నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౨-వ స్థలము. దేవాలయం.
[పువ్వులతోటలో మండపంమీదకూచుని, శిష్యుడు ప్రవేశించును.]
శిష్యుడు

ఆర్నెల్లకోమాటు పొస్తకంపట్టుకుంటే కొత్తశ్లోకాలు పాతశ్లోకాలు ఒక్కలా గ్కనపడతాయి. యిప్పుడు కొత్తశ్లోకం కనుక్కొమ్మంటే నాశక్యవాఁ? సిద్ధాంతినెవణ్ణయినా ప్రశ్నడిగి కనుక్కొవాలి. లేకుంటే చటుక్కున పుస్తకం విప్పియె శ్లోకం కనపడితే ఆశ్లోకం చదువుతాను.

"మృగాః ప్రియాళు ద్రుమమంజరీణాం"

యిదేదో చదివినజ్ఞాపకం లీలగావుంది. లేళ్లుపరిగెత్తాయని కాదూ? యేం గొప్పమాట చెప్పా`డోయి కవి! లేళ్లు పరిగెత్తితే యవడిక్కావాలి. పరిగెత్తకపొతే యవడిక్కావాలి? కుక్కలు పరిగెత్తుతున్నాయ్‌ కావా, నక్కలు పరిగెత్తుతున్నాయ్‌ కావా? పిల్లులు పరిగెత్తుతున్నాయి కావా? పనికొచ్చే ముక్క ఒక్కటీ యీపుస్తకంలో లేదు. నాలుగంకెలు బేరీజు వేయడం, వొడ్డీ వాశీ కట్టడం కాళిదాసుకేం తెలుసును? తెల్లవాడిదా మహిమ! యెపట్నం యెక్కడుందో, యెకొండ లెక్కడున్నాయో అడగవయ్యా గిరీశంగార్ని; నిలుచున్న పాట్ను చెబుతాడు.

"ప్రియాముఖం కింపురుషశ్చుచుంబ"

ముద్దెట్టు కున్నాడటోయి ముండాకొడుకు. ముక్కట్టు కున్నాడు కాడూ?

[కరటకశాస్త్రి శిష్యుడికి కనపడకుండా వెనుకనుంచి ప్రవేశించును.]

"వర్ణ ప్రకర్షే సతి కర్ణికారం ।
ధునోతి నిర్గంధతయాస్మ చేతః" ॥

యిదికూడా చదివినట్టె వుందోయి, ఆపువ్వెదో కవికిష్ఠంలేదట. యిష్ఠం లేకపోతె ములిగిపోయింది కాబోలు! మాగురువుగారికి దొండకాయ కూర యిష్ఠం లేదు, గురువుగారి పెళ్లాం పెరట్లో దొండపాదుందని రోజూ ఆకూరె వొండుతుంది. బతికున్నవాళ్ల యిష్ఠవెఁ యిలా యేడుస్తూంటే చచ్చినవాడి యిష్ఠాయిష్ఠాల్తో యేంపని? యీచదువిక్కడితో చాలించి గిరీశంగారి దగ్గిర నాలుగింగిలీషు ముక్కలు నేర్చుకుంటాను. వెంకడికి యింగిలీషొచ్చునని యేం గఱ్ఱాగా వుంది?

కరట యెవిఁట్రా అబ్బీ అంటున్నావు?
శిష్యు యెదో నాస్వంత ఘోష.
కరట గురువునిగదా, అదేదో నాకూ కొంచెం చెబుదూ.
శిష్యు చప్పడానికేవుఁందండి? నాటకంలో నాచాత వేషం కట్టించి పెద్దచాంతాళ్లలాంటి హిందూస్తానీ ముక్కలూ, సంస్కృతం ముక్కలూ అర్థం తెలియకుండా భట్టీయం వేయించడానికి మీకు ఓపికుందిగాని నాకు నాల్రోజులి కోశ్లోకం చెప్పడానికి శ్రద్ధలేదుగదా? పట్నంవొదిలి ఆర్నెల్లకోమాటు అగ్రహారాలంట వొచ్చినప్పుడు మరేం వూసుపోక "పుస్తకం తియ్యంటె" సంస్కృతం యెంవచ్చేని?
కరట యిటుపైన్చూడు యలా చెబుతానో, రోజుకి నాలుగేసి శ్లోకాలు చెబుతాను. కొత్తశ్లోకం చదువు.
శిష్యు "అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా ।
హిమాలయో నామ నగాధిరాజః" ॥
కరట మొదటి కొచ్చావేం?
శిష్యు మొదలూకొసా వొక్కలాగే కనపడుతూంది.
కరట (నవ్వి) పోనియ్‌, మొదణ్ణించే చదువుదాం.
శిష్యు చదివినా యేంలాభవుఁంది. యీశ్లోకం శుద్ధ అబద్ధంట.
కరట యవరుచెప్పా`రు?
శిష్యుడు గిరీశంగారు.
కరట యెంచెప్పా`డు?
శిష్యు హిమాలయం రెండుసముద్రాలకీ దాసి, రూళ్ల గఱ్ఱలాగలేదట. మా`పులో చూపించాడు.
కరట హిమాలయం శిగగోశిరిగాని. ఆపుస్తకం ముణిచి నామాటవిను.
శిష్యు చిత్తం (పుస్తకం మూయును.)
కరట చదువన్న దెందుకు, పొట్ట పోషించుకోడానిగ్గదా?
శిష్యుడు అవును.
కరట యీరోజుల్లో నీసంస్కృత చదువెవడి క్కావాలి?
శిష్యు దరిద్రులి క్కావాలి.
కరట బాగా చెప్పా`వు. నీకు యింగ్లీషు చదువుకోవాల్నుందో?
శిష్యు చెప్పించే దాతేడీ?
కరట నేను చెప్పిస్తాన్రా.
శిష్యుడు నిజంగాను?
కరట నిజంగాన్రా, గాని ఒకషరతుంది.
శిష్యు యెవిఁటండి?
కరట నాకో కష్ఠసాధ్యమైన రాచకార్యం తటస్థించింది. అది నిర్వహించి నువ్‌ చేసుకురావాలి.
శిష్యు నావల్లయే రాచకార్యాలు కూడా వున్నాయా?
కరట యీరాచకార్యం నీవల్లేకావాలి. మరెవడివల్లాకాదు. అదేవిఁటంటె, ఓపదిరోజులు నువ్వు ఆడపిల్లవై పోవాలి.
శిష్యు గణియం పట్ణంలోవుండి పోయిందే?
కరట అట్టే గణియం అవసరంలేదు. నీకు తలదువ్వి, కోకకడితే పజ్యండేళ్ల కన్నెపిల్లలావుంటావు. నిన్ను తీసుకెళ్లి లుబ్ధావుధాన్లికి పెళ్లి చేస్తాను. నాలుగుపూటలు వాళ్లింట నిపుణతగా మెసిలి, వేషం విప్పేశి పారిపోయిరా. నిజవైఁన పెళ్లిముహర్తం చాలా వ్యవధుంది.
శిష్యు యిదెంతపని.
కరట అలా అనుకోకు. అతి చేస్తి వట్టాయనా, అనుమాన పడతారు. పట్టుబడ్డావంటే పీక తెగిపోతుంది.
శిష్యు మీకా భయంవొద్దు.
కరట నువ్వునెగ్గుకొస్తే, మా పిల్లన్నీకిచ్చి యిల్లరికం వుంచుకుంటాను.
శిష్యు అలాప్రమాణం చెయ్యండి.
కరట యిదుగో యీపుస్తకం పట్టుకు ప్రమాణం చేస్తున్నాను.
శిష్యుడు యీపుస్తకంమీద నాకు నమ్మకం పోయింది. మరోగట్టి ప్రమాణం చెయ్యండి. గిరీశంగారిని అడిగి ఒక యింగిలీషు పుస్తకం పట్టుకురానా?
కరట తప్పితే భూమితోడ్రా.
శిష్యు మీరు యగేస్తే భూవేఁం జేస్తుంది? మీ మాటేచాలును కానీండి.
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)