కావ్యములు శివరాత్రి మాహాత్మ్యము శ్రీనాథుఁడు

శివరాత్రి మాహాత్మ్యము (సుకుమార చరిత్రము)

చతుర్థాశ్వాసము

ఇష్టదేవతా ప్రార్థనాదికము
క.శ్రీతరుణీ[1]సితవిలసన-
జాతశివానూనభక్తిసంపద్గురు వి-
ఖ్యాత[2]నుతకీర్తి సితజీ-
మూత[3]సితాఖిలదిగంత ముమ్మయశాంతా.
1
ఆ.వె.అక్కథకుఁడు శౌనకాదులైన మహాము-
నీంద్రులకుఁ బ్రియమున నిట్టులనియె
నట్లు భూమి విడిచి యరుగవలయు నింక
ననుచు మాటలాడు నవసరమున.
2
క.తెలతెలవాఱుచు వచ్చెం
బలపలనయ్యెం బయోదపథమునఁ దారల్
[4]కలవింకంబుల కోమల-
కలకలములు చెలఁగెఁ [5]గాళికావిపినమునన్.
3
సీ.సంభోగపరిఖిన్నశబరసీమంతినీ- | స్వేదవార్బిందువిచ్ఛేదకారి
విఘటమానాంభోజవిపినషండమధూళి- | పరిమళాసారసంపర్కసురభి
సమదకాంతారకాసరయూథ[6]రోమంథ- | సంభూతడిండీరశకలవాహి
లలితలుంగలవంగలవలీమతల్లికా- | లాస్యోపదేశలీలాగురుండు
 
గీ.యామినీశేషతుహినధారానుషంగ | జడిమభరమంద [7]సంచారచతురశాలి
యల్లనల్లనఁ [8]బొలుపారె నడవిలోనఁ | గాల్యసంధ్యాసుగంధుండు గంధవహుఁడు.
4
ఉ.క్షోణిరుహాగ్రభాగముల జోకలుగట్టి వనీశిఖావళ-
శ్రేణులు తాండవంబు లొనరింపఁగ మంద్రగభీరభంగి శ-
ర్వాణిగృహంబులోని బలివైభవలీలకు మ్రోసెఁ గంచుని-
స్సాణము మాటిమాటి కనుశబ్దము లీనఁగ గోపురంబు[9]నన్.
5
శా.నిష్ఠాసంపద నర్ఘ్యపాణు లగుచున్ విప్రుల్ ప్రశంసింప మం-
జిష్ఠారాగము లంబకంబున నధిష్ఠింపన్ నిలింపాద్రిభూ-
కాష్ఠామధ్యమునందుఁ దోఁచెను శతాంగప్రష్ఠసర్పద్విష-
జ్జ్యేష్ఠుం [10]డప్పుడు నిష్ఠురప్రదరబంహిష్ఠద్యుతిశ్రేష్ఠతన్.
6
వ.ఆ దివసంబున.7
ఉ.జాతరచేసె బ్రాహ్మణుఁడు చండికిఁ గమ్మని పిండివంటతో
నేతులతోడ మద్దికడ నిర్మలినన్నాముతో రసావళీ-
చూతఫలాళితోడ వరసూపముతో జిఱువాలతోడుతన్
[11]నీతులతోడ నప్పు డకనిష్ఠతరంబగు నిష్ఠ పెంపునన్.
8
వ.నాఁటిరాత్రి *(నిశా)సమయంబునఁ గాలకంఠకంఠమూల కాకోలవిషమషీ కళంకచ్ఛాయాసముల్లాసంబు *(నుల్లసనంబు) నుల్లసంబాడు నిబిడాంధకారంబున [12]నన్నెలవు గదలి చండాలియుం దానును సుకుమారుండు దుర్గమాటవీ[13]విషయంబు హూణదేశంబు గడచి ప్రతిదినప్రయాణంబుల నెడనెడం బక్కణ (గ్రామఘోషంబుల భిక్షాహార గోరస క్షౌద్రంబులనుం గందమూలంబులనుం గర్కంధూ [14]లికుచ కదలీ చూత మాతులుంగ లవలీ జంబూ తాల తిందుక ద్రాక్షాఫలంబులను శరీరయాత్ర నడుపుచు గంధసింధురఘటాకరటఫలక తటగళితమదజలాసారధారాసారిణీసంపర్క చంద్రకిత[15]బంధకిని యగు సింధురనది యుత్తరించి, యుత్తరాభిముఖుండై జంబూద్వీపవిశ్వంభరానితంబబింబ జాంబూనదమేఖలాపాశంబగు కాంభోజదేశం బతిక్రమించి, యభ్రంకష విశంకట శిఖరోత్సేధ బహులమహీధరస్కంధసంకులంబగు కిరాతమండలంబు పొత్తెంచి యందు బృందారకనగర సౌందర్యంబు ధిక్కరించు వైభవాధిక్యంబునం బ్రసిద్ధిగాంచి [కాంచీ]పట్టణంబునకుం జుట్టంబన నవంతికి సామంతంబన మధురకుం బ్రతియన మాయకుం బ్రతిచ్ఛాయనా నయోధ్య కధ్యాహారంబన ద్వారవతికిం బ్రతియన గాశికిం గీసవెలితియన నొప్పు వణిక్పథంబను [మ]హానగరంబు ప్రవేశించి.9
ఉ.ఎంతయుఁ గాల ముండెను మహీసురుఁ డప్పురియందు వేదవే-
దాంతపురాణతత్వవిదులైన ధరామరు లుద్ధరింపఁగా
శాంతియు దాంతియుం ధృతియు సత్యము శౌచము బాహ్యవృత్తి య-
భ్యంతరవృత్తి ధౌర్త్యమును బాయక యెప్పుడు జెల్లుచుండఁగన్.
10
గీ.బ్రహ్మపురివాడలో వణిక్పథమునందు
జరిగె సంస్పృష్టిదోషంబు జరభి కతన
నెవ్వ రేలాగువారొ యెట్లెఱుఁగవచ్చు
జగతిఁ గల [16]దిజ్యదోష మజ్ఞానకృతము.
11
గీ.విభవముల [17]వడ్గు పెండ్లిండ్లు విందు వీడు
భోజన ప్రతిభోజనమ్ములను వ్రతము-
లాదిగాఁ గల తిథులందు నతనిఁ గూడి
వ్య[వ]హరించెను వీట బ్రాహ్మణకులంబు.
12
గీ.నెలత బొమ్మంచు పుట్టంబు నెఱిక గట్టు
కాంత ధరియించు పచ్చనక్షకల బొట్టు
నింతి యొడికంబుగా వాడు నిల్లుబట్టు
వీటి విప్రాంగనలు దన్ను వినుతి సేయ.
13
సీ.కృపకు నాధారంబు కీర్తి కావాసంబు | దానధర్మముల కాధానకంబు
మూలంబు కాంతి కావాలంబు దాంతికి | నఖిలవిద్యలకును నాలయంబు
మంగళంబుల కిక్క మదవికారములకు | దూరంబు [18]నురువు సాధుత్వమునకు
దావానలము రాగతరుపల్లవములకు | నపలేపతిమిరసంహతికి హేళి)
 
గీ.[19]పట్టణము బ్రహ్మపురివాడ బ్రహ్మలోక- | మునకు సయిదోడు మోసల మోక్షమునకు
దూషితంబయ్యె సంసర్గదోషకలన | నంటుముట్టునఁ గలుషితంబయ్యె నాడు.
14
క.తనయల (నిద్దఱ) నిద్దఱు
తనయులనుం గాంచి కాలధర్మమునొందెన్
[20]వనజాస్య [21]గట్టివయసునఁ
దనయుఁడు పరలోకవిధులు తల్లికిఁ [22]జేసెన్.
15
గీ.ఏమి చెప్పంగ [23]నఱువదియేండ్ల వయసు
ముసలి సుకుమారుఁ డేకాంతమున రమించెఁ
గూఁతు లిద్దఱ బొమలపైఁ గురులు వ్రాలు
నంతమాత్రపుఁ జిన్నిప్రాయంబు వారి.
16
వ.అంతం గొంతకాలంబునకు వాని దుశ్చేష్టితంబు లెఱింగి బ్రాహ్మణులు *(వానిని) బహివెట్టి యూరు వెడల నడిచి యారూఢపతితుండైన వాని సంసర్గంబునం బుట్టిన దోషంబు బుద్ధిపూర్వకంబు గాదు కావునఁ గొంద ఱుపవసించియుఁ గొందఱుత్తప్తకృచ్ఛ్రంబు లనుసరించియుఁ గొందలఱుు కృచ్ఛ్రాతికృచ్ఛ్రంబులు నడిపియుఁ గొందరు చాంద్రాయణంబు లాచరించియు (నెట్టకేలకు విశుద్ధి గావించిరి సుకుమారుండును).17
సీ.(చెలికారు లంజనాచల గండ)శిలలకు | యమదూతలకు నభిధాంతరములు
ప్రతిబింబములు కాళరాత్రియామములకు | బుత్రసంతానంబు భూతములకు
నశుభకర్మముల కన్వాదేశములు మౌని- | శాపాక్షరములకు సంగడీలు
[24]కలికాలమునకు డగ్గఱిన చుట్టంబులు | ధూమకేతువులకుఁ దోడునీడ-
 
గీ.లంధకారంబులకు విందులనఁగ గిరుల- | యందు వర్తించు చెంచుల నాశ్రయించి
మనువు మనెఁ గూఁతులును దాను మహిసురుండు | కొంతకాలంబు మనములోఁ గుత్సలేక.
18
క.ఎనుబది యేఁడుల వార్ధక-
మునఁ [25]బ్రాజనశక్తి యుడిగిపో దాతనికిం
దినియెడిది పెద్దమాంసము
కొనియెడి[26]యది కల్లు మనసు క్రొవ్వెట్టుడుగున్.
19
గీ.కాంచె నిద్దఱు సుతుల నక్కామినులకు
వావి వర్ణంబు మాలిన వద రతండు
శాస్త్రములఁ జెప్పఁ[27]బడిన దోషంబు లెన్ని
యన్నియును జేసె నాతఁ డేమనఁగఁ గలదు.
20
వ.అంత.21
క.హేమంతము శరదాగమ-
సామంతము [28]తుహినకణవిసంస్థులశబరీ-
సీమంతము మదనబల-
శ్రీమంతము [29]డాసె భువనసీమంతంబై.
22
మ.బలసుల్ పండెను దొండముక్కు వడియెం బ్రాసంగుచేల్ పోఁకమో-
కల పూఁబాళలతావిఁ గ్రోలి [30]పొదలెం గౌబేరదిగ్వాయువుల్
ఫలినీవల్లిమతల్లివల్లరులపైఁ బైపై నలివ్రాతముల్
పొలసెన్ మంచులు రాలె రాత్రికరిణీఫూత్కారవార్బిందువుల్.
23
చ.కలమవనాళికాకణిశకంటకకోటులచేతఁ జూడ్కి కిం-
పలవఱిచెన్ ధరిత్రి తుహినాగమవేళఁ దటాకసారణీ-
సలిలము వాఱి పండిన యజాంగలసీమము లెన్ని యన్నిటం
దలమగు సీతు పేర్మి గరు దాల్చిన భావము ప్రస్ఫుటంబుగన్.
24
క.కలవింక కలకలాకుల
వలభీగర్భములు సౌధవాటములు పురం-
బులయందుఁ దుహిన[31]వేళలఁ
జలి [32]గులగులఁ గూయునట్టి చందంబొందెన్.
25
క.పెనుఁజలి గడగడ [33]వణఁకుచు
వనదేవత [34]దంతవీణ వాయించెనొకో
యన మోకప్రేంకణంబుల
[35]ననగుత్తుల మొఱసె నలిగణము విపినములన్.
26
శా.బింబోష్ఠీకుచకుంభభారము లురఃపీఠంబులన్ హత్తి మో-
దంబారన్ మృదుకేళిశయ్యల శుభాంతర్గర్భగేహంబులం
దాంబూలీదళ[36]పూగపూరితముఖుల్ ధన్యాత్మకుల్ శీతకా-
లం బెంతేనియు నిద్రవోదురు నిశల్ సంభోగలీలావధిన్.
27
సీ.ధనదశుద్ధాంతకాంతాపయోధర[37]భార- | సంవ్యానపల్లవస్రంసనములు
కైలాసగిరికూటకల్పద్రుమాటవీ- | కుసుమగుచ్ఛరజోఽ[38]వగుంఠనములు
చంద్రభాగాసరిత్సలిలవీచీఘటా- | ప్రేంఖోలికాకేళిరింఖణములు
[39]రాఢాపురీహర్మ్యరత్నహేమగవాక్ష- | సంవేశనక్రియాసౌష్ఠవములు
 
గీ.వలనుగాఁ జంపకారణ్య[40]వాటిఁ దరిసి | కాశి యొరసి కళింగాంధ్రదేశసరణి
దక్షిణము సాఁగెను సపాదలక్షశైల | [41]కటకబంధుఁ డుదగ్దిశాగంధవహుఁడు.
28
గీ.చలి ప్రవేశించు నాగులచవితినాఁడు
మెఱయు వేసవి రథసప్తమీదినమున
నచ్చసీతు ప్రవేశించుఁ బెచ్చు పెరిఁగి
[42]మార్గశిర పౌషమాసాల మధ్యవేళ.
29
గీ.ఇనుఁడు కోదంటరాశిమీఁ దెక్కువేళ
నిక్షుకోదండవల్లి యెక్కిడు మరుండు
సమదవేదండసమమహాసత్త్వుఁడయ్యు
జనుఁడు కోదండమును బోలెఁ దనువు వంచు.
30
గీ.ఇండ్ల మొదలను నీరెండ [43]నీరికలను
ననుఁగుఁదమ్ముఁడు నన్నయు నాటలాడు
నత్తయును గోడలును గుమ్ములాడుఁ గుమ్ము
[44]గాఁచుచోటికి మకరసంక్రాంతివేళ.
31
సీ.కాశిలోఁ జక్రపుష్కరిణి [45]దుష్కృతశుష్క- | గహనావళీదావదహనజిహ్వఁ
గుక్కుటేశ్వరవరకుండి [46]పిఠాపురి- | నఘతమస్కాండచండాంశుదీప్తి
దక్షవాటంబు సప్తర్షిగోదావరి | కలిదోషపాషాణకులిశధార
గౌతమీతటిని మార్కండేయుపురి మ్రోల | దురితాహిసంఘాతగరుడమూర్తి
 
గీ.నిన్నిటను దీర్థమాడంగ నేఁగుదెంతు- | రఖిలమునులుఁ బ్రభాతసంధ్యాగమముల
గ్రహగణేశుండు కోదండరాశిఁ బాసి | మకరమున కేఁగుదేరంగ మాఘవేళ.
32
మ.పఱివోయెం దుహినంబు పండె వరి యిప్పల్ వూసె శైలంబుల
[47]గఱివోగట్టెన్ వలరాజు తేఁటియెఱకం గాండప్రకాండంబులం
జఱపించెన్ గ్రహరాజు [48]మాఠరకునిం జక్రాద్రికూటంబునం
దఱిఁ గౌబేరదిగంతరిక్షపథయాత్రాజైత్రతుత్తుంభమున్.
33
వ.వెండియుం జకోరలోచనల కుచమండలంబులకుఁ గర్పూరఖండక్షోదంబుల మేదించిన చందనానులేపనైపథ్యం బపథ్యంబయ్యె. రథ్యవేగంబున ననూరుసారథి రథంబు ప్రతివిఘట్టనక్షుణ్ణ నక్షత్రక్షోదపాళీ చుళుకితోర్ధ్వాండభిత్తియై యుత్తరాయణంబు గైకొని కులూతశాతోదరీకపోల ముకురబింబంబులం బ్రతిబింబించె. సవ్యాపసవ్యక్రమంబునం జక్రమిథునంబుల నెట్టుకొని బిట్టేసియేసి విసిగి నిల్చి మనోభవుండు నిగిడించిన నిట్టూర్పునుం బోలె నిశాసమయంబుల నిండువెన్నెలలోనం జిన్నిచిన్ని నులివేఁడివడి పొడచూపె. కేదారక్షేత్రంబులం గలమగోపిక లొడికంగా దంచి (సడించిన) నిద్దంబులగు [49]దుద్దుగడు ప్రాసంగుఁబ్రాలు సద్యోమార్జనావశంబున నతిస్నిగ్ధవర్ణంబులై కర్ణాటదేశ[50]తాటంకినీ దశనవజ్రాంకురంబుల కాంతిసంపదలఁ [51]దలపించె. నీహారవ్యపాయంబున నిర్మలంబులై బహుళపక్షప్రదోషంబులయందు దారకంబులు వికచకుముదకోరకంబులు *(కెలంకులఁ) గొలంకులలోనం బ్రతిబింబించి మదకలకలహంసత్రోటికోటీవిఖండి మృణాలదండఖండంబుల భావంబు భజించె. హృదయోత్కంఠాతిరేకంబునఁ గంఠమూలకఠోర కాలకూటవిషమషీ కళంకపంకచ్ఛాయచ్ఛాటా[52]కంఠోక్త భువనరక్షాదాక్షిణ్యుండు దాక్షారామ భీమేశ్వరుండు దక్షిణజలధివేలావలయితంబులగు నేలాలవంగలవలీమతల్లికా కుడుంగక్రోడంబులం గ్రీడించుటకునై సారంగలోచనలుఁ దానును గోరంగి వెడలె. [53]వలవలని మంచుఁ దుప్పర ముసురుజడిం దడిసి జడనుపడి [54]వేగుఁబోఁకల పోఁక పూబాళల పరిమళంబులఁ [55]బుక్కిలించి యుమియుచుఁ, బక్కణంబులలోన నల్లనల పొలుపారు నడవికరువలి యసమసవిషమ కుసుమఫలక్రీడామతల్లికల [56]మల్లు పెనంగి డస్సిన భిల్లపల్లవాధరల గల్లఫలకంబులఁ గ్రొత్త యుదయించు చెమట చిత్తడి యుడిపె. కాశి శ్రీశైల [57]కుంభఘోణ శోణార్క కాంచీ కాంచనసభా కాళహస్తి కురుక్షేత్రాది పుణ్యస్థానంబులం గూపవాపీతటాకకుండికా [58]ప్రస్రవణశ్రోతస్వినులం బ్రత్యూషకాలంబులం బరమర్షిసార్థంబు తీర్థంబాడె నివ్విధంబున మాఘమాసవాసరంబులు వసంతసమయసామంతంబులు జరగుచుండ నా చండాలాది మసుష్యులకు భుక్తిముక్తులు ప్రసాదింపఁజాలి మాహేశ్వరులకు మహోత్సవంబు పాశుపతులకుం బ్రీతి కాలాముఖుల కవలంబంబు ముములకు మనికి జటాధారుల కాధారంబు పరివ్రాట్టులకుఁ బట్టుఁగొమ్మ వేదాంతులకు సంతోషం బాగమికులకు భాగధేయంబు మాంత్రికులకు మనువు తాంత్రికులఁ దావలంబు పౌరాణికులకుఁ [59]బ్రాణం బౌపనిషదుల కుపాయంబు ముముక్షులకు రక్ష శంభునకు విస్రంభస్థానంబు శాంభవికి [60]హృత్కరంబంబు హేరంబునకుం బ్రియంబు తండువునకుఁ బండువు కుమారస్వామికిం బ్రేమాస్పందంబు భృంగిరిటికిం దంగెటిజున్ను దురితతరుషండఖండనంబునకు గండగొడ్డలి యఘపటలతిమిర[61]సముదాయాహిమ ఘృణిసంతానంబు సంతాపశాంతికి భాగీరథీప్రవాహంబు శివరాత్రి పుణ్యకాలం బేతెంచిన.34
సీ.ఆ వణిక్పథమున కనతిదూరంబున | గవ్యూతియెడ నుదక్పశ్చిమమునఁ
బర్వతోపత్యకాపర్యంతతటమున | సికతా[62]తినిర్మలక్షేత్రసీమ
మాలూరతరుషండమధ్యభాగంబునం | బ్రస్రవణాపగాపార్శ్వభూమిఁ
గుసుమవాటికలలోఁ గువలయాంభోరుహ- | కుముదమండితమైన కొలనితోడఁ
 
గీ.గోటతో గోపురములతోఁ గుట్టిమాట్ట- | మండపంబులతో మహామహిమ నొప్పు
[63]నాదిమధ్యాంత నాగేశ మనఁగ నొక్క | పుణ్యతీర్థంబు [64]త్రైలోక్యపూజితంబు.
35
గీ.అందు శేషప్రతిష్ఠితుం డమృతదివ్య-
లింగమంగళమూర్తి ఖట్వాంగపాణి
యర్ధశశిమౌళి నాగేశ్వరాహ్వయుండు
ప్రతివసించు ననేకకల్పములనుండి.
36
వ.ఆ శివరాత్రి పుణ్యకాలంబున.37
సీ.శివగంగఁ బుణ్యాభిషేకంబు దీర్చిరి | దరి నొనర్చిరి [65]మూఁడు తర్పణములు
ధరియించి రంబునిర్ధౌతవస్త్రంబుల | నాచరించిరి బ్రహ్మయజ్ఞతంత్ర-
మర్ఘ్యాంజలిక్షేషపణానంతరమ్మునం | దొనరించి రంశుమంతున కుపాస్తి
గృహదేవతార్చనక్రియ లాచరించిరి | యభ్యాగతులకు నర్హణలు నడిపి-
 
గీ.రవని[66]సురులెల్ల నాగేశ్వరాలయమున | కేఁగుదెంచిరి ప్రణమిల్లి రీశ్వరునకు
(జాగరమునకు) నాలుగు జాలుఁ బూజ- | [67]కాదిసంకల్ప మొనరించి రభవు మ్రోల.
38
గీ.ఆదరంబున సమ్మార్జనానులేప
ధూపపటువాసనలు తైలదీపములును
సంఘటించిరి వివిధసంస్కారవిధుల
బ్రాహ్మణులు నర్హులైనట్టి పౌరజనులు.
39
సీ.కాంస్యతోరణమాలికలు సంఘటించిరి | ప్రాసాదగోపురాభ్యంతరముల
రంభాతరుస్తంభసంభారములు సము- | త్పాటించి రొగిఁ బ్రతిద్వారమునను
బూజోపకరణపాత్రీజాత మఖిలంబు | సంస్కరించిరి భస్మసలిలశుద్ధిఁ
గరమొప్పు వృషభపుంగవకేతనంబులు | నిలువంగఁ బెట్టిరి వలభులందుఁ
 
గీ.గమలనీలోత్పలంబులుఁ గర్ణికార- | [68]మాలతీకుందములు హేమమరువకములు
మల్లికాకింశుకము లపామార్గవకుళ- | పాటలంబులుఁ గూర్చి రపారములుగ.
40
గీ.అపుడు సుకుమారకాహ్వయుం [69]డపరసంజ
నేఁగుదెంచెను నాగేశ్వరేశు గుడికిఁ
బుష్పవాటికలోఁ [70]గమ్మపువులఁ గోసి
పొలఁతులకు నిద్దఱకుఁ గొంచుఁబోవఁ దలఁచి.
41
క.కుడిచేత మాంసఖండము
[71]లెడకేలను మద్యరససహితమగు కంచుం
గుడుకయు ధరించి మదమున
వడవణఁకులు గొనుచు నతఁడు వచ్చెన్ గుడికిన్.
42
వ.జన్మాంతరస్థుండు వోలె రూపాంతరగతుండు వోలె నావిష్టుండు వోలె భూతాధిష్ఠితుండు వోలె గ్రహగృహీతుండు వోలె [72]నున్మత్తుండునుం బోలె మదిరామదాతిరేకంబునఁ దన్నుఁ దా నెఱుంగక పరిసరలతాకంటకానుషజ్యమానాంశుకోత్తరీయుండును నజ్ఞాతసమవిషమమేదినీభాగ విన్యాసప్రస్ఖలిత పాదద్వయుండునునై పలితపాండురంబులగు శిరోరుహంబులు విరిసి వీఁపునం బడ నొయ్యనొయ్యన నేతెంచి నిర్లజ్జుండును నిస్నేహుండును నృశంసుండును నగు నక్కర్మచండాలుండు గర్భగేహంబునకుఁ జక్కం గట్టెదుఱ నిలిచి రక్తకమలదళచ్ఛాయంబులగు కన్నులు దెఱచి విఘూర్ణమానతారకంబైన [73]వికారాలోకనంబున నలవోకయుం బోలె నిర్మలస్ఫటికమండపాధ్యాసీనుండును నమృతమయ జ్యోతిర్లింగమూర్తియు ముక్తాఫలధవళకాంతియుఁ ద్రిభువనవందితచరణుండును జరాచరగురుండును నగు నాగేశ్వరుని దర్శించి యమ్మహాదేవు [74]మౌళికపాలమాలికామండన ఖండేందు[75]శకలంబులకు గగనగంగాప్రవాహడిండీరఖండంబులకు నుష్ణీషఫణిఫణాఫలకంబులకుఁ జెలికారంబు సేయం జాలి పాంచజన్యసహోదరంబులన దుగ్ధాంబురాశిహృదయంబులనఁ జంద్రికా[76]శరణంబులన [77]నంగజాట్టహాసచ్ఛేదంబులన మెండుకొనియున్న పుండరీకంబుల పూజ గనుంగొని వెండియు.43
ఉ.చాయన భోగిరాట్కటకసన్నిధిదీపిత దీపమాలికా-
చ్ఛాయఁ బురఃప్రదేశమునఁ జాఁగిన నిర్జరవాహినీమహా-
తోయము సావి చీర యెగఁద్రోచి చొరంగఁ దలంచె నెంత లోఁ-
తో యని కొంకికొంకి పతితుం డతఁ డాసవపానవిక్రియన్.
44
గీ.పవనవశమునఁ గేతకీప్రసవధూళి
యంగమున హత్తియుండంగ నాతఁ డపుడు
విమలభస్మసముద్ధూళన మొనరించి
పాశుపతదీక్షఁ గైకొన్న భంగి నుండె.
45
చ.కలఁగఁగఁ బాఱె నాతని యఘంబులు పంచహృషీకసంభవం-
బులు బహుకాలసంకలితముల్ దవవహ్నిచిటచ్ఛిటధ్వనిం
గలఁగఁగఁ బాఱు పక్షుల ప్రకారమునం దొలుజాముపూజకై
బలుపటహమ్ము ఠమ్మనుచు భర్గుని గేహమునందు మ్రోసినన్.
46
వ.ఆ శివరాత్రి పుణ్యకాలంబునఁ బురాణంబులు వినిపించువారును నితిహాసంబులు చదువువారును బంచాక్షరీ పంచబ్రహ్మాది మంత్రంబులు జపించువారును నీలకంఠస్తోత్రంబులు పఠించువారును బ్రాణాయామంబు లనుసంధించువారును బ్రత్యాహారంబులు నడుపువారును [78]బ్రదక్షిణంబులు సేయువారును భస్మోద్ధూళనంబు లొనర్చువారును దురోదరంబుల వినోదించువారును నష్టావధానంబులఁ గ్రీడించువారును వీణ లాస్ఫాలించువారును గావ్యగోష్ఠి సలుపువారును బరిహాసం బాదరించువారును బిందుమతి యభ్యసించువారును బ్రహేళికలు భావించువారును నాడువారునుం బాడువారును మేషకుక్కుట [79]కరేటు లావుక కపింజల యుద్ధంబులు వీక్షించువారును గుబ్జవామన కిరాతబర్బర జరఠమూక జనవికారంబు లవలోకించువారునై జాగరంబులు సలుపుచునుండిరి. సుకుమారుండును నొక్కించుక యన్నుం [80]దేఱికొని వారిం జూచుచుండె నప్పుడు శివగంగానిర్ఝరజలతరంగ శీకరజాలజనిత జడిమంబులు నందిరోమంధ ఫేనబిందువాహులుం గుమారశిఖికలాప విధూననక్రియాలలితంబులుఁ బశుపతిజటాబద్ధ వాసుకినిపీతశేషంబులు హేరంబగండమండలనిష్యందమాన దానధారాకలుషగంధలహరీ పాణింధమంబులు భృంగిరిటి నికుంభ కుంభోదర ప్రముఖ నిఖిలగణపరిషద్ధూళితభసిత ధూళికావిసరంబులు[81] మాతృకాశ్రవణావతంసకహ్లారకోరక ప్రేంఖోళనప్రక్రియా సమభిహారానుమేయావతరణంబులు మహిసాక్షి గుగ్గులు ధూపధూమకంబులు మాలూరకిసలయామోద మేదురంబులు నగు మహాదేవనిశామారుతంబు లతనిమీఁద బొలుపారి పాతకంబులు దూల రాల్చె నట్టి సమయంబున.47
గీ.అర్ధరాత్రంబుదాఁక నయ్యధమవృత్తి
[82]శివనిశావైభవంబు వీక్షించి చనియెఁ
దానకమునకు నది యాదిగా నతండు
విడిచెఁ దొల్లింటి [83]తన నీచవృత్తిబుద్ధి.
48
వ.అంతఁ గొంతకాలంబునకు.49
క.కుక్కలలో శబరులలో
గక్కెర చిమ్మటలలోనఁ గార్కోళులలోఁ
బక్కణము గుడిసె నడుమను
గుక్కిపయిం జచ్చె నతఁడు ఘోరవ్యాధిన్.
50
క.శ్రీనాగేశ్వరశంభు-
స్థానంబున [84]గిరిశరాత్రి జాగర మలవో-
కైనను గనుఁగొన్నట్టి క-
తానను విగతాఘుఁడై యతఁడు మృతిఁ బొందెన్.
51
సీ.క్రిమి కంఠకుహరమార్గమున కడ్డము దొట్టి | పెద్దయేనియు బాధపెట్టకుండ
శ్లేష్మ ముద్రేకించి సెలవి రంధ్రమువాయ | మెఱసి నుచ్చిళ్ళు గ్రమ్మింపకుండ
దృగ్గోళకంబులు దిరుగంగఁ[85]బడి దృష్టి | యంధకారంబులో నణఁగకుండ
నెఱిదప్పి యుచ్ఛ్వాసనిశ్వాసపవమాన- | పరివాహగతు [86]లోటువడకయుండఁ
 
గీ.బరమయోగీశ్వరుఁడు వోలె బ్రహ్మరంధ్ర- | వీథిఁ బ్రాణంబు విడిచె నవ్విప్రకులుఁడు
పుణ్యశివరాత్రి నలవోక వోలెనైన | నురగధరుచెంత జాగరంబుండెఁ గాన.
52
వ.ఆ కాలంబునఁ గాలకింకరులు మృత్యుదేవతాసహితులై ముసలముద్గర (ఖడ్గ)తోమరాది ప్రహరణంబులతో(డం గదిసి) అతని లింగశరీరంబు వరుణపాశంబుల బంధించుకొనిపోవఁ గణంగిన నవ్వేళ శివదూతలు శివాజ్ఞావశంబున శూలాంకుశగదాభిండివాలపరిఘపరశ్వధ(పాణులై యేతెం)చి దవ్వుల నాకాశమార్గంబున.53
ఆ.వె.ఓరి యమునిదూతలార యీ బ్రాహ్మణుఁ
గరుణ మాలి యేల కట్టినారు
విడుఁడు శివుని [87]యాన మృడునాజ్ఞ [88]దాఁటి మీ
రాజు (చెడుట యెఱు)గరా మదించి.
54
మాలిని.విడుఁడు విడుఁడు వీనిన్ విప్రునిన్ భాగ్యవంతున్
మృడుఁడు గరుణతోడన్ మిక్కిలిం గారవించెన్
జడుల కొరుల కేలా సంభవించున్ యథార్థం
బడర మఱి మృ(డానీళానుకం)పాలవంబుల్.
55
గీ.[89]యజ్ఞదానతపస్సూనృతాదులైన
పుణ్యకర్మం బొనర్చిన పురుషునందు
నెట్లు సంతోషమండు నర్ధేందుమౌళి
యట్టి సంతోష మితనియం దావహించె.
56
వ.అనిన యమకింకరులు శంకరకింకరుల కిట్లనిరి.57
సీ.[90]ఏ కార్యమునకయి యెచ్చోటి కరిగెద | [91]రరుగుఁడు మీరు మహాత్ములార
యితని క్లేశము చూచి యతికృపాపరతమై | పు(రుషార్థ మొన)రింప బూనినారె
హరుకింకరుల మన్న నాశ్చర్యమయ్యెడు | సదసద్వివేకంబు చాలకునికి
భవభక్తులకు నడ్డపడుట ధర్మము మీకు | నేమేల పట్టుదు మీశుభక్తు-
 
గీ.నితఁడు కలుద్రాగె ఱంకాడె [92]నెఱచిఁ దినియె | నిలిచి మూత్రించెఁ జండాలలలనఁ [93]గూడెఁ
గూఁతు రమియించెఁ దెరువాటు గొట్టెఁ బ్రజలం | జెంచురాజుల సేవించెఁ జెఱిచెఁ గులము.
58
సీ.కేలుదోయెత్తి మ్రొక్కెనె పాశుపతులకు | శరణార్థి [94]యనియెనే జంగములకు
ఫాలభాగమునందు భస్మంబు పూసెనే | యఱుతఁ దాలిచెనె రుద్రాక్షపూస
శివమంత్ర ముచ్చరించెనె జిహ్వ [95]తుదయందు | నరిగెనె యెన్నఁడే నభవుగుడికిఁ
బఠియించెనే మహాప్రమథచారిత్రంబు | తిరిగెనే మృడుపుణ్యతీర్థములకు
 
గీ.[96]దోసములు పెక్కుఁ చేసినఁ జేసెఁ గాని | కాలగళుభక్తి యావంతఁ గలిగెనేని
యడ్డపడ ధర్మమౌఁ [97]గాక యనఘులార | యర్హమే యీ దురాత్మున కడ్డపడఁగ.
59
ఉ.ఎట్టుగ నేఁగుదెంచితిరి యిందుకళాధర[98]భృత్యులార యీ
చెట్టదురాత్మునిన్ హరుని [99]చెంతకునుం గొనిపోవువారలై
యెట్టొకొ శంకరుం డొకని నెవ్వనినేఁ గొనితేరఁ బంపినం
బట్టఁగ [100]వచ్చినారొ తడఁబాటున వీని మతిభ్రమంబునన్.
60
సీ.అని హేతువులును దృష్టాంతంబులును జూపి | యమ(భృత్యు లియరైరి) యవనిసురుని
నూరకయుండె మృత్యువు నోర్ గదల్పక | భవునిచే మును పడ్డపాటుఁ దలఁచి
వరుణపాశములచే [101]వ్యథితచేతస్కుఁడై | సుకుమారుఁ డెంతేని స్రుక్కుచుండె
నెదురుచూడఁ దొణంగి (రీశ్వరయములును) | తారు పంచినవారు తడయుటయును
 
గీ.గాలయాపనమునకు నిగ్రహముఁ బూని | శంభుకింకరు లపు డవష్టంభ మెసఁగ
నౌడుగఱచుచు నప్పు డేకాంతముండి | సమధికంబైన సాహసోత్సాహ[102]వృత్తి.
61
ఉ.బిత్తరి దండిమాట లిటు ప్రేలెదరే యమరాజుసేవకుల్
చిత్తజవైరియాజ్ఞ యొకచీరికి గైకొనకంచు నుద్ధతిన్
మిత్తిని వారినిం గదిసి నిర్భరభూరిభుజాబలంబునన్
మొత్తిరి [103]యుర్కి బాహువులు [104]మోడిచి పట్టి వృషాంకకింకరుల్.
62
క.కడవసముల బ్రహరించిరి
యడిచిరి లాతముల మొత్తి రహివలయములం
బిడికిళ్ళను ఘట్టించిరి
తడఁబడ మృడుభటులు దండధరుకింకరులన్.
63
వ.*(ఇట్లు) మొత్తువడి యమకింకరులు [105]శంకరకింకరులకుం బ్రతిఘటింపక సుకుమారుని బరివేష్టించి యమలోకంబున కభిముఖులై యతనిం గొనిపోవం దొణంగి రప్పుడు రుద్రాక్షమాలికావక్షఃస్థలుండును జంద్రార్ధకృతశేఖరుండును భస్మోద్ధూళితలలితాంగుండును ద్రిలోచనుండును [106]నతిప్రమాణకాయుడును నగు నీలలోహితప్రమథుండు కాలాంబుదధ్వానగంభీరంబైన కంఠస్వనంబున నిట్లనియె.64
సీ.పడసె నెవ్వని కృప బ్రహ్మ బ్రహ్మత్వంబు | విష్ణుండు విష్ణుత్వవిభ్రమంబు
నీరేడుజగములు నెవ్వాని కుక్షిలో | నొక్కఁడొక్కంటితో నొరయుచుండు
నంధకేభజలంధరాది దానవకోటిఁ | గ్రాఁగించె నెవ్వాని కంటిమంట
యామ్నాయశాఖాసహస్రంబు లెవ్వని | నాసికారంధ్రనిశ్వాసధార-
 
గీ.లమ్మహాదేవు లెంకలమైన మేము | భర్త యానతి నిర్వహింపంగఁ [107]దలఁప
మమ్ముఁ జీరికిఁ గైకోక మదము పేరిట | నెట్టు కొనిపోయెదరు విప్రు నెఱయఁగట్టి.
65
ఉ.బుద్ధియ కల్లెనేని కొనిపోకుఁడు ధర్మము సూక్ష్మ [108]మీ యసం-
బద్ధములైన న్యాయములఁ బంతము వచ్చునె [109]మేము [110]దెంపుమై
యుద్ధము సేయఁజాలకయ యోహరిసాహరి నెంత చెప్పిన-
[111]న్నిద్ధరణీతలామరుని నీరు చలంబున మీకుఁ దక్కునే.
66
గీ.ఎంత చెప్పిన విన[112]రేమి యీకు మాకు
హరుని యాజ్ఞ[113]య బలవంత మల్పమెట్టు
[114]చాక నొవ్వక మీరు మా కాఁకఁ జెడక
[115]యిద్ధరామరు మాకిప్పు డిచ్చు టొప్పు.
67
క.నావుడును యమునిదూతలు
భావభవారాతి[116]ప్రమథవర్గముతోడన్
సేవకధర్మము తగవును
లావును బంతంబు [117]దృఢబలంబును మెఱయన్.
68
వ.[118]ఇట్లని పలికరి.69
క.చత్తుము చెఱఁబడుదుము కడు
నొత్తుము మీచేత నెట్టునుం దగవు మముం
బుత్తెంచిన పతిసన్నిధి
నుత్తర మెట్లిత్తు మాజ్ఞ యుపహతిఁ బొందన్.
70
సీ.చర్చించి చూడుఁ డా చంద్రార్ధమౌళికి | యమరాజు నిజభృత్యుఁ డౌనొ కాఁడొ
యభవుఁ డిచ్చినయట్టి యధికార మౌఁ గాదొ | యముఁడు గూర్చున్న ధర్మాసనంబు
త్రిపురాసురాంతకు [119]దివ్యదేహము గాదొ | [120]వేదస్మృతులు తత్త్వవిధిఁ దలంప
శిష్టరక్షయు దుష్టశిక్షయు శూలికి | (ననుమతం బౌఁ గాదొ) యాత్మలోన
 
గీ.నవకరము లెన్ని యన్నియు [121]నాచరించెఁ | బాపియగు విని నరకకూపమునఁ ద్రోచి
బాధ పెట్టంగవలసిన పట్టునందుఁ | బంతమే విడుఁ డంట యో ప్రమథులార.
71
ఉ.చచ్చిననేమి మూర్ఛ (నర సచ్చిన)నేమి ప్రహారవేదనన్
నొచ్చిననేమి పండ్లుచెవినోరు కరాంగుళి నేత్రగోళముల్
ముచ్చికనేమి [122]పట్టువడి [123]మొక్కిలి బంధనశాలలోనికిన్
వచ్చిననేమి భృత్యునకు [124]నచ్చిన యేలిక యాజ్ఞపట్టునన్.
72
గీ.తగవు ధర్మంబుఁ పాడి పంతంబు దెలిసి
యనుపుఁ డీ బ్రాహ్మణుని బాధ లనుభవింప
నొండె దురమున మమ్ము మృత్యువు జయించి
విప్రుఁ గొనిపొండు మాటలు వేయునేల.
73
క.మీకును మీ పతియానతి
మాకును మా భర్తయాజ్ఞ మన్నింపఁదగున్
[125]వాకోవాక్యమ్ముల వెడ
వాకాట్లం బల్బజంబు వలవదు సేయన్.
74
క.అని యమునిభటులు పలికిన
విని శంకరభటులు తద్వివేకంబునకున్
మనమున సంతోషించియు
[126]మనసిజహరు శాసనమును మన్నించుటకై.
75
సీ.పొడికచ్చడములపైఁ బులితోలు నునుసేలు | కటిభారమునఁ గాసెకట్టు గట్టి
యభినవంబైన రుద్రాక్ష యొడ్డాణంబు | నాభిచక్రములోనుగా భరించి
ప్రిదిలి జాఱకయుండఁ బెనుఁబాఁప[127]ప్రోఁగులు | [128]శ్రవణభాగమునందు సంతరించి
యల్లిబిల్లిగ జటావల్లీమతల్లులు | గూర్చి పెంపొందఁ గీల్కొప్పు వెట్టి
 
గీ.భసితధూళిశరీర మధ్యంగమార్చి | యుద్దవిడిఁ బారిషదయోధు లొక్కఁడొకఁడ
యాయుధంబులు ధరయించి యట్టహాస- | డమరుకధ్వాన సింహనాదములతోడ.
76
శా.ఆటోపారభటీసముద్భటతరాహంకారబాహాధను-
ర్జ్యాటంకారరవంబు లంబుజభవాండాభ్యంతరంబున్ సమా-
స్ఫాటింపంగ లలాటలోచనభుజిష్యుల్ దండభృద్భృత్యుల
ధాటీసంభ్రమలీలఁ దాఁకిరి వడిన్ ధారాధరాధ్వంబునన్.
77
సీ.ద్రాఘిష్ఠకఠినదంష్ట్రాదండసంఘట్ట- | కటుఘోరకిటకిటాత్కార మగుచుఁ
జటులఝంఝామరుజ్ఝంపాపరంపరా- | సన్నిభఘ్రాణనిశ్వాస మగుచు
[129]వికలతారకచక్రవిభ్రాంతిభీషణ- | స్ఫారచక్షుర్ద్వయీభయద మగుచు
[130]నిటలవీథివిటంకనిర్భరభ్రూకుటీ- | నటనక్రియాటోప[131]పటహ మగుచు
 
గీ.గాలమృత్యువు శాణచక్రమునఁ బట్టి | చికిలిచేసిన యడిదంబుఁ జేతఁ దాల్చి
జేగుఱించిన మొగముతోఁ జిత్తజారి- | ప్రమథవర్గంబుఁ దాఁకె నాగ్రహ మెలర్ప.
78
వ.ఠవణి[132]ఠమరువు ఠమఠమనినదము ఠవణించుచుఁ దచ్చటుల(తర)[133]ఠమామీఠడంబరవిష్కంభము కాష్ఠాకటాహముల నుద్ఘాటింప దినకరకరచ్ఛాయాచ్ఛేదాధిగమమున ధగద్ధగితములగు నిస్త్రింశకుఠారాద్యాయుధదీప్తులు రణలక్ష్మి నివాళింపంగ నపుడు విద్యాధరపన్నగయక్షగరుడగంధర్వాదులు మది నాహ్లాదింపంగ సురముని [134]కుంచె యాడింపంగ నిలింపపదమున భవునిలెంకలు శమనకింకరులును బాహావష్టంభవిజృంభణ మప్రతిహతముగ నొండొరువులఁ దాఁకిన భండనంబు ఘోరంబయ్యెను.79
క.శంకరభటులును నంతక-
కింకరులు మిథఃప్రహార[135]కీలాలసటా-
పంకిలతనులయి కుసుమిత-
కంకేలీతరుల భంగిఁ గనుపట్టి రనిన్.
80
వ.అప్పుడు కింకరులయం దొక్కరుండు యముని సన్నిధికిం జని [136]యతని కిట్లనియె.81
సీ.దేవ దేవర యాజ్ఞధృతి [137]నేము దలఁబూని | మృత్యుతోఁ గూడి భూమీస్థలమున
[138]కరిగి వణిక్పథమను పట్టనమునకు | ననతిదూరమున శైలాంతరమున
నడవిలో నొక మృగవ్యాధపక్కణమునం | [139]దరిగి గేహమున గుష్ఠామయమునఁ
జెడిపెకూఁతురు కాళ్ళకడనుండి యేడ్వంగఁ | బంచత్వ మొందిన పాపకర్ము
 
గీ.బ్రహ్మబంధుని సుకుమారుఁ బట్టి [140]తేఁగ | నభవుదూతలు [141]రానీక యాఁగినారు
మాకు వారికి దురమయ్యె నాకసమున | నెఱుఁగఁ జెప్పంగ వచ్చితి నిత్తెఱంగు.
82
వ.అనిన *(విని) కృతాంతుండు సమధికక్రోధావేశవివశస్వాంతుండై యులుంబరుండను సేనాని రావించి యతనితో నిట్లనియె.83
గీ.చను ములుంబర వృషభలాంఛనుని లెంక-
లాఁగినారఁట మనవాండ్ర నాకసమున
నొక్క పాపాత్ముఁ గొనిరాఁగ నుద్దవిడిని
నేఁగి యా జటాధారుల నెగిచి రమ్ము.
84
క.గబ్బున [142]నెదిరించిన నొక
దెబ్బగొను(ము నీకు) నెదురె త్రిజగమున నొరుల్
తబ్బిబ్బుగ జంగములకుఁ
బబ్బంబులు పెట్టు ముష్టిపరిఘట్టనలన్.
85
గీ.వ్యాధు లష్టోత్తరశతంబు వచ్చుఁగాక
తోడ నేతెంచుఁగాక మృత్యువులు నూఱు
పంపినారము మున్నాడి భటులఁగూర్చి
కాలమృత్యువు గెల్చు శంకరునిహితుల.
86
వ.అని పల్కిన వల్లెయని యులుంబరుండు వివిధవ్యాధిమృత్యుపరివృతుండై కదలి యుద్దవిడిఁ దూర్యంబులు మొరయఁ ప్రమథానీకంబుఁ దాఁకి శస్త్రజాలంబులు నిగుడ్చి పేర్చి యార్చినం గోపించి పంచవదనుభటులు కుటిలభ్రూభంగభూషణంబులగు మొగంబులు జేవుఱింప నట్టహాసంబు చేసి యదల్చి డమరుడిండిమ [143]ఠమఠమధ్వానంబుతోఁ గీనాశకింకరుల ముసల భిండివాల తోమర మండలాగ్ర త్రిశూల పట్టిసంబులఁ బ్రహరించిన విచ్ఛిన్నబాహూరుచరణవక్షః(కటికంఠ)లలాటకృకాటులై విచ్చియు నొచ్చియుఁ జచ్చియుఁ దెరలియుఁ బొరలియుఁ దోఁగియుఁ డాఁగియుఁ (గొంచియు జలించియు) గ్రుస్సియు డస్సియుఁ గందియుఁ గుందియుఁ దారియు (దేరియు) మ్రొగ్గియు డగ్గియు నలసియు సొలసియు [144]వికావికలై దిక్కామొగంబులై యౌరుసౌరులై [145]గురియై బందబందై భండనంబు విడిచి వలియ(ఁబాఱి వెళ్ళఁబాఱుచు) *(వెలవెలంబోయి) కృతాంతుని సన్నిధికిం బోయిరి. ఇట జటాధారులు సుకుమారుని బంధనంబు లూడ్చి యతని మున్నిడుకొని [146]హొన్నాళంపుఁ గరాచూరి చాయలం బంటించు మింటితెఱువునం జనిరి. అప్పుడా [147]సుకుమారుండు పుణ్యశివరాత్రివ్రతాలోకనప్రభావంబున.87
తాళ రగడ.దవుదౌవులఁ గాంచెం గైలాసము తరుణేందుకళాధరుని
నివాసము దశహరి[దవధి]స్థానస్థపుటితధవళచ్ఛాయాచ్ఛేదవిలాసము
ధ్రువమండల[వీథీ]సంరోధిస్థశృంగశృంగాటకవిహర-
త్ఖచరయక్షగరుడగంధర్వ[148]ప్రమదాస్తోమవిహితలీలాపరిహాసము
నవలేపాటోపసముద్భటవిఘ్నాధిపదీర్ఘవిషాణప్రఘణన-
వ్యాఘట్టన[[149]హర]పాదాద[ళితస్ఫటిక]ప్రస్థతటధ్వనివిసరము
[150]నవిహితలాక్షాముద్రానిగదవ్యాఖ్యాతాశోకలతాపల్లవ-
[151]యాథాతథ్యవిజిత్వ(ర)నీహారాద్రిసుతాచరణా[ధి]న్యాసము.
88
సీ.కామధుగ్ధేనుసం(ఘముల) తొఱ్ఱులు గాంచెఁ | గాంచెఁ గాంచనరత్నకందరములు
కాంచెఁ గల్పకవాటికాసహస్రంబులు | సిద్ధరసాపగాశ్రేణిఁ గాంచె
బహుహిరణ్మయమహాప్రాకారములు గాంచె | నమలిన(స్ఫటికసౌ)ధములు గాంచెఁ
బ్రబలచింతామణీస్పర్శవేధుల గాంచె | నానావిమానరత్నములు గాంచె
 
గీ.హావభావవిలాసరేఖావిశేష- | హారి [152]మూర్తుల రుద్రకన్యకలఁ గాంచె
(నంది దోడ్కొ)నిపోవ నర్ధేందుమౌళిఁ | గాంచె సుకుమారుఁ డంబికాకాంతు శివుని.
89
వ.కాంచి దండప్రణామంబులు చేసి చేతులు [153]మోడ్చి (సుకుమారుండు) నమశ్శంకరాయ, శశాంకమూర్ధాలంకారాయ, [154]త్రిపురపురంధ్రినీరంధ్ర స్తనకుంభ[155]సముత్తంభిత కస్తూరికాస్థాసకముద్రా ద్రోహిబాహార్గళస్తంభాయ, జంభారిప్రముఖ నిఖిలదేవతాకోటిహాటక కిరీటకోటివిటంక[156]సందానిత మందారమాలికామకరందబిందునిష్యందధారాధౌత చరణారవిందాయ, జలంధరాసురకంధరాపీఠికావిఘట్టనక్రియాగరిష్ఠనిష్ఠురతా శశ్వ[157]ద్విభంగఖట్వాంగపాణయే, పశ్యల్లలాటాయ, మదనమదగదాగదంకారాయ, సంధ్యానటాయ. కరకలితడమరు[158]డాంకారబృంహిత బ్రహ్మాండమండలాయ, చండికాధిపతయే, నిరస్తసమస్తోపాధికాయ, సచ్చిదానందస్వరూపాయ, *(స్వమహామహిమప్రతిష్ఠాయ, నిరుపాధిక నిరవధిక నిర్ణిరోధ నిరవగ్రహ నిరభిసంధి నిర్భర కృపాసంపత్సపూర్ణ మేధసే, [159]నృకపాలమాలికాభరణాయ సముద్దండపుండరీక) క్రవ్యాదకృత్తికంధాధురంధరస్కంధభాగాయ, భగవతే ధన్యోఽస్మి! కృతపుణ్యోఽస్మి! *(నమస్తే నమస్తే) అని పలికి వెండియు.90
తాళ రగడ.జయజయ శంకర జయజయ పురహర జయజయ (కరుణా)గుణవరుణాలయ
జయజయ తుహినక్ష్మాధరకన్యాసహచర శాక్వరవర శుభకేతన
జయజయ మందర[160]కుధరోల్లుఠనాసంక్షుభితమహాక్షీరోదన్వత్
జఠరక్రోడప్రభవద్గరళజ్వలనగిళనకల్మాషితకంధర.
91
వ.అని యనేకప్రకారంబులం బ్రస్తుతించిన సుకుమారుని మీఁదఁ గరుణాకటాక్షవీక్షణంబు లొలయించుచు విరూపాక్షుం డతనికిఁ గామగమనంబును హేమకింకిణీమాలికాసనాథంబును రుద్రకన్యాసహస్ర[161]సంకులంబునునగు దివ్యవిమానం బొసంగి ప్రమథత్వంబు కృపచేసెఁ బుణ్యవంతుల భాగ్యంబునకుం గొలఁది గలదె; యింక నెయ్యది [162]యడిగెద రడుగుండని సూతుండు నైమిశారణ్యనివాసులగు మహామునులకు సవినయంబును సస్నేహంబును సగౌరవంబునుగా విన్నవించిన.92
గీ.పరమమునులు సూత్యాహసంభవుని సూతు
భక్తిఁ బూజించి యధికతాత్పర్య[163]గరిమ
భటులు ప్రమథులచే భంగపడుట చూచి
చిన్నవోయి యముం డేమిచేసెఁ బిదప.
93
మ.కరుణాసాగర శైవశాస్త్రకలనాగాంభీర్యశౌర్యోన్నతా
తరుణీమన్మథరాజపూజితకళా[164]ధర్మక్రియాసంస్తుతా
వరనీతిప్రతిభావిశేషకలనా వాగీశసంకాశ శ్రీ-
తరుణీనాథమనోజ్ఞరూప[165]విలసత్కావ్యార్థసంబోధనా.
94
క.ధర్మార్థాలయవరగుణ-
నిర్మాణవిశేషవిభవనిరుపమకార్యా
కర్మోత్కటబహు[166]గుణవృత-
నిర్మలసుజ్ఞాన[167]చతుర నిశ్చలధైర్యా.
95
మాలిని.శతధృతి[168]మతిదీపా సారనిర్మాణరూపా
సతతసుఖవినోదా సామగానప్రమోదా
వితతకవివరేణ్యా [169]వీరశైవాగ్రగణ్యా
యతులబలవివేకా హర్షనైర్మల్యపాకా.
96
గద్యము.ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర *(సకలవిద్యాసనాథ) శ్రీనాథనామధేయ ప్రణీతంబయిన శివరాత్రి మాహాత్మ్యంబునందుఁ జతుర్థాశ్వాసము. 

[1] తా. సుర.
[2] తా. తరకీర్తి.
[3] తా. శివాసిత.
[4] ము. కలకలవింకల కోమల.
[5] తా. కాళి విపినములోనన్.
[6] ము. సమ్మర్ద.
[7] ము. చతుర సంచారకారి.
[8] ము. బొలుపారు నడవి నడుమఁ.
[9] తా. లన్.
[10] తా. డర్కుఁడు.
[11] తా. నేతుల.
[12] తా. నన్నెలవులం గదలి.
[13] తా. విషయంబునుంగా.
[14] తా. వితికుచ.
[15] తా. బంధకిణియగు.
[16] ము. దిజ్జ.
[17] తా. వడుగు.
[18] తా. ఉరుఉ.
[19] ము. గీ. గ్రామఘోషంబు పురివాడ బ్రహ్మలోక-ము ... ..డు మొగసాల.
[20] తా. వనజాక్షి.
[21] తా. గండివయసున.
[22] తా. దీర్చెన్.
[23] తా. నిరువది.
[24] తా. కలికాలములకు.
[25] ము. బ్రాక్తన.
[26] ము. దిది.
[27] తా. బడ్డ.
[28] ము. తుహినకణవిసంజ్ఞిత శబరీ.
[29] తా. సకలభువనసీమంతంబై.
[30] ము. పొరలెం.
[31] తా. వేళన్.
[32] తా. కులంకుల.
[33] తా. వడఁకుచు.
[34] తా. దండవీణ.
[35] తా. సనగుత్తులు.
[36] ము. భాగ.
[37] తా. భాస.
[38] తా. వకుంఠనములు.
[39] తా. రాధరాపురి.
[40] తా. పాళి.
[41] తా. కటకబంధుండు తద్దిశా.
[42] తా. మార్గపౌషమాసంబుల మధ్యవేళ.
[43] ము. నీడికలను.
[44] తా. గాయుచోటికి.
[45] ము. దుష్కరశుష్క.
[46] ము. పీఠపురి శంకాతమస్కాండ.
[47] తా. గరిమందెన్.
[48] తా. మాఠరునిచే.
[49] తా. మద్ది ... పుడుంబ్రాలు నిగనిగడాలు సద్యోమార్గావకాశంబున విశుద్ధస్నిగ్ధవర్ణంబులగు.
[50] తా. తాటంకినుల.
[51] ము. దలంచె.
[52] ము. కుండు భువన.
[53] తా. పలపలని.
[54] ము. వ్రేఁకలగు పోఁక.
[55] తా. బుక్కిలించుమియుచు.
[56] తా. మల్లువెనంగి.
[57] తా. కుంభకోణ కోణార్క.
[58] తా. ప్రస్రవస్రోతస్వినులం.
[59] తా. ద్రాణం.
[60] ము. హృదయోత్కంఠయు.
[61] తా. సముదయాహి.
[62] తా. వినిర్మల.
[63] తా. నాదిమధ్యంబు.
[64] తా. నాగేశపూజితంబు.
[65] పుణ్యతర్పణములు.
[66] తా. బుధులెల్ల.
[67] ము. నాది.
[68] మాలతీందుక హేమాంబుమరువకములు.
[69] ము. డదరువజ్జ.
[70] తా. గొమ్మపువ్వు.
[71] తా. పెడ.
[72] ఉన్మత్తుండ పోలె.
[73] తా. కేకరాలోకంబున.
[74] తా. మౌళిం గపాల.
[75] తా. శకలంబునకు.
[76] తా. ధవళంబులన.
[77] ము. నంగజాట్టహాసంబు.
[78] తా. అంగప్రదక్షిణంబులు.
[79] తా. నక్రకరలావుక.
[80] తా. తేఱికొన.
[81] తా. భసిత దవచితధూళికా ధూళిపాళికాసరంబులు.
[82] ము. శివు.
[83] ము. నీచపువృత్తిబుద్ధి.
[84] ము. గిరిశురాత్రి జాగరములు ... ... నను.
[85] ము. దృష్టియు.
[86] తా. లొంటిబడకయుండ.
[87] తా. యాజ్ఞ.
[88] ము. దాఁట.
[89] ము. అన్నదాన.
[90] తా. ఏ కార్యమునకునై.
[91] తా. అరుగుడా.
[92] తా. సతిని విడియె.
[93] తా. గవిసె.
[94] ము. ననియెనే.
[95] ము. నే ప్రొద్దు.
[96] ము. దానములు, పెక్కుఁ జేసినదానఁ గాని.
[97] తా. గాన.
[98] తా. భక్తులార.
[99] తా. చేరువకుం.
[100] తా. వచ్చినారు.
[101] తా. వ్యథితమనస్కుడైఁ.
[102] తా. మమర.
[103] తా. యుల్కి.
[104] తా. మోడ్చిరి.
[105] తా. శంకరభటులకుం.
[106] తా. అతిప్రమాణోపాయుండును.
[107] ?. దగదొ.
[108] తా. మిట్లు.
[109] తా. యేము.
[110] తా. నగ్గలింపగా.
[111] తా. న్నిద్ధరణీసురోత్తముని.
[112] తా. నేమొ నేము మీకు.
[113] తా. యు.
[114] తా. చాల నొప్పక పరిభూతిఁ జటులపడక.
[115] తా. యీ ధరాసురవరుని మాకిచ్చు టొప్పు.
[116] తా. ప్రముఖ భటవర్గముతో.
[117] తా. కడుఁ జలంబును.
[118] తా. ఇట్లు వలికి.
[119] తా. దివ్యాజ్ఞ యౌఁ గాదొ.
[120] తా. వేదస్తుతులు.
[121] తా. నాచరించి.
[122] ము. పట్టపతి.
[123] తా. మొక్కిలి.
[124] తా. వచ్చిన.
[125] తా. వాకోపవాక్యముల.
[126] తా. మనసిజహరు శాసనమున.
[127] తా. ప్రొగ్గళ్ళు.
[128] తా. శ్రవణపాశమునందు.
[129] తా. వికట.
[130] తా. నిటలభేరి.
[131] తా. లటహ.
[132] తా. డమరువు ఢమఢమ.
[133] తా. డమా విరడవాడంబర నిరష్కంధము.
[134] తా. కుంచియ.
[135] తా. కృతరుధిరపటా.
[136] తా. యతనితో నిట్లనియె.
[137] తా. తోడఁ.
[138] ము. ఁజని వణిక్పథమను ఘనపట్టనమునకు.
[139] ము. గుష్ఠామయంబునఁ గుతిలపడఁగ.
[140] తా. తేర.
[141] తా. రాకుండ నాఁగినారు.
[142] తా. నేతెంచిన.
[143] తా. ఢమఢమ.
[144] తా. పికాపికలై బిక్కామృగంబులై.
[145] తా. గురిగురిలై బండుబండై.
[146] తా. హిన్నాళంబు కరాచోళి చాయలం బట్టించు.
[147] తా. బ్రాహ్మణుండు.
[148] తా. ప్రమథ.
[149] ము. పారద. తా. హపార.
[150] ము. నవిహితరూక్షా.
[151] ము. యాథాతవ్యయ విజిత్వనీహారాద్రి. తా. యాథాతవ్యయ విజిత్వర.
[152] తా. మూర్తులు.
[153] తా. మొగిడ్చి.
[154] ము. త్రిభువన.
[155] తా. సమస్తస్తంభిత.
[156] ము. సంవాసిత.
[157] తా. ద్విఘంగణా లంఘపాణయే.
[158] ము. ఠాంకార.
[159] ము. వృషాంక.
[160] ము. కందర కంధర.
[161] తా. సంనుతంబును.
[162] ము. (వినవలతు).
[163] తా. గతి యమ.
[164] తా. ధామ.
[165] తా. విలసత్కార్యార్థసంబోధనా.
[166] తా. గణవృత.
[167] తా. వరిత.
[168] ము. విస్ఫురత్పుణ్యగణ్యా.
[169] ము. యతులఫలవివేకా.
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - SivarAtrimAhAtmyamu - prathamASvAsamu - SrInAthudu (telugu andhra)