవాటినైనా సేకరించడం సంస్కృతిగలవార మనుకొన్న మనకు విహితధర్మం. ఆ ధర్మమును నిశ్చలభక్తితో నెరవేర్చుటకు దీక్ష వహించి, శక్తివంచనలేక తీవ్రమైన కృషిచేసి కృతకృత్యులయిన "ఎల్లోరా"గారికి నా అభివందనాలు!

ఈ జానపద గేయాలను రచించినవారెవరో మనకు తెలియదు. వారు తమ నామధేయాలను యథాతథంగా గాని, "ఎల్లోరా" వంటి ఉపపదాలతో గాని తమ గేయాలలో పొందుపరచుకోలేదు. వారు ఏనాటివారో స్పష్టంగా తెలియదు. అయినా, కొన్ని విశేషాలను బట్టి కాలనిర్ణయం, దేశనిర్ణయం కొన్ని గేయాల విషయంలో చేయగలము.

ఏ యే గేయాలలో కొద్దిగానయినా పాతబడ్డ నుడికారం కనబడుతుందో, ఏ యే గేయాలు మన బాల్యంలో మన ముసలమ్మలు, తాము తమ బాల్యంలో తమ ముసలమ్మలు పాడగా విని నేర్చుకొన్నామని చెప్పి వినిపించారో, ఏ యే గేయాలు తెలుగువారు గల అన్ని ప్రదేశాలలోను ఇంచుమించు ఒకే విధమున నేటికింకా వినబడుతూ వున్నవో, అవి ప్రాచీన - లేదా చాలాకాలం క్రిందటి జానపద గేయాలని మనమూహించవచ్చును. "గుమ్మడేడే గోపిదేవీ", "కృష్ణమ్మా గోపాలబాలా కృష్ణమ్మా" మొదలయిన గేయాలున్నూ, మేలుకొలుపు పాటలున్నూ, శ్రీకృష్ణలీలలున్నూ - ఇంకా ఇటువంటివి మరికొన్నిన్నీ చాలాకాలం క్రిందటనే రచితములయి ఉండవలెను. కథావస్తు సంఘటితములయిన కాటమురాజు, దేశింగ్‌ మొదలయిన గేయాలు ఆయా వీరుల చర్యలు జరిగిన కాలంలోనో, ఆ తర్వాతనో రచితములయి ఉండవలెను. "బత్తాయిచెట్టు", "బత్తాయి పండు" అనే మాటలు గల పాటలు బటేవియా నుండి నారింజపండ్లు మన దేశానికి వచ్చిన తర్వాతనే పుట్టి యుండవలెను. ఈ విధంగా "లోలకులు పెట్టిందిరా పిల్ల", "లుంగీ యేసుకు", "వాచీ పెట్టి", "పకోడీలు", "బేసరి", "రైలుబండి", "రోడ్డు" మొదలయిన అన్యదేశ్యములు గల గేయాలు ఇటీవలివని చెప్పవచ్చును గదా! ఈ విధంగానే గుంటూరు, పల్నాడు, గోదావరి, కృష్ణవేణమ్మ, భద్రాద్రి, దాచేపల్లి మొదలయిన ప్రదేశాలకు అంకితములయిన గేయాలు ఏయే ప్రాంతాలలో పుట్టియుండవచ్చునో ఊహించుకోగలము.

ఒక హెచ్చరిక. ఇటీవలివారు - జానపదులు కారు నవనాగరికులే - రచించిన పాటలు కూడా కొన్ని జానపదగేయాల క్రింద చెలామణి అవుతున్నవి. అందుకు నా యనుభవమే తెలియజేస్తున్నాను. 1908లో నేను రచించిన చిలుకమ్మ పెండ్లి, రైలుబండి పాటలు గుంటూరులో వెల్వడుతూ వుండిన 'వివేకవతి' అనే మాసపత్రికలో ప్రకటితములయినవి. అందు నా పేరు కూడా రచయితగా ముద్రితమయినది. దరిమిలాను నా యనుజ్ఞపొంది లాంగ్‌మన్స్‌, మాక్‌మిలన్‌ వారు తమ వాచకములలో చేర్చు కొన్నారు. ఆ తర్వాత కొందరు జానపదగేయాలంటూ ఒక చిన్న గ్రంథము ప్రకటించి అందులో నా చిలుకమ్మ పాట నా పేరు లేకుండా చేర్చుకొన్నారు. ఈ విధంగా ఇంకా ఇటువంటి ఆధునిక రచనలు ఇంకెన్ని చేరినవో!

సరే! ఇటువంటి ప్రక్షిప్తాలవలన కలిగే బాధ అంత గొప్పదికాదు. కాని, వాస్తవమయిన జానపద గేయాలు ఇంకా అక్కడక్కడ వినబడుతూ వున్నవే గ్రంథాలలోనికి ఎక్కకుండా వున్నందుకు ఎక్కువగా చింతించవలసియున్నది. జానపద గేయాల సేకరణ ఒకరిద్దరి వల్ల పూర్తి కానేరదు. అమెరికా వంటి దేశాలలో యీ పనికి ప్రత్యేక సంస్థలు ఏర్పడి ఉన్నవి. ఇందుకు కావలసిన పత్రికలున్నవి. జానపద వాఙ్మయ గ్రంథాలు - కథలు, గేయాలు, సామెతలు మొదలయిన శాఖలకు చెందినవి వందలకొలదిగా ఉన్నవి. ఈ పనికి ప్రభుత్వమువారు, విశ్వవిద్యాలయములు, ఇతర విద్యాసంస్థలు పూనుకొనవలెను.

జానపద గేయాలను సేకరించే పని ఇంత కష్టమైనదైనా "ఎల్లోరా"గారు శ్రద్ధ వహించి పెక్కు గేయాలు సేకరించి ప్రకటిస్తూ ఉన్నందుకు వారున్నూ, వీటిని చక్కగా ముద్రిస్తూ ఉన్న విశాలాంధ్ర ప్రచురణాలయం వారున్నూ దేశానికెంతో మేలు చేసినవారని చెప్పవలెను. వీరి కృషి ఇతోధికంగా ఫలించునుగాక!

గిడుగు వెంకట సీతాపతి

AndhraBharati AMdhra bhArati - jAnapada gEyamulu - ellOrA - dEshi sAhityamu ( telugu andhra )