కవితలు | దాశరథి కవితలు | గాలిబ్ గీతాలు | ![]() |
గాలిబ్ గీతాలు - దాశరథి
మార్చి 1961.
(మిర్జా అసదుల్లా ఖాన్ గాలిబ్
27, డిశంబరు 1797 : 15, ఫిబ్రవరి, 1869)
అనువాదరీతి
....
....
అయఃపేటికలలో భద్రపరచబడిన మణిని సాధించడం ఎంత కష్టమో పద్యాలలో డాగిన గాలిబ్
హృదయాన్ని అందుకోవడంకూడా అంతశ్రమతో కూడిన పని. ప్రతి పద్యాన్నీ ఆకళించుకొని, ఆ పద్యానికి
వివిధవ్యాఖ్యాతలూ, విమర్శకులూ చెప్పిన అర్థాన్ని చదివి, నాకు స్ఫురించిన అర్థాన్ని జీర్ణించుకొని,
త్రేన్చి తెలుగురూపంలో మళ్లీ ఆ హృదయాన్ని ఆవిష్కరించడం కొంత క్లిష్టమైనపనే. ఒక్కొక్క పద్యాన్నీ
తెలుగులోకి దింపడానికి రోజులురోజులు పట్టేవి. అప్పటికీ సంపూర్ణంగా మూలార్థం రాకుంటే మళ్లీ
మార్చవలసివచ్చేది. ఇది అనువాదం కాని అనుసరణ కాదు. కనుక నా కల్పన ఈషణ్మాత్రమూ పనికిరాదు.
తెలుగుపాఠకులకు గాలిబ్ భావం అందడానికి కావలసిన హంగులు చేయడానికి మాత్రమే నాకు అధికారం వుంది.
అంతకు మించి లేదు. ఇలాటి నిర్బంధాలతో ఈ అనువాదానికి ఉపక్రమించాను. బాగా జనాదరాన్ని పొందిన ఆయన
పద్యాలు ఇంచుమించు అన్నీ తీసుకున్నాను. క్లుప్తత (Brevity) చెడకుండా రెండు పాదాలలోని భావాన్ని రెండు
పాదాలలోనే చాలావరకూ ఇమిడ్చినాను. ఎక్కడో మరీ వివరణ అవసరమైనచోట నాలుగుపాదాలుగా పెంచాను.
అనువాదానికి ఆటవెలది, తేటగీతం వాడుకున్నాను. ఎక్కడో ఒకటి రెండు చోట్ల ద్విపదను, రగడను ఉపయోగించినాను.
....
....
ఏను స్వయముగా కవితన్ వరింపలేదు, తానె వరియించె కైతల రాణి నన్ను. |
|
ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము, నరుడు నరుడౌట యెంతో దుష్కరమ్ము సుమ్ము. |
1 |
వేరులోనుండి కొమ్మలు వెలసినట్లు అన్నిశబ్దాలు నిశ్శబ్దమందె పుట్టె. |
2 |
స్వీయలోపమ్ము లెరుగుట పెద్ద విద్దె; లోప మెరిగినవాడె పూర్ణుడగు నరుడు. |
3 |
పత్రమున నగ్ని శిఖ భద్రపరుచవచ్చు, హృదయమున దుఃఖబాధ భరించలేము. |
4 |
ఈ జగత్తు స్వభావమ్ము నేమియందు! మంచి చేసిన వానిని ముంచు నౌర! |
5 |
నరములం దందరికి రక్త మురుకుగాని కంత జారని దెట్లు రక్తమగునోయి? |
6 |
ఆవల వెడలక నిలిచిన అశ్రుకణము పెను తుఫానుగా వెడలి వచ్చినది నేడు. |
7 |
అన్ని రోగములకు నౌషధం బుండియు ప్రణయరోగమునకు కనము మందు. |
8 |
భిక్షుకునివంటి వేషము వేసినాను; దాతలగువారి చేతలు చూతునింక. |
9 |
బ్రతుకుపై నింత విశ్వాస పడెదరేల? ఏడి మాంధాత? పురుకుత్సు డేడి నేడు? |
10 |
గ్రీష్మమున వాన కురిసిన నూష్మమెసగు, అట్లె కన్నీటితో గుండె నగ్గి పెరిగె. |
11 |
సహృదయమునకు బయట సన్మానమబ్బును శుక్తివిడిన నాటి మౌక్తికముగ. |
12 |
మహిత కస్తూరికా పరిమళము లొలుకు సరస మధుధారకైగదా స్వర్గవాంఛ! |
13 |
సింధువునుజేరి బిందువు సింధువగును; ధ్యేయమునుబట్టి ప్రతిపని దివ్యమగును. |
14 |
చక్రవర్తిచేతి స్వర్ణపాత్రికకన్న నాదు మట్టిచిప్ప నయము లెమ్ము. |
15 |
నిప్పు నీళ్లలో చల్లార చప్పుడగును, ఎదియు గతియించునపుడు రోదించుగాదె! |
16 |
సంతసముగోరి మధువాను చవట యెవడు? లోకమెల్లను మరువ గోరుదును నేను. |
17 |
ప్రేయసిగృహవీధి స్పృహతప్పి పడిపోయి ముదితకాలిగురుతు ముద్దుగొంటి. |
18 |
బాధ కలిగినపుడు పలవించెదను నేను, నాది హృదయమోయి, కాదు రాయి! |
19 |
కత్తి చేతలేక కదనమ్ము జరిపెడి ఇంతి కెవ్వ డసువు లీయకుండు? |
20 |
బ్రతికినన్నినాళ్ళు వెతలు తప్పవు కదా! మృతియె వెతలదీర్చు మేటి మందు. |
21 |
వెతల నోర్తుమేని వెత లంతమైపోవు, సులభమగు నలభ్యములును దాన. |
22 |
ప్రళయ ముండెగాని, తలప నద్ది వియోగ రాత్రికన్న భీకరమ్ముకాదు. |
23 |
వలపు లేనాడుగాని నిష్ఫలమ్ము గావు, కాయ కాయని వృక్షమ్ము కాదు వలపు. |
24 |
బాధలో నాకు రుచి కనుపట్టగానె చాన నన్ను బాధించుట మానుకొనెను. |
25 |
నేను నీ వాకిటనె కట్టినాను గృహము, ఇంకనైన నా యిల్లెటో యెరుగలేవె? |
26 |
బిందు వణగారి సింధువై వెలసినట్లు రుజయు పెంపొంది ఔషధరూప మందు. |
27 |
సఖికి కాన్క సమర్పింపజాల నేను, ఈయగదు హృదయమె లేకపోయె నాకు. |
28 |
ఆమె సౌందర్యమును చూచినంత తెలిసె ప్రళయ ఝంఝాప్రభంజనబాధ యేమొ. |
29 |
ఖైదులో నాకు నీ జడమీది చింత, దానితోగూడ శృంఖలాగ్లాని కొంత. |
30 |
గ్రంథిపడనినాడు కలవయ్యె నఖములు; గ్రంథిపడెను నేడు, కలదె నఖము? |
31 |
ఈ యజాండమ్మునందు నశించు నన్ని, గాలిలో దీపమ ట్లుండెగాదె రవియు! |
32 |
నీటిచుక్క ముత్తెమౌట వర్జించెను, కనులలోన నిలువగలిగె నిపుడు. |
33 |
గుండె దొంగిలించుకొనిపోయె జంకక, ముద్దొసంగ వెనుకముందులాడు. |
34 |
చిత్రగుప్తుడు వ్రాసినమాత్ర మనము పాపు లగుదుము; సాక్షి యెవ్వండు కలడు? |
35 |
నేను మరణింప నాయింటిలోన దొరికె ప్రేయసుల చిత్తరువులును, లేఖ; లంతె. |
36 |
డాగె పరదాల పగలు తారాగణమ్ము, రాత్రి నేమయ్యెనో దిగంబరమ్ములయ్యె. |
37 |
ప్రేయసీకోపవహ్ని తప్పించుకొనగ చత్తమన్నను న న్నది చావనీదు. |
38 |
ఎంతకని వ్రాతు నా గుండెవంత? నింక ఆమెకున్ జూపెదను రక్తిలాంగుళులను. |
39 |
నీకు నేను గిట్టనియెడ సాకి! నాకు చషకమీకుము, దోసిట చాలు మధువు. |
40 |
నేను మరణింప నామె చింతింపదొడగె, ఎంత తొందరగా కరుణించె నన్ను! |
41 |
ఎప్పు డాలించు నామె నా హృదయబాధ? అదియు నానోటినుండి యె ప్డవధరించు? |
42 |
హృదయమందునుండి ఉదరమ్మునకు చేరి రెంటి కలిపె నీదు కంటిచూపు. |
43 |
వచ్చె నరుణతరుణ వాసంత సమయమ్ము, గోళ్లు మరల గుండె గోకజొచ్చె. |
44 |
ఏదొ వక్షమ్మునందు బాధింపదొడగె; హృదయమా! కాదు, బాణంపుటినుపముక్కు. |
45 |
ఏల నన్ను మరచె నెరుగబోయితి; నామె వలపుచూపు చూచె, భస్మమైతి. |
46 |
భ్రమరరోదన మెట్లు వ్యర్థముగ బోవు? వెలది పువుగుండె వేయిముక్క లయిపోయె. |
47 |
దుఃఖములు ధీరులకు నొక్కత్రుటిని తగ్గు, వైద్యుతాగ్నితో దుఃఖదీపంబు వెలుగు. |
48 |
ఎచట నీ పదాంకముల నీక్షింతు, నచట అడవిదారియు నందనమట్లు తోచు. |
49 |
కానుపించుగాని గమ్యమ్ము చిక్కదు; నేను నడచినట్లు తాను నడచు. |
50 |
ఎంతొ ఉత్సాహపడుచు కష్టింతు మౌర! మృతియె లేకున్న రుచి యేది బ్రతుకులోన? |
51 |
గాలిబా! నీదు తాత్త్విక కలన యహహ! త్రాగకుండిన నిను మేము యోగి యనమె? |
52 |
హింసపడు మాకు బ్రహ్మాండ మెంతొ ఇరుకు, అందు గగన మ్మొక పిపీలికాండ మంత. |
53 |
పానశాలయె లేని దేదైన నేమి? బడి, మసీదు, సత్తరువు సర్వమ్ము నొకటె. |
54 |
స్వాస్థ్యమెడలిన మందిచ్చువాడు వలదు; ప్రాణములు పోవ నేడ్చెడివాడు వలదు. |
55 |
కుసుమములు విచ్చె, మొగ్గలుకూడ విరిసె, తెల్లవారె, నాయమ కన్ను తెరువలేదు. |
56 |
ద్వారబంధములును తలుపుతాళము లేని, ఇరుగుపొరుగు లేని ఇల్లు వలయు. |
57 |
మాటలాడువాడు, మందలించెడువాడు నెవడు లేనియెడ వసింపవలయు. |
58 |
సంతసం బింక నెట్టుల సాధ్యపడును? మెదడునను పూలతోటలు, మది నెడారి. |
59 |
ఆమె తోటకు వాహ్యాళి కరిగె నంట, ఇంక తోటలో పూలు వాంఛించు నెవడు? |
60 |
ఎవతె అధరచక్రమును భావించినానొ రేయి మదినిండ చుంబనశ్రేణి వెలసె. |
61 |
ఈయెడారిముండ్ల కెడద ముక్కలుచెక్కి పూలవోలె నిలుపజాలినాడ. |
62 |
మెరుపులో, అగ్నికీలలో దొరుకబోని అందచందాలు గల ఆ యొయారి యెవరు? |
63 |
వత్తునని రాక, నాయింటి వాకిలిని నన్నె కావలిగా నిల్పినా వదేమె? |
64 |
భ్రుకుటిక్రిందుగ నయనముపోల్కి, గురువ! ఆలయముపంచలనె పానశాల వలయు. |
65 |
ఎడద నాది లోలోన దహింపజొచ్చె కప్పుకొనియున్న బూదిలో నిప్పువోలె. |
66 |
అందకత్తెలతో మాటలాడుకొఱకు చిత్రలేఖనవిద్య నేర్చితిని నేను. |
67 |
గుండెలో సఖిపై నున్న కోర్కి చచ్చె, కారుచిచ్చంటి సకలమ్ము కాలిపోయె. |
68 |
నా యెడందగూర్చి నా కేమి తెలియదు; నేను వెదకుచుండ నీకు దొరికె. |
69 |
మచ్చలను మృత్యువే కప్పిపుచ్చకున్న అంబరము లెన్ని యున్న దిగంబరుడనె. |
70 |
మల్లియ, గులాబి, చంపకవల్లి పూచె; రంగు వేరయ్యును వసంతురాక చెప్పె. |
71 |
హరిని ప్రార్థింప తలవంచినట్లుగానె బాగ త్రాగి మ్రొక్కుము మధుభాండమునకు. |
72 |
ఎంత విరుగపూచెనే తోట! శుకపికా లెగురునపుడు పూల తగిలె కాళ్లు. |
73 |
మందుకొఱకు తిరిగి మరి హెచ్చె నా బాధ కాళ్లుకూడ నెత్రు గ్రక్కజొచ్చె. |
74 |
పరుగు లెత్తియెత్తి పట్టుబడితి నేను బందిపోటుదొంగ పదములొత్త. |
75 |
ఆమె పాదతీర్థ మానగోరితిగాని కాళ్లు నేలమీద కడిగె నామె. |
76 |
అశ్రుధారావివర్ణ నేత్రాంచలములు కాంతిలగ గుండెకోసి రక్తమ్ము నిడుదు. |
77 |
ఎవని ఇలు కాదు, వాకిలియేని కాదు, దారిలో కూరుచుంటి, వద్దనెద రేల? |
78 |
పగలు దోయగాబడ, రాత్రి పట్టెనిద్ర, నన్ను దోచిన దొంగకు నతులొనర్తు. |
79 |
మబ్బువచ్చి నాదు మడిని పండింపగా మెరపువచ్చి దాని మ్రింగజొచ్చె. |
80 |
శస్త్రవైద్యు కత్తిసైతము రక్తాశ్రు కణము లొలికె, నీవు కరుగవేమె? |
81 |
నాదు గుండెగాయము కుట్టు సూదికంట అశ్రుజలధార దారమై అవతరించె. |
82 |
నేను తోటలో కాలూనినానొ లేదొ కోకిలాబృందములు కావ్యగోష్ఠి జరిపె. |
83 |
భానుసోమాదులకు తీసిపోని నాదు నేత్రముల నీ పదా లంటనీయ వేమె? |
84 |
నీ పదమ్ముల చుంబింపనీయవేమె? గగనములతోడ సమమైన కానె నేను? |
85 |
నన్ను తోటకు గొంపోకు, నన్ను జూచి పూలకన్నులు రక్తాశ్రువులను నించు. |
86 |
పానసమయాన ఎదవిచ్చి పలుకవేని ఏను త్రాగినమిషను కవ్వింతు నిన్ను. |
87 |
వెలది! నీ ప్రణయాకృతి కొలుతునేని ప్రళయబీభత్సమే ఒక నిలువు చిన్న. |
88 |
ముదిమివలన వలపుపొలికేక లిడనైతి, ఈ వసంతమెల్ల ఇట్లె గడచె. |
89 |
నీదు రోగినిగూర్చి చింతించినారు కాగితమ్మున మందులు కట్టువారు. |
90 |
గాలిబా! త్రాగనని శపథాలు సేతు గాని నీ ఒట్టుపై నమ్మకమ్ము పోయె. |
91 |
నా విరహబాధ నేమందు! నాతిమొగము రేల భావింతు, పొద్దటివేళ కురుల. |
92 |
మనిషి ఏకాకియైనను మనసులోన గుంపులుగ భావములు చేరి గోష్ఠిజరుపు. |
93 |
ఏల కాళ్లు నొచ్చె బాలామణికి? రాత్రి ఎవని స్వప్నసీమ కేగివచ్చె? |
94 |
ఆమె ముద్దిచ్చుటకు వెనుకాడదేమొ! కాని ఇమ్మని అడుగగా లేను నేను. |
95 |
కోమలీ రాగరంజితాంగుళికవోలె ప్రతికుసుమముకుళమ్ము కన్పట్టదొడగె. |
96 |
వ్రీడతో మజ్నువే పురి వీడిపోయె, నన్ననుకరించి చెడిపోవకున్నె వాడు! |
97 |
ఎన్నొ గాయమ్ము లెదనున్న నేమిపలుక, ఏకవ్రణమునకే పువ్వు కేకపెట్టె. |
98 |
ఇంత శ్రమపడి రం గద్దెదేల గోళ్ల? రం గధికమైనయెడల జ్వాలలు రగిల్చు. |
99 |
ప్రేమభిక్షుకునిన్ హింసపెట్టు టరయ ప్రణయసౌందర్య రాజ్ఞికి పాడిగాదు. |
100 |
![]() |
![]() |