నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
కన్యాశుల్కము - ద్వితీయాంకము.
౧-వ స్థలము. కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లు ఇల్లు.
(అగ్నిహోత్రావధాన్లు జంఝాలు వడుకుచుండును. కరటకశాస్తుల్లు శిష్యుడిచేత లేనిపేలు నొక్కించుకొనుచుండును. వెంకమ్మ కూర తరుగుచుండును.)
వెంకమ్మ నిన్నట్నించి కిశిమీశ్శలవులని కుఱ్ఱవాడు వుత్తరం రాశాడు. యెన్నాళ్లో ఐంది వాణ్ణిచూసి, కళ్లు కాయలు కాసిపోయినాయి. గడియో గడియో రావాలి.
అగ్నిహోత్రావధాన్లు ఎందుకు వొట్టినే వగచడం? వొద్దు వొద్దంటూంటే యీ యింగిలీషు చదువులోపెట్టా`వ్‌. మెరకపొలం సిస్తంతా వాడి కిందయిపోతూంది. కిందటి యేడుపరిక్ష ఫేలయి పోయినాడు గదా? యీయేడు యెలాతగలేశాడో తెలియదు. మనకీ యింగిలీషు చదువు అచ్చిరాదని పోరిపోరిచెబితే విన్నావుకావు. మా పెద్దన్న దిబ్బావుధాన్లు కొడుకుని యింగిలీషు చదువుకు పార్వతీపురం పంపించేసరికి వూష్టం వొచ్చి మూడ్రోజుల్లో కొట్టేశింది. బుచ్చబ్బి కొడుక్కి యింగిలీషు చెప్పిద్దావఁనుకుంటూండగానే చచ్చినంత ఖాయలా చేసింది.
వెంకమ్మ మీరెప్పుడూ యిలాంటి వోఘాయిత్తం మాటలే అంచూవుంఛారు. డబ్బు కర్చయిపోతుందని మీకు బెంగ. మొన్నమొన్న మనకళ్లెదుట మనవాకట్లో జుత్తు విరబోసుకు గొట్టికాయలాడిన నేమానివారి కుఱ్ఱాడికి మునసబీ ఐంది కాదూ?
అగ్ని మనవెధవాయకి చదువొచ్చేదేం కనపడదుగాని పుస్తకాలకిందా జీతంకిందా యిహ నాలుగేళ్లయేసరికి మనభూమి కడతేరిపోతుంది. ఆపైని చిప్పా దొప్పా పట్టుకు బయల్దేరాలి. నిమ్మళంగా యింటి దగ్గిరుంటే యీపాటికి నాలుగష్టాలు చెప్పేదును. వొద్దంటూంటే యీవెధ వింగిలీషు చదువులో పెట్టా`వు.
వెంకమ్మ మనవాడికో మునసబీ ఐనా పోలీసుపనైనా ఐతే రుణాలిచ్చి యీ అగ్ఘురారం భూవుఁలన్నీ కొనేస్తాడు. యాడాదికో నూఱ్ఱూపాయలు కర్చుపెట్టడానికింత ముందూ వెనకాచూస్తున్నారు, మీలాగేవాడూ జంఝాలు వొడుక్కుంటూ బతకాలని వుందా యేవిఁషి? మీకంత భారవఁంతోస్తే మావాళ్లు నాకు పసుపూకుంకానికీ యిచ్చిన భూవఁమ్మేసి కుఱ్ఱాడికి చదువుచెప్పిస్తాను.
కరటకశాస్త్రి నీభూవెఁందు కమ్మాలమ్మా? మనసొమ్ము చడతిని కొవ్వున్నాడు, అతడే పెట్టుకుంటాడు.
అగ్ని ఐతే నన్ను ఆక్షేపణ చేస్తావషే? యీ మారంటే నీ అన్నవున్నాడని వూరుకునేదిలేదు.
[గిరీశం, వెంకటేశం ప్రవేశింతురు.]
వెంక మాబాబ్మా బాబు వచ్చావషొయ్‌! (వెంకటేశమును కౌగలించుకొనును.)
అగ్నిహో వెధవాయా యీమారైనా పా`సయినావా? (వెంకటేశం తెల్లబోయి చూచును.)
గిరీశం పా`సయినాడండి, ఫస్టుగా పా`సయినాడు. నేను చాలాశ్రమపడి చదువు చెప్పా`నండి.
అగ్ని యీతుర కెవడోయ్‌!
గిరీశం టర్క్‌! డామిట్‌, టెల్‌మా`న్‌.
అగ్ని మానా? మానులావుంచా నంఛావూ? గూబ్బగలగొడతాను.
వెంకటేశం (వణుకుతూ తల్లివేపుచూసి) అమ్మా యీయ్నే నాకు చదువు చెప్పే మేష్టరు.
కరట ఇంటికి పెద్దమనిషొస్తే అపృచ్ఛపు మాటలాడతావేవిఁటి బావా? ఆయనేదో కుఱ్ఱవాడితో యింగిలీషు మాటంటే పుచ్చకాయలదొంగంటే బుజాల్తడువుఁకున్నట్టు నీమీద పెట్టుకుంటావేం?
(బండివాడు సామానుదించును.)
గిరీశం (కరటకశాస్త్రితో) తమబావగారా అగ్నిహోత్రావఁధాన్లుగారు? నన్ను తమరు యరక్కపోవచ్చునుగాని డిప్టీకలక్టరుగారింటికి తమరువచ్చేటప్పుడు నేను వారి పిల్లలికి చదువుచెబుతూ వుండేవాణ్ణి. డిప్టీకలక్టరుగారు తమర్ని యే మ్మెచ్చుకునేవారనుకుంటారు!
కరట అవును మీమొఖం చూచిన జ్ఞాపకవుఁంది. డిప్టీకలక్టరుగారు మహదొడ్డప్రభువ్‌.
గిరీశం మీలాంటి చప్పన్నభాషలూ వచ్చిన మనిషి యక్కడా లేడనీ, సంస్కృతం మంచినీళ్లప్రవాహంలా తమరు మాట్లాడతారనీ, తమలాంటి విదూషకుణ్ణి యక్కడా చూళ్లేదనీ డిప్టీకలక్టరుగారు శలవిస్తూండేవారు. కవితారసం ఆయన్లా గ్రెహించేవారేరీ? నాకవిత్వవఁంటే ఆయ్న చెవికోసుకుంటారు. మహారాజావారిదర్శనం కూడా నాకు చెయించారండి.
అగ్ని (ధుమధుమలాడుతూ) ఈ శషభిషలు నాకేం పనికిరావు. యితడి వైఖరిచూస్తే యిక్కడే బసవేసేటట్టు కనపడుతూంది. మాయింట్లో భోజనం యంతమాత్రం వీలుపడదు.
వెంక ఆయనమాటలు గణించకు బాబూ, ఆయన మోస్తరది. మీదయవల్ల మావాడికో ముక్కబ్బితే మీమేలు మరిచిపోం.
గిరీశం అందు కభ్యంతర వేఁవిఁటమ్మా, మీవాడు శలవుల్లో చదువుచెప్పమని యంతో బతిమాలుకుంటే పోనీ పనికొచ్చే కుఱ్ఱవాడుగదా అని వొచ్చానుగాని పట్ణంలో మునసబుగారింట భోజనంచేదని వొచ్చానా, వారిచ్చేడబ్బు చేదని వొచ్చానా అమ్మా?
వెంకమ్మ యీ చదువులకోసవఁని పిల్లణ్ణి వొదులుకునివుండడం, వాడు పరాయివూళ్లో శ్రమదమాలు పడుతూండ్డం నాప్రాణాలు యెప్పుడూ అక్కణ్ణే వుంఛాయి. డబ్బంటే యెన్నడూ వెనక చూళ్లేదుగదా. మేం కనడంమట్టుకు కన్నాం. మీరే వాడికి తల్లీ తండ్రీని. యలా కడుపులో పెట్టుకు చదువు చెబుతారో మీదేభారం.
గిరీశం తమరు యింతదూరం శలవియ్యాలమ్మా? నా మంచిచెడ్డలు మీ కుఱ్ఱవాణ్ణడిగితే తెలుస్తుంది. మునసబుగారూ, డిప్టీకలక్టరుగారూ యెన్నికచేసిన మనిషిని. నా మాట నే చెప్పుకోవాలా`, ఇంతెందుకూ యిక మూడేళ్లు నా తరిఫీదులో వుంచితే క్రిమినల్లో వరసగా పోలీసు పరిక్ష పా`సుచేయిస్తాను.
అగ్ని మూడేళ్లే! యీసంవత్సరం పుస్తకాల కెంతవుతుందిరా అబ్బీ?
వెంకటేశం పదిహేన్రూపాయ లవుతుంది.
అగ్ని ఒక్కదమ్మిడీ యివ్వను. వీళ్లిద్దరూకూడి ఆరూపాయలు పంచుకుతినేటట్టు కనపడుచూంది. నేను వేదం యనబైరెండుపన్నాలూ ఒహదమ్మిడీ పుస్తకాలఖర్చు లేకుండా చదువుకున్నాను. ఇదంతా టోపీ వ్యవహారంలా కనపడుతుంది.
కరట (నవ్వుతూ) కోట్లకి విలవైనమాట అన్నావు బావా!
గిరీశం (కరటకశాస్త్రితో) దిసీజ్‌ బార్బరస్‌, చూచా`రండీ, జెంటిల్మేన్‌ అనగా పెద్దమనిషిని యలా అంటున్నారో! నేను యిక యిక్కడ వుండడం భావ్యం కాదు, శలవుపుచ్చుకుంటాను.
వెంకమ్మ చాల్చాలు బాగానేవుంది! యింటి కెవరొచ్చినా నాకిదే భయం, ఆయన మాటల కెక్కడికి బాబూ, వెళ్లిపోకండి.
కరటక అగ్నిహోత్రావుధాన్లూ! కుఱ్ఱవాడికి రవ్వంతచదువు చెప్పించడానికి ఇంత ముందూవెనకా చూస్తున్నావ్‌. బుచ్చమ్మనమ్మిన పదిహేను వొందల రూపాయిలేంజేశావ్‌?
గిరీశం సెల్లింగ్గర్ల్స్‌! డామిట్‌!
అగ్ని ప్ర`తీగాడిదె కొడుకూ అమ్మా`వమ్మా` వంచూంఛాడు. కూరగాయల్షోయ్‌ అమ్మడానికీ? ఆరూపాయలు పుచ్చుకోకపోతే మొగుడు చచ్చాడుగదా, దాని గతి యావైఁయ్యుండును?
కరట చచ్చాడంటే వాడిదా` తప్పు, మంచంమీంచి దించెయడానికి సిద్ధంగా వున్న వాడిక్కట్టా`వ్‌!
గిరీశం తమరేనా నులక అగ్నిహోత్రావుధాన్లుగారు? యీ పట్టెని జటలో తమంతవారు లేరని రాజమహేంద్రవరంలో మావాళ్లనుకునేవారు.
అగ్ని మీది రాజమహేంద్రంషండీ? ఆ మాట చెప్పా`రుకారేం? రామావుధాన్లుగారు బాగున్నారా?
గిరీశం బాగున్నారండి. ఆయన మా మేనమావఁగారండి.
అగ్ని ఆ మాట చెప్పా`రుకారూ?
గిరీశం మామావఁ యీ దేశబ్భోగట్టా వొచ్చినప్పుడల్లా తమర్ని యెన్నిక చేస్తూంటారండి.
అగ్ని నాకూ వారికి చాలాస్నేహం. చూశారా కొంచం నాకు ప్రథమకోపం. యవరో తెలియకుండా అన్నమాటలు, గణించకండేం.
గిరీశం దానికేవఁండి, తమవంటి పెద్దలు అనడం మాలాంటి కుఱ్ఱవాళ్లు పడడం విధాయకవేఁగదండీ?
కరట (తనలో) యిన్నాళ్లకి మా అగ్నిహోత్రుడికి తగినవాడు దొరికా`డు.
అగ్ని చూశారండీ, మీపేరేవిఁటండీ?
గిరీశం గిరీశం అంటారండి.
అగ్ని చూశారండి, గిరీశంగారూ! మా కరటక శాస్తుల్లు వట్టి అవకతవక మనిషి; మంచీ చెడ్డా యేమీ వాడి మనసుకెక్కదు. అల్లుడు చచ్చిపోయినాడంటే అందువల్ల యెంతలాభం కలిగింది. భూవుఁలకి దావా తెచ్చావాఁలేదా? నేను యీమధ్య దాఖల్చేయించిన పిటీషను మీద ఆర్డరు చదివి పెట్టండి (గదిలోకి వెళ్లి కాకితంతెచ్చి గిరీశంచేతికి యిచ్చును.)
గిరీశం (చూసి) ఎవడో తెలివితక్కువ గుమాస్తా వ్రాసినట్లుంది. అక్షరపొలితే లేదండి.
అగ్ని మావకీలు గడగడ చదివేశాడండి.
గిరీశం నేను మాత్రం చదవలేకనా. అంతకన్న గళగ్రాహిగా చదువుతాను. లెక్చర్లిచ్చేపండితుణ్ణి నాకిది పేలపిండీ కాదు; అయితె రాసినవాడి తెలివికి సంతోషిస్తున్నాను. యిది అరిటిపండు విప్పినట్టు తర్జుమాచేసి దాఖలుచెయ్యమని శలవా?
అగ్ని అంతకంటేనా! (తనలో) డబ్బు ఖర్చులేకుండా వీడిచాత కాగితమ్ముక్కలన్నీ తర్జుమాచేయించేస్తాను.
గిరీశం యింకా యింగ్లీషు కాయితాలు యేవుఁన్నా నామీద పార`య్యండి, తర్జుమా చేసిపెడతాను.
అగ్ని అష్లాగే.
వెంకమ్మ మా అబ్బాయీ మీరు ఒక్క పర్యాయం యింగిలీషు మాట్లాడండి బాబూ.
గిరీశం అలాగే నమ్మా.
My dear Venkatesam-
Twinkle! Twinkle! little star,
How I wonder what you are!
వెంకటేశం There is a white man in the tent.
గిరీశం The boy stood on the burning deck
Whence all but he had fled.
వెంకటేశం Upon the same base and on the same side of it the sides of a trepezium are equal to one another.
గిరీశం Of man's first disobedience and the fruit of that mango tree, sing, Venkatesa, my very good boy.
వెంకటేశం Nouns ending in f or fe change their f or fe into ves.
అగ్ని యీ ఆడుతూన్న మాటలకి అర్థంయేవిఁషండి?
గిరీశం ఈ శలవుల్లో యే ప్రకారం చదవాలో అదంతా మాట్లాడుతున్నావఁండి.
కరట అబ్బీ వొక తెనుగు పద్యం చదవరా?
వెంకటేశం పొగచుట్టకు సతిమోవికి-
కరట చబాష్‌!
గిరీశం డా`మిట్‌! డోంట్రీడ్‌ దట్‌, (మెల్లగా) "నలదమయంతులిద్దరు" చదువ్‌.
వెంకటేశం నలదమయంతు లిద్దరు మనః ప్రభవానల దహ్యమానులై సలిపిరి దీర్ఘ వాసర నిశల్‌.
కరట అట్టేఅట్టే, మనఃప్రభవానలవఁంటే యేవిఁట్రా?
వెంకటేశం (యింటికప్పువేపుచూసి వూరుకుండును.)
గిరీశం పసిపిల్లలకి అలాంటి కఠినవైఁన పద్యానికి అర్థం తెలుస్తుందా అండి?
అగ్ని పద్యాలికి అర్థం చెప్పరూ?
గిరీశం యిప్పటిమట్టుకు వేదంలాగే భట్టీయం వేయిస్తారు. తెల్లవాళ్ల స్కూళ్లలో తెలుగుపద్యాలమీద ఖాతరీ లేదండి. యంతసేపూ జాగర్ఫీ, గీగర్ఫీ, అర్థమెటిక్‌, ఆల్జిబ్రా, మా`థమా`టిక్స్‌ యివన్ని హడలేసి చెప్తారండి.
కరటక (తనలో) తర్ఫీదు మాచక్కగావుంది. వీణ్ణి పెందరాళె తోవపెట్టకపోతే మోసవొఁస్తుంది.
అగ్ని అన్నోటి చెప్తారండీ?
గిరీశం మరేవఁనుకున్నారు? మీ కుఱ్ఱవాళ్లాగా చదువుకునే వాడికి ఒక నిమిషవైఁనా తెరిపుండదు.
అగ్ని అదుగో చదువంటే అష్లాగే చదువుకోవాలి. గొట్టికాయలాడకుండా మావాణ్ణి ఖాయిదాచేస్తే యంత చదువైనా వొస్తుంది.
గిరీశం నాదగ్గిర గొట్టికాయలు గిట్టికాయలు పనికిరావండి. పుస్తకం చాతపడితే వేళ్లకి పుస్తకం అంటుకుపోవాలి, అలాచదివిస్తానండి.
అగ్ని అలాగేచేస్తే మావాడికి చదువొచ్చి అన్నిపరిక్షలూ పా`సవుతాడండి. మావాడికి డబ్బుఖర్చులేకుండా పెళ్లయె సాధనంకూడా తటస్థించిందండి.
వెంకమ్మ మీ నైజంకొద్దీ ఛిఱ్ఱూ కొఱ్ఱూ మంఛారుగాని మీకు మాత్రం అబ్బిమీద ప్రేవఁలేదా యేవిఁషి? పట్టంలో గొట్టాలమ్మొచ్చినప్పుడు యంతో బెంగబెట్టుకుని అబ్బిని శలవర్జీరాసి వెళ్లిపోయిరమ్మన్నారు కారా? చదువూచెప్పించక పెళ్లీచెయ్యక తీరుతుందా యేమిషి?
కరట డబ్బు ఖర్చులేకుండా కొడుక్కి పెళ్లిచేస్తావుటోయి బావా? ఆడపిల్లల్ని అమ్మినట్టే అనుకున్నావా యేవిఁటి? పదిహేను వొందలైనా పోస్తేనేగాని అబ్బికి పిల్లనివ్వరు.
అగ్ని డబ్బు ఖర్చులేకుండా వెంకడికి యలా పెళ్లిచేస్తానో నువ్వేచూతువుగాని. రామచంద్రపురం అగ్రహారంలో లుబ్ధావదాన్లుగార్ని యెరుగుదువా?
కరట యరగను.
అగ్ని ఆయ్న లక్షాధికారి. పద్ధెనిమిదివందలకి సుబ్బిని అడగొచ్చారు. ఉభయఖర్చులూ పెడతారష, పెళ్లి మావైభవంగా చేస్తారష, మనం పిల్లనితీసికెళ్లి వాళ్లింటే పెళ్లిచెయ్యడం, మనకి తట్టుబడి అట్టేవుండదు. ఆపద్ధెనిమిది వొందలూపెట్టి వెంకడికి పెళ్లిచేస్తాను.
వెంకమ్మ పెళ్లికొడుక్కెన్నేళ్లు?
అగ్ని యెన్నేళ్లైతేనేవిఁ? నలభైయ్యయిదు.
గిరీశం లుబ్ధావదాన్లుగారు మాపెత్తల్లి కొడుకండి, తమతో సమ్మంధవఁంటే నాకు సంతోషవేఁగానండి. ఆయనకి అరవయ్యేళ్లు దాటా`యండి, యీడేవఁయినా సెల్లింగ్‌ గర్ల్‌స్‌ అనగా కన్యాశుల్కం, డామిట్‌! యంత మాత్రమూ కూడదండి, నేను పూనాలో వున్నప్పుడు అందువిషయమై ఒహనాడు నాలుగ్గంటలు ఒక్కబిగిని లెక్చరిచ్చానండి, సావకాశంగా కూర్చుంటే కన్యాశుల్కం కూడని పన`ని తమచేతనే వొప్పిస్తాను.
కరట బావా యీసమ్మంధం చేస్తే నీ కొంపకి అగ్గెట్టేస్తాను.
అగ్ని వీళ్లమ్మా శిఖాతరగ, ప్రతీగాడిదకొడుకూ తిండిపోతుల్లాగ నాయింటజేరి నన్ననేవాళ్లే. తాంబోలం యిచ్చేశాను. యిహ తన్నుకుచావండి.
వెంకమ్మ నాతో చప్పకుండానే?
అగ్ని ఆడముండల్తోనా ఆలోచన? యీ సమ్మంధం చైకపోతే నేను బారికరావుఁణ్ణే! (లేచివెళ్లును.)
కరట యెంమార్దవం.
వెంక అన్నయ్యా! యీ సమ్మంధం చేస్తే నేన్నుయ్యోగొయ్యో చూసుకుంటాను. పెద్దదాన్ని రొమ్ముమీద కుంపట్లాగ భరిస్తూనేవున్నాం. ఆయనికి యంత యీడొచ్చినా కష్టంసుఖం వొళ్లునాటక యీ దౌర్భాగ్యపు సమ్మంధం కల్పించుకొచ్చారు. నేబతికి బాగుండాలంటే యీ సమ్మంధం తప్పించు.
కరట గట్టి అసాధ్యంతెచ్చిపెట్టా`వే, వొట్టిమూర్ఖప గాడిదకొడుకు. యెదురుచెప్పినకొద్దీ మరింత కొఱ్ఱెక్కుతాడు. యేం చేయగల్గుదునని నీకు భరువసా చెప్పను? యేమీ పాలుపోకుండా వుంది.
గిరీశం అమ్మా మీరు యెందుకలా విచారిస్తారు? అవుఁధాన్లుగారు సావకాశంగా వున్నప్పుడు ఒక్కగంట కూర్చుంటే డబ్బుచ్చుకు ముసలివాళ్లకి పెళ్లిచెయ్యడం దౌర్జన్యవఁని లెక్చరిచ్చి మనసు మళ్లిస్తాను.
వెంకమ్మ బాబూ, అతడు మీ మా`నత్తకొడుకైతే మీకాళ్లు పట్టుకుంటాను, మీరువెళ్లి ఆయ్న మనస్సు మళ్లిస్తురూ. నాచర్మం చెప్పులు కుట్టియిస్తాను.
గిరీశం అమ్మా యేం చెప్పను! వాడో త్వాష్ట్రం. పిల్లదొరకడవేఁ చాలువాడికి. యీసమ్మంధం వొదులుకుంటే వాడికి పెళ్లేకాదు. వాడని వాడొదిలే ఘటంకాడు.
కరట అమ్మీ నేనో ఉపాయం చెబుతాను యిలారా.
(కరటకశాస్త్రి శిష్యుడు వెంకమ్మ నిష్క్రమింతురు.)
గిరీశం మైడియర్‌ షేక్స్పియర్‌! నీ తండ్రి అగ్గిరావుఁడోయి. మీ యింట్లో యవళ్లకీ అతణ్ణి లొంగదీశే యలోక్వెన్సులేదు. నాదెబ్బచూడు యివా`ళేం జేస్తానో. వీరేశలింగం పంతులుగారు కన్యాశుల్కం విషయవైఁరాసిన ఉపన్యాసం పైకితీయ్‌. మావఁగారికి లెక్చరివ్వడాని క్కత్తీ కఠారీనూరాలి.
వెంకటేశం మీలెక్చరుమాట అలావుణ్ణీండిగాని యీవా`ళ నాగండం గడిచిందిగదా అని సంతోషిస్తున్నాను. మీఱ్ఱాకపోతే పరిక్ష ఫేలయినందుకు మానాన్న పెయ్యకట్టుతాడుతో చమ్డా లెక్కగొట్టును.
గిరీశం యిలాంటి ప్రమాదాల్తప్పించుకోవడవేఁ ప్రజ్ఞ. యేవైఁనా డిఫికల్టీ వొచ్చినప్పుడు ఒక ఠస్సావేశావఁంటే అది బ్రహ్మభేద్యంగా వుండాలి. పోలిటిషనంటే మరేవిఁటనుకున్నావ్‌? పూజా నమస్కారాల్లేక బూజెక్కున్నాను గాని మనకంట్రీయే ఇండిపెండెంట్‌ అయితే గ్లాడ్స్టన్‌లాగ దివాన్గిరీ చలాయిస్తును. యేమి వాయ్‌! మీ తండ్రివైఖరి చూస్తే పుస్తకాలకి సొమ్మిచ్చేటట్టు కనబడదు. చుట్టలు పట్ణంనించి అరకట్టేతెచ్చాం`గదా, యేమి సాధనం?
వెంక నాన్నివ్వకపోతే అమ్మనడిగి డబ్బుతెస్తాను.
గిరీశం నీబుద్ధియలా వికసిస్తూందో చూశావా? యిలా తర్ఫీదవుతుంటే నువ్వుకూడా పెద్దపోలిటిషను వవుతావు.
[బుచ్చమ్మ ప్రవేశించును.]
బుచ్చమ్మ తమ్ముడూ అమ్మ కాళ్లు కడుక్కోమంచూందిరా.
గిరీశం (తనలో) హౌ బ్యూటిపుల్‌! క్వైటనెక్‌స్పెక్టెడ్‌!
బుచ్చమ్మ అయ్యా మీరు చల్దివణ్ణం తించారా?
గిరీశం నాట్ది స్లైటెస్టబ్జక్‌షన్‌, అనగా యంతమాత్రం అభ్యంతరం లేదు. వడ్డించండిదుగో వస్తున్నాను. తోవలో యేటిదగ్గిర సంధ్యావందనం అదీ చేసుకున్నాను.
(బుచ్చమ్మ వెళ్లును.)
గిరీశం వాట్‌, యీమె నీ సిస్టరా? తలచెడ్డట్టు కనబడుతున్నదే?
వెంక మాఅక్కే, జుత్తుకి చవుఁఱ్ఱాసుకోదు.
గిరీశం తల చెడ్డం అంటే, విడో అన్నమాట. చవుఁరు గివుఁరూ జాంతే నయ్‌. గాని యిన్నాళ్లాయి నీకు విడో మా`రేజి విషయవైఁ లెక్చర్లిస్తూవుంటే యీ కథ యెప్పుడూ చెప్పా`వుకావు? మీ యింట్లోనే ఓ అన్ఫార్చునేట్‌ బ్యూటిఫుల్‌ యంగ్‌ విడో వుందటోయ్‌! యేమి దురవస్థ! మైహార్ట్‌ మెల్‌ట్స్‌. నేనే తండ్రినైతే యీపిల్లకి విడోమా`రియెజ్జేసి శాశ్వితవైఁనకీర్తి సంపాదిస్తును. (తనలో) యేమి చక్కదనం, యీసొంపు యక్కడా చూళ్లేదే! పల్లిటూరు వూసు పోదనుకున్నానుగాని పెద్ద కాం`పేనుకి అవకాశం యిక్కడకూడా దొరకడం నా అదృష్టం.
వెంక మా నాన్న నాక్కూడాపెళ్లి చా`స్తాడు.
గిరీశం యీ వా`ళో పెద్ద పెళ్లినీకు తలవెంట్రుకంత వాసి తప్పిపోయింది. యీ శలవులాఖర్లోగా తాళాధ్యాయం కాకుండా తప్పించుకుంటే నువ్‌ పూరా ప్రయోజకుడివే, యిహ నిజవైఁనపెళ్లా? యింతచదువూ చదువుకుని నీతండ్రి కుదిర్చిన యేవీఁ యరగని చిన్న పిల్లకా పుస్తె కడతావ్‌? మాంచియెఱ్ఱగా బుఱ్ఱగావున్న యంగ్విడోని నువ్‌ పెళ్లా`డకపోతే ఐషుడ్బి యషేమ్డాఫ్యూ!
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)