నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౨-వ స్థలము. లుబ్ధావధాన్లుయిల్లు.
లుబ్ధా అవును. మీరు చెప్పినమాట బాగుంది. దివ్యస్థలాల్లో ఏకరాత్ర వివాహాచారంవుంది.
కరట పెద్ద పెద్ద ఉద్యోగస్థులుకూడా, యిప్పటిరోజులలో, వివాహాలు అలాగే చేస్తున్నారు. కోదండరామస్వామివారు స్వయంవ్యక్తవూఁ, హనుమత్ప్రతిష్ఠా అయినప్పుడు, దివ్యస్థలంకాదని యెవడనగలడు?
లుబ్ధా ఆమాట సత్యవేఁగాని, యిది దివ్యస్థలంగా ఆలోచించి ఇదివరకు యెవళ్లూ యిక్కడ, ఏకరాత్రవివాహం చేసివుండలేదు మావఁగారూ. మనంచేస్తే యేవఁంటారో?
కరట దివ్యస్థలం అయినతరవాత యెవడేవఁంటే మనకేం పోయింది?
లుబ్ధా అయితే పంతులుతో చెబుదాం.
కరట యేవిఁటి మీసత్యకాలం మావగారూ! యీపెళ్లిలో యేదోవొక వొంటుబెట్టి, నాలుగుడబ్బులు ఆర్జించు కుందావఁని చూస్తూవున్న పంతులూ, పోలిశెట్టీ, ఏకరాత్ర వివాహానికి ఆమోదిస్తారా? పుస్తెకట్టిందాకా ఆమాట వాళ్లతో చెప్పకండి.
లుబ్ధా పంతులుతో చెప్పకపోతే యేంజట్టీ పెడతాడో?
కరట యేవిఁటి మీభయం! అతగాడు మీకు యజమానా? జట్టీ, గిట్టీ పెడితే, పెణతూడ గొడతాను.
లుబ్ధా మీరు కాదుగాని, సిద్ధాంతిగారి చేతిలో రెండు రూపాయలు పడేస్తే, ఆపూచీ అంతా ఆయన నెత్తిమీద వేసుకుంటాడు. ఆయన యదట పంతులు నోరు యెగియదు.
కరట పావఁంటిదానికి విరుగుడుంది. పంతులికుండదా?
(నిష్క్రమింతురు.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)