నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౨-వ స్థలము. రామప్పంతులుయింట్లో పడకగది.
[మధురవాణి తివాసీమీదకూచుని వీణవాయించుచుండును. వాయిద్యం ముగించి.]
మధు

విద్యవంటి వస్తువలేదు, నిజమే - ఒక్కటితప్ప - అదేవిఁటి? విత్తం. డబ్బు తా`నివిద్య దారిద్ర్యహేతువ. యీ వూళ్లో నారదుడు వొచ్చి పాడితే నాలుగు దమ్మిడీలివ్వరు. గనక యీవీణ యిటుపెడదాం. హెడ్డు కనిష్టేబు సౌజ్ఞచేసి వెళ్లా`డు. అతడు యిచ్చేదీ చచ్చేదీ లేదుగాని, జట్టీలేవైఁనావొస్తే ఓ వొడ్డు కాస్తాడు.

(వీధితలుపు తట్టబడును.)

వొచ్చాడు కాబోలు. (తలుపు దగ్గిరకివచ్చి) యవరు మీరు? బంధువులా?

(తలుపవతల కరటకశాస్తుల్లు, కన్యవా`షంతో శిష్యుడున్నూ.)
కరట ఆపద కడ్డం బడ్డవారే బంధువులు. మేమ్మీకు బంధువులం కావుఁగాని, మీరు మాకు బంధువులు కాగల్రు.
మధు నా`స్తులా?
కరట (తనలో) యీకంఠం విన్నట్టుంది. (పైకి) నా`స్తం కట్టడానికే వొచ్చాం.
మధు దేంతో కడతారు?
కరట (తనలో) యీవేశ్య మధురవాణి కాదుగద? కంఠాన్ని పోలిన కంఠం వుండ కూడదా? (పైకి) నా`స్తం కట్టడానికల్లా వున్నది వక్కటేగదా టంకం?
మధు యేవిఁటో ఆ టంకం?
కరట బంగారం!
మధు మాపంతులుగారికి మీరు నా`స్తులూ, బంధువులూ కూడా కాకపోతే తలుపు తియ్యొచ్చును. (తలుపు తియ్యును.)
కరట (తనలో) అరే! మధురవాణే!
మధు (ముక్కుమీద వేలుంచుకొని) చిత్రం!
కరట యేమిటి చిత్రం?
మధు యీవేషం!
కరట ఉదరనిమిత్తం బహుకృతవేషం; యిది దేవుఁడిచ్చిన వేషవేఁను.
మధు నాదగ్గిరేనా మర్మం? యీ పిల్లెవరో?
కరట నాకొమార్త`.
మధు నాటకవఁల్లా చెడి పొగటివేషాల్లో దిగిందా`? పెట్టి పుట్టా`రుగదా యేల యీ అవస్థ?
కరట నీదయవల్ల దేవుడిచ్చినస్థితికేం లోపంరాలేదు. నిన్నుచూదావఁని వొచ్చాను.
మధు యిన్నాళ్లకైనా యీ దీనురాలు మీకు జ్ఞాపకం రావడం అదెంతగాదు?
కరట నీలాంటి మనిషి మళ్లీవుందా? నిన్ను చూడ్డం బ్రహ్మానందం కాదా? నీదగ్గిరకి రావడం, చేదనా` యిన్నాళ్లూ రాలేదనుకున్నావు? డిప్టీ కలక్టరుగారి కుమార్రత్నంగారు నిన్ను చేపట్టా`రని తండ్రికి తెలిసింతరవాత, నేనుగానీ నీ యింటికి వొస్తే పీక ఉత్తరించేస్తాడేమో అనేభయంచాత కొంచం యడబెట్టి యితడికి యెప్పుడు బదిలీ అవుతుంది, మా మధురవాణ్ణి యెప్పుడు చూస్తాను అని దేవుఁణ్ణి సదాప్రార్థిస్తూ వుంటిని. నువ్విక్కడెన్నాళ్లాయి వున్నావు?
మధు డిప్టీకలక్టరుగారి కుమార్రత్నంగార్ని, తండ్రి, చదువుపేరు పెట్టి చన్నపట్ణం తగిలిన రెండునెల్లదాకా ఆయననా`స్తుడు గిరీశంగారి ద్వారా డబ్బు పంపించా`డు. ఆతరవాత మొన్నటిదాకా గిరీశంగారు నన్ను వుంచారుగాని, డబ్బుకి యటాముటీగా వుండేది. నాయింటికి వొచ్చిన వాడల్లా తనకొడుక్కి దోస్తీ అయివుంటాడని డిప్టీ కలక్టరు అనుమానిస్తాడేమో అని పేరుగలవాడెవడూ నాయింటికి రావడం మానేశాడు. సంజీవరావుగారి అల్లరి కొంచం మరుపొచ్చిందాకా పైనుందావఁని యీ వూరొచ్చాను.
కరట (ముక్కుమీద వేలుంచుకొని) గిరీశం నిన్నుంచుకున్నాడా? మా మేనల్లుడికి చదువుచెప్పడాని క్కుదురుకుని మావాళ్లింట్లో చేరా`డు. వాడికి పెందరాళే ఉద్వాసన చప్పాలి.
మధు (ముక్కుమీద వేలుంచుకొని) నాదగ్గిరకు వచ్చినవాడల్లా చెడిపోయినాడో? నాదగ్గిరకు మీరు రాకుండా అవరోధం కలిగిందని యిప్పుడే డిప్టీ కలక్టరుగార్ని తిట్టా`రే. ఆయనకంటె మీన్యాయం యేంబాగావుంది? నాదగ్గిరకు వచ్చినందుకు, మీ భార్యాగారు ముందు మిమ్మల్ని మెడబట్టుకొని యింట్లోంచి తరవ్వఁలిసింది. తనకి రొట్టా`, ఒహడికి ముక్కానా?
కరట క్రియలలో అంతవరకూ జరక్కపోయినా మాటల్లో ఆమర్యాద అమేషా నాకు జరుగుతూనే వున్నది.
మధు (చిరునవ్వుతో) యీ యిల్లాలు మాపంతులు కంటబడితే యీవిడ` గుట్టు బట్టబయలౌతుంది.
కరట యిల్లాలనేస్తున్నావేఁం అప్పుడేను? కన్నెపిల్ల; దీన్ని పెండ్లిచేయడానికే, నీదగ్గిరికి తీసుకొచ్చాను.
మధు మాపంతులుకేనా పెళ్లి?
కరట "ఏకానారీ సుందరీవా దరీవా," అన్నాడు. త్రిలోకసుందరివి నువ్వు దొరికింతరవాత నీ పంతులుగారికి యింకా పెళ్లెందుకు?
మధు ఐతే మరెవరికి పెళ్లిచెయ్డం? నాకా యేవిఁటి? అలాగైతే, సైయేఁ! మొగ వేషంవేసుకొని, పెళ్లిపీటలమీద కూర్చుంటాను. యిలాంటి పెళ్లాం దొరకడవెఁలాగ? జగత్ప్రసిద్ధులైన కరటకశాస్తుల్లుగారి అల్లుణ్ణి కావడంయెలాగ? దివ్య సుందర విగ్రహవఁని పొగడగానే నాబుజాలు పొంగుతాయనుకున్నారు కాబోలు? యీపిల్లదగ్గిర నాబోట్లు దివిఁటీముందర దీపాలు. ఆడది మెచ్చిందే అందం! మొగాడి కన్ను మసక. మీకేంతెలుసును? మరి నాపెళ్లాన్ని నాకిచ్చేసి మీతోవని మీరువెళ్లండి. (శిష్యుడి చెయిపట్టి లాగును.)
శిష్యుడు చూశావురా నాన్నా యలా పట్టుకుందో?
మధు (ఆచుకోలేకుండా నవ్వుతూ) శాబాషు! యిదేనా పెద్దమనిషి తరహా! యిరుగు పొరుగమ్మ లేవఁంటారో మొగుడు పిలిస్తె వెళ్లకుంటేను?
శిష్యుడు కొడుతుంది కాబోల్రా నాన్నా, యింటి కెళ్లిపోదాం, రా!
మధు యేంనంగనాచివే? తరవాత పెళ్లిచేసుకుంటాను. అందాకా ముద్దియ్యి (ముద్దెట్టుకొనును.)
కరట నేరని పిల్లని చడగొడుతున్నావు.
మధు నాలాంటి వాళ్లకి నూరుమందికి నేర్పి చెడగొట్టగలడు. యవరిశిష్యుడు? యీకన్న`పిల్ల నోరు కొంచం చుట్టవాసన కొడుతూంది!
కరట అంచాతే కాబోలు డబ్బీలో చుట్టలు తరుచు మాయ వౌఁతూంటాయి. మధురవాణి! దేవుఁణ్ణాకు నిన్ను చూపించాడు, పంతుల్లేని సమయం కనిపెట్టి వొచ్చాను; మళ్లీ అతడొచ్చేలోగా నామాటలు నాలుగూవిని మాకువొచ్చిన చిక్కు తప్పించు.
మధు మీకొచ్చిన చిక్కేవిఁటి? నేం చెయ్గలిగిన సహాయ వేఁవిఁటి?
కరట చిక్కన్నా చిక్కుకాదు. విను, యీవూళ్లో గిరీశం పెత్తల్లికొడుకు లుబ్ధావుధాన్లని ఓ ముసలా`డున్నాడు; వాడికి మా మేనగోడల్నివ్వడానికి మా బావనిశ్చయించాడు. యీ సంబంధం చేస్తే నా చెల్లెలు నూతులో పడతానని వొట్టేసుకుంది. యేం వుపాయం చా`స్తావో, దాని ప్రాణం కాపాడాలి.
మధు యీపిల్లని అంతకి తక్కువ సొమ్ముకి అమ్మితే, లుబ్ధావధాన్లు చంకలుగుద్దుకుని చేసుకుంటాడు. అతనిదాకా యెందుకు నేనే కొనుక్కుంటాను.
కరట చూపితే అందుకు పోయేదానికి నీకు మిక్కిలి చెప్పాలా` యేవిఁటి?
మధు యిదివరకి నిర్ణయవైఁన సమ్మంధం యేమ్మిషపెట్టి తప్పించడం?
కరట నీ బుద్ధికసాధ్యం వుందా? డబ్బు కసాధ్యం వుఁందా?
మధు బుద్ధికి అంతా అసాధ్యవేఁగాని, డబ్బుకి యక్కడా అసాధ్యంలేదు. యీపెళ్లిలో మాపంతులుకో పదిరాళ్లు దొరుకుతా యనుకుంటున్నాడే?
కరట నాసంబంధం చేసుకుంటే నేను యిరవై రాపాషాణాలు యిస్తాను.
మధు సరే. గాని నాటకంలో యంతహాస్యవైఁనా చెల్లుతుంది. నటనలోకి హాస్యం తెస్తే యేవిఁమూడుతుందో ఆలోచించారా?
కరట మధ్య నీకొచ్చిన ఫర్వాయేవిఁటి? నాకొచ్చిన ఫర్వాయేవిఁటి? యీ కత్తెర మీసం, కత్తెర గెడ్డం కడిగేసుకుని నాతోవని నే వెళతాను. యీ కోక నీదగ్గిర పారేసి మాశిష్యుడు వెళతాడు. ఆతరవాత యిదేవిఁటమ్మా యీ చిత్రవఁని నువ్వూ నలుగురమ్మలక్కలతోపాటు ఆశ్చర్యపడుదువుగాని. మీపంతులుతో సిఫార్సుచేసి యీమంత్రం యలా సాగిస్తావో గట్టి ఆలోచనచెయ్యి.
మధు మాపంతులు వక్కడివల్లా యీపని కానేరదు.
కరట మరియింకా యవరికాళ్లు పట్టుకోవాలో చెప్పు.
మధు మాపంతులుతో మాట్లాడ్డం ఐనతరవాత అవుధాన్లు కూతురు మానా`స్తం మీనాక్షిని తండ్రికి తెలియకుండా చూసి, ఓ రెండుపెద్దకాసులు యిస్తానని చెప్పండి. ఆపైని సిద్ధాంతిని చూసి అతనికీ ఆలాగే ఆశపెట్టండి. యీ పనికి సిద్ధాంతే కీలకం. నేను తెరవెనకనుంచి సమయోచితంగా హంగుచాస్తాను.
కరట నీమాట వెరేనే చెప్పాలా? నిన్ను సంతోషపెట్టడం నాకు విధి.
మధు ఆమాట మీరు శలవివ్వడం నాకు విచారంగావుంది. వృత్తిచేత వేస్యనిగనక చెయ్యవలసినచోట్ల ద్రవ్యాకర్షణచేస్తానుగాని, మధురవాణికి దయా దాక్షిణ్యాలు సున్నఅని తలచారా? మీతోడబుట్టుకి ప్రమాదం వొచ్చినప్పుడు నేను డబ్బుకి ఆశిస్తానా? యటుంచి యెటొచ్చినా కాపాడతాడు, హెడ్డు కనిష్టేబుకు మాత్రం కొంత నిజంచెపుదాం. అతగాడు యిప్పుడే వస్తాడు, మాట్లాడతాను, మీరు యిక్కడ కూచోండి.
కరట స్వాధీనుడేనా? కొంపముంచడుగద?
మధు గులాం. (నిష్క్రమించును.)
కరట కూచుందాం రా.
శిష్యుడు నా పేరేవిఁటండోయి?
కరట కొంపముంచుతావు కాబోలు! సుబ్బి! సుబ్బి! మధురవాణ్ణి చూడగానే మతి పోయిందా యెవిఁటి?
శిష్యుడు దానినవ్వు పట్టుబడాల`ని నిదానిస్తున్నాను.
కరట సబ్బు అన్నమాట జ్ఞాపకం వుంచుకుంటే సుబ్బి అనే పేరు జ్ఞాపకంవుంటుంది.
(రామప్పంతులు గుఱ్ఱం దూరాన్న దిగి నడిచివచ్చి)
రామ (కరటకశాస్త్రితో మెల్లిగా) లోపలికెవరైనా వెళ్లారా?
కరట (గట్టిగా) యెవరో యిద్దరు ముగ్గు రొచ్చారుగాని మీయిల్లాలుగారొచ్చి పైకి పొమ్మని గెంటేశారు.
రామ మీరెవరు? యెందుకొచ్చారు?
కరట మాది కృష్ణాతీరం. నాపేరు గుంటూరు శాస్తుల్లంటారు. తమదగ్గిర రాచకార్యవుఁండి వొచ్చానండి.
వీధిలోనుంచిజవాను "యినస్పెకటరుగారు నే వొచ్చిందాకా మఱ్ఱిచెట్టుకింద గుఱ్ఱాన్ని నిలబెట్టుంచుతావఁన్నారు. రూపాయలు వేగం యివ్వండి."
[మధురవాణి ప్రవేశించును.]
రామ యవరు వొచ్చారట?
మధు యవరొస్తారు? మీనా`స్తులట! తగిలా`ను.
జవాను రూపాయలండోయి.
రామ (మధురవాణితో) యేదీ మొన్న నీకిచ్చిన రూపాయలు? సాయింత్రం మళ్లీ ఫిరాయిస్తాను. యీసైతాను ప్రా`ణం తింటున్నాడు.
మధు మీరిచ్చిన రూపాయలు పట్ణంతోలేశాను. నేను డబ్బిక్కడ దాచుకుంటే మాతల్ల`క్కడ కాలక్షేపం చెయ్యడవెఁలాగ?
రామ వొట్ట`బద్ధాలు!
మధు (తాళముల గుత్తి మొలలోనుంచి తీసి రామప్పంతులుమీద విసిరి) చూసుకోండి.
రామ (బుజం తడువుఁకుంటూ) దురహంకారం కూడదు! విసిరికొడితే దెబ్బతగల్దనుకున్నావా యేవిఁటి?
మధు దుష్టుమాటలనగా తగిల్తే తప్పా?
జవాను యేవఁయ్యోయి. పోయి, రూపాయి లిచ్చావుకావని యినస్పెక్టరుగారితో చెబుదునా?
మధు (మెడలో నానుతీసి) యిది తాకట్టువుంచి కావలసినసొమ్ము తెచ్చుకొండి.
రామ (తనలో) ఆహా! యేమి యోగ్యమైనమనిషి! లేనిపోని అనుమానాలు పడకూడదు!
కరట పంతులుగారూ యెన్నిరూపాయలు కావాలండి?
రామ పాతిక.
కరట నే దాఖల్చేస్తాను (జవానుకు యిచ్చును.)
రామ ధనజాతకానికి డబ్బలా వొస్తూవుంటుంది. యేవిఁటి మీరాచకార్యం?
కరట యిది నాపిల్లండి. దీనికి వివాహం చేయించి ఆసుకృతం తమరు కట్టుకోవాలి.
రామ వివాహం చేయించడానికి నేను వైదీకిని కాను, నాకు మంత్రాలురావే? (చుట్ట, జేబులోంచి తీసి కొనకొరికి) యేవఁంటావు మధురవాణీ? అగ్గిపుల్ల.
మధు (అగ్గిపుల్ల అందిస్తూ పంతులునుంచి శిష్యుడి వేపూ, శిష్యుడినుంచి పంతులు వేపూ కోపముతో చూసును.)
కరట మంత్రవఁన్నప్పుడు వైదీకపవాడిదేం మంత్రవఁండి? యీ రోజుల్లో వైదీకమ్మంత్రాల మహిమ పోయిందండి. మంత్రవఁంటే నియ్యోగప్రభువుదే మంత్రం! తమవంటి ప్రయోజకులకు మంత్రం మాటాడుతుందండి.
రామ మధురం! యేవఁంటావు? యీపిల్ల న్నే పెళ్లిచేసుకుందునా?
మధు (రామప్పంతులు వేపూ, శిష్యుడివేపూ చురచుర చూసి నిష్క్రమించును.)
రామ సొగసుకత్తెలకి అలకకూడా అదో సృంగారం సుమండీ, శాస్తుల్లుగారూ!
కరట వైదీకపాళ్లం మాకా శృంగారాలు యలా అనుభవవౌఁతాయండి? మాయిల్లాళ్లక్కోపంవొస్తె చీపురుగట్టలు యెగురుతాయండి. సరసవఁన్నది పుస్తకాల్లో చదవడవేఁగాని మాకు అనుభవవేద్యం కాదండి. శ్రీకృష్ణమూర్తివారు రాధికతో శలవిస్తున్నారు, ఓరాధికా నీకోపం తీర్చుకోవాలన్నష్షాయనా "ఘటయ భుజబంధనం రచయ రదఖండనం, యేన వా భవతి సుఖజాలం" అనగా యేవఁంచున్నాడంటే కవీశ్వరుడు, చేతుల్తోటి ఉక్కిరి బిక్కిరి అయ్యేటట్టుగా కౌగలించుకో, మరిన్నీ పెదివఁలు రక్తాలొచ్చేట్టు కొరికెయ్యి, అంఛున్నాడు.
రామ (మధురవాణి వెళ్లిన గుమ్మమువేపు చూసి) ఉప్పులేకనే ముప్పందుం. మధురవాణికి మాత్రం యీవెఱ్ఱి మొఱ్ఱి కవిత్వాలు చెప్పకండి. నాలాంటి మృదువర్లు మోటసరసం సహించరు.
కరట ఆమె మీభార్యా కారండీ? సంసారికన్నా మర్యాదగావుంది యీవేశ్య! మీది యేవఁదృష్టం.
రామ యెంపిక. యెంపికలోవుందండి. మీరాచకార్యం చెప్పారుకారు.
కరట లుబ్దావుధాన్లుగారికీ తమకీ చాలాస్నేహవఁని విన్నాను. ఆయన తమమాట అడుగుదాటరట?
రామ ఆ గాడిదకొడుక్కి ఒకరితో స్నేహం యేమిటండీ? వాడి ప్రా`ణానికీ డబ్బుకీలంక`. డబ్బుకీ వాడికే స్నేహంగాని మరి యవరితోనూ స్నేహంలేదు. అయితే వాడికి వ్యవహారజ్ఞానం లా`కపోవడంచాతా, కోర్ట్లంటే భయంచాతా, నాసలహాలా`క బతకలేడు. వాడే అన్నమాటేవిఁటి, యీ తాలూకాలో సివిలు మేజస్ట్రేట్లు యెక్కఁడొచ్చినా రామప్పంతులు పప్పులేనిపులగం వుండదు.
కరట ఆ మాటవినే తాము నియ్యోగ ప్రభువులు, మంత్రబలంచాత చక్రం అడ్డేస్తారని తమర్ని వెతుక్కొచ్చాను. మాపింతల్లికొడుకు బియ్యె బియ్యల్‌ పా`సయినాడండి. డిప్టీకలక్టరీ చేస్తున్నాడు. బంధువులకి అతనివల్ల గడ్డిపరకంత సాయం లేదుగదా? మీది మిక్కిలి కూరానారా యవళ్లయినా గృహస్థులు గృహస్థు మర్యాదకి పంపించి, తల్లయినా పెళ్లాంఅయినా అవిపుచ్చుకుంటే, తిరగ గొట్టిందాకా అభోజనం కూచుంటాడు! పెట్టడానికీ పుచ్చుకోవడానికీ నియ్యోగ ప్రభువులు, తమకి చెల్లిందిగాని, మావాళ్ల ఉద్యోగాలు మంటిగడ్డ ఉద్యోగాలండి. "ఇయ్యా ఇప్పించంగల అయ్యలకేగాని మీసమన్యులకేలా రొయ్యకి లేవా బారెడు" అని కవీశ్వరుడన్నాడు.
రామ యీ యింగిలీషు చదువులు లావైన కొద్దీ వైదీకులే అన్నమాటేవిఁటి అడ్డవైఁన జాతులవాళ్లకీ ఉద్యోగాలవుతున్నాయి గాని యంత చదువుకున్నా మీ వైదీకప్పంతుళ్లవారికి మా చాకచక్యాలబ్బుతాయండీ? మా లౌక్యం మాతో స్వతహాగా పుట్టినది. మీరు తెచ్చిపెట్టుకున్నది. యెరువు సరుకు యెరువు సరుకే. విన్నారా? మీవాళ్లు లంచాలు పుచ్చుకోవడం చాతకాక, పతివ్రతలమని వా`షం వేస్తారు.
కరట అదే పతకవైఁతే అది అమ్ముకు బతకనాఁ అన్నట్టు మా వాళ్లకే చాతయితే నాకు యీ అవస్థేవండి? మావాడు పదిమంది పార్టీలతో చెబితే పదిరాళ్ల సొమ్ము దొరుకును. యీ చిక్కులు లా`కపోవును.
రామ యెవిఁటా చిక్కులు?
కరట రుణబాధ చాలా లావుగా వుందండి. రేపటి పున్నంలోగా ఒక దస్తావేజు తాలూకు రూపాయలు చెల్లకపోతే దావాపడిపోతుందండి. యీ పిల్లని నల్లబిల్లిలో వెంకటదీక్షతులుగారికి పదహారు వందలకి అమ్మ నిశ్చయించుకొని తీరా వొచ్చేసరికి యిప్పట్లో రూపాయలివ్వలేం, పెళ్లయిన నెల రోజుల్లో యిస్తావఁన్నారండి. అందుచేత అది వొదులుకొని లుబ్ధావుధాన్లుగారు వివాహ ప్రయత్నంలో వున్నారనివిని తమ దర్శనానికి వొచ్చానండి. యిదిగాని తాము సమకూరుస్తే పదివరహాల సొమ్ము దాఖలు చేసుకుంటాను.
రామ నేను నలభై యాభై రూపాయల వ్యవహారాల్లో జొరబడేవాణ్ణికాను.
కరట తాముచేసే సదుపాయాన్ని బట్టి యెంతయినా దాఖలుచేసేవాణ్ణేనండి. నారుణాలు పదహారు వందలుంటాయండి. ఆ పైని యెవొచ్చినా తాము దాఖలు చేసుకొండి.
రామ "ఐతే, గియ్తే" బేరాలు మాకవసరం లేదు. అగ్నిహోత్రావుధాన్లకి పద్ధెనిమిది వొందలిస్తున్నాడుగదా, అందుకు సగానికి సగం తగ్గితేనేగాని అవుధాన్లు ఆ సంబంధం మాని మీ సంబంధం చేసుకోడు. అందులో మీ రుణాలు తీరేదేవిఁటి, నాకిచ్చేదేవిఁటి? యేవైఁతేనేవిఁ? ఆ వ్యవహారం యలాగా మించి పోయింది. పదిరోజులకిందటొస్తే ఫొక్తుపరుస్తును. ఆ సంబంధం భోగట్టా మొదట నేనే తెచ్చాను. నా చేతులొంచి ఆ వ్యవహారం పోలిశెట్టిలాగేశాడు. కృత్యాద్యవస్థమీద మధురవాణి మేజువాణీకి వాణ్ణొప్పించే సరికి నా తాతలు దిగొచ్చారు. మరివక ఉపాయం చెబుతాను వినండి. మీకు మయినరు కొమాళ్లున్నారా?
కరట చిన్నవాడికి మయినారిటీ దాటి మూడేళ్లయిందండి.
రామ అయితే యిహలేందేవిఁటి? ఆ కుఱ్ఱవాడు మయినరని వాదిద్దాం.
కరట సాక్ష్యం యలావొస్తుందండి?
రామ ఓ హో హో! మీకు యేమీ తెలియదే! యిలాంటి వ్యవహారాలు నా తలమీద యెన్ని వెంట్రుకలున్నాయో అన్ని మోసేశాం, విన్నారా? ఉర్లాం బసవరాజుగారి సంభావన్లరేటే సాక్ష్యాలక్కూడా గేజటార్డర్‌ చేశాం. కుండనాలు వేసుకున్నవారికి ఓ రూపాయి జాఫా.
కరట జాతకంవుందిగదా యేంసాధనం?
రామ కాకితవైఁతే అగ్గిపుల్లతో ఫైసల్‌! తాటాకైతే నీళ్లపొయ్యి! కొత్తజాతకం బనాయించడం అయిదు నిమిషాలు పని. మా సిద్ధాంతిమట్టుకు నాలుక్కాలాలు చల్లగావుండాలి. నా దగ్గిర పాతతాటాకులు అలేఖాలు అటకనిండా వున్నాయి. ముప్ఫైయేళ్లనాటి కాకితాలున్నాయి. రకరకాలు సిరాలున్నాయి. ఒక నూఱ్ఱూపాయలు నాకు ఫీజుకింద యిచ్చి ఖర్చులు పెట్టుకొండి. గ్రంధం నడిపిస్తాను.
కరట దారి ఖర్చుకోసం తెచ్చిన రూపాయలు మీకు దాఖలుచెశాను. మరి బుర్ర గొరిగించుకుందావఁంటె దమ్మిడీలేదు. కోర్ట్లంట తిరగడానికయినా చేతిలో ఓడబ్బు సొమ్ముండాలిగదా? యిదొహర్తే టొంపలా నాతోవుంటే యలాగండి కోర్టంట తిరగడం? తమ లౌక్యానికి అసాధ్యవఁన్నది వుంటుందంటే నే నమ్మజాలను. యలాగయినా కుదిర్న సంబంధం తప్పించి, మా సంబంధం కుదిర్చి నాకు యిచ్చే సొమ్ములో పదోవంతు తాము అంగీకరించి మిగిలింది నాకు దయ చెయ్యండి. దీన్ని మొగుడింట అప్ప జెప్పి ఆ పైన యీ గ్రంధం యేదో కొసచూసిందాకా తమర్ని అంటగాగి వుంటాను.
రామ పదోవొంతు పనికిరాదు. మాబేరం యెప్పుడూ సగానికి సగం.
కరట సంగోరు మీకిస్తే మరి నేను రుణాలేం తీర్చుకోను?
రామ రుణాల్తీర్చుకో అఖర్లేకుండా గ్రంధం జరిగిస్తాంకదూ? అప్పుడే మీ చేతులో రూపాయలు పడడానికి శిద్ధంగా వున్నట్లు మాట్లాడుతారేవిఁటి? నేను యంత శ్రమబడ్డ పైనిపతకం తిరగాలి? అది ఆలోచించారా?
కరట తాము అలాఅంటే నేనేం మనివిచెయ్నండి? రక్తం మాంసం అమ్ముకుంటూన్నప్పుడు ఆ కానికూడయినా సంతుష్టిగా దొరకడం న్యాయంగదండి? వ్యవహారాల తొట్రుబాటు చాతనూ పిల్లకట్టు దప్పివుండడం చాతనూ, తొందరబడుతున్నాను గానండి, కొంచం వ్యవధివుంటే రెండువేలకి పైగా అమ్ముకుందునండి.
రామ "అయితే గియితేలు" అనుకున్న లాభం లేదని చెప్పా`నుకానా? ఐదో వొంతుకు యేవఁంటారు?
కరట యీపాపపు సొమ్ముకే తమరు ఆశించాలా అండి?
రామ పాపపు సొమ్ము మాదగ్గిరకిరాగానే పవిత్రవైఁపోతుంది. ఒహళ్ల కివ్వడం కోసవేఁగాని నాక్కావాలా యేవిఁటి?
కరట ఐతే కానియ్యండి.
రామ యిక నా ప్రయోజకత్వం చూడండి. మధురం! మధురం! కాకితం, కలం, సిరాబుడ్డి తీసుకురా. మామోలు సిరాబుడ్డి కాక గూట్లోది పెద్దసిరాబుడ్డి తే.
మధు (అవతలనుంచి) నాకంటెమధురం కంటబడ్డ తరవాత నేనెందుకు?
రామ ఆడవాళ్లకి అనుమానం లావండి. వింటున్నారా? అదో ముచ్చట!
కరట కేవలం వజ్రాన్ని సంపాదించారు!
రామ వజ్రవేఁ గానండి, పట్టవాసపు అలవాటుచాత పదిమందితో మాట్లాడితేగాని దానికి వూసుబోదు.
కరట ఆమాత్రం స్వేచ్ఛయివ్వడవేఁ మంచిదండి; ఆడదాన్నట్టే రొకాయించకూడదండి!
రామ రొకాయిస్తే యెంజెస్తుం దేవిఁటండి?
కరట యిలాంటి మానంగల మనిషైతే నూతులో గోతులో పడుతుందండి.
రామ ఆలాగనా అండి!
కరట అందుకు సందేహమేమిటండి! నాజూకైన మనస్సుగల స్త్రీని మల్లెపువ్వులాగ వాడుకోవాలండి.
రామ ఆ నాజూకులూ గీజూకులూ మీకేం తెలుసునండి?
కరట పుస్తకాల్లో చదువుకున్న ముక్కలు. నాయకుడు నిరాకరిస్తే నాయిక వొచ్చిన్నీ యేవో, ఉద్యానాల్లో వుండుకున్నషువంటి లతలతో వురిపోసుకుంచుందండి. మహా కవులనాటకాల్లో అష్లాగే జరిగినట్లు రాశారండి.
రామ మరెవళ్లతో మాట్లాడినా తప్పులేదుగాని, హెడ్డుకనిష్టీబుతో మాత్రం మాట్లాడవద్దని బుద్ధిచప్పండి. మీరు తండ్రిలాంటి వారుగదా!
కరట ప్చు! అంత అదృష్టవాఁ అండి! అట్లాంటి పిల్లే నాకువుంటే, మూడునాలుగు వేల కమ్ముకుని రుణాలూ పణాలూ లేకుండా కాలక్షేపం చేసివుందును. దీన్నయినా నాలుగు దిక్కులా అమ్మ జూపితే రెండు మూడువేలు యిదివరకే చేతులో పడివుండునండి. మేనరికంచెయ్యాలని దీంతల్లి భీష్మించుక్కూచోబట్టి యీదురవస్థ మాకొచ్చింది. అంచాతనే యింట్లో చప్పకుండా యీపిల్లని వెంటతీసుకొచ్చి యీదేశంలో పెళ్లికి చూపుతున్నాను.
రామ నాసహాయ లోపం వుండబోదు.
కరట ఐతే కార్యవఁయిందే!
రామ యెదీ పిల్లా యిలారా, చెయి చూపించూ.
(శిష్యుడు భయం నటించి వెనక్కి తక్కును.)
కరట చూపించమ్మా, భయంలె చ్చూపించు (కరటకశాస్తుల్లు శిష్యుణ్ణి రామప్పంతులు దగ్గిరికి తోయును. రామప్పంతులు చెయ్యిపట్టుకుని అరిచెయ్యి చూచుచుండును. శిష్యుడు చెయ్యిలాగుకొంటూన్నట్టు నటించును. మధురవాణి సిరాబుడ్డీ, కలం, కాకితం పట్టుకుని రామప్పంతులు వెనక నిలుచుండును.)
రామ ఆహా! యెం ధనరేఖా! సంతానయోగ్యత బాగావుంది.
మధు మీరు చేపట్టింతరవాత, అందుకులోపం వుంటుందా?
(సిరాబుడ్డిలోని సిరా రామప్పంతులు ముఖంమీద పోసి ఛఱ్ఱునవెళ్లిపోవును.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)