నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౩-వ స్థలము. లుబ్ధావధాన్లు యింటిపెరడు.
[కరటకశాస్తుల్లు, మీనాక్షీ ప్రవేశింతురు.]
మీనాక్షి మీపిల్లని నాకడుపులో పెట్టుకోనా తాతయ్యా?
కరట కడుపుగదా అమ్మా? అంచేత పదేపదే చెబుతున్నాను. దానికి తల్లివైనానువ్వే, తండ్రివైనానువ్వే. (దుఃఖమును అభినయించును.)
మీనాక్షి విచారించకండి, తాతయ్యా, దానికి యేలోపం రానియ్యను.
కరట అమ్మా, నీకిమ్మని మా అమ్మిచేతికి ఓ పులిమొహురు యిచ్చాను. పుచ్చుకో.
మీనాక్షి యిస్తుంది. తొందరేవిఁటి, తాతయ్యా? దాందగ్గిరవుంటేనేం? నాదగ్గిరవుంటేనేం?
(సిద్ధాంతి ప్రవేశించును.)
సిద్ధాంతి యెంతసేపూ కూరలుతరగడం, భోజనాల సరంజాం జాగ్రతచెయ్యడం సందడేగాని, లగ్నానికి కావలసిన సరంజాం జాగ్రత చెయ్యడపు తొందరేవీఁ కానరాదు. నాశిష్యుడు ముంగి పోతులాగ పడున్నాడు.
మీనా నాలుగ్గడియల పొద్దుకిలగ్గవైతే, యిప్పట్నించీ సరంజాం తొందరేవిఁటి అచ్చన్న మావాఁ?
సిద్ధాంతి చదవేస్తేవున్న మతీ పోయిందన్నాట్ట. నాలుగ్గడియల రాత్రుందనగా శుభమూర్తం.
మీనా మానాన్న యెప్పుడూ యిదేమచ్చు. యేమాటా నిజం యింట్లో ముండలతో చెప్పకపోతే యెలా యేడుస్తారు? నాన్నా? నాన్నా!
(లుబ్ధావధాన్లు ప్రవేశించును.)
లుబ్ధా యెందుకాగావు కేకలు?
మీనా నాలుగ్ఘడియల రాత్రుందనగానట మూర్తం. అచ్చన్న మావఁ అంటున్నారు.
లుబ్ధా యిదేవిఁటండోయి, నాలుగ్గడియలపొద్దు కనుకున్నానే ముహూర్తం?
సిద్ధాంతి ముప్పైమూడు ఘడియలపొద్దు కనుకున్నారుకారో? మీ వెఱ్ఱులు చాలించి చప్పునకానియ్యండి మంగళాస్నానాలు. ఊళ్లో బ్రాహ్మలినందర్నీ పిలిచేశాను.
లుబ్ధా చంపారే! చలి!- అయితే, రావఁప్పంతులుకూడా నాలుగ్ఘడియలపొద్దుకి అనుకున్నాడే ముహర్తం? ఆయనే వొచ్చి, పెద్దిపాలెంలో లౌక్యుల్ని నాలుగ్ఘడియలపొద్దుకి రమ్మని పిలుస్తారేమో?
సిద్ధాంతి శతాంధాః కూపం ప్రవిశంతి. అమ్మీ, పిల్లకి స్నానం చేయించూ.
మీనా యిదుగో, నిమిషంలో చేయిస్తాను.
సిద్ధాంతి ఆడవాళ్లునయం. పెళ్లిపందిట్లో సరంజాం చూసుకుంటాను.
లుబ్ధా పంతులులేకుండా లగ్నం అయితే-
సిద్ధాంతి పంతులుకా, మీకాపెళ్లి? జంకవోడక స్నానంకానీండి.
(నిష్క్రమింతురు.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)