నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౨-వ స్థలము. మధురవాణియింట్లో గది.
[రామప్పంతులు కుర్చీమీద కూర్చుండును, మధురవాణి యెదట నిలుచుండును.]
రామ (జేబులోనుంచి చుట్టతీసి పంటకొన కొరికి) పిల్లా, అగ్గిపుల్ల.
మధురవాణి (అగ్గిపుల్ల వెలిగించి చుట్టకందించుచుండగా రామప్పంతులు మధురవాణి బుగ్గను గిల్లును. మధురవాణి చుట్టకాలకుండానే అగ్గిపుల్లరాల్చి యడంగా నిలబడి కోపం కనపర్చుతూ) మొగవాడికయినా ఆడదానికయినా నీతివుండాలి, తాకవద్దంటే చెవినిపెట్టరుగదా?
రామ నిన్ను వుంచుకోవడానికి అంతా నిశ్చయమయి రేపోనేడో మంచి ముహూర్తంచూసి మావూరు లేవతీసుకు వెళ్లడానికి సిద్ధవఁయ్యుంటే యింకా యవడో కోన్కిస్కాహేగాడి ఆడాలో వున్నానంటూ పాతివ్రత్యం నటిస్తావేమిటి?
మధుర వేశ్య అనగానే అంత చులకనా పంతులుగారూ? సానిదానికి మాత్రం నీతి వుండొద్దా? మాపంతులుగార్ని పిలిచి "అయ్యా యిటుపైని మీతోవమీది, నాతోవనాది" అని తెగతెంపులు చేసుకున్నదాకా నేను పరాధీనురాలినే అని యంచండి. మీరు దెప్పిపొడిచినట్టు ఆయన వైదీకయితేనేమి, కిరస్తానం మనిషైతేనేమి, పూటకూళ్లమ్మను వుంచుకుంటేనేమి నన్ను యిన్నాళ్లూ ఆ మహరాజు పోషించాడుకాడా? మీరంతకన్న రసికులయినా, నామనస్సు మీరు యంత జూరగొన్నా, ఆయనయడల విశ్వాసం నాకుమట్టుకు వుండొద్దా?
రామ పెద్దపెద్దమాటలు ప్రయోగిస్తున్నావు! వాడి బతుక్కి వాడు పూటకూళ్లమ్మని వుంచుకోవడం కూడానా! పూటకూళ్లమ్మే వాణ్ణి వుంచుకుని యింతగంజి బోస్తూంది.
మధు అన్యాయం మాటలు ఆడకండి, ఆయన యంత చదువుకున్నాడు, ఆయనకి యంతప్రఖ్యాతి వుంది! నేడోరేపో గొప్ప వుద్యోగం కానైయ్యుంది.
రామ అహహ (నవ్వుతూ) యేం వెఱ్ఱినమ్మకం! నీవు సానివాళ్లలో తప్పపుట్టా`వు. గిరీశంగారు గిరీశంగారు అని పెద్దపేరు పెడతావేవిఁటి, మావూళ్లోవున్న లుబ్దావధాన్లు పింతల్లికొడుక్కాడూ వీడూ! గిఱ్ఱడని మేం పిలిచేవాళ్లం. బొట్లేరు ముక్కలు రెండు నేర్చుకోగానే ఉద్యోగాలే! వాడికల్లా వక్కటే వుద్యోగం దేవుఁడు రాశాడు. యేవిఁటో తెలిసిందా? పూటకూళ్లమ్మయింట్లో దప్పిక్కిచేరి అరవ చాకిరీచెయ్యడం.
మధు యీమాటలు ఆయన్ని అడుగుదునా?
రామ తప్పకుండా. కావలిస్తే నేను చెప్పా`ననికూడా చెప్పు.
మధు అయినా ఆయన గుణయోగ్యతలతో నాకేంపని? యేవఁయినా ఆయన నాకు యజమాని. ఆయన తప్పులు నాకళ్లకు కనపడవ్‌.
రామ అయితే అతడికి విడా`కులు యెప్పుడిస్తావు?
మధు యిక్కడి రుణాలూ పణాలూ తీర్చుకోడానికి మీరు శలవిచ్చిన రెండు వొందలూ యిప్పిస్తే యీక్షణం తెగుతెంపులు చేసుకుంటాను.
రామ అయితే యింద (జేబులోనుంచి నోట్లు తీసియిచ్చును. మధురవాణి అందుకొంటుండగా రామప్పంతులు చెయ్యిపట్టి లాగును. మధురవాణి కోపంతో చెయి విడిపించుకుని నోట్లు పారవేసి దూరముగా నిలుచుండును.)
మధు మీతో కాలక్షేపం చెయ్యడం కష్టం. ఒక నిర్నయంమీద నిలవని మనిషిని యేవఁన్నమ్మను?
రామ (నోట్లుయెత్తి) క్షమించు, అపరాధం, (నోట్లు చేతికిచ్చును) లెక్ఖపెట్టి చూసుకో.
మధు ఆమాత్రం మిమ్మల్ని నమ్మకపోతే మీతో రానేరాను. యింత రసికులయ్యుండీ నామనస్సు కనిపెట్ట జాలినారుకారు గదా? మీనోట్లు మీవద్దనే వుంచండి. నేను డబ్బుకక్కుర్తి మనిషినికాను. (నోట్లు యివ్వబోవును.)
రామ వొద్దు! వొద్దు! వొద్దు! నీమనసు కనుక్కుందావఁని అన్నమాటగాని మరొకటి కాదు. గాని, యీగిరీశం గుంటవెధవ, వీడెవడో మా గొప్పవా డనుకుంటున్నావేవిఁటి ?
మధు ఆయన్ని నాయదట తూల్నాడితే యిదుగో తలుపుతీశాను విజయంచెయ్యండి. (తలుపుతీసి వకచేత పట్టుకుని రెండవ చేతివేలుతో పైకితోవచూపును), అదుగో గిరీశంగారే వొస్తున్నారు, ఆమాటేదో ఆయన్తోటే చెప్పండి.
రామ వేళాకోళం ఆడుతున్నావూ?
గిరీశం (వాకట్లోనుంచి) మైడియర్‌.
రామ (ఆత్మగతం) అన్న, వేళగానివేళొచ్చాడు గాడిదకొడుకు, తంతాడుకాబోలు, యేవిఁటి సాధనం, యీ మంచంకింద దూరుదాం. (మంచంకింద దూరును.)
[గిరీశం ప్రవేశించును.]
గిరీశం వెల్‌, మైడియర్‌ ఎంప్రెస్‌. (బుజము మీద తట్టబోవును.)
మధు (ఒసిలి తప్పించుకుని) ముట్టబోకండి.
గిరీశం (నిర్ఘాంతపోయి) అదేమిటి ఆవికారం.
మధు ఆఖరు వికారం.
గిరీ (ఆత్మగతం) నేను వుడాయిస్తానని దీనికెలా తెలిసింది చెప్మా! సానివాళ్లకి కర్నపిశాచివుంటుంది కాబోలు (పైకి) మైలబడితే స్తానంచేసి వేగిరం రా.
మధు యిప్పుడేంతొందర, తలంటుకుంటాను.
రామ (ఆత్మగతం) చబాష్‌, యేమి నీతయిన మనిషి యిది! వెధవని ముట్టుకో నివ్వకుండా యెత్తు యెత్తింది!
గిరీశం మైలా గియిలా మాయింగ్లీషువారికి లక్ష్యంలేదు యిలారా (దగ్గిరికి చేరును.)
మధు (వేలుచూపి) అక్కడనే ఆగండి. మీరు కిరస్తానం అయితే కావచ్చును. నేను కిరస్తానం యింకా కాలేదే. మీరు కిరస్తానం అన్నమాట యిప్పుడే ఒహరు చప్పగా విన్నాను.
రామ (తనలో) నె చెప్పా`నంటుందా యేమిటి!
గిరీశం ఒకరు చప్పగా విన్నావూ? యవరా జెప్పింది? యవడికిక్కడికి రావడానికి మగుదూర్‌ వుంది? యిలాంటి చాడీకోర్‌ కబుర్లు చెప్పడానికి యవడికి గుండ` వుంది? ఆ మాటలు విని నాతో చెప్పడానికి నీ కెక్కడ గుండుంది? చెప్పు!
రామ (తనలో) తంతాడు కాబోలు, యరక్క చిక్కడ్డాను.
మధు మొగాడే చెప్పాలా యేవిఁటి? ఆడవాళ్లకి దేవుఁడు నోరివ్వలేదా?
గిరీ (తనలో)పూటకూళ్లముండే చెప్పింది కాబోలు (పైకి) ఆడదా? ఆడదాన్ని నోరుబెట్టుకు బతకమనే దేవుఁడుచేశాడు. పరువయిన ఆడది నీయింటికెందుకొస్తుంది.
మధు పరువైన మొగాళ్లొచ్చినప్పుడు పరువైన ఆడవాళ్లెందుకు రాకూడదు? ముందు కూచోండి, తరవాత కోప్పడుదురుగాని, చుట్టతీసుకోండి, అదుగో అగ్గి పెట్ట`.
గిరీ ముట్టుకోడానికి వల్లలేకపోతే అగ్గిపుల్ల వెలిగించి యివ్వడానికయినా పెట్టిపుట్టా`నుకానా? యీవా`ళ మహాఉత్సాహంగా వచ్చానుగాని ఉత్సాహభంగంచేశావ్‌.
మధు యెవిఁటా వుత్సాహం?
గిరీశం యిదిగో జేబులో హైదరాబాద్‌ నైజామ్‌వారి దగ్గిర్నించి వొచ్చిన ఫర్మానా. మానా`స్తం నవాబ్‌ సదరదాలత్‌ బావురల్లీఖాన్‌ ఇస్పహన్‌ జంగ్‌ బహద్దర్‌ వారు సిఫార్స్‌చేసి వెయ్యి సిక్కారూపాయలు జీతంతో ముసాయిబ్‌ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేషా బాద్షావారి హుజూర్న వుండడం.
రామ (తనలో) యెవిఁట్రా వీడిగోతాలు!
గిరీశం యింత శుభవార్తతెచ్చినా, దగ్గిరకి రానిచ్చావు కావుగదా? నాతో హైదరాబాద్‌ వస్తావా?
మధు (తలతిప్పుతూ) నే యెందుకు? పూటకూళ్లమ్మని తీసికెళ్లండి.
గిరీ (నిర్ఘాంతపోయి)పూటకూళ్లమ్మ యేవఁయినా పెంట పెడుతూందా` యేవిఁటి?
మధు మీకే తెలియాలి.
గిరీ నీ తెలివి తక్కువచూస్తే నాకు నవ్వొస్తూంది. యెవ డేమాటన్నా నామీద నమ్మడవేఁనా? యీఘోరవైఁన అబద్ధాలు నీతో యవడు చెబుతున్నాడో కనుక్కోలేననుకున్నావా యేవిఁటి? సప్తసముద్రాల్దాటినా వాడి పిలకట్టుకుని పిస్తోల్తో వొళ్లు తూట్లు పడేటట్టు ఢాఢామని కొట్టకపోతినట్టయినా నాపేరు గిరీశమే, నినద భీషణశంఖము దేవదత్తమే! కబడ్దార్‌!
మధు సముద్రాలవతలకెళ్లి వెతకక్ఖర్లేదు. ఆచెప్పినమనిషి మీ యదటే చెబుతాడు.
రామ (తనలో) యీముండ నన్ను బయలుబెడుతుంది కాబోల్రా దైవమా!
గిరీ (తనలో) థాంక్గాడ్‌. అయితె పూటకూళ్ల దాన్దెబ్బతగల్లేదు. (పైకి) యిలాంటి దుర్మార్గపకూతలు ఆయిల్లాలు చెవినిపడితే చాలా ఖేదిస్తుంది. ఆపాపవఁంతా నిన్ను చుట్టుకుంటుంది. ఆమె యంత పతివ్రత! యంత యోగ్యురాలు!
మధు వెధవముండకి పాతివ్రత్యం అన్నమాట యీనాటికి విన్నాను.
గిరీశం దానికి ... కాదు ఆమెకి మొగుళ్లేక పోయినా ఆమెను వెధవనడానికి వీల్లేదు.
మధు మీరుండగా వెధవెలా అవుతుంది?
గిరీశం నాన్సెన్స్‌ (దీనికోఠస్సా చెప్పి రంజింపచేదాం) యిదుగోవిను. దాని నిజం యెవిఁటంటె - పూటకూళ్లమ్మ ముచ్చటగా తప్పటడుగులువేశే రోజుల్లో ఒక కునుష్టి ముసలాడికి కట్ట నిశ్చయించారు. పుస్తెకట్టబోతూంటేనో కట్టిన వుత్తరక్షణంలోన్నో ఆముసలాడు పెళ్లిపీటలమీదే గుటుక్కుమన్నాడు. అప్పుడు పెళ్లి అయినట్టా కానట్టా అని మీమాంస అయింది. కొందరు పుస్తెకట్టా`డన్నారు. కొందరు కట్టలేదన్నారు. పిల్లతండ్రి, పెళ్లికొడుకు వారసులుమీద దావా తెచ్చాడు. పురోహితుడు వాళ్లదగ్గిర లంచంపుచ్చుకుని పుస్తెకట్టలేదని సాక్షెవిఁచ్చాడు. దాంతో కేసుపోయింది; మరిదాన్నెవరూ పెళ్లా`డారుకారు.
మధు అయితే మరిమీకు తప్పులేదే?
గిరీశం యేవిఁటి యీకొత్తమాటలూ! నాకు ఆదీ అంతూ తెలియకుండా వుందీ! ఆహాఁ సరసంవిరసంలో దిగుతూందే! హాస్యాని కంటే నివ్వేవఁన్నా ఆనందవేఁ, నిజవఁనిగానీ అంటివా, చూడు నాతడాఖా. యవడీమాటలు పేల్తున్నాడో వాడి పేరుతక్షణం చెబుతావా చెప్పవా?
మధు రామ.
రామ (తనలో) సచ్చాన్రా, పేరు చెప్పేసింది!
మధు రామ! రామ! ఒహరు చెప్పేదేవిఁటి లోకవఁంతా కోడై కూస్తూంటేను?
(వీధిలోనుంచి తలుపుతలుపు అని ధ్వని.)
గిరీశం (తెల్లపోయి) తలుపుతియ్యొద్దు, తియ్యొద్దు. ఆపిలిచేమనిషి వెఱ్ఱిముండ మనుషుల్ని కరుస్తుంది.
మధు తలుపు తీసేవుంది.
గిరీశం చంగునవెళ్లి గడియవేసెయ్‌.
మధు అదుగో తలుపుతోసుకు వొస్తూంది.
గిరీశం గెంటెయ్‌, గెంటెయ్‌.
మధు ఆ వయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తూంది. (మధురవాణి వాకట్లోకి వెళ్లును.)
గిరీశం మంచంకింద దూరుదాం. (గిరీశం మంచంకింద దూరును.) (తనలో) దొంగలంజ సరసుణ్ణి దాచిందోయ్‌ మంచం కింద. యిదేవిఁటో మంచిమనిషి అని భ్రమించాను. దీ న్తస్సాగొయ్యా. సిగపాయిదీసి తందునుగాని యిది సమయంకాదు. అయినా పోయేవాడికి నాకెందుకురొష్టు, (రామప్పంతులుతో మెల్లిగా) యవరన్నా మీరు, మహానుభావులు?
రామ నేను రామప్పంతుల్నిరా, అబ్బాయీ.
గిరీశం తమరా, యీమాత్రానికి మంచంకింద దాగోవాలా, మహానుభావా? నన్నడిగితే యిలాంటి లంజల్ని యిరవైమందిని మీకు కన్యాదానం చేతునే.
రామ (తనలో) బతికా`న్రా దేవుఁడా; (పైకి) నువ్వురా బాబూ దీన్నుంచుకున్నావు! అలాతెలిస్తే నేరాకపోదును సుమా.
గిరీ మాటవినపళ్లేదు. కొంచం యిసుంటా రండి. (రామప్పంతులు ముందుకుజరుగును, గిరీశం అతన్ని తప్పించుకుని గోడవేపు చేరును.)
గిరీశం అన్నా యీలంజని యన్నడూ నమ్మకండీ, యిలా యిరవైమందిని దాచగల శక్తుంది, దీనికి.
రామ రెండువందలు దొబ్బిందిరా బాబూ.
గిరీశం నువ్వులేం జాగర్త చేశారా?
రామ అంతేనా?
గిరీ మరేవిఁటి?
[మధురవాణిన్ని, పూటకూళ్లమ్మ వల్లెవాటులో చీపురుగట్టదాచిన్ని ప్రవేశింతురు.]
మధు మీరన్నమనిషి యిక్కడలేరంటే చెవినిబెట్టరుగదా!
పూట నీయింట్లో జొరబడ్డాడని వీధులో వాళ్లుచెబితే నీమాట నమ్ముతానా యెవిఁటి? ఆవెధవవుంటే నాకేం కావాలి, వుండకుంటే నాకేం కావాలి. వాడు నీకిచ్చిన యిరవయి రూపాయలూ యిచ్చెయ్‌.
మధు యవడి కిచ్చావో వాణ్ణే అడగవమ్మా.
పూట వెధవకనబడితే సిగపాయిదీసి చీపురుగట్టతో మొత్తుదును, యెక్కడదాచావేవిఁటి?
మధు నాకు దాచడం ఖర్మవేఁవిఁ నేను మొగనాల్నికాను. వెధవముండనీ కాను. నాయింటి కొచ్చేవాడు మహరాజులాగ పబ్లీగ్గా వొస్తాడు (కంటితో మంచము కిందుచూపును.)
పూట మంచంకింద దాగా`డేమో - (మంచము కిందుకు వంగి) నీ పరువు బుగ్గ`యినట్టే వుంది లేచిరా. (చీపురుగట్ట తిరగేసి రామప్పంతులును కొట్టును.)
రామ ఓర్నాయనా, నన్నెందుక్కొడతావే దండుముండా? (మంచంకిందినించి పైకివచ్చి వీపు తడుముకొనును.)
మధు ఆయన్నెందుకు కొట్టా`వు? నాయింటికొచ్చి యేవిఁటీ రవ్వ?
పూట అయితె మంచంకిందెందుకు దూరా`డూ?
మధు నీ కెందు కాగోష? అదో సరసం.
పూట యిదో చీపురుగట్ట సరసం.
రామ (వీపు తడువుఁకుంటూ) నీసిగతరగా, ఆడదానివై పోయినావే, లేకుంటే చంపేసి పోదును. నీ రంకు మొగుణ్ణికొట్టక నన్నెందుక్కొట్టా`వే ముండా? అందుకా నన్ను ముందుకి తోసి తాను గోడవేపు దాగున్నాడు.
పూట ఆవెధవ కూడా వున్నాడూ మంచంకింద! కుక్కా పైకిరా.
గిరీశం వెఱ్ఱ`ప్పా! మంచంకిందికిరా, వెఱ్ఱి వొదలగొడతాను.
పూట అప్పనిట్రా వెధవా నీకు? నీకు భయపడతాననుకున్నావా యేవిఁటి? నీ సానిముండ యలా అడ్డుకుంటుందో చూస్తాను. (పూటకూళ్లమ్మ ఒకవేపు నుంచి మంచంకిందికి దూరును. మరి వొక వేపునుంచి గిరీశం పైకివచ్చి రామప్పంతులు నెత్తి చరిచి లఘువేసి పెరటివేపు పరిగెత్తిపోవును.)
రామ సచ్చాన్రా నాయనా (రెండు చేతుల తలపట్టుకొని) మధురవాణీ యేవీఁ బేహద్బీ! కనిష్టీబు క్కబురంపించూ.
మధురవాణి యెందుకు పబ్లీకున అల్లరీ అవమానవుఁన్నూ! రేపో యెల్లుండో మీరే వాడికి దెబ్బకి దెబ్బతీసి పగతీర్చుకుందురుగాని. (మధురవాణి రామప్పంతుల్ని కౌగలించుకొని తలముద్దెట్టుకుని చేతరాసి) యేవిఁ దుష్టు! మొగవాడయినవాడు యెదట నిలిచి కొట్టాలి. దొంగ దెబ్బ కొడతాడూ? వాడిపొంకం అణతురుగాని లెండి.
రామ గవురనుమెంటు జీతవిఁచ్చుంచిన కనిష్టీబులుండగా మనకెందుకు శరీరాయాసం? యీ వెధవని పజ్యం`డు కోర్ట్లంటా తిప్పకపోతే నేను రామప్పంతుల్ని కాను చూడు నాతమాషా!
మధు (రామప్పంతుల్ని ముద్దుబెట్టుకుని) మాటాడక వూరుకొండి. (మంచంకిందివేపు చూపించి నోరు మూసి) దొంగ దెబ్బకొట్టినవాడిదే అవమానం; మీదికాదు.
రామ నొప్పెవడి దనుకున్నావు? ఆముండ మంచంకిందనించి రాదేం? చీపురుకట్టలాక్కో.
పూట ఫడేల్మంటే పస్తాయించి చూస్తున్నాను. నీ మొగతనం యేడిసినట్టేవుంది. (పైకివచ్చును.)
(అంతా నిష్క్రమింతురు.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)