కావ్యములు శివరాత్రి మాహాత్మ్యము శ్రీనాథుఁడు

శివరాత్రి మాహాత్మ్యము (సుకుమార చరిత్రము)

ప్రథమాశ్వాసము

ఇష్టదేవతా ప్రార్థనాదికము
శా.శ్రీ(గౌరీస్తనగంధసారఘుసృణశ్రీ)[1]వాసితోరస్స్థలీ-
నాగాధీశవిశిష్టసంస్తవలసన్నాళీకపాదద్వయ-
ప్రాగల్భ్యుండగు శంకరుండు మనుచుం బ్రత్యక్షమై యెప్పుడున్
యోగీంద్రాఖ్యుని ముమ్మడీంద్రసుతునిన్ నుద్యుక్తశాంతాత్మునిన్.
1
శా.శ్రీరామారమణుం డశేషజగతీక్షేమంకరప్రక్రియా-
భారాయత్తమనస్కుఁ డార్యజన[2]సంభావ్యుండు భవ్యాత్ముఁడై
గారామారఁగ నుమ్మమాంబికసుతున్ గౌరీశభక్తాగ్రణిన్
ధీరున్ ముమ్మయశాంతునిన్ మనుచు సందీర్ఘాయురర్థాఢ్యుఁగన్.
2
ఉ.నాలుగు మోములం దనర నాలుగు వేదము లభ్యసించుచున్
నాలుగు నైదు రూపముల నవ్యసుఖ(స్థితి సృష్టి)[3]చేయుచు
న్నాలిని బుక్కిటం దిడి విహాయసవీథిని నంచ నెక్కి తాఁ
జాలఁ జరించు బ్రహ్మ ఘనశాంతుఁడు శాంతనఁ బ్రోచుఁ గావుతన్.
3
చ.హరిహరపద్మజాదులగు నాద్యులు సంతతభక్తియుక్తులై
చిరమగు నిష్టసంపదలఁ జేకొని లోకములన్ సృజింపఁగా
నరుదుగఁ బ్రేమఁ బ్రోవ లయమందఁగఁ జేయఁగఁ గర్తలైరి నీ
[4]పరమహనీయతత్త్వ మనివార్యము సద్గుణశీల పార్వతీ.
4
గీ.మదనుఁ గన్నతల్లి మాధవునిల్లాలు
బ్రతుకులెల్లఁ దానె పట్టిచూడ
ముఖ్యమైన లక్ష్మి ముమ్మయశాంతాత్ము
మందిరంబునందు మసలుచుండు.
5
చ.కవికవితాబ్ధిలోన ముఖగహ్వర మోడయు జిహ్వ త్రెడ్డు హృ-
త్పవనుఁడు పీలికాఁడు మృదుభాషలు రత్నము(లై చెలంగఁగా
కవి పర)మాత్మ వర్తకుని కైవడి నీకు విశేషసత్కృతుల్
గవయఁగ [5]వచ్చె నీవలనఁ గావ్య[6]సుఖాత్ముఁడ [పోలె] భారతీ.
6
క.యుక్తాయుక్తనిరీక్షణ
శక్తుఁడు గాఁ డీతఁ డన కజస్రము కరుణా-
సక్తమతి మమ్ముఁ బ్రోవుము
భక్తపరాధీన వీరభద్రస్వామీ.
7
సీ.ప్ర[కట] గర్జారౌద్రభాసితచంచలో- | ద్దామనీలాంబుదశ్యామదేహు
దనుజదర్పధ్వాంతదారుణసప్తార్చిఁ | బన్నగకేయూరుఁ బ్రకటమూర్తి
దారితశ్రీస్థిరాదర [వరహ]స్తుని | దక్షాధ్వరాటవీదావదహను
శమనజిహ్వాభీలసంకాశఘోరాసి | దక్షిణదోర్దండధారు వీర-
 
ఆ.వె.భద్రు భక్తచిత్తపరిపూర్ణు వాసవ- | వం[దితాం]ఘ్రియుగ్ము వారణాసు-
రారిమూర్తియైన యభినవరూపుని | సన్నుతింతు నేను సరస మెసఁగ.
8
సీ.దక్షాధ్వరధ్వాంతద[ళనభ]ద్రోద్రేక- | సప్తాశ్వుఁ డే దేవు చండహేతి
భుగ్నస్ఫుటాభీలభువనసంక్షోభైక- | గరళ మే దేవు నాక్రమ్యభుక్తి
నిఖిలావనీభారనిర్మలనిర్మాణ- | కరణంబు లే [దేవు కం]కణంబు-
లంధకాసురభీమహంకారపాథోధి- | బాడబం బే దేవు భయదశూల-
 
ఆ.వె.మమరవరకిరీట విమలకోటీరట- | న్నిబిడమణిమయూఖని[వ]హరుచిర
పాదపద్ముఁడైన పలివెల కొప్పయ్య | నర్థితోడఁ గొల్తు నహరహంబు.
9
చ.పృథివిని భూధరావలి గభీరము సాగరసప్తకంబు త-
త్ప్రథితనిబంధనంబు వియదంతరమెల్ల కటిప్రదేశ మా
పృథుతరలోకసంఘములు భీమపిచండ మజాండమాలికా-
గ్రథనము నీదు మస్తమని కాంతురు సిద్ధివినాయకాధిపా.
10
క.భావమునఁ దలఁతు మద్గురు
భావితలోకుని మదీశుఁ బరమేశసమున్
శైవమతగర్వనిర్వహ-
ణావిష్కృతకీర్తిఁ బండితారాధ్యవరున్.
11
సీ.బాణు నద్భుతశాస్త్రబహుకలాపారీణుఁ | బ్రకటవరకవితా[భ్యాసు వ్యాసు]
బంధురగాంభీర్య[7]బంధు సుబంధు వి- | స్ఫురితమహోన్నతిస్తోము సోముఁ
జిరతరమతిభద్రుఁ జెన్నారు శివభద్రు | నతులగుణస్ఫారు నమ్మయూరు
వరనీతిచాతురీవాగ్భూతి భవభూతి - | (ముఖ్యసజ్జనదయా)మోఘు మాఘు
 
గీ.ఘనవినూత్నవికాసు శ్రీకాళిదాసు | దండికావ్యానులాపవాగ్దండి దండిఁ
జిత్రవాగ్జృంభణప్రఖ్యుఁ జిత్తపాఖ్యుఁ | దగిలి మలహణు బిలహణుఁ (దలఁతు నెపుడు).
12
ఉ.ఉన్నతమైన [8]యంధ్రకవితోక్తుల నెంతయుఁ బ్రోడలైన యా
నన్నయభట్టు తిక్కకవినాయకుఁ [9]దత్సము శంభుదాసు(నిన్
బన్నగుఁ బోలు నా కమలనాభునిఁ జేరి భజింతు నెంతయున్
సన్నుతశబ్ద)శాస్త్రముల సంఘట(నంబు ఘటించు వేడు)కన్.
13
క.కృతిపతులగు కవిముఖ్యుల
సతతముఁ గొనియాడి వారి సన్నుత(కరుణా-
మతికిన్ బాత్రుఁడ నేనే
వితతంబగు కవితచెప్ప వెరవని మతితోన్).
14
క.(ఉఱవైన సుకవి)కోటుల
తెఱఁ [10]గిది యని తప్పులెల్లఁ దీర్తురు వశులై
యెఱుఁగరు సుకవులఁ గుకవులు
కఱకులు [11]వలుకుటయ నేర్పు గర్వప్రౌఢిన్.
15
ఉ.పద్యగణాక్షరప్రకరభావరసారగుణ(ప్రపూర్ణమై
హృద్యవిలాస)శబ్దపదహేతుకళారససత్క్రియాఢ్యమై
యాద్యులు చన్న మార్గమున నా వళి ప్రాస విడంబబంధమై
చోద్యముగాఁగఁ జెప్పు కృతి శ్రోత్రసుఖావహ మెల్లచోటులన్.
16
శా.(జాతాజాత చరాచరప్రతతికిన్) [12]సంభూతకస్థానమై
ఖ్యాతంబై బుధహృద్యమంగళకవీంద్రాచార్యసంసేవ్యమై
యాతారార్కసుధాంశువై కమలజాతాకల్పమై యెప్పుడున్
జ్యోతిశ్చక్రముఁ బోలెఁ గ్రాలవలదా సొం(పారి కావ్యం బిలన్).
17
వ.అని యిష్టదేవతాప్రార్థనంబును, గురుప్రశంసయుఁ, గవీశ్వరప్రస్తుతియుఁ, గుకవినిరాకరణంబునుం జేసి యొక్క కవితావిధానంబు శైవంబుగా సుకుమారచరిత్రంబు (చెప్పంబూనిన యవసరంబున) స్వస్తి శ్రీపర్వతస్వయంభూ శ్రీలింగచక్రవర్తి శ్రీమన్మల్లికార్జునమహాదేవుని ముఖమండపంబున సుఖాసీనులయి యంచుగండ(దేవ) పృథ్వీమహా(మహత్తును, నానాదేశాగతానేక బ్రాహ్మణ)భక్తప్రకరంబులును, విజయసదృక్షులగు శుద్ధక్షత్రియులును, ధనపతిసమానసంపద్భాసితులగు వైశ్యులును, నిర్వక్రపరాక్రములగు వీరభటులును, [13](శంకరపురాధ్యక్షులును), స్థానా(ధికారులును, బాహత్తరి)నియోగంబును, గుండలి దండ లాసక [14]ప్రేరణి ప్రేంఖణంబులైన చతుర్విధనృత్తగీతవాద్యాభిజ్ఞులును, గళావిలాస[15]కరణాసనబంధురబంధభేదంబులం [16]గందర్పసంగరప్రవీణలయిన (కురంగలోచనలును బలసి)యుండ, శ్రీశాంతభిక్షావృత్తియతీశ్వరుండు శివకథావిధానంబులఁ [17]బ్రొద్దులు పుచ్చుచుఁ దన మూలభృత్యుండగు [18]నుప్పలపు ముమ్మడిదేవయ్య శాంతునిం గనుంగొని నీ పేర (నంకితంబుగా నంధ్రభాషా) కవిత్వంబున నీ కథ యుపన్యసింపుమనిన మహాప్రసాదంబని సత్కవిసార్వభౌముండగు శ్రీనాథకవివరేణ్యుని గృపావిశేషంబునం గాంచి శ్రీమన్మల్లికార్జున మహాదేవ(దేవు పాదపద్మారాధకులగు) అంచుగండముఖ్య [19]రేవణసిద్ధ యేకోరామేశ్వర పండితారాధ్యాది చాతుర్వర్ణ్యంబులం గలిగిన మ(తంబుల) యందు (పండితారాధ్యహస్తసంభూత వంశంబులయందు నుద్భవం)బందిన మల్లినాథగురుండు.18
సీ.లింగార్చనక్రియాలీల నే ప్రొద్దును | గరికాల[20]చోడని కరణివాఁడు
జంగమారాధనాసక్తి మై(నేపార | బల్లాణభూనాథు పాడివాఁడు
పరమశైవాచారపాండిత్యవిస్ఫూర్తి | సంగన బసువయ్య) సరణివాఁడు
వరధర్మచాతురీవైభవఖ్యాతిచే | [21]చెన్నమరాయని చెలువువాఁడు
 
గీ.ననఁగ నిద్ధాత్రి నింపారు నఖిలకళల | సకలనిర్మాణవిద్యాప్రశస్తుఁ డనఁగ
మానితైశ్వర్యసంప్రాప్త(మహితయశుఁడు) | మల్లికార్జునయోగిసమాజ[22]వరుఁడు.
19
క.ఆతని వంశంబునఁ బ్ర-
[23]ఖ్యాతచరిత్రప్రతాపకలనాధర్ముం
డాతతవిక్రమశీలుఁడు
భూతలమునఁ గొమ్మవిభుఁడు పొలుపై వెలసెన్.
20
వ.తదనుసంభవుండు.21
సీ.[24]చేఁపూరి భీమేశుఁ జెలువార గుండెలఁ | బూజ గావించిన పుణ్యమూర్తి
కడిమిమై నిరువత్తుగండనిచే మల్లి- | కార్జును కుత్పలం బర్థిఁ బడసె
గొలని రామారెడ్డివలన (శ్రీగిరినాథు | కర్పించె భరణాలు గరి)మతోడ
భక్తిరాజాఖ్యుచేఁ బర్వతేశ్వరునకు | నర్పించెఁ [25]జెరువాలు నాతుకూరు
 
గీ.ధరణిఁ ద్రిపురాంతకున కాముదాలపల్లి | రాయవేశ్యా[26]భుజంగువల్లావ యిచ్చె
నిట్టి పౌరుష (సంపన్నుఁ డిద్ధయశుఁడు) | పోలిదేవయ్య చెన్నారుఁ బుణ్యమూర్తి.
22
వ.ఆ గురుస్వామి నిజవంశాచారంబునకు దగిన తలోదరిం బరిణయంబయ్యె నంత.23
సీ.గౌరీతలోదరి గాఁబోలు నీ భా(మ | కారుణ్యవిస్ఫూర్తి గలిగి)యుండు
శ్రీలక్ష్మి గాఁబోలుఁ జెలువ సౌభాగ్యంబు | దిక్కులనెల్లను బిక్కటిల్లు
వాగ్దేవి గాఁబోలు [27]వామాక్షి బహుశాస్త్ర- | పాండిత్యవిస్ఫూర్తిఁ బరిఢవించు
నింద్రాణి గాఁబోలు నిందునిభాస్య (తాఁ | బావన)ఖ్యాతిమై బరఁగుచుండు
 
గీ.ననఁగ నే ప్రొద్దు గుణముల నతిశయిల్లి | [28]పరఁగు శ్రీశైలనాథుని పట్టణమునఁ
బోలిదేవయ్య కులసతి పుణ్యచరిత | ముదిత [29]సజ్జననికురుంబ ముమ్మమాంబ.
24
ఉ.*పోలయ ముమ్మమాంబికలు పుణ్యచరిత్రుల భక్తియుక్తులం
బోలఁగఁ గాంచి రేడ్వురను బుణ్యఋషీశ్వరసప్తతుల్యులం
బోలిన పుత్రసప్తకము భూతహితార్థగుణప్రవృత్తికై
లాలితవిక్రమోన్నతుల లక్షణదివ్యవిచక్షణాత్ములన్.
25
సీ.రామామనోహరరతిరాజ[30]నిభుఁడు శ్రీ- | మల్లినాథాఖ్యుండు మహిమ వెలయు
(ధర్మార్థ సం)చారనిర్మలస్వాంతుండు | శ్రీగిరినాథయ్య చెలువుమీఱుఁ
బరమశైవాచారపాండిత్యగరిమల | [31]సెట్టిదేవాఖ్యుండు చెన్నుమీఱు
వైభవప్రఖ్యాతవరహరిశ్చంద్రుండు | భీమేశ్వరస్వా(మి పెంపుమీఱు)
 
గీ.వెలయు ముమ్మడిదేవయ్య వినుతకీర్తి- | ఘనుఁడు కొమరగిరీంద్రుండు గలిగియుండు
(భూతిఁ) బోతలింగాఖ్యుఁడు పొలుపుమీఱు | సప్తఋషులకు నే ప్రొద్దు సము(లనంగ).
26
క.(వారలలోపల సెట్టియ
ధారుణి శ్రీపర్వతేశు దండాధీశుం
డారయ ననఁగా వెలసెను)
కారణజన్ముండు (నవ్యకావ్యాసక్తిన్).
27
సీ.(శివరాత్రి నిత్యంబుఁ జెల్లించు విఖ్యాతి | బసువయ్య దండాధి పాటివాఁడు)
లింగార్చనక్రియా(లీలల నే ప్రొద్దు | సురియ చౌడాధీశు సొబగువాఁడు)
పరమలింగధ్యానపారీణసద్బుద్ధి | నల్లమప్రభు లీల నలరువాఁడు
[32]రుచ్యర్పణక్రియారూఢి నిద్ధారణి | మాదరచెన్నయ్య మహిమవాఁడు
 
గీ.చెలఁగె గురులింగజంగమసేవకుండు | మల్లికార్జునశివునకు మంత్రి యనఁగఁ
దూర్పునాఁడెల్లఁ బాలించు నేర్పరతఁడు | శ్రీసమేతుండు పోలయసెట్టివిభుఁడు.
28
వ.అమ్మహాత్ముండు దన [33]వర్ణంబునకుం దగిన వర్ణనీయయగు సాధ్వి వివాహంబయ్యె నంత.29
సీ.పార్వతీమూర్తియు భారతీదేవియు | నిందిరారూపంబు నింద్రుసతియు
రోహిణీదేవియు రుక్మిణీ[34]దేవియు | స్వాహాస్వధాతులశక్తిచయము
గంధర్వసతులును గందర్పుభామయుఁ | గశ్యపుసాధ్వుఁలుఁ గ్రతువు[35]సతియు
వరవసిష్ఠునిరాణి ధరఁ గుంభసంభవు- | రామయు నాదిత్యురమణిఁ గూడి
 
గీ.ధరణి నొక్కటఁ బుట్టించె ధాత[36]యనఁగ | మగువ సెట్టిదేవాఖ్యుని మారమాంబ
సకలసద్గుణవిఖ్యాత[37]సౌమనస్య | మహితపంచాక్షరీమంత్ర [38]మంజులాత్మ.
30
క.సెట్టియ[39]మారమ గాంచెను
దట్టుల భీమయ్యఁ బ్రోలధరణీధవునిన్
[40]దుట్టురగండని ముమ్మయ-
[41]సెట్టన విలసిల్లు వీరశేఖరు [42]నర్థిన్.
31
క.పారావారగభీరుఁడు
నారీజనమన్మథుండు వరసుతుఁ డనఁగా
ధారణి సెట్టియభీముఁడు
వారక వర్ధిల్లునెపుడు వైభవ మలరన్.
32
క.లాలితవైభవశీలుఁడు
లోలాక్షీమన్మథుండు లోకఖ్యాతుం
డాలోలచరిత్రుఁడు ధరఁ
బ్రోలామాత్యుండు వెలసెఁ బుణ్యోదయుఁడై.
33
సీ.పంచాక్షరీమంత్ర పారిజాతోద్భూత | ఫలము లే గురువు సంభాషణములు
వీరశైవాచారవిమలమార్గానూన- | శాశ్వతం బే గురుస్వామి మహిమ
నిఖిల[43]దేశాధీశనివహ[44]ప్రణామైక- | పాత్ర మే గురుమూర్తి పాదయుగళి
శంకరపూజాప్రశస్తదీక్షాజనా- | హ్లాద మే గురువు హస్తాంబుజాత-
 
గీ.మనఁగఁ బండిత చెనమల్లికార్జునునకుఁ | బౌత్రరత్నంబు సెట్టియ ప్రభుసుతుండు
మారమాంబాతనూజుండు మహితయశుఁడు | వెలయు ముమ్మడి దేవయ్య వినుతకీర్తి.
34
ఉ.శ్రీగిరి తూర్పుదేశమునఁ జెన్నగు భక్తిమహత్త్వ (మర్థిఁ దా
నా)గమవేదశాస్త్రముల నంచితధర్మకథాప్రసంగతిన్
(యాగ)విశేషసూత్రముల నాయతశక్తి సుభక్తియు(క్తుఁడై)
(శ్రీగురుఁడైన ప్రోలగురు సెట్టియ ముమ్మయ) చెప్ప నొప్పెడున్.
35
క.వారక (సెట్టియ వీరన)
సారార్థము లయిన [45]కృతుల సభలోపలఁ దా
గారామారఁగఁ బలికిన
శారద యీ [46]రూపనంగ జగతిఁ జరించున్.
36
ఆ.వె.(వారిలోన వెలసె వరజయగండండు
బిజ్జ)లాఖ్య మానభీకరుండు
బసవశంకరుండు పరవాదిమండూక-
భయదపన్నగుండు [47]భక్తిఘనుఁడు.
37
క.[48]శ్వేతాంబరుఁ బొలియించిన
ఖ్యాతచరిత్రుండు జైనకాకోదరతా-
ర్క్ష్యాతతబిరుదాంకుఁడు సం-
జాతప్రవిలీన బిరుద[49]సమ్మతుఁ డెలమిన్.
38
చ.పరిణయమయ్యెఁ గాంతఁ గులభామిని రుద్రయపుత్రి శాంకరిన్
[50]సరసకలాభిరామ కులసంస్తుత పుణ్యచరిత్రయుక్తయై
యరయఁగఁ బుట్టినట్టి త్రిపురాంబికకూఁతురు భాగ్యదేవతన్
బరమపతివ్రతానిలయ భాసురనిర్మలగాత్రి నర్థమై.
39
సీ.పరమపాతివ్రత్యభావంబు తలఁపంగ | గౌరి గాఁబోలు నీ కాంత తలఁప
సకలసంపత్స్ఫూర్తి చాతుర్యమహిమల | నిందిర గాఁబోలు నిందువదన
సకలవిద్యాప్రౌఢి సడిసన్న గరిమల | భారతి [51]గాఁబోలు భామ యెపుడు
సర్వలక్షణగుణసంపన్నతోన్నతి | నింద్రాణి గాఁబోలు నిగురుఁబోణి
 
గీ.యనఁగ నిద్ధాత్రి నే ప్రొద్దు నతిశయిల్లెఁ | బరఁగ ముమ్మడి దేవయ్య భామ జగతిఁ
[52]గామితార్థైకసంధానకల్పవల్లి | యుజ్జ్వలద్గుణనికురుంబ యొమ్మమాంబ.
40
ఉ.ముమ్మడిదేవచంద్రునకు ముఖ్యతలోదరి యొమ్మ[53]మాంబకున్
(సమ్మద శైవశాస్త్రపరిసంచిత నిర్మల)శుద్ధ[54]యుక్తికిన్
ఇమ్మహి నెల్లవారలకు నీప్సితవస్తువిధాయియై ధరన్
సమ్మతి నుద్భవిల్లె [55]వరశాంతుఁడు శాంతన [56]యగ్రగణ్యుఁడై.
41
సీ.పరవాదిమత్తేభపంచాననాఖ్యుఁడు | పరవాదిమండూకపన్నగుండు
పరవాదినవమేఘపవమానధీరుండు | పరవాదిసాగరబాడబుండు
పరవాది[57]కుత్కీలభాసురదంభోళి | పరవాదికేంధనపావకుండు
పరవాదిచయతమఃపటలోగ్రభానుండు | పరవాదిభోగిసుపర్ణుఁడనఁగఁ
 
గీ.జటులజైనకోలాహలసమర బిరుద- | ఘనుఁడు సంగ్రామపార్థుండు వినుతయశుఁడు
శుభుఁడు ముమ్మడిదేవయ్య సుతుఁ డనంగ | వెలసె శాంతయ్య విక్రమవీరవరుఁడు.
42
గీ.వేడ్కఁ గవిసార్వభౌముని విమలచరిత
స్కాందపౌరాణికంబైన కథలలోన
ఘనత శివరాత్రిచరితంబుఁ దెనుఁగుగాఁగఁ
గరుణఁ జేయుము శ్రీనాథకవివరేణ్య.
43
వ.అనవుడు నమ్మహీసురాగ్రగణ్యుండు కమలనాభామాత్యపౌత్రుండును మారయామాత్యపుత్రుండును నగు శ్రీనాథకవివరేణ్యుండును [58]సంతుష్టమానసుండై శాంతస్వామి యొసంగిన కర్పూరతాంబూల జాంబూనదాభరణంబులు స్వీకరించి [59]స్కాందంబున నీశానసంహితయందుం జెప్పంబడిన యురులింగోద్భవంబును, శివరాత్రిమాహాత్మ్యంబును, (సుకుమారోత్పత్తియు, యమ-శంకర సంవాదంబును, యమ-శివదూత సంబోధనంబును నను పంచమాశ్వాసానుకీర్ణంబై యొప్పు) [60]కథానిధానంబున కధీశ్వరుఁగా (శాంతదేశికేశ్వరుం బరిగ్రహించి).44
షష్ఠ్యంతములు
క.(సత్యహరిశ్చంద్రునకును,
నిత్యాప్రతిమాన) దాననిర్మలమతికిం
గృత్యాకృత్యవివేకికిఁ
బ్రత్యర్థిద్విరదదళనపంచాస్యునకున్.
45
క.రామామన్మథమూర్తికి
రామత్రయ[61]లీనమతికి రమ్యాత్మునకున్
[62]సోమవ్రతవరకాంతికి
భీమజయోత్కటవిశేషభీకరమతికిన్.
46
క.శైవాగమశాస్త్రాది
ప్రావీణ్యాగణ్యపుణ్యభరితాత్మునకున్
భావాభావవివేకికి
భావితవంశావతారపరమాత్మునకున్.
47
క.జంభాంతకవైభవునకు
సంభృతశాస్త్ర[63]ప్రతాపశైలోన్నతికిన్
శుంభత్ప్రాభవరతికిన్
దంభోళిస్ఫురితతీవ్రతరఖడ్గునకున్.
48
క.[64]వరముమ్మయశాంతునకుం
బరమ[65]పరిజ్ఞాననిధికిఁ బావనమతికిన్
నిరుపమవిక్రమయశునకుఁ
గరుణారసపూరితాత్మకలితాంగునకున్.
49
వ.అభ్యుదయపరంపరాభివృద్ధియు, నభిమతార్థసిద్ధియు, సత్యధర్మక్రియావృద్ధియు నగున ట్లష్టాదశవర్ణనాగర్భంబుగా నత్యాశ్చర్యకరంబై యుండ నా రచియింపబూనిన కథానిధానంబు సకలపాపనిర్ముక్తంబై [66]సర్వవస్తుసంధానంబై, సర్వలక్షణసంపన్నంబై, సర్వాగమానూనసంభావితసంస్తుత్యంబై, పరమధర్మోత్కృష్టంబై, పరమేశ్వరప్రియంబై, పార్వతీమనోహరంబై, శ్రీనాథసేవితంబై, *(బ్రహ్మరుద్రాది దేవతాసంస్తూయమానంబై), (యథావిధి) శోభిల్లు నిప్పుణ్యచారిత్రంబు *(దశదోషవివర్జితంబై) నా నేర్చిన విధంబున రచియించెద నది యెట్టిదనినఁ బూర్వోక్తమార్గంబునఁ బరిపూర్ణంబై యథావిధి శోభిల్లు *(నిప్పుణ్యచారిత్రంబుఁ బోలి)నట్టి ధర్మక్షేత్రంబును మహాతీర్థంబును నగు గంగాకాలిందీసంగమంబున [67]సంశ్రితాత్ములు సత్యవ్రతపరాయణులు నగు శౌనకాది మహామునులు దీర్ఘసత్రంబునందుఁ గూడియుండ (నవ్వేళ) వేదవ్యాసప్రియశిష్యుండు రోమహర్షణతనయుండు పౌరాణికుండు సూత్యాహిసంభవుండు సూతుం డేతెంచిన సంప్రహృష్టమానసు లయి యమ్మహామును లాసనార్ఘ్యపాద్యాదులం బూజించి యతని కిట్లనిరి.50
సీ.సర్వజ్ఞ రోమహర్షణతనూభవ సూత | యఖిలపురాణవిద్యాప్రగల్భ
పంచావయవయుక్త భవ్యకావ్యవిదగ్ధ | యాశ్చర్యహేతువులైన కథలు
[68]రత్నాకరమునందు రత్నంబులునుబోలెఁ | గలవు నీయందుఁ బొగడ్త గాదు
నీ వెఱుగని విద్య లీ విశ్వమున లేవు | తర్కించి యెన్నివిధములఁ జూడ
 
గీ.నుత్తరోత్తర [69]సత్కృత్య మొప్పు నీకుఁ | గాలనిర్ణయకలన నీ కరతలంబు
పూర్వమున మేము సేసిన పుణ్యమెల్ల | ఫలితముగ [70]నేఁగుదెంచితే ప్రార్థనంబు.
51
వ.వేదంబులు నాలు గంగంబు లాఱు మీమాంసాన్యాయ విస్తరపురాణ ధర్మశాస్త్రంబు లాయుర్వేద ధనుర్వేదంబు లర్థశాస్త్రంబు లను నష్టాదశవిద్యానిధానంబులకు నాదికర్త సదాశివుం డా శూలపాణి యమ్మహాస్థానంబులు బ్రహ్మ కుపదేశించె. అనంతరంబ శంకరాజ్ఞాప్రచోదితుండై కృష్ణద్వైపాయనాభిధానంబున ననాదినిధనుండు పుండరీకాక్షుండును, నరణియందు వైశ్వానరుండునుం బోలె ద్వాపరాంతంబున సత్యవతియం దావిర్భవించె. వేదార్థోప[71]బృంహణార్థంబు సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితంబు లను పంచలక్షణంబులం గలిగి [72]బ్రాహ్మంబు వైష్ణవంబు శైవంబు భాగవతంబు భవిష్యంబు నారదీయంబు మార్కండేయం బాగ్నేయంబు పాద్మంబు బ్రహ్మకైవర్తంబు లైంగంబు వారాహంబు స్కాందంబు వామనంబు కౌర్మంబు మాత్స్యంబు గారుడంబు బ్రహ్మాండంబు నను మహాపురాణంబులు పదునెనిమిది గల్పించె నవియు.52
గీ.గ్రంథసంఖ్యఁ బురాణసంఘంబు గూడి
[73]నాల్గు లక్షలౌ నీ పురాణములలోన
నూఱువేల్గ్రంథములలోన నుతి వహించి
శ్రీమహాస్కాందసంహిత శివునిఁ జెప్పు.
53
వ.అందు శివరాత్రిమాహాత్మ్యంబు చెప్పంబడి యుండు; నమ్మహావ్రతం బెట్టి దెవ్వ రాచరించి రే ఫలంబు నొసంగు మాకుం బరిపాటి తేటపడ వివరింపుమనిన నక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లనియె.54
ఉ.తాపససార్వభౌములు సదాశివరాత్రిమహావ్రతంబు [74]దో-
షాపహృతిక్షమంబు వినుఁ డాదరణంబున నేను సద్గురు
శ్రీపదపద్మముల్ దలఁచి చెప్పెద శంకరసంహితాకథా-
దీపితభవ్య[75]మార్గమున దేటపడన్ మొదలింటినుండియున్.
55
గీ.ప్రళయకాలంబు [76]తుదఁ గాళరాత్రి చనిన
[77]నపరమగు సర్గమునకు బీజాంకురంబు
శీతమును నుష్ణమును [78]గాక చిలుపచిలుప
గంధవాహంబు [79]వీచె నిర్గంధమగుచు.
56
సీ.మూలముట్టుగ[80]ను నున్మూలనంబును బొంది | మహిధరంబులు రూపుమాలి యుండఁ
ద్రిభువనంబులుఁ జలత్తృణరాశియునుఁ బోలె | సప్తార్చిచేత భస్మంబు గాఁగఁ
బుష్కలావర్తకాంభోధరంబులు వృష్టి | విశ్వప్రపంచంబు వెల్లిగొనఁగ
భూర్భువస్స్వర్లోకములు మహర్లోకంబు | జనలోక మెక్కి విశ్రాంతి మెఱయ
 
గీ.నఖిలదిక్కులు ముంచి బ్రహ్మాండగోళ | మప్పళింపుచు సప్తార్ణ(వాంబువులును)
నిండికొనియుండఁగా రిత్తనింగితోడఁ | గొంతకాలంబు శూన్యమై గొడ్డుపోయె.
57
వ.అప్పుడు బ్రహ్మ నారాయణుండై శివయోగముద్రాముద్రితలోచనుం డగుచు సముద్రంబు నడుమం బవ్వళించిన.58
క.జనలోక మెక్కి సిద్ధులు
వినుతించిరి జలధిసలిలవీచీ[81]రింఖ-
ద్ఘనజాతయోగనిద్రా-
వినిమీలితదీర్ఘనయను విషధరశయనున్.
59
గీ.దేవతలు సంస్తుతించంగఁ దెల్లవాఱెఁ
గల్పసంహారకాలంబు కాళరాత్రి
యంత మేల్కని కూర్చుండె నాదిపురుషుఁ
డాదిమబ్రహ్మ జగము సేయంగఁ దలఁచి.
60
గీ.అభినవోన్మేషజిహ్మ మైనట్టి దృష్టి
దిశలు వీక్షించెఁ ద్రిభువనాధీశ్వరుండు
[82]చింతనొందె లోకంబు [83]సృజించు వెఱవు
హృదయమున (నిట్టిదని నిశ్చయింపలేక).
61
ఉ.(ఎక్కడఁ బోయెనో ధరణి యిందునిభాకరు) లెందణంగిరో
చుక్కలసుద్ది యెద్ది[84]యొకొ చూడఁగఁ గందుమె పర్వతంబులన్
దిక్కుల చాయ లెవ్వి యని ధీరత నల్విటు చింత[85]నొందె నే
(సక్కటి చూచినం దిమిరసం)హతి విశ్వము ముంచియుండఁగన్.
62
క.అంతఃకరణంబున నటు
చింతిలి యుండుచుఁ బ్రపంచసృష్టికినిఁ [86]గ్రియో-
దంతమ్ము లేక దుర్వ్యథ
సంతన కట్టఁగ విధాత చాలండయ్యెన్.
63
వ.వెండియు బహువిధంబుల నూహాపోహ లొనర్చియుఁ బుండరీకసంభవుండు భువననిర్మాణక్రియారంభంబునకు నుపాయంబుఁ గానక చీకాకుపడి కాకోదరగ్రామణీగ్రైవేయు భగవంతుం గృతాంతఘస్మరు సంస్మరించి తత్ప్రసాదంబున వసుంధరాగోళంబు మహాంధకారమగ్నం బగుట యెఱింగి యజ్జగద్ధాత్రుల నుద్ధరింపం దలంచి.64
శా.క్రోడాకారము దాల్చి కంఠభవఘుర్ఘుర్ ధ్వానవిస్ఫూర్తిఁ బా-
తాళక్రోడమహా[87]కటాహమున సందారింపఁ దత్కంధరా-
గోళస్థాయినియైన భూమి పృథువక్షోజప్రదేశంబునన్
లీలాసత్పులకాంకురంబు లెగయన్ వెన్నుండు మున్నీటిలోన్.
65
గీ.లోఁతుమున్నీటిలోపల నీఁతలాడెఁ
గూట[88]కోలావతారుఁడై కైటభారి
చటులవాల కశాఘాతసంప్రభూత-
[89]నీరమడ్డుస్వనంబున నింగి యదుర.
66
సీ.కాఁడిపాఱిన మేనిగరులు బ్రహ్మాండంబు | [90]కడపపూబంతి కక్కజము దోఁప
ఖురపుటంబునఁ గీలుకొని మేరుకుధరంబు | మువ్వలోపలి [91]ఱాతిమురువు [92]వడయ
దీర్ఘకంఠకఠోరఘుర్ఘురస్వనమునఁ | బాతాళగోళంబు బాతళింప
నీలాంబుదశ్యామనిబిడదేహచ్ఛాయఁ | [93]బ్రళయాంధకారంబు దొలకరింప
 
గీ.సప్తపాతాళముల క్రిందఁ జాఁగిపడిన | యవని నెత్తె నిశాతదంష్ట్రాంకురమున
నభినవస్తబ్ధరోమదివ్యావతారుఁ | డంబురుహలోచనుండు కల్పాదియందు.
67
వ.ఇవ్విధంబున మహాపర్వతసన్నిభంబును *(నీలమేఘప్రతీకాశంబును దంష్ట్రాదండదారుణంబును విపులవృత్తఘనస్కంధంబును సమున్నతకటితటంబును హ్రస్వవృత్తోరుజంఘాగ్రంబును దీక్ష్ణఖురమండలంబును బద్మరాగసదృశేక్షణంబును దృఢదీర్ఘమహాప్రోథంబును సముదీర్ణోచ్ఛ్వాసనిశ్వాసవిఘూర్ణిత ప్రళయార్ణవంబును) విద్యుచ్ఛటాపాటల *(సటా)చ్ఛన్న కపోలస్కంధబంధురంబును[94]నయిన వరాహరూపం బావహించి రసాతలంబున సలిలమగ్నయగు పృథివి నుద్ధరించిన.68
గీ.దానవారాతిదంష్ట్ర నెత్తంగఁబడిన
[95]యుర్వి సూపట్టు జలధి నీ రోడి(గిలఁగ
పసిఁడికామ హత్తించిన పంబుతోడి
క్రొత్త) వెలిపట్టు జగజంపు గొడుగువోలె.
69
సీ.జయజయధ్వనులతో సనకాది మునికోటి | వేదాక్షరంబుల వినుతి సేయ
బహుళసౌరభ(పరంపర) లుప్పతిల్లంగ | విద్యాధ(రులు పుష్పవృష్టి) గురియ
దివ్యదుందుభిసముత్థితనినాదంబుల | (భువననిష్కం)భంబు బోరు కలఁగ
జోకయై యప్సరస్సుదతీకదంబంబు | నింగిమీఁదఁ బ్రమోదనృత్త మాడ
 
గీ.జద్దువడి యుండె నొక కొంత ప్రొద్దు వేడ్క | నవయవంబులు గరుదాల్ప నచ్యుతుండు
ప్రళయజలనిధి క్రింద (లోబ)డినయట్టి | యుర్వి దంష్ట్రాంకురంబున నుద్ధరించి.
70
గీ.సురలు తనమీఁదఁ బువ్వులసోన గురియఁ
జూడ నొప్పా[96]రె హరి [97]శఠక్రోడమూర్తి
కందరంబుల ఖద్యోతగణము మెఱయఁ
జాల నొప్పారు నంజనాచలము వోలె.
71
వ.ఇవ్విధంబునఁ బ్రళయసలిలోపద్రవం బు[98]డిపి ధాత్రిఁ [99]బూర్వస్థానంబున సంస్థాపించి సర్వసర్వంసహాభార*(వహనం)బునం బ్రభవించిన ప్రయాసఖేదం బుజ్జగించుట[100]కయి పాఁపసెజ్జపై మున్నీటి నట్టనడుమం బవ్వళించి నారాయణుడు నిజాంతర్గతంబున.72
శా.దుర్వారోద్యమభంగి దంష్ట్రికతుదిన్ దూరంబుగా [101]నెత్తి యేఁ
బూర్వస్థానమునందుఁ బెట్టితి యథాపూర్వంబుగా నిప్పుడీ
యుర్వీమండలి నెట్టివాఁడనొకొ యోహోయంచుఁ జిత్తంబునన్
గర్వించెన్ మధుకైటభాంతకుఁ డు[102]దన్వద్వారిమధ్యంబునన్.
73
గీ.అంత నిటఁ దానతానగు నబ్జభవుఁడు
దంభ[103]కోలావతారుఁడు ధాత్రి [104]యెత్తఁ
జాగెఁ బ్రారబ్ధమార్గానుసారమునను
మొదలుకొని యెల్ల విష్టపములు [105]సృజింప.
74
వ.[106]మహత్సర్గంబు *(భూతసర్గంబు వైకారికసర్గంబును నను) బుద్ధిపూర్వకంబులగు మూఁడును బ్రాకృతసర్గంబులు; ముఖ్యసర్గంబు, తిర్యక్సర్గంబు, దేవసర్గంబు, మానుషసర్గంబు, గ్రహసర్గంబును నా [107]నైదును బుద్ధిపూర్వకంబులు వైకృతసర్గంబులు; కౌమారసర్గంబు ప్రాకృతసర్గంబు. ఈ తొమ్మిదియు నసాధకంబులు సాధకత్వంబును నైహికాముష్మికహితాహిత తదుపాయ తత్ప్రతికారవిరహితంబునం జేసి [108]యప్రయోజనంబులగుట నీ తొమ్మిది సర్గంబులవలనను బ్రయోజనంబు గానక కనకగర్భుండు మహేశ్వరునిం బ్రస్తుతించి తత్ప్రసాదంబునం బురాణప్రజాపతుల *(కశ్యప)మరీచిభృగ్వాంగిరస పులస్త్యపులహక్రతుదక్షవసిష్ఠుల మానసంబునం దొమ్మండ్రను ధర్మాధర్మసంకల్పంబుల మూఁటినిఁ గూడఁ బన్నిద్దఱు పుత్రులఁ గాంచె. ఆ పన్నిద్దఱవలననుం బండ్రెండు దివ్యవంశంబులు ప్రజావంతంబులుఁ గ్రియావంతంబులునై ప్రవర్తిల్లె; నందు *(దేవ)దైత్యదానవముని యక్షగరుడగంధర్వ కిన్నరకింపురుష సిద్ధవిద్యాధర కర్మదేవతాప్సరఃకామినీ రక్షోభూతపిశాచ మనుష్య పశుపక్షిమృగోరగకీటక గిరిగ్రావ వృక్షలతాగుల్మాదులును, గాయత్రీ త్రిష్టుప్సామరథంతరంబులును, అగ్నిష్టోమహయమేధ వాజపేయాతిరాత్ర పౌండరీకాదులు లోనుగా గలుగు చరాచరంబులు ప్రాజాపత్యాంగోపాంగప్రత్యంగంబుల జన్మించె; నివ్విధంబున నఖిలప్రపంచంబు నిర్మించి విరించి నిజాంతర్గతంబున.75
ఉ.ఏ నధికుండ నాకుఁ బ్రతి యెవ్వరు నిర్జరకోటిలోన నేఁ
[109]గాని జగత్ప్రపంచపరికల్పన సేయఁగలేఁడు తక్కొరుం
డే నఖిలేశ్వరుండనని యెవ్వరునుం బ్రతికోటిలేమిఁ దాఁ
దాన యహంకరించెను విధాత సదా[110]శివు మాయపెంపునన్.
76
వ.ఇవ్విధంబున నవష్టంభంబు గైకొని యంభోరుహసంభవుండు తాను సృజియించిన భువన(భవనం)బులు వీక్షింపందలంచి రాయంచ[111]తే రెక్కి దిక్కులఁ జరించువాడు ముందట.77
మహాస్రగ్ధర.అటఁ గాంచెం [112]బద్మగర్భుం డహిమకరఢులీహస్తినక్రాది యాదః-
పటలీధాటీవిహారప్రచలిత మహిభృత్పక్షవిక్షేపలీలా-
[113]చటులోర్మివ్యాప్తఘోషా సముపచితదిశాసౌధవీథీవిటంకా-
వటుసంఘాటాప్రతిశ్రు[114]ద్భయకలితజగద్వ్యా ప్తి లబ్ధిన్ సుధాబ్ధిన్.
78
లయగ్రాహి.తోయజభవుండు మదిఁ బాయని యహంకరణ-మాయ[115]ను జగంబు[116]ల కపాయము ఘటింపం
జేయ సమకట్టి ఫణిశాయి నిరుపాధి శుభ-దాయకు సురాసురనికాయమకుటా[117]గ్ర-
స్థాయి కురువిందసముదాయఘృణి[118]కోటివిశ-దాయతపదద్వయుఁ గళాయుతుని శ్రీనా-
రాయణు రమారమణు డాయఁ జని నిద్దురకు రాయిడిగ నెవ్వఁడవురా! యనుచుఁ బల్కెన్.
79
క.లేలెమ్మెక్కడివాఁడవు
పాలసముద్రమున భోగిపర్యంకమునం
దేలెద వొక్కండవు [119]ననుఁ
ద్రైలోక్యాధీశు [120]నెఱుఁగుదా పరమేష్ఠిన్.
80
సీ.పాతాళభువనసప్తకము నిర్మించితి | వానితి విశ్వవిశ్వంభరయును
దిక్చక్రవాళ మెత్తితిఁ జక్కఁజేయఁగాఁ | [121]బాఁతుకొల్పితి గోత్రపర్వతముల
వరుసఁ దీర్చితి నేడు శరనిధానములకు | నారు వోసితి నరణ్యములు పెక్కు
గ్రహతారనక్షత్రగతు లేఱుపఱిచితి | సరణు లేర్చితి నభస్వంతమునకుఁ
 
గీ.గదియఁ గూర్చితి బ్రహ్మాండకర్పరంబు | పరిధిగా [122]వాలిచితి మహావరణజలము
నిట్టి నేఁ జేరవచ్చిన నెదురుకొనవు | పాన్పు డిగ్గవు దురవలేపమున నీవు.
81
గీ.ఎవ్వఁడవు చెప్పుమనిన లేనవ్వు నవ్వి
యిందిరావల్లభుఁడు బ్రహ్మ కిట్టు లనియె
నే జగత్కర్తనై యుండ నెట్లు నీవు
కర్తనని పల్కెదవు సిగ్గుగాదె చెపుమ.
82
గీ.విని యెఱుంగవె కల్పాంతవేళ నేను
దంభ[123]కోలావతార ముద్ధతి వహించి
సర్వసర్వ(ంసహాతలచక్ర)[124]భరము
దాల్చినాఁడను దంష్ట్రికాదండకోటి.
83
శా.ఏలా వచ్చెదు డాయ నెవ్వఁడవు నీ వెచ్చోటికిం బోయె [125]ది-
ట్లేలా మ్రొక్కవు నాకు గర్వమిఁక నెంతే నోర్వ[126]కుందుం జుమీ
త్రైలోక్యాధి[127]పుఁడన్ సురాసురశిరోరత్నప్రభామండలీ-
వ్యాలీఢాంఘ్రిసరోరుహుండ విడు గర్వారంభసంరంభమున్.
84
గీ.అని వసుంధర నుద్ధరించిన బలంబు
భువనసర్గం బొనర్చిన పూనికయును
గారణంబులుగాఁగ నాగ్రహము పూని
యచ్యుతుండు నజుండు గర్వాంధులగుచు.
85
వ.[128]ఒండొరుల నెఱింగియు నయ్యిద్దఱు మహేశ్వరు *(మాయా) ప్రభావంబున.86
గీ.నన్ను గెల్చికదా నీవు నలిననాభ
యఖిలలోకేశ్వరుఁడ వౌట యనియె బ్రహ్మ
నన్ను గెల్చికదా నీవు నలినగర్భ
యఖిలలోకేశ్వరుఁడ వౌట యనియె శౌరి.
87
వ.*(అని యవష్టంభవిజృంభణమున).88
గీ.ఇందిరానాయకుఁడు శార్ఙ్గ మెక్కువెట్టె
గాండివము సజ్యముగఁ జేసెఁ గమలభవుఁడు
శరములిద్దఱుఁ గాలాగ్నిసన్నిభంబు
లేసి రొండొరుపై శౌర్య మెసక మెసఁగ.
89
మ.జవ మేపా[129]ర మురారిపద్మజ భుజాచక్రీభవచ్ఛార్ఙ్గగాం-
డివకోదండవినిర్గత[130]ప్రబలసందీప్తాస్త్రసంఘాతముల్
భువనక్రోడము నిండి భానుకిరణంబుల్ దూఱనీకుండుటం
బవలుం బర్వె మహాంధకారములు పైపై సూచినిర్భేద్యముల్.
90
గీ.గాండివము తేరిపైఁ బెట్టి కమలభవుఁడు
శార్ఙ్గమున నచ్యుతుం డేయు సాయకములఁ
గర్కశంబైన కుశపూలకమున [131]వ్రేసి
ఖండ[132]ఖండంబులుగఁ జేసెఁ గదనవీథి.
91
క.వాలిక మెఱుంగుఁ దూపులు
నాళీకాసనుఁడు [133]కినుక నారాయణుపైఁ
గీలుకొనఁజేసి యార్చెను
నాలుగు మోములను [134]ద్రిభువనములు వడంకన్.
92
వ.ఇవ్విధంబున విధాత [135]యార్చిపేర్చినఁ గోపాటోపంబునం గటకటం బడి కైటభాంతకుండు లలాటవీథీవిటంకంబున భ్రుకుటి నటింపఁ గల్పాంతవేళాసముజ్జ్వలజ్వలనజ్వాలాజాల లీలాక్రీడావహమహాప్రభామండలమధ్యవర్తియు, విబుధరిపువధూవైధవ్యదానదీక్షాధురంధరప్రభా పరాక్రమక్రీడానిర్వక్రపరాక్రమంబగు చక్రం బతని మీఁదఁ బ్రయోగించిన.93
మ.దిశలున్ నింగియు నేలయు బహులదీప్తి వ్యాప్తి నంతర్భవిం-
ప శతానందునిమీఁద సాగుటయు నప్పద్మాసనుండేసె బ్ర-
హ్మశిరోనామకమైన యస్త్ర(ము సమస్తాస్త్రా)ధిదైవంబు న-
వ్విశిఖం బుద్ధతి మ్రింగె నద్భుతగతిన్ వేవేగ నాచక్రమున్.
94
గీ.హరి విధాత[136]పైఁ బాశుపతాస్త్ర మేసె
నజుఁడు హరిమీఁదఁ బాశుపతాస్త్ర మేసె
నమ్మహ్మాస్త్రంబు (లొండొంటి నాక్రమించఁ
జనియెఁ బరిపాటి దివ్యవర్షములు నూరు).
95
చ.పటుతరవిక్రమస్ఫురణఁ బాశుపతంబులు రెండుఁ బోరఁగాఁ
జిటిలిన విస్ఫులింగములఁ జిల్లులు వోయె నభఃస్థలంబు ది-
క్తటము(లు మండె నంబుధులు గ్రాఁగె రసాతల)గర్భగోళసం-
పుటములు వొక్కె నుమ్మదము పుట్టెఁ జెమర్చెఁ బురాణకూర్మమున్.
96
ఉ.పాశుపతాస్త్రరాజము లభంగధృతిం దమలోనఁ బోర ఘో-
రాశనిఖండసన్నిభములైన తదీయకృపీటసంభవో-
ల్కాశతముల్ పరస్పరవిఘట్టనఁ జిచ్చఱకోలలై వెసం
గేశవుమేన బ్రహ్మమెయిఁ గేలి యొనర్చె నపారవేదనన్.
97
ఉ.కాంచనగర్భుఁడున్ నరకఘస్మరుఁడున్ బహుకాల మీ క్రియం
గాంచిరి నొచ్చి పాశుపతకాండయుగప్రభవాగ్నికీలలన్
జంచలచిత్తవృత్తి బహుసంపద పెంపున [137]మూరిఁబోయి ద-
ర్పించినయట్టివారి కివి పెద్దలె యచ్చెరువంద [138]నేటికిన్.
98
గీ.పాశుపతములు రెండు [139]నీభంగిఁ బోర
నజుఁడు హరియును వారింప నలవిగాక
విస్ఫులింగచ్ఛటావళివేష్టనమున
స్రుక్కుచుండిరి యంగముల్ [140]పొక్కిపడఁగ.
99
గీ.త్రిభువనంబును భయమందె దేవదైత్య-
ఖచరసిద్ధగంధర్వులు కలఁగఁబడిరి
అస్త్రరాజద్వయంబు సంహారకాల-
దహనుభంగి నేకాంగయుద్ధంబు సేయ.
100
గీ.అస్త్రయుద్ధము మాన్ప హర్యజులఁ గావఁ-
దలఁచి యర్ధేందుమౌళి యత్యంతకరుణ
నస్త్రములు రెంటినడును నయ్యవసరమున
సంభవించె [141]మహానలస్తంభమూర్తి.
101
స్రగ్ధర.*స్తంభం బావిర్భవించెన్ జ్వలదనలశిఖాజాలముల్ దిక్కులందున్
జృంభించెన్ భూర్భువస్స్వస్థిరతరజఠరక్షేత్రముల్ చంచదుల్కా-
సంభారోద్యత్స్ఫులింగస్థగితములుగ నాశంక విశ్వంభరుండున్
శంభుండున్ సంభ్రమింపం జటులకరతటిత్సన్నిభస్ఫూర్తిమూర్తిన్.
102
సీ.సప్తపాతాళ విష్టపము[142]లు భేదించి | ధరణిచక్రంబు బిందం బొనర్చి
భూర్భువస్స్వర్లోకములు సమాస్ఫాటించి | ధ్రువమండలంబుఁ దుత్తుమురు చేసి
పరమేష్ఠిపదవి కుద్భ్రాంతి యాపాదించి | హరిపదంబున కార్తి యావహించి
బ్రహ్మాండకుహరకర్పరము వ్రక్కలు వాపి | యావరణంబు లందంద చించి
 
గీ.[143]పరగఁ బుష్కరమార్గంబు పాయఁబట్టి | యెగసి యెచ్చోట కేఁగెనొ యెఱుఁగరాదు
శాతకుంభాద్రికూటాగ్రసన్నిభంబు | శాంభవంబైన పావకస్తంభ మపుడు.
103
గీ.పాలుగల [144]యగ్గికంబంబు ప్రభవ[145]మంది
యుష్ణమును శీతమును గాకయుండెఁ గాని
యహహ పెట్లు జగం బుష్ణ మయ్యెనేని
శిశిర మగునేని వణఁకును సీతువట్టి.
104
సీ.అద్భుతం బందిరి హరియుఁ బద్మభవుండుఁ | దమలోని తీవ్రరోషములు మాని
పుష్కలావర్తకాంభోధరవ్రాతంబు | గురిసెఁ గల్పకలతాకుసుమవృష్టి
జయజయధ్వనులతో సనకాది యోగీంద్రు- | లభినుతించిరి ప్రస్ఫుటాక్షరముల
నమరదుందుభినినాదములు దిక్కుల నిండె | గంభీరతరమహాఘనరవముల
 
గీ.నడఁగె నస్త్రద్వయంబు నభ్యంతరమున | [146]నగ్గికంబంబులోఁ గాన[147]నయ్యె శివుఁడు
వలిపె తెరలోననున్న భావంబు దోఁప | మాఘకృష్ణచతుర్దశీమధ్యరజని.
105
గీ.హంసరూపంబు దాల్చెఁ బద్మాసనుండు
దంష్ట్రిరూపంబు గైకొనె దనుజరిపుఁడు
పోయి రంబరమున కధోభువనమునకు
నూర్ధ్వమును గ్రిందుఁ గానంగ నుత్సహించి.
106
క.బహువర్షసహస్రంబులు
ద్రుహిణుండును హరియు [148]నధ్యధోభువనములన్
బహులక్రియ శోధించిరి
దహనస్తంభంబు తుదయుఁ దన్మూలంబున్.
107
వ.శోధించి యాద్యంతంబులు పొడగానక హరివిరించు లేతెంచి వామదక్షిణభాగంబుల నిలిచి జగత్కారణంబయిన యమ్మహాదేవు నిట్లని స్తుతియించిరి.108
సీ.[149]శర్వ లోకాధీశ చంద్రార్ధశేఖర | పురుష పురాణ శంకర మహేశ
యభవ యంతర్యామివై [150]ప్రేరకత్వము | చేపట్టి జనుల శాసింతు [151]వీవు
భవదీయమాయాప్రభావంబు కతమున | నెఱుఁగలేమైతిమి యేము నిన్ను
మాకుఁ గర్తవు నీవు మాకు భర్తవు నీవు | మాకు హర్తవు నీవు మాటలేల
 
గీ.నీ మహత్త్వంబు వర్ణింపనేర మేము | నిన్నుఁ దెలియంగనేరము నిజముగాఁగ
నభవ యాద్యుండ [152]వాఢ్యుండ వగుదుగాన | నట్టి నీ కాచరింతు ముపాస్తి యెపుడు.
109
గీ.పశువులము [153]మేము హర పశుపతివి నీవు
పశువులకు నెక్కడిది బుద్ధి ఫాలనయన
రాజ శేఖర నేర్పు నేరములు చూడ-
కరసి రక్షింపు మమ్ము నత్యంతకరుణ.
110
గీ.విష్ణుమూర్తులు [154]కడచన్న వేళలందు
నజునిమూర్తులు [155]కడచన్న యవసరమున
[156]జిష్ణుమూర్తులు పర్యవసించినపుడు
[157]కలదె నీకు నపాయంబు కాలకంఠ.
111
గీ.అమరవంద్య దివాభీత మనెడి పులుఁగు
హేళిమండల మీక్షింప నెట్లు నేర్చు
నేము [158]నిన్ను బరీక్షింప నెంతవార-
మిమ్మహాపరాధము క్షమియింపవలయు.
112
వ.అని స్తుతియించినం బ్రసన్నుండై విరూపాక్షుం డాక్షణంబ లింగమధ్యంబున వెడలి యర్ధనారీశ్వరుండును ద్రినేత్రుండును నీలలోహితుండును వరదాభయ[159]మృగధరుండును సర్వాభరణభూషితుండును బ్రమథగణసమన్వితుండును గోటిసూర్య[160]ప్రకాశుండును బాలచంద్రావతంసుండునునై సన్నిధియగుటయుఁ బెన్నిధిఁగన్న పేదల *(విధంబుం) బోలి విరించినారాయణు లిట్లనిరి.113
సీ.ఇభచర్మపరిధాన యే భక్తి చేసిన | సంతసంబందు నీ యంతరంగ-
ముడురాజమౌళి యే యుపచారములు నీకుఁ | బ్రియములై యుండు నెంతయును గరిమ
నగరాజకన్యకాప్రాణేశ నీకు నే | కెలనఁ బో సర్వాంగకృప జనించుఁ
గ్రతువైరి నీకు నే వ్రతముఖ్య మొనరింపఁ | గౌతుకోన్మేషంబు గలిగియుండు
 
గీ.నంధకాసురదమన నీ కభిమతంబు | లే యనుష్ఠానములు శర్వ యే మఖంబు
లాచరించిన [161]నీ వారమగుదు మట్టు- | లభవ దాక్షిణ్యపరత మా కానతిమ్ము.
114
వ.అనినఁ [162]బ్రీతచేతస్కుండై *(శివుండు) విశ్వంభరాంభోరుహసంభవుల కిట్లనియె.115
మ.అవధానంబున నాకు [163]సత్ప్రియము సేయన్ సర్వదా మీకు [164]స-
ద్వ్యవసాయం బొడఁగూడెనేని వినుఁడా యంభోజదృగ్భారతీ-
ధవులారా విని యాచరింపుఁడు మదిం దాత్పర్య మొప్పంగ శ్రీ-
శివరాత్రివ్రత మస్మదీయ మది దాక్షిణ్యంబునం చెప్పితిన్.
116
వ.బ్రాహ్మముహూర్తంబునందు మేల్కని శౌచక్రియలు నడపి గురున కభివాదనంబు సేసి సంకల్పంబు నడపి పూజోపకరణద్రవ్యంబులు సమకూర్చుకొని [165]నదీస్నానం బొనర్చి నిత్యనైమిత్తకాద్యనుష్ఠానంబులు దీర్చి [166]యలంకృతుఁడయి [167]యజనస్థానంబును సమ్మార్జనలేపనాదుల శోధించి వితానధ్వజంబు లెత్తించి [168]పతాకావలులు *(గట్టి) తోరణంబులు [169]సంఘటించి (కదలీఫల పూగఫల పనసఫల నారికేళంబులు తోరణంబులుగాఁ గట్టి) దేవాలయంబు ప్రవేశించి మౌనియై భసితత్రిపుండ్రంబును భస్మోద్ధూళనంబును గావించి రుద్రాక్షమాలికలు ధరియించి శివభక్తుల రావించి గురూపదేశమార్గంబున [170]నాసనంబుఁ బాద్యం బర్ఘ్యంబు [171]మధుపర్కంబు నిచ్చి [172]పంచవదనంబులుఁ బంచామృతంబుల నభిషేకించి ఫలోదక పుష్పోదక గంధోదక కుంకుమోదక రత్నోదక కర్పూరోదకంబుల నభిషేకించి వస్త్రం బుపవీతం బాచమనంబు గంధంబు భూషణంబు పుష్పంబు ఫలాహారంబు నీరాజనంబు ధూపంబు వ్యజనంబు వాదిత్రంబు దర్పణంబు స్తోత్రంబు మొదలుగాఁ గల [173]షోడశోపచారంబుల నుపచరించి నాలుగుజాములును జాగరంబు సేయునది. (ఇది శివరాత్రి) వ్రతచర్యప్రకారంబు.117
గీ.బ్రహ్మహత్యాయుతము సురాపానశతము
వీరహత్య గోహత్యలు వేనవేలు
శిశువధంబు [174]జనంగమ [175]స్త్రీనిషేవ-
మాదియగు పాపములఁ [176]దోలు నభవురాత్రి.
118
వ.తొల్లి యొక్క బ్రాహ్మణుండు మహా[177]పాపంబులు సేసి (సర్వజనంబులచేత నిందితుడై యొక్క) శివరాత్రి[178]వ్రతదర్శనంబున శివపురంబునకుం జనియె ననిన శౌనకాదు లక్కథకున కిట్లనిరి.119
గీ.అద్భుతం [179]బయ్యెడిని మాకు నగ్రజన్ముఁ
డెట్టు పాతకములు సేయు టెట్టు [180]లట్టి
పాపి శివరాత్రివ్రత మెట్టు పరఁగఁ జూచె
నంతయును విస్తరింపుమా [181]యనినఁ బ్రీతి.
120
శా.జీమూతాన్వయరాజధైర్య సుమహాక్షీరాబ్ధిగాంభీర్య [182]సు-
శ్రామప్రోద్భవగాఢశౌర్య సుమనోధన్వాతిసౌందర్య పౌ-
లోమీనాయకతుల్యభోగయుత [183]సుశ్లోకద్రుజిత్త్యాగ భా-
షామాధుర్య మతిప్రకాశధిషణా సత్యార్హసంభాషణా.
121
క.నిత్యయశశ్శ్రీసుందర-
మత్యమరాచార్యవర్య మాన్యచరిత్రా
భృత్యజనావనతత్పర
సత్యహరిశ్చంద్ర సరససాహిత్యనిధీ.
122
మాలిని.అమితహితసుభాషా స్వాంతవిద్యావిశేషా
సమరముఖదిలీపా చంద్రకందర్పరూపా
కమలనయ[న]వీర్యా కాంచనాహార్యధైర్యా
విమలరుచిరకీర్తీ విశ్రుతానందమూర్తీ.
123
గద్యము.ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సకలవిద్యాసనాథ శ్రీనాథనామధేయ ప్రణీతంబయిన శివరాత్రి మాహాత్మ్యంబునందుఁ బ్రథమాశ్వాసము. 

[1] ము. వాశ్రి.
[2] తా. సంస్తవ్యుండు.
[3] ము. చేసియున్.
[4] తా. వర.
[5] ము. నిచ్చె.
[6] ము. సుఖస్థితి యిచ్చుఁ గావుతన్.
[7] ము. బంధానుబంధ వి.
[8] ము. యాంధ్ర.
[9] ము. డెఱ్ఱన.
[10] ము. గిదె.
[11] తా. గలుగుటయె.
[12] తా. సంఘాతక.
[13] తాళపత్రమున లేదు.
[14] తా. ప్రేరణ ప్రేక్ష్యకంబులైన.
[15] ము. కరుణాబంధుర.
[16] ము. గంధర్వసంగర.
[17] తా. బ్రొద్దుపుచ్చుచు.
[18] ము. పువ్వలపు.
[19] ము. వరుణా... ... ... లోష్ఠ.
[20] తా. భూనాథు.
[21] ము. సేనమ.
[22] ము. పరుఁడు.
[23] ము. ఖ్యాతిగఁ జరితప్రతాప.
[24] ము. చేవూరి.
[25] ము. జెరువాడు.
[26] తా. భుజంగమర్లావ.
[27] ము. వర్ణిత.
[28] ము. పరగ.
[29] తా. పరిణజనకదంబ.
[30] తా. నిభుఁడనా.
[31] తా. చిట్టి.
[32] తా. రిచ్యయనక్రియాలీలల నిద్ధాత్రి.
[33] తా. వర్ణనంబునకు.
[34] తా. నాతియు.
[35] ము. సతులు.
[36] తా. నాఁగ.
[37] ము. సారసాఖ్య.
[38] ము. మానసాత్మ.
[39] తా. యమరం.
[40] ము. మట్టుర.
[41] తా. సెట్టియ.
[42] తా. డర్థిన్.
[43] తా. దేవాధీశ.
[44] ము. ప్రమేయక.
[45] తా. శ్రుతుల.
[46] తా. రూపునందు.
[47] తా. భక్త.
[48] ము. పీతాంబరు.
[49] తా. సమ్మదు.
[50] తా. సరళకులాభిరామ.
[51] తా. యననొప్పు.
[52] ము. కామితార్థక.
[53] తా. సానికిన్.
[54] తా. మూర్తి.
[55] ము. ఁబర.
[56] ము. వా.
[57] తా. కుత్కూట.
[58] తా. నగు సంతోష.
[59] తా. యందంబుగ.
[60] ము. కథావిధానంబున.
[61] ము. లీల.
[62] తా. సోమావృత.
[63] తా. వ్రతాశశైవో.
[64] తా. ధర.
[65] ము. వర.
[66] తా. సర్వాగమానిర్ముక్తంబై.
[67] తా. సంస్థితాత్ములు.
[68] తా. రత్నాకరంబందు.
[69] సత్కృత.
[70] ము. నేగుదెంచితి.
[71] తా. బృహద్వర్ణనార్థంబు.
[72] తాళపత్రమున నీ పురాణముల పేరులు ముందువెనుకలుగా నున్నవి.
[73] ము. నాల్గు లక్షల.
[74] ము. దోషాపహృతిక్రమంబు.
[75] ము. మార్గమును.
[76] తా. తుదిం.
[77] తా. పరమమగు స్వర్గమునకు.
[78] ము. గాఁగఁ.
[79] ము. వీఁచు.
[80] తా. సమున్మూలాంజనము బొంది.
[81] తా. రింఖో.
[82] ము. చింతనొంది.
[83] ము. సృజింప.
[84] తా. యకొ.
[85] ము. నొందఁగా.
[86] తా. క్రియావంతవ్యుని కంతర్వ్యథ.
[87] ము. కటాహము సముద్ఘాటింప. తా. కటాహమున సంధానింప.
[88] ము. క్రోడావతారుఁడై.
[89] తా. నీరవండుస్వరంబున.
[90] ము. కనుప.
[91] తా. రాయి.
[92] తా. నెరయ.
[93] ము. ప్రళయాంతకాలంబు.
[94] తా. నై.
[95] ము. తా. సుట్టును.
[96] తా. రు.
[97] తా. శ్వేత.
[98] ము. ఁదీర్చి.
[99] తా. నుద్ధరించి.
[100] తా. నై.
[101] ము. నైతి.
[102] తా. హృద్యద్వారి.
[103] ము. క్రోడావతారుఁడై. తా. కోలావతారుఁడై.
[104] ము. యెత్తి, సాగె.
[105] తా. సృజించె.
[106] తా. మహత్సర్గంబు నాను.
[107] ము. నేడును.
[108] తా. నిష్ప్ర.
[109] తా. గాన.
[110] తా. శివ.
[111] తా. నెక్కి.
[112] తా. కంజ.
[113] తా. చటులోర్మీవ్యాపి.
[114] తా. ద్వ్యతికలిత.
[115] తా. తి.
[116] తా. న.
[117] తా. గ్రా.
[118] తా. జాలనికటాయిత.
[119] తా. నన్.
[120] ము. నెఱుఁగురా.
[121] ము. పాదుకొల్పితి.
[122] ము. వాల్చితిని.
[123] ము. క్రోడా.
[124] ము. సరణి.
[125] ము. దీవేలా.
[126] తా. కుండం జుమీ.
[127] తా. పతిన్.
[128] ము. ఒండొరు నెఱింగిన యయ్యిద్దరు.
[129] ము. రి.
[130] ప్రభల.
[131] తా. నేసి.
[132] ము. ఖండములుగ.
[133] తా. గిన్క.
[134] ము. త్రిభువనము వణఁకాడన్.
[135] తా. యార్చినం బేర్చిన.
[136] తా. మై.
[137] ము. మూరివోయి.
[138] తా. వారికిన్.
[139] తా. నిబ్భంగి.
[140] ము. సొక్కి.
[141] ము. మహాస్తంభ శంభుమూర్తి.
[142] తా. లుద్భేదించి.
[143] తా. పరమ పుష్కరమార్గంబు పాయఁదట్టి.
[144] తా. యట్టి.
[145] తా. మందె.
[146] తా. నగ్నికంభంబు.
[147] తా. బడియె.
[148] తా. దివియధో.
[149] తా. సర్వ.
[150] తా. ప్రేరకత్వంబు.
[151] తా. వీవ.
[152] తా. వైతివీ.
[153] తా. నేము.
[154] తా. గడసన్న.
[155] తా. గడసన్న.
[156] ము. విశ్వమూర్తులు విబుధులు వెడలునపుడు.
[157] ము. కలదు నీ కనపాయంబు.
[158] ము. నిను వినుతింపఁగ.
[159] ము. మృగాంకధరుండును.
[160] తా. ప్రతీకాశుండును.
[161] ము. నీ వారమగుట యట్లు.
[162] తా. బ్రచేతస్కుండై.
[163] ము. సంశ్రయము.
[164] ము. నధ్యవసాయం.
[165] ము. నదీస్నానంబు వొనర్చి.
[166] తా. యలంకృతులై.
[167] తా. అజనస్నానంబున.
[168] తా. ఫలావలులు.
[169] తా. గాఁగట్టి.
[170] తా. నాసనార్ఘ్యపాద్యంబుల.
[171] తా. మధుపర్కంబిచ్చి.
[172] తా. పంచవదను.
[173] తా. యశేషోపచారంబుల.
[174] తా. ను జంగము.
[175] ము. శ్రీవినాశ. తా. స్త్రీనిషేధ.
[176] తా. బొల్చు.
[177] తా. పాతకంబులు.
[178] తా. వ్రతం బాచరించి.
[179] తా. బది నీవు మాకు.
[180] తా. లిట్టిపాటి.
[181] తా. కనిన.
[182] తా. సు-త్రామాత్మోద్భవ.
[183] తా. సుశ్లోకచ్ఛటాభూష. ము. సుశ్లోకారిజిత్త్యాగ.
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - SivarAtrimAhAtmyamu - prathamASvAsamu - SrInAthudu (telugu andhra)