నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౩-వ స్థలము. కృష్ణారాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధాన్లుగారి యిల్లు.
 

(వీధిగుమ్మం యదట గిరీశంనిలిచి సన్ననిగొంతుకతో పాడును.)

"కాముని విరిశరములబారికి నే,
నేమని సహింతునే, చెలి, యేమని సహింతునే?"

వీడి తస్సా గొయ్యా, వీడిబాణాలు పువ్వులటోయి? ఆమాట యవడునమ్ముతాడు, వెర్రికుట్టె యెవడైనా నమ్మాలిగాని? అనుభవ వేద్యవైఁన దీని నిజం యేవిఁటంటే - మంచిపదునుబట్టిన లోహం మొనకి, డయమండ్‌ పొయంట్‌ వేసి, పోయజన్‌లో ముంచి, కంటికి కనపడకుండా మంత్రించి విసురుతాడు. అంచేతనే, పైకి గాయం కనపడదుగాని పోలీసువాళ్ల దెబ్బల్లాగ లోపల తహతహ పుట్టిస్తాయి. యీ విడో బ్యూటీ చూస్తే యేమీ తోచకుండావున్నది. అయితే యిది చెప్పినట్టల్లా వశమయ్యే మనిషికాదు. పాతరస్తాలేం పనికి రాకుండా వున్నాయి. నా యక్‌స్పీరియన్సూ, నాశృంగార చేష్టలూ గుడ్డిగవ్వంత పని చెయ్యకుండా వున్నాయి. యింత సింప్లిసిటీ యక్కడా కానలేదు. దీనికి లవ్‌ సిగ్నల్సు రామరామా! యేమీ తెలియవు. చమత్కారంమాటలు ఆడితే యేమిన్నీ అర్థంచేసుకోలేక ఆలేడికళ్లతో తెల్లబోయి చూస్తుంది. అయామ్‌ డ్రెడ్ఫుల్లీ యిన్‌ లవ్‌ విత్‌ హర్‌. దీన్ని చూసిన దగ్గిర్నించీ టౌను లవ్‌సూ, డాన్సింగర్లుసూ మీద పరమాసహ్యంపుట్టింది. పోజిటివ్‌ యబహరెన్స్‌. వాళ్ల పెంకెమాటలూ, పెడర్థాలు, దొంగవేషాలూ, డామిట్‌! అంతా యిన్సిన్సిరిటీయే గదా? యిన్నాళ్లు మధురవాణి వలల్లోపడి యెలాగు యాస్‌ని అయిపోయినానో నాకు నామట్టుకే ఆశ్చర్యంగావుంది! మధురవాణికీ యీమనిషికీ కంపా`రిజన్‌ వున్నదా? అది రంగువేసిన గాజుపూస. యిది ప్యూర్‌ డైమండ్‌! కాదని యవడైనా అభాజనుడు అంటే అమాంతంగా వాడి పిలకూడదీస్తాను. దీనిని చెడగొట్టడానికి ప్రయత్నం చెయ్యకూడదు. చేసినా సాగే`ది కాదు. గనక కొత్తదారీ, కొంత న్యాయవైఁనదారీ తొక్కాలి. యేవిఁటయా అది? మాయోపాయంచేసి దీన్ని లేవతీసుకుపోయి విడో మా`రియేజి చేసుకుంటినట్టాయనా కీర్తీ, సుఖంకూడా దక్కుతాయి. "టూ బర్‌డ్స్‌ యట్‌ వన్‌ షాట్‌!" యిలాంటి అట్టర్లీ యిన్నోసెంట్‌ విడోని వొప్పించి తీసుకుపోయి పెళ్లా`డితే మజా, ప్రయోజకత్వమూగాని, రెండేసి మూడేసి సంతానాలు కలిగి తురకాడితోనో, దూదేకులవాడితోనో లేచిపోవడానికి సిద్ధంగావున్న దండుముండల్ని విడో మా`రియేజి చేసుకుంటే హెల్‌! పూటకూళ్లమ్మలాంటి ముండని పెళ్లాడ్డం విడో మా`రియేజి అనిపించుకోదు. అది దొంగముండా మా`రియేజి! యిదేవిఁటయా యిది, యీ బుచ్చమ్మ? సాక్షాత్తూ పరమపవిత్రమైన విడో విత్‌ గిల్ట్‌లెటర్స్‌! అయితే, గియితే, మ-రా-రా-శ్రీ, యన్‌. - గిరీశంగారు విడో మా`రియేజి చేసుకోవడమేనా? "టు మా`రీ యె విడో, ఆర్‌ నాట్‌ టు మా`రీ, దటీజ్‌ ది క్వశ్చన్‌!" షేక్‌స్పియర్‌ పడ్డ అవస్థలో పడ్డాం! "తొందరపడి హాజీసాహేబు తురకల్లో కలిసిపోయినాడన్నట్లు" నావంటి బుద్ధిమంతుడు తొందరపడి యేపనీ చెయ్యకూడదు. దాని లాభనష్టాలు బేరీజువేసి, జమాఖర్చుచేసుకుని మరీ డిసైడ్‌ చెయ్యాలి. లెటస్‌ సీ. Imprimis ఒకటోపద్దు డెబిట్‌ (నష్టం) - విడో మా`రియేజి చేసుకుంటే మావాళ్లు అక్కరచెయ్యరు. అందుకు క్రెడిట్‌, (లాభం) - వాళ్లిప్పుడు చేస్తూన్న అక్కరేవుఁంది? గనక బా`లెన్స్‌ (గాక బాకీ) నిల్‌ బండిసున్నా! రెండోపద్దు - డెబిట్‌ (ఖర్చు) - లోకం నన్ను బహిష్కారం చేస్తారు. అందుకు క్రెడిట్‌, (జమ)-లోకంలోకల్లా విలవైన వస్తువను నేను అంకించుకుని, పసలేని ఆ లోకానికే నేను బహిష్కారం వేస్తాను. గనుక క్రెడిటు బా`లెన్సు (నిలవ) - యేమిటయా? నెగెటివ్‌ యడ్వాంటేజి, హా`వింగ్‌ నథింగ్‌ టు డూ వితే పాపర్‌వర్‌ల్డు - పోజిటివ్‌ యడ్వాంటేజి - పొజెసింగ్‌ ఆలిట్స్‌ వెల్త్‌! మూడోపద్దు - డెబిట్‌ - నష్టం - "వీడి పెళ్లాం వెధవముండ" అంటారు - నోటా బీనీ - యీ పద్దు నిజంగా డెబిటేనా? ఆడిట్‌ డిపార్ట్‌మెంటు వార్నడిగి సంశయం తీర్చుకోవాలి. అందాకా మ-రా-రా-శ్రీ, గిరీశంగారి అభిప్రాయం యేమంటే - విడో అనేది యేమిటి? ఏనేమ్‌! ఓపేరు. ఆ పేరు మనిషి మొహమ్మీద రాశుందా? మనిషిని ముస్తాబుచేసి యదట నిలబెడితే, యిది పునిస్త్రీ, యిది విడో అని చప్పగలిగిన పెద్దమనిషి యవడు? ఒహడూలేడు. గనక విడో అనే వస్తువ యక్కడుందయా? వెక్కిరించే వెధవల నోళ్లలో వుంది. దీనికి క్రెడిట్‌, (లాభం) - యేమనగా - విడో పెళ్లా`డిందంటె అశుభం వోగాయిత్యం అని అటెవడూ కన్నెయ్యడు. యిక డెబిట్లేని శుద్ధక్రెడిట్‌, నంబర్‌ ఫోర్‌, "చుక్కలవలె, కర్పూరపు ముక్కలవలె నీదు కీర్తి ముల్లోకములన్‌ । క్రిక్కిరిసి పిక్కటిల్లెను," అన్నట్లు గిరీశంగారి కీర్తి మిన్ను ముట్టుతుంది. గిరీశంగారి విధవా వివాహ మహోత్సవం కథ న్యూసు పా`పర్లలో పెద్దక్షరాల్తోపడుతుంది. క్రెడిట్‌ నంబర్‌ ఫైవ్‌, విడో మా`రియేజి యసోసియేషన్‌వారు ఒక తృణం యిస్తారు. బుచ్చమ్మక్కూడా కొంచెం డబ్బుంది. డెబిట్‌ - దావా తెస్తేగాని అవుధాన్లు మావఁగారు దాన్లో దమ్మిడీ యివ్వడు.

ప్రొజెండ్‌ కాన్సన్నీ విచారించగా, అవశ్యం విడోమా`రియేజి చేసుకుని తీరవలసిందే. అయితే సాధనవేఁవిటి? యేదైనా యాసెన్‌ బ్రిడ్జికట్టి వొడ్డు చేరాలి. (పైకి ముఖం యెత్తి ఆలోచించి) వెంకమ్మ, మొగుడితో దెబ్బలాడి నూతులో పడ్డప్పుడు నేను సాహసించి వురికి పైకితీసిందగ్గిర్నుంచీ వూరంతా నేను సాక్షాత్తూ సత్య హరిశ్చంద్రుణ్ణిగా భావిస్తున్నారు. ఆడుగడుక్కి బుద్ధి దాట్లేస్తూంటుందిగాని, నేనంతవాణ్ణీ కానా యేవిఁటి? స్నేహంపట్ల పీకిచ్చేస్తారే గిరీశంగారు! సాధారణులా? గనుక బుచ్చమ్మని మనం లావు చనుంచేసినా సుతిమించే వరకూ యవరూ తప్పు బట్టబోరు. రాత్రిళ్లు అరబ్బీనైట్లు, కాశీమజిలీలు, మదనకామరాజు కథలూ చెబుతూవుంటే యంతో సర్‌దాగా పక్కని కూచుని వింటుంది, లవ్‌ స్టోరీజ్‌ బుఱ్ఱకెక్కించాను. కొంత గ్రౌండ్‌ ప్రిపేరైంది గనక, యిహ విడో మా`రియేజి మంచిదని బోధపరుద్దాం. పాచిక పారినట్టాయనా, రామవరం చలో, విడో మా`రియేజి కరో! లెట్‌మీ బిగిన్‌ ది కాంపైన్‌ ఎట్‌ వన్స్‌. (తలుపు కన్నములోనుంచి తొంగిచూచి) నడవలో కూర్చుని విస్తళ్లు కుడుతున్నది. మొట్టమొదట కొంచం మ్యూజిక్‌ విసురుదాము. (ఎటులోర్తునే చెలియా అను జావళీ కూనురాగముతో పాడి) బుచ్చమ్మ వదినగారూ తలుపు తీయండి (బుచ్చమ్మ తలుపుతీయును) వదినా ... వెల్‌! ... వెంకటేశం యేమిచేస్తున్నాడు?

బుచ్చమ్మ పెరట్లో గొట్టికాయ లాడుతున్నాడు.
గిరీశ

ఈ వూరువస్తే మరిచదువు చెడిపోతుంది. పట్నంలో వున్నప్పుడు డస్కుదగ్గిరనుంచి కదలితే వొప్పేవాడను కాను... ఒక్కమాటు పి... పిలుస్తారా పాఠంచెపుతాను.

(బుచ్చమ్మ తమ్ముని తీసుకొని వచ్చుటకు వెళ్లును.)

ఆహా! దీనిఠస్సా గొయ్యా, మొహం యెదటికి వచ్చేటప్పటికి కొంచం ట్రెంబ్లింగ్‌ పట్టుకుంటుంది. వకటి అనవలెనని మరివకటి అనేస్తూ యుంటాను. మరెవళ్లూలేరు. వంటరిగా దొరికిందిగదా, - యీలాంటప్పుడు నామనస్సులో మాట చెప్పేస్తే తీరిపోవునా! ఆ కోతి వెధవని తీసుకురమ్మని చెప్పాను. కానీ, పాఠాలలో చిన్నలెక్చరు వేతాము. (వెంకటేశ్వరులు, బుచ్చమ్మ ప్రవేశింతురు.) యేమివాయి మైడియర్‌ బ్రదరిన్లా వెంకటేశం, పాఠాలు చదవడం శుభ్రంగా మానివేశావు? యిక్కడ మరి మాసంరోజులువుంటే వచ్చిందికూడా మరచిపోతావు. యేదీ టెక్స్టు బుక్కు పట్టుకురా. (వెంకటేశం పుస్తుకము పట్టుకొనివచ్చును) గాడ్స్‌వర్క్‌స్‌ అనేపాఠంతియ్యి. రీడ్‌ ఆన్‌ మై గుడ్‌ బోయ్‌.

వెంకటేశ (తడుముకుంటూ) దేర్‌ యిజ్‌ నాట్‌ ఏన్‌ ఆబ్జక్ట్‌ ఇన్‌ క్రియేషన్‌ వుచ్‌ డజ్‌నాట్‌ సెర్వ్‌ సమ్‌ యూస్‌ఫుల్‌ పర్‌పజ్‌.
గిరీశ అట్టె! అట్టె! అక్కడ నిలుపు, క్రియేషన్‌ అనగా యేమిటి?
వెంకటేశ క్రియేషన్‌ అనగా - అనగా - ఆవులు.
గిరీశ నాన్సెన్స్‌, చదవేస్తే ఉన్నమతికూడా పోతున్నది. ఆవులు యెదటవున్నాయనా ఆవులంటున్నావు? మళ్లీ ఆలోచించి చెప్పు.
వెంకటేశ యేమాటకి అర్థం అడిగారండి?
గిరీశ క్రియేషన్‌.
వెంకటేశ అదా! క్రియేషన్‌ అంటే ప్రపంచం. నేను, యెదట ఆవులు కనబడితే యీ ఆవు పెరుగు యీ నెలరోజులేకదా తినడవఁని ఆలోచిస్తూన్నాను.
గిరీశ వన్‌ థింగ్‌ ఎట్‌ ఏటైమ్‌. యిప్పుడు పాఠంమాట ఆలోచించు. క్రియేషన్‌ అనే వక్కమాటపైనే వక్కఘంట లెక్చరు యివ్వవచ్చును. ప్రపంచం యేలాగున్నది? కపిద్ధాకార భూగోళా అని మనుధర్మశాస్త్రంలో చెప్పినాడు. కపిద్ధమంటే యేమిటి?
వెంకటేశ నారింజపండు.
గిరీశ వెరిగుడ్‌. అందుకు అమర నిఘంటులో పద్యం నీకువచ్చునా?
వెంకటేశ రాదు. చెప్పండి రాసుకుంటాను.
గిరీశ
యింతలు బదరీ ఫలములు,
యింతలు మారేడుపళ్లు యీడుకు జోడై
బంతులు తామరమొగ్గలు,
దంతీకుచకుంభముల బోలు తరుణీ కుచముల్‌.
యీ ప్రపంచములో యేమివస్తువులుంటవి?
వెంకటేశ ఆవులు.
గిరీశ డామ్‌ నాన్సెన్స్‌, యెంతసేపూ ఆవులేనా? యేవిఁటి వుంటవో బాగా ఆలోచించి చెప్పు.
వెంకటేశ గేదెలు.
గిరీశ దట్‌విల్‌ నాట్‌డు, మళ్లీ ఆలోచించి చెప్పు.
వెంకటేశ అయితే నాకు తెలియదు.
గిరీశ విడోస్‌ - యింతచిన్నప్రశ్నకు నీకు జవాబు తెలియదు! ప్రపంచమందుండే వస్తువులన్నిటిలోకీ ముఖ్యమయినవి విధవలు. దాని విషయమై పెద్ద లెక్చరు యివ్వవచ్చును. మనదేశములో ఒక దురాచారమువున్నది. మొగవాడికి పెళ్లాము చచ్చిపోతే తిరిగీ పెళ్లాడుతాడు. ఆడదానికి మొగుడు చచ్చిపోతే యంత యవ్వనములోనున్నా, యెంత సొగసుగానున్నా, మరివకడిని పెళ్లాడ వల్లలేదు. ఇది అన్యాయమంటావా, కాదంటావా?
వెంకటేశ తప్పకుండా అన్యాయమే.
బుచ్చమ్మ యేమండీ గిరీశంగారూ, వెధవలు పెళ్లా`డడం పాపంకాదూ?
గిరీశ ఆహా! మీ సత్యకాలం చూస్తే నాకు విచారంగానున్నది. వెధవలు పెండ్లాడవలసినదని పరాశరస్మృతిలో స్పష్టంగానున్నది. వేదంలోకూడా నున్నది. రాజమహేంద్రవరములో యిదంతా పండితులు సిద్ధాంతం చేసినారు. పూర్వకాలంలో వెధవలు పెండ్లాడేవారు, వెంకటేశం! నలచరిత్రలో దమయంతి రెండోపెండ్లి సాటించినపద్యం చదువు.
వెంకటేశ నాకు రాదు.
గిరీశ ఇంత ముఖ్యమయినపద్యం మరచిపోవడం యంతతప్పూ! నోటుబుక్కు తీసిరాసుకో - "దమయంతి రెండో పెళ్లికి, ధరనుండే రాజులెల్ల దడదడవచ్చిరీ" - చూశావా! లోకంలోవుండే రాజులంతా వెధవని పెళ్లాడడానికి వచ్చారట. (బుచ్చమ్మవైపు జూచి) చూశారా? శాస్త్రాలన్నీ వొప్పుకోవడమే కాకుండా మీదిమిక్కిలి వెధవలు పెళ్లాడకుండా వుండిపోతే దోషమని కూడా చెప్పుతూ వున్నాయి. యిందు విషయమై శంకరాచార్యులవారు పత్రికకూడా యిచ్చి యున్నారు.
బుచ్చమ్మ అయితే మనవాళ్లంతా వెధవల్ని పెళ్లిచేసుకోకూడదంటారే?
గిరీశ అదంతా యింట్లో చాకిరీ చేయించుకోవడము కోసరముగాని మరేమీకాదు. ఝామురాత్రి ఉందనగాలేచి మరునాడు రెండు ఝాములరాత్రిదాకా యెద్దులాగు పనిచేయిస్తారు కదా? ఒక్కపూటకంటె యెక్కువ భోజనం చెయ్యనియ్యరు గదా? అప్సరస లాగున యెంత సొగసుగానున్నా మంచిగుడ్డ కట్టుకోనివ్వరు. సరుకు పెట్టుకోనివ్వరు. తుమ్మెదపంక్తుల్లావుండే జుత్తుకూడా తీసివేస్తారు గదా! ఫర్‌ ఎగ్జాంపిల్‌, మీ అక్కయ్యకు ఆ చంద్రబింబమువంటి ముఖముపైని ఒకకుంకుమబొట్టుంటే త్రినేత్రుడికైనా చూడడానికి అలవి వుండునా? ఆహా! యీ అవస్థచూస్తే నా హృదయం కరిగిపోతున్నది. ఆల్‌రైట్‌! ప్రపంచములో యింకా యేమివస్తువులు వున్నవి?
వెంకటే చేగోడీలు.
గిరీశ డామ్‌ నాన్సెన్స్‌ - ఎంతసేపూ తిండివిషయమయ్యే ఆలోచిస్తావు. బా`చిలర్స్‌, బ్రహ్మచారులుకూడా వున్నారు. వాండ్లు చెయ్యవలసినపని యేమిటి?
వెంకటే వేదం చదువుకోవడం, పెయ్యలకి గడ్డితేవడం.
గిరీశ నాన్సెన్స్‌ - అది మీతండ్రిదగ్గర చదువుకునే విద్యార్థుల మాట. బ్రహ్మచారియొక్క రియల్‌ డ్యూటీ అంటే, విధింపబడినపని యేమనగా, విధవలను పెండ్లాడడమే. ఇంకా క్రియేషన్‌లో యేమున్నది?
వెంకటేశ నాకు తెలియదు.
గిరీశ రామవరములో వెధవవివాహము చేసుకున్నవాళ్లకల్లా నెల వక్కంటికి నూరు రూపాయలు యిచ్చి పోషించడమునకు విడోమారేజి సభ వకటియున్నది. ఇదివరకు అయిదువేలమంది విధవలకు వివాహములు అయి పునిస్త్రీలు అయిపోయినారు. ఆల్‌రైట్‌! క్రియేషన్‌ అనే మాట అయినది. ఆసెంటెన్సు అంతకూ అర్థము చెప్పు.
వెంకటే మీరొకటమాటు చెప్పినతరవాత నేచెబుతాను.
గిరీశ ఆల్‌రైట్‌! ప్రపంచములో దేవుడు ప్రతివస్తువునూ యేదో వొక వుపయోగముకొరకు చేసియున్నాడు. చేగోడీ యెందుకు చేసినాడూ?
వెంకటేశ తినడముకు.
గిరీశ దట్‌ ఈజ్‌ రైట్‌, ఆవుల నెందుకు చేశాడు?
వెంకటేశ పాలు యివ్వడముకు.
గిరీశ పెర్‌ఫెక్ట్‌లీ రైట్‌, ఆడవాళ్ల నెందుకు చేశాడు?
వెంకటేశ వంటచెయ్యడానికి.
గిరీశ నాన్‌సెన్స్‌. పెండ్లాడడముకూ పిల్లలను కనడముకున్నూ. గనుక పెండ్లాడకుండావున్న వెధవపిల్లలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన పాపమును చేస్తున్నారు.
[అగ్నిహోత్రావధానులు ప్రవేశించును.]
అగ్నిహో ఏమండీ గిరీశంగారూ మాకుర్రవాడికి చదువు చెప్పుతున్నారూ?
గిరీశ ఘంటసేపాయి చెపుతున్నానండి.
అగ్నిహో యేదీ నేకూడా వింఛాను కొద్దిగా చెప్పండీ.
గిరీశ మైడియర్‌ బోయ్‌, గాడ్‌ మేడ్‌ క్రియేషన్‌. సృష్టియెవడు చేసినాడూ?
వెంకటేశ దేవుడు.
గిరీశ ఫాదర్‌ ఈజ్‌ నెక్‌స్ట్‌ టు గాడ్‌. దేవుని తరువాత ముఖ్యం యెవరూ! సే ఫాదర్‌.
వెంకటేశ తండ్రి.
అగ్నిహో మొత్తముమీద మీ ఇంగ్లీషు చదువు మంచిదిలాగే కనబడుచూన్నది. భాష భేదంగాని మనముక్కలే వాళ్లవిన్నీ.
గిరీశ వెంకటేశం! దేవుడు సృజించిన ప్రపంచములో యేమివస్తువులున్నవి? సే కోర్ట్‌స్‌.
వెంకటే వెధవలు.
గిరీశ నాన్‌సెన్స్‌, సే కోర్ట్స్‌.
అగ్నిహో యిదేమిటండోయి ప్రపంచంలో వెధవలున్నారంచున్నాడు, ఇంగ్లీషు పుస్తకాల్లో యిదేనా యేమిషి వున్నది?
గిరీశ వెధ్వల్‌ అన్నది లాటిన్‌ మాటండి - ఆమాటకర్థం కచేరీలండి. కచేరీలు యెందుకున్నవి?
వెంకటేశ దావాలు తేవడముకు.
గిరీశ దట్‌ ఈజ్‌ రైట్‌ - చూచారండీ మీవాడికి కచేరీల భోగట్టాలుకూడా నేర్పుతున్నాను.
అగ్నిహో అయితే మనదావావిషయమై నేనిచ్చిన కాకితాలు సమగ్రంగాచూశారా?
గిరీశ కేసు గెలవడముకు యేమీ అభ్యంతరములేదు. మీకు తెలియడంకోసం గ్రంధం అంతా తెలుగు చేస్తున్నాను. మామగారూ మీవిషయమై యెంతశ్రమయినాపడి అమలాపురం వెళ్లి అక్కడ కోర్టులో కేసు గెలిపించకపోతే నన్ను పేరుపెట్టి పిలవవద్దు.
అగ్నిహో యేదో అంతా మిమ్మలినే నమ్ముకునివున్నాము. యెంత డబ్బయినా కేసు గెలిస్తే చాలును. పెళ్లిపనులకి మీ కుమ్మక్కువుంటేనేకాని తూగదు సుమండీ. నామీద కోపంచాత కరటకశాస్త్రుల్లూ వాళ్లూ వెళ్లిపోయినారు. వాళ్లువొచ్చేటట్టు కనపడదు.
గిరీశ మీరు కూర్చున్న దగ్గిరనుంచి కాలుకదపకుండా ఎరేంజిమెంటు యావత్తూ నేను చేస్తానుకాదూ.
(నిష్క్రమించుచున్నారు.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)