కవితలు శశికళ (అడివి బాపిరాజు)  
1. నిరీక్షణ 2. అనర్హత
3. అనర్ఘము 4. ఎవరవే?
5. ఈ నిశిని 6. ఎవరికోసం
7. ఎవరివో ఆ కలస్వనాలు 8. నువ్వటే!
9. పువ్వటే 10. ప్రత్యక్షము
11. లోకము 12. సూర్యసుత
13. అవతరణము 14. అతిథి
15. నువ్వు 16. చరిత్ర
17. నీలము 18. శశికళ
19. నగ్న 20. ఆ వెనుక
21. పరమార్థము 22. ఉగాది
23. ప్రస్థానము 24. శ్రుతిలేని
25. మార్పు 26. ఒకరి కొకరు
27. ఆటపాటలు 28. ప్రణయ కోపన
29. రాగిణీమాల 30. మేలుకొలుపు
31. యోగిని 32. సంగీతమేలనే
33. నాట్యము 34. అక్కసురాలు
35. త్రప 36. ఆశయదేవి
37. పూజ 38. కంటినవ్వు
39. అటుఇటు 40. ఇంద్రజాలిక
41. విప్రలంభ 42. సంప్రార్థన
43. నారాణి 44. గంగాధర
45. కళాపరిమళము 46. ఒఖ్ఖణ్ణి
47. నిత్యయౌవన 48. అనుగమము
49. గానసుందరి 50. కారణము
51. మార్గము 52. ఇష్టదేవత
53. ధ్యేయము 54. పిలుపులు
55. నర్తకి 56. వరప్రదానము
57. పూల బాలిక 58. యుగ్మము
59. ఎండిమియాన్‌ 60. మన చెలిమి
61. సొగసు ... వయసు 62. వసంతపూర్ణిమ
63. స్మృతులు 64. దేశిక
65. ఇంతలో... 66. గ్రీవ గంగోత్తరి
67. ఖేచరి 68. జ్యోత్స్నాద్యుతి
69. గౌరీ శంకర శృంగావిర్భవ 70. దీపావళి
71. తెర 72. అమరత్వము
1. నిరీక్షణ
నీకై నే ఎదురుచూస్తి
నీకై నే వెదకినాను
కను తెరచిన కలలమధ్య
కలలెరుగని గాఢనిద్ర!
నీకై నే ఎదురు చూస్తి - నీకై నే వెదకినాను
నను తెలిసే శిశుదినాల - వినితెలిసే బాల్యలీల
యౌవన మధు మధురాలలో - భావా భావ స్థితిలో ॥నీకై॥
ఎవరవో నీ వెటులుందువో - ఎవరవో నీ వెట నుందువో
భువిజవే దివిజాంగనవై - అవతరించినావో ఏమో ॥నీకై॥
కిన్నెర తీగల మీటితి - నిన్ను దరియు రాగంలో
వెన్నెలలో కరుగు గీతి - నిన్నె పాడి నిన్నె వెదకు ॥నీకై॥
తపసైన నిరీక్షణలో - తలపులతో బొమ్మైతిని
నాతోనే లోకాలూ - నాతోనే కాలాలూ ॥నీకై॥
కనుతెరచిన కలల మధ్య
కలలెరుగని గాఢనిద్ర
2. అనర్హత
వెదకలేనే రాణి నిన్నూ
వేదనా పూర్ణ మీ బ్రతుకులోనూ! ॥వెదక॥
వదలలేనే కలలు
నిదరలేదే మనసు
విదిలించి వాసనల్‌ ॥వెదక॥
కదిలించి జన్మనే
చదల కెగయగ జాలు
పృథుల పక్షాలేవి ॥వెదక॥
3. అనర్ఘము
నిన్ను దరిసిన కాంతి - నిన్ను పొందిన కాంతి
వెన్నెలలు వెలిగెనే - విరిసె మల్లెలు కోటి
నీవు వెలిగే కాంతి - నిన్ను వీడే కాంతి
మిన్ను టేరే బాల - స్విన్నా మృతమె లీల.
నిను చుట్టి ఒక కాంతి - నీలోన ఒక కాంతి
ఉజ్వలమ్మై సిత - ప్రజ్వలమ్మై తప్త
కాంచనమ్మై వెలిగె.
నీవు నెలరేక వట - నీవు వెన్నెల వటే
పరమ శోభవు నీవు - నిరతిశయ ప్రణయవే.
4. ఎవరవే?
ఓ చెలీ నీ వెవరు - ఓ చెలీ నీ వెవరు
కలలోని పాపవా - ప్రకృతి వలపుల బాలవా?
మధుర మందానిల పరీమళమవో!
మధుమత్త శారదాత్మిక సుషమవో!
సుందరాప్సరసాంగనా కంఠ - తుందిలము మందారమాలవో!
ఓ చెలీ నీ వెవరు? ఓ చెలీ నీ వెవరు?
కలలోని ముగ్ధవా? కతలోని స్నిగ్ధవా?
వారాసిలో పొంగు కెరటాలవో! - నీరాల లోతులో నీలాలవో!
తుంగ వీచీ శిఖర - భంగరేఖా రచిత
శుక్తి గర్భాంతరిత - ముక్తా ఫలాచ్ఛవో!
ఓ చెలీ నీ వెవరు? ఓ చెలీ నీ వెవరు?
కలలోని పొలతివా? కతలోని మెలతవా?
ప్రత్యూష బాలా ధరారుణిమవో - నిత్య నూతన భాను కిరణమ్మవో
గాఢరజనీ హృదీ - వ్యూఢ గభీరస్థ
తమసులో నుదయించు
విమల భాః కిరణమవో?
ఓ చెలీ నీ వెవరు? ఓ చెలీ నీ వెవరు?
కలలోని సుందరివో - కతలోని చెందిరివో
కాదంబినీ వక్షనట శంవచో
ప్రాదంబరేంద్ర కార్ముక వర్ణవో?
అరుణాంశు చుంబితా నందరాజీవ హృదయ
కేసర పరాగ గాంగేయ ప్రకాశవో?
ఓ చెలీ నీ వెవరు? ఓ చెలీ నీ వెవరు?
తలలో నణీయవా? కతలోని ప్రణవా?
దివిజగంగా తరంగ స్వరమవో
హిమజ యమునా గమన గానమ్మవో
గోదావరీ సప్త కూలంకషానుగత
తాపస పవిత్రపద - తాళ స్వరూపవో?
ఓ చెలీ నీ వెవరు? ఓ చెలీ నీ వెవరు?
కలలోని భామవో? కతలోని దేవివో?
గగనలలనా శిరోరత్నమ్మవో
కతిశపాథోరాసి సారసనవో
తాండవేశ్వర నాట్య
తాళ తకిట ద్ధిమిత
ఝంతర ఝణక్వణిక
స్వర్ణ మంజీరవో?
ఓ చెలీ నీ వెవరు? ఓ చెలీ నీ వెవరు?
కలలోని మాయవో - కతలోని ధ్యేయవో?
5. ఈ నిశిని
బ్రతుకంతా నిరీక్షణము - మతి అంతయు దీక్షణమై
ఈ నిశిలో గాటపుతమి - నేను వేచి యుంటి నొంట
ఈనిశి ఒక సుముహూర్తము - గానము ఈ నిశ్చలతయె
ఈ కుటీర ప్రాంగణమున - చీకటి చెలిగా నిలిచితి
ఈ నిశిలో రొదలు లేవు - ఈ నిశిలో సొదలు రావు
వేచియుంటి ఎవరికొరకొ - కాచియుంటి ఏ ఘటనకొ
ఈ నిశిలో నడికిరేయి - ఎవరో నా తోట చొచ్చి
పూమొగ్గల విరియచేసి - ముంగిటిలో అడుగులిడిరి
తూరుపుమల నెలతోచెను - తొగకన్నెలు వగలూరిరి.
6. ఎవరికోసం
ఎవరికోసం కంఠమున ప్ర - స్రవణమై నా గీతముబుకును
ఎవరికోసం గీతికాఝరి - ప్రవాహించును వడులు సుడులై
ఎవరికోసం వడుల సుడులలొ - అవతరించును మధుర తాళోర్మికా కోటుల్‌
ఎవరికోసం? ఎవరికోసం?
7. ఎవరివో ఆ కలస్వనాలు
ఎవరివో ఆ కలస్వనములు - ఎవరిదో ఆ మధుర గీతము
భువన మోహన రాగమొక్కటి - పొంగి పొరలెను దెసలు మునిగెను
ఇటుల చూచితి అటుల చూచితి - ఎటుల కనినను ఎవరు లేరూ
తీపి బరువుల గీతి మాత్రము - ఓపలేనీ నన్ను ముంచెను
శిల్పప్రతిమై చేష్ట లుడిగితి - కల్పములె కరిగినవి హృది
గానమతి అతిలోకమై చద - లానె పాల్కడలిలో అలలై
గాయనీ ఆ బాల ఎవరో - ఏ అనంతములోన దాగెనో
ఎవరివో ఆ కలస్వనములు - ఎవరిదో ఆ మధురగీతము
8. నువ్వటే!
నువ్వటే నువ్వటే - పువ్వు విరిసిన వయసు - నవ్వులలమిన సొగసు
రువ్వి నా ఎదపైన - చివ్వునంతర్హివే - నువ్వటే నువ్వటే!
నువ్వటే నువ్వటే - కవ్వించి నాకాంక్ష - త్రవ్వించి నా కలలు
ఉవ్విళ్ళుగొన మనసు - దవ్వైతివే దెసల - నువ్వటే నువ్వటే!
నువ్వటే నువ్వటే - జవ్వనీ ప్రణయినీ - మువ్వంపు వగలాడి
అవ్వారు ముద్ది మా - నవ్వుతూ నను వదలి
రివ్వురివ్వున మిన్ను - పవ్వళింపయితివే - నువ్వటే నువ్వటే!
9. పువ్వటే
పువ్వటే నీ సొగసు - వేలుపుల - బువ్వటే నీ నవ్వు
ఈ వెలుగు లేమంటు - ఏను తడబడుటలే
ఎటుచూచినా వెలుగు - ఎదురు కొన్నది నన్ను
కళవళము పడుతూనె - కనులు మూసితి నేను
పువ్వటే నీ సొగసు - బువ్వటే నీ నవ్వు
కనులు మూసితినేమి - కాంతులాపుట ఎట్లు
నాలోన నాపైన - నానార్ధముల కాంతి
పువ్వటే నీ సొగసు - వేలుపుల - బువ్వటే నీ నవ్వు
10. ప్రత్యక్షము
ఒక రాగాలాపనలో
ఒక గీతావిష్కరణలో
ఎవరో ఒక దివ్యరూప
ఎవరో ఒక తళుకు చాన
కిరణంలా కరణంలా - సురచాపం వర్ణంలా
మెరిసిందహో మిరిమిట్లయి - దరిసిందహో దరిసెనమై!
ఒక రేఖా విన్యాసము
ఒక వర్ణం ప్రసరింపులో
ఎవరో ఒక దివ్యభామ
ఎవరో లావణ్యమూర్తి
ఆమ్నాయ సునాదంలా
అతి వేల రసాపగలా
ఆపేచన కాలేఖ్యము
అతిరేకావతరణమ్ము
నిరతిశయానందమ్మై - పరిమళాంగి ప్రవిమలాంగి
పారిభద్ర ప్రసూనాంగి - విరిసిందహో విధురేఖై
కురిసిందహో సురమధువై
దివితరించి భువితరించి - అవతరించె నా ప్రణయిని
దిశామూర్తి శశికళాఖ్య నిశామూర్తి శశికళాఖ్య
గోదావరి పాడిందీ గోవత్సం ఆడిందీ
సాయందిన కల్యబాల - చల్లెను పన్నీటి జాలు
చల్లెను స్వర్ణాక్షతలను - చదలదేవి ఆశీస్సుల
11. లోకము
చంద్రలోకం తూర్పుదెసలో - సూర్యలోకం పశ్చిమంలో
చిన్నిలోకం ఒకటే ఉన్నాదే!
ఓ నా వెన్నేల చిన్నారి పడుచా!
ఆ లోక మేలే కన్నెరాణివి నువ్వే నువ్వేనే!
వాడిపోవని పూలతోటలు
నీడలెరగని నిండు పున్నమ
పరిమళాలే పిన్న వాయువులూ
ఓ నా వెన్నేల చిన్నారి పడుచా!
ఆ జగతి వెలిగే వన్నెలాడివి నువ్వే నువ్వేనే!
నింగి నీలిమ కంటి బొమలూ - ముంగురులె ఆ మొయిల గములూ
తొంగతి రెప్పలె ఇరుల కారంచుల్‌ - ఓ నా వెన్నేల చిన్నారి పడుచా!
చెంగలించే చుక్కలె నీ కన్నుల్‌
నా పూజాపీఠం
సింగారి వేల్పువు నువ్వే నువ్వేనే!
ఓ నా వెన్నేల బాలా! నా బంగరు సానివి నువ్వే నువ్వేనే!
పొద్దుపొడుపూ తొగరు కెమ్మోవి - ముద్దు మోమే మొయిలు తెరువూ
నిద్దపుకేనూ మిన్ను టేరేనే - ఓ నా వెన్నేల చిన్నారి పడుచా!
విద్దెలన్నీ నీవే నీవేనే
నా హృదయ కమలం - సుద్దులాడివి సొబగులాడివి నువ్వే నువ్వేనే!
కంటిలోనికి కలలు పొదిగీ - కంఠంలోనే తీపులు పిదికీ
జంట చేస్తివి చేతికి కౌశల్యం
ఓ నా వెన్నేల చిన్నారి పడుచా
మంటి మింటికి శ్రుతిగా నా తలపూ!
నా ఆత్మ మధ్యవు
అమృతమూర్తివి నువ్వే నువ్వేనే!
12. సూర్యసుత
సూర్యసుతవే శశికళా
చంద్రబాలవు శశికళా
కుసుమ మాలల కోమలాంగీ
మిసిమి వన్నెల మించు బాలా!
సూర్యసుతవేలే - శశికళా - సోమసుతవీవే!
అమృత విలసిత విమలగాత్రీ
కొమరుప్రాయపు - కొమ్మ ముద్దుల గుమ్మనీవె
సూర్యసుతవీవే - శశికళా - సోమసుతవీవె!
నిత్య వికసిత నృత్యమూర్తీ
ముత్యములడాల్‌ మోహమూర్తీ
సూర్యసుతవీవె - శశికళా - సోమసుతవీవే!
నీవటే నా ప్రణయ నిధివీ - నీవటే నా తపస్సిద్ధివి
సూర్యసుతవీవె - శశికళా - సోమసుతవీవే!
13. అవతరణము
నీలిమిను పవళింపు - నిదురించు నీ సొంపు
తేలిపోతూ దిగెను - వేలలే వెలిగేను
తొంగలించే వయసు - నింగినంతా ఒలసె
బంగారు మంచాన - పవళించె నీ సొగసు!
తెలికొండపై గంగ - తేలివారినరీతి
తెలివి నా తలపుగిరి - తేలివాలితి నాతి.
నిత్యవికసిత దేహ - నృత్య విలసితహాస!
నిదురించు నినుకోరి - పదము మొదలిడినాను
జన్మజన్మల రాణి - తన్మయుడనే జాణ
మేలుకొలుపులు నిన్ను - జాలిగా పిలచెనటె
అలనల్ల నాడించి - అరవిచ్చె నీ కనులు
దరిసినది నీ సొగసు - విరిసినది నా మనసు
విరుచుకొను నీ మేను - వికసించు కల్పకము
ఆత్రమై ఆశతో - చిత్రమై దరినేను
వాలుచూపుల చూచి - మేలుకొనె దీ వలపు
తొలిపొద్దు కిరణమై - చెంగలువ అరుణమై.
జాళువాపాన్పు దిగి - బాల వయ్యారమై
మ్రోల నిలిచితివటే - మోకరిల్లితి నేను.
ఎవరెవరి హృదయాలు - ఏమి కాంతించెనో
ఎవరెవరి భావాలు - ఏమి కాంక్షించెనో!
14. అతిథి
రూపురేఖల రుచి తళత్థళ
చూపు నొబగుల సురభిళమ్ములు
జలజలా వచ్చావు బాలా
వలపలా తోచావు బాలా!
స్వచ్ఛశోభా పూర్ణమూర్తివి
విచ్చు పాటల పుష్పవదనపు
అలలులా వచ్చావు బాలా
కలలులా వచ్చావు బాలా!
ఘల్లు ఘల్లున కాలి మువ్వలు
ఘల్లుమన నా జన్మమంతా
వెల్లువై వచ్చావు ప్రేయసి
వెన్నెలై వచ్చావు ప్రేయసి!
15. నువ్వు
పూవులో మసృణములు - తావిలో ఘసృణములు
ప్రోవు ప్రోవులు చేరి - నీవుగా మూర్తించె.
రాయంచ స్విన్నతలు - ప్రాలేయ స్వచ్ఛతలు
లీలార్ద్రమై కలసి - బాల నీవై వెలసె.
కోకిలల కువకువలు - వాకపరువుల కివలు
నే కంఠమున సొలసి - నీకు పలుకులు వొలసె.
ఆకాశ నీలాన - రాకాసుధాకరము
నీ కనుల వెలిగెనే - నా కమృతము కలిగె.
16. చరిత్ర
మర్త్యుడను నేనటే, ప్రియబాల
అమర సఖి నీవటే!
ఒక తారకాకాంతి - ఒక దివ్యలిప్తలో
చీకట్ల వెలిగిస్తు - చేరినది ఈభువిని
తారకిరణము నేను - తారకవు నీవటే!
శిల్ప నిష్ణాతగా
చిత్రకారుణ్ణిగా
జన్మజన్మాలెన్నొ - తన్మయ కళాపూజ
శిల్పి నేనేనటే - శిల్పమవు నీ వటే
ఆనా డజంతాన - ఆంధ్రపురి కటకాన
ఆంధ్రకవి స్వప్నాన - ఆంధ్ర నటకరణాన
ఆంధ్ర సంస్కృతినేనె
ఆంధ్రత్వమీవటే!
17. నీలము
నీలికలువ పుటాలలో
తేలిపోవు నీలిమలపు
నీలరత్నహృదయంలో
సోలిపోవు కాంతి సూక్తి.
నెమలి గళము వంపుల్లో
నృత్యమాడు నీలినిగలు.
నీలాకాశ రహస్యము
కాళిందీ ఝరినీరము
మూర్తించినవే కన్నుల
నర్తించెను కనుపాపల
సూర్యసుతా శశికళవే!
ఆర్యసఖీ శశికళవే!
18. శశికళ
దివ్యభాసితరూప శశికళ - నవ్యసుందరమూర్తి శశికళ
నిత్య యౌవన స్నిగ్ధ శశికళ - ప్రత్యయిత నా దేవి శశికళయే!
చిత్రరూపము రంగు శశికళ - శిల్ప కౌశల్యమ్ము శశికళ
చిత్రకారుని కుంచె శశికళ - శిల్పి చేతుల ఉలియె శశికళ!
కావ్యనాయిక నాకు శశికళ - కావ్య రసమున స్థాయి శశికళ
కావ్యవ్యంగ్యము రీతి శశికళ - కావ్యమే నా గీతి శశికళ!
వీణ తీగెలు మెట్లు శశికళ - గాన మాధుర్యాతి శశికళ
రాగములు తాళాలు శశికళ - వేగమగు కీర్తనము శశికళయే!
19. నగ్న
వెన్నెలలో వెలుగుధార
వన్నెలలో స్నానమాడ
ధవళకాంత తరళమూర్తి - భువన సకల మోహమూర్తి
ప్రణయదేవి నా శశికళ - మృణాళాంగి నా శశికళ
పూర్ణనగ్నయై నిలిచెను - పూర్ణకుంతలా లాడగ.
తను భంగిమ హిమశృంగము - మినువాకలో తరంగము
వెన్నెలలో స్నానమాడ - క్రొన్ననల ప్రోవు ప్రోడ
స్వచ్ఛ దేహమై నిలిచెను - స్వప్న సుందరై పొలిచెను
మిరుమిట్లయె నా కన్నులు - ఉరవడించె నా కోర్కెలు.
సమభంగా కృతి నిలిచెను - సుమ పరిమళములు విరిసెను
నగ్న బాల నా శశికళ - నగ లలంకరించని కల
తళతళమని మెరిసె దేవి - తలిరుటాకు మృదువుప్రోవు
అనుపమాన సౌందర్యము - నిరుపమాన లావణ్యము
ఉద్రిక్తము నా హృదయము - ఉద్గాఢము నా ప్రణయము
పదములు పూవుల గుత్తులు - మధుపము తొడి చిత్తము
సుషమాధారలు జంఢులు - తుషారార్ద్రములు తలపులు
అమృతకలశ మామెకు కటి - అమరపతిని ఆమె ఎదుట
డమరుక మధ్యమ్ము నడుము - క్రమము తప్పి మది నృత్యము
పారిభద్ర సుమకుచములు - బాహ్లిక సుమ చూచుకములు
ధవళ కమల ముకుళ గళము - నవమాలిక సరము కరము
సౌగంధిక కుసుమ ముఖము - సైరేయక సుమనాసిక
ఇందీవర లోచనములు - మందారక కపోలములు
శేఫాలీ కుటికైశ్యము - శ్రీఫాలము మాలతి కృతి
పాటలాధరోష్ఠమ్ములు
ప్రవిమల మూర్తి నిలిచెను - పరమశోభ తానమగుచు
దివ్యదేవి నా శశికళ - భవ్యమయ్యె నా జన్మము
20. ఆ వెనుక
చీకటి వెనుకే రాకా జ్యోత్స్నలు
నీ కనురెప్పల నీలిమ వెనుకే
వికసిత నిర్మల విద్యుద్రోచులు
పక పక నవ్వుచు పాపలు వెలుగును
కాంతి గర్భమున కలవు వర్ణములు
కనుపాపలలో కాంతుల లోతుల
రంగు రంగులై రాగము లీనుచు
శృంగారించును చిత్రములెన్నో
వర్ణ గభీరము పదములలోనే
పూర్ణరూపమై పొలుచును భావము
చిత్రరీతులలో చెన్ను మీరునే
పత్రరేఖ నీ ప్రణయము దేవీ!
21. పరమార్థము
"ఓ శిల్పి! నీ విద్య ఉపదేశమొసగు ఆ
పరమార్థమేమంచు" ప్రశ్నించినావు.
"సుందరము రేఖలో సొబగైన వర్ణాల
నారాణి మూర్తింప నా విద్య"లన్నాను.
"ఓ కవీ! నీపాట ఒదుగు మెదుగుల లోన
చెలువొందు భావమ్ము సెలవీయ"మన్నావు.
"జ్వలిత గీతా తటి చ్చలితకాంతుల మధ్య
నా రాణి రూపింప నా తపస్స" న్నాను.
"ఓహో నృత్యోపాసి! నీ అంగహారాల
ఓ హరిలు గోప్యంపు ఊహేది" అన్నావు.
"నృత్త నృత్యాలలో వృత్తిలో చారలో
దేవి నీకై ఆడి నీవౌదు" నన్నాను.
22. ఉగాది
ఈ ఉగాది ప్రేమసఖీ - నా ఊహల కందవేమె!
కలలోనే వచ్చినావు - కలలోనే కరగినావు ॥ఈ॥
ఒక కౌగిలి వదిగిస్తివి - కికురించితి వొక ముద్దును
పకపకమను నవ్వులతో - కకుబంతము కలసినావె ॥ఈ॥
గంధమలది కాన్కలిచ్చి - విందు లిడితి విడియమిస్తి
సుందరాంగి చంద్రికలో - మందుపెట్టి మాయమైతె ॥ఈ॥
23. ప్రస్థానము
ప్రేమార్థినై వెడలినానూ - శిల్ప - కామార్థినై కదలినానూ!
ప్రకృతి పథములు నడచి - భావలోకము గడచి
బహుదేశములు విడిచి - పడినాను అడవిలో ॥ప్రేమార్థినై॥
వర్ణాలు తూలికలు - వర్ణాలు పాలికలు
వస్తువులు చేబూని - ప్రస్థానమైనాను ॥ప్రేమార్థినై॥
కంటకావృత సరణి గండశైలాలలో
ఉస్సురని తూలుతూ ఓహోయని పడిపోతి ॥ప్రేమార్థినై॥
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు - తెన్ను తెలియని ఒళ్ళు
కదలికే లేనట్టి కఱ్ఱనై పడి ఉంటి ॥ప్రేమార్థినై॥
ఒకనాడు శుభవేళ - వికసించె చంద్రికలు
నాపైన వాలినవి - రూపొందె శశికళా! ॥ప్రేమార్థినై॥
మసృణ కోమల కరము - ఘసృణ పరిమళ స్పర్శ
నాకు ప్రాణము నిచ్చె - నాకు తెలివిడి వచ్చె ॥ప్రేమార్థినై॥
కన్ను విప్పితి లేస్తి - కౌగిలిని ఒదిగిస్తి
నాలోన చైతన్య - నాశశికళ! అనన్య ॥ప్రేమార్థినై॥
24. శ్రుతిలేని
పాడకే నారాణి పాడకే పాట
పాట మాధుర్యాల ప్రాణాలు మరిగెనే!
రాగమాలాపించి వాగులా ప్రవహించి
సుడిచుట్టు గీతాల సురిగి పోనీయకే ॥పాడకే॥
కల్హార ముకుళములు కదలినవి పెదవులూ
ప్రణయపద మంత్రాల బంధించె జీవనము! ॥పాడకే॥
శ్రుతిలేని నా మదికి చతుర గీతాలేల
గతిరాని పాదాల కతుల నృత్యమ్మటే! ॥పాడకే॥
25. మార్పు
కత్తిపట్టిన చేతికో దేవీ
ఇత్తువేమే సకల సౌరభ పుష్పదామము!
ఉరుములురిమే కంఠమున దేవీ
విరియ చేస్తువె మధుర మందస్వరములే!
తీక్ష్ణరోహిత పూర్ణ జన్మిని
తీర్తువేమే దివ్యమంజుల వర్ణములనే!
26. ఒకరి కొకరు
నువ్వూ నేనూ కలసి
పువ్వులో తావిలా - తావిలో మధువులా!
నువ్వూ నేనూ కలసి
కోకిలా గొంతులా - గొంతులో పాటలా!
నువ్వూ నేనూ కలసి
వెన్నెలా వెలుగులా - వెలుగులో వాంఛలా!
నువ్వూ నేనూ కలసి
గగన నీలానిలా - నీలాన కాంతిలా!
27. ఆటపాటలు
వాన చినుకుల ఆట - కోనవాగుల పాట
నీదు సొగసుల కులుకు - నీదు వలపుల పలుకు.
మెరుము తళుకుల ఆట - ఉరుము బరువుల పాట
నీదు కలతల అలుక - నీదు విరసపు చెళుకు.
మలయానిలుని జాలు - ఎలదేటి రుతి చాలు
నీదు తియ్యని ఆట - నీదు హాయగు పాట.
28. ప్రణయ కోపన
ఏల కోపం వచ్చినదో నీ - మ్రోల నిలిచిన నన్ను చూడవు
బాలికా నా వైపు తిరగవు - పంతగించితివో?
వీణె మీటిన తీపి పాటలు - వేణు వూదిన గాన మంత్రము
జాణ! నీవై పలుకు లాడవు - ముగ్ధనాయికవా?
పూల తావుల అలలు చూపులు - మాలతీ వల్లరుల నవ్వులు
నీల గగన విలాస లీలలు - దాచుకొన్నావా?
కాళిదాస మనోజ్ఞ కవితా - కలశ వార్నిథి వీచికలు నీ
కౌగిలింతలలోని వింతలు - నేడు చూపవటే!
పచ్చ కర్పూరాన వెన్నెల పసిడి సంజల సంపగులలో
పాటలీ కుసుమాన ఉషసుల చుంబనము లేవీ?
మేల మాడవు, గంధ మలదవు - పూల జడతో నన్ను కట్టవు
వాలు చూపుల నివాళించవు - ప్రణయ కోపనవా!
నేను చేసిన తప్పులేవో - నేనె ఎరుగను
గాన పూజలొ అపశ్రుతిలా - కలత బెడితినొ
ఆన తప్పితినేమొ మోహో - ద్రిక్త విరసముననన్‌
ప్రాణకాంతా! పాదపద్మము మ్రోల వాలుదు
ప్రణయ లీలల ప్రథమ తప్పిద
మెట్టిదైనను - ఏరికైన క్ష మార్హమేకాదా?
29. రాగిణీమాల
పాడెదను నీకునై పాటలను దేవీ!
వాకలై తేనియలు ప్రవహించు దేవీ!
సుమబాల ప్రేమకై తమి మీరి ముగ్ధుడై
భృంగ బాలుడు పలుకు శృంగార కల్యాణి ॥పాడెదను॥
మధుమాస పికరాజు విధుర సంక్లేశియై
గళమెత్తి కోయన్న కలరాగిణీ తోడి ॥పాడెదను॥
వేసవిని పుట్టిల్లు వెడలి రానలసించు
వాహినీ సతి కొరకు
పగలు పొగిలే కడలి
ధ్వానమౌ దీపకము ॥పాడెదను॥
30. మేలుకొలుపు
సృష్టి అంతా నిశ్చలమ్మయె - తుష్టి తీరక నేను మాత్రము
కాలమంతా నిదుర పోయెను - మేలుకొని నేనొకడ మాత్రము!
మినుకు మినుకను తారకలలో - కునుకులాడెను కటిక చీకటి
కన్ను మూసిన పూల ప్రోవుల - తెన్ను తెలియని గంధ బాలిక!
ఇంతలో ఆ నిశ్చలతలో - ఇంతలో ఆ సుప్త జగతిని
నిదురలోనివి తీయటూర్పులు - చెదిరి తేలుతు నన్ను చేరెను!
"ప్రేయసీ!" అని గద్గదికమై - పిలిచితిని నే వణికిపోతూ!
"ప్రేయసీ!" యని మారు మ్రోగె వి - హాయసీ పథి దెసలు దెసలన్నీ!
గాఢ నిద్రను సోలినవి న - క్షత్రబాలలు ఒడలు తెలియక
వాని సౌందర్యాల మధ్యను - వాలి యున్నది ఒక్క సోయగమూ!
"ప్రేయసీ!" యను నాదు పిలుపును - "ప్రేయసీ!" యను మారు మ్రోతయు
మేలు కొలిపెను తార బాలల - మేలు కొలిపెను సర్వ సృష్టిని!
కారకా బాలికల నడుమను - కోరికల ప్రోవైన నిన్నూ
మేలు కొలిపెను పిలుపు పాటలు - జాలిగా ఆనంద భైరవిలో!
సృష్టి అంతా ఝల్లు మన్నది - చేష్టలందెను కాల వాలిక
ఘల్లు మన్నది లోక నాట్యము - ఫుల్లమై రసదివ్య పుష్పము
వెల్లువలు గంధములు నింపెన్‌.
31. యోగిని
పదము సవ్వడి అయిన - చెదురు నీ యోగమని
హృదయ దేవళమూర్తి - ఒదిగి వస్తిని నేను.
పూల పూజించితే - సోలిపోవుదువనుచు
ఆలయపు మోసాల - పూలిడితి పూజిస్తి.
గొంతెత్తి పాడితే - శాంతి పొడి యగుననుచు
లోలోన గుసగుసల - ఆలపించితి పాట.
ఎంతకాలము తపసు - కాంత కోరిక ఏమి
ఎదుట నిలిచిన నేను - ఏ వరము లిచ్చేను.
32. సంగీతమేలనే
సంగీత మేలనే - పొంగేటి లయలేల
సంతోషమేలేని జన్మకిక ॥సంగీత॥
గొంతెత్తి పాడితే గొణుగు పోయెను స్వరము
పాట రానే రాదు? బరువెక్కెనే గుండె ॥సంగీత॥
కోకిలల కంఠాన మూకత్వమే చాలు
సెలయేటి పతనాల జలము లింకిన చాలు ॥సంగీత॥
నీవు కనరాని నా - కీ విపంచది ఏల
ఈ వేణు వెందుకే - ఈ హంగులెందుకే ॥సంగీత॥
33. నాట్యము
నా రాణి కళ్ళలో - నాట్యమొక్కటి మెరిసె
తారాపథాలలో తళుకు హంగులు మురిసె!
నా రాణి కనుబొమలు నాటరాగము పాడె
కారుమబ్బుల దరులు పూరించె శ్రుతిమోడి!
నా రాణి కనురెప్ప లారజము వాయించె
నీరధి నీలాలు ఆరభటి మ్రోయించె!
నా రాణి కనుపాపలే రాగ తాళగతి
చార సంచారిగా సలిపె లాస్యము నిరతి!
నా రాణి కళ్ళలో నాట్య నాయకు డేను
ధీర లలితుడను స్వాధీనపతికవు నీవు!
34. అక్కసురాలు
ఒక్కణ్ణయి ఎక్కణ్ణో - సుక్కిపోయి సోలియుంటి
మక్కువ ఇంతైన లేని అక్కసురాలా!
టక్కులాడివై పోతివె - చక్కనిదానా!
నా పూజలు మోసమంట - నా ప్రార్థన వ్యర్థమంట
నన్నొక పెరవానిచేసి
అన్నెకారి మాటలంటి వక్కసురాలా! ॥టక్కులాడి॥ ॥ఒక్కణ్ణయి॥
కళ్ళల్లో శీతలాలు - కంఠంలో కర్కశోక్తి
పెడమోమై తిరిగినావు
ఎడదలోన దయలుమరిగి అక్కసురాలా! ॥టక్కులాడి॥ ॥ఒక్కణ్ణయి॥
ఒక్కణ్ణయి ఎక్కణ్ణో - చిక్కినట్టి ఆశ మనసు
ఊళ్ళంటక ఏళ్ళంటక
ముళ్ళదారి పడివోతిని అక్కసురాలా! ॥టక్కులాడి॥ ॥ఒక్కణ్ణయి॥
ఒక్కణ్నయి ఎక్కణ్ణో - ఒదిగి ఉంటి ఉస్సురంటు
కలలు రాక నిదుర లేక
కళలసీమ చేరబోక
ఏలాగో ఏలాగో
కాలంతో ప్రవహిస్తిని అక్కసురాలా! ॥టక్కులాడి॥ ॥ఒక్కణ్ణయి॥
35. త్రప
బాలవే నీ వెపుడు - గోలవే బేలవే!
పరమ సౌందర్యాలు - పడతి నీ కన్నులే
కన్నులలో దాగెనే - కమ్మని సిగ్గోటి
బాలవే నీవెపుడు - గోలవే బేలవే!
ఉదయ సంధ్యల ఎరుపు
పెదిమెలలో తేనెలే
తేనెలో ఒదిగింది - తీయ తీయని సిగ్గు!
బాలవే నీవెపుడు - గోలవే బేలవే!
తంత్రి స్పందించుతూ
తలవాల్చి పాడుతూ
నను ముంచు నీ పాట నవ్యమయ్యే సిగ్గు!
బాలవే నీవెపుడు - గోలవే బేలవే!
నీలి కనురెప్పలో మేలమాడే సిగ్గు
అందాల నీ పెదవి అలమిపోయే సిగ్గు
దివ్య గాంధర్వాన నవ్యమయ్యే సిగ్గు
సిగ్గులను మాలగా చేర్తువే నా గళము!
బాలవే నీవెపుడు - గోలవే బేలవే!
36. ఆశయదేవి
మనుజుని మనుగడ కని కృంగితివే
మినుచెలి శశికళ! ప్రణయపు దేవీ!
తనలో దాగిన రాక్షసత్వమును - మనుజుడెప్పుడూ చెరవిడదీయును
చీల్చి చెండునట మానవత్వమును - నిల్చును ఘోరపునీడై దారుల ॥మనుజుని॥
ఆతని వెలుగై ఆతని ఛాయగ - అనుసరించునట ఆశయదేవియు
మనుజునిలోనే మను దేవత్వము - ప్రణయ పవిత్రము పరవశరూపము ॥మనుజుని॥
కాకుము పసరము కాకు పిశాచివి - లోక కంటకుడవై కూలకురా
ఊ కొట్టుము ప్రణయోక్తుల నరుడా - సేకరించుముర శిల్ప రసజ్ఞత
నీకై నేనే నిత్యసుందరిని - నీ ఆనందము నేనే అనునట
నియతదేశికై ప్రియము సెప్పునట - మనుజుని ఉన్నతికని పొంగెదవే!
కవియేయైనా గాయకుడైనా - రవిలా రంగుల రాజే అయినా
రాజ్యములేలే పూజ్యుడె అయినా - ఆజ్యము పోసే యాజ్ఞికుడైనా
మతకర్తయినా శ్రుతి కర్తయినా
వితములు తెలిసిన విజ్ఞుండైనా
ఆశయ ప్రణయము ఆరాధించును
ఆమెయె అతని ఆలంబనమని
మనుజుని మనుగడ వినిపించితివే
మినుచెలి శశికళ! ప్రణయపు దేవీ!
నీవే ఆశవు నీవే ఆశయ
మీవే నా దివ్యావతరణమవు
నేను నరుడనట నీ వమర్త్యవే
నీలో నేనై నాలో నీవై
మనుజుని మనుగడ వినిపించితివే
మినుచెలి శశికళ! ప్రణయపు దేవీ!
37. పూజ
అందుకోవేమే శశికళా!
నా పూజ
సుందరివి నీవె కాదంటవే!
ప్రణయ పళ్ళెరమందు
పండ్లు కాంక్షలగములు
చూపు పూవుల సరులు ఊపిరే ధూపాలు ॥అందుకో॥
తనువె నీఆలయము
మనసె ఆసనమయ్యె
నామ మంత్రము జపము నా గీతములె వినతి ॥అందుకో॥
కలల నారతినిచ్చి
కళ నివేదన మిస్తి
అందుకోవేమి ఓ శశికళా!
నాపూజ
సుందరివి నా దేవివే నీవు!
38. కంటినవ్వు
లోచనాల హాసలీల
లోలాక్షీ ప్రియబాలా!
కనుపాపలలో హేలలు
కనురెప్పల నీలాలూ
కను కొలకుల కాంతికళలు
కను మూతలపైన కలలు ॥లోచనాల॥
పక్ష్మ కాండపటము నెమలి
భరత నృత్య లాసికయై
అష్ట నాయికల భావము
లభినయించె కంటినవ్వు ॥లోచనాల॥
అంత ప్రేమ కనుల వెలుగె
ఆరతిగా అందుకొంటి
వెలుగుల వెనకై నవ్వులు
తలపై వాలిన పువ్వులు ॥లోచనాల॥
చక్ష్వాంచల స్రావితమై
వక్వాంచలములు చిందెను
ఆనందపు బాష్పములో
ఆర్తి కరిగి కన్నీరో ॥లోచనాల॥
ఆకాశము నీలనిధులు అబ్ధి
సుడులు నీల పథులు
నీ కన్నుల నీలినవ్వు నీరు
నింగి తెలిపేయునో ॥లోచనాల॥
39. అటుఇటు
ఈ పక్క ఓ నవ్వు ఆ పక్క ఓ నవ్వు
నవ్వుల్ల మాలలో నేనూ
నవ్వు పరిమళమూర్తి నువ్వూ!
ఈ వైపునో చూపు ఆ వైపునో చూపు
చూపు చూపుల నడుమ నేనూ
చూపులో సౌందర్యమీవూ!
ఈ సాయనో పాట ఆ సాయనో పాట
పాట ఫణతుల నడక నేనూ
పాటలో మధురత్వ మీవూ!
ఆ దరిని నా ఎడద ఆ దరిని నీ ఎడద
ఎడద ఎడదల కోర్కె నేనూ
ఎడద ఎడదల ప్రేమ నీవూ!
40. ఇంద్రజాలిక
చూపులోనే ఇంద్రజాలము చూపుటేలా, మాయలాడీ!
రూపమెరుగని మంత్ర లోకము ప్రాపణమ్మయె ధూర్తురాలా!
నేల బరువులు దాటిపోతిని, నీలగగనము తేలిపోతిని!
కాలమావల గడిచిపోతిని, వేలలన్నీ మీరిపోతిని
మూలమే ఆ భాసితమ్మగు లీలలోనే చేరిపోతిని!
చాలునే నీ ఇంద్రజాలము
చాలునిక నా అవధి మించిన
సాదృతా నందమ్ము దేవీ!
నెమలి పింఛము తిప్పవేమే
నేలపై నా కాలు నిలుపుము
వాలనీయవె చూపులను ఈ
లోక సామాన్యాలపైనన్‌.
41. విప్రలంభ
నను జూసి నవ్వేవు - కను మూసి పోయేవు
నా బాధ నాలోనె - నా గాధ నాకేనె
దేవి నాతో నీకు ఈ విప్రలంభమటె
నీ వియోగము నాకు భావాధికరణమటె
జాతి బాధకు కృంగి జాతి ముక్తికి పొంగు
జాత్యభ్యుదయ శిల్ప కల్పనాశయ హృదిని
ప్రజల బ్రతుకులలోన ప్రతిభ ప్రజ్ఞలు నేను
ప్రజల హృదయములలో భక్తి భావము నేను
దేశోన్నతీ యత్నదీక్షా విజృంభుడను
దేశ సౌందర్య రసదీప్త జీవిని నేను
కుంచియలు రంగులతొ కొలువ చేరితి నిన్ను
శిల్ప పీఠి వసింప చేరరావే దేవీ.
నను జూసి నవ్వేవు - కను మూసి పోయేవు
నా బాధ నాలోనె - నా గాధ నాకేనె!
42. సంప్రార్థన
సకల శిల్ప సుందరాలు - సర్వ రసానందాలూ
వెలసిపోవు దేవళాన్ని - చెలీ నీకు నిర్మించితి
అధివసింపరావ నీవు - అవతరింప ఒప్పకున్న
ముందు యుగపు రసికాత్ములు
ముందు యుగాల సహృదయులు
పాడు పడిన సౌందర్యము - పరికిస్తూ నిట్టూర్తురు.
ఏదో ఒక విడ్డూరము
ఏదో ఒక ప్రణయ భంగ - మావహిల్లె నిచటనంచు
అంజలితో కంట నీరు - అర్పింతురు నీకు నాకు.
43. నారాణి
నా రాణి నా వాణి శశికళవు దేవీ!
నా బాణి నా ప్రాణ ప్రియ రహస్యము నీవు నీవే!
కనుమూసి కనుతెరచి కనలేని కలగనుచు
వినువీధిలో కొత్త మనుగడలు మలిచానె ॥నారాణి॥
వెన్నెలను వన్నెలను మిన్ను కన్నై వెదికి
నిన్నె నా సొదనడుమ విన్నదే నే నెరుగ ॥నారాణి॥
నీ ప్రేమ కనలేక ఈ సీమ మనలేను
నన్నోమదువొగాక నా బ్రాములే నాకొ! ॥నారాణి॥
కలలు విరుగగ నీకు తలపు లందగరావు
తలపులే కళల పసవలపు వరమీయవే! ॥నారాణి॥
44. గంగాధర
నీలి ఆకాశాలు కన్నులు - నీలి ఆకాశాల చుట్టిన
ఆశలే నీ కంటి కాటుక ప్రేయసీ!
ఆ దివ్యపథముల వెలుగు కాంతులె
అంబురుహ నేత్రాంచలములను
కూడుకొన్నది నిర్మలాంబువు
లతి పవిత్రము లుగ్దతమ్ములు
లోకబాధలు లోక దుఃఖము - చీకటై ప్రజ డాయు మూర్ఖత
శోకభావోద్దీపనములై - కలత నింపెనటే!
ఆర్తి పొంగెను - అలముకొనె కన్నీరు వాహిని
అలలుగా ఆవర్తములుగా - అవధులన్నీ ముంచివేసెను
వ్యోమకేశుడ జడల విప్పితి - శ్యామకైశ్యము దెసల పర్వెను
దుఃఖ జాహ్నని కౌగిలిస్తూ
తోయముల తనలోన ధరాతలకు - జూటమై శశిశోభితాలంకృతులనెలనై
సోలితునోదేవీ!
45. కళాపరిమళము
నేను: నన్నటే ప్రేమింతు ఓ రాణీ
నన్నటే పాలింతు ఓ దేవీ!
ఆమె: నిన్నెరా ప్రేమింతు - వెన్నెలల బాలరా
నేను: నీ అందమెక్కడే - నా అంద మెక్కడే
దివ్య పథముల నుండి దిగివచ్చు మూర్తివే
భూమిపై తిరిగేటి పోటు మానిసి నేను!
ఆమె: భూమినందము సేయు పుణ్యమూర్తివి నీవు
ఆకాశయాత్రలో అంతుదొరకని నేను
నీ హృదయ మందముర - నీ సొగసు నీవెరా!
నేను: అర్ధచంద్రుడు నుదురు అమృతరసమే పెదవి
ఆకాశగంగ నీ అంగ విన్యాసాలు
నీవు సొబగుల రాణివే దేవి - నేను కర్కశ మూర్తినే చెలీ!
ఆమె: నీ వదన ముషసురా నీచూపు కాంతిరా
నీ పెదవిలో పాట నృత్యాలు సలుపురా
అందమే నీదిరా - సుందరిని నేనురా!
నేను: నీ మూర్తి పూజింప - ఈ మనుజు లెందరో
అందరిలో ఒఖ్ఖణ్ణి - ఆశ నా కేలనే!
ఆమె: బ్రతుకు సర్వస్వమ్ము - పరమ నైవేద్యమౌ
నీ పూజె పూజరా - నీవు నేనేనురా
నీకు నేనై వెలసి - నాకు నీవై పొలసి
ఇరువురము బ్రతుకులో - కెరలింతు మందాలు
నేను: ఇరువురము లోకాన
పరిమళింతము కళల
ఇరువురము ప్రేమికుల
మిరువురము శిల్పులము.
46. ఒఖ్ఖణ్ణి
మరచి పోవబోకె బాల
మరచిపోవకే!
అరచి అరచి పిలువలేను - తరచి తరచి వెదకలేను
పరచి ఎగురు కాంక్షలలో
పడి చెదురును నా గుండెలు - మరచి పోవకే!
హోరుమనే వారి రాశి - మారు మోగెను నా పాటలు
విరిగిపడే తరగలలో - నురుగులలో సరుగులలో ॥మరచి॥
ఒఖ్ఖణ్నే! యిసుక బయలు - ఒఖ్ఖణ్ణే! నీరు దెసలు
కదలిపోవు దూరాలూ - చెదరిపోవు మేఘాలూ ॥మరచి॥
అదుముకొన్న నీ తలపులు - చిదిమిరాల్చు హృదయ సుమము
ఏరలేను రేకలన్ని - ఏరలేను పుప్పొడినీ! ॥మరచి॥
47. నిత్యయౌవన
నాలోన నీవూ నిత్య యౌవనవూ
ఏను మాత్రం దీవి ఏళ్ల జీర్ణింతునే?
నాలోన నీవూ నిత్య యౌవనవూ!
పాపలలొ పాపనై పాడెదను ఆడెదను
అందాల పడుచుతో గంధాలు ప్రసరింతు
నాలోన నీవూ నిత్య యౌవనవూ!
పూలమాలలు తాల్చి మేలమాడుదు నిన్ను
కాలాన్ని కట్టేసి కాలకిందను రాతు
నాలోన నీవూ నిత్య యౌవనవూ!
శక్తి కృంగని బుద్ధి రక్తిపొంగిన వృద్ధి
నీపాట శ్రుతికలిపి నీతో నృత్యము సేతు
నాలోన నీవూ నిత్య యౌవనవూ!
48. అనుగమము
నువు పరుగిడితివి నువు ప్రవహిస్తివి
నిను వెనుదవిలితి వనసఖి నామనిలా!
పికీ బాలవై వికా వికలుగా
కుహు కుహు నిస్వన విహారగీతము
రసాల నిష్కుట ప్రసారితాంతర
కషాయ జేమన కలరాగంలో
రెక్కలు చాచిన నీ వెనుకాలే
సొక్కుచు కోకోయని నే నెగిరితినే!
నీలం నీడల హేలాలీలలు - జాలవిచిత్ర వికల్పవు విభ్రమ
దృశ్యాదృశ్యవు హ్రదినివైతిని - వశ్యుడనై నిను నిత్యప్రియగా
వరియించగ నిన్ననుగమియించగ - వారిద నాయక వేగాత్ముడనే!
శూన్యా శూన్యాంతపథి తారా - కన్యవు రోహిణి వసదృశ్యమూర్తివ
నన్యవు చొచ్చుకుపోతివి గగనము - పుణ్యవతీ నిన్ననుసరించెదను
కళాప్రపూర్ణుడు రాకా చంద్రుడు - కళానిలయ ఆ తారక చేరే రీతిని
ఉదయం సాయం సంధ్యలలో - పదవిన్యాసము నృత్యగీతులలో
ఉషారమణిలా తుషారార్ద్రవై
పుషితారుణ రాగ ప్రఫుల్లవు
నువు పయనించితె! నీ వెనకాలే
దివమణి సూర్యుడనై నే వెన్నాడితినే!
నువు పరుగిడితివి నువు ప్రవహిస్తివి
సవసవ నీకౌనాడెను దేవీ
పడతీ నిను నే పరుగుల పట్టితి
పకపక నవ్వుతు ననుజేరితివే
బ్రతుకున ఒకటై నువ్వూ నేనూ
పవన హృదయమున పరిమళమౌతూ
పయనమైతిమే పరమ శోభకై.
49. గానసుందరి
సారెలను సవరించి తంత్రుల - తీరుపుల మీటించి శ్రుతిగా
నేరుపులు పాటించి వయొలిన్‌ - తాల్చితివి హృదయాన దేవీ!
గారములు శృంగారములు మధు - పూరములు విరితోరములు ఝుం
కారములు ఝుంకారములు సంరావములు నయ్యెన్‌.
రాగములు సంఫుల్ల మయ్యెను - రాగమొందెను తాన వర్ణము
త్యాగబ్రహ్మమె నాద బ్రహ్మై - తీగెల స్పందించి వెడలెన్‌.
జీవమున అట్టడుగు భావము - చేయి పట్టీ కలచినట్లయ్‌
చీకు తలపుల క్షుద్రకాంక్షలు - చివ్వునా పైకెగసివచ్చెన్‌.
గుండెలో ఎఱ్ఱన్ని రంగులు - మండిపోయెను ఆశయాశలు
ఎండిపోయెను మొండినై చెడు - దుండగుడ నైతిన్‌.
సత్తువంతా పోయి అందపు - మత్తులో పడిపోయి, హృదయము
ఎత్తుపల్లములోన వణికెను - చిత్తమున నైరాశ్యమొదవెన్‌.
తీగెలను స్పందించు విల్లును - రాగ స్వరముల నాడు వేళ్ళూ
తూగిపోయె గీతికాతతి - దోగులాడెను దెసలు దెసలన్నీ!
కోయిలలు పాడెనో వాగులు - లోయలో నృత్యాలు సలిపెనో!
వేయి మలయానిలము లొకటై - వీచెనో శ్రుతులు శ్రుతులన్నీ!
కోటి పూవులు విరిసినట్లయి - కోటి చంద్రిక లలమినట్లయి
పాటలే ప్రసరించు బ్రతుకున - బ్రతుకు కదలక శిల్పమై నిలిచెన్‌.
ఏదియో అమృతాప్లావితమై - ఏదియో ఆనందలీలై
వేదనా రహితంపు బ్రతుకై - రోదసీ పథమెల్ల నిండితి
హ్లాదమే విశ్వమై నిలిచెన్‌.
50. కారణము
ఎవరు నేనీ జగతి
ఎవరు నేనీ ప్రగతి
అవధి మించిన కాంక్ష - అందుకొను నా స్వగతి
జవమూనునా కలలు - జగమేని దరియునా
సొగలు పొగలై బ్రతుకు - సోలినది నీ మ్రోల.
ఆశయము వలదేని - ఆవలేమున్నదో
ఆలయము కలదేని - ఆవలీవల విజయము.
బ్రతుకు ఒక యోగమై - వితములను మది కలుపు
సతియె అవధికి రూపు - కారణము నీ వలపు.
51. మార్గము
అడుగడుగునకీ ప్రపంచపు
చెడుగు హృదయము లెన్నో చుట్టీ
కడుపునకు ఇసుమంత దొరకని - బడుగు బ్రతుకుల తూలు నడకలో
మధుర మెక్కడ మంజులతలేవీ! - దేవీ!
మార్గమెక్కడ స్వర్గమెక్కడనే!
ప్రేమ లెరుగని నీమమెంచని - తామసులతో దట్టమీ మహి
కోటి రూకల గుణము లెంచే - కూళలెందరొ ఏలునీ భువి
మధుర మెక్కడ మంజులతలేవీ! - దేవీ!
క్రోధవహ్నులు కుములు నాడులు
సాధకమ్ములు మృత్యుకీలలు
సాధుదేశము శాంతమే గతి - సత్యశీలా హింసలేపధి
మధుర మక్కడ మంజులతలవియే! - దేవీ!
మార్గమదియే స్వర్గమదియేనే!
52. ఇష్టదేవత
హితులందరికి ఇష్టదేవులు కలరు - నా బ్రతుకు
శ్రుతికలిపి వలపించు సతి చతురవు దేవీ!
యెంకొక్క దేవతై యెలిసెనట ఒక్కరికి
యెనక జల్మమునుండి యెన్నేని జన్మాల ॥హితు॥
హృదయేశ్వరీ దివ్యపద పుష్పపూజార్ధి
వకుళమాలికవైచి వరియించె సఖుడొకడు ॥హితు॥
కిన్నెరీబాలా ప్రసన్నా విలాసితుడు
రసవాహినీ స్నాతరమ్య వాఙ్మి యొకండు ॥హితు॥
మఘవమస్తక మకుట మాణిక్యమై వెలయు
ఊర్వశీ దేవి ప్రేమోల్లాసి చెలియొకడు ॥హితు॥
మందార పుష్పార్ద్ర సుందరీ మృదుహాస
చంద్రికా శోభితులు జంటకవి హితులొకరు ॥హితు॥
53. ధ్యేయము
నా బ్రతుకొక పరిమళార్ద్ర
నందనోద్యాన వనము
నందనాన విహరించే సుందరివే ప్రేమరాణీ!
నీ ప్రజ్ఞే నీ లోకము నవ నవోన్మేషణమ్ము
నవ్యతలో నిత్యోదయ కల్యబాలవే నీవూ!
నీ ఒదిగిన నా స్వప్నము - నింగి వరకు స్పందించును
నిద్రా స్వాప్నిక పులకిత నిరుపమ రూపవె సఖియా!
నా ప్రణయమె నీ రూపము - నా ఆత్మే నీ ప్రాణము
నీకు నాకు విడుటేది విరహమేది!
మన ప్రణయమె మన ధ్యానము - మన యోగమె మన ధ్యేయము
మనమే మన ధ్యాతలమై - మనుదుమే అనంతమందు!
54. పిలుపులు
"బాపిరాజా!" అన్న ఏ పిలుపు నేవిన్న
ఊపుదును మూర్ధమ్ము ఊకొట్టి మాటాడి.
"బాపి బావా" యంద్రు పలుకరింతురు హితులు
పారిజాత సుమమ్ము పట్టుదును అంజలిలో.
"బాబు!" అని మా నాన్న పరమ ప్రేమను పిలువ
ప్రత్యక్షమయ్యెడిది పాలసంద్రము నాకు.
"నాన్న" యని మా అమ్మ నన్ను దివ్యయై పిలుచు
నాకు పులకలు కలిగి నాకమ్ము అంటుదును.
"హో శశికళా ప్రియ భావుకా" అనుహూతి
ఉజ్వల రసానంద దివ్యానుభూతియే, ఓ దేవి!
55. నర్తకి
భూలోకానికి పూర్వపువైపున
ఆకాశానకు ఆవలి దెసలో
మూర్తించిన దొక నర్తనశాలా - స్ఫూర్తిత వర్ణాతీత ప్రభాసము.
సముచిత వేషా సుందరరూపవు
విమల విభూష విచిత్ర వియచ్చర
వై పారి భద్ర మందార కుసుమ - మాలా చర్చితవేణీ భరవై
రంగస్థలాన అవనిక ముందర
శృంగారవతీ నిల్చినావటే!
అచ్చర పడతులు హంగై పొల్చిరి
అతోద్యమ్ములు నాల్గు వాద్యములు
తతానద్ధ సుషిర ఘనాలంకృతలై - చతురలు తౌర్యత్రికమునకు శీలలు
నృత్యనాయికా! నీకెలకులలో
నిల్చిరి వివిధాలంకృత నాట్యవేషులై!
సభానుమతిగొని మనస్సు లిడితిని
సమందహాసపు మృదంగ వందన
మాచరించితివి కాకలి కంఠము - నాలాపిస్తివి అసదృశరాగము
పుష్పాంజలివై దేవసన్నుతిగ
పూర్వరంగమును ప్రారంభిస్తివి.
స్వరజతినొక్కటి నృత్తవిలాసము
విరచిత మంజులగతీ విశేషము
తకతక ఝంతర తళాంగుధత్త
త్తైధత్తత్తై యని శబ్దములో
ముక్తాయించితి మృదంగనాదము
రక్తి కొలువగా మెరుముతీగవై
అతి లోకాలంకృత నాట్యమంది
రాంతర సభలో నే నొక్కడనే
నాయకుడను సభ్యులునై కెరలితి
నాకై నీ నాట్యము నీ విద్యలు
సౌందర్యము గాంధర్వము సౌష్టవ
సౌహార్ద సుభగ సౌశీల్యాలును దేవీ.
శృంగార రసాంచిత విరహోత్కం - ఠాంగహార కరుణార్ద్రిత గీతము
ఆలోలిత రస పరిఫుల్లసౌర - భాప్లావిత పరమ భావ చలితము
హావభావ విలసత్కృతాభినయ - హ్లాదము నద్భుత నృత్య మొనర్చితివే!
అటు ఖండిత విటు వాసవసజ్జిక - వభిసారిక వొక్కసారి ప్రోషిత
భర్తృక వొక్కట కలహాంతరితవు
స్వాధీన పతికవు స్వీయవు ప్రౌఢ
వఖిల రసాధిదేవత వనన్యవు
వాచ్యాభినయ విశారద వతివా!
56. వరప్రదానము
దివ్యభూముల కెటకో తేల్చుకొని పోతివే!
దీనజీవిని నన్ను దివ్యుణ్ణి చేసితే!
దేహమే శల్యమై
దినదినము కృశియించి
నీవు దర్శనమీని నిముసమొక యుగముగా
తోవతెలియని అంధజీవినై కుందితిని ॥దివ్య॥
నీకె గురువును నేను
శ్రీకమల పరిమళా
వేశికుడ ప్రియుడనై ఆశించి భాషించి
దీక్షలో శిల్ప విన్యాస పులకితుడనై
దేవి నీ రాకకై తీవ్ర వేదన పడితి!
ఏ ముహూర్తపు బలిమొ
ఏ పూర్వపుణ్యమో
అమృతవాహిని రీతి అవతరించితివీవు
ఆనందరూపవై అధివసిస్తిని మ్రోల ॥దివ్య॥
హృదయాన మోముంచి ఒదిగితిని ఒడిలోన
కదియించి కౌగిటను నుదుటిపై చుంబించి
"ఓ ప్రభూ నీ విద్య
నా ప్రణయ" మన్నావు
సౌరభావృత హస్త
సంస్పర్శ ఓషధై
నూత్నశక్తిని పొంది నూత్న జీవమునంది
యత్న కార్యోన్ముఖుడనై నిలిచితే రాణి! ॥దివ్య॥
57. పూల బాలిక
పూల వనమున కలిసినామూ నా రాణి నేనూ
పూల పరిమళములో మెలిసినామూ! ॥పూల॥
పూలలో ఉదయించి పూవులా తా నిలిచి
పూల జల్లుల నన్ను సోలించె నా దేవి! ॥పూల॥
తన కొరకు నే వెదికి జనపథములే తిరిగి
వనరు నా బ్రతుకులో వనలక్ష్మియై వచ్చె ॥పూల॥
తన వనము తానంట తన పూలు తానంట
తన పూల గంధముల నన తేనియలె తాను! ॥పూల॥
నా సందిటను ఒదిగి నన్ను వనమున త్రిప్పి
పూల పుప్పొడులలో సోలు తన్నే చూపె ॥పూల॥
ఏ పూవు తాల్చినా నా పొందిటను తానె
ఏ గంధ మలదినా ఏకమటనే దాను ॥పూల॥
58. యుగ్మము
అతడు: నీవు నేనే సఖీ!
ఆమె: నీవు నేనే సఖా!
అతడు: వర్తన మహానదీ పంకజోద్భవులమై
ఆమె: పైకెగసి ఫుల్లమౌ పద్మయుగ్మము మనము
అతడు: నీవు నేనే సఖీ!
ఆమె: నీవు నేనే సఖా!
అతడు: సకల ప్రజారణ్య సంజాతులము ప్రత్యు
ఆమె: షాకాశ గాయకులు భరతపక్షులము మనము
అతడు: నీవు నేనే దేవీ!
ఆమె: నీవు నేనే ప్రభూ!
అతడు: ఈ మహానంత విశ్వైక పథగాములము
ఆమె: స్వేచ్ఛా ప్రకాశ తారాద్వయమ్మును మనము!
59. ఎండిమియాన్‌
కొండ తిరిగీ కోన తిరిగీ
కోన మధ్యను కొండవాగును
బండరాళ్ళను పతనమయ్యే
పండు వెన్నెల పరుగులెత్తే!
లోయ చేరానే!
ఓ నా వెన్నెల బాలా!
సోయగాల లోయ చేరానే!
అడవి చెట్లూ నిడివి లతలూ
జడుల రాలే కడిమి పూలూ
కడిమి పూవుల కథలు వింటూ
నడక సాగితినే!
ఓ కడలి వెన్నెల ఒడలుదానా!
గండశిలపై విడిది చేశానే!
గండ శిలలను కొండవాగూ
నిండు గొంతుక నినదమిస్తూ
పదము లాడుతు పరుగు లెత్తేనే!
ఓ ఉదయ కమలం పెదవిదానా!
నదినిచేరే శిలను డాసితినే!
చెట్లమీదే చంద్రబింబం
చెట్లకొమ్మల చంద్రకిరణం
చెట్ల పూవుల వెన్నెల వియ్యాలే
ఓ చిత్రకంఠము పలుకుదానా!
పూలతేనెల వెన్నేల కలిసేనే!
గండశిలపై మేను వాల్చితి
కొండవాగూ పాటపాడెను
వెండి వెలుగులు నన్ను ముంచెను
ఓ నిండు వెన్నెల నీటులాడీ
పండుకొనుచూ నిదుర కూరితినే!
పరిమళాలూ దెసలు నిండెను
పరుగులెత్తే వాగు పాడెను
వాగు పాటతో చిన్ని పులుగులు
మూగ గొంతుల శ్రుతులు కలిపినవే!
ఓ తామరపూవూ మోముదానా
తోగు పాటలు జోల పాడినవే!
మూడువేలా ఏళ్ళ వెనకే
ఈడువచ్చిన గ్రీకు బాలుడు
ఆడుకొనెనే గ్రీసు దేశానా
ఓ అడవి మల్లెల అందందానా
గ్రీకు బాలుడు ఎండిమియానంటా!
ఎండిమియాను అందకాడూ
అందమునకే అందకాడూ
గంధములు తావిందులిడు అర
వింద ముఖమువాడు కందునిపోలే
సుందరుడు ఆ ఎండిమియానంటా
ఓ చెందమ్మీ మోముదానా
ఎండిమియానూ గ్రీకు బాలకుడే!
ఆలమందల తోలుకుంటూ
చేలదాపుల ఏటి ఒడ్డుల
తేనె పాటల పాడుకుంటూ
తానె తిరిగెనె ఎండిమియానంటా!
ఓ మీను కన్నుల మించుబోడీ
కోనలోనే ఆవుల కాసే గొల్లవాడే గ్రీకు బాలకుడూ!
వెలిగిపోయే కలువ రాజూ
కలిమిలల్లిన కడలి రాజూ
బలము పొదిగిన పర్వతరాజేనే!
ఓ బొగపూవుల ఊర్పుదానా!
ఆలకాసే ఎండిమియాను ఏటిలోనే
పెద్దరాయిని నిద్దుర జోగేనే!
కొండ పక్కా వాగులోనే
గండ శిలపై నిదురపోయే
ఎండిమియాన్ని నువ్వు చూశావే
ఓ నిండు వెలుగుల నిశలరాణీ
ఎండిమియాను సుందరరూపము
నీదు చూపుల తళుక్కుమన్నాదే!
నిదురపోయే ఎండిమియానూ
కన్ను తెరచీ నిన్ను చూసెను
ఇరువురి చూపులు కలసి పోయెను
ఇరువురి మనసూ లేకమయ్యెను
ఓ వలపుల వెన్నేలపడుచా
నింగి నువ్వూ నేలపైనే ఎండిమియానంటా!
నేలపై అతడందకాడూ
నింగిపై నీ వందగత్తెవు
ఇద్దరి అందాలేకమైతే
ఏడు లోకా లందాల వెలుగునే
ఓ దివ్యసుందరీ వెన్నెల బాలా!
దివ్య సుందరుడతడు లోకంలో!
నీవు వలచిన ఎండిమియాను
నిన్ను వలచిన ఎండిమియానూ
నీవు తప్పా ఇతరం లేదా అందాల వానికి
నీవే బ్రతుకూ నీవే స్వర్గం
నీవే నీవేనే
ఓ నిండు వెలుగుల నింగి సుందరీ
నీవే హృదయం నీవే ప్రాణం నీవే నీవేనే!
కన్నులందూ వెన్నేల వెలుగూ
వెన్నెలేనే అతని ఊర్పూ
వెన్నెల లేనీ చీకటి రోజుల
కన్నులు వాడీ కఱ్ఱబారి తా
మూర్చ మునిగెనే
ఓ శీతలాత్మా చిత్రదేవీ!
వెన్నవలె నీ మనసూ కరిగిందే!
అతని ప్రేమకు పొంగిపోతివి
అతని సొగసుకు అలరిపోతివి
అతని అందం, అందం నీదీ
అలలూ అలలా కలసిపోయితివే!
ఓ వెన్నెలా చిన్నారి పడుచా
మీ కలయిక దేవులు మెచ్చారే!
జలజల పోయే వాగు మధ్యను
శిలాతల్పం పవ్వళించీ
కలలుకంటూ నిదురపోతిని
నిదురపోయే నాపై వాలితివే!
ఓ వెన్నేల వన్నేల రాణీ
నిదురలో నన్ను కౌగిలి చేర్చితివే!
నిదురపోయే నన్ను చూచీ
నాపై వాలిన నిన్ను చూచీ
గురువు "కూల్డ్రే" చిత్రము లిఖియించె
ఓనా బ్రతుకు తెరువుల ప్రవిమలాంగీ
"ఎండిమియానని" చిత్రం పేరుంచే!
చిత్రం చూచిన పెద్దలంతా
చిత్రమెంతో గొప్పదనిరీ
చిత్రం వ్రాసిన చిత్రకారుడు
ఎండిమియాన్ని చూచే నన్నారే
ఓ నా నిత్య ప్రణయినీ
చూచిన సత్యం నీకే తెలుసునే!
60. మన చెలిమి
నా సఖీ మన చెలిమి
వేసటేనట భువికి
కాసంత ఉపకారి కాదంట మనుజునకు
నా సఖీ! నా సఖీ!
జీవిత విధానాలు
భావి కర్తవ్యాలు
ఎరుగలేనే లేని
ఎదురుకోనే లేని
పాటలెందు కటంచు పదములేలా అంచు
పలుకుదురు భూషణలు చిలుకుదురు - దూషణలు ॥నా సఖీ॥
జమ్ముమను మధుర శ్రుతి
తుమ్మెదలు ఆడవా?
కొమ్మ కొమ్మకు తేలి
కోకిలలు పాడవా?
అవి వట్టి వమ్మంట అర్థ రహితమ్మంట ॥ నా సఖీ॥
కాసంత ఉపకారి కాదంట మనుజునకు
పుష్ప గంధ వ్యాప్తి
పూర్ణ చంద్రుని దీప్తి
భుక్తి నీయగలేని శక్తి హీనులంట ॥ఓ సఖీ॥
కలలు హుళక్కియట
కళలు వ్యర్థములంట
కళలైన సాంఘిక రాజకీయార్థికా
చలిత భావోద్రిక్త సంకలితమై యుండ
వలెనంట మనుజప్రగతికి దారంట అవి! ॥ ఓ సఖీ॥
భౌతికోన్నతి జేర్చు భౌతికోద్యములుండె
భౌతికోద్యమ మహాప్రజ్ఞార్ధి సమదర్శ
నస్థితికి మానసానంద బుద్ధ్యానంద
స్వస్థతయె మూలమ్ము భావోజ్వలము లవియె ॥ ఓ సఖీ॥
ప్రకృతిలో సౌందర్య ప్రత్యక్ష దృశ్యాలు
వికసితోత్తమ కృషులు సకల కావ్యములు కళలు
పరమ సృష్ట్యావిర్భవ రస స్వరూపములు
నరజాతి ప్రగతికవి ఆలంబనోద్దీప
నాధారములు విమల హృదయ స్థితికి కార
ణాత్మికము లాప్తశక్తీ ప్రఫుల్లములు
అమలమౌ ఏ దృశ్య
మమృతమౌ ఏ ఘటన
కాల్పనిక చిత్రమై శిల్ప విషయము కాదొ!
అల్ప భావములెట్లు శిల్ప విషయము లౌను!
పొడితనము ఉన్నతటె
జడత సంపన్నతటె
భౌతికాకర్షణాతీత సంకలనమే
భౌమ్యమౌ తుచ్ఛేంద్రియాకర్షణాతీత
రీతియే ఘటనయే
ప్రీతియే ప్రేమయే
సౌందర్య రూపమ్ము సౌందర్య భావమ్ము!
సౌందర్య సంధాన సందర్శనోద్భవము
ఆనందమో దేవి! ఆనందమే శక్తి
ఆనందమే ప్రగతికై నరులకిడు రక్తి
ఓ సఖీ మన ప్రేమ
అసాధ్యమీ భువికి
ఆనంద సౌందర్య
ప్రాణమే మనుజునకు!
61. సొగసు ... వయసు
ఆ సొగసె నీ సోయగమె దేవీ!
ఆ వయసు నీ హోయలు కావే!
చిట్టి పాపగ నేను చిందులాడిన వయసు
నట్టింట నలుగురూ నన్ను ముద్దిడు సొగసు
ఆ సొగసె నీ సోయగమె దేవీ! - ఆ వయసు నీ హొయలె కావె!
పుట్టుతూ కేరుమని పొంగిపోయిన వయసు
తొట్టిలో శిశువునై తొక్కులాడిన సొగసు
ఆ సొగసె ఆ హొయెలె దేవీ! - నీ సోయగము వయసు కావే!
చిలక పందిరి చూస్తు కిలకిలను నా వయసు
కులుకుతూ రంగుబొమ్మల నాడు నా సొగసు
ఆ సొగసె ఆ హొయలె దేవీ! - నీ సోయగము వయసు కావే!
"బాపన్న బంగారు బాలన్న" ఆ వయసు
పాటలకు నిదురలో పవ్వళించిన సొగసు
ఆ సొగసె ఆ హొయెలె దేవీ! - నీ సోయగము వయసు కావే!
మెళ్ళోన పులిగోరు కాళ్ళగజ్జల వయసు
ఒళ్ళు బంగరు తొనల ఒరుసుకొను నా సొగసు
ఆ సొగసె ఆ హొయెలె దేవీ! - నీ సోయగము వయసు కావే!
తప్పటడుగుల కులికి తలుపుదాటిన వయసు
కప్పురపు వాసనలు గంధమలదిన సొగసు
ఆ సొగసె ఆ హొయలె దేవీ - నీ సోయగము వయసు కావే!
ఆనాడె నీ కొరకు అన్వేషినగు వయసు
అందాల నెలపాప నడిగి వేడిన సొగసు
ఆ సొగసె ఆ హొయెలె దేవీ! - నీ సోయగము వయసు కావే!
62. వసంతపూర్ణిమ
ఒక దివ్య కుసుమమ్ము వికసించినది నేడు
నాడునేడూ రూపు - నవపరిమళాలము.
ఒక దివ్యనాదమ్ము కకుబంతముల చరించు
కోటివీణల శృతులు మీటుతూ పాడుతూ.
ఒక దివ్య వర్ణమ్ము సకల శూన్యాలలమె
గంభీర చిత్రాలు - గా రూపమెత్తుతూ.
ఈ ఫాల్గుణ పవిత్ర పరమ శోభాపూర్ణి
మా రాత్రి నా దేవి - మంగళాకృతి వచ్చె!
నా ఎదుట నా దేవి శశికళే నిల్చె
నాకు నూతన శక్తి - నాకు నూతన రక్తి!
63. స్మృతులు
ఏనాటివో స్మృతులు - ఈనాడు నా గతులు
ప్రాణాధికను దేవి - ప్రత్యక్షమిడు శ్రుతులు ॥ఏనాటివో॥
లిఖియించు చిత్రాన - లేమ! వర్ణాలలమి
రేకలను కూర్చుమను - సోకు లెట్టుల మరతు ॥ఏనాటివో॥
నా పాటలో తాను - నవతేనియల గొంతు
కలసిపాడే తీరు - కలలైన మరతునా? ॥ఏనాటివో॥
వెన్నెలే తానౌట - కన్ను మరగిన తన్ను
వెదకలేనన్న నను - ఒదిగించు టెరుగనా? ॥ఏనాటివో॥
ఇది నా కమావాస్య - ఈ కటికి చీకట్ల
ఎంత బాధను మనుట...
ఏనాటి స్మృతులనుట.. ॥ఏనాటివో॥
64. దేశిక
నాకు శిష్యవు దేవి నీవూ!
ప్రణయమూర్తీ!
నాకు దేశికవే దేవి నీవూ!
కావ్యములు కవిత్వమన - కవి యన రహస్యాలు
కళని గూఢార్థాలు - తెలుపుమని వేడితివి ॥నాకు॥
భాషయన భావమన
వాగర్థ పరమగతి
వ్యంగ్యము అలంకారములు
అతి శబల వృత్తులన
రసమన రసానంద
రమ్య జీవిత పరమ
స్థితి యన తెలుపుమని
చతురమతి కోరితివి ॥నాకు॥
విమల గాంధర్వమే
కమనీయములు శ్రుతులు
సప్త స్వరోద్భవము
దీప్త మేళ స్థితి
మూర్ఛనలు రాగాలు
అర్చనలు కీర్తనలు
ప్రసార గమకాలు
విస్తారిత స్థాయి
గాంధర్వ కావ్యాది
సౌందర్య రూపమని
దేవి నీ రూపమే
భావాత్మయై వెలిగె ॥నాకు ॥
65. ఇంతలో...
పదివారములు కాదో దేవి!
ఇంతలో
మది విరుగు నిరసనా దేవీ!
హృదయాన కుమిలేటి వ్యధపోదు మంటలగు
కథగా మిగిలె ప్రేమ - కలలె ఇక నాకెమొ! ॥పది॥
ఏనాటికీ కళలు - ఎన్నటికి నీ కలలు
సౌందర్య పూజ, ఆ - నంద హారతి నీకు ॥పది॥
శిల్పదేవికి నీకు - చిత్ర విద్యను పూజ
నినుకొలుచు నా బ్రతుకు - నిలుపుదువె ఈ సిలుగు! ॥పది॥
పాటకై నా హృదిని - పసిడి పల్లకి చేసి
మేళవించెడి తంత్రి - ఫెళ్ళుమని తెంపుదువె! ॥పది॥
ఆశాపరిమళము ఆరిపోవగ నీకు
ఆశాంతముల నలము - ఆశయా శోక సుమ - మే శమించు శోకమున!
66. గ్రీవ గంగోత్తరి
గ్రీవ గంగోత్తరీ - పావనోద్భూత మం
దాకినీ స్వచ్ఛమ - స్తోక సౌందర్యమై!
నీ విమల గాంధర్వ - మావిర్భవించినది
ఆనంద పరవశుడ - అల భగీరధుడనై
నిలువెల్ల పొంగితిని దేవీ!
కలుషరహితము జగము దేవీ!
అమృత కలశము గళము - అమల మధు ధారగా
నీ గాన మాధుర్య - మాగమించెను దేవి!
ముల్లోకములు గాన - కల్లోలములు నిండ
అమృత ప్లావితతనూ - కమనీయ మూర్తినై
నిత్య విద్యా హృదయ - మృత్యుంజయుడ దేవి!
రాకేందు బింబాస్య - నీకంఠమే జ్యౌత్స్ని
కాపుంజ మంజుల సు - రూపమై దివ్యమై
భవదీయ సంగీత - పరమ శోభా కాంతి
వేలలే ప్రసరించె - మూలాలు పులకించె
వనది కలశాంబుధై - జనులెల్ల దేవులై
అబ్ర విగ్రహుడ శబ్ద బ్రహ్మనై నేను
నిను పొదివికొంటినో దేవీ!
నీవు ప్రణయ స్వరూపవే దేవే!
67. ఖేచరి
ఖేచరీ గంధర్వబాలా!
భూచరుడ నన్వేషి నేనూ
గరుద్వయమును ముడిచి అస్మత్‌ - గాన పూజాపీఠి భాసించూ!
పల్లవాధరి! మధు వసంతపు - పల్లవిని నీ వాలపింపగ
ఝల్లుమని నా మొరడు హృదయం - వల్లరీ సంఫుల్ల మయ్యెన్‌
గ్రామములు మూర్ఛనలు మొరసెను - గతుల భేదాలెన్నో మురిసెను
జతుల వర్ణాలన్ని సుడులై - మతుల పరవశతలను ముంచెన్‌
స్థాయిత్రయములు అభినయమ్మయె - కాలత్రికములు నృత్తమాడెను
తాలద్వా త్రిశన్మోహిని - తాండవించిందీ!
గళము వీడిన ఖరహరప్రియ - వెలుగు తరగలు విరుచుకొనిపడె
తళుకుతళుకని బ్రతుకు సర్వము - కళానిధి అయ్యెన్‌.
దేవి! నందనవన సుమాలను - నీవు మలచితి స్వర సుమాలిక
గ్రీవ భూషితదామ పరిమళ
భావపూరిత దేవమూర్తిగ
నేను నిలిచితినే!
68. జ్యోత్స్నాద్యుతి
ఇన్నినాళ్ళు ఎటుదాగెనొ - క్రొన్ననరుల ప్రోవుపాట
విన్నది విన్నట్టు వెదికి - వీనులలసిపోయె దేవి! ॥ఇన్ని నాళ్ళు॥
వన్నెల విలసిల్లు పాట - వెన్నెల సుడితిరుగు పాట
అన్నుకొను పరిమళాలు - అలది కలచు తేనె పాట! ॥ఇన్ని నాళ్ళు॥
ఇన్ని యుగము లెటనున్నదో - మిన్నులాను మేటి పాట
తెలి వెలుగులు మలచుపాట - కలరాగము లలము పాట
కల్పాలే కరిగి వచ్చె - కడపలన్ని బ్రతుకు చొచ్చె
కల్పతరువు మేన వెలసె - కలశాంబుధి మదిని పొలసె ॥ఇన్ని నాళ్ళు॥
నేడే నా హృదయవనిని - నిలిచె నిత్య మధుమాసము
నేడే నా జీవితపథి - నిలిచె నిత్య జ్యోత్స్నాద్యుతి.
69. గౌరీ శంకర శృంగావిర్భవ
గౌరీ శంకర శృంగావిర్భావ - గంగాధర మంజుల తరహస్తా
స్పందిత డమరుక దివ్య నినాదము - సుందర వదనా నీ గాంధర్వము.
పంకేరుహ సంభవ సాధ్వీ రుచి
రాంక స్థిత వీణా ఖేలన
ర్తిత పాణీ కంకణ నిక్వాణ
శ్రుతి సంశ్లేషిత గీతా సామ్యము
అతి మోహనరూపా నీ గానము.
యమునా తటి పాటలి తరు నీడను
సుమనోరజ సేవన మృదు వదనుడు
అతసీ సుమసంకాశ తనుడు పరి
వృత సీమంతవతీ వ్రజబాలుని
మందార ముకుళ మధురాధర చుం
బచ్ఛుభవేణూ స్వన పరమాద్భుత
మందెను నీ సంగీతము దేవీ!
70. దీపావళి
దీపావళీ విశ్వ - రూపావళీ! నిత్య
జ్యోత్స్నావళీ! వృక్ష
శోభావళీ! దేవి
నా లక్ష్మి నా వాణీ - నా శక్తి నా ప్రతిభయే! ॥దీపావళీ॥
దీపావళీ! ప్రణయ
ధూపావళీ! రాస
గంధావళీ! తోష
బంధావళీ! దేవి
నా బ్రతుకు నా చదువు - నాయత్న కార్యార్ధమే! ॥దీపావళీ॥
దీపావళీ! వర్ణ
లేపావళీ! దివ్య
చిత్రావళీ! పరమ
శిల్పావళీ! దేవి
నా ప్రజ్ఞ నా దీక్ష - విన్యాస వైచిత్రియే! ॥దీపావళీ॥
దీపావళీ! రాగ
వ్యాప్తావళీ! గతుల
తాళావళీ! కరణ
చారావళీ! దేవి
నా నృత్య గీతాభి - నయ నృత్త వృత్తావళీ! ॥గీతావళీ॥
దీపావళీ! రథ్య
సేవ్యావళీ! మధ్య
శృత్యావళీ! మూర్తి
స్మృత్యావళీ! దేవి
నా ఆశ ఆశయము - నా అవధి ఆనందమే ॥దీపావళీ॥
71. తెర
ధవళమైనదీ తలపు దాటినది - దానికి మొదలూ చివరా లేనిది
నీకు ఇవతల నాకు అవతల
తెర ఉన్నాది బాలా! తెర ఉన్నాదే!
తెర మీదానిన నీడను జూస్తిని - తెరచాటున నీ పాటలు వింటిని
తెరచొచ్చిన నీ కాంతిని జోగితి
తెరువేమన్నా తెలియలేకనె కలిగిపోతినీ
తెర ఉన్నాది బాలా! తెర ఉన్నాదే!
కన్నులు కానని రూపం పిలిచీ - కౌగిలికందని భావం తలచీ
తెరవైపున నా చేతులు మోడ్చీ - అరమూతలు నా తీరని కలవై
చీల్చిన చిరగని తెర ఇవతలనే - చేరగరానీ నీవవతలనే
తెర ఉన్నాది బాలా! తెర ఉన్నాదే!
72. అమరత్వము
ఓ చెలీ! ఓ చెలీ!
నీవు నా నిదురలో మూర్తించి
నీవు నా ఎదలలో నర్తించి
పూవులో తేనెవై
తావిలో మత్తువై
పాటలో ఫణితివై
మాటలో తేటవై
అమృత బిందువులోని
అమరత్వమైతివే!
ఓ చెలీ! ఓ చెలీ!
AndhraBharati AMdhra bhArati - kavitalu - shashikaLa Adivi Bapiraju Adavi Bapiraju aDavi bApirAju aDivi bApirAju SaSikaLa ( telugu andhra )