కావ్యములు శివరాత్రి మాహాత్మ్యము శ్రీనాథుఁడు

శివరాత్రి మాహాత్మ్యము (సుకుమార చరిత్రము)

ద్వితీయాశ్వాసము

క.శ్రీహిమవద్గిరిపుత్రిమ-
నోహరపదభక్తిజాతనూతనసరస-
వ్యాహారకావ్యనాయక
మోహనతనుజితజయంత ముమ్మయశాంతా.
1
వ.అక్కథకుండు శౌనకాది మహామునుల కిట్లని చెప్పందొణంగె.2
సీ.కాంచనాచలముతో గర్వించి యే కొండ | [1]పెరిఁగె బ్రహ్మాండకర్పరము మోవ
నే కొండచఱులపై హిమశైలకన్యక | చెంచులేమలఁ గూడి సంచరించు
వజ్రాల కమరు ఠేవ విడంబనము సేయు | నే కొండమొలచుట్టు నిందుతనయ
యల్లోనేరెడుదీవి యవనీధ్రములలోన | నే కొండ కైశ్వర్య మెక్కుడయ్యె
 
గీ.నట్టి వింధ్యనగేంద్రపర్యంతభూమి | దండకారణ్యవిపినమధ్యంబునందు
రత్నపురమనఁ గల దొక రాజధాని | కిన్నరాధీశు నగరకిఁ గీస వెలితి.
3
గీ.స్ఫటికమాణిక్యపాషాణఘటితమైన
యప్పురముకోట యాకాశ మంటి యొప్పు
వేడ్కఁ బాతాళభువనంబు వెడలివచ్చి
[2]చుట్టుముట్టినయట్టి వాసుకియుఁ బోలె.
4
గీ.[3]పట్టణంబున దేవతాభవనకోటి
తుహినగిరికూటములతోడఁ దులలుతూఁగు
నమరగంగాపయఃప్రవాహములఁ బోలుఁ
దచ్ఛిరస్థాపితోన్నతధ్వజపటములు.
5
సీ.[4]ప్రణతదేవకిరీటమణిమయూఖచ్ఛటా- | పటలకిమ్మీరాంఘ్రిపంకజుండు
వికటపాటలజటామకుటకోటిఘటిత- | కోమల[5]తారకాకాముకుండు
గంధదంతావళక్రవ్యాదరాట్కృత్తి- | కంథాధురంధరకంధరుండు
కుంభినీధరసుతాకుచకుంభమృగమద- | స్థాసకస్థగితవక్షస్థలుండు
 
గీ.శంభుఁ డోంకారనాథుండు శాశ్వతుండు | పాయకయ యుండు నవ్వీటి పరిసరమున
నర్మదా సింధుతీర కాంతారభూమి | మఱ్ఱి యను పేరి కల్పద్రుమంబు [6]నీడ.
6
వ.అప్పట్టణంబునకుం జుట్టును జనపదంబు [7]లైరావతీశతద్రూ విపాశాసింధునదీమాతృకంబులును, విశ్వవిశ్వంభరాభ్రూలతానుకారిసేతురేఖాలంకారంబులును, దటాకతరుకుసుమకేసరక్షర దమందమకరందధారాధోరణీసహస్ర[8]సంవర్ధితకుల్యా సలిలకల్లోలమాలికా[9]స్ఫుటస్ఫాయత్కాయమాన నానావిధోద్యానవాటికాసంఘటితాకాలకాలాంధకారంబులును, నారామచూతపోతనికరసుకుమార కిసలయాస్వాదకషాయకంఠ కలకంఠకామినీ కోమలకుహూకార కోలాహలాంకురిత పంచమరాగరాజంబులును, రాజాన్నకలమషాష్టిక పతంగ[10]ప్రియ నానావ్రీహిసస్య[11]ప్రశస్తంబులును, బ్రవర్ధమానవనంబులును, [12]నిబిడిత సారసికంబులును, గుళుత్థాభ్యుత్థానంబులును, సముద్గతముద్గసామగ్రీసంగ్రహంబులును, [13]అణుకచణకచణంబులును, సిద్ధార్థ [14]శ్యామాక గోధూమ [15]గర్ముత్తిలజర్తిలంబులును, అదూషిత [16]మాషకోరదూషితకోన్మేషంబులును, [17]కుసుంభకుసుమగుచ్ఛచ్ఛాయాచ్ఛటా[18]భ్యంగణ శోణభంగోమాణుశృంగారిత జాంగలక్షేత్రంబులునునై దాశరథి[19]చరిత్రంబునుం బోలె సీతావృత్తి[20]సరళంబును, జంద్రోదయంబునుం బోలెఁ గరసహస్రసంవర్ధిత[21]రత్నాలయంబును, యదువంశంబునుం బోలెఁ గులక్రమాగత శూరపురుషోత్తమ బలాభిపాలితంబునునై యుండు వెండియు.7
మ.పరలోకస్థు [22]బతిన్ ఝుషాంకు బ్రతికింపంగోరి యోంకారశం-
కరు మ్రోలన్ రతి [23]ముక్తకంఠముగ నాక్రందించునా [24]నొప్పు న-
ప్పురబాహ్యోపవనాంతదీర్ఘికల (రేపున్ మాపు వీతెంచు) పు-
ష్కరకింజల్కభుజిక్రియాసుఖితహంసక్రేంక్రియారావముల్.
8
మ.ధరణీచక్రమువోలె నప్పురము విస్తారంబు నాయామముం
బరికింపంగ నశక్యమైన గరిమం బాథోధిగంభీరతం
బరిఖామండల మంబురాశి నుపమింపం బాత్రమై యొప్పు నం-
బరకల్లోలలుఠత్తిమింగిలఢులీమత్స్యాహినక్రోద్ధతిన్.
9
గీ.భద్రజాతి యేనుంగు లప్పట్టణమునఁ
బ్రకటితస్ఫూర్తి నొప్పు సిబ్బములతోడ
విమలవారాశిఫేనఖండములతోడి
కవ్వపుంగొండబందులో కాక యనఁగ.
10
ఉ.లక్షలసంఖ్య లప్పురి కెలంకులయందుఁ గొలంకు లొప్పు వాః-
పక్షిగరుచ్ఛటాపవనపాతవికంపితపంకజంబులై
[25]వీక్షణకౌతుకంబు ప్రభవింపుచునుండును లీలమై సహ-
స్రాక్షుఁడు విశ్వరూపమహిమాద్భుతముం బ్రకటించెనో యనన్.
11
శా.ఆ వింధ్యాచలదుర్గ [26]మేలు శబరాధ్యక్షుండు హేమాంగదుం
డా వార్ధిద్వితయద్వయావధిగఁ జక్రాధీశ్వరుల్ గొల్వ నా-
శావేదండఘటాకపోలతలమూర్ఛద్దానధారాజల-
ప్లావప్రక్రమసంవిశుద్ధబహులప్రస్ఫూర్తిమత్కీర్తియై.
12
సీ.శివుని కైవడి [27]మహాసేనానుయాతుండు | బలభేది పగిది [28]నపవ్యపాయుఁ
డరవిందహితు లీల [29]నధిగతాభ్యుదయుండు | [30]బుధుని క్రియ నజహత్పుష్కరుండు
గంగాప్రవాహంబు కరణిఁ బావనమూర్తి | భుజగాధిపుని భంగి భోగశాలి
యేనుంగు చందాన దానధారాశోభి | శౌరి లాగున శంఖచక్రపాణి
 
గీ.కర్త యాశ్చర్యములకు నాకరము నీతి- | కఖిలవిద్యాగమములకు నాస్పదంబు
పగఱ కుత్పాతకేతువు బంధుకోటి- | కమరలోకద్రుమంబు హేమాంగదుండు.
13
గీ.ఆ నృపాలుండు నీతివిద్యానిరూఢిఁ
జారదృష్టియౌఁ గాని విచారదృష్టి
సమధికైశ్వర్యవైభవోజ్జ్వలత నాతఁ
డష్టమూర్తియౌఁ గాని యనష్టమూర్తి.
14
యజ్ఞదత్త చరిత్రము
వ.ఆ రాజునకు నఖిలశాస్త్రవిద్యాకళా[31]పావనగంభీరబుద్ధి యజ్ఞదత్తుండను బ్రాహ్మణుండు దేవేంద్రునకు బృహస్పతియును వృషపర్వునకు శుక్రుండును దశరథునకు వసిష్ఠుండును రామునకు విశ్వామిత్రుండును నజాతశత్రునకు ధౌమ్యుండును [32]నలునకు సుమతియుం బోలెఁ బ్రధానియై రాజ్యభారంబు భరియించియుండు నమ్మంత్రి భార్య వినయవతియు వివేకవతియు విభ్రమవతియు విలాసవతియు సౌభాగ్యవతియు లక్షణవతియు నౌదార్యవతియు గాంభీర్యవతియు లజ్జావతియునై సర్వగుణసంపూర్ణ సుశీలాభిధానయగు [33]భామారత్నం బతనికిఁ [34]బ్రేమాస్పదంబై యుండు.15
గీ.అన్ని భాగ్యంబు [35]లున్న నా యజ్ఞముఖికి
శ్రీమహాలక్ష్మి గలుగఁగ నేమి సెలవు
పుత్రవచనావలోకనోద్భూతమైన
యొక్క సౌఖ్యంబు బ్రాఁతియై యుండుఁ గాన.
16
గీ.[36]తనయసంతానలబ్ధి దౌదవ్వుగాఁగ
విభవసంపత్తి గల్గియు విన్నఁబోయి
వనిత నిష్ఫలపుష్పదర్శనముఁ [37]దాల్చె
శరలతాకాననము వోలె జవ్వనంబు.
17
సీ.కాంత పుష్పాది బోగంబు [38]లింపనివను | వైరాగ్యవిధికిఁ దా వాల్చుఁ జిత్త-
మన్వయంబునకుఁ దా నాలంబమయ్యును | దను నిరాలంబఁగా దలఁచు నింతి
ప్రొద్దునఁ [39]దగినట్టి భోజనం బొల్లక | యుపవాస [40]నియమంబు నువిద దలఁచు
సంపత్పరంపర సంభవిల్లిననైన | సంతోష మొదవదు చామ [41]మదికిఁ
 
గీ.గోమలాంగుళదళహస్తతామరసము | కర్ణపూరత్వలీలకై కాలుసాఁప
గండతలదర్పణంబునఁ గదియఁ జేర్చి | [42]తరుణి చింతించు [43]సుతులబ్ధి తడయుటకును.
18
ఉ.సంతతి లేని దుఃఖమున సామజరాజఘటాంతవైభవం-
బెంతయుఁ గల్గియున్ సరసిజేక్షణ [44]విన్నఁగఁబోయియుండు సీ-
మంతిని బోటికత్తెలకు మానసవృత్తి యెఱుంగఁ జెప్ప కై-
[45]కాంతికకేళిశయ్యపయిఁ గాంత గుణించు మనోరథార్థముల్.
19
ఉ.[46]ఆ చపలాయతాక్షి కనకాంబురుహంబులఁ [47]బూజ సేయు విం-
ధ్యాచలకందరానిలయు నద్రిసుతాప్రియనాథు నర్మదా-
వీచిపరంపరాసలిలవిప్రుషదాశ్రయశీతగంధవా-
హాచమనప్రవృద్ధభుజగాధిపకంకణు నోంకృతీశ్వరున్.
20
సీ.అభిషేక మొనరించు నలినీలకుంతల | శంభు సోమోద్భ[48]వాసలిలధార
నెలఁత యభ్యర్చించు నీలోత్పలంబులఁ | దరుణనిర్మలసుధాధామమౌళి
గరళకూటగ్రాసకల్మాషకంధరు | మేన గంధ మలందు మీన[048]నేత్ర
యర్పించు దివ్యోపహారంబు లెలనాఁగ | కుటిల[49]కుండలిరాజకుండలునకు
 
గీ.నతివ దిరుగుఁ బ్రదక్షిణం బభవు [50]గుడికి | గుచభరంబున నరగౌను [51]గూనుగిలఁగ
[52]రవలిమట్టెల మ్రోతతో రాయిడింపఁ | జరణనూపురఝళఝళంఝళరవంబు.
21
వ.ఒక్కనాఁ డోంకారనాథునకుఁ బ్రదక్షిణం బాచరిం[53]చుచు నప్పద్మాక్షి ప్రాకారపురఃప్రఘాణంబున నొక్క పౌరాణికుండు శ్రీమహాభారతంబు వక్కాణించు వాఁ [54]డపుత్రకులకుఁ బుణ్యలోకంబు లేదని కథానుకథనప్రసంగంబునం బలికిన నయ్యింతి సంతానవిరహవేదనాదూయమానమానసయై మందిరంబున కేతెంచి యేకాంతభవనంబున [55]విహారశయ్యపై మేనువైచి చింతాక్రాంతయై యుండె నంత యజ్ఞదత్తుం డమ్మత్తకాశిని నన్వేషించి.22
ఉ.కాంత సరోజనాళలతికాతనుపాండుశరీరయష్టి నే-
కాంతగృహాంతరస్థితఁ బ్రియాంగనఁ జేరఁగవచ్చె మంత్రి క-
ల్పాంతమునన్ రసాతలగుహాకుహరంబున [56]డాఁగియున్న భూ-
కాంత వరాహమూర్తి హరి గ్రచ్చఱ డాయఁగవచ్చు కైవడిన్.
23
వ.డాయవచ్చినఁ గృతప్రత్యుత్థానయగు నప్పంకజాక్షియుఁ దానునుం పర్యంకంబునఁ గూర్చుండి యవిరళాశ్రుపాతార్ద్రీకృతదుకూలయు ననలంకృతయునైన సుశీలం జూచి యజ్ఞదత్తుం డిట్లనియె.24
గీ.ఏల యేడ్చెదు చెప్పవే యిందువదన
విపులశోకభరంబున వెక్కివెక్కి
త్రాట గ్రుచ్చిన [57]క్రొత్తముత్యాలవోలెఁ
[58]జన్నుఁగవ నున్న వీ బాష్పజలకణములు.
25
సీ.కుదురునిండిన మంచి గుబ్బచన్నుల మీఁద | ధరియింపవేల ముత్యాలపేరు
ఫాలేందురేఖపైఁ బచరింప విది యేల | కుంకుమంబున బొట్టు గోరఁ దీర్చి
[59]యానబంధోద్ధురంబగు నితంబంబున | సవరింపవేల వజ్రాల [60]కమరు
పాయవట్టములతోఁ బసిఁడి నూపురములు | హత్తింపవేల పాదాంబుజములఁ
 
గీ.[61]బంచవన్నియరాచిల్కఁ బంజరమున | నేల సదివింప [62]వనురాగ మెసకమెసఁగ
నేల చింతించెదవు [63]చెప్పు మిందువదన | గండపాళికఁ గెంగేలు గదియఁజేర్చి.
26
గీ.నెలఁత నులివేఁడియైన నీ నిడుదయూర్పు
మాటిమాటికి నిపుడు నా మానసంబు
గంపమొందించుచున్నది కల్లగాదు
ప్రబల భవదీయ వక్షో[64]భవంబుఁ బోలె.
27
క.అపరాధము సేయఁ గదా
చపలాయత[65]నేత్ర! [66]యేను జనవున[67]నేనిన్
నిపుణతతోఁ జింతించిన
నెప మేమియుఁ గానరాదు నీ నెగులునకున్.
28
క.భవదాయత్తము విభవము
భవదాయత్తంబు సువ్వె ప్రాణము నాకున్
భవదాయత్తము సర్వము
ధవళాంబుజపత్ర[68]నేత్ర తథ్యం బరయన్.
29
వ.ఈ దుఃఖంబునకుం గారణం [69]బేమి చెప్పుమని [70]యడుగుటయుం బ్రత్యుత్తరం బీక యూరకున్న దాని తాంబూలకరండవాహిని మంత్రితో నిట్లను దేవ దైవంబు కరుణలేమి జేసి, పెద్దకాలం బిమ్మహాదేవి సంతానలాభంబు దూరంబగుట కారణంబుగా శయనాసన[71]పానభోజనవిభూషణపరిధానాది సముచితవ్యాపారంబులు పరిజనప్రయత్నంబున *(బ్రతిదినంబు) నెట్టకేల[72]కు నిర్వర్తించుచు దేవరకు హృదయ[73]వేదన గావింపనో[74]క యనవరతంబుఁ దోఁపకుండఁ
జరియించుచున్నయది [75]నిన్నటి రేపు తపనమండలంబు కుపిత *(కపికపోల) క్రోడతామ్రంబై యుదయగిరికవాటవిటంకంబు [76]నలంకరింప వింధ్యాచలనితంబబింబంబునకు మణిమేఖలాకలాపంబునుం బోలిన నర్మదాప్రవాహంబునం గ్రుంకి యోంకారేశ్వరు శశాంకరేఖాలంకారు హేమపంకజంబులం బూజించి గుడికి బ్రదక్షిణంబు నేయునది దేవభవనప్రాకారగోపుర ప్రఘాణంబునం బౌరాణికుండు మహాభారతంబు వక్కాణింపుచుం [77]గథానుకథనప్రసంగంబున నపుత్రకులకుఁ బుణ్యలోకంబులు లేవని పలికిన నప్పలుకులు నెమ్మనంబునం గీలుకొని వాలంప [78]ములుకులుం బోలె వేదన యుత్పాదింప భవనంబునకు వచ్చి [79]యేకాంతంబ యిచ్చోట నవిరళబాష్పధారాదుర్దినాంధ[80]కారితముఖియై యీ దుర్దశం బొందియున్నయది *(యనుటయు).
30
ఆ.వె.మంత్రి యొక ముహూర్త మాత్రంబు చింతించి
యుష్ణదీర్ఘమైన యూర్పు నిగుడ
[81]నెంత చింత దీనికిది మహాబలవంత
మేమి సేయవచ్చు నిందువదన.
31
ఉ.ఊరక [82]కుందనేమిటికి నోంకృతినాథుఁడు నర్మదానదీ-
తీరనివాసి భక్తజనదివ్యమహీరుహ [83]మున్నవాఁడు నీ-
రేరుహనేత్ర తత్పదపరీష్టి యభీష్టశుభాభివృద్ధికిం
గారణమౌ టెఱుంగవె వికారము దక్కు భజింపు శంకరున్.
32
గీ.ఈశ్వరుం డద్రిజానాథుఁ డిందుమౌళి
కరుణ [84]లేకున్న మనకెట్లు కలుగనేర్చుఁ
జంద్రచందనచంద్రికాశైత్యమైన
పుత్రపరిరంభసౌఖ్యంబు పువ్వుఁబోణి.
33
గీ.గురుజనంబుల [85]సేవింపు కువలయాక్షి
[86]కమలలోచన ముక్కంటి కరుణఁ జేసి
[87]మున్ను గురు నుపదేశంబు మొనయఁ గాంచి-
రభిమతార్థంబు లెందఱే [88]ననుదినంబు.
34
వ.సర్వజగత్ప్రసిద్ధంబుగదా యితిహాసంబు తొల్లి చండకౌశికు వరప్రసాదంబున మగధాధిపతియగు [89]బృహద్రథుండు జనార్దను గెలువం దగినట్టి శౌర్యనిధి జరాసంధుం గాంచె; దశరథుండు విభాండక తనయుం(డగు ఋశ్యశృంగు) నారాధించి దిగ్గజంబులం బోలిన కుమారుల *(సకలలోకహితంబుగా) నలుగురం [90]బడసె సమారాధిత గురుదేవతాప్రసాద*(వశ)ంబున.35
గీ.వెలఁది పుత్రోదయారంభవేళయందు
నిన్ను నెన్నఁడు చూతునో కన్నులార
విమలచంద్రోదయారంభవేళయందుఁ
బూర్ణిమా[91]యామినినిఁ బోలెఁ బుణ్యగరిమ.
36
వ.దేవీ శోకంబు విడువుము ధైర్యం బవలంబింపుము ధర్మంబు నడువుము దానంబు సేయుము [92]వ్రతంబులు సలుపుము సత్యంబు పలుకుము; మన పాలి దేవతలు మన కభీష్టలాభంబుఁ బొందింపఁగలవారు; భవ్యసంతాన లాభంబున సంతోషంబు వహింపం గలవవి [93]దుఃఖాపనోదననిపుణంబులు ధర్మోపదేశ[94]గర్భంబులు [95]చాటుమధురంబులు నగు మాటల
నూరార్చి, కాంచనకలశోదకంబులు కరపల్లవంబున ధరియించి [96]నయనంబులు దుడిచి యగ్గజయానకు ముఖప్రక్షాళనం బాచరించి, మందీభూతదుఖయగుట యెఱింగి మంత్రి యంతఃపురంబు వెడలి సముచితవ్యాపారంబులం బ్రవర్తిల్లె నది యాదిగ [97]నాగమోక్తప్రకారంబున సభక్తివినయతాత్పర్యంబున.
37
ఉ.ఆ ధవళాయతాక్షి వసుధామరకోటి భజించు దేవతా-
రాధన మాచరించు మునిరాజి కుపాస్తి యొకర్చు [98]మంత్ర వి-
ద్యాధరులన్ నుతించుఁ గొనియాడును యోగిజనంబు వర్ధమా-
నాధికభక్తిభావమున నాత్మజసంతతిలబ్ధికామనన్.
38
గీ.ఎఱుఁగునే నీడకన్నును నెండకన్నుఁ
[99]జెలఁగి పూఁచునే కర్మవంచిన లతాంగి
యెట్టి క్లేశంబులకునైన [100]నీడఁబోదు
తన మనంబున [101]నిగ్రుచు సంతానకాంక్ష.
39
సీ.భక్తితో మాతృకాభవనంబుఁకు నేఁగుఁ | గావించు [102]నతి దిశాదేవతలకు
వాయసంబులకు నిర్వర్తించు దధిబలిఁ | గొలుచు జ్యేష్ఠాదేవి నలఘుమహిమఁ
జదివించుకొనుఁ బుణ్యసంహితావ్రాతంబు | మూలికామాణిక్యములు ధరించుఁ
[103]దాంబూలగంధాక్షతలు చిరంటుల కిడు | [104]విప్రశ్నికల గారవించుఁ దఱచుఁ
 
గీ.గుమ్మరావంబు కడవలు కొల్లవిడుచు | బాలురకుఁ దియ్యపండులు పంచి యిచ్చుఁ
జెలులుఁ దానునుఁ [105]రేలు పోచిళ్ళువోవుఁ | దామరస[106]నేత్ర పుత్రసంతానకాంక్ష.
40
వ.ఇవ్విధంబునఁ [107]బుణ్యోపవాసవ్రతదానధర్మదేవతారాధనంబు[108]లఁ బ్రతిబంధదోషంబులుం బాసిన [109]నా సుశీలాదేవియందుం బ్రతిమాచంద్రబింబంబు సరసియందునుం బోలె గర్భం బావిర్భవించిన.41
సీ.అభ్యంతరస్థాగ్నియగు శమీలత వోలె | నిధిగర్భయగు నబ్ధి[110]నేమి వోలె
[111]నంతస్స్థదిగ్దంతియగు వియన్నది వోలె | శశికుక్షియగు నస్తసంధ్య వోలె
నాలీనహర్యక్షయగు నద్రిగుహ వోలె | వినయధారిణి యగు [112]విద్య వోలె
[113]జలదాంతరితయగు నళినాప్తరుచి వోలె | సూనృతాభిధయగు సూక్తి వోలె
 
గీ.నాదిమబ్రహ్మసంభరితోదరయగు | కైటభారాతినాభ్యబ్జ[114]కళిక వోలె
నధిగతాగస్త్యయగు దక్షిణాశ వోలెఁ | బ్రథమగర్భంబు ధరియించెఁ బల్లవోష్ఠి.
42
గీ.[115]పలుచఁ బాఱెను గండదర్పణయుగంబు
నవమధూకప్రసూనంబు [116]నవమధుకర
[117]మానుగతిఁ జూచుకంబులు నసితమయ్యె
సవతి పూఁబోండ్ల యాననాబ్జములతోడ.
43
చ.మనమున కుత్సవం బొసఁగె మంత్రికిఁ [118]బట్టపుదేవి గర్భశో-
భనమునఁ [119]జేసి వెల్వెలఁగబారిన ముద్దుల నెమ్మొగంబుతో
ఘనసమయంబునందుఁ బొడకట్టిన చల్లని తూర్పుగాలిచే
ననిచిన కన్నెగేదఁగికి నచ్చిన కూరిమిచుట్టమో యనన్.
44
గీ.గర్భభారాలసాంగియై కంబుకంఠి
చెవి శిరీషప్రసూనంబు [120]చేర్పనోప-
దెట్లు ధరియింపఁగానోపు హేమరత్న-
కంఠికాహారకేయూర[121]కటకములను.
45
క.ఎలదోఁట తీఁగెయుయ్యెల
కలకంఠికిఁ [122]బిన్ననాఁటి కతలై తోఁచెం
జెలువకుఁ బాదాంబుజములు
[123]గిలిగింతలు వోవుఁ గేలిగిరివార్తలకు.
46
శా.ఆ సారంగవిలోలలోచనను గాఢాలింగనక్రీడలన్
వాసాగారము కేలితల్పముపయిన్ మన్నించి మంత్రీశుఁ డ-
త్యా[124]సక్తిం జవిచూచు నెట్టుకొని మృత్స్నాస్వాదనప్రక్రియా
వ్యాసంగంబు[125]నఁ గమ్మనైన యదసీయంబైన బింబోష్ఠమున్.
47
క.జలరుహనాభుని వక్షః-
స్థలికౌస్తుభమునను [126]మృడుని జడముడి నుడురా-
ట్కలికాలంకృతి వోలెం
బొలఁతుక ప్రత్యగ్రగర్భమున నొప్పారెన్.
48
వ.ప్రతిదివసోప[127]చీయమానగర్భనిర్భర[128]యగు నయ్యాదిగర్భేశ్వరి కౌముదీ[129]మహోత్సవంబునఁ బ్రియసఖీవిలోచనచకోరి[130]కలం గోరికలు [131]నిండించి వెండియు.49
చ.బహుదినముల్ మహాసచివు [132]పట్టపుదేవికి వృద్ధిఁ బొందె దు-
స్సహనవగర్భ[133]సంగ్రహము [జాడ] సఖుల్ ప్రియమందఁగా ముహు-
ర్ముహురనుబద్ధజృంభితసముద్గతవిహ్వల[134]లోలనేత్రముల్
జహదజహత్సమగ్రపురుషాయితకేలివిజృంభణంబు[135]లై.
50
గీ.[136]అల్లనల్లన మెలఁగుఁ బద్మాయతాక్షి
సముదితంబైన గర్భభారము కతమున
సమ్యగాపీతజలరాశిసలిల[137]మైన
ప్రావృడారంభనవమేఘపంక్తి వోలె.
51
శా.[138]సీమంతోన్నయనంబుఁ బుంసవనముం జేయించె శ్రీయజ్ఞద-
త్తామాత్యాగ్రణి[139]చే నృపాలకుఁడు వింధ్యాధీశ్వరుం డర్మిలిన్
సామంతక్షితిపాలమంత్రు లసమానంబైన ప్రేమంబునన్
భామా[140]హేమతురంగరత్నములు పైపైఁ బావడల్ దేరఁగన్.
52
సీ.కమ్మగొజ్జఁగి నీటఁ గలయంపి చల్లిరి | [141]మేఁగి మెత్తిరి క్రొత్త మృగమదమున
రంగవల్లులు కప్పురపు [142]ధూళిఁ దీర్చిరి | [143]కీరించి రొగి మాల్యతోరణములు
తరుణరంభాతరుస్తంభంబు లెత్తిరి | కట్టి రెల్లెడఁ బట్టు కలువడములు
కమలచందనమాలికలు [144]వినిర్మించి రు- | త్తంభించి రున్నతధ్వజపతాక-
 
గీ.[145]లాలిఖించిరి గేహకుడ్యములయందు | సర్వతోభద్రమకరికాస్వస్తికములు
పరిజనంబులు రాజాజ్ఞఁ బట్టణమున | యజ్ఞదత్తుని ప్రథమకళ్యాణవేళ.
53
గీ.[146]వేడ్క నృత్యంబు లాడిరి వీథులందుఁ
బాడి [147]రెత్తిలి పికకుహూపంచమమున
[148]బంజళంబున ధవళప్రబంధగీతి
[149]కనుమ యవ్వలి కర్ణాటకమలముఖులు.
54
మ.*అదనన్ వచ్చిరి సంభ్రమంబునను బంచారామలీలావతుల్
పదునాల్జాతుల యప్సరోంగనలునుం బాలిండ్లపై హారముల్
గదలం బెన్నెఱి సేసకొప్పులపయిం గహ్లారగుచ్ఛంబులొ-
ప్పఁ దదీయత్వరగండభాగములఁ గంపంబొందఁ దాటంకముల్.
55
సీ.[150]పూజెకుండలు నిల్పెఁ బువ్వుఁబోఁడి యొకర్తు | శుభవితర్దిక చతుష్కోణములను
[151]జాజాలపాలికల్ సర్వౌషధుల నించి | ప్రోక్షించె జలము పద్మాక్షి యొకతె
కాంత యొక్కతె సన్నెకలుఁ బొత్తరంబును | [152]దోరించె వటశాఖతోడఁ గూడఁ
బీఠికంబులు [153]వెట్టి బింబోష్ఠి యొక్కతె | మడుఁగుఁ బుట్టము [154]గప్పె నడుగు మునుఁగ
 
గీ.రమణి యొక్కతె వింజామరంబు దాల్చెఁ | దరుణి యొక్కతె తాళవృంతంబు పూనె
లలన యొక్కతె పసిఁడి సంబెల ధరించె | నాలవట్టంబు [155]వహియించె నతివ యోర్తు.
56
గీ.మంత్రి [156]వేల్పించె గృహ్యోక్తమార్గ మొప్ప
బ్రహ్మపదమునఁ గూర్చుండి బ్రాహ్మణుండు
హోమములు రెండు బుగ్యజుస్సామవేద-
మంత్ర[157]మాది జయాదిహోమంబు తుదగ.
57
మ.[158]చెవికిం గేలివతంసకోత్పలదళశ్రీలై కపోలంబులన్
నవకాలాగరు[159]పత్రరేఖలయి మేనం గమ్మకస్తూరియై
ధవళాంభోరుహ[160]నేత్రపైఁ గురిసె నుద్యల్లీల సీమంతపుం-
సవనాజ్యాహుతిహోమసంప్రభవచంచద్వహ్నిధూమచ్ఛటల్.
58
మ.చెలికత్తెల్ చిఱునవ్వు చెక్కులపయిం [161]జెల్వార వీక్షింప నొ-
జ్జలు [162]మంత్రంబులు సెప్పఁ బ్రెగ్గడ శరత్సంపూర్ణచంద్రాస్యకున్
వలిచన్నుంగవమీఁద ముత్పులకము [163]ల్వర్ధిల్లఁ గేల్వంచుచున్
శలలీకంటక మెత్తి యౌఁదలపయిన్ సంధించె సీమంతమున్.
59
క.కుటిలాలక [164]కుడి నాసా-
పుటరంధ్రము[165]నందు మూఁడుబొట్టులు [166]మిడిచెన్
వటఫలదళరస మధిపతి
కటకఝణత్కార మెసఁగ గరపద్మము[167]లన్.
60
గీ.మృదులగోధూమసరులతో మేలవించి
వన్నెకుచ్చుల పేరుతో [168]వక్కరించి
పుష్పడుండుభకంబుతోఁ బొత్తు [169]వడసి
బడఁతి పాలిండ్లపై [170]నొప్పె పసిఁడిపేరు.
61
గీ.తగవులిచ్చిరి [171]పుట్టింటితల్లి ప్రజలు
వీళ్ళొసంగిరి చుట్టాలు వేనవేలు
[172]కట్టనిచ్చె నృపాలుండు కన్నుదనియఁ
బరమహీపాలురిచ్చిరి పావడములు.
62
సీ.క్ష్మామండలము తురంగమధట్టమయమయ్యెఁ | గరిమయంబయ్యె దిక్చక్రవాళ-
మంబరం బాతపత్రావళిమయమయ్యె | సౌరభమయమయ్యె మారుతంబు
పరివారమయమయ్యె బ్రహ్మప్రపంచంబు | జయశబ్దమయమయ్యె సకల[173]జగము-
లాత[174]పంబు విభూషణాలోకచయమయ్యె | సంతోషమయమయ్యె జనులమనము
 
గీ.వింధ్యపర్వత మేలు పృథ్వీవరుండు | దానుఁ బట్టంపుదేవియుఁ దగవుగలిగి
సచివునింటికి [175]నేతెంచి సమ్మదమున | నొద్దనుండి యా శోభన మొనరుచుటయు.
63
గీ.[176]జవిలె నరఁబూలు ముడిచిన సాధ్వి యొకతె
[177]యోలగందంపుఁ బసపున నూన్చెఁ గదిసి
పసిఁడి యుత్తర[178]జందెముల్ [179]పాయఁబట్టి
రాచప్రెగ్గడ బ్రహ్మసూత్రమున నగుచు.
64
గీ.దశరథుని వాజపేయంబు ధర్మసూను
రాజసూయంబు నుపమింపఁ [180]బ్రాఁతియె యని
[181]పట్టణంబును దేశంబుఁ బరిఢవింప
బెట్టె దొడ్డుగ [182]నామెత ప్రెగడగారు.
65
వ.*అంత.66
సుకుమారుని జననము
క.నవమాసంబులు నిండిన
ధవళేక్షణ గాంచె సుతు సుధాకరతారా-
[183]రవిబుధధిషణవిధుంతుద
[184]కవు లుచ్చగముగను నమృతఘటికలు నడువన్.
67
వ.ఇవ్విధంబున సుశీలాదేవి నందనుం గాంచిన వార్త [185]యంతఃపురపరిచారిణి యొకర్తె విన్నవించిన నమృతరపధారామయంబయిన
యమ్మాటకు సద్యఃప్రరూఢరోమాంకురనికరకంటకితగాత్రుండును దరస్మిత *(వికసిత)కపోలమండలుండునునై మంత్ర్యాఖండలుండు.
68
ఆ.వె.తాను గట్టినట్టి చీనాంబరంబులుఁ
దాను బెట్టినట్టి మేనితొడవుఁ
బ్రమదమొప్ప నిచ్చెఁ బారితోషికముగ
మంత్రి యంతిపురము మానవతికి.
69
సీ.[186]తలయంపి ధవళముద్రాకుంభ మిడువారు | రక్షాభసితరేఖ వ్రాయువారు
గౌరసర్షపరాజి కలయఁ జల్లెడువారు | బలివిధానంబులఁ బరఁగువారు
లవణంబు నింబపల్లవముఁ ద్రిప్పెడువారుఁ | [187]బ్రేము మంచంబుతోఁ బెనఁచువారు
[188]గవలధూపంబు సంఘటియించువారును | [189]మంచిము ట్టెడఁద యోజించువారు
 
గీ.గదిసి దీవించువారును [190]గంధతైల | [191]మలదుకొనువారుఁ గాయంబు లందువారుఁ
బాడువారును బరిహాసమాడువారు- | నైరి శుద్ధాంతసతు లరిష్టాలయమున.
70
సీ.కర్పూరసమ్మిశ్రగంధసారంబునఁ | జఱచెఁ [192]జప్పట భిత్తిఁ జామ యొకతె
[193]వెలికిలం బెట్టె నుత్పలగంధి యొక్కర్తు | గప్ప గర్భగృహోపకంఠభూమి
జ్యేష్ఠాధిదేవత సేవించె నొకయింతి | పసపుఁబుట్టము గట్టి భక్తిగరిమఁ
బటముపై లిఖియించెఁ బాటలాధర యోర్తు | క్రొత్తలత్తుక [194]శశాంకుని ఖరాంశు
 
గీ.[195]జరఠమేంఠంబు కంఠదేశమునఁ జుట్టెఁ | బుష్పడుండుభముల నొక్క పువ్వుఁబోఁడి
యంబుజానన యొకతె నెయ్యభిఘరించె | భుజగనిర్మోక మొకతె నిప్పులఁ గమర్చె.
71[196]
ఉ.మంగళరత్నదీపముల మధ్యమునం బురుటింటి పాన్పుపై
నంగజసన్నిభుండు సచివాగ్రణినందనుఁ డొప్పె నెంతయున్
నింగిఁ బ్రదోషవేళ నతినిర్మలతారక[197]చక్రవాళముల్
సంగతిఁ జుట్టునుం గొలువఁ జాలఁగ నొప్పు శశాంకు కైవడిన్.
72
గీ.బాలకుఁడు చంద్రచంద్రికాపాండు [198]వయిన
[199]పాన్పుపై నొప్పెఁ బొత్తులపై శయించి
యమృతవారాశిలోన శేషాహి మీఁదఁ
బవ్వళించిన కౌస్తుభాభరణుఁ బోలి.
73
గీ.దానధర్మంబు లొనరించి త్యాగ మిచ్చి
బ్రసవగేహంబు సొచ్చి భూపాలమంత్రి
[200]యంబుపావకసంస్పర్శ మాచరించి
ప్రథమతనయు ముఖేందుబింబంబు సూచె.
74
గీ.పురుడు చెల్లంగఁ బుణ్యాహమును నొనర్చె
నిలయదైవతములఁ గొల్చి నిజసుతునకు
మారసన్ని భునకు సుకుమారుఁ డనెడి
పేరువెట్టెఁ బ్రధానబృందారకుండు.
75
గీ.పసపుఁబుట్టంబు ధరియించి పద్మనయన
సుతుని నుత్సంగమునఁ దాల్చి చూడనొప్పె
దరణిబింబహారిద్రవార్ధరముతోడ
లలితరుచి నొప్పు నాకాశలక్ష్మివోలె.
76
గీ.పల్లవాధర మడుఁగైన యొల్లెఁ గట్టెఁ
గొంగు మణిహేమకంఠికాకోటిఁ జెరివి
సొబగుఁ గాటుకబొట్టుతోఁ జూడనొప్పె
వింతచెలువునఁ బచ్చిబాలెంత[201]రాలు.
77
ఉ.[202]రక్షకుఁ బుండరీకనఖరంబు సువర్ణలతానిబద్ధమున్
వక్షమునన్ ధరించి సచివప్రియసూనుఁడు చూడనొప్పె ను-
గ్రతతిసంభ్ర మోద్ధతిగ [203]గాఁడి విడంబితమైన [మర్త్య]హ-
ర్యక్షుని గోరు పేరురమునందు ధరించిన దైత్యు కైవడిన్.
78
గీ.రత్నవేదికపై మంత్రిరాజసుతుఁడు
తల్లిహృదయంబు [204]దృష్టియు తన్నుఁ గొలువ
[205]ఫాలతలమున రావ్రేక పరిణటింప
జానుచంక్రమణక్రీడ సంచరించె.
79
మ.వలిచన్నుల్ వడఁకాడ వేనలులు గైవ్రాలంగ గారాపు దా-
దులు తన్నేమఱ [206]కంతనంత దిరుగన్ ధూర్తుండు తా నుద్ధతిన్
గలకాంచీమణికింకిణీకలకలా[207]త్కారంబు తోరంబు గాఁ
గలహంసంబులఁ బట్టఁ [208]బాఱుసు వడిం [209]గక్ష్యావిభాగంబులన్.
80
వ.అంత [210]నా సుకుమారుడు నత్యంతసంతోషవంతులగు తలిదండ్రుల మనోరథంబు ఫలియింప ననుదినప్రవర్ధమానుండై వర్ధమానసంపదనురూపంబు[211]లగు నైశ్వర్యానుభవంబులు గలిగి క్రమంబునఁ గృతచౌలోపనీతుండై యాచార్యగృహంబున కరిగి.81
సీ.చదివె వేద మెఱింగెఁ బదము [212]వాక్యంబుఁ బ్ర- | మాణంబు దివ్యాగమములు చూచెఁ
దరచె నాదిపురాణధర్మశాస్త్రంబులు | నేర్చె వీణావేణునృత్యకళలు
వాదనశ్యాంజన[213]వదనికాదులును జూ- | దంబును గణితశాస్త్రంబు దెలిసె
సరహస్యముగ నింద్ర[214]జాలమంత్రక్రియా | తంత్రమంత్రములఁ జిత్తరువు గఱచె
 
గీ.గ్రోల్చె యోగంబు సాధించె రుద్రభూమి | [215]సకలశస్త్రాస్త్రసంచయసమితి నేర్చె
[216]నాకళించెను విపులవైద్యక్రమంబు | సంగ్రహించెఁ గవిత్వంబు సచివసుతుఁడు.
82
వ.ఇవ్విధంబున సర్వవిద్యాపరిశ్రమంబునఁ [217]బ్రాగల్భ్యంబు వహించిన సుకుమారునకు శైశవంబు సరిగడచుటయుఁ బ్రదోషంబునకుఁ
జంద్రోదయంబును, [218]జలధరంబునకు శక్రచాపంబును, [219]బుష్పంబునకు వాసనాప్రకారంబును, గమలవనంబునకు సూర్యోదయంబును, గంధగజంబునకు దానంబును, విజ్ఞానంబునకు మౌనంబును, [220]నవధ్యునకు గేయంబును, రాజ్యబలంబునకు నాజ్ఞాబలంబునుం బోలె భువనసమ్మోహనంబైన సౌందర్యంబున [221]కనురూపంబై జవ్వనం బావిర్భవించిన.
83
గీ.బాల్యమునయందుఁ గలుగు సౌభాగ్యరేఖ
నినుమడించిన సౌందర్య మెసకమెసఁగ
సచివతనయుండు [222]తారుణ్యసంక్రమమునఁ
[223]బద్మముఖులకుఁ గన్నులపండువయ్యె.
84
శా.పంచారామవిలాసినీధవళదృక్పాఠీనజాలాయమా-
నాంచ[224]త్కోమలనిర్నిబంధనమనోజ్ఞాకారరేఖా(కళా)-
పంచాస్త్రుండగు నా కుమారుఁ [225]డురుదర్పస్ఫూర్తి నవ్వీటిలో
సంచారం బొనరించెఁ గాంచనమహాసౌధాగ్రభాగంబులన్.
85
గీ.ఆదిగర్భేశ్వరత్వంబు యౌవనంబుఁ
జక్కఁదనమును నతిసాహసంబుఁ జనవు
నొక్కఁడొక్కం[226]డు చాలు దోషోత్కరమున
కన్నియును [227]గూడియున్నవి యతనియందు.
86
సీ.ఒకకొంతప్రొద్దు కందుకకేళి యొనరించుఁ | గంకణంబుల ఝణత్కార మెసఁగ
నొకకొంతప్రొద్దు వల్లకి నఖాగ్రంబుల | బహురాగముల నేర్పుఁ [228]బ్రస్తరించు
నొకకొంతప్రొద్దు [229]కొండికజవంబు లొనర్చు | పరిహాసగోష్ఠికిఁ బల్లవించు
నొకకొంతప్రొద్దు లోకకథాప్రహేళికా- | బిందుమత్యాదులఁ బిచ్చలించుఁ
 
గీ.గొంతప్రొద్దు వినోదించుఁ [230]గొఱతలయిన | తోడివేడుకకాండ్రతో మేడమీఁద
విమలచంద్రోదయారంభవేళయందు | [231]బిల్లదీవాటలను మల్లు[232]పెనఁగుటలను.
87
వ.ఇవ్విధంబునఁ దృష్ణావిషవల్లి [233]కాలవాలంబును, నింద్రియగుణంబులకు శరణంబును, మోహ[234]నిద్రకు విభ్రమశయనంబును, శాస్త్రదృష్టికి దిమిరోద్గమంబును, దోషాశీవిషంబులకు [235]నావాసవల్మీకంబును, *(సుగుణకలహంసంబులకుఁ బ్రావృట్కాలంబును,) గపటనాటకంబునకుఁ [236]బ్రస్తావనయు, ధర్మేందుమండలంబునకు రాహువక్త్రంబునునైన యౌవనారంభంబున.88
సీ.ఆజానుదీర్ఘబాహార్గళస్తంభుండు | కోమలాళివినీలకుంతలుండు
కర్ణాంతవిశ్రాంతకమలాయతాక్షుండు | పరిఫుల్లచంపక [237]ప్రసవనసుఁడు
బహుళాష్టమీశశిప్రతిమఫాలతలుండు | కంబుసన్నిభచారుకంధరుండు
పరిపక్వబింబికా[238]ఫలపాటలోష్ఠుండు | గంధవారణకుంభ[239]కఠినభుజుఁడు
 
గీ.సచివతనయుండు కుపితధూర్జటిలలాట- | చక్షురనలార్చి రుద్గమసంప్రభూత
విస్ఫులింగచ్ఛటా[240]ఘటావేష్టనమునఁ | బసిమి దప్పని వలరాజు పగిది నొప్పె.
89
సీ.[241]చరిగొన్న వెలిపట్టు జన్నిదంబులతోడ | [242]రత్నాలతారహారము ధరించి
వలిపనీర్కావిదోవతిపైఁ బదార్వన్నె | [243]కళయైన పసిఁడిమేఖల [244]ఘటించి
గంగమట్టియమీఁదఁ గస్తూరిరసమునఁ | బుండ్రకంబు లలాటమున నమర్చి
[245]విమలసన్మణికుండలముల పార్శ్వములందు | లలితంబులగు [246]నొంటు లలవరించి
 
గీ.యాత్మవంశపరంపరాయాతమైన | వైదికాచారమార్గంబు వక్కణించి
[247]యారజము రాచఱికమును నలవరించి | నగరవీథులఁ జరియించుఁ బ్రెగడసుతుఁడు.
90
గీ.సచివనందను కర్ణపాశముల వ్రేలు
కుండలంబుల ముత్యాలగుళిక లొప్పు
నన్యలోకస్థుఁడగు శంబరారి కేడ్చు
రతిమహాదేవి యశ్రుపూరములు వోలె.
91
క.కుసుమాయుధనిభుఁడగు నా
రసికునిపై వ్రాలు సానురాగముతోడన్
బిసరుహనయనల చూపులు
భసలంబులు పూపుఁదోఁటపయి వ్రాలు గతిన్.
92
గీ.భావ మభిరామరూపైక[248]పక్షపాతి
యౌవనము దోషముల కెల్ల నాస్పదంబు
మన్మథుఁడు [249]కోపి యెటు నియమంబు నిలుచు
సుదతులకు వానిఁ గడకంట జూచినపుడు.
93
సీ.హృదయ మువ్విళ్లూర నేకాంతమున నుండి | వానిఁ [250]జింతింపని వనజముఖియు
నొకమా ఱతనిఁ జూచి యొండొక్కమఱి చూడ | [251]నభిలషింపని విద్రుమాధరయును
గలలోన వానిఁ జిక్కఁగఁ గౌఁగిటను జేర్చి | ముకుళితేక్షణగాని ముద్దియయును
నతని రూపంబుఁ గుడ్యములందు లిఖియించి | [252]యందంబుఁ జూడని యంగనయును
 
గీ.[253]జెలులచేతను బ్రోది రాచిలుకచేత | వాని గుణములు విని కుచద్వంద్వసీమఁ
[254]జాదుకొనఁ బులకింపని పైదలియును | బన్నిదము వ్రేసినను లేదు పట్టణమున.
94
సీ.ద్యూతకేలియ వినోదోపాయ[255]మయ్యెను | బరదారగమనంబు ప్రౌఢియయ్యె
నాత్మభార్యాపరిత్యాగంబు ధృతియయ్యె | [256]నాఖేటలీల విహారమయ్యె
గురుతిరస్కా[257]రంబ గరిమ[258]యయ్యెను నట- | విటకీర్తనంబు[259]లే పటిమయయ్యెఁ
బానంబె యధ్యాత్మపరత[260]యై విలసిల్లె | తరలతాగతియ యుత్సాహమయ్యె
 
గీ.గుణము [261]దోషంబు దోషంబు గుణమునయ్యె | నపుడు సుకుమారునకుఁ దద్వయస్యులకును
నాదిగర్భేశ్వరత్వంబు యౌవనంబు | [262]సవురు ధనమును జనవు హేతువులు గాఁగ.
95
గీ.[263]త మ్మమానుషకాలోచితంబులైన
కీర్తనంబుల [264]మై పులకించుకొండ్రు
తా రమర్త్యులుగా మదిఁ దలఁతు రహహ
విత్తమదమత్తచిత్తులై వెఱ్ఱిజనులు.
96
సీ.అయ్య నీవు చతుర్భుజావతారుఁడ వన్నఁ | దమ భుజాదండపార్శ్వములఁ జూతు-
రయ్య నీవు త్రిలోచనావతారుఁడ వన్న | ఫాల మంటుదురు దోఃపల్లవమున-
నయ్య నీవు గజాననావతారుఁడ వన్నఁ | గుంభపీఠము లంటికొనఁ దలంతు-
రయ్య నీవు [265]చతుర్ముఖావతారుఁడ వన్న | [266]నద్దంబుఁ జూడంగ నభిలషింతు-
 
గీ.రవసరం బిచ్చుట యనుగ్రహంబు గాఁగ | మోముఁ జూచుట యుపకారముగను బలుకు
మైత్రిగా నప్పు డధిక[267]సమ్మానముగఁ ద- | లంతు రైశ్వర్య[268]వైభవవంతు లుబ్బి.
97
ఉ.సంపద పేరి కట్టిఁడిపిశాచము సోఁకిన మానవుండు పూ-
జింపఁ డభీష్టదేవత భజింపఁడు సజ్జనులైనవారి మ-
న్నింపఁడు మిత్రబంధుల గణింపఁడు ధర్మరహస్యముల్ విచా-
రింపడు (నేమముం దగ భజిం)పఁ డహంకరణంబు పెంపునన్.
98
గీ.ఉద్ధతుం [269]డయి సుకుమారుఁ డుండలేక
[270]వీటఁ జక్కని జవరాలి వెదకివెదకి
వలపు పుట్టించి సంకేతములకుఁ దార్చి
[271]చలుపు రతికేలి బహుళపక్షంబు రేలు.
99
గీ.పద్మనాభుండు మదనగోపాలమూర్తి
ఘోషమున [272]నెట్లు వలపించె గొల్లసతుల
నెట్టుకొని [273]యట్లు వింధ్యాద్రిపట్టణమునఁ
బరపురంధ్రుల [274]వలపించె బ్రాహ్మణుండు.
100
సీ.యమునానదీసైకతమున జాలరికన్య | చనుదోయి నంటఁ డే శక్తిసుతుఁడు
నందవ్రజంబులో నలిననాభుం డెట్లు | విహరించెఁ బదియాఱువేలసతుల
దేవదారువనంబులో విరూపాక్షుండు | మునిభామినుల నెట్లు మోసపుచ్చెఁ
గొక్కొరొకోయని కోడియై యెలుఁగించి | యమరనాయకుఁ డె ట్లహల్యఁ గలసె
 
గీ.మొలకచన్నులపాయంపు ముద్దుఁగూఁతుఁ | బట్టుకొనె నెట్లు పైకొని పద్మభవుఁడు
చందురుం డెట్లు వొందె నాచార్యులేమ | ననుచు విప్రుండు [275]రమియించె నన్యసతుల.
101
సీ.[276]సంధ్యాభివందనశ్రద్ధ యుద్వాసించె | గాయత్రి దవ్వులఁ గట్టిపెట్టె
నగ్నిహోత్రముమీఁది యాస నుత్పాటించె | నఘమర్షణస్నాన మరసి [277]మానె
[278]నిహపరసామగ్రి నీయఁజాలెడునట్టి | విధిదేవతార్చన వీటిఁబుచ్చె
[279]వేదపాఠము మానె వివిధసత్కర్మాది | సత్కలాపంబులు జాఱవిడిచెఁ
 
గీ.[280]సిగ్గుఁ బోకార్చెఁ గుక్కలఁ జేతఁబట్టె | [281]నిలిచియుండియు మూత్రించెఁ గలిసె లజ్జఁ
[282]గాలపరిపాటి ప్రారబ్ధకర్మవశతఁ | బయిసికొట్టనం బడియె నా బ్రాహ్మణుండు.
102[283]
వ.ఇవ్విధంబునం దృగున్మీలనంబునం బోలె మార్గంబు దప్పి, జిహ్వాచ్ఛేదనంబునం బోలె మూఁగై, ఇంద్రజాలపింఛికాప్రచారంబునం బోలె తత్వం బెఱుంగక, ఊహజ్వరంబునం బోలె [284]నసంబద్ధంబు లాడుచు, లోకాయతవిద్యాభ్యాసంబుననుం బోలె నధర్మంబు మరగి, పైశాచగ్రహణంబునం బోలె గళవళింపుచు, మదనా వేశంబునం గావరంబెత్తి వర్తింపుచున్న సుకుమారు రావించి యజ్ఞదత్తుండు సుశీలాదేవి [285]సమక్షంబున వాని కిట్లనియె.103
గీ.అన్న సుకుమార! యేలయ్య యనుదినంబు
గొఱకుఁదనమున ధూర్తులఁ గూడి తిరిగె
దకట మీ యమ్మ గాంచె నిన్నధికనియతిఁ
గోరి వీరవ్రతంబున గొడ్డు వీఁగి.
104
సీ.ఓరి నీకాచార్యుఁ డుపదేశ మిచ్చెనో | దర్శించితెట్లు శాస్త్రములలోన
ధర్మం బుపార్జింపఁ దగిన మార్గమె యిది | తపము వర్ధిల్లునే తనరఁ దీనఁ
గైవల్యపదవి యెక్కఁగవచ్చునే దీనఁ | గంటె నాకమునకుఁ గారణముగఁ
గాదేని [286]నియమంబు క్రమమే యిది దలంప | భవదుఃఖములు దీనఁ బాయుటెట్లు
 
గీ.మూర్ఖుఁడైనను శిశువైన మూఢుఁడైన | దన కరిష్టంబుఁ దలఁచునే మనమునందు
నంతరహితుల యార్గురయందు ఘనుఁడు | మన్మథుఁడు దద్వికారంబు మాను మిపుడు.
105
సీ.రత్నాంశుదీపాంకురములచేఁ బాయదు | యౌవనోద్భూతమైనట్టి తమము
శిశిరోపచారంబుచేత సాధ్యముగాదు | ప్రత్యగ్రమైన దర్పజ్వరంబు
మంత్రమూలములచే మణులచేఁ దేరదు | విషయవిషాస్వాదవిషమమూర్ఛ
సలిలాభిషేక శౌచములచేఁ బోవదు | ఘనభోగమను పూతిగంధకళిక
 
గీ.యామవతిఁ దెల్లవారిన నణఁగిపోవ- | దుదరసుఖసన్నిపాతనిద్రోదయంబుఁ
బ్రతిదినంబును లక్ష్మీసురామదంబు | విరియనేరదు పరిణామవేళయందు.
106
క.[287]ఏమగునొకొ బాంధవమున
నామలకశలాటురసము యౌవనలక్ష్మీ-
సామగ్రికినా యొగరు గ-
దా మధురత యొసఁగు విషయమను జలమునకున్.
107
గీ.[288]జవ్వనమునను సదుపదేశములు గావు
తి(ఱ్ఱిఁబోసిన సలి)లంబు తెఱుఁగు దోఁప
శంబరారాతిపుష్పాస్త్రసంప్రహార-
జర్ఝరీభూతమగు మనస్సంపుటమున.
108
వ.తండ్రి! గురూపదేశం బఖిలమలప్రక్షాళనక్షమంబైన తీర్థస్నానంబు, జరామరణవైకల్యంబు లేని వార్ధకంబు, మేదోభారంబు లేని గౌరవంబు, సువర్ణరచన లేని కర్ణాభరణంబు, నుద్వేగంబు లేని ప్రజాగరంబు; [289]ఇది యభవ్యులకు సలిలంబునుం బోలెఁ గర్ణస్థితంబై యుపద్రవంబు నాపాదించు. నీ విటవట్టి నెట్టుకొని పెద్దలమాట వినుము, వింటేని ధూర్తులు నిన్నుఁ [290]బ్రశాసింపలేరు, *(కుటిలులు నిన్ నలమరింపలేరు), వంచకులు నిన్ను వంచింపలేరు, పల్లవులు నిన్ను వలపింపలేరు, మదంబు నిన్నుఁ గదల్పలేదు, [291]విషయంబులు నిన్ను నాశ్లేషింపలేవు, విను మనూచానాచారంబును, నాముష్యాయణంబును, [292]నామేధితామ్నాయంబును, నధీతాశేషశాస్త్రంబును, [293]నలింగవృత్తియు, [294]ననవకీర్ణంబు, ననభ్యుదితంబును, ననభిష్ఠుతంబునునైన [295]యాయావరవంశంబునం బ్రభవించినాఁడవు మూఢుఁడవై యనుష్ఠానబంధంబులగు విషయోపభోగంబులయందు సుఖబుద్ధి యారోపించెదవు. నీయట్టి [296]దుర్బుద్ధిశీలురుగదా నిస్త్రింశంబుఁ జూచి కువలయమాల యనియును, గృష్ణసర్పంబు వీక్షించి కాలాగురుధూమరేఖ యనియును, నంగారంబు [297]దర్శించి బంగారం బనియును భ్రాంతిఁ బొందుదురు. దుందుమార[298]కరంధమ మాంధాతృనహుష నాభాగసన్నిభుండు వింధ్యాచలపతి, హేమాంగదుండు మనల గురుస్థానంబుగా మన్నింపుచున్నవాఁడు. మన వంశంబునకు నీవొక్కండవ సంతానబీజంబ వింతయు నెఱింగి బుద్ధిమంతుడవై మమ్ము నుద్ధరింపవలదా యని*(పలికి) మంత్రి కన్నీరు దొరఁగ ముహూర్తమాత్రం బూరకుండె సుశీలాదేవియు.109
సీ.రవలయుంగరముల రత్నాంకురము లొత్తఁ | గేల్దమ్మి చెక్కులఁ గీలుకొల్పి
మొకరితుమ్మెద మూతిముట్ట నోడెడి వేఁడి- | నిశ్వాసపవనంబు నివ్వటిలఁగ
నాకర్ణదీర్ఘంబులగు క్రాలుఁగన్నులంఁ | బరిపాటలచ్ఛాయ పల్లవింప
గంఠగోళంబు గద్గదికాను[299]బద్ధమై | బాష్పభారంబు నిబ్బరము గాఁగఁ
 
గీ.బక్ష్మములు జాఱి గండదర్పణము లొరసి | వ్రాలి పాలిండ్లపై నశ్రువాఃకణములు
హారలతలకు నాతిథ్య మాచరింప | గుబ్బతిల నేడ్చె [300]నొత్తిలి కువలయాక్షి.
110
వ.ఇవ్విధంబునఁ దల్లియుఁ దండ్రియుఁ [301]దనకు హితోపదేశంబు చేసి తన సౌమనస్యసౌముఖ్యంబులతోఁ దగిన ప్రత్యుత్తరం [302]బీయమి నిర్వేదించుట యెఱింగి.111
సీ.ధర్మశాస్త్రాభ్యాసతాత్పర్యముననైన | సంస్కార [303]మె ట్లౌరుసౌరు పడియె
నిరుపాధినిస్సీమనిర్నిబంధన[304]శక్తి | గల మహాప్రతిభ యే కాటఁ గలసె
బంచేంద్రియ[305]విజయోపాయభూతములైన | వినయంబు లే ప్రయోజనముఁ దీర్చె
నవయోవనాంకు[306]రోన్నతవంశదవమైన | [307]శ్రుతివైభవం బేమి హితవు చేసె
 
గీ.జిన్ని వయసున [308]గురులు శిక్షించినట్టి | పుణ్యవాసన నేల గోల్పోయె మనసు
కటకటా! నందనుండ [309]వొక్కఁడవ కల్గి | గురుల నేడ్పించుచున్నావు [310]కోరగమున.
112
వ.అనినఁ దల్లిదండ్రులకుం బ్రణామంబు చేసి యింతనుండి మీ యాజ్ఞ [311]శిరంబున ధరియించి బుద్ధిమంతుండనై యుండెద మీరు [312]వగవకుండుండని పలికి సముచితప్రకారంబున వీడుకొనియె ననిన నటమీఁది వృత్తాంతం [313]బెట్టిదని యడిగిన.113
మ.వరశైవైకవిధాన [314]దానకథనవ్యాపార పారంగతా-
స్థిరలక్ష్మీనవశారదోదయ దయాధీనాయతాలోక లో-
కరమాపాదన పాదపద్మవినతక్ష్మాపాలసంశీల శీ-
లరతిప్రస్ఫుటశాంత శాంతనవకల్పద్వీర వీరాగ్రణీ.
114
క.ధీమత్కవితావిస్తర-
ధామాయిత నిరుపమానదానాంబుద హృ-
ద్భీమ జయోత్కలసీమా-
రామామన్మథవిశేష రాజితమూర్తీ!
115
మందారదామ.లింగార్చనా[315]రూఢలీలావిశాలా
గంగాంబు[316]సుస్వచ్ఛకావ్యైకజాలా
*సంగీతసాహిత్యసౌహిత్యలోలా
శృంగారసద్భక్తసేవాను[317]పాలా.
116
గద్యము.ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సకలవిద్యాసనాథ శ్రీనాథనామధేయ ప్రణీతంబయిన శివరాత్రి మాహాత్మ్యంబునందు ద్వితీయాశ్వాసము. 

[1] తా. పెరిగి.
[2] ము. చుట్టుముట్టినయట్టి.
[3] తా. పట్టనంబున.
[4] ము. తా. మకుట.
[5] తా. తోరణకోవిదుండు.
[6] ము. మొదల.
[7] ము. తా. లీలావతీ శతద్రు విపాట్సింధు.
[8] తా. సువర్ధిత.
[9] తా. స్ఫాల.
[10] తా. ప్రాయ
[11] తా. ప్రస్థంబులును.
[12] తా. నిపీడితకాసారసేకంబులును.
[13] తా. సనకోచణకచణకంబులును.
[14] తా. శ్యామ.
[15] ము. శర్మరాతిల.
[16] ము. మహాకోర.
[17] ము. కుస్తుంబురు.
[18] ము. భృంగ.
[19] తా. చరిత్రంబులనుం బోలె.
[20] తా. సరళంబులును.
[21] తా. రత్నాలయంబులును.
[22] తా. మదిన్.
[23] తా. కంఠముక్తముగ.
[24] తా. నప్పురీ-పురబాహ్యోపవన.
[25] తా. వీక్షకు గౌతుకంబు.
[26] తా. మేలె.
[27] ము. మహాసేనాని యాత్ముండు. తా. మహాసేనాని యాతండు.
[28] తా. నపవ్యసాయు.
[29] తా. నధికరాభ్యుదయుండు.
[30] ?. బుద్ధుని క్రియ జయత్పుష్పశరుఁడు.
[31] పావగాహబుద్ధి.
[32] తా. హరిశ్చంద్రునకు సత్యకీర్తియును ము. నలునకు దమనుండునుం బోలె.
[33] ము. బాలా.
[34] ము. బరమప్రియాస్పదంబై.
[35] తా. లుంగల.
[36] తా. తనయు.
[37] తా. దాల్చి.
[38] ము. లింపెసఁగిన. తా. లింపనినను.
[39] తా. ఁదగునట్టి.
[40] ము. నంబుండ.
[41] ము. మతికి.
[42] ము. పడతి.
[43] ము. సుతలబ్ధి వడయుటకును.
[44] ము. చిన్నగ.
[45] ము. కాంతమ.
[46] తా. ఆ చపలాక్షి దాను.
[47] తా. బూని.
[48] తా. వ.
[49] తా. నేత్రి.
[50] తా. కుంతలి.
[51] తా. నకును.
[52] తా. గూనిగిలఁగ.
[53] తా. రవణి.
[54] తా. పుచు.
[55] తా. అపుత్రులైనవారలకు.
[56] ము. విరహశయ్యపై.
[57] తా. డస్సియున్న.
[58] ము. ముత్యాలదండ వోలె.
[59] తా. చన్నులని నున్నయవి బాష్పజరకణములు.
[60] ము. యానచక్రోద్ధురంబగు నితంబముమీద.
[61] తా. కమలు.
[62] తా. పచ్చ.
[63] తా. కనురాగ.
[64] తా. చెప్పె యిందువదన.
[65] తా. భరంబు.
[66] తా. నేత్రి.
[67] తా. నేను జను నొరునేనిన్.
[68] తా. నేత్రి.
[69] తా. బు.
[70] తా. యడిగినం.
[71] తా. స్నాన.
[72] తా. కునికి వర్తించుచు.
[73] తా. పీడ.
[74] తా. కనారతంబు నే కారణంబు.
[75] తా. నిన్న రేపు.
[76] తా. ల.
[77] తా. కథాకథన.
[78] ము. ములికియుం బోలె.
[79] తా. యేకాంతంబున నిచ్చోట.
[80] తా. కారముఖి.
[81] తా. దీని కెటులైన దేవుండు బలవంత.
[82] తా. యేడ్వ.
[83] ము. మున్ సదాశివున్ సారసనేత్ర.
[84] ము. లేకను సుతుఁడెట్లు.
[85] తా. సేవించు.
[86] తా. నలినముఖి నిష్ఠమీర సంతత మనీష.
[87] తా. మునిజనంబుల భజియించి మున్ను గాంచి.
[88] ము. నబ్జవదన.
[89] ము. రాజు దైతేయకులవిమర్దను.
[90] తా. గాంచె.
[91] తా. యామినియు.
[92] తా. నేమంబున నోములు నోముము.
[93] ము. దుఃఖోపశమనభాషణంబులు.
[94] తా. నిపుణంబులు.
[95] ము. చారు.
[96] తాన యమ్మానినీరత్నంబునకు.
[97] తా. సుశీల పరమభక్తితాత్పర్యంబు.
[98] ము. మంత్రవిద్యాధృతబుద్ధిఁ గాంచు.
[99] ము. చొలవకూచిన కడవంచునే లతాంగి.
[100] తా. నీడజోడు.
[101] తా. నిగుర్చు.
[102] ము. నతిథిసత్కారములను.
[103] ము. దన్వంగి.
[104] తా. విప్రకన్యల.
[105] ము. వ్రతములు సలుపుచుండు.
[106] తా. నేత్రి.
[107] తా. పుణ్యవ్రతోపవాస.
[108] తా. లు.
[109] ము. నా సుదతీలలామంబు మెఱసి.
[110] ము. నిలయ.
[111] తా. నసమగ్న.
[112] ము. వినత.
[113] ము. నస్తాంతరితయగు.
[114] ము. కమును బోలె.
[115] తా. పలచ.
[116] తా. నవమతించె.
[117] తా. నాతి కుచచూచుకంబులు.
[118] తా. బట్టముదేవి.
[119] ము. బల్చనై చెలువు పైకొను.
[120] తా. ఁజతచనోప.
[121] తా. కంకణములు.
[122] ము. చిన్ననాఁటి.
[123] ము. గిలిగింతలు గొలుపుఁ గేలిగిరిగుహలందున్.
[124] ము. సంగంబొనరించె ముద్దుగొనె.
[125] తా. ను.
[126] ము. దీప్తిఁ దనరెడు మణిరా.
[127] నీయమాన.
[128] ము. యగుచు నయ్యది.
[129] ము. విలసనంబునుం బోలెఁ.
[130] ము. కలకుఁ.
[131] ము. నిండించె.
[132] తా. పట్టముదేవికి.
[133] ము. చిహ్నములు చూచి.
[134] ము. నేత్రపద్మముల్.
[135] ము. లున్.
[136] ము. అట్లు ధవునొద్ద.
[137] తా. యైన.
[138] ము. సీమంతోన్నతసంభ్రమంబు వెలయం.
[139] ము. కన్నృపాలకుడు. తా. కిన్.
[140] ము. సింధు.
[141] తా. మ్రోకువెట్టిరి.
[142] ము. మ్రుగ్గు వెట్టిరి.
[143] తా. దోరించి రొగిఁ దల్యతోరణములు.
[144] ము. ను నిర్మించిరి, స్తంభించి రుత్తమదర్పణములు.
[145] తా. అభిలిఖించిరి.
[146] తా. వెలఁదివెన్నలఁ బ్రాసాదవీథులందు.
[147] తా. రొత్తిలి.
[148] తా. పంజరంబున.
[149] ము. కముల నవ్వేళ.
[150] తా. పూజగుండలు నిల్పెఁ బూఁబోణి యొక్కతె.
[151] ము. జాజాలపాలెల సర్వౌషధులు.
[152] తా. దోలించె.
[153] తా. వెట్టె.
[154] తా. లిచ్చెగడలు మునుఁగ.
[155] ము. ధరియించె.
[156] తా. గల్పించె గుహ్యోక్త.
[157] తా. వేద.
[158] తా. చెవులం గేతిని
[159] తా. చిత్ర.
[160] తా. నేత్రిపైఁ బొలసె.
[161] తా. జిర్వార.
[162] తా. చెప్పనప్డు.
[163] తా. వర్ధిల్లెఁ గేల్సాచుచున్.
[164] ము. కును.
[165] ము. లందు.
[166] ము. పిడిచె.
[167] తా. నన్.
[168] తా. వక్కడించి.
[169] ము. వచ్చు.
[170] ము. నొప్పు.
[171] తా. పుట్నింటి.
[172] ము. కట్నమిచ్చె.
[173] తా. జనము.
[174] ము. పత్ర.
[175] తా. నేతెంచు.
[176] తా. జరధి నరమూల ముడిచిన.
[177] ము. యుల్లగందంబు.
[178] తా. జంధ్యాలు.
[179] తా. వాయఁబెట్టి.
[180] తా. ప్రాప్తమైన.
[181] తా. పట్టణంబున దేశంబు పరిణమింప.
[182] తా. నామిత.
[183] ము. రవిసుత.
[184] ము. కవులు భికములుగ నవమ ఘటికలు.
[185] తా. యంతఃపురచారిణి యొక్క చకోరనేత్రి విన్నవించిన నవ్వాక్యంబు.
[186] తా. తలయంటి ధవళనిద్రాకుంభ.
[187] తా. ప్రేమ, మువ్వంబుతో.
[188] తా. గమల.
[189] తా. మంచిము ట్టెదుర.
[190] ము. గండతైల.
[191] ము. మందుకొనువారు.
[192] తా. నప్పటి.
[193] తా. వెలకెలం. ము. వెలకిల్లఁ.
[194] తా. శశాంకశేఖరాంశు.
[195] తా. జరధమేఢ్రంబు.
[196] తాళపత్రమున నిచట రెండు మూడు పద్యములకు వలసిన చోటూరకే విడిచి యున్నది.
[197] తా. చక్రవాకముల్.
[198] తా. వైన.
[199] ము. పాన్పుఁ బొత్తులపై నొప్పెఁ బవ్వళించి.
[200] ము. యప్డు.
[201] ము. యపుడు.
[202] ము. అక్షయవర్ణితాఖ్యుఁడు గరంబు(?) సువర్ణ.
[203] ము. ని గాండివధన్వుని తండ్రియౌ సహస్రాక్షునివైరి పేరురమునందు.
[204] ము. దృష్టులు.
[205] ము. సకలజనులును బంధులు సంతసింప.
[206] ము. కంతలంతలను వేడ్కల్ మీఱి చూడంగఁ దాఁ.
[207] తా. రావంబు
[208] తా. జారువడినిం.
[209] తా. కక్ష్యాది భాగంబులన్.
[210] తా. ననంతసంతోషాక్రాంతస్వాంతులగు దంపతుల.
[211] ము. గఁ గుమారత్నంబునకుఁ గ్రమ.
[212] ము. వక్కాణించె మహనీయ.
[213] ము. వదనికాదులు జూదమాడంగ నెఱిఁగెను మదనశాస్త్ర. తా. వదనికాదులును జూదంబు గణితశాస్త్ర ముద్రంబు దెలిసె.
[214] ము. జాలంబు యంత్రక్రియా మంత్రతంత్ర చిత్తరువు గఱచె.
[215] తా. కరభటజ్ఞానవీథికి గాలుసాఁచె.
[216] తా. అభ్యసించెను విపులవైద్యములు నేర్చె.
[217] ము. పారీణు
[218] తా. సజలబలధరంబునకుఁ జక్రవాకంబును.
[219] తా. కల్పపాదపంబునకుఁ గుసుమప్రకారంబును.
[220] తా. దానంబునకు నాత్మశ్లాఘావిపర్యయంబును.
[221] తా. కనురాగంబైన యవ్వనం బావిర్భవించిన.
[222] ము. తానొప్పి చారులీలఁ.
[223] ము. బౌరజనులకు.
[224] ము. త్కారము.
[225] ము. రకుఁడు.
[226] తా. డ బాలుఁ డోషోష్ఠమదమున.
[227] తా. రూఢి.
[228] తా. ప్రౌఢిచూపు.
[229] ము. భాండక.
[230] తా. ప్రౌఢలైన.
[231] తా. పిల్లదీపాటలను.
[232] తా. వెలుఁగుటలును.
[233] తా. కావలంబంబును.
[234] తా. నిద్రలకు.
[235] తా. నివాస.
[236] తా. ప్రస్థాపనయు.
[237] తా. ప్రసవి.
[238] ము. పరిపాటలోష్ఠుండు.
[239] తా. కరిభుజుండు.
[240] ము. వలీ.
[241] ము. పరి.
[242] తా. ముత్యాలతారహారములు దాల్చి.
[243] తా. కళలైన.
[244] తా. నటింప.
[245] ము. కమలకర్ణిక.
[246] తా. చెంప లలవరింప.
[247] తా. ఆవజముతో చెరికము నలవడంగ.
[248] ము. పాతకంబు.
[249] తా. కోటవెట్టు నేమంబు నిలుచు.
[250] తా. చింతించని.
[251] తా. అభిలషించని.
[252] తా. అద్దంబు సూడని యంగనయును.
[253] తా. చెలువచేతను.
[254] తా. జాదుకొనం బులకించని. ము. బాదుకోఁ.
[255] తా. మై తోఁచె.
[256] ము. ఁజేలవిహారంబు సేమమయ్యె.
[257] ము. రంబు.
[258] ము. మయ్యె.
[259] ము. లు.
[260] ము. యయ్యె సమస్త.
[261] ము. లకు నెల్ల.
[262] తా. సవరదనమునుఁ జనువు.
[263] తా. తమ్ము.
[264] తా. మయి పులకించుకొనుచు.
[265] ము. చరాచరావతారుఁడవన్న.
[266] ము. నందంబు.
[267] ము. తరార్థముగఁ.
[268] ము. మదబల.
[269] తా. డైన.
[270] తా. వింట జిక్కని జవరాలి.
[271] తా. సలుపు.
[272] తా. నెట్టు.
[273] తా. యట్ల.
[274] ము. వలపించు.
[275] ము. రమియించు.
[276] తా. సంధ్యాది వందన.
[277] ము. మాపె.
[278] తా. వైశ్వదేవముమీఁది విశ్వాసము త్యజించె హంతకారము బుద్ధి నపనయించె.
[279] ?. దేవతార్చనము మీఁది ప్రయత్నమును మానె చదువు శాస్త్రము నౌరుసౌరు పరచె.
[280] ము. దనకు మరగిన వారసుందరవనితల.
[281] ము. నిరతసల్లాపసంభోగనిపుణతా సు-.
[282] ము. ఖానురాగనిమగ్నుఁడై నిత్యకర్మమై తనర్చెను సుకుమారధరణిసురుఁడు(?)
[283] ఈ భాగమున ముద్రిత ప్రతిలో నివియున్నవి.
వ.ఇవ్విధంబునఁ గుమారుండు విహరింపఁజూచి.
క.ప్రేమమునఁ గూర్చు సుతునకు, వేమఱు సద్బుద్ధి చెప్ప వినమికి వగచున్,
సామగ్ర్యదుర్గుణాళి క,దా మధురత యొసఁగు విషమమగు చలమునకున్.

[284] తా. ఆ సంబంధంబు లాడుచు.
[285] తా. సక్షమంబువ
[286] తా. నియమక్రమంబేది.
[287] తా. ఏమఉనొకొ.
[288] తా. జవ్వనములు.
[289] తా. ఇట.
[290] ము. బ్రశంసింప.
[291] ము. విషయంబు.
[292] తా. నామ్రేడితామ్నాయనంబు.
[293] తా. నాలింగ.
[294] తా. ననవకీర్ణియు.
[295] ము. యార్య.
[296] తా. దుర్బుద్ధియు.
[297] తా. ధరియించి.
[298] ము. సముండు.
[299] తా. బంధమై.
[300] ము. నత్తఱి.
[301] తా. తన కుచితోపదేశంబు.
[302] తా. బీక నివేదించుట.
[303] తా. మెప్డోరుసౌరు.
[304] ము. వృత్తి.
[305] తా. జయోపాయభూతములైన.
[306] తా. శాహవపదమైన నీ. ము. శోన్నతవంశపదమైన.
[307] ము. శ్రుతివైభవములేమి.
[308] తా. ము. గురుల నీక్షించినట్టి.
[309] ము. ఒక్కఁడవు నీవు.
[310] ము. గోరముగను.
[311] ము. శిరసున.
[312] తా. వగవకుండని.
[313] తా. బెట్లని.
[314] ము. పాత్ర కవితా.
[315] ము. రూఢి లీలావతారా.
[316] తా. మృత్‍స్వచ్ఛ.
[317] ము. హేలా. *తాళపత్రమున లేదు.
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - SivarAtrimAhAtmyamu - prathamASvAsamu - SrInAthudu (telugu andhra)