కవితలు జాషువ ఖండకావ్యములు
శ్మశానవాటి
భీష్ముఁడు
రాజరాజు
భారతవీరుఁడు (భారతి, జనవరి 1927)
భారతవీరుఁడు (భారతి, సెప్టెంబరు 1928)
శల్యసారథ్యము (భారతి, సెప్టెంబరు 1931)శ్మశానవాటి
ఎన్నో యేండ్లు గతించిపోయినవి గానీ, యీ శ్మశానస్థలిన్‌
గన్నుల్‌ మోడ్చిన మందభాగ్యు డొకఁడైనన్‌ లేచిరాఁ, డక్కటా!
యెన్నా ళ్ళీచలనంబు లేని శయనం? బేతల్లు లల్లాడిరో!
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్‌!
ఆకాశంబును కాఱుమబ్బుగము లాహారించె; దయ్యాలతో
ఘూకంబుల్‌ చెరలాడసాఁగినవి; వ్యాఘోషించె నల్దిక్కులన్‌
గాకోలంబులు; గుండె ఝల్లుమనుచున్నంగాని యిక్కాటియం
దా కల్లాడిన జాడ లే; దిచట సౌఖ్యం బెంత క్రీడించునో!
ఇచ్చోట; నేసత్కవీంద్రుని కమ్మని-కలము, నిప్పులలోనఁగఱఁగిపోయె!
యిచ్చోట; నేభూము లేలు రాజన్యుని-యధికారముద్రిక లంతరించె!
యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ-సలసౌరు, గంగలోఁగలసిపోయె!
యిచ్చోట; నెట్టిపే రెన్నికం గనుఁగొన్న-చిత్రలేఖకుని కుంచియ, నశించె!
ఇది పిశాచులతో నిటాలేక్షణుండు-గజ్జె గదలించి యాడు రంగస్థలంబు;
ఇది మరణదూత తీక్ష్ణమౌ దృష్టు లొలయ-నవనిఁ బాలించు భస్మసింహాసనంబు
ముదురుతమస్సులో మునిగిఁపోయిన క్రొత్త సమాధిమీదఁ బై
బొదలు మిణుంగురుంబురువు పోలిక వెల్గుచునున్న దివ్వె, ఆ
ముద ముడివోయినన్‌ సమసిపోవుట లేదది దీప మందుమా?
హృదయముసుమ్మి, నిల్పిచనియె న్గతపుత్రిక, యే యభాగ్యయో!
కవుల కలాలు, గాయకుల కమ్మని కంఠము లీ శ్మశానపుం
గవనులఁ ద్రొక్కి చూచెడి; నొకానొకనాఁ డల కాళిదాస భా
రవు ల శరీరముల్‌ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే
ణువు లయి మృత్తికం కలిసెనో కదా! కుమ్మరివాని సారెపై
ఆలోకించిన గుండియ ల్గరంగు; నాయా పిల్లగోరీలలో
నే లేబుగ్గల సౌరు రూపఱియెనో! యేముద్దు నిద్రించెనో!
యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో?
యీలోకంబున వృద్ధిగాదగిన యేయే విద్య లల్లాడునో?
ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు; విశ్వంభరా
నటనంబున్‌ గబళించి గర్భమున విన్యస్తంబు గావించి, యు
త్కటపుం బెబ్బులితోడ మేకఁ నొకప్రక్కన్‌జేర్చి జోకొట్టి యూ
ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁగారాడెడిన్‌
వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపుఁ బాలఱాతిగో
రీకడఁ బారవేయఁబడి ప్రేలికలం బొరలాడు ప్రేత మే
యాకటిచిచ్చునన్‌ గుమిలి, యార్చి, గతించిన పేదవాని దౌ
నోకద! వానికై వగవఁ డొక్కండు; దాఁచదు కాటినేలయున్‌
భీష్ముఁడు
వృద్ధవీరుఁడ! నీవయస్సెంత చెపుమ?
తండ్రి మరణించియే మూఁడు తరములయ్యె;
నౌర! భారత యుద్ధమధ్యంబునందు
పడుచు పార్థునిఁ దల్లడపరచినావు
కోడెవయస్సు ని న్నలమి గోటికి మీసము చిక్కునాఁడు, ము
య్యేడిరునాళ్ళు పోరు వెలయించిన భార్గవరాముఁ డెంత య
ల్లాడెనో! మూడుగాళ్ళ ముసలయ్యవు; నేఁటి కెదిర్చి కృష్ణుఁడున్‌
గ్రీడియుఁ దల్లడిల్లి; రవని న్నిను గెల్చు మగఁడు పుట్టెనే?
"వెలిమావుల్‌ రుధిరంబు గ్రక్కె; గతిదప్పెందేరు; సంధించు న
మ్ములతో గాండివమూడె; సాఁగవు కరంబుల్‌; బావ! ఆలంబు నా
వలగా" దంచు ధనంజయుండు కనులన్‌ బాష్పంబుల న్నించఁడే?
బలమో! లేక మహత్త్వమో! యిది తలంపన్‌ రాదు గంగాసుతా?
ఆరయ నీవు ధర్మయున కాయువు పట్టెఱిఁగింపకుండినన్‌
శౌరియు, సవ్యసాచి మరునాడు రణంబున నిల్తురే? కృపా
పారగ! నిక్కపుం గినుక పైకొని నీవు ధనుస్సుఁ పట్టినన్‌
నీరయి పోవె లోకములు! నింగి గుంభిల్లునఁ గూలిపోవదే!
అంబ శిఖండియయ్యె; నతఁడాడుది; వాని మొగంబుఁ జూడనం
చుం బరిపూర్ణ పౌరుష విశుద్ధికి భంగము గల్గకుండ వి
ల్లంబులు బారవైచితివి యర్జునవీరుని కీర్తి నిల్ప! గం
గాంబిక ధన్యయయ్యెనుగదా! నినుగాంచి; ధనుష్మదగ్రణీ!
గురువు గొడ్డలి ద్రిప్పుకొని తప్పుకొనుదాఁక-మరలి వెన్కరాని మార్గణంబు
ముత్తరంబులనుండి ముదిరి ముద్దలుగట్టి-చేవ డిందని పచ్చి యౌవనంబు
వసు సప్తకము సానఁబట్టి జీవము వోసి-యొసఁగు కక్కసపు టాయుధబలంబు
స్వర్గతరంగిణీ స్తన్యంబు బలిమిని-సంప్రాప్తమైన తేజశ్చయంబు
గవ్వకుం గాని పాడు శిఖండిముందు-వ్యర్థపుచ్చితె పార్థుని పరువుకొఱకు!
జగము నగలించు నీ దివ్యశంఖరవళి-పవ్వళించెనె యమ్ములపడక మీద!
కౌరవుని యాస గంగలోఁ గలసిపోయె;
పరశురాముని వేఁడి నిశ్వాసములకు
నింద్రగిరి క్రాఁగి బూదియయ్యెను గదోయి!
శంతనకుమార! నీ విల్లు జారిపోవ.
రాజరాజు
నిన్నుఁ బోలు మహీనేత నిక్కవముగఁ
బుట్టెనో? పరాశరదివ్యముని సుతుండు
మున్ను, మాతాత పరిహాసమునకుఁ గాను
కల్పనముచేసి వ్రాసెనో? కౌరవేశ!
మాతాత సత్యవంతుండు
పూతములగు నాల్గు వేదములు వ్రాసిన వి
ఖ్యాతకవీంద్రుం; డాతని
చేతికల మబద్ధములు వచింపదు సుమ్మీ!
వ్యాసకల్పిత మహాభారతామ్నాయంబు-గుట్టుగా నిమఁ దిట్టుగొనుచునుండ
ముగురు సత్కవుల పెంపుడు కావ్యరాజంబు-పదిమందిలో బట్టబయలు సేయ
నింతలింతలు సేయు దృశ్యప్రబంధాళి-మొత్తమై ని న్నాడిపోసికొనఁగ
చెప్పుడుమాటకు జెవి యొగ్గు భవనంబు-క్రూరాత్ము డని పండ్లు నూరు కొనఁగ
తొడలు తెగిన బాధతో, నింత దుష్కీర్తి-తోఁ, బరాజయంబు తోడురాఁగ
నరకమునకుఁ బోయినావో? స్వర్గమునకుఁ-జేరినావో? నీవు కౌరవేంద్ర!
నీసావాసముచేసి ముజ్జగముఁ బిండింజేయగాఁ జాలు రా
ధాసూనుం డొక వ్యర్థజీవి యయి నిందాబద్ధుఁడై పోయె; నీ
యాసల్‌ భీముగదాభిఘాతమున నుగ్గై యూరు యుగ్మంబుతో
నీ సింహాసనసీమ దుఃఖపడు చుండె న్నేఁడు కన్నీళ్ళతో!
సవ్యసాచికరాన సాము నేరిచికొన్న-బలమైన కొవ్వాఁడి బానములకు
వాయుసూనుని బాహుబలముతోఁ బోరాడు-మొక్కవోవని పుట్టె డుక్కుగదకు
పాంచాలి నులివెచ్చ బాష్పాంబువులఁ దేలు-వజ్రనిష్ఠుర శాపవాక్యములకు
యమతనూభవుని దీనాలోకములఁ దోలి-దీపించు శీతలాలాపములకు
సకల భువనంబు లాలించి సమ్మతించు-వనజనాభుని శుభ రాయబారమునకు
సమ్మతింపక, రక్త నిర్ఝరములందుఁ-దానమాడితి వేల? గాంధారితనయ!
అంటఁగరాని యగ్ని కెనయైనది ద్రౌపది; యట్టి సాధ్వి వ
య్యంట మొగాన బూని, "యకటా!" యని యశ్రులు రాలనేడ్చినన్‌
దుంటరివై సహోదరులతో సభలోనఁ బరాభవించినా
వంట! మఱందివై వదినకా మొనగానితనంబు సూపుటల్‌!
కురుభూపాలుఁడు బుద్ధిమంతుడని వాకోబూనితింగాని, యా
దరణీయంబులు హేతువు ల్గలుగవద్దా? నీ చరిత్రంబునన్‌
గరళాన్నంబును, మాయజూదమును లాక్షాగేహమున్‌ ద్రౌపదీ
పరిభావంబు భయంకరంబులయి చూపట్టుం గురుక్ష్మాపతీ!
నీయతనంబు లన్నియును నెత్తురుకూడు భుజించి మాయమై
పోయెఁగదా? వృథాపయశముం దలదాల్చిన నీకు నేఁడు నిం
దాయువుఁ బోసినారు కవు లక్కట, పెందొడలూడి, కుంటివై!
యీ యవమానజీవితము నెట్లు సహింతువయా సుయోధనా!
భారతవీరుఁడు (భారతి, జనవరి 1927)
గీ.ఘనకురుక్షేత్ర సంగ్రామ గగనమునకు
భానుమంతుఁడవై వైరి వర్గములను
కలఁచి గెలిచిన దండిమగండ వీవు;
కర్ణ, కారణమేమి దుఃఖపడ నింక?
గీ.సమరధర్మంబు విడి ధనంజయుఁడు సంపె;
నతనిచేఁ జచ్చె రాధేయుఁ డనెడు పల్కు
పుట్టెననుచింత గలదు కాఁబోలు నీకు
నట్లుగాదయ్య గెలుపు నీయదియె కర్ణ!
గీ.ధర్మముఁ దలంచి నినుఁ గన్నతల్లి ననుఁగు
సోదరుల రేణువులభాతిఁ జూచినావు
ఔర నీస్వామిభక్తి నీయద్వితీయ
సుగుణసంపద వర్ణింప నగునె కర్ణ!
శా.వీరాగ్రేసర, నీవు పాండవబలాబ్ధిన్‌ మందరంబట్లు దో
స్సారం బార మథించి యంచితయశస్సారంబు లోకంబునన్‌
బారంజల్లిన సద్ధనుర్ధరుఁడ వెవ్వం డీడురా నీకుఁ గ
ర్ణా, రాజన్యుల కెల్ల నీచరితమన్నన్‌ గర్ణపేయంబగున్‌.
మ.ఒకపాంచాలికి భర్త లేవురని మర్త్యుల్‌గూడిమాటాడువా
డుకయే కర్ణకఠోరమై మసలుచుండున్‌ డెందమం దట్టివా
నికి నాకాఱవ భర్తృనామము ధరన్‌ నిర్మింప కంచున్‌ మురా
రికి వాక్రుచ్చి యశంబుఁ జాటవె ధరిత్రీమండలిన్‌ భానుజా!
మ.జననంబందిన తత్క్షణంబ కఠినస్వాంతంబునన్‌ గంగ క
ప్పనగావించిన క్రూరురా లనక లోభస్వాంతయై కుంతి “నా
యన, కర్ణా, సుతభిక్షరా” యనఁగ నాహా! మారుమాటాడ కి
చ్చిన విఖ్యాతవదాన్యమాన్యుఁడవు యొచ్చెం బేది నీకీర్తికిన్‌.
గీ.పార్థనామము చెవిలోనఁ బడినయంత
భగ్గుమని మండిపోవు నాపాదమస్త
కంబు నీకట్టి మీ వైరకారణంబు
చాటుచున్నది కర్ణ, నీ స్వామిభక్తి.
చ.అరదము నేలఁ గ్రుంగినపు డైనను, భార్గవరాముశాపవా
క్సరణిశరంబు లూహ కెడసన్నపు డేనియు, శల్యుఁ డెన్ని ని
ష్ఠురములు పల్కుచున్న, రణశూరత దక్కక వైరివీరకం
ధరపటుకర్తనోద్యమమునన్‌ జెలువారవె సూర్యనందనా!
శా.కింకన్‌ రుద్రునిఁ బోలి తేరి నడుచక్కింజేరి, దృప్యద్ధను
ష్టంకారంబొనరించుచున్‌ రిపులకంఠశ్రేణిఁజెండాడునీ
వంకన్‌ జూడఁ గిరీటియంతటి ప్రతాపస్ఫారమార్తాండుఁడే
జంకెన్‌ నీ కెదురెక్కు వీరుఁ డొకడున్‌ జన్మించెనే, భానుజా!
మ.చెవులన్‌గుండలముల్‌ ప్రభావిభవరాజిం జిమ్ము వర్మంబుఁ బు
ట్టువుతోఁగల్గిన ముద్దుబిడ్డఁడవు, నీటుంగోటు దీపింప రెం
డవమీనాంకుని వోలి విల్లుఁ గొని జన్యక్షోణులం జొచ్చి శా
త్రవనాశం బొనరించు నిన్నుఁగని, కర్ణా! కుంతి యెట్లోర్చెనో!
చ.మివులఁ బవిత్రవంతమయి మేదినిఁ గాలువకట్టి మర్మరా
రవము సెలంగ నీదురుధిరంబు స్రవించుచు “యర్జునాయధ
ర్మువు, భవ” మంచు నెంతవలపోసెనొ! శత్రుకళేబరంబు లం
టవలసెనంచు నెంత వనటంబడినాఁడవొ, కర్ణ! కూలుచో.
ఉ.“చండగభస్తిమండల మొసంగిన నాతొలుచూలుకాన్పు క
ర్ణుం”డనుకుంతిమాటకుఁ దనూలత కంపమునంద ధర్మసూ
నుం డెలుఁగెత్తి యేడిచి నినుం గొనియాడుచుఁ బల్కె నట్టిశూ
రుం డిఁకఁ బుట్టఁబోఁడని నిరూపణసేయుచు సూర్యనందనా!
కం.కర్ణుని తల భారతమని
దుర్ణయవాక్యముగఁ బల్కుదురు జను లోశౌ
ర్యార్ణవ! నీ చరితము సం
పూర్ణముగ నెఱుంగలేకపోవుట కతనన్‌!
భారతవీరుఁడు (భారతి, సెప్టెంబరు 1928)
ఉ.“ఈ కవచంబుఁ గుండలము లీయకు మల్లదె దొంగబాపఁడై
నాకవిభుండు వచ్చెడిని నా యనుఁగుంగొడుకా” యటంచు మ
ర్త్యాకృతి నుండి పల్కెడు నహస్కరునిం గని నవ్వి యవ్వి యే
పోకడఁ బెట్టు నీ సుగుణము న్నుతియింపఁ దరంబె భానుజా!
చ.నరుఁడు బృహన్నలాఖ్య నలనాఁడు విరాటునిఁ గొల్చుచుండి, యు
త్తరునకు సాయమై, కురుశతంబును మూర్ఛిలఁ గొట్టునాఁడు, భా
స్కరసుతుఁ డోడె నందు రని కన్నుల నీ రిడకయ్య, శక్తులై
గురుఁడు, నదీసుతుం డెదురుకొన్నది లేదుగదోయి, భానుజా!
శా.గంగాపుత్రుఁడు రాజునానతి శతాంగశ్రేణి యర్పించు నాఁ
డంగీకారము గాక నీ కొక రథం బర్పించెనే కాని, యో
యంగాధీశ్వర, యుగ్రవత్కదనపంచాస్యుండ వౌ నీకు నీ
యంగత్రాణములున్‌ రథంబులును సాహాయ్యంబు లేమాత్రముల్‌.
ఉ.సంగరసీమ నీకుఁ దొలిసాయకమైన భుజంగభర్త, పా
ర్థుం గుఱిచూచుచో నది విరుద్ధగతిం జని టెక్కెముం గిరీ
టాంగదముల్దహించి, యినజా, ననుఁ గ్రమ్మర నేయుమన్న, ఛీ
యెంగిలిబాణ మేయ ననవే! రణవీరుఁడ వీవ యర్కజా!
ఉ.నిక్కపుఁ బేఁడబుఱ్ఱవలె నీతొడ నింద్రుఁడు బొక్కసేయ నాఁ
డక్కట నెత్తురు ల్వరద లై ప్రవహించుచునున్న ధైర్యమున్‌
దక్కక నిద్రఁ జెందు జమదగ్నికుమారుఁ గదల్పలేదు హా!
యెక్కడి చిత్తదార్ఢ్య; మిది యెక్కడి దీగురుభక్తి భానుజా!
మ.కురురా జొక్కఁడుగాక నీ దగు మహత్కోదండపాండిత్యము
న్వరదానప్రతిభానిసర్గగుణ మెవ్వారేని గుర్తించిరే
యరవిందాప్తకుమార, చింతపడకయ్యా! నేఁటి కింకన్‌ దిగం
తరదేశంబులఁ బాఱుచున్నవి భవద్దానాంబుధారానదుల్‌.
శా.నీ నేర్పు న్సహజప్రతాపవదనోన్మేషంబు నీక్షించి, యీ
ర్ష్యానైశిత్యముఁ దోఁపనీక, కులగోత్రప్రశ్నలన్‌ దెచ్చి ల
జ్జానిర్జీవునిఁగా నొనర్చెడు కృపాశ్వత్థామలే లేక, క
ర్ణా, నీ వేరికి తీసిపోయెదవు, మార్తాండాత్తతేజశ్వి వై?
ఉ.అంబుజనాభు నంతటి మహాత్ముఁడు పార్థునితేరిమీఁద గు
ఱ్ఱంబులు దోలుచుండ సమరం బొనరింపఁ దెగించునే లలా
టాంబకుఁడైన? నీ తెగువ యబ్బురముం గలిగించు! వీరలో
కంబున నీకుఁ జాలిన మగండు జనింపఁడు సూర్యనందనా!
ఉ.“నా యరదంబు క్రుంగిన దనంత, కిరీటి, క్షణంబు తాళుఁ డో
యీ! యిది యుద్ధ ధర్మ” మని యీవు వచించుచునున్న నిన్ను న
న్యాయముగా వధించిన ధనంజయుఁడా విజయుండు నీవు కా
వా, అకటా! యి దెక్కడి నిరర్థకధర్మము సూర్యనందనా!
ఉ.“భారతయుద్ధరంగమున పాండుతనూభవమధ్యముండొ, కా
దా, రవిజుండొ! తీరవలె తథ్యము నా కిటు గాక కంటికిం
గూరుకు రాదు, రా” దనుచు ఘోరముగా శపథంబు చేసి నీ
కూరిమిఱేనికై తనువుఁ గోల్పడి తెంతటి సాహసుండవో!
చ.“కుడిభుజమైన కర్ణుఁ డనిఁగూలె, సమస్తముఁ దీఱె” నంచు డీ
ల్పడి, ధృతరాష్ట్రనందనుఁడు పాండుకుమారుల కోహటించి య
మ్మడువునఁ జొచ్చె, శూరజనమండన, నీవు గతింపకున్న, భీ
ముఁడు తొడఁ గొట్టి నీ నృపునిముందర నిల్చి గదం ధరించునే!
తే.ఫల్గునుఁడు దక్కఁ దక్కిన పాండుసుతులు
భండనంబున నీచేతఁ బడినయపుడు
తల్లి కిచ్చినవరము చిత్తమున మెఱసి
యడిద మెత్తని సత్యసంధుఁడవు కర్ణ!
శల్యసారథ్యము (భారతి, సెప్టెంబరు 1931)
సీ.అహిమస్తములకు నొయ్యారంబు నేర్పించు వలపుఁ బిల్లనఁగ్రోవి పాటకాఁడు
పసితనంబునయందు పడగపాములనెక్కి చిందులాడిన గొల్లచిన్నవాఁడు
పదియారువేల గోపస్త్రీలతోఁగూడి యపవాదుబూనని యందగాఁడు
లోకాంతమున మఱ్ఱియాకుఁ దెప్పందేలి తలదాఁచుకొన్న చిత్రస్వరూపి
తే.భాసురములైన తన చేరెఁడేసికనుల
మచ్చుఁజల్లెడు వేలుపు మాంత్రికుండు
తొడరి విజయునియరదంబు దోలుచుండె
కాంచి వి ల్లందుకొనుము భాస్కరకుమార!
చ.ములుకులు నీధనుస్సున విముక్తములై చని, కృష్ణమూర్తికిన్‌
వలఁగొని యావల న్నరునిపైఁ గసిబూనుట, దుస్తరంబుగా
దలఁప విదేటివెఱ్ఱి? భుజదర్పము వెన్నుని ముందు సాగునే
మలపుదునా రథంబు? యనుమానముఁ దోచె జయంబు కర్ణుఁడా?
మ.వ్యయమైపోయిన యమ్ములన్మరలఁ గూర్పం దక్షమైయున్న, య
క్షయతూణీరములిచ్చి పార్థుఁడు శరాసారంబు గుప్పించినన్‌
జయ మాదేవుఁ డెఱుంగు గుఱ్ఱములపై, నాపై, భవత్సేనపై
దయజూపించుట కూపిరాడఁగలదా? దౌర్భాగ్యధానుష్కుఁడా!
ఉ.తూలినపందికై, హరుఁ డెదుర్కొని రేఁచిన గ్రుద్దులాట కు
స్తీల, బలిష్ఠుఁడై, కఱకుఁ దేలినవాఁడు మహేంద్రసూతి యా
శూలికి గుండెలే దతనిఁ జూడ నెగాదిగ, యుద్ధభూమిలో
రాలఁదలంచితే? పరశురాముని శిష్యుఁడనన్న బిఱ్ఱునన్‌.
తే.ఖాండవము నర్జునుఁడు కాల్చు కాలమందు
పరుగులెత్తిన ముసలిసర్పమును వింటఁ
దొడిగినాఁడవు, భళిభళీ! విడువవలవ
దబ్జనాభుఁడు గరుడవాహనుఁడు సుమ్ము.
మ.బలవంతుండగు శౌరి, రోషము రగుల్పన్‌ బార్థుడుం గెంపుచూ
పులవేగంబునఁ దూపులన్నడిపి నీమూర్ధంబు ఖండింపఁడే?
తలపై శాపము లాడు నీకు నొక యుద్ధంబేల? నీరక్తమున్‌
బొలయున్‌ గాకులు గ్రద్దలున్‌ గుడుచునేమో! నేఁడు సూతాత్మజా!
మ.ఇలకున్‌ గ్రుంగె రథంబు చక్ర మిపు డేదీ? నీకు గత్యంతరం
బలుక న్నీ ప్రతిపక్షిగాండివధరుండై, చెండుచున్నాఁడు నీ
బలమున్‌ గాలములేదు స్యందనము లేవందీసికొ మ్మేటికీ
తలపోఁత ల్శరణంబు వేఁడుకొనరాదా? కర్ణ! బీభత్సునిన్‌.
AndhraBharati AMdhra bhArati - kavitalu - jAShuva - khaMDakAvyamulu ( telugu andhra )