నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
కన్యాశుల్కము - తృతీయాంకము.
౧-వ స్థలము. రామచంద్రపురం అగ్రహారంలో రామప్పంతులు యింట్లో సావిట్లోగది.
[మధురవాణి ప్రవేశించును.]
మధు యీరామప్పంతులు కథ పైకి పటారం, లోపల లొటారంలా కనిపిస్తూంది. భూవుఁలన్నీ తాకట్టుపడి వున్నాయిట; మరి రుణంకూడా పుట్టదట. వాళ్లకీ వీళ్లకీ జుట్లుముడేసి జీవనం జేస్తూన్నాడు, యీవూరు వేగం సవిరించి చెయ్‌ చిక్కినంతసొమ్ము చిక్కించుకుని పెందరాళే మరోకొమ్మ పట్టుకోవాలి (పాడును) 'తెలియక మోసపోతినే, తెలియక' (పాడుతుండగా రామప్పంతులు ప్రవేశించును.)
రామ యేవిఁటో ఆ మోసపోవడం? తరవాత ముక్కేవిఁటి, పాడూ.
మధు తరవాత ముక్కకేవుఁంది. మిమ్మల్ని నమ్మి మోసపోయినాను.
రామ అదేం అలాఅంటున్నావు? నిన్ను మోసపుచ్చలేదే? నిర్నయప్ర`కారం రెండొందలూ పట్ణంలో యిచ్చాను. నెల జీతం నెలకు ముందే యిచ్చాను. యిహ మోసవేఁవుఁంది?
మధు యేంచిత్రంగా మాట్లాడతారు పంతులుగారూ, నాకు డబ్బే ప్ర`ధానవైఁనట్టు మీ మనసుకి పొడగడుతూంది కాబోలు, నాకు డబ్బు గడ్డిపరక. మీ భూవుఁలు రుణాక్రాంతవైఁనాయని అప్పట్లో నాకు తెలిశుంటే మీదగ్గిర రెండొందలూ పుచ్చుకొందునా? మీరు ఖర్చు వెచ్చాలు తగ్గించుకుని సంసారం బాగుచేసుకోకపోతే నేనుమాత్రం వొప్పేదాన్నికాను. ఫలానా పంతులుగారు ఫలానా సాన్నుంచుకుని బాగుపడ్డారంటేనే నాకు ప్ర`తిష్ఠ. మాయింటి సాంప్రదాయం ఇది పంతులుగారూ; అంతేగాని లోకంలో సాన్లమచ్చని వూహించకండి.
రామ భూవుఁలు తణఖా అన్నమాట శుద్ధ అబద్ధం యవరన్నారోగాని; నేను మహరాజులా వున్నాను.
మధు నాకంటికి మహరాజులా కనపడబట్టే యిల్లూ వాకలీ వొదిలి మానం ప్రా`ణం మీపాలుచేసి నమ్మి మీవెంట వొచ్చాను. నన్ను మోసం మాత్రం చెయ్యకండీ; మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది.
రామ నేను మోసంచేసే మనిషినేనా?
మధు అలాగయితే లుబ్దావుధాన్లు గారికి పెళ్లెందుకు కుదిర్చారు? నాకు తెలియదనుకున్నారా యేవిఁటి? ఆముసలాడికి పెళ్లెందుకు? మీకోసవేఁ యీ యెత్తంతాను.
రామ ఆహా! హా! హా! యిదా అనుమానం! కొంచం గెడ్డం నెరుస్తూంది, నన్ను కూడా ముసలాణ్ణంటావా యేవిఁటి?
మధు చట్లకి చావ నలుపు, మనిషికి చావ తెలుపూ. అనగా చీకట్లో నక్షత్రాల్లాగ, అక్కడక్కడ తెల్లవెంట్రుక తగిల్తేనే చమక్‌.
రామ స్వారస్యం మా చమత్కారంగా తీశావ్‌! యేదీ ముద్దు. (రామప్పంతులు మధురవాణిని ముద్దుబెట్టుకో బోవును.)
మధు (చేతులతో అడ్డి ముఖము ఓరజేసుకుని) వేళాపాళా లేదా? లుబ్దావుధాన్లు పెళ్లి తప్పించేస్తేగాని నేను ముద్దుబెట్టుకో నివ్వను.
రామ అంతా సిద్ధవైఁం తరవాత, నాశక్యమా ఆపడానికి? (బలాత్కారంగా ముద్దుబెట్టుకొనును.)
మధు సత్తువుందనా మోటతనం?
రామ నా సత్తువిప్పుడేం జూశావ్‌. చిన్నతనంలో ధ్వజస్తంభం దండతో కొడితే గణగణమని గంటలన్నీ ఒకగడియ వాగేవి. నాడు జబ్బుచేసిం దగ్గిర్నుంచీ డీలా అయిపోయినాను.
మధు యిదా డీలా? నాచెయి చూడండీ యలా కంది పోయిందో. అన్నా, మోటతనం!
రామ ౘాప చిరిగినా ౘదరంతని, నీ ప్రాణానికి యిప్పటి సత్తువే ఉడ్డోలంలా కనపడుతూంది.
మధు యీపెళ్లి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను.
రామ వెఱ్ఱికుదిరింది, రోకలి తలకి చుట్టమన్నాట్ట! రెండేళ్లాయి ఆముసలిగాడిద`కొడుకుమీద నా లౌక్య ప్ర`జ్ఞంతా వినియోగపర్చి పెళ్లిసిద్ధంచేసి యిప్పుడెలా తప్పించడం?
మధు యేం లౌక్యం చేశారు?
రామ అలా అడుగు. నాబుద్ధిసత్తువ కూడా నీకు తెలుస్తుంది. లుబ్దావుధాన్లు పరమలోభి. వాడిగుణం యిలావుండబోతుందని పోల్చారేమో అన్నట్టు చిన్నతనంలో వాడికి పేరుపెట్టా`రు. పెళ్లా`డితే వొల్లమాల్ని ధనం వొస్తుందని ఆశపెట్టించాను.
మధు యలాచేశారీ మహాచిత్రం? పెళ్లైతే ధనం ఖర్చౌతుందిగాని, రావడవెఁలాగ?
రామ లౌక్యవఁంటే మరేవిఁటనుకున్నావు? అసాధ్యాలు సాధ్యం, సాధ్యాలు అసాధ్యం చెయ్యడవేఁకదూ? మన సిద్ధాంతిని దువ్వేటప్పటికి వాడేంజేశాడనుకున్నావు? లుబ్దావుధాన్లు జాతకం యగా దిగా చూసి, సీఘ్రంలో వివాహయోగవుఁందన్నాడు, ఆవివాహంవల్ల ధనయోగవుఁందన్నాడు, దాంతో ముసలాడికి డబ్బొస్తుందన్న ఆశముందుకీ, డబ్బు ఖర్చౌతుందన్న భయంవెనక్కీ లాగడం ఆరంభించింది. యింతట్లో పండాగారిక్కడికొచ్చారు. ఆయన్ని కూడా తయారుచేశాను. లుబ్దావుధాన్లు అనుమానం తీర్చుకుందావఁని ఆయనకి జాతకం చూపించేసరికి పండాగారు యేమన్నారూ? "వివాహధనయోగాలు జవిఁలిగావున్నాయి, అయితే మీరు పెద్దవాళ్లు, యిప్పుడు మీకు పిల్ల నెవరిస్తారు, పెళ్లెలా అవుతుంది? యిలాంటి జరగడానికి వీల్లేని మహాయోగాలు జాతకాల్లో పట్టినప్పుడు, గొప్పమేలుకు బదులుగా గొప్పకీడు సంభవిస్తుంది. అనగా మీకు మార్కవోఁ ధననష్టవోఁ, సంభవిస్తుంది. గ్ర`హశాంతి చేసి బ్రాహ్మణ భోజనం బాహుళ్యంగా చెయ్యండి, కొంత జబ్బో గిబ్బోచేసి అంతటితో అరిష్టం పోతుంది. మంచి రోజు చూసి సూర్య నమస్కారాలు ఆరంభించండి" అని చెప్పేసరికి అవుధాన్లు గుండ` రెండుచక్కలై వివాహప్ర`యత్నం ఆరంభించాడు. యిదీ కథ.
మధు యేమికల్పన!
రామ యింకావుంది; యిహను కృష్ణారాయపురంలో అగ్నిహోత్రావుధాన్లు కూతురు జాతక వెఁలావుందట? చప్పడానికి అలవిలేదు. అదికాలుపెట్టిన యిల్లు పది యిళ్లౌతుందట. అదిపట్టిందల్లా బంగార వౌఁతుందట!
మధు నిజవేఁనా లేక అదీ మీ బనాయింపేనా?
రామ అదిమట్టుకు నా బనాయింపుకాదు, అగ్నిహోత్రావుధాన్లే జాతకం అలా బనాయించాడు, మా బ్రాహ్మల్లో యిది పరిపాటే, పెళ్లిళ్లలో పంపించేది ఒహ జాతకవూఁ నిజంవుండదు.
మధు యేమ్మోసం!
రామ లౌక్యం, లౌక్యవఁను.
మధు రెండింటికీ యేవిఁటో భేదం?
రామ నమ్మిం ౘోట చేస్తే మోసం, నమ్మం ౘోట చేస్తే లౌక్యవూఁను.
మధు తాను చేస్తే లౌక్యం, మరోడు చేస్తే మోసం అనరాదా? అబద్ధానికి అర్ధవేఁవిఁటి?
రామ యావఁన్నావూ? అబద్ధవఁ`నా? ఉద్యోగధర్మం లౌక్యవృత్తీ అని, అది వకవృత్తి భగవంతుడు కల్పించాడు. ఆ లౌక్యవృత్తి యెటువంటిదీ? నిౙాన్ని పోలిన అబద్ధవాఁడి ద్రవ్యాకర్షణచేసేది. యీ ధర్మసూక్ష్మాలు నీకెలా తెలుస్తాయి.
మధు నాకెలా తెలుస్తాయి నిౙవేఁగాని, ద్రవ్యాకర్షణ యలాగ యీపెళ్లివల్ల?
రామ (తనలో) క్రాసెగ్జామినేషను చేస్తూందోయి దీంతస్సా గొయ్యా (పైకి) నీకు మేజువాణి నిర్నయించుకున్నాను కానూ, నీకు పదిరూపాయలసొమ్ము దొరకడం ద్రవ్యాకర్షణ కాదా?
మధు యేంచిత్రవైఁన మనుష్యులు పంతులుగారూ! (తమలపాకుచుట్టతో కొట్టి) నేను రాబోతానని రెండేళ్ల కిందట కలగని, యీకాబోయే మేజువాణీ బుద్ధిలో వుంచుకుని యీపెళ్లి కావడానికి విశ్వప్ర`యత్నం చేశారూ? ద్రవ్యాకర్షణ యలాగో నాకు బోధపడ్డది. పెళ్లికూతుర్ని యిలాకా చేసుకుని, దాంద్వారా ముసలాడి మూటా ముళ్లా` లాగేస్తారు. యంత సత్యకాలప దాన్న`యినా ఆమాత్రం ఊహించుకోగల్ను. లేకపోతే నేయంత బతిమాలుకున్నా యీపెళ్లి తప్పించక పోవడవేఁవిఁ? మీబుద్ధికి అసాధ్యం వుందంటే నే నమ్ముతానా?
రామ ఆమాట్నిౙవేఁగాని, అన్నిపనులూ ద్రవ్యాకర్షణ కోసవేఁ చాస్తాననుకున్నావాయేవిఁటి, ఆముసలాణ్ణి కాపాడదావఁనే, యీ పెళ్లితలపెట్టా`ను.
మధు "చిత్రం చిత్రం మహాచిత్రం" అని కథుంది, అలావున్నాయి మీ చర్యలు!
రామ ఆ కథేదో చెబుదూ, నాక్కథలంటే మాసరదా.
మధు పొగటిపూట కథలేవిఁటి. ముందు యీ చిత్ర కథేవిఁటో శలవియ్యండి!
రామ అది చెప్పేదికాదు. చెప్పను.
మధు చప్పకపోతె వొప్పను.
రామ ఒప్పకేం జేస్తావు?
మధు యేం జేస్తానా? యీ జడతో కొడతాను, శాస్త్రంలో కాముకులకు చెప్పిన ఆయుధవిఁది.
రామ నేం దెబ్బలికి మనిషినికాను. శాస్త్రం గీస్త్రం వొక పక్కనుంచి మోట సరసం మాను. చెప్పమంటే చెబుతాను గాని అలాంటి కబుర్లు నువ్వు వినకూడదు. మరేంలేదు. లుబ్దావుధాన్లు వెధవకూతురు, మీనాక్షి ప్రవర్తన మంచిదికాదు. నాల్రోజుల కొహమారు అది పీకలమీదికి తెస్తూంటుంది. పోలీసువాళ్లు బెదిరించి పదిడబ్బులసొమ్ము లాగేస్తూంటారు. డబ్బు ఖర్చంటే ముసలాడికి, ప్రాణపోకట, సంసారం కూడా మీనాక్షి దూబర చేస్తుందంటాడు, పెళ్లయితె దాని ఆటకడుతుంది.
మధు మీనాక్షి ప్ర`వర్తన బాగుంది కాదంటూ మీరే చెప్పాలీ? మీరు కంట పడ్డ తరవాత యే ఆడదాని ప్ర`వర్తన తిన్నగావుంటుందీ?
రామ అదుగో చూశావా? అలా అంటావనే కదూ చప్పనన్నాను.
మధు యీచిక్కులు నాకేం తెలియవు. పెళ్లి మానిపించెయ్యండి.
రామ యీపెళ్లిలో నీమేజువాణీ పెట్టి పదిరాళ్లిప్పిస్తాను. మాటాడ కూరుకో.
మధు (ముక్కుమీద వేలుంచుకొని) లుబ్దావుధాన్లు యదట నేను మేజువాణీ ఆఁ!
రామ పేరు వాడుగాని, సభలో పెద్ద న్నేనేకదూ?
(హేడ్‌ కనిస్టేబ్‌ చుట్టకాలుస్తూ ప్రవేశించి కుర్చిమీద కూర్చొనును.)
హెడ్‌ రావఁప్పంతులూ! యినస్పెక్టరికే టోపి వేశావటే?
రామ (హెడ్‌ కనిస్టేబుచెవిలో) గారూ గారూ అనవయ్యా.
హెడ్‌ యెప్పుడూలేంది గారేవిఁటి, గీరేవిఁటి, చింతగారు?
రామ ఆడవాళ్లున్న ౘోటికి తోసుకు రావడవేఁనా, అన్నా!
హెడ్‌ ఆడవాళ్లంటున్నావు, నువ్వు కూడా అందులోనె జమాయేవిఁటి? అహ! హ!
రామ హాస్యానికి వేళాపాళా వుండాలి.
హెడ్‌ నేను హాస్యంకోసం రాలేదు; యినస్పెక్టరు పేరు చెప్పి రావిఁనాయడిదగ్గిర పాతిక రూపాయల్లాగా`వట, యిలా యందరిదగ్గిర లాగా`డో రావఁప్పంతుల్ని నిల్చున్న పాట్లాన్ని పిలకట్టుకు యీడ్చుకురా అని నాతో ఖచితంగా చెప్పి యినస్పెక్టరు పాలెం వెళ్లిపోయినాడు.
రామ చిన్నప్పుడు వొక్కబర్లో చదువుకున్నాం యినస్పెక్టరూ నేనూను. అంచాత అతని పిలక నేనూ నాపిలక అతనూ లాగినా ఫర్వాలేదు. రావిఁనాయడి మాట మాత్రం శుద్ధాబద్ధం. మీరు ముందు పదండి, గుఱ్ఱం కట్టించుకుని స్టేషను దగ్గిర కలుస్తాను.
హెడ్‌ నేనెలా వొస్తాను నీతోటి; నాకు వొల్ల మాల్న`పనుంది, ఒక కనిష్టీబుని నీతో పంపిస్తాను.
రామ (హెడ్‌ చెవులో) నాయింట్లో మాత్రం నకార ప్రయోగం చెయ్యకు, నీపుణ్య వుఁంటుంది.
హెడ్‌ అదా నీఘోష! అలా క్కానియి. (నిష్క్రమించును.)
రామ (తనలో) అదుగో మళ్లీ ఏకవచనవేఁ కూస్తాడు! (పైకి) యవడ్రా అక్కడ.
నౌఖరు (ప్రవేశించి) సిత్తం బాబు.
రామ గుఱ్ఱం కట్టమను.
నౌఖరు సిత్తం బాబు. (నిష్క్రమించును.)
రామ చూశావూ మధురవాణీ నేన్నిలబడ్డచోట రూపాయలు గలగల్రాల్తాయి, యీ యినస్పెక్టరుగాడికి యీ తాలూకాకి వొచ్చింతరవాత అయిదారువేలు యిప్పించాను. వీధి తలుపు వేసుకుని, సంగీతసాధకం చేసుకో, విద్యవంటి వస్తువు లేదు. (గుమ్మందాటి నాలుగడుగులువెళ్లి తిరిగివచ్చి) అప్పుడే వీణతీశావు? యీవూళ్లో మాదుర్మార్గులున్నారు; నా స్నేహితులవఁనీ, బంధువులవఁనీ పేరుపెట్టుకొస్తారు, రానీకుమా (తలుపుపైనించివేసి) గడియవేసుకో.
(నిష్క్రమించును.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)