నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
శ్రీ
కన్యాశుల్కము - ప్రథమాంకము.
౧-వ స్థలము. విజయనగరములో బొంకులదిబ్బ.
[గిరీశము ప్రవేశించును.]
గిరీశ

సాయంకాలమైంది. పూటకూళ్లమ్మకు సంతలో సామాను కొని పెడతానని నెల రోజుల కిందట యిరవైరూపాయలు పట్టుకెళ్లి డా`న్సింగర్లుకింద ఖర్చుపెట్టా`ను, యీవా`ళ ఉదయం పూటకూళ్లమ్మకీ నాకూ యుద్ధవైఁపోయింది. బుఱ్ఱ బద్దలు కొడదామా అన్నంత కోపంవొచ్చిందిగాని, పూర్రిచ్చర్డు చెప్పినట్లు పేషెన్సు వుంటేగాని లోకంలో నెగ్గలేం. ఈలా డబ్బు లాగేస్తె యిదివరకు యెన్ని పర్యాయములు వూరుకుంది కాదు? యిప్పుడేదో కొంచం డా`న్సింగర్లుమాట ఆచోకీ కట్టినట్టు కనబడుతుంది. ఓర్వలేని వెధవ యెవడైనా చెప్పివుంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే యిటుపైని తిండిపెట్టేటట్టు కానరాదు. యీవూళ్లోమరి మన పప్పువుడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే. వెంకుపంతులుగారి కోడలికి లవ్‌ లెటర్‌ రాసినందుకు యెప్పుడో ఒహప్పుడు సమయంకనిపెట్టి దేహశుద్ధి చేస్తారు.

Can love be controll'd by advice?
Will cupid our mothers obey?

శీఘ్రంగా యిక్కణ్ణించి బిచాణా యెత్తివెయ్యడమే బుద్ధికి లక్షణం; గాని మధురవాణిని వదలడవఁంటే యేమీ మనస్కరించకుండా వున్నది.

It is women that seduce all mankind.

నేను యెమో ఉద్యోగాలూ ఊళ్లూయేలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతోవుంది, పూర్‌క్రీచర్‌!

ఎవరావస్తున్నది? నాప్రియశిష్యుడు వెంకటేశ్వర్లులా వున్నాడు. యీవా`ళ కిస్‌మిస్‌ శలవులు యిచ్చివుంటారు. వీడివైఖరి చూస్తే పరిక్ష ఫెలైనట్టు కనపడుతుంది. వీణ్ణి కొంచం వోదార్చి వీడికి శలవుల్లో చదువు చెప్పే మిషమీద వీడితో వీడివూరికి వుడాయిస్తే చాలాచిక్కులు వొదుల్తాయి; అట్నుంచి నరుక్కురమ్మన్నాడు.

[వెంకటేశం ప్రవేశించును.]

యేమివాయ్‌ మైడియర్‌ షేక్స్పియర్‌, ముఖం వేలవేసినావ్‌?

వెంక యిక మీర్నాతోమాట్లాడకండి. మా మా`ష్టరు మీతో మాట్లాడొద్దన్నాడు. మీ సావాసం చెయడంచాత నాపరిక్ష పోయిందని అన్నారు.
గిరీ నాన్సెన్స్‌. మొదట్నుంచీ నేను అనుమానిస్తూనే వున్నాను. నీ మా`ష్టరికినన్నుచూస్తే కిట్టదు. అందుచాత నిన్ను ఫెయిల్‌ చేశాడుగాని లేకుంటే నువ్వేవిఁటి ఫెయిల్‌ కావడవేఁవిఁటి! అతనికీ నాకూ యెందుకు విరోధంవొచ్చిందో తెలిసిందా? అతను చెప్పేదంతా తప్పులతడక. అది నేను న్యూసు పా`పర్లో యేకేశాను. అప్పట్నుంచీ నేనంటే వాడిక్కడుపుడుకు.
వెంక మీవల్లనాకు ఒచ్చిందల్లా చుట్టకాల్చడం వొక్కటే. పాఠం చెప్పమంటే యెప్పుడూ కబుర్లు చెప్పడవేఁకాని ఒకమారయినా ఒక ముక్కచెప్పిన పాపాన్ని పోయినారూ?
గిరీ

డా`మిట్‌. ఇలాటి మాటలంటే నాకు కోపంవొస్తుంది. ఇది బేస్‌ ఇన్గ్రా`టిట్యూడ్‌. నాతో మాట్లాడడవేఁ ఒక ఎడ్యుకేషన్‌. ఆమాటకొస్తె నీకున్న లాం`గ్వేజి నీ మా`ష్టరుకుందీ? విడో మారియేజి విషయమై, నాచ్చి కొశ్చన్‌ విషయమై నీకు యెన్ని లెక్చర్లు యిచ్చాను! నాదగ్గిర చదువుకున్నవాడు ఒహడూ అప్రయోజకుడుకాలేదు. పూనా డక్కన్‌ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది ఇలెవెన్‌ కాజస్‌ ఫర్ది డిజనరేషన్‌ ఆఫ్‌ ఇండియాను గూర్చి మూడుఘంటలు ఒక్కబిగిని లెక్చెర్‌ యిచ్చేసరికి ప్రొఫెసర్లు డంగయిపోయినారు. మొన్నబంగాళీవాడు యీవూళ్లో లెక్చరిచ్చినప్పుడు ఒకడికైనా నోరు పెగిలిందీ? మనవాళ్లు వొట్టి వెధవాయలోయ్‌, చుట్టనేర్పినందుకు థా`ంక్‌ చెయ్క, తప్పుపట్టుతున్నావ్‌? చుట్టకాల్చడంయొక్క మజా నీకు యింకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. చుట్టగాల్చబట్టే కదా దొర్లింత గొప్పవాళ్లయినారు. చుట్టకాల్చని యింగ్లీషువాణ్ణి చూశావూ? చుట్టపంపిణి మీదనే స్టీముయంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టా`డు. లేకపోతే వాడికి పట్టుబణ్ణా? శాస్త్రకారుడు యేవఁన్నాడో చెప్పా`నే.

సూత ఉవాచ-
క॥ ఖగపతి యమృతముతేగా ।
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్‌ ।
పొగ చెట్టై జన్మించెను ।
పొగతాగనివాడు దున్నపోతైబుట్టునూ॥
యిది బృహన్నారదీయం నాలుగవ ఆశ్వాసంలో వున్నది. అది అలావుణ్ణీగాని నీ అంత తెలివైన కుఱ్ఱవాణ్ణి ఫెయిల్‌ చేసినందుకు నీ మా`ష్టరుమీద నావొళ్లు మహా మండుతూంది. ఈమాటు వంటరిగాచూసి వొకతడాఖాతీస్తాను. నువ్వు శలవుల్లో యిక్కడుంటావా వూరికి వెళతావా?
వెంక వెళ్లాల్నుందిగాని, పా`సుకాలేదంటే మాతండ్రి చావ కొడతాడు.
గిరీ ఆగండం తప్పేవుపాయం నేన్చెబుతాను, నే చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చాస్తావూ?
వెంక (గిరీశంకాళ్లుపట్టుకొని) మీశలవు యెప్పుడు తప్పా`ను? మాతండ్రికి మాచడ్డ కోపం. పా`సుకాలేదంటే యెవిఁకలు విరగ్గొడతాడు. (కన్నీరు చేత తుడుచుకొనును.)
గిరీ దటీజ్‌ టిరనీ - యిదే బంగాళీ కుఱ్ఱవాడవుతే యేంజాస్తాడో తెలిసిందా? తాతయేది తండ్రయేది కఱ్ఱపట్టుకుని చమ్డాలెక్కగొడతాడు; మీ అగ్రహారం కుఱ్ఱవాళ్లు మరియవళ్లయినా యీ వూళ్లో చదువుకుంటున్నారా?
వెంక మరెవళ్లూలేరు.
గిరీ ఐతే నేనో వుపాయం చెపుతాను విను, నే కూడా నీతో మీవూరొచ్చి పరిక్ష పా`సయినావని మీవాళ్లతో చెబుతాను; అక్కడనీకు చదువు చెప్పడానికి ఒచ్చానని మీవాళ్లతో చెప్పు; శెలవులాఖర్ని నిన్ను టవునుస్కూల్లో పైక్లాసులో ప్రవేశ పెడతాను.
వెంక మీరేవొస్తే బతికా`ను మరేవిఁటి; కిందటి మాటు శలవులికే మాఅమ్మ మిమ్మల్ని తీసుకు రమ్మంది.
గిరీ ఆల్రైట్‌ - గాని - నాకిక్కడ చాలా వ్యవహారములలో నష్టంవస్తుందే - మునసబుగారి పిల్లల్కి శలవుల్లో పాఠాల్చెపితె ఫిప్టీ రుపిజ్‌ యిస్తావఁన్నారు; అయినా నీ విషయవైఁ యంత లాస్‌ వచ్చినా నేను కేర్‌ చెయ్యను. ఒకభయం మాత్రం వుంది. మీవాళ్లు బార్‌బరస్‌పీపిల్‌గదా, నన్ను తిన్నగా ట్రీట్‌ చేస్తారో చెయ్యరో. నీవు నన్నుగురించి మీమదర్‌తో గట్టిగా రికమెండ్‌ చెయ్యవలసి వుంటుంది. కొత్తపుస్తకాలికి వొక జాబితారాయి - కొంచండబ్బు చేతిలోవుంటేనేగాని సిగర్సుకి యిబ్బంది కలుగుతుంది. నోటుబుక్కుతీసిరాయి. 1 రోయల్‌ రీడర్‌, 2 మా`న్యూల్‌ గ్రా`మర్‌, 3 గోష్‌ జియామెట్రీ, 4 బాస్‌ ఆల్జిబ్రా, 5 శ్రీనివాస్సయర్‌ అర్థిమెటిక్‌, 6 నలచరిత్ర, 7 రాజశేఖరచరిత్ర, 8 షెపర్డు జనరల్‌ ఇంగ్లీష్‌, 9 వెంకటసుబ్బారావు మేడీజీ. యెన్నిపుస్తకా లయినాయి?
వెంక తొమ్మిది.
గిరీ మరొక్కటి రాయి. అక్కడికి పదీ అవుతాయి. కుప్పుసామయ్యర్‌ మేడ్‌డిఫికల్ట్‌. అక్కడికి చాల్ను. మీవాళ్లుగాని యింగ్లీషుమాట్లాడ మన్నట్టాయినా తణుకూ బెణుకూ లేకుండా పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు జ్ఞాపకం వున్నంతవరకు యాకరుపెట్టు. నీదగ్గిర కాపర్సు యేవైఁనా వున్నవా`? నాదగ్గిర కరన్సీనోట్లు వున్నవిగాని మార్చలేదు. పదణాలుపెట్టి ఓశేరు కాశీమిఠాయికొని పట్టుకురా. రాత్రి మరి నేను భోజనంచెయ్యను. మార్కట్టుకివెళ్లి బండీకుదిర్చి దానిమీద నాట్రావెలింగ్‌ ట్రంక్కు వేశి మెట్టుదగ్గిర బండీ నిలబెట్టివుంచు. యిక్కడకొన్ని రాచకార్యాలు చక్కబెట్టుకుని యంతరాత్రికైనా వొచ్చి కల్సుకుంటాను. గోఎట్వన్స్‌, మైగుడ్‌ బోయ్‌. నువ్‌ బుద్ధిగావుండి చెప్పినమాటల్లా వింటూంటే నిన్ను సురేంద్రనాద్‌ బా`నర్జీ అంత గొప్పవాణ్ణిచేస్తాను. నేను నీతోవస్తానన్నమాట మాత్రం పిట్టకైనా తెలియనియ్యొద్దు. జాగ్రత. (వెంకటేశం నిష్క్రమించును.)
గిరీశం యీ వ్యవహార మొహటి ఫైసలైంది. ఈ రాత్రి మధురవాణికి పార్టింగ్‌ విజిట్‌ యివ్వందీ పోకూడదు.
[రాగవరసతో పాడును.]
నీ సైటు నాడిలైటు;
    నిన్ను మిన్న
    కాన కున్న
క్వైటు రెచడ్‌ ప్లైటు
మూనులేని నైటు.
[ఒకబంట్రోతు ప్రవేశించును.]
బంట్రోతు నేను పొటిగరాప్పంతులుగారి నౌఖర్నండి, లెక్క జరూరుగుందండి, పొటిగరాపుల కరీదు యెంటనె యిప్పించమన్నారండి.
గిరీశం (విననట్టు నటించుతూ)
ఫుల్లుమూను లైటటా,
జాసమిన్ను వైటటా,
    మూను కన్న
    మొల్ల కన్న
నీదు మోము బ్రైటటా
టా! టా! టా!
బంట్రోతు యంతమందిని పంపినా యిచ్చారు కారటండి, నేనాళ్ల లాగూరుకుండేవోణ్ణి కానండి.
గిరీ అయ్య కోనేటికి తోవయిదే.
బంట్రోతు యక్కడి శెవిఁటిమాలోకం వొచ్చిందయ్యా.
గిరీ కోవఁటి దుకాణవాఁ? కస్పా బజార్లోగాని యిటివేపులేదు.
బంట్రోతు (గట్టిగా చెవిదగ్గిర నోరుపెట్టి) పోటిగరాపులు కరీదిస్తారా యివ్వరా?
గిరీ బస, రాధారీ బంగాళాలో చెయ్యొచ్చును.
బంట్రోతు (మరీగట్టిగా) యాడాదికిందట మీరూ సాన్దీ కలిసి యేసుకున్న పోటిగరాపులకరీదు మాపంతులు నిలబెట్టి పుచ్చుకొమ్మన్నారు.
గిరీ ఓహో నీవటోయ్‌, యవరో అనుకున్నాను. నింపాదిగా మాట్లాడు, నింపాదిగా మాట్లాడు. రేపువుదయం యెనిమిది ఘంటలకి పూటకూళమ్మ యింటికి వొస్తే అణా ఫయిసల్తో సొమ్మిచ్చేస్తాను. మీ పంతులికి స్నేహం మంచీ చెడ్డా అక్కర్లేదూ?
బంట్రోతు మాటల్తో కార్యం లేదు. మొల్లోశెయ్యెట్టి నిల్సున్నపాట్ని పుచ్చుకొమ్మన్నారండి.
గిరీ పెద్దమనిషివిగదా; నువ్వూ తొందరపడ్డం మంచిదేనా? నీ తండ్రి యంత పెద్దమనిషి. యీ చుట్టచూడు యంత మజాగా కాల్తుందో. హవానా అంటారు దొర్లు దీన్ని. రేప్పొద్దున్నరా రెండు కట్టలిస్తాను.
బంట్రోతు శిత్తం సొమ్ము మాటేం శలవండి.
గిరీశం చెప్పా`నుకానా? రేప్పొద్దున్న యివ్వకపోతే మాలవాడికొడుకు ఛండాలుడు.
బంట్రోతు మాలాడికొడుకు శండాలుడు కాకుంటే మరేటండి.
గిరీశం నీకు నమ్మకం చాలకపోతే యిదిగో గాయత్రీపట్టుకు ప్రమాణంచేస్తాను.
బంట్రోతు శిత్తం, రేపు పొద్దున్న సొమ్మియ్యకపోతే నా ఆబోరుండదండి.
గిరీశం

ఆహాఁ! నీ ఆబోరు ఒహటీ, నా ఆబోరు ఒహటీనా?

[బంట్రోతు నిష్క్రమించును.]

ఇన్నాళ్లకి జంఝప్పోస వినియోగంల్లోకి వొచ్చింది. ధియాసొఫిస్టుసు చెప్పినట్లు మన ఓల్డు కస్టమ్సు అన్నిటికీ యేదో ఒహ ప్రయోజనం ఆలోచించే మనవాళ్లు యార్పరిచారు. ఆత్మానుభవం అయితేనేగాని తత్వం బోధపడదు. ఈ పిశాచాన్ని వొదుల్చుకునేసరికి తలప్రాణంతోక్కొచ్చింది. శీఘ్రబుద్ధేః పలాయనం. పెందరాళే యీవూర్నించి వుడాయిస్తేనేకాని ఆబోరు దక్కదు. యిక మధురవాణి యింటికి వెళదాం. మేక్‌ హే వైల్దీ సన్‌ షైన్స్‌ అన్నాడు.

AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)