నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
కన్యాశుల్కము - చతుర్థాంకము.
౧-వ స్థలము. రామప్పంతులు యింటిసావిడి.
[రామప్పంతులు కుర్చీమీదకూర్చుని వుండగా మధురవాణి నిలబడి తమలపాకులుచుట్టి యిచ్చుచుండును.]
రామ నేనే చిన్నతనంలో యింగిలీషు చదివివుంటే జడ్జీలయదట ఫెళఫెళలాడించుదును. నాకు వాక్‌స్థానమందు బృహస్పతివున్నాడు. అందుచాతనే యింగిలీషురాక పోయినా నాప్రభ యిలా వెలుగుతూంది.
మధు మాటలునేర్చిన శునకాన్ని వేటకిపంపితే ఉసుకోమంటే ఉసుకోమందిట.
రామ నేనా శునకాన్ని?
మధు హాస్యానికన్న మాటల్లా నిజవఁనుకుంటారేవిఁ?
రామ హాస్యానికా అన్నావు?
మధు మరిమీతో హాస్యవాఁడకపోతే, వూరందరితోటీ హాస్యవాఁడ మన్నారాయేవిఁటి?
రామ అందరితో హాస్యవాఁడితే యరగవా?
మధు అంచేతనే కుక్కన్నా, పందన్నా, మిమ్ముల్నే అనాలిగాని, మరొకర్ని అనకూడదే? మిమ్మల్ని యేవఁనడానికైనా నాకుహక్కువుంది. యిక మీమాటకారితనం నాతో చెప్పేదేమిటి? మీమాటలకు భ్రమసేకదా మీ మాయలలోపడ్డాను?
రామ నాకు యింగిలీషేవొస్తే, దొరసాన్లు నావెనకాతల పరిగెత్తరా?
మధు మీ అందానికి మేము తెనుగువాళ్లము చాలమో? యింగిలీషంటే జ్ఞాపకవొఁచ్చింది. గిరీశంగారు మాట్లాడితే దొరలుమాట్లాడినట్టు వుంటుందిట.
రామ అటా, యిటా! నీకేంతెలుసును. వాడువొట్టి బొట్లేరుముక్కలు పేల్తాడు. ఆమాటలుగానీ కోర్టులో పేల్తే చెప్పుచ్చుకు కొడతారు.
మధు అదేమో మీకేతెలియాలి! గాని, గిరీశంగారు లుబ్ధావధాన్లుగారి తమ్ములటా? చెప్పా`రు కారు!
రామ నీమనుసువాడి మీదికి వెళుతూందేం? ఐతే నీకెందుకు, కాకపోతేనీకెందుకు?
మధు మతిలేని మాటా, సుతిలేనిపాటా, అని.
రామ నాకామతిలేదంటావు?
మధు మీకుమతిలేక పోవడవేఁం, నాకే.
రామ యెం చేత?
మధు నుదట్ను వ్రాయడం చేత.
రామ యేవఁని రాశుంది?
మధు విచారం వ్రాసివుంది.
రామ యెందుకు విచారం?
మధు గిరీశంగారు లుబ్ధావధాన్లుగారి తమ్ములైతే, పెళ్లికివొస్తారు; పెళ్లికివొస్తే, యేదైనాచిలిపిజట్టీ పెట్టి, మీమీద చెయిజేసుకుంటారేమో అని విచారం.
రామ అవును, బాగాజ్ఞాపకంచేశావు. గాని డబ్బు ఖర్చైపోతుందని అవుఁధాన్లు బంధువుల నెవళ్లనీ పిలవడు.
మధు గిరీశంగారు పిలవకపోయినా వస్తారు.
రామ నువుగానీ రమ్మన్నావా యేమిటి?
మధు మీకంటే నీతిలేదుగాని నాకులేదా?
రామ మరివాడొస్తాడని నీకేలాతెలిసింది?
మధు పెళ్లికూతురు అన్నకి చదువు చెప్పడానికి కుదురుకుని, వాళ్లింట పెళ్లి సప్లై అంతా ఆయనేచేస్తున్నారట. అంచేత రాకతీరరని తలస్తాను.
రామ వాడొస్తే యేమి సాధనం?
మధు నన్నా అడుగుతారు?
రామ పెళ్లేతప్పిపోతే?
మధు యలాతప్పుతుంది?
రామ తప్పిపోడానికి ఒకతంత్రం పన్నా`ను.
మధు అయితే, మధురంమాట చెల్లించారే?
రామ చెల్లించక రావఁప్ప యేచెరువునీళ్లు తాగుతాడు?
మధు యేదీముద్దు (ముద్దుపెట్టుకొనును.)
రామ గాని మధురం, కీడించిమేలిద్దాం. ఒకవేళ దెబ్బబే జోటు అయిపోయి వాడు రావడవేఁ తటస్థిస్తే యేవిఁటి సాధనం?
మధు ఆడదాన్ని, నన్నా అడుగుతారు?
రామ ఆడదాని బుద్ధిసూక్ష్మం. కోర్టువ్యవహారం అంటే చెప్పు. యెత్తుకి యెత్తు యింద్రజాలం లాయెత్తుతానూ? చెయిముట్టు సరసవఁంటేమాత్రం నాకు కరచరణాలు ఆడవు.
మధు పెళ్లినాలుగురోజులూ, తలుపేసుకుని యింట్లో కూచోండి.
రామ ఆడదానిబుద్ధి సూక్ష్మవఁని చెప్పా`నుకానూ? మామంచి ఆలోచన చెప్పా`వు.
మధు గాని, నాకొకభయం కలుగుతూంది. నిశిరాత్రివేళ పైగొళ్లెం బిగించి, కొంపకి అగ్గిపెడతాడేమో?
రామ చచ్చావేఁ! వాడు కొంపలు ముట్టించే కొరివి ఔను. మరి యేవిఁగతి?
మధు గతి చూపిస్తే యేమిటిమెప్పు?
రామ "నువ్వుసాక్షాత్తూ నన్ను కాపాడిన పరదేవతవి" అంటాను.
మధు (ముక్కుమీదవేలుంచి) అలాంటిమాట అనకూడదు. తప్పు!
రామ మంచిసలహా అంటూ చెప్పా`వంటే, నాలుగు కాసులిస్తాను.
మధు డబ్బడగలేదే? మెప్పడిగా`ను. నేను నా ప్రాణంతో సమానులైన మిమ్మల్ని కాపాడుకోవడం, యెవరికో ఉపకారం?
రామ మెచ్చియిస్తానన్నాతప్పేనా?
మధు తప్పుకాదో? వేశ్యకాగానే దయా దాక్షిణ్యాలు వుండవో?
రామ తప్పొచ్చింది. లెంపలు వాయించుకుంటాను, చెప్పు.
మధు పెళ్లివంటలకి పూటకూళ్లమ్మని కుదర్చండి.
రామ చబాష్‌! యేమి విలవైన సలహా చెప్పా`వు! యేదీ చిన్నముద్దు (ముద్దుపెట్టుకోబోయి, ఆగి) గాని గిరీశంగాడు నన్నూ దాన్నీకూడా కలియగట్టి తంతాడేమో?
మధు ఆభయం మీకక్కరలేదు. పూటకూళ్లమ్మ కనపడ్డదంటే, గిరీశంగారు పుంజాలు తెంపుకు పరిగెత్తుతారు, ఆమె నోరు మహాఁ చెడ్డది.
రామ అవును. నోరేకాదు, చెయ్యికూడా చెడ్డదే. దాం దెబ్బనీకేం తెలుసును. గాని, మా దొడ్డసలహా చెప్పా`వు. యేదీ ముద్దు. (ముద్దుపెట్టుకొనును.)
(ముద్దుబెట్టుకుంటుండగా, లుబ్ధావధాన్లు ఒక వుత్తరము చేతబట్టుకుని ప్రవేశించును.)
లుబ్ధా యేమిటీ అభావచేష్టలూ!
రామ (గతుక్కుమని తిరిగిచూసి) మావాఁ పడుచువాళ్లంగదా? అయినా, నా మధురవాణిని నేను నడివీధిలో ముద్దెట్టుకుంటే, నన్ను అనేవాడెవడు?
మధు నడి కుప్పమీదయెక్కి ముద్దుపెట్టుకోలేరో? పెంకితనానికి హద్దుండాలి. బావగారికి దండాలు, దయచెయ్యండి. (కుర్చీ తెచ్చి వేయును.)
రామ నాకు మావఁగారైతే, నీకు బావగారెలాగేవిఁటి?
మధు మాకులానికి అంతా బావలే. తమకు యలా మావఁలైనారో? (లుబ్ధావధాన్లుతో) కూచోరేం? యేమి హేతువోగాని బావగారు కోపంగా కనపడుతున్నారు. రేపు పెళ్లైనతరవాత అక్కగారిని, వీధితలుపు గడియవేసి మరీ ముద్దెట్టుగుంటారేమో చూస్తానుగదా? అయినా మీ అల్లుడుగారికి చిన్నతనం యింకా వొదిలిందికాదు.
రామ పైలా పచ్చీసీలో, చిన్నతనంగాక పెద్దతనం యలా వొస్తుంది? యేం, మావాఁ! కోపవాఁ?
లుబ్ధా నాకు పెళ్లీవొద్దు పెడాకులూవొద్దు.
రామ (మధురవాణి చెవిలో) చూశావా మధురం, నాయంత్రం అప్పుడే పారింది. (పైకి లుబ్ధావధాన్లుతో) అదేం, అలా అంటున్నారు? నిశ్చయం అయినతరవాత గునిసి యేం లాభం?
లుబ్ధా నీ సొమ్మేం పోయింది? గునియడం గినియడంకాదు, నాకీ పెళ్లి అక్ఖర్లేదు.
మధు (రామప్పంతులు చెవిలో) యేమిటా వుత్తరం?
రామ (మధురవాణి చెవిలో) అగ్నిహోత్రావుధాన్లు పేరుపెట్టి నేనే బనాయించాను.
మధు (రామప్పంతులు చెవిలో) యేవఁని?
రామ (మధురవాణి చెవిలో) నువ్వు ముసలివాడివిగనక నీ సంబంధం మాకు వొద్దని.
మధు చిత్రం! చెప్పేస్తాను.
రామ (మధురవాణి చెవిలో) నీకు మతిపోయిందా యేమిటి? పెళ్లి తప్పించమని నువ్వే నాప్రాణాలు కొరికితే, యీ యెత్తు యెత్తాను. నోరుమూసుకో.
మధు (లుబ్ధావధాన్లు చెవిలో) యీ సంబంధం మీకు కట్టిపెట్టాలని పంతులు చూస్తున్నారు. వొప్పుకోకండి.
రామ (మధురవాణితో) యేమీ బేహద్బీ! (లుబ్ధావధాన్లుతో) స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః అన్నాడు. దానిమాటలు నమ్మకండి. కల్పనకి యింతమనిషిలేదు.
లుబ్ధా (చేతిలోని వుత్తరమును ఆడిస్తూ) యీ కుట్రంతా నీదే.
రామ (తీక్షణంగా మధురవాణి వైపుచూసి, లుబ్ధావధాన్లుతో) కోపం కోపంలా వుండాలిగాని, యేకవచన ప్ర`యోగం కూడదు.
లుబ్ధా యిదంతా మీకల్పనే. నాకొంప ముంచడానికి తలపెట్టా`రు. చదవండి.
రామ (వుత్తరం అందుకోక కుర్చీ వెనక్కి తీసుకుని) ఆవుత్తరం సంగతి నాకేం తెలుసును?
లుబ్ధా చేసినవాడివి, నీకు తెలియకపోతే, యెవరికి తెలుస్తుంది?
రామ అదుగో మళ్లీ యేకవచన ప్ర`యోగం! మెత్తగా మాట్లాడుతున్నానని కాబోలు అనాడీ చేస్తున్నారు? వుత్తరంగిత్తరంనేను కల్పించానని, మళ్లీ అన్నారంటే కథ చాలా దూరం వెళుతుంది. ఆ సంగతిమట్టుకు కాని వుండండి. రామప్పంతులు తడాఖా అంటే యేవఁనుకున్నారో?
లుబ్ధా నువ్వు-
రామ అదుగో మళ్లీ.
లుబ్ధా మీ కల్పనైతేనేం, మరొహరి కల్పనైతేనేం, బుద్ధి పొరపాటునాది. మధ్య వెధవలతో నాకేంపని? వెంటనే బయల్దేరిపోయి, ఆ అగ్నిహోత్రావధాన్లునే అడుగుతాను.
రామ మాటలు మాజోరుగా వొస్తున్నాయి. జాగ్రత (లుబ్ధావధాన్లు వెళ్లును) నన్నేనా వెధవలు అంటున్నాడు?
మధు నన్నుకూడా కలుపుకోవాలని వుందా యేవిఁటండి?
రామ నన్నుమట్టుకు వెధవని కింద కట్టావూ?
మధు నేవుండగా వెధవలు మీరెలా అవుతారు?
రామ నన్ను సప్త వెధవనిచేశావు. మరి యింకా తరవాయి యేం వుంచావు?
మధు అదేవిఁటి ఆమాటలు?
రామ ఆ వుత్తరం నేను బనాయించానని, ఆవెధవతో యెందుకు చెప్పా`వు?
మధు మీతోడు, నేను చెప్పలేదే?
రామ మరి నేను బనాయించానని, వాడికెలా తెలిసింది?
మధు యెందుకీ ఆందోళన?
రామ మరి, ఆవెధవ ఆవుత్తరం తీసికెళ్లి అగ్నిహోత్రావధాన్లుకి చూపిస్తే, నామీద వాడు వెంటనే పోర్జరీకేసు బనాయిస్తాడే? పీక తెగిపోతుంది, యేవిఁటి సాధనం?
మధు యంత్రం యెదురు దిరిగిందో? ఐతే చక్రం అడ్డువేస్తాను. (మధురవాణి తొందరగా వీధిలోకి వెళ్లును.)
రామ యిదెక్కడికి పారిపోతూంది? యిదే చెప్పేశింది. దొంగపని చేసినప్పుడు రెండోవారితో చెప్పకూడదు. వెధవని చెవులు నులుపుకుంటాను. పరిగెత్తివెళ్లి చేతులో కాగితం నులుపుకొత్తునా? - గాడిదకొడుకు కరిస్తే? పోయి మీనాక్షి కాళ్లుపట్టుకుంటాను.
(మధురవాణి వకచేతితో వుత్తరము, వకచేతితో లుబ్ధావధాన్లు చెయ్యిపట్టుకుని ప్రవేశించును.)
మధు (రామప్పంతులుతో) చాలు, చాలు, మీ ప్రయోజకత్వం. బావగారికి అన్నా, తమ్ముడా, కొడుకా, కొమ్మా? మిమ్మలిని ఆప్తులని నమ్ముకుని, సలహాకివస్తే, ఆలోచనా సాలోచనా చెప్పక, ఏకవచనం, బహువచనం, అని కాష్టవాదం పెట్టా`రు. బావా! కుర్చీమీదకూచోండి. (కుర్చీమీదకూచోబెట్టి) (రామప్పంతులుతో) యీవుత్తరం యేవిఁటో నింపాదిగా చదివి చూసుకోండి (వుత్తరం రామప్పంతులు చేతికి యిచ్చును.)
రామ (వుత్తరం అందుకుని తనలో) బతికా`న్రా దేవుఁడా. (చూచుకుని) అరే నావుత్తరవేఁకాదే యిది. నానీడచూసి నేనే బెదిరాను (పైకి) మావాఁ! వొస్తూనే తిట్లతో ఆరంభిస్తే యెంతటి వాడికైనా కొంచం కోపం వొస్తుంది. నెమ్మదిగానూ, మర్యాదగానూ, నన్నొచ్చియేం సహాయం చెయమంటే అది చెయనూ?
లుబ్ధా మరైతే యీ పటాటోపం వొద్దని రాయండి. అతగాడికి పటాటోపం కావలిస్తే ఆఖర్చంతా అతగాడే పెట్టుకోవాలి.
మధు (లుబ్ధావధాన్లు, జుత్తుముడివిప్పి దులిపి) యేం ధూళి! సంరక్షణ చేసేవాళ్లు లేకపోబట్టిగదా? (గూటిలోనుంచి వాసననూనె దువ్వెనాతెచ్చి తలదువ్వుచుండును.)
రామ (ఉత్తరం తిప్పి కొనచూసి చదువును.) "శేవకుడు తమ్ములు గిరీశం"- వీడా!
మధు పైకి చదవండి.
రామ నీగిరీశం, అనగానే పైకి చదవాలేం?
లుబ్ధా "నీ గిరీశం" అన్నారేం?
రామ అది వేరేకథ.
లుబ్ధా పైకి చదవండి.
రామ

(చదువును)

"శేవకుడు, తమ అత్యంత ప్రియసోదరులు గిరీశం అనేక నమస్కారములు చేసీ చాయంగల విన్నపములు, త॥ యీ నాటికి వృద్ధాప్యంలోనయినా మీరు తిరిగీ వివాహం చేసుకుని ఒక యింటివారు కావడమునకు నిశ్చయించితిరన్న మాటవిని యమందానందకందళిత హృదయారవిందుడ నైతిని."
లుబ్ధా వెధవ, వృద్ధాప్యవఁంటా`డూ? మొన్నగాక మొన్ననేగదా యాభైదాటా`యి.
మధు (దువ్వెన మొలనుపెట్టి, లుబ్ధావధాన్లు జుత్తుముడివేసి) సంరక్షణలేక యిలా వున్నారుగాని, యవరు మిమ్మల్ని ముసలివాళ్లనేవారు?
రామ

(చదువును)

"మీకు కాబోవు భార్య, నాప్రియశిష్యుండగు వెంకటేశ్వర్లు చెలియలగుటంజేసి నాకు బ్రహ్మానందమైనది. నేను అగ్నిహోత్రావధానులు వారి యింటనే యుండి పెళ్లిపనులు చేయించుచున్నాడను. వారు నన్ను పుత్రప్రాయముగా నాదరించుచున్నారు. బహు దొడ్డవారేగాని చంద్రునకు కళంకమున్నటుల వారికి కించిత్తు ద్రవ్యాశా, కించిత్తు ప్రథమకోపముం గలవు."

వ్యాకరణం వెలిగిస్తున్నాడయ్యా గుంటడూ!

"షరా- ఆకోపం వొచ్చినప్పుడు మాత్రం యెదట పడకుండా దాగుంటే యెముకలు విరగవు. ప్రాణం బచాయిస్తుంది. మరేమీ ఫర్వావుండదు- ద్రవ్యాశ అనగా, అది వారికిగాని మీకుగాని ఉపచరించేదికాదు. మీ వూరివారెవరోగాని ఒక తుంటరి, మీరు విశేషధనవంతులనియు, పెళ్లి దేవదుందుభులు మ్రోయునటుల చేతురనియు, వర్తమానము చేయుటను, యేబది బండ్లమీద యీ వూరివారి నందరిని తర్లించుకు రానైయున్నారు. ఇంతియకాక, దివాంజీ సాహేబు వారినడిగి, ఒక కుంజరంబునూ మూడు లొట్టియలనూ, యేనుగుఱ్ఱంబులంగూడ తేనై యున్నారు. బంగారపుటడ్డలపల్లకీగూడ దెచ్చెదరు."

"షరా- దానిమీద సవారీ ఐ, ఆలండౌలత్తులతో వూరేగి, మీరు పెళ్లిచేసుకోవడం నాకు కన్నులపండువేగాని, యిదంతా వృధా వ్రయంగదా. అని నాబోటి ఆప్తులు విచారిస్తున్నారు. యెద్దుపుండు కాకికి రుచి. రామప్పంతులు సొమ్మేంబోయింది?"

వెధవ! నావూసెందుకోయి వీడికి?

"యిందులో ఒక పరమరహస్యం. అది యెద్దియనిన, యీ రామప్పంతులు చిక్కులకు, జాకాల్‌; తెలివికి, బిగ్‌ యాస్‌."

యిదేవిఁటోయి, యీ బొట్లేరు యింగిలీషు!

"అనగా"

వ్యాఖ్యానంకూడా వెలిగిస్తున్నాడయా!

"జాకాల్‌, అనేది, గుంటనక్క"

పింజారీ వెధవ!

"బిగ్‌ యాస్‌, అనగా, పెద్ద-"

వీడి సిగాదరగా! యేం వీడిపోయీకాలం! వీడిమీద తక్షణం డామేజి దావా పడేస్తాను.

(మధురవాణికి నవ్వొచ్చి, ఆపుకోజాలక, విరగబడి నవ్వును.)

యెందుకలా నవ్వుతావు? నీ మొగుడు నన్ను తిడుతున్నాడనా ఆనందం?

మధు (నవ్వుచేత మాట తెమలక, కొంతసేపటికి) కాదు-కాదు-మీతోడు-లొటి-
రామ నాతోడేవిఁటి! నేను చస్తే నీకు ఆనందవేఁ!
మధు (ముక్కుమీద వేలువుంచి, రామప్పంతులు దగ్గరకువెళ్లి, సిరస్సు కౌగలించుకొని, ముద్దెట్టుకొనును) యేమి దుష్టుమాటా!
రామ మరెందుకు నవ్వుతావ్‌?
మధు లొటి-లొటి-లొటి-
రామ యేవిఁటా "లొటి"?
మధు లొటి-పిట-
రామ అవును, లొటిపిట, అయితే?
మధు (సమాళించుకుని) యెందుకో?
రామ యెందుకో నాకేంతెలుసును?
లుబ్ధా ఉత్తరం వల్ల మీరే తెమ్మన్నట్టు అగుపడుతూందే?
రామ నేనా? నేనా? నాకెందుకూ లొటిపిట?
మధు (ఉప్పెనగా తిరిగీ నవ్వుతూ) యెక్కడానికీ.
రామ నేనా యెక్కడం?
లుబ్ధా యెందుకు కూడదూ? మీరొక లొటి-పిట-బావగారొక లొటిపిట- పో-పో-పొలిశెట్టి-పెళ్లి సప్లయిదారుడుగనక, అతడో లొటిపిట-యెక్కి పొలాలంట-వూరేగండి-వెన్నుకుప్పెక్కి-ఆ వైభవం-కళ్లారా-చూస్తాం- (మిక్కిలిగా నవ్వును నవ్వును సమాళించుకుని) బావగారూ, క్షమించండి- ఆదుష్టువ్రాతకి నవ్వా`ను- మరేంగాదు.
రామ దుష్టంటే దుష్టా! గాడిద`!
లుబ్ధా మీరొహ, పెద్దగాడిద`నికూడా తెమ్మన్నారని కాబోలు, రాశాడండీ.
రామ లేదు, లేదు, గాడిదెమాట వుత్తరంలో యక్కడా లేదు.
లుబ్ధా వుంది. నేను చదివానండీ. గాడిద`నెందుకు తెమ్మన్నావయ్యా నానెత్తి మీదికీ?
రామ నీకు మతిపోతూందా యేమిటి? గాడిదెమాట లేదంటూంటేనే? (మధురవాణి తిరిగీ నవ్వుచుండును) నీక్కూడా మతిపోయిందీ? యెందుకానవ్వు? నన్ను చూశా? అవుధాన్లును చూశా?
మధు యెందుకు-ఆ-అనుమానం?-సామెత-వుంది.
రామ యేమిటా సామిత గీమితాను?
మధు గాడిద` అందిట-పాటకి నేను-అందానికి-మా అప్పా-అందిట-
రామ అంటే?
మధు పెళ్లికి గాడిద`-లొటిపిటామాట-యిన్నాళ్లకి-మళ్లీ విన్నానుగదా అని.
రామ వింటే?
మధు నవ్వొచ్చింది. మీరు కూడా నవ్వరాదూ? యెందుకీ దెబ్బలాట?
రామ వీడిమీద డా`మేజి దావా వెంటనే పడేస్తాను.
మధు (లుబ్ధావధాన్లుతో) బావా, యెందుకు మా పంతులుగారిమీద అన్యాయంగా అనుమానం పడతారు? ఆయన నిజంగా మిమ్మల్ని అన్నగార్లా భావించుకుంటున్నారు. గిరీశంగారు పంతులుమీద వ్రాయడానికి కారణాంతరం వున్నది. మీతో చెప్పవలసిన సంగతికాదు గాని, మీ ఉభయులకూ స్నేహం చెడడానికి సిద్ధంగా వున్నప్పుడు చెప్పకతీరదు. మీ గిరీశంగారు నాకు కొన్నాళ్లు యింగ్లీషు చెప్పేవారు. కొద్ది రోజులు నన్ను వుంచుకున్నారు. మా పంతులుగారు ఆయన దగ్గిరనుంచి నన్ను తీసుకువెళ్లిపోయి వచ్చినారనే దుఃఖంచేత లేనిపోని మాటలు కల్పించి "నక్కాగిక్కా" అని వ్రాశారుగాని, ఆ బొల్లిమాటలు నమ్మకండి.
రామ "నక్కా గిక్కా" వొట్టినే పోతుందనుకున్నావా యేమిటి? డామేజి దావా పడ్డతరవాత దాని సంగతి తెలుస్తుంది.
మధు బావా, మరొకమాట ఆలోచించండీ. పంతులకేం లాభం యేనుగులూ, లొటిపిటలూ, గాడిదలూ- (నవ్వును.)
రామ మనిషివికావా యేమిటి? గాడిదెమాట లేదంటూంటేనే?
మధు పోనియ్యండి - మీకెందుకు కోపం! గాడిద`లు లేకపోతే కడంవ్వే ఆయెను. యివన్నీ మీ యింటిమీదపడి తింటే మా పంతులుగారికి యేంలాభం? చెప్పండీ. ఒకవేళ రాతబుబేరం జరుగుతుంది గనక పోలిశెట్టికి లాభించవచ్చును.
లుబ్ధా బాగాచెప్పావు-పోలిశెట్టి చేసినపనే!
రామ చవగ్గా చేస్తాడని ఖర్చువెచ్చం కోవఁటాడిమీద పెట్టా`వు. అనుభవించు.
మధు యిప్పుడు మించిపోయినదేమి? పెళ్లికూతుర్ని పంపిస్తే పదిరూపాయలు ఖర్చుతో యిక్కడ ముడిపెట్టేస్తాం. మీరెవరూ రావద్దని, మీ మావఁగారిపేర వుత్తరం వ్రాయండి.
లుబ్ధా మా ప్ర`శస్తమైన ఆలోచన చెప్పా`వు. మావఁగారూ, మధురం మా బుద్ధిమంతురాలు.
రామ అదుగో! "మధురం గిధురం" అని మీరు అనకూడదు. "మధురవాణి" అనాలి.
లుబ్ధా పొరపాటు-- గాని తీరామోసి వాళ్లు పెళ్లికూతుర్ని ఒక్కర్తెనీ పంపించేస్తే?
మధు మరేం? మీతీపు దిగదీసిందీ? పెళ్లిచేసుకొండి.
లుబ్ధా నా ప్రాణంపోతే యీ సంబంధం చేసుకోను. ఆవుత్తరం కొసాకూ చదివితే అభావచేష్టలు మీకే బోధపడతాయి.
మధు చదవడం మానేసి యేమిటి ఆలోచిస్తున్నారు?
రామ గిరీశం గాడిమీద పరుపునష్టానికి డామేజీదావా తేకమాన్ను-వాడి మొహం లాగేవుంది వుత్తరం. చదివేదేవిఁటి.
లుబ్ధా మావెధవ నాపరువుమాత్రం యేమైనా వుంచాడనా? అయినా తరవాయి చదవండీ.
రామ

(చదువును)

"తాజాకలం. చిన్నది బహులక్షణంగా వుంటుంది. గాని కొంచం పెయ్యనాకుడుమాత్రంకద్దు. అద్దానిని మనవారు వైధవ్యహేతువ అండ్రు. యిదివట్టి సూప-సూపర్‌-స్టి-షన్‌-అనగా, తెలివితక్కువ నమ్మకం. మనవంటి ప్రాజ్ఞులు లెక్కించవలసినదికాదు. షరా-దీనికి వక చిన్నబైరాగీ చిటికీవున్నది. చిమ్మిటతో పెయ్య నాకుడు వెండ్రుకలూడబీకి, ఒక పౌ-పౌడర్‌-అనగా, గుండ కద్దు; ఆగుండ ప్రామినచో మరల పెయ్యనాకుడు పుట్టనేరదు. ఈ లోగా దైవాత్తూ వైధవ్యంబే సంప్రాప్తించినచో, పదేపదే క్షౌరం బౌనుగావున పెయ్యనాకుడు బాధించనేరదు. రెండవ నెంబరు షరా-ఒకవేళ వైధవ్యం తటస్థించినా, మావదెనగారు జుత్తు పెంచుకునేయడల, మీరేం జెయ్యగలరు; నేనేం జెయ్యగలను?"

మధు చాల్చాలు; యీపాటి చాలించండి. గిరీశంగారు యేంతుంటరి?
రామ

యిప్పుడైనా వాడి నైజం నీకు బోధపడ్డదా?

(చదువును)

"మూడవషరా-యీరోజుల్లో స్త్రీ పునర్వివాహం గడబిడ లావుగానున్నది. తమకు విశదమే. మీరు స్వర్గంబునకుంబోయి ఇంద్రభోగం బనుభవించుచుండ నామెకు పునర్వివాహము చేసికొన బుద్ధి పొడమ వచ్చును. అదిమాత్రం నేను ఆపజాలనని స్పష్టముగా తెలియునది. ఏలననిన? వద్దని మందళించుటకు ఎదట పడితినో, 'మీయన్న స్వర్గంబున రంభతో పరమానందంబునొందుచు నున్నారుకదా, నా గతేమి' యని యడిగినచో నేమి యుత్తర మీయువాడ?"

మధు మరి చాలించండి.
రామ

నీయిష్టం వొచ్చినప్పుడు చదివి, నీయిష్టం వొచ్చినప్పుడు మానేస్తాననుకున్నావా?

(చదువును)

"నాల్గవషరా-కొదువ అన్ని హంశములూ బహు బాగావున్నవి. తప్పకుండా యీ సంబంధం మీరు చేసుకోవలిసిందే. మీ అత్తగారు సాక్షాత్తూ అరుంధతివంటివారు. మనలో మనమాట, ఆమెకు యీ సంబంధం యెంతమాత్రమూ యిష్టము లేదు. పుస్తెకట్టేసమయమందు, మీయింటి నూతులోపడి ప్రాణత్యాగం చేసుకుంటానని, యిరుగు పొరుగమ్మలతో అంటున్నారు, గాని ఫర్వాలేదు. ఆనాలుగు గడియలూ, కాళ్లూ చేతులూ కట్టేదాం. మూడు ముళ్లూ పడ్డతరవాత నూతులోపడితే పడనియ్యండి. మనసొమ్మేం బోయింది? పోలీసువాళ్ల చిక్కులేకుండామాత్రం, వాళ్లకేమైనా పారేసి వాళ్లని కట్టుకోవలసివస్తుంది. యీ సంగతులు యావత్తూ మీ మేలుకోరి వ్రాసితిని. యిక్కడ వారికి తెలియరాదు. మరిచిపోయినాను, పిల్లజాతకం అత్యుత్కృష్టంగా వుందట. ఆ బనాయింపు కూడా రామ-"

మధు రామ?
రామ అది ఆడవాళ్లు వినవలసిన మాటకాదు.
లుబ్ధా అది కూడా మీరే బనాయించారంటా డేవిఁటండీ?
రామ వాడి నోటికి సుద్ధీ, బద్ధంవుందీ? డామేజీ పడితేగాని కట్టదు.
లుబ్ధా కొంచం అయినా నిజం వుండకపోతుందా, అని నాభయం. అత్తగారికి యిష్టంలేదని పోలిశెట్టి కూడా చెప్పా`డు. యీ సంబంధానికి వెయివేలదణ్ణాలు; నా కొద్దుబాబూ.
మధు బాగా అన్నారు. మీ సంబంధం మాకు యెంతమాత్రంవొద్దని, మీ మావఁగారి పేర వ్రాయండి. కాకితం కలంతేనా?
లుబ్ధా మావాఁ! మరి ముందూ వెనకా ఆలోచించక వెంటనే వుత్తరం రాసి పెట్టండీ. (నిలబడి మధురవాణి చెవిలో రహస్యము మాట్లాడును; మధురవాణి లుబ్ధావధాన్లు చెవిలో మాట్లాడును.)
రామ మొహంమీద మొహంపెట్టి, యేవిఁటా గుసగుసలు?
పైనుంచి
పోస్టుజవాను
"లుబ్ధావుధాన్లుగారున్నారండీ. వుత్తరంవొచ్చింది"
(మధురవాణి పైకివెళ్లి వుత్తరముతెచ్చి లుబ్ధావధాన్లుచేతికి యిచ్చును. లుబ్ధావధాన్లు రామప్పంతులు చేతికి యిచ్చును.)
లుబ్ధా సులోచనాలు తేలేదు. మీరే చదవండి.
రామ (తనలో చదువుతూ) మరేవీఁ! చిక్కే వొదిలిపోయింది. మీ మావఁగారి దగ్గర్నించి.
లుబ్ధా యేవఁని? యేనుగులూ, లొటిపిటలూ తా`నంటాడా యేవిఁటండి?
రామ మీ సంబంధవేఁ అక్కర్లేదట.
లుబ్ధా యేవిఁటీ? యెంచాతనో? వాడికా అక్కర్లేదు? నాకా అక్కర్లేదు? తన పరువుకి నేంతగా`ను కానో?
మధు నిమిషంకిందట పెళ్లి వొద్దన్నారే? యిప్పుడు పెళ్లి తప్పిపోయిందని కోపవాఁ?
లుబ్ధా యింకా యేం కూస్తాడో చెప్పండీ.
రామ మీరు పీసిరి గొట్లని యెవరో చెప్పా`రట.
లుబ్ధా నేనా పీసిరి గొట్టుని? వొక్కపాటున పద్దెనిమిది వొందలు యే పీసిరి గొట్టు పోస్తాడు? యింత సొమ్ము యెన్నడైనా, ఒక్కసారి, అగ్నిహోత్రావుధాన్లు కళ్లతో చూశాడూ? సంసారం పొక్తుగా చేసుకుంటే పీసిరి గొట్టా? వాడిసొమ్ము వాడినెత్తిన కొట్టినతరవాత, నేనెలాంటివాణ్ణి అయితే వాడికేం కావాలి?
మధు యెలాంటివాళ్లేం? బంగారంలావున్నారు?
రామ మీరు ముసలివాళ్లనీ, మీకు క్షయరోగం వుందనీ కూడా, యెవరో చెప్పా`రట.
లుబ్ధా నేను ముసలివాణ్ణా వీడి సిగతరగా! యాబైయేళ్లకే ముసలిటండీ? కొంచం దగ్గు వుండడవేఁ కాగట్టండి (దగ్గును) నిలివెడు ధనంపోసి పిల్లని కొనుక్కున్న తరవాత, మరిదాని ఘోషా, నా ఘోషా వాడి కెందుకయ్యా? డబ్బుచ్చుకున్న తరవాత చచ్చిన శవానికైనా కట్టకతీరదు. మాటాడ్రేం?
రామ అవును; నిజవేఁ. మీరు ముసలివాళ్లైతేమాత్రం?
లుబ్ధా అదుగో. 'ఐతేమాత్రం' అంటారేవిఁటి? నువ్వేపెట్టా`వు కాబోలు యీ పెంటంతాను.
రామ అన్ని పెంటలు పెట్టడానికీ, మీ తమ్ముడు గిరీశం అక్కడే వున్నాడుకదూ?
లుబ్ధా వీడు, అక్కడెలా పోగయినాడయ్యా నాకు శనిలాగ?
మధు ఏమి! యీ మగవారి చిత్రం! యింతసేపూ పెళ్లి వొద్దని వగిస్తిరి; యిప్పుడు పెళ్లి తేలిపోయిందని వగుస్తున్నారు. నిజంగా మీకు పెళ్లా`డాలని వుందండీ?
లుబ్ధా వుంటే వుంది, లేకపోతే లేదు. గాని యీ దుర్భాషలు నేను పడి వూరుకుంటానా?
మధు మరేం జేస్తారు?
రామ యేంజేస్తారా? డామేజీకి దావా తెస్తారు.
లుబ్ధా దావావొద్దు, నీ పుణ్యం వుంటుంది. వూరుకో బాబూ.
రామ కాకపోతే, యింతకన్నా చవకైనదీ, సాంప్రదాయవైఁనదీ, సంబంధం కుదిర్చి, చేసుకున్నావఁంటే, అగ్నిహోత్రావుధాన్లుని చెప్పుచ్చుకు కొట్టినట్టు వుంటుంది.
లుబ్ధా చవగ్గాకుదరడవెఁలాగ?
మధు నామాటవిని పెళ్లిమానేసి వూరుకోండి.
లుబ్ధా యేం? ముసలివాణ్ణని నీకూ తోచిందా? యేవిఁటి?
మధు మీరా ముసలివాళ్లు? యవరా అన్నవారు?
లుబ్ధా నీకున్నబుద్ధి ఆ అగ్నిహోత్రావుధాన్లకి వుంటే బాగుండును.
మధు ఓ పన్ను కదిలిందా? కన్నుకు దృష్టి తగ్గిందా? చూడండీ, మీ దండలు కమ్మెచ్చులు తీసినట్టు యలా వున్నాయో?
రామ (తనదండలు చూసుకొని) మావఁ పెరట్లో గొప్పు తవ్వడంనుంచి దండలు మోటుగా వున్నాయి; గాని నాదండలు సన్నవైఁనా ఉక్కు ఖడ్డీలు.
మధు (తన చీర కొంగుతో లుబ్ధావధాన్లు ఛాతీకొలిచి) యెంతఛాతీ!
రామ యేమిటీ వాళకం?
మధు వుత్తరం, మీలో మీరు చదువుకుంటారేం? పైకి చదవండి.
రామ నువ్వు నన్ను ఆజ్ఞాపించే పాటిదానివా? మేం చదువుకుంటాం. యివి ఆడవాళ్లు వినవలిసినమాటలుకావు. నువ్వు అవతలకి వెళ్లు.
మధు నేను కదలను.
రామ అమాంతంగా యెత్తుకెళ్లి వెనకింట్లోకుదేస్తాను.
మధు (కుర్చీ వెనకను నిలబడి లుబ్ధావధాన్లు దండలు చేతులతో గట్టిగా పట్టుకుని) మార్కండేయులు శివుణ్ణి చుట్టుకున్నట్లు, బావగార్ని చుట్టుకుంటాను. యెలా లాక్కు వెళాతారో చూస్తాను.
లుబ్ధా (తనలో) యేమి మృదువూ చేతులు! తల, తల దగ్గిర చేరిస్తే, యేమి ఘుమఘుమా! (పైకి) "బాలాదపి సుభాషితం" అన్నాడు మావఁగారూ - మధురవాణ్ణి వుణ్ణియ్యండి. మంచి బుద్ధిమంతురాలు. నిజం కనిపెడుతుంది.
రామ అయితే మరివిను (చదువును) "మీకొమార్తె ప్రవర్తన బాగావుండక పోవడంచాత మిమ్మల్ని వెలేశారని లోకంలో వార్త గట్టిగావున్నది."
లుబ్ధా (కొంతతడవు వూరుకుని) నువ్వే నాకొంప తీశావు.
మధు పంతులేనా?
లుబ్ధా ఒహర్ననవలిసిన పనేవుఁంది?
మధు (కొంతతడవు వూరుకొని) నేను మీ యింటికి వెళ్లిపో యొస్తాను. రండి. పెళ్లీగిళ్లీ మానెయ్యండి. మీకు పెళ్లాంకన్న యెక్కువగా సంరక్షణ చేస్తాను.
లుబ్ధా (ఆనందం కనపరుస్తూ) బీదవాణ్ణి నేను డబ్బివ్వలేనే? నీలాంటి విలవైన వస్తువను పంతులుగారే భరించాలి.
మధు నాకు డబ్బక్కర్లేదు. తిండి పెడతారా?
లుబ్ధా ఆహా! అందుకులోపవాఁ!
మధు ఐతే పదండి. మరి యీ పంతులుగారిమాయ మాటలు వినక పెళ్లి మానేసి, సుఖంగా యింట్లో కూచుందురుగాని.
రామ (మధురవాణివైపు తీక్షణముగా చూసి) నువ్వు భోజనం చెయ్యలేదన్నమాట జ్ఞాపకంవుందా? వెళ్లు.
మధు మీచర్య చూస్తేనే కడుపునిండుతుంది. (ఛఱ్ఱుమని యింటిలోనికి పోవును.)
లుబ్ధా యీ మధురవాణి. విన్నారా! మావాఁ! వేశ్య అయినా! చాలా తెలిసినమనిషి. మన సంసార్లకి దానికివున్నబుద్ధివుంటే బతికిపోదుం.
రామ అవుఁను. బుద్ధిమంతురాలే; గాని వొళ్లెరగని కోపం. యేవైఁనా వెఱ్ఱి అనుమానం పుట్టితే, తనూపై కానదు. చూశారా మావాఁ, మీలాంటి శిష్ఠులు సానివాళ్ల శరీరం తాకకూడదు. అది చిన్నతనంచేత మొఖంమీద మొఖం పెడితే "పిల్లా, యడంగా నిలబడి మాట్లాడు" అని చెప్పాలి. ఒక్కటే వొచ్చింది దీనికి దుర్గుణం. పరాయివాళ్లతో మాట్లాడితేగాని దానికితోచదు. పట్ణవాసంలో వుండడంనించి ఆదురలవాటు అబ్బింది.
లుబ్ధా చిన్నతనంగదా! మధురవాణి నాపిల్లలాంటిది. ముట్టుగుంటే అదోతప్పుగా భావించకండి.
రామ నీ సొమ్మేం బోయింది! అదికాదు, చూశారా మావాఁ. వుంచుకున్న ముండాకొడుకు యదట, మరో మొగాణ్ణి పట్టుకుని "వీడి దండలు కమ్మెచ్చులు తీసినట్టున్నాయి. వీడి ఛాతీ భారీగావుంది"- అని చెవిలో నోరుపెట్టి గుసగుసలాడుతూంటే అగ్గెత్తుకొస్తుందారాదా?
లుబ్ధా పొరపాటు. లెంపలు వాయించుకుంటాను. క్షమించండి.
రామ మీలెంపలు వాయించుకుంటే కార్యంలేదు. దాని లెంపలు వాయించాలి. మీమీద దానికి కొంచెం యిష్టం వున్నట్టుంది. గట్టిగా బుద్ధిచెప్పండి.
లుబ్ధా నామీద యిష్టవేఁవిఁటి మావాఁ! యక్కడైనా కద్దా?
రామ మీయింటికి వెళ్లిపోయొస్తానంటూందే? మరి తీసికెళ్లు.
(పైమాటలాడుచుండగా మధురవాణి పట్టుచీరకట్టుకుని ప్రవేశించి.)
మధు అలాగే తీసికెళ్తారు మీకు భారవైఁతేను. ఆ మహానుభావుడికి చాకిరీచేస్తే పరంఐనా వుంటుంది.
లుబ్ధా మామగారు హాస్యానికంటున్నారుగాని, నిన్నొదుల్తారా? నేతగను, తగను.
రామ అలాగడ్డి పెట్టండి!
మధు ఆయన హాస్యానికి అంటున్నా, నేను నిజానికే అంటున్నాను. గడ్డి గాడిద`లు తింటాయి; మనుష్యులు తినరు.
రామ అదుగో మళ్లీ గాడిదలంటుంది! (మధురవాణి నవ్వుదాచుటకు ముఖం తిప్పికొని, లోగుమ్మముదాటి, విరగబడినవ్వును.)
లుబ్ధా మధురవాణికి మీదగ్గిర భయంభక్తీకూడాకద్దు.
రామ వుంది. కోపవొఁస్తే గడ్డి పరకంతఖాతరీ చెయ్యదు. పరాయిమనిషి వున్నాడని అయినా కానదు.
లుబ్ధా పెళ్లిప్ర`యత్నం యిక మానుకోవడవేఁ ఉత్తమం, అని తోస్తుంది. యేవిఁటి తమశలవు?
రామ నాశలవేం యెడిసింది! పెళ్లిచేసుకోవొద్దని మధురవాణి శలవైంది. దాని బుద్ధికి ఆనందించి అలా నడుచుకుంటున్నారు. స్త్రీబుద్ధిః ప్రళయాంతకః అని చెప్పనే చెప్పా`ను.
లుబ్ధా మీరు ఆప్తులనేగదా మీ సలహాకి వొచ్చా`ను. మధురవాణి చెప్పిందనా పెళ్లివద్దంటున్నాను. తప్పినపెళ్లి తప్పిపోయింది. ఖర్చులుకూడొచ్చాయి గదా అని సంతోషిస్తున్నాను.
రామ రెడ్డొచ్చాడు మొదలాడన్నాడట. సాధక బాధకాలు యెన్ని పర్యాయములు చెప్పినా అవి అన్ని పూర్వపక్షంఐ, ముక్తాయింపు మళ్లీ డబ్బు ఖర్చుమీదికి వొస్తూవుంటుంది. పెళ్లి చేసుకుని కడుపు ఫలిస్తే మీ యిల్లు పదియిళ్లౌతుంది. పెళ్లి చేసుకోక గుటుక్కుమంటే, యీ కష్టపడి ఆర్జించిన డబ్బంతా యవడిపాలుకాను?
లుబ్ధా అదుగో యేమో యెక్కువ ధనం వున్నట్టు శలవిస్తారు. నాకేవుఁంది?
రామ వున్నంతవుంది. పరానికి యిన్ని నీళ్లచుక్కలు వొదిలేవాడుండాలా?
లుబ్ధా అలా అయితే, తమ రెందుకు పెళ్లి చేసుకున్నారు కారూ?
రామ నేను పిత్రార్జితం అంతా కరరావుఁడు చుట్టేవేశాను. యిక పరానికా? నేను శాక్తేయుణ్ణీ; యోగ సాధనం చేస్తాను. నాకు మరికర్మతో పనిలేదు. లోకంకోసం తద్దినాలు పెడుతున్నాను. అయితే సానిదాన్ని యెందుకు వుంచుకున్నావయ్యా! అని అడగగలరు. "కామిగాక మోక్షకామికాడు" అన్నాడు. యిక మీసంగతో? మీరు నిద్దరపోతూండగా చూసి యెప్పుడో ఒకనాడు మీనాక్షి ఆపాతు యెక్కదీసి రంకుమొగుణ్ణి తీసుకు పారిపోతుంది. ఆపైని దరిద్రదేవత మిమ్మల్ని పెళ్లాడుతుంది.
లుబ్ధా అయితే యేం జెయమంటారు?
రామ మీరు పునః ప్ర`యత్నంచేసి పెళ్లా`డండి. పెళ్లాంభయంచేత మీనాక్షి ఆటకట్టడుతుంది. మీనాక్షి భయంచేత, మీ పెళ్లాం కట్టుగావుంటుంది. అవునంటారా? కాదంటారా?
లుబ్ధా నిజవైఁనమాటే.
రామ నిజవైఁతేనేం? మీకు బహుపరాకు. సాధకబాధకాలు అడుగడుక్కీ జ్ఞాపకం చేస్తూండాలి. మీకు జాతకరీత్యా, వివాహం జరక్కపోతే, మార్కం వుందన్నమాట పరాకుపడ్డారా?
లుబ్ధా పరాకులేదు. గాని యిన్నాళ్లాయి కొట్టుకుంటూంటే, యీ నాటికి పద్ధెనిమిది వొందలకి, వక సంబంధంకుదిరి, తీరా క్రియకాలానికి తేలిపోయిందిగదా? యిప్పుడు చవగ్గా మనకి సంబంధం కుదురుతుందా? కుదరదు. కుదరదు.
రామ నిన్న నొచ్చాడయ్యా, గుంటూరునించి వక బ్రాహ్మడూ. వున్నాడో వెళ్లిపోయినాడో?
లుబ్ధా సంబంధానికా?
రామ అవును. యంతబుద్ధి తక్కువపనిచేశానూ! నాయెరికని యెక్కడైనా సంబంధంవుందా అని అతగాడు అడిగితే, లేదని చెప్పా`ను. యీ సంబంధం మీకు తప్పిపోతుందని నేనేం కలగన్నానా యేవిఁటి? అతడు జటాంత స్వాధ్యాయిన్నీ మంచి సాంప్రదాయవైఁనకుటుంబీకుడున్నూ, ఆ సంబంధంచేస్తే అగ్నిహోత్రావుధాన్లుని చెప్పుచ్చుకు కొట్టినట్టౌను.
లుబ్ధా బేరం యేం చెప్పా`డు?
రామ బేరం మహాచవకయ్యా. అదే విచారిస్తున్నాను. అతగాడు గుంటూరునుంచి వస్తున్నాడు. అక్కడివాళ్లకి, మనదేశపు కొంపలమ్ముకునే బేరాలతాపీ యింకా తెలియదు. అందుచేత నందిపిల్లిలో పన్నెండు వందలకి సంబంధం కుదుర్చుకున్నాడు. వ్యవధిగాగాని పెళ్లికొడుకువారు రూపాయలు యివ్వలేమన్నారట, ఆ బ్రాహ్మడికి రుణాలున్నాయి వాయిదానాటికి రూపాయలు చెల్లకపోతే దావా పడిపోతుందని యెక్కడయినా పిల్లని అంటగట్టడానికి వ్యాపకంచేస్తున్నాడు. ఒకటి రెండు స్థలాల్లో వెయ్యేసి రూపాయలకి బేరం వొచ్చిందట. పన్నెండు వందలకిగాని యివ్వనని చెప్పా`డు.
లుబ్ధా మరొక్కవొంద వేదాంమనం?
రామ అతగాడు వుంటేనా, నూరువెయడానికీ యాభైవెయడానికీని?
లుబ్ధా కనుక్కుందురూ మీపుణ్యంవుంటుంది. యెక్కడబసో?
రామ దాని సిగగోసినడబ్బు, డబ్బుమాట అలా వుణ్ణీండి గాని. ఆపిల్ల యేమియేపు! యేమి ఐశ్వర్యలక్షణాలు! ధనరేఖ జెఱ్ఱిపోతులావుంది. సంతానరేఖలు స్ఫుటంగావున్నాయి. పిల్ల దివ్యసుందర విగ్రహం.
(మధురవాణి ప్రవేశించును.)
మధు గ్రహవేఁవిఁటి?
రామ గ్రహవేఁవిఁటా? అవుధాన్లుగారి గ్రహస్థితి చూస్తున్నాం. జాతకరీత్యా యీ సంవత్సరంలో వివాహం కాకతప్పదు.
మధు మీమాట నేను నమ్మను. (అవుధాన్లు దగ్గిరకువెళ్లి ముఖంయదట ముఖం వుంచి) ఆమాటనిజమా?
లుబ్ధా అంతా నిజం అంటున్నారు.
మధు సిద్ధాంతిగారేవఁన్నారు?
లుబ్ధా జాతకం చూసిన సిద్ధాంతల్లా ఆమాటే అంటున్నాడు. యిదివరికల్లా నాజాతకం మాగట్టి దాఖలా యిస్తూంది. ఒక్కటీ తప్పిపోలేదు.
మధు అయితే మీ ప్రారబ్ధం. ఆపెయ్యనాకుడు పిల్లనిమాత్రం యీ పంతులు మాయమాటలువిని చేసుకోకండి.
రామ భోంచేస్తూ వొచ్చావు, యేం పుట్టి ములిగిపోయిందని?
మధు వెండిగిన్నెకోసం వొచ్చాను.
రామ తీసుకెళ్లు. (మధురవాణి నిష్క్రమించును.)
లుబ్ధా పెళ్లి చేసుకోవొద్దంటుందేవఁండీ?
రామ నిమ్మళంగామాట్లాడండి. సానిది యక్కడైనా పెళ్లి చేసుకోమంటుందయ్యా? నీమీద కన్నేసింది.
లుబ్ధా నామీద కన్నెయ్యడవేఁవిఁటి మావఁగారూ! యవరు విన్నా నవ్వుతారు.
రామ మీరుగానీ పెళ్లి చేసుకోవడం మానేస్తే, మీయింట్లోవొచ్చి బయిఠాయిస్తుంది. అది ఘంటాపథంగా చెబుతూవుంటే చెవుల్లేవా యేవిఁటి మీకు? దానితో మీరేవఁయినా వెఱ్ఱి వెఱ్ఱి చాష్టలు చేశారంటే మీకూనాకూ పడుతుంది గట్టిరంధి. జాగ్రతెరిగి మసులుకొండి.
లుబ్ధా నేనా? నేనా? యేవిఁటి అలా శలవిస్తున్నారు. మావాఁ! నాపిల్ల ఒకటీ అది వొకటీనా? ఆ గుంటూరు శాస్తూల్లు వున్నాడో వెళ్లా`డో, ఒక్కమాటు కనుక్కోలేరో?
రామ యదటింట్లోనే బసచేశాడు కనుక్కుంటానుగాని, మధురవాణి భోజనం యేపాటి అయిందో చూసి మరీ వెళతాను. (లోపలికి వెళ్లివచ్చి పైకి వెళ్లును.)
లుబ్ధా మధురవాణ్ణి తీసుకుపోతా ననుకుంటున్నాడు యీ పంతులు ఆహ! హ! (పొడుముపీల్చి) మనిషికీ మనిషికీ తారతమ్యం సాందేకనిపెట్టాలి. పంతుల్లాగ మీసంవుంచుకుని, రంగువేసుకుంటే, తిరిగీ యౌవ్వనం వొస్తుంది. యీ చవక సంబంధం కుదిరినట్టాయనా యేమి అదృష్టవంతుణ్ణి!
(రామప్పంతులు స్త్రీవేషముతోనున్న శిష్యుణ్ణి రెక్కపట్టుకు తీసుకువచ్చును. అరచెయ్యి చూపించి)
రామ మావాఁ! యేం ఖొదాకొట్టు కొచ్చిందోయి నీకు! యిదిగో ధనరేఖ. చెయ్యి కొసముట్టి రెండోపక్కకి యెగబాకిరినట్టుందోయి. యివిగో సంతానరేఖలు. కంఠందగ్గిర చూశావా హారరేఖలు?
లుబ్ధా అట్టే పరిశీలన అక్కర్లేదు. చాల్లెండి.
(పై ప్రసంగము జరుగుచుండగా మధురవాణి వెనక పాటున వచ్చి పంతులు నెత్తిమీద చెంబుతో నీళ్లు దిమ్మరించును.)
రామ యేమిటీ బేహద్బీ!
మధు మంగళాస్నానాలు. (శిష్యుడి గెడ్డం చేత నొక్కి) నీకు సిగ్గులేదేలంజా?
(మధురవాణి నిష్క్రమించును.)
రామ కోపవొఁస్తే మరి వొళ్లెరగదు. యిక కొరకంచో చీపురుగట్టో పట్టుకు వెంట దరువుఁతుంది. యీ పిల్లని తీసుకు పారిపోదాంరండి.
(శిష్యుడి చెయ్యి పట్టుకుని పైకి నడుచును.)
లుబ్ధా నడుస్తుంది. రెక్క వొదిలెయ్యండి.
రామ (రెక్కవదిలి) ఓహో! కాబోయే యిల్లాలనా?
(ముగ్గురూ నిష్క్రమించి, వీధిలో ప్రవేశింతురు.)
లుబ్ధా యీ పిల్లని చేసుకోమని మీ అభిప్రాయవేఁనా?
రామ నా అభిప్రాయంతో యేంకార్యం? మీ మనస్సమాధానం చూసుకోండి. పిల్ల యేపుగావుందా? రూపు రేఖావిలాసాలు బాగున్నాయా? అది చూసుకోండి.
లుబ్ధా సంసార్లకి సౌందర్యంతో యేంపని?
(సిద్ధాంతి తొందరగా యెదురుగుండా వస్తూ ప్రవేశించి.)
సిద్ధా (లుబ్ధావధాన్లుతో) యవరు మావాఁ యీపిల్ల? (లుబ్ధావుధాన్లు జవాబుచెప్పక, రామప్పంతులువైపు బుఱ్ఱతిప్పి సౌజ్ఞచేయును.)
రామ మావాళ్లే.
సిద్ధా (నిదానించి) భాగ్య లక్షణాలేంబట్టాయీ యీ పిల్లకీ!
రామ యేవిఁటండి?
సిద్ధాం విశాలవైఁన నేత్రాలూ, ఆకర్ణాలూ, ఆవుంగరాలజుత్తూ, విన్నారా? యేదమ్మా చెయ్యి (చెయ్యిచూసి) యే అదృష్టవంతుడు యీ పిల్లని పెళ్లాడా`డోగాని-
రామ యింకా పెళ్లికాలేదండి.
సిద్ధాం మీరు పెళ్లి చేసుకోవాలని వుంటే, యింతకన్న అయిదోతనం, అయిశ్వర్యం, సిరి, సంపదాగల పిల్ల దొరకదు. యిది సౌభాగ్యరేఖ, యిది ధనరేఖ, పంతులూ బోషాణప్పెట్టలు వెంటనే పురమాయించండి. యేదీ తల్లీ చెయితిప్పూ. సంతానం వకటి, రెండు, మూడు. (చెయ్యివొదలి లుబ్ధావధాన్లతో)యెదీ మావాఁ పొడిపిసరు. (పొడుంపీల్చి) పోలిశెట్టి కూతురు ప్రసవం అవుతూంది. జాతకం రాయాలి. మళ్లీ దర్శనం చాస్తాను.
రామ వక్కమాట. (సిద్ధాంతితో రహస్యంగా మాట్లాడును. సిద్ధాంతి చంకలో పంచాంగంతీసి, చూచును. మరి నాలుగుమాటలాడి పంచాంగం చంకని పెట్టుకుని తొందరగా వెళ్లిపోవును.)
లుబ్ధా యేవఁంటాడు?
రామ నేనే యీపిల్లని పెళ్లి చేసుకుంటాననుకుంటున్నాడు. రేపటి త్రయోదసినాడు పెళ్లికి మంచిది అన్నాడు.
లుబ్ధా ఆరోజు వివాహముహూర్తం లేదే?
రామ శుభస్య శీఘ్రం అన్నాడు. ద్వితీయానికి అంతముహర్తం చూడవలసిన అవసరంలేదు. తిథీ నక్షత్రం బాగుంటే చాలును. యిదుగో మీమావఁగారు వొస్తున్నారు.
లుబ్ధా బేరఁవాడి చూడండి.
(కరటక శాస్తుల్లు ప్రవేశించును.)
కరట గంగాజలం సిరస్సున పోసుకున్నారా యేవిఁటి పంతులుగారూ? మాపిల్లని యెక్కడికి తీసికెళ్తున్నారు?
రామ (కరటక శాస్త్రితో) మాట.
(ఇద్దరూ రహస్యముగా మాటలాడుదురు.)
రామ (లుబ్ధావధాన్లును యెడంగా తీసికెళ్లి) పధ్నాలుగు వొందలు తెమ్మంటున్నాడు. యెవళ్లో పదమూడు యిస్తావఁన్నారట.
లుబ్ధా యిదా మీరు నాకు చేసిన సాయం? పొనియ్యండి, ఆపజ్యెండుకైనా తగలెట్టండి.
రామ ఉపకారానికి పోతే నాదా`నిష్టూరం? కోరి అడిగితే కొమ్మెక్కుతారు. యేంజెయను? (కరటకశాస్త్రితో రహస్యంగా మాట్లాడి, తిరిగీ వచ్చి లుబ్ధావధాన్లుతో) మావాఁ కృత్యాద్యవస్థమీద వొప్పించాను. పిల్లదానికి సరుకు పెడితేగాని వల్లలేదని భీష్మించుకు కూచున్నాడు. యేవఁంటావు?
లుబ్ధా అది నావల్లకాదు.
రామ వూరుకోవయ్యా. అలాగే అందూ, మధురవాణి తాలూకు కంటెతెచ్చి ఆవేళకి పెట్టి, తరవాత తీసుకుపోతాను.
లుబ్ధా అదేదో మీరే చూసుకోండి.
రామ నేనే చూసుకుంటాను. ఖర్చు వెచ్చాలేవోమనవేఁ చేసుకుని, కొంచంలో డబడబలాడించేదాం. పోలిసెట్టిని సప్లైకి పెట్టకండి. పెద్దిపాలెం వెళ్లి లౌక్యుల్ని యెవరు పిలవడం?
లుబ్ధా మరి నా కెవరున్నారు. మీరే పిలవాలి.
రామ లౌక్యుల్ని పిలవడానికి వెళ్లినప్పుడు దుస్తుడాబుగా వుండాలి. దగలా, గిగలా తీయించి యెండవేయిస్తాను.
(నిష్క్రమింతురు.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)