నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౩-వ స్థలము. అగ్నిహోత్రావధాన్లు యింటి యదటివీధి.
[గిరీశం, వెంకటేశం ప్రవేశింతురు.]
వెంక రాత్రి కన్యాశుల్కం మీద లెక్చరిచ్చారా?
గిరీశం లెక్చరేవిఁటోయ్‌. ధణుతెగిరిపోయింది. మీతండ్రిది మైరావణ చరిత్రోయ్‌. మీఅంకుల్‌ కరటకశాస్త్రి స్కౌండ్రల్లా క్కనపడుతున్నాడు.
వెంక యేం జరిగిందేం జరిగిందేవిఁటి?
గిరీశం విను. రాత్రి భోజనాలవేళ లెక్చరు ఆరంభించమని రోజల్లా బురిడీలు పెట్టా`డోయి మీ మావఁ. సబ్జక్టు నేను కొంచం యెత్తగానే తనుకూడా గట్టిగా సపోర్టు చేస్తానని ప్రోమిస్‌కూడా చేశాడు. నీ తండ్రి వైఖరీచూస్తే మాత్రం కొంచం ధైర్యం వెనకాడి నాలిక్కొన కొచ్చిన మాట మళ్లీమణిగి పోతూండేది. పెరుగూ అన్నం కలుపుకునే వేళకి యిక టైమ్మించి పోతూందని తెగించి లెక్చరు ఆరంభించాను. ఇంట్రడక్‌ష\న్‌ రెండు సెంటెన్సులు యింకా చెప్పనే లేదు నాలుగు యింగ్లీషు మాటలు దొల్లాయోయ్‌ దాంతో నీతండ్రి కళ్లెఱ్ఱజేశి "యీ వెధవ యింగ్లీషు చదువునించి బ్రాహ్మణ్యం చెడిపోతూంది; దేవభాషలాగ భోజనాల దగ్గిరకూడా ఆ మాటలే కూస్తారు; సంధ్యావందనం శ్రీసూక్త పురుషసూక్తాలూ తగలబడిపోయినాయి సరేగదా?" అని గట్టిగాకేకవేసి చెప్పేసరికి నేను కొంచంపస్తాయించి "థ్రోయింగ్‌ పెర్‌ల్సు బిఫోర్‌ స్వైన్‌" అనుకొని కరటక శాస్తుల్లువేపు చూసేసరికి యెంచేస్తూన్నాడనుకున్నావ్‌? రాస్కెల్‌ వులకలేదు పలకలేదు సరేకదా మొహం పక్కకి తిప్పి కడుప్పగిలేటట్టు నవ్వుతున్నాడు. యికలెక్చరు వెళ్లిందికాదు సరేకదా, నోట్లోకి ముద్దకూడా వెళ్లిందికాదు. ఛీ యింతయిన్సల్టు జరిగింతరవాత తక్షణం బయలుదేరి వెళ్లిపోదావఁనుకున్నాను.
వెంక అయ్యో వెళ్లిపోతారా యేవిఁటి?
గిరీశం నాటింది లీష్టు. కొసాకీవిను, నీతండ్రిని పోకెట్లో వేశాను.
వెంక నా తండ్రికి లెక్చరిచ్చి పెళ్లి తప్పిస్తావఁన్నారే?
గిరీశం పెళ్లి ఆపడానికి బ్రహ్మశక్యంకాదు. డిమాస్థనీసు, సురేంద్రనాద్‌ బా`నర్జి వచ్చి చెప్పినా నీతండ్రి యీ పెళ్లిమానడు. లెక్చర్లు యంతసేపూ సిటీల్లోనేగాని పల్లిటూళ్లలో యంతమాత్రం పనికిరావు. పూనాలాంటిసిటీలో లెక్చర్‌ యిచ్చావఁంటే టెంథౌజం`డు పీపిల్‌విండానికి వొస్తారు. మన టౌన్లోనో, పెద్ద మీటింగులు చెయ్యాలంటే, డప్పులు బజాయించి, నోటీసులు కట్టి, బౙార్లుకాసి, తోవంట పోయేవాళ్లని యీడ్చుకు వొచ్చినా, యాబైమందికారు. పల్లెటూరి పీపిల్‌ లెక్చర్లకి అ\న్‌ఫిట్‌. మొన్న మనం వొచ్చిన బండీవాడికి నా`షనల్‌ కాంగ్రెస్‌ విషయవైఁ రెండు ఘంటలు లెక్చరు యిచ్చేసరికి ఆగాడిద కొడుకు, వాళ్లవూరు హెడ్‌కానిష్ఠేబిల్ని కాంగ్రెసువారు యెప్పుడు బదిలీ చేస్తారని అడిగాడు! విలేజస్‌లో లెక్చర్లు యంతమాత్రం కార్యంలేదు. నీ తండ్రి దగ్గిర మాత్రం లెక్చరన్నమాటకూడా అనకూడదు.
వెంక అయితే, నాన్నని యలాగ జేబులో వేశారేవిఁటి?
గిరీశం అది పో`లిటిక్సు దెబ్బోయ్‌! ఆ తరవాత కథవిను. నామీద కా`కలేసిన తరవాత కోపవఁణక్క, ధుమధుమ లాడుకుంటూ, పెరుగూ అన్నం కుమ్మడం ఆరంభించాడు. ఇంతలో మీ అప్ప వొచ్చి గుమ్మం దగ్గిర నిలబడి కోకిలకంఠంతో "నాన్నా తమ్ముడికి పెళ్లిచెయ్యాలంటే నాసొమ్ముపెట్టి పెళ్లిచెయ్యండిగాని దాని కొంపముంచి లుబ్ధావుఁధాల్లుఁకి యివ్వొద్దని" చెప్పింది. దాంతో నీ తండ్రికి వెఱ్ఱికోపం వొచ్చి వుత్తరాపోసనం పట్టకుండానే ఆపెరుగూ అన్నంతో విస్తరితీసికెళ్లి దాన్నెత్తిని రుద్దేశాడు! కరటక శాస్తుల్లు అడ్డుపడబోతే చెంబుతో నీళ్లు వాడినెత్తిం దిమ్మరించాడు. కరటక శాస్తుల్లుకి కోపంవొచ్చి శిష్యుణ్ణి తీసుకు వాళ్లవూరెళ్లిపోయినాడు.
వెంక దీనిపేరెనా యేవిఁటి మానాన్నంజేబులో వేసుకోవడం?
గిరీశం పేషన్స్‌! కొసాకీవిను. స్కౌండ్రల్‌ కరటక శాస్తుల్లు వెళ్లిపోయినాడని సంతోషించానుగాని, నీ సిస్టర్‌ ఫేట్‌ విషయవైఁ మహా విచారవైఁంది. నేనే దాని హజ్బెండ్నైవుంటే, నిలబడ్డపాటున నీ తండ్రిని రివాల్వర్తో షూట్‌ చేశివుందును. మీ అమ్మ యేడుస్తూ ఒకమూలకూచుంది. అప్పుణ్ణే వెళ్లి, నీళ్లపొయిలో నిప్పేసి, నీళ్లుతోడి, నీసిస్టర్ని స్తానం చెయమన్నాను. సిగర్సు కాల్చుకుందావఁని అరుగుమీద నేను బిచాణావేసే సరికి, నీ తండ్రికి పశ్యాత్తాపం వొచ్చి, తానూ ఆ అరుగుమీదే బిచాణా వేసి, ఒక్క సిగరయినా కాల్చనియ్యకుండా రాత్రల్లా కబుర్లలో పెట్టి చంపాడొయ్‌. మొత్తానికి కత్తు కలిపేశాను.
వెంక యాలాక్కలిపా`రేవిఁటి?
గిరీ ఒక పొలిటికల్‌ మహాస్త్రం ప్రయోగించి కలిపేశాను.
వెంక యెవిఁటండా అస్త్రం?
గిరీ ఒకడు చెప్పిందల్లా మహాబాగుందండవేఁ. సమ్మోహనాస్త్రవఁంటే అదేకదా?
వెంక లెక్చరిచ్చి మాతండ్రిని వొప్పించడానికి బదులుగా ఆయన చెప్పిందానికి మీరే వొప్పుకున్నారూ?
గిరీ కుంచం నిలువుగా కొలవడానికి వీల్లేనప్పుడు, తిరిగేశైనా కొలిస్తే నాలుగ్గింజలు నిలుస్తాయి. బాగా ఆలోచిస్తే యిన్ఫెంటు మా`రియేజి కూడుననే తోస్తూంది.
వెంక యిన్నాళ్లూ కూడదని చెప్పేవారే నాతోటి?
గిరీ ఒపినియన్సు అప్పుడప్పుడు ఛేంజి చెస్తూంటేనేగాని పోలిటిషను కానేరడు. నాకు తోచిన కొత్త ఆర్గ్యుమెంటు విన్నావా? యిన్ఫెంటు మా`రేజీలు అయితెనేగాని, యంగ్‌ విడోజ్‌ వుండరు. యంగ్‌ విడోజ్‌ వుంటేనేగాని, విడో మారియేజ్‌ రిఫారమ్‌కి అవకాశం వుండదుగదా? సివిలిజేషన్కల్లా నిగ్గు విడో మారియేజ్‌ అయినప్పుడు, యిన్ఫెంట్‌ మారేజీల్లేకపోతే, సివిలిజేష\న్‌ హాల్టవుతుంది! మరి ముందు అడుగు పెట్టలేదు. గనక తప్పకుండా యిన్ఫెంటు మా`రేజి చేయ్యవలసిందే. యిదివొహ కొత్తడిస్కవరీ; నంబర్‌టూ, చిన్నపిల్లల్ని ముసలాళ్లకిచ్చి పెళ్లిచెయ్యడం కూడా మంచిదే అనినేను వాదిస్తాను.
వెంక సుబ్బిని లుబ్ధావుఁధాల్లికి యివ్వడం మంచిదంటారా యెవిఁటి? అమ్మ ఆ సమ్మంధం చేస్తే నూతులో పడతానంటూందే?
గిరీ ఫెమినైన్స్‌ ఫూల్సన్నాడు. "పడుపడుఅన్న నాసవితేగాని పడ్డనాసవితి లేదంది" టెవర్తోను. నూతులో పడడం గీతులోపడడం నాన్సన్స్‌, ఓరెండు తులాల సరుకోటి మీనాన్నచేయించి యిచ్చాడంటే మీ అమ్మ ఆమాట మానేస్తుంది. గాని నా ఆర్గ్యుమెంటు విను.
వెంక యేవిఁటండి?
గిరీశం పెళ్ల`నే వస్తువ, శుభవాఁ అశుభవాఁ? మంచిదా చెడ్డదా? చెప్పు.
వెంక మంచిదే.
గిరీశం వెరిగుడ్‌! పెళ్లనేది మంచి పదార్థవైఁతే "అధికస్య అధికం ఫలం" అన్నాడు గనక చిన్నపిల్లని ఒక ముసలాడికి పెళ్లిచేసి, వాడుచస్తే మరోడికి, మరోడుచస్తే మరోడికి, యిలాగ పెళ్లిమీద పెళ్లి, పెళ్లిమీద పెళ్లిఅయి, వీడిదగ్గిరో వెయ్యి, వాడిదగ్గిరో వెయ్యి, మరోడిదగ్గిర మరోవెయ్యి, రొట్టెమీద నెయ్యి, నేతిమీద రొట్టె లాగ యేకోత్రవృద్ధిగా కన్యాశుల్కం లాగి, తుదకి నాలాంటి బుద్ధివఁంతుణ్నిచూసి పెళ్లా`డితే చెప్పావ్‌ మజా? ఇహసౌఖ్యం పూర్తిగా లభిస్తుంది. ఇహసౌఖ్యంవుంటే పరసౌఖ్యంకూడా సాధించావేఁ అన్నమాట. యలాగో తెలిసిందా? ఈజ్‌మెంటు హక్కు యష్ఠాబ్లిష్‌ అవుతుంది.
వెంక కన్యాశుల్కం కూడా మంచిదంటున్నా రేవిఁటి?
గిరీ మరేవిఁటనుకున్నావ్‌? నెవ్వర్డూబైహావ్సన్నాడు చేస్తే శుద్ధక్షవరవేఁగాని తిరపతి మంగలాడి క్షవరం చెయ్యకూడదు. యీ అస్త్రంతోటే మీతండ్రి వశ్యం అయినాడు. యింగ్లీషువాడు "థింక్‌" అన్నాడోయి. ఆలోచిస్తేగాని నిజం బోధపడదు. బాగా ఆలోచించగా, కన్యాశుల్కంలేని మా`రేజే యీ భూప్రపంచంలో లేదు. విన్నావా?
వెంక యెలాగండి?
గిరీ అలా అడగవోయి, యేం? డబ్బుచ్చుకుంటేనే కన్యాశుల్కవఁయిందేం? యిన్ని తులాలు బంగారం పెట్టాలి, యింత వెండిపెట్టాలి అనిరూపాయిలకి బదులుగా వెండిబంగారాలకింద ధనం లాగితే, కన్యాశుల్కం అయిందికాదేం? యీ పెద్దపెద్ద పంతుళ్లవారంతా యిలా చేస్తూన్నవారేనా?
వెంక అవును.
గిరీ యిక దొర్లలోనో? వాళ్లతస్సా గొయ్యా, యిల్లుగుల్ల చేస్తారోయి; అవి గుడ్డలుకావు, అవి శెంట్లుకావు, అవి జూయల్సుకావు, మా`రియేజి సెటిలుమెంటని బోలెడు ఆస్తికూడా లాగుతారు. యీ ఆర్గ్యుమెంటు నేను చెప్పేసరికి నీతండ్రి బ్రహ్మానంద భరితుడైనాడు. లుబ్ధావుఁదాన్లు పెళ్లికి అన్నిటికన్న పెద్ద సవబొకటి నీకు చెబ్తానువిను.
వెంక యెవిఁటండి.
గిరీ లుబ్దావుఁధాన్లు ముసలాడూ, బంగారప్పిచికానున్ను. రెండేళ్లకో మూడేళ్లకో అమాంతంగా బాల్చీ తన్నెస్తాడు. అనగా "కిక్స్‌ ది బకెట్‌." దాంతో నీ చెల్లెలు రిచ్చి విడో అవుతుంది. నువ్వు పెద్దవాడివైన తరవాత దానికి విడోమా`రియేజి చేశి శాశ్వతవైఁన కీర్తి అతిసులభంగా సంపాదించవచ్చును. యెవఁంటావ్‌?
వెంక అవును.
గిరీశం మరో గొప్పమాట యీ సంబంధం అయితె నీకూనాకూ సంబంధం కలుస్తుందోయి.
వెంక అదినాకిష్ఠవేఁ.
గిరీ రాత్రి నీ తండ్రి, నీకు హైకోర్టు వకాల్తీదాకా చదువు చెప్పిస్తానన్నాడు. ప్రస్తుతోపయోగం పుస్తకాలమాట కదిపా`నుగాని, పెళ్లినుంచి వచ్చింతరవాత యిస్తానన్నాడు. యీలోగా చుట్టముక్కల్లా`కపోతే గుడ్లెక్కొస్తాయి. సిగర్సుకోసం కాపర్సేవఁయినా సంపాదించావాలేదా?
వెంక లేదు. యీ వుదయవఁల్లా అమ్మ ధుమధుమలాడుతూనే వుంది. మానాన్న పొడుంకోసం కొట్లోనిలవచేశిన పొగాకులోది వోకట్ట వోణీలో దాచి తీసుకొచ్చాను.
గిరీ దటీజ్పోలిటిక్స్‌! మరియింతసేపూ చెప్పా`వుకావేం? చుట్టల్చుట్టుకుని యీకోవిల గోపురంలో కూచుని కాల్చుకుందాం రా!
వెంక కోవిల్లో చుట్టకాల్చవొచ్చునా?
గిరీ కాలిస్తే కోవిల్లోనే కాల్చాలోయి. దీనిపొగ ముందర సాంబ్రాణి, గుగ్గిలం యేమూల? యేదీ కట్ట యిలాతే (కట్ట అందుకొని వాసనచూసి) ఆహా! యేవిఁ పొగాకోయి! నిజంగా కంట్రీలైఫులో చాలా చమత్కారంవుంది. బెస్టుటోబాకో, బెస్టుగేదెపెరుగు, మాంచిఘీ. అంచేతనేనోయ్‌ పోయట్సు "కంట్రీలైఫ్‌ కంట్రీలైఫ్‌" అని దేవులాడుతారు.
వెంక మీరూ పోయట్సేగదా?
గిరీ అందుకభ్యంతరవేఁవిఁటి? నాకూ కంట్రీలైఫు యిష్ఠవేఁగాని సీవఁలోలాగ బ్యూటిఫుల్‌ షెపర్డెస్లూ, లవ్‌ మేకింగూ వుండదోయ్‌. గ్రాస్‌ గర్ల్సు తగుమాత్రంగా వుంటారుగాని, మా డర్టీస్మెల్‌! అదొహటిన్నీ మనదేశంలో మెయిడన్సు వుండరోయి. యంతసేపూ లవ్మేకింగ్‌ విడోజ్కి చెయ్యాలిగాని మరి సాధనాంతరంలేదు.
వెంక మీరు విడోమీద చేశిన పోయిట్రీ రాసియిస్తానని యిచ్చారుకారు గదా?
గిరీ

అడగ్గానే యిస్తే వస్తువవిలవ తగ్గిపోతుంది. అదొహటిన్నీ, మఱ్ఱెండేళ్లు పోతేనేగాని దాని రసం నీకు బాగా బోధపడదు. అయినా స్పెషల్‌కేసుగా నీకు ఉపదేశం చాస్తాను. నోటుబుక్కు తీసిరాయి.

(గిరీశం చుట్టకాలుస్తూ, మధ్య మధ్య చుట్టచేత పట్టి, ఒక్కొక్క ముక్క చెప్పగా వెంకటేశం వ్రాసును.)

        THE WIDOW.

She leaves her bed at A.M. four,
And sweeps the dust from off the floor,
And heaps it all behind the door,
                The Widow!

Of wond'rous size she makes the cake,
And takes much pains to boil and bake,
And eats it all without mistake,
                The Widow!

Through fasts and feasts she keeps her health,
And pie on pie, she stores by stealth,
Till all the town talk of her wealth,
                The Widow!

And now and then she takes a mate,
And lets the hair grow on her pate,
And cares a hang what people prate,
                The Widow!

I love the widow - however she be,
Married again - or single free,
Bathing and praying
Or frisking and playing,
A model of saintliness,
Or model of comeliness,
What were the earth,
But for her birth?
                The Widow!

యిది నేను రిఫార్మర్లో అచ్చువేసేటప్పటికి టెన్నిసన్‌చూసి గుండెకొట్టుకున్నాడు. చుట్టతాగడం సమాప్తంచేశి యింటికి పొదాంరా చాలాసేపైంది.

(నాలుగడుగులు యిద్దరూ నడిచేసరికి అగ్నిహోత్రావుఁధాన్లు కలియును.)
అగ్ని ఏవఁండీ - హనుమాన్లుగారూ - మీపేరేవిఁటండీ!
గిరీ గిరీశం అంటారండి.
అగ్ని అదుగో, గిరీశంగారూ రాత్రి మనవఁనుకున్న ప్రకారం మనదావాలు గెలుస్తాయనే మీ అభిప్రాయవాఁ?
గిరీ గెలవకపొతే నేను చెవి కదపాయించుకు వెళ్లిపోతాను. మీ వూహపోహలు సామాన్యవైఁనవా? అందులో "యతోధర్మ స్తతోజయః" అన్నట్టు న్యాయం మీ పక్షం వుంది. బుచ్చమ్మగారి కేసు విషయమై జబ్బల్పూర్‌ హైకోర్టు తీర్పొహటి మనకి మహా బలంగావుంది. మాపెత్తండ్రిగారు యిలాంటి కేసే ఒహటి యీ మధ్య గెలిచారండి.
అగ్ని దీని కల్లా అసాధ్యం యీకేసు కాకినాళ్లో తేవల సొచ్చింది. మా కరటక శాస్తుల్లుని పంపిస్తే యవడో చవలవకీల్ని కుదిర్చాడు. వాడెప్పుడూ డబ్బు తెమ్మని రాయడవేఁగాని కేసుభోగట్టా యేవీఁరాయడు. గడియ గడియకీ వెళదావఁంటె దూరాభారం గదా?
గిరీ మీశలవైతే స్టీమరుమీద నేను వెళ్లి ఆవ్యవహారవఁంతా చక్కబెట్టుకువస్తాను. మాపెత్తండ్రిగారు కాకినాడ కల్లా తెలివైన ప్లీడరు, ఆయనపట్టిన కేసు యన్నడూ పోయిందన్నమాట లేదండి.
అగ్ని మీరు వెళితే నేను వెళ్లినట్టే. యంత ఫీజయినా మీ పెత్తండ్రిగారికే వకాల్తీ యిద్దాం. యావఁంటారు?
గిరీ మీదగ్గిర ఫీజు పుచ్చుకోవడం కూడానాండి? ఖర్చులు మట్టుకు మీరు పెట్టుకుంటే, ఫీజక్ఖర్లేకుండానే పని చేయిస్తానండి.
అగ్ని మీరలా అంటార న్నేనెరుగుదును. గాని గెలిచింతరవాత మనకితోచిన బహుమతీ యిద్దాం.
గిరీ యిచ్చినాసరె యివ్వకపోయినా సరేనండి.
[బుచ్చమ్మ ప్రవేశించును.]
బుచ్చమ్మ నాన్నా! అమ్మ స్తానానికి లెమ్మంచూంది.
అగ్ని అలాగే. (బుచ్చమ్మ వెళ్లిపోతూండగా గిరీశం కేగంట చూసును.) భోజనంచేశిన తరవాత కాయితాలు మీచేతికిస్తాను; అవన్నీ సావకాశంగా చూడండి, మాయింటితూరు ప్పొరుగు రావాఁవుధాన్లుమీద మందడిగోడ విషయమై మనంతెచ్చినదావా, లంచంపుచ్చుకుని మునసబు అన్యాయంగా కొట్టేశాడు. జడ్జీకోర్టులో అప్పీలుచేశాం; మావకీలు అవతలపా`ర్టీదగ్గిర కతికి మనకేసు ధంసంచేశాడు. మీవంటివారు నాకు చెయ్యాసరావుంటే రావాఁవుధాన్లు పిలకూడదీసేదును: కానిండిగాని తూర్పుమందడిగోడ రావాఁవుధాన్లిదయితే, పడవఁటి మందడిగోడ మందవాల్నా లేదా? న్యాయంచెప్పండి. చూడండీ దానిమీద యలా కొంజాయెత్తా`డో! క్రిమినల్నడిపించమని భుక్తసలహాచెప్పా`డు.
[బుచ్చమ్మ ప్రవేశించును.]
బుచ్చ నాన్నా! అమ్మ స్తానం చెయ్యమంచూంది.
అగ్ని వెధవముండా సొద! పెద్దమనుష్యుల్తో వ్యవహారం మాట్లాడుతూంటే రామాయణంలో పిడకల వేట్లాటలాగ అదే పిలవడవాఁ!
గిరీ తప్పకుండా క్రిమినెల్కేసు తా`వలశిందే, క్రిమిన ల్ప్రొశిజ్యూర్‌ కోడు 171 శక్షన్‌ ప్ర`కారం తెద్దావాఁ? 172డో శక్షన్‌ ప్ర`కారం తెద్దావాఁ?
అగ్ని రెండు శక్షన్లూ తా`లేవేఁం?
గిరీ నేరంగలప్ర`వేశం, ఆక్రమణ - రెండు శక్షన్లూకూడా ఉపచరిస్తాయి సరేగదా కళ్లతో చూశాను గనుక యీగోడ మీదయినట్టు జల్లీల్తెగబొడిచి సాక్ష్యంకూడా పలగ్గలను, యీగోడ స్పష్టంగా మీదాన్లాగే కనపడుతూంది.
అగ్ని అందుకు సందేహవుఁందండీ, యేమరిచి యిన్నాళ్లు వూరుకున్నాను. పెరటిగోడ కూడా చూతురుగాన్రండి. అక్కాబత్తుడిముక్కు నులిపిగెల్చుకున్నాను. కాని యీదావాలకింద సిరిపురంభూవిఁ అమ్మెయ్య వలసి వొచ్చిందండి, రావాఁవధాన్లుకేసుకూడా గెలిస్తె, ఆవిచారం నాకు లేకపోవును.
(అందరు నిష్క్రమింతురు.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)