నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౪-వ స్థలము. పెరటిలో జామిచెట్టు కొమ్మమీద వెంకటేశంకూచుని జామిపండు కొరుకుచుండును.
[చెట్టుకొమ్మలు ఆవరించివున్న నూతిలో నీరు బుచ్చమ్మ తోడుతుండును.]
బుచ్చమ్మ తమ్ముడూ, గిరీశంగారు గొప్పవారష్రా?
వెంక గొప్పవారంటే అలా యిలాగా అనుకున్నావా యేవిఁటి? సురేంద్రనాద్‌ బా`నర్జీ అంతగొప్పవారు.
బుచ్చమ్మ అతగాడెవరు?
వెంక అందరికంటే మరీ గొప్పవాడు.
బుచ్చమ్మ అయితే గిరీశంగారికి వుద్యోగం కాలేదేమి?
వెంక నాన్సన్స్‌! నువ్వు ఆడదానివి; నీకేం తెలియదు. ఉద్యోగవంటే గొప్పనుకుంటున్నావు. ఉద్యోగవఁంటే యేమిటో తెలిసిందా? సర్వెంట్‌ అన్నమాట.
బుచ్చమ్మ అనగా యేమిటి?
వెంక సర్వెంటనగానా? నౌఖర్‌ అన్నమాట. మన గేదెనికాసే అశిరిగాడు ఒక సర్వెంట్‌. మన యిల్లుతుడిచే అంకి ఒక సర్వెంట్‌. వీళ్లు మన నౌఖర్లు. పోలీసూ, మునసబూ తెల్లవాడి నౌఖర్లు. జీతం లావురాగానే గొప్పనుకున్నావా యేవిఁటి? సురేంద్రనాద్‌ బా`నర్జీ, గిరీశంగారులాంటి గొప్పవాళ్లు తెల్లవాడిదగ్గిర కాదు, దేవుఁడిదగ్గిరైనా నౌఖరీ చెయ్యమంటే చెయ్యరు. కలక్ట రేవంటాడో తెలిసిందా? పోలీసువెళితే "స్టాండ్‌!" నిలుచో అంటాడు. గిరీశంగారు వొచ్చారంటే షేక్‌హాండ్‌ చేసి కుర్చీమీద కూచోండి అంటాడు. ఆయనకి హైదరాబాదునవాబు వెయ్యిరూపాయల పని యిస్తామంటే, నీపనెవడిక్కావాలి పొమ్మన్నాడు.
బుచ్చమ్మ ఆయనకి పెళ్లైందిరా?
వెంక లేదు.
బుచ్చమ్మ తమ్ముడూ, వెధవలు పెళ్లా`డ్డం మంచిదంటారుగదా, ఆయనెందుకు పెళ్లా`డారు కార్రా?
వెంక నీకు యంతచెప్పినా తెలియదు. (గట్టిగా) ఆయన ఉద్యోగం చెయ్యకపోవడం, పెళ్లి మానుకోవడం లోకం మరామత్తు చెయ్యడానికట; యిప్పుడు తెలిసిందా?
బుచ్చమ్మ యలా మరమ్మత్తు చేస్తున్నార్రా?
వెంక నావంటి కుర్రాళ్లకి చదువుచెప్పడం. (నిమ్మళంగా) చుట్టనేర్పడం. (గట్టిగా) నాచ్చికొశ్చన్‌ అనగా సానివాళ్ల నందర్ని దేశంలోంచి వెళ్లగొట్టడం ఒహటి. నేషనల్‌ కాంగ్రెస్‌ - అనగా దివాన్గిరీ చలాయించడం ఒహటి. యిప్పుడు తెలిసిందా?
బుచ్చమ్మ ఉద్యోగం చెయ్యరన్నావే? దివాన్గిరీ యేరాజుదగ్గిర్రా?
వెంక యేరాజుదగ్గిరా? - ఆడదానివి నీకెందుకూ యీ భోగట్టా అంతాను?
బుచ్చమ్మ నువుకూడా లోకం మరమ్మత్తు చాస్తావుష్రా?
వెంక ఓ!
బుచ్చమ్మ ఐతే వెధవముండనికూడా పెళ్లా`డతావురా?
వెంక నాన్న తన్నకుండావుంటే తప్పకుండా పెళ్లాడతాను; గాని బోడిగుండు చేస్తేమాత్రం నాకక్ఖర్లేదు.
(గిరీశం ప్రవేశించి.)
గిరీశం వదినా యీ చెట్టుకింద నిలబడితే మీరు వనలక్ష్మిలా వున్నారు. (బుచ్చమ్మవైపుతేరి చూసును.)
బుచ్చమ్మ విన్నారా? తమ్ముడు వెధవని పెళ్లాడతాష్ష!
గిరీ నా ప్రియశిష్యుడూ, మీకు ప్రియసోదరుడూ అయిన వెంకటేశం విధవావివాహవేఁ చేసుకుంటే, మేం యావన్మందివిఁన్నీ బ్రహ్మరధం పట్టవాఁ?
బుచ్చ గురువులుగదా ముందు మీరెందుకు చేసుకోరు?
గిరీ ఆడగవలిసినమాట అడిగారు. చెబ్తాను వినండి. మీ రడిగినతరవాత చెప్పకపోవడం తప్పని చెబుతున్నానుగాని, యీ మాటలు చెప్పవలిసినవి కావు. యేవఁంటారా? నా గొప్ప నే చెప్పుకోకూడదుగదా? అదొహటి. అంతకంటె ప్రమాదమైనమాట మరోటుంది. చూశారా వొదినా!- మొదట్నించీ విధవావివాహం కూడదు కూడదు అని తప్పు అభిప్రాయంలో పడిపోయివున్న అత్తగారూ, మావఁగారూలాంటి పెద్దవాళ్లకి యెన్ని శాస్త్రాలూ సవబులూ మనం చెప్పినా, వాళ్లకి నెత్తికెక్కవు. యిలాంటి మాటలు వాళ్లతో మనం చెప్పినట్టాయనా కఱ్ఱుచ్చుకుంటారు. మావఁగారు వేదంమట్టుకే చదువుకున్నారుగాని నేను శాస్త్రాలు అన్నీ చదువుకున్నాను. అబ్బో, నేను మన శాస్త్రాల్లో వుడ్డోలుణ్ణి. శాస్త్రకారుడు యేవఁన్నాడూ? "బాలాదపి సుభాషితం" అన్నాడు. అనగా మంచిమాట చంటిపిల్లడు చెప్పినావిని ఆ ప్రకారం చెయ్యండయ్యా అన్నాడు. అయితే మన పెద్దవాళ్లు శాస్త్రంలో చెప్పినప్రకారం నడుస్తారూ? యంతమాత్రం నడవరు. మనం శాస్త్రమూ, సవబులూ చూపిస్తే యావఁంటారు? యీ గుంటవెధవలు చెప్పడం మనం విండవూనా అని కఱ్ఱుచ్చుకుంటారు. నామాటకేవిఁ చప్పకండి, నాది యినుంలాంటి శరీరం - కొడితే కఱ్ఱ విరిగిపోవాలిగాని చెక్కుచదరదు. నా ప్రియశిష్యుడికైతేనో? మీ అందరివీ మెత్తని మృదువైన శరీరాలు అవుటచాత యెవిఁకలు విరిగిపోతాయి. గనుక యీ మాటలు మన్లో మనం అనుకోవలసినవే గాని మరోళ్లతో ప్రాణంపోయినా అనవలసినవికావు. యావఁంటారు?
బుచ్చ అవును.
గిరీ అవునంటే చాలదు. యవరితోనూ యీ మాటలు చెప్పనని మీరంటేనేగాని, నామనసులో మాటలు నాలుగూ యెలా చెప్పడం?
బుచ్చ యవరితోనూ చప్పను.
గిరీ వొట్టేసుకోవాలి.
బుచ్చ యావఁని వొట్టేసుకునేది?
గిరీ యావఁనా? మీరు యవరితోటైనా చెబితే నా బుఱ్ఱ పగిలిపోవాలని వొట్టేసుకొండి.
బుచ్చ అహఁ! అలా వొట్టేసుకోను. మీ బుఱ్ఱ చల్లగావుండాలి. చెబితే నాబుఱ్ఱే పగిలిపోవాలని వొట్టేసుకున్నాను.
గిరీ అందుకు నే వొప్పుతానా యేవిఁటి? నాబుఱ్ఱ పగిలింతరవాత మీబుఱ్ఱ జోలికి యవడైనా రావాలిగాని, మీ ప్రాణానికి నాప్రాణం అడ్డువెయ్యనా?
బుచ్చ మాఅమ్మని బతికించారుకారా? మీరు అలాంటివారే.
గిరీ ఆమాట మీరే అన్నారుగనక, వినండి - చెప్తాను. నేను పెళ్లా`డి పెళ్లాం బిడ్డలూ నాకుంటే, వాళ్లని తల్చుకున్నతరవాత ప్రాణానికి తెగించి మీ అమ్మని తియ్యడానికి నూతులోకి గెంతగలిగి వుందునా? యీ జన్మవఁంతా లోకోపకారం కింద వినియోగపర్చుకుందావఁని నిశ్చయించుకుని యిదివరదాకా ఏకాకినై వుంటిని. సత్యమే. మీలాంటి నా మేలుకోరినవాళ్లు "పెళ్లిచేసుకో" అంటే ఆమాట తోసేయడం కష్టమే; గాని ఒకమాటకిమాత్రం జవాబు న్యాయంగా చప్పండి. ఒక్కళ్లకి ఉపకారం చెయడం గొప్పా? అందరికీ ఉపకారం చెయడం గొప్పా?
బుచ్చ అందరికీ చెయ్యడవేఁ గొప్పనుకుంటాను.
గిరీ సరే! ఆమాటమీద నిలవండి. పెళ్లాడి, ఆలూబిడ్డలకి, ముచ్చకాయ ముగ్గురికి ఉపకారం చెయడంకంటే లోకోపకారం కింద యీ ప్రాణం వినియోగపర్చడం పుణ్యంకాదా? చచ్చేకాలానికి స్వర్గం యెదురుగుండా వొస్తుందే?
బుచ్చ లోకానికి యేం వుపకారం చాస్తారు?
గిరీ అలా అడగండి. సోషల్‌ రిఫారమ్‌, సోషల్‌ రిఫారమ్‌ అంటే సంఘసంస్కారం. అసలు యింగిలీషుమాట యంత అర్థవౌఁతుందో, మీకు, దాని తర్జుమాకూడా అంతే అర్థం అవుతుంది. విప్పిచెప్పాలంటే ఒకసిమిలీ, అనగా ఉపమానంచెప్పి మీకు బోధపరుస్తాను. లోకం తప్పుతోవలో వెళ్లుతూంటే ఆతోవలోంచి మళ్లించి మంచితోవలో పెట్టడవఁనేది సోషల్‌ రిఫారమ్‌.
బుచ్చ యేమిటా తప్పుతోవ?
గిరీ జారూ బురదా, గట్లూ గతకలూ వున్నతోవ యలావుంటుందో యిప్పుడు మనవాళ్ల ఆచారాలు అలావున్నాయి; ఆతోవలోంచి బండీ తప్పించి మంచి దిమ్మిసాకొట్టిన హైరోడ్డులోకి మళ్లించాలి. ఆబండికి రెండుచక్రాలు. ఒకటి విధవావివాహం, రెండు నాచిక్వొశ్చన్‌, అనగా సానివాళ్లని హతవాఁర్చడమున్నూ యీ రెండే రాజమార్గాలు.
బుచ్చ మనవాళ్ల దురాచారాలేవిఁటో నాకు బోధపడలేదు.
గిరీ ఐతే చెబుతాను వినండి. ముసలాళ్లకి చిన్నపిల్లల్నిచ్చి పెళ్లిచెయ్యడం ఒకటి, డబ్బుకి పిల్లల్ని అమ్ముకోవడం ఒకటి. అవునంటారా కాదంటారా?
బుచ్చ అవును.
గిరీ ఆ ముసలాళ్లు చస్తే కష్టంసుఖం యరగని పసిపిల్లలు వెధవలు అవుతారు. ఉప్పూ పులుసూ తినడంచాత యేమీ యరగని పసిపిల్లలు పూర్నయవ్వనం వొచ్చినతరవాత మనసుపట్టలేకపోతే వాళ్లదా తప్పు? "వెధవవివాహం కూడదూ, గిధవవివాహం కూడదూ" అని ఓర్వలేనిమాటలు చెబుతూ, డబ్బుకాసించి, ముసలి పెళ్లిళ్లుచేసే మూర్ఖుల్దా తప్పు? వూరుకుంటారేం?
బుచ్చ నాకు తెలియదు.
గిరీ అవుఁను మరి మీరేవఁనగల్రు? తల్లినీతండ్రినీ యేఁవనుకున్నా మనసులో అనుకుని జీర్ణించుకోవాలిగాని, మీలాంటి మంచివాళ్లు పైకంటారా? నాలాంటి వాణ్ణి, యేవఁండీ మావఁగారూ, పిల్లల్ని రూపవంతుడూ, యవ్వనవంతుడూ, బుద్ధిమంతుడూ అయ్ని కుర్రవాడికి యిమ్మని శాస్త్రంలో వుందిగదా, శాస్త్రానికి విరుద్ధంగా, యెందుచాత డబ్బుక్కక్కుర్తిపడి ముసలాళ్లకి కట్టబెడుతున్నారయ్యా? శాస్త్రంలో "వెధవలికి పెళ్లిచెయ్యవలసినది, చెయ్యవలసినది" అని శాశించి చెప్పివుండగా యెందుకు చెయ్యరయ్యా అని అడిగితినట్టాయనా, అర్థచంద్రప్ర`యోగంచేసి అవతలికి గెంటుతారు. అంచాత "శాంతం బోషాణపెట్ట`" అనుకుని నోరుమూసుకు వూరుకున్నాను. యిహ నాచ్చికొశ్చన్‌ మాటవినండి. సానివాళ్లని హతవాఁర్చడం మంచిదంటారా కారా?
బుచ్చ వాళ్లని చంపేస్తారా యేవిఁటి?
గిరీ చంపక్కర్లేదు. "పొమ్మనక్కర్లేదు, పొగబెడితే" చాలునన్నట్టు సానివాళ్లని పెళ్లిళ్లకి పిలవకపోవడం, వాళ్లిళ్లకి వెళ్లకపోవడం, వాళ్లని వుంచుకోకపోవడం పైంచెప్పిన పనులుచేసేవాళ్లని కనపడ్డచోటల్లా తిట్టడం, యిలా నాలాంటి బుద్ధిమంతులంతా ఒహటై కొంతకాలం చేసేసరికి, కలికంలోకైనా మరి సాంది వుండదు. లేకుంటే చూడండి. మన వెంకటేశం పెళ్లికి తప్పకుండా సానిమా`ళం తెస్తారు. నే యెరుగుదును. కూడదన్నపనల్లా మావఁగారు చాస్తారు, కూడినపని మానేస్తారు. సానిమా`ళం తా`వడమనేది డబ్బిచ్చి తద్దినం కొనుక్కోవడమన్నమాట కాదా? పెళ్లినాటికి నా ప్రియశిష్యుడికి కొంచం యీడొస్తుందిగదా. ఆ సానిముండలు యఱ్ఱగా బుఱ్ఱగా వుండడంచూసి, పెళ్లాంమీద అసహ్యంపుట్టి "యీ పసిపిల్ల యదగడవెఁప్పుడు, కాపరానికి రావడవెఁప్పుడు, యీ సానివాళ్లు మా మజాగావున్నారని" వాళ్లని వెంకటేశం వుంచుకుంటే కొంప ములిగిపోతుందిగాని తరవాయి వుండిపోతుందా? యేవఁంటారు?
బుచ్చ అవును, నిజవేఁ.
గిరీ గనుక లోకం బాగుపడేటందుకుగాను వెధవలికి పెళ్లిచెయ్యడానికి, సానివాళ్లని సాగనంపడానికి వీరకంకణం కట్టాను. మరే వచ్చి, మీ తమ్ముళ్లాంటివాళ్లకి అనేకులికి విద్యాబుద్ధులు చెప్పుతున్నాను. గజీతగాణ్ణి ఔటచేత నూతుల్లో గోతుల్లో పడ్డవాళ్లని పైకి తీస్తాను. యింకా నా`షనల్‌ కాంగ్రెస్‌ ఒహటుందిగాని అందులో నే చేసేపని చాంతాడంత వ్యాఖ్యానం చేస్తేగాని మీకు బోధపడదు. పరిపరివిధాల లోకోపకారం చేస్తున్నాను.
బుచ్చ యీ పనులన్నీ పెళ్లిచేసుకుంటేమాత్రం చెయ్యకూడదా?
గిరీ యలా జెయడం? లోకవఁంటే యేవిఁటి గంజిగుంట అనుకున్నారా? యేషియా, యూరోప్‌, ఆఫ్రికా, అమెరికా, ఆష్ట్రలేషియా అని, ఐదు ఖండాలు. అందులో అమెరికాలో మనుష్యులు బుఱ్ఱకిందికీ కాళ్లు పైకీపెట్టి నడుస్తారు. యిక్కడ పగలుగదా యిప్పుడు? అక్కడ రాత్రి. నార్త్‌పోల్‌ అని మరోదేశం వుంది. అక్కడ ఆర్నెల్లు పొగలే; అప్పుడు మరి రాత్రుండదు. ఆర్నెల్లు రాత్రే; అప్పుడు మరి పొగలుండదు. అక్కడేవిఁటనుకున్నారు. సముద్రం అంతా మంచుకెరడైపోతే లేళ్లని బళ్లకికట్టి సవారీఐ, వాయువేగ మనోవేగంగా వెళతారు. యిన్ని దేశాలకీవెళ్లి అక్కడివాళ్లకల్లా ఉపకారం చేస్తేగదా లోకోపకారం అవుతుంది? పెళ్లాంబిడ్డలూ వుంటే వాళ్లని వొదిలి యలా పోవడం? అయితే పెళ్లా`డమని మీరు చెప్పినమాటకూడా సుతలామూకొట్టి పారెయకూడదు. లోకానికోసం బతకడం ఉత్తమం. అయితే లోకం అంతా యంతవిలవో అంతకన్న యెక్కువవిలవైన రత్నంలాంటి ఆడమనిషి దొరికితే, తప్పకుండా పెళ్లాడవలిసిందే. యీవూరొచ్చేవరకూ నాకలాంటి దివ్యసుందర విగ్రహం, కనపళ్లేదు. మొహవెఁదట చెప్పకూడదు. అలాంటి మనిషి యీవూళ్లో కనపడ్డది; అందరాని పండుకు ఆశించడవెఁందుకని మనసు మళ్లించుకోడానికి విశ్వప్రయత్నం చేస్తున్నానుగాని మనస్సు లొంగకుండావుంది. భగవంతుడేం జేస్తాడో! మనస్సుతో యావఁంటున్నానంటే, "ఓ వెఱ్ఱిమనసా! నువ్వు వలచిన చిన్నది ఆణిముత్యవేఁగాని యిన్నాళ్లూ పెళ్లి మానేసి యిప్పుడు 'పెళ్లా`డదాం, పెళ్లా`డదాం' అని యెందుకు సందడిపడతావు? 'సంసార సాగరం దుఃఖం, తస్మాజ్జాగ్రత జాగ్రత' అన్నాడు. సంసారంలో పడిపోతే మళ్లీ నీకు లోకోపకారం చెయడానికి అవకాశం వుంటుందా?" అని మనస్సుకి బోధపరుస్తున్నాను. పెళ్లాడితే లోకోపకారానికి అవకాశం యంతమాత్రం వుండదు చూశారా వదినా! మాటవరసకి మనం పెళ్లాడతాం అనుకుందాం. సంసారం గడుపుకోవడానికి డబ్బు సంపాదించుకోవాలా? యిదివరకల్లా అంటే బ్రహ్మచర్యం ఆచరిస్తున్నాను గనక "సత్రాభోజనం, మఠానిద్రా" సరిపోయింది. మాటవరసకి మిమ్మల్ని పెళ్లాడింతరవాత, అలా సరిపోదే! మనంగాని మావఁగారి మూర్ఖానికి లక్ష్యపెట్టక, యవరితోనూ చప్పకుండా రామవరం వెళ్లిపోయి అక్కడ శాస్త్రోక్తంగా పెళ్లాడావఁంటే, ప్రస్తుతంమట్టుకు విడో మారియేజి సభవారు మనకి నెలకి నూర్రూపాయలు యిస్తారు. ఓ నాలుగయిదు మాసాలు అలా కాలక్షేపంచేసి, హైదరాబాదులోగాని, బడోదాలోగాని ఓ వెయిరూపాయల వుద్యోగం సులభంగా సంపాదించుకుంటాను. హయిదరాబాదు నవాబు నెలరోజులకిందట పెద్ద ఉద్యోగ విఁస్తానన్నాడు. "నేను ఒకడిదగ్గిర నౌఖరీచేస్తానా?" అని విఱ్ఱవీగి తోసిపారేశాను. మీరు వివాహం చేసుకోమని సలహాయిస్తారని అప్పుడే యెరిగివుంటే ఆ ఉద్యోగం మించిపోనియ్యకపోదును.
బుచ్చ మీరు ఉద్యోగం చెయ్యరన్నాడే, తమ్ముడు?
గిరీ అవును బ్రహ్మచారిగావుండి లోకోపకారం చేస్తూ వున్నంతకాలం పెళ్లిచేసుకోనని శపధం పట్టా`ను. గాని యిప్పుడు నా అదృష్టంవల్ల లోకం అంతటికన్నా విలవైన వజ్రంలాంటి భార్యా దొరికితే పెళ్లాడక తీరుతుందా? లోకంయొక్క విలవ వెండి అనుకోండి. లోకం వెండైతే మీలాంటి సువర్ణచ్ఛాయగల కుందనపుబొమ్మ, పజ్యండోవన్నె బంగారం అవునంటారా కాదంటారా? బంగారం విలవ యెక్కువా, వెండి విలవ యెక్కువా? చప్పండి.
బుచ్చ బంగారవేఁ యెక్కువ.
గిరీ సరే, మీలాంటి బంగారం బొమ్మే లభించినప్పుడు లోకం గీకం అవతలబెట్టి పెళ్లాడక తీరదుగదా. మాటవరసకి మనం పెళ్లా`డతాం అనుకొండి. పెళ్లా`డింతరవాత సంసారం సుఖంగా జరుపుకోవాలంటే లావుగా డబ్బుండాలిగదా? ఉద్యోగం చేస్తేగాని డబ్బులావుగారాదే?
బుచ్చ అవును.
గిరీ అట్టే డబ్బెందుకని అడుగుతారు ఒకవేళ. చెబుతాను వినండి. సంసారానికి యిల్లన్నది ఒకటుండాలిగదా? యేవఁంటారు?
బుచ్చ అవును.
గిరీ నాకు మేడలుంటేనేగాని కుదరదు. యిలాంటి చిన్న యిళ్లలో నాకు ఉక్కిరిబిక్కిరిగా వుంటుంది. ఆమేడచుట్టూ తోట వుండాలి. మావిడిచెట్లూ, అరిటిచెట్లూ, జామిచెట్లూ, చెప్పన్న వృక్షాలూ వేస్తాం. మన వెంకటేశం కోతిలాగ పళ్లుతింటూ యెప్పుడూ ఆ చెట్లమీదే వుంటాడు.
వెంక ఆచెట్లపళ్లన్నీ నేనే కోస్తాను.
గిరీ అంతవాడివికావనా? మనం అలాగ యిల్లూ, వాకిలీ, తోటా, దొడ్డీ, యార్పరుచుకునేటప్పటికి మనకి చిన్నపిల్లలు పుడతారు. వాళ్లని సంరక్షణచెయ్యాలా? వాళ్లు నేను కుర్చీమీద కూచుని రాసుకుంటూంటే వొచ్చి చెయ్యిబట్టుకులాగి నాన్నా యిది కావాలి అది కావాలంటారు. మీరు బీరపువ్వుల్లాగ వొంటినిండా సరుకులు పెట్టుకుని, చక్కగా పసుపూ కుంకంపెట్టుకుని, మహాలక్ష్మిలాగ యింట్లో పెత్తనంచేస్తూవుంటే ఒక పిల్ల యిటివేపువొచ్చి మెడకాగలించుకునీ, ఒకపిల్ల అటువేపువొచ్చి మెడకాగలించుకునీ "అమ్మా యిది కావాలి, అమ్మా అది కావాలని" అడుగుతారు. వాళ్లకి సరుకూ జప్పరాచేయించాలి, జరీదుస్తులు కుట్టించాలి. గిరీశంగారి పిల్లల్ని తీసుకురా అని ఒకప్పుడు నవాబుగారి శలవౌతుంది. మన పిల్లల్ని వెంకటేశంలాగ కాయగావంచా, తెల్లచొక్కాయితో పంపించడానికి వల్లకాదుగదా? వాళ్లకి చిన్నబళ్లూ, గిళ్లూకొనాలి. వాళ్లకి చదువూసంధ్యా చెప్పించి ప్రయోజకుల్ని చెయ్యాలి. యిదంతా సంసార తాపత్రయంకాదా? యిందులో పడిపోతే మరి లోకోపకారం చెయడానికి అవకాశవుఁంటుందా? చెప్పడం మరిచిపోయినాను, అప్పుడు మన వెంకటేశం మనదగ్గిరే వుండి చదువుకుంటాడు.
బుచ్చ అలా అయితే మరి నాన్నకి ఖర్చుండదు. నాన్నా అమ్మా వాడిచదువుకోసం దెబ్బలాడ్రు.
గిరీ నే వొద్దన్నానా?
వెంక నాకో చిన్న గుఱ్ఱబ్బండి కొనాలి.
గిరీ వేరే నీకు బండీ యెందుకు? మా పిల్లలబండీలో నువ్వుకూడా వెళ్లుదువుగాని, వాళ్లు అల్లరి చెయకుండానూ, కిందపడిపోకుండాను చూస్తూవుందువుగాని.
వెంక అక్కయ్యని పెళ్లాడేస్తారా యేవిఁటి?
గిరీ మాటవరసకి అని అంటూంటే, మతిపోయినట్లు మాట్లాడతావేవిఁటి?
బుచ్చ అంతేకద?
గిరీ అంతేగదంటే, అంతకంటె అదృష్టం నాకు పట్టడం యలాగ? ఆమాట మీరు అన్నా, నేను అన్నా, మీవాళ్లు నన్ను తన్ని తగిలేస్తారు. వెంకటేశంగానీ అన్నట్టాయనా, పెయ్యకట్టుతాడు వుణ్ణేవుంది.
వెంక ఓయి నాయనో! (వీపుతడువుఁకొనును) గుప్‌ చప్‌! నే ఆవూసెత్తను!
బుచ్చ మానా`స్తం, రాంభొట్లుగారి అచ్చమ్మ మీరు వొప్పుకుంటే మిమ్మల్ని పెళ్లా`డతానంది.
గిరీ పెళ్లా`డడవేఁ వొస్తే, అచ్చమ్మనీ పిచ్చమ్మనీనా పెళ్లా`డతాను? యప్పటికైనా "ఒకళ్లతో నాకు పనేవిఁటి? నా బతుకు సుఖవేఁదో నేను చూసుకుంటాను." అని మీలాంటి దివ్యసుందరవిగ్రహమూ, గుణవంతురాలూ, నామీద కనికరించి "గిరీశంగారూ నన్ను పెళ్లాడండి" అంటే పెళ్లాడతానుగాని అచ్చమ్మల్నీ, పిచ్చమ్మల్నీ మెడకి కట్టుకుని ఉత్తమ బ్రహ్మచర్యం, లోకోపకారం మానుకుంటాననుకున్నారా యేవిఁటి?
వెంక మంచిపండు పడిపోయింది అందుకోండి.
గిరీ (పండుతీసి) ఆహా యేమిచాయ! వొదినా మీవొంటిచాయని వుంది యీపండు. యిందండి.
బుచ్చ బిందెలోపడెయ్యండి. తమ్ముడూ దిగొచ్చి బింద`యెత్తు.
గిరీ వాడక్ఖర్లేదు. నేనెత్తుతాన్లెండి. (యెత్తి) ఆహా! యేమివయ్యారం! (బుచ్చమ్మ నిష్క్రమించును.) శిష్యా! రెండుపళ్లురాల్చు.
వెంక నాన్నొస్తున్నాడండోయి దిడ్డీతోవ్వేపు. యేవిఁటి సాధనం?
గిరీ ఆకులు దట్టంగా వున్నవేపు దాగో. నేను యాతాంతోడ్డం ఆరంభిస్తాను.
(అగ్నిహోత్రావధాన్లు ప్రవేశించి.)
అగ్ని గిరీశంగారూ, నీరు తోడుతున్నారండీ? అసిరిగాడు తోడుతాడే, యింగిలీషు చదువుకున్నవాళ్లు, మీ కెందుకాశ్రమ?
గిరీ పనివంటి వస్తువ లోకంలో లేదండి. ఊరికే కూచుంటే నాకు వూసుపోదు. మొక్కలకా, మంచిది నాకా, కసరత్తూ. గవునరు, తోట్లో గొప్పు తవ్వుతాడు. సీవఁరాణీవారు బీదలూ సాదలకీ యివ్వడానికి బట్టలు కుడతారు. యింగిలీషువాడు సోమరితనం వొప్పడండి. వాళ్లలో పెద్ద కవీశ్వరుడు షేక్‌స్పియరు యేవన్నాడో విన్నారా, "డిగ్నిటీ ఆప్‌లేబర్‌" అన్నాడు - అనగా కలక్టరు గొప్పవాడుకాడు, జడ్జీ గొప్పవాడుకాడు; కాయక్లేశపడి కష్టపడే మనిషే గొప్పవాడన్నాడు. అంచాతనే యీ గొప్పదొర్లంతా మెప్పు పొందాలంటే తోటమాలీపని చేస్తారు. చెట్లూ చావఁలూ యెక్కడం వొహటి వాళ్లలో గొప్పవిద్య. లాభంలేనిపని యేదీ దొరచెయ్యడండి మావఁగారూ. దొరగారు వూర్నించి వూరికి వెళుతూండగా దాహవేఁస్తుంది. చెట్లని పళ్లుంటాయి. నడితోవలో చెట్టెక్కడం నేర్చుకోకపోతే దాహంతో చావవలిసిందేగదా? యేజన్సీ కమాన్‌ చేస్తూవుంటే పెద్దపులి వొస్తుందనుకొండి. దొరకి చెట్టెక్కడం చాతయితె చపాల్న చెట్టెక్కి ప్రాణం కాపాడుకుంటాడు. అంచేత చదువుతోపాటు చెట్లెక్కడంకూడా నేరుస్తారు.
అగ్ని దొర్ల తరిఫీదంతా అదో చిత్రం. వెంకడు రాసుకుంచున్నాడా, చదువుకుంచున్నాడా అండి?
గిరీ యింతసేపూ చదువుచెప్పి "చెట్లూ చావఁలూయెక్కి ఆడుకో" అని తోలేశాను.
అగ్ని మీకేం మతి పోయిందా యేవిఁటండి? కాలూచెయ్యీ విరుచుకుంటే?
గిరీ రేపు మనవాడికి గుణుపురం తాసిల్దారీఅయి అడివిలో కమాను వెళ్లుతూవుండగా పెద్దపులొస్తే చెట్టెక్కలేక, కాళ్లువొణికి చతికిల బడాలని మీ అభిప్రాయవాఁ యేవిఁటి?
అగ్ని మనవాడికి తాసిల్దారీ అవుతుందండి?
గిరీ యెందుక్కాకూడదూ? గుఱ్ఱాలెక్కడం, చెట్లెక్కడం మనవాడు నేర్చుకోకపోతే, "నాయనా నువ్వు కమాన్లకి పనికిరావు. డసుకు దగ్గిరకూచుని గుమస్తాపని చేసుకో. తాసిల్దారీ గీసిల్దారీ తలపెట్టకు" అని దొర్లంటారు.
అగ్ని అషైతే చిన్నచెట్లెక్కించండిగాని పెద్దచెట్లప్పుడే యక్కనియ్యకండి.
గిరీ అంచేతనే జామచెట్టు యక్కమన్నాను. చూశారా?
అగ్ని ఓరి! కోతివెధవా!
గిరీ అదుగో తిడుతున్నారూ? దొర్లచదువు చదువుకుంటే, దొర్లతరిఫీదు యివ్వక తప్పదు. మీరిలా తిడితే భయపడి కిందపడతాడు; యిలాంటిపనులు మీకిష్టం లేకపోతే, యింగిలీషుచదువు మానిపించి వేదం చెప్పండి.
అగ్ని మరిచిపోయి తిట్టా`ను. యీ యింగిలీషు వాళ్లసంగతంతా అదో వెఱ్ఱిమొఱ్ఱి.
గిరీ మీవంటి ప్రాజ్ఞులు అలా అండం నాకు ఆశ్చర్యంగా వుంది. వాళ్లనడవడిక మంచిదవడం చాతనే దేవుఁడు యింత రాజ్యైశ్వర్యం వాళ్లకిచ్చాడు. మనశాస్త్రాల్లో మాటలు మనం మరిచిపోయినావుఁ. ఆమాటలే తెల్లవాళ్లు దొంగతనంగా పట్టుకుపోయి, శాస్త్రం చెప్పినట్టల్లా ఆచరించి మనరాజ్యం లాగుకున్నారు. మీరు యెరిగిన వారుగదా చెప్పండి, గురువులు దగ్గిర శిష్యులు యెంచేశేవారు? అడివికెళ్లి చెట్లెక్కి సమిధలు తెచ్చేవారు. రండికీ మొండికి ఓర్చెవారు. యిప్పుడు యింత ప్రాజ్ఞులైన మీరేవఁంటున్నారూ? మావాడు యిల్లుకదిలివెళ్లితే కందిపోతాడు, మావాడు జావఁచెట్టెక్కితే కాళ్లువిరుచుకుంటాడు అని భయపడుతున్నారు. మీశిష్యులు బ్రహ్మాండవైఁన మఱ్ఱిచెట్టు కొసకెక్కి ఆకులుకోసి తెస్తున్నారుకారా? మనపుస్తకాల్లో మర్మం కనుక్కుని దొర్లు బాగుపడుతున్నారు, మనపుస్తకాలు బూజెక్కించి మనం చెడుతున్నాం.
అగ్ని మీకు చాలాతెలుసును. యీతెల్లవాళ్లు చేసేవిద్యలన్నీ మనగ్రంధాల్లోంచి యెత్తుకెళ్లినవే. యీరెయిళ్లు గియిళ్లూ యావత్తు మనవేదంలో వున్నాయిష. మీది మాపరిశీలనైన బుద్ధి. మనకేసు గెలవడానికి మీరురాసిన సవబులు మాబాగున్నాయి.
గిరీ యింకాబాగుండును. రికార్డు పూర్తిగాలేదు. కొన్నికాగితాలు మీరే పారెశారో, మీవకీలు వుంచేసుకున్నాడో నాకు బోధపడకుండావుంది.
అగ్ని నేను పారెయ్యలేదండీ. నాకు యింగిలీషు తెలియకపోవడం చాలాచిక్కొచ్చింది.
గిరీ మీకే యింగ్లీషువొస్తె భాష్యం అయ్యంగార్లా అయిపోరా? యీమడి తడిపేసి, వున్నకాగితాలు యావత్తుకూ జాబితారాస్తాను, తమరువెళ్లండి.
అగ్ని మీరు సంసారం పనిపాట్లు యేం శ్రద్ధగాచేసుకుంటారు! మావాడికి మీలా ప్రయోజకత్వం అబ్బితే నాకొహడి అవసరంవుండదు. దిగేటప్పుడు నిమ్మళంగా సాయంచేసి మరీదింపండేం? కీడించి మేలించమన్నాడు (నిష్క్రమించును.)
వెంక (నిమ్మళంగా) నాన్నయింట్లో కెళ్లిపోయినాడు.
గిరీ నిమ్మళంగాదిగు.
వెంక (వురికి) బతికించారు. (వెళ్లిపోబోవును.)
గిరీ ఆగు ఆగు ఆ వొళ్లొపళ్లిలా పట్రా.
వెంక దొబ్బుతారా యేవిఁటి అన్నీని? అన్యాయం!
గిరీ "అన్యాయం పాపనాశనం" అన్నాడు. ఒక్క అన్యాయంతో పాపాలన్నీ పోతాయి. అన్నిపళ్లూ నువుమాత్రం తింటావాయేమిటి? తింటే స్టమకేక్‌, కడుపు నొప్పొస్తుంది. కడుపు నొప్పొస్తే మీ అమ్మ నోరు పగల్దీసి సోలడు ఆవఁదం వసగుండా గొంతుకలో పోస్తుంది.
వెంక నేనావఁదం తాగను.
గిరీ అలా అయితే పళ్లట్టే తినకు (యాతాం వొదిలి వెంకటేశం వొళ్లోని కాయలు యెంచుచుండును.)
వెంక (యేడుపుమొహంతో) పెద్దపళ్లన్నీ దొబ్బుతారా యేవిఁటి?
గిరీ

పెద్దవాళ్లకి పెద్దపళ్లూ, చిన్నవాళ్లకి చిన్నపళ్లూ. యింతసేపూ చెట్టెక్కి చిలకలా కొరికావు చాల్దా? (నాలుగుపెద్దపళ్లుతీసుకొని వెంకటేశం వీపుతట్టి) మైడియర్‌ బ్రదరిన్లా! యిహ నీయిష్టవొఁచ్చినట్టు చెట్లూ చావఁలూయెక్కు. యింగిలీషువాడు నేచర్‌ స్టడీ చెయ్యమన్నాడు. జామ చెట్టెక్కినప్పుడుమాత్రం పండూ, పరువుకాయా, పచ్చికాయా వీట్లభేదం బాగా స్టడిచేసి, పళ్లేకొయ్యి. అందులో నాలుగు గురుదక్షిణకింద నాకియ్యి. లేకుంటే కడుపుబ్బుతుంది. నువ్వొహమాటు చెట్టెక్కింతరవాత, వలేసి చూసినా మరి పరువుకాయ కనపడదు. "యేరకుమీ కసుగాయలు" అన్నాడు. రనెవే! - (వెంకటేశం దాటువేసి పారిపోవును.) పాచిక పారెటట్టే కనపడుతూంది. హా! యేమి సొగసు!

కం.
నదమా పొక్కిలి, జాంబూ । నదమా మైచాయ, కోకనదమా పదమా ।
పదమాజడ, నడుము వియత్‌ । పదమా, నూగారుగూఢ పదమాచెలికి\న్‌ ॥
(నిష్క్రమించును.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)