నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౪-వ స్థలము. లుబ్ధావధాన్లు యింటి అరుగుమీద పసుపుబట్టలు కట్టుకుని, లుబ్ధావధాన్లు స్త్రీవేషముతో శిష్యుడు, కొందరు బ్రాహ్మలు కూర్చుని వుందురు.
(రామప్పంతులు, తాషామర్ఫా, కావిళ్లూ, చాకర్లతో, ప్ర`వేశించి అరుగుమీద చతికిలబడి)
రామ అబ్బ! ఎంతశ్రమ పడ్డానండి (నౌఖర్లతో) తాషామర్పా వూరుకోమను. బోయీలొహళ్లూ, బాజావాళ్లొహళ్లూ, వూరుచేరేటప్పటికి కోలాహలంలావుచేస్తారు. కాళ్లుపీక్కు వచ్చాయయ్యా, వెధవ పెద్దిపాలెం యంతదూరవుఁందీ! (తిరిగిచూసి) యిదేవిఁటీ పసుబ్బట్టలూ, పెళ్లికూతురుతో కలిసికూచోడవూఁను? పెళ్లికొడుకుం చేయించుకున్నావటయ్యా? ముదిమికి ముచ్చట్లులావు.
లుబ్ధా లగ్నానికి మీరు లేకపోయినారుగదా! అని మహా విచారపడుతున్నాను.
రామ (ఉలికిపడి) యేవిఁటీ! లగ్గవేఁవిఁటి?
పూజారిగవరయ్య లగ్నంవేళకి తమరు లేకపోయినారుగదా అని, మేం యావన్మందివీఁ విచారించాం. తమరు యేదో వ్యవహారాటంకంచేత వేళకి రాజాలినారుకా రనుకున్నాం. తాము లేకపోవడంచేత సభ సొగుసే పోయింది. "నియ్యోగిలేనిసావిడి । అయ్యయ్యో వట్టిరోత, అది యెట్లన్నన్‌ । వయ్యారి" -
రామ అట్టేపేలకు. ముహర్తానికి ముందే పుస్తె యెలా ముడెట్టా`వయ్యా?
పూజా సిద్ధాంతిగారు నక్షత్రాలు చూసి ఘడియలుగట్టి సరిగ్గా ముహూర్తం వేళకేపుస్తె కట్టించారండి.
రామ నాలుగ్ఘడియల పొద్దుకాలేదే?
పూజారి నాలుగుఘడియల రాత్రుందనగాకదండీ, శుభముహూర్తం?
రామ సిద్ధాంతి, ముహర్తం తెల్లవారి నాలుగుఘడియలకని చెప్పా`డే?
పూజారి పంచాంగం మార్చడానికి యవడిశక్యం బాబూ? తెల్లవారగట్ల నాలుగు ఘడియలకని, సిద్ధాంతిగారు మనవిజేసివుంటారు. తాము పరాగ్గా వినివుందురు.
రామ పంచాంగానికేం యీ వెధవ పల్లిటూర్లో? సిద్ధాంతి ఆడింది ఆటా, పాడింది పాటా. యంతద్రోహం చేశాడయ్యా సిద్ధాంతి!
పూజారి సిద్ధాంతి యంతో నొచ్చుకున్నాడు, తమరు రాలేదని బాబూ. యేమి ఆటంకంచాత వుండిపోయినారో? అని అవుధాన్లుగారు తల్లడిల్లా`రు. తాషామర్ఫా విన్నతరవాతగదా, ఆయనమనస్సు స్వస్థపడ్డది.
లుబ్ధా నిజం మావఁగారు.
పూజారి యిక మధురవాణో? అంటే, ఆపందిట్లో నిశ్చేష్టురాలై పుత్తడిబొమ్మలాగ నిలుచుందిగాని బ్రాహ్మణ్యం యావన్మందీ గెడ్డం పట్టుకు యెంత బతిమాలుకున్నా, పాడిందిగాదు.
కొండిభొట్లు అంతసేపూ హెడ్డు కనిష్టీబుగారితో మాట్లాడుతూ నిల్చుందిగాని, యేం? యింతమందిం ప్రార్ధించినప్పుడు, ఓ కూనురాగం తియ్యకూడదో?
మరివకబ్రాహ్మడు ఓరి కుంకాయా, పంతులుగారు సభలో లేందీ యలా పాడుతుందిరా?
పూజా హెడ్డుగారితో యేవిఁటి మాట్లాడుతూందనుకున్నావు? పంతులుగారు సరుకూజప్పరా, పెట్టుకు వెళ్లా`రు. యేంప్రమాదం వొచ్చిందో! ముహర్తం వేళకి రాలేదు. జవాన్లనిపంపి వెతికించండి అని బతిమాలుకుంటూందిరా.
కొండిభొట్లు యీ గవరయ్యగారు గోతాలు కోస్తాడ్రా. హెడ్డూ, అదీ, ఒహరిమీదొహరు విరగబడి నవ్వూతూంటే, పంతులుకోసం బెంగెట్టుకుందని కవిత్వం పన్నుతాడు.
రామ వైదికం! వైదికం! మీయేడుపులు మీరు యేడవక, లోకంలో భోగట్టా అంతా మీకెందుకు?
పూజారి వూరుకోరా కొండిభొట్లు. పెద్దాపిన్నా అక్కర్లేదూ?
రామ నీపెద్దతనం యెక్కడ యేడిసింది? నివ్వే ముందు రేపెట్టావు.
పూజారి వై, స, బు, పె, అని యందుకన్నాడు బాబూ?
రామ అతడేడీ, అతడు? అతడిపేరేఁవిటీ?
పూజారి యెవరండి?
రామ ఆగుంటూరి శాస్తూల్లేడయ్యా?
పూజారి యేగుంటూరి శాస్తుల్లండి?
లుబ్ధా ఆయనా, - మరేవొచ్చి, ఆయనా-వూరి కెళ్లారు.
రామ యేవిఁటీ తెలివితక్కువమాట! కూతురికి పెళ్లౌతూంటే, వూరికెళావెళ్లా`డు?
లుబ్ధా పెళ్లయిపోయిందిగదా?
రామ తెలివిహీనం! లగ్నవఁంటే నేను లేకుండా వెలిగించావుగానీ, పెళ్లి ఐదురోజులు తగలడుతుందిగదూ?-
పూజారి ఏకరాత్ర వివాహం కదండీ? అంచేత ప్రధానహోమం, శేషహోమంతో సమాప్తి అయిపోయింది.
రామ (నిశ్చేష్టుడై లుబ్ధావధాన్లుతో) ఓరి, సామిద్రోహప వెధవా!
పూజారి (నోరుమూసి) బాబ్బాబూ, శాంతించండి! శాంతించండి! (లుబ్ధావధాన్లుతో) పంతులుగారి కాళ్లమీద పడవయ్యా. (పంతులుతో) తమరు చేయించిన శుభం. అశుభంమాటలు శలవియ్యకండి. సిద్ధాంతిగారూ, వారి మావఁగారూ, శాస్త్రచర్చచేసి, లగ్నం పదినిమిషాలుందనగా, ఏకరాత్ర వివాహం స్థిరపర్చారు.
రామ యేంకుట్ర! వాడికి రూపాయలివ్వలేదుగద?
లుబ్ధా యెల్లుండి యేవా`ళకైనా రూపాయలు చెల్లించకపోతే దావా పడుతుందని, తొందరపడి పట్టుకు వెళ్లిపోయినారు. మళ్లీ వారంనాటికి వొస్తానఁన్నారు.
రామ నన్ను మధ్యవర్తినిచేసి, నేను లేనిదీ, యీ వ్యవహారం యలా పైసలుచేశావు? నేను యంత యడ్వాన్సు వాడికియిచ్చానో నీకు తెలుసునూ? అప్పుడే మావఁగారితో కలిసిపోయి నాకు టోపీ అల్లా`వూ?
లుబ్ధా మీరుచేసిన నిర్నయప్రకారవేఁ, రూపాయలు చేతులో పడితేనేగాని, పుస్తెకట్ట నివ్వనన్నాడు. యేంజెయ్యను?
రామ పుస్తెకట్టకపోతే నీపుట్టె ములిగిందిగాబోలు! నేవొచ్చేలోగా యేం వుప్పెనవొచ్చింది? వీడేదో పెద్దదగాచేసి, నేనొస్తే, పట్టుగుంటానని రూపాయలు చేతులో పడేసుకుని వుడాయించాడు. వాడిపెరేవిఁటీ?
పూజారి ఆయన పేరు-మరేవచ్చి-అవుధాన్లుగారు శలవిస్తారు.
లుబ్ధా నాకు తెలియదు.
రామ అయ్యో అభాజనుడా! యిహ, వాడు, పంచాళీమనిషి అనడానికి సందేహవేఁవిఁటి?
లుబ్ధా అతగాణ్ణి మీరే తీసుకొచ్చి దొడ్డవాడని చెప్పా`రు? అంచేతనే అతణ్ణి నేను నమ్మా`ను.
రామ నువ్వు నమ్మితే యెవడికి కావాలి? నమ్మకపోతే యెవడికి కావాలి? అతనికి నేను పెళ్లిఖర్చులకోసం బదులిచ్చిన నూరురూపాయిలూ, అక్కడపెట్టు.
లుబ్ధా యెవరికిచ్చారో అతణ్ణే అడగండి. నాతో చెప్పకండి.
రామ సరే, నీతో చెప్పను- నీతో యిక మాటే ఆణ్ణు- మరినీయింట్లో వక్క నిమిషం వుండను. (లేచినిలుచుని) అంతావినండయ్యా! యీ గుంటూరుశాస్తుల్లు పచ్చిదొంగ, లేకుంటే ఈ తెలివిహీనుడు యిచ్చినరూపాయిలు సంధించుకుని, పేరైనా చెప్పకుండా పరారీ అవుతాడా? నాతాలూకు సొమ్ముకూడా పట్టుకు చపాయించాడు. వీడివైఖరీ చూడగా, రెండోపెళ్లి పిల్లనో, సూద్రప్పిల్లనో, యీ తెలివిహీనుడికి అమ్మి. యెగేసినట్టు కనపడుతుంది. గనక, ఒరే! బారికీ, ఒరే! మంగలీ, హెడ్డుగారి దగ్గిరికెళ్లి, యిద్దరు జవాన్లను తీసుకురా. వాడి వెంట దౌడా యింపిస్తాను.
(పైమాటలు అంటూ వుండగా, సిద్ధాంతి ప్ర`వేశించి, రామప్పంతులు మాటలు ముగించి వెళ్లిపోబోతూవుండగా రెక్కబట్టి నిలబెట్టును.)
సిద్ధాంతి యెక్కడికి వెళతారు? కొంచం నిలబడండి.
రామ యేమిటి నీ నిర్బంధం?
సిద్ధాంతి గుంటూరి శాస్తుల్లుగారి పేరేవిఁటో మీక్కావాలా`!
రామ యేమిటా పేరు?
సిద్ధాంతి పేరి రామశాస్తుల్లుగారు. ఆయనపేరుతో మీకేం పనుంది?
రామ వాడు నాకుబాకీ.
సిద్ధాం మీకు ఒక దమ్మిడీ బాకీలేదు. ఆనిజం నాకుతెలుసును.
రామ చెయ్యి నొక్కేస్తున్నావేవిఁటి!
సిద్ధాం వైదీకపాళ్ల చెయ్యి మృదువుగా యలా వుంటుంది? అవధాన్లుగారు యిచ్చిన సొమ్ము తాలూకు నిలవ యెంతుందో చెప్పండి.
రామ నువ్వెవరివి అడగడానికి? అన్న! చెయ్యినొక్కుతున్నావు! తంతావా యేవిఁటి?
సిద్ధాం శుభమల్లె, పెళ్లికూతుర్ని ముండా ముతకా, అంటే యెవరయినా వూరుకుంటారా?
రామ ముండకాదు, పునిస్త్రీయే, అంటాను; చెయ్యివొదిలెయ్యి.
(లుబ్ధావధాన్లు శిష్యుడికి కొంతయడంగా జరుగును.)
సిద్ధాం కోపంవొచ్చినప్పుడు, లౌక్యం మరిచిపోకూడదు. మీరు ప్రభువులూ; మేం ఆశ్రితులం. తమకిలాభించేమాట చెబుతాను, యిలా దయచెయ్యండి.
రామ మర్యాదగా మాట్లాడితే, నా అంతమంచివాడు లేడు.
సిద్ధాం అవధాన్లుగారూ మీరు కూడా యిలారండీ.
(అవధాన్లు, సిద్ధాంతి, రామప్పంతులూ రహస్యముగా మాట్లాడుదురు.)
రామ (ఉత్సాహముతో) సిద్ధాంతీ యేదీ పొడిపిసరు. నియ్యోగపాడన్నవాడు, సవబుకి కట్టుబడతాడు. యవరయా వంటబ్రాహ్మలు! మాయింటికి పలహారాలు వెళ్లాయా? యేవోఁయి, కొండి భొట్లూ! మాట, యిలారా!
(కొండి భొట్లు వచ్చును.)
కొండి యేం శలవు?
రామ మాయింటిదాకా నాతోరా.
కొండి చిత్తం.
రామ మాతోట్లో, మంచి పనసకాయలున్నాయి. రెండుకాయలకి బరాతవిఁస్తాను. తెచ్చుకో మీ అయ్యకి పనసకాయ కూరంటే, మాయిష్టం.
కొండి చిత్తం!
రామ పెళ్లిలో యేవిఁటోయి గమ్మత్తు.
కొండి యేవీఁ గమ్మత్తు లేదండి.
రామ మధురవాణి పాడిందికాదేం?
కొండి పాడింది -
రామ ఆఁ!
కొండి కాదండి.
రామ అలాచెప్పు. అంతసేపూ హెడ్డు కనిష్టీబుతో మాట్లాడుతూంది కాబోలు?
కొండి లేదండి. ఒక్కమాటాళ్లేదు.
రామ మరెందుకన్నావూ, మాట్లాడిందని యిందాకానూ? విరగబడి నవ్విందన్నావే?
కొండి మరీ- మరీ- మరే వొచ్చి- లింగన్నగారి కాంభొట్లు అలా అనమన్నాడు.
రామ వాడిపని పట్టిస్తాను. నాతో వెకాస్యాలా! నువ్వుమాత్రం వాడిజట్టు కూడకు. చిన్నప్పట్నుంచీ నిన్ను యెరుగుదును. నువ్వు నిజాయితీ మనిషివి.
కొండి అవుఁనండి. యెప్పుడూ నేను నిజవేఁ చెబుతాను.
రామ అవునుగాని, హెడ్డు కనిష్టీబుమాటమట్టుకు నిజం చెప్పా`వుకావు. పట్టాభిరామస్వావిఁమీద ప్రమాణంచేసి, చెప్పూ! మధురవాణి యవరెవరితో మాట్లాడింది?
కొండి మరేవచ్చి- నిజం చెప్పమన్నారూ?
రామ నిజాయితీ మనిషివనేగదా నిన్ను అడుగుతున్నానూ?
కొండి అయితే, - అందరితోటీ మాట్లాడింది.
రామ అందరితోటీ అంటే యవరెవరితోటి?
కొండి యవరెవరా అండి? పెళ్లి వొదిలేసి, అంతా మధురవాణి చుట్టూమూగాం. భుక్తగారితో మాట్లాడింది. మరేవచ్చి.
రామ యింకా యవరితో మాట్లాడింది?
కొండి సిద్ధాంతి మంత్రం చప్పడం మానేసి మధురవాణి చెవులో యేకాంతం మాట్లాడా`డు.
రామ మరింకా యవరితోటి?
కొండి మరేవచ్చి- హెడ్డు కనిష్టీబుతోటి.
రామ ఓరి ఛండాలుడా! హెడ్డుతో మాట్లాడ లేదన్నావే?
కొండి అవును మాట్లాళ్లేదు.
రామ పుండాఖోర్‌! మాట్లాడిందా మాట్లాళ్లేదా?
కొండి సచ్చాన్రా దేవుఁడా!
రామ అసత్యం అంటే, నాకు వెఱ్ఱికోపం. ప్రమాణ పూర్తిగా, నిజంచెప్పు. అబద్ధవాఁడితే, తల పేలిపోతుంది. మాట్లాడిందాలేదా?
కొండి లేదు.
రామ ప్రమాణ పూర్తిగా?
కొండి ప్రమాణ పూర్తిగానే.
రామ యిప్పుడు నిజంచెప్పా`వు. విన్నావా? నీకు చిన్నతనం; ఆడవాళ్లమీద, ఒహరు అనమన్నా, అన్యాయంమాటలు ఆడకూడదు. తెలిసిందా?
కొండి మధురవాణి మా దొడ్డమనిషి.
రామ వూళ్లో అలా అనుకుంటారేం?
కొండి అంతా అనుకుంటారు.
(రామప్పంతులు యింటియెదట.)
రామ నేను తలుపుకొడతాను నివ్వో చిన్నగమ్మత్తుచెయ్యి.
కొండి చిత్తం.
రామ యీ విచ్చబేడమొలనిపెట్టుకో. మా పెరటిగోడ అవతల, ఒక అరఘడియ నిలబడు. దిడ్డీతోవంట కనిష్టేబుగాని, మరెవరుగాని, పైకి వొచ్చినట్టాయెనా, రెక్కపట్టుకుని, కేకెయ్యి. నేవొస్తాను. లేకుంటే వుడాయించెయి. (కొండుభొట్లు నిష్క్రమించును.) తలుపు తలుపు. (తనలో) ఒకంతట తలుపుతియ్యదు. అనుమానా నిక్కారణం. వీడు నిజంచెప్పాడా? అబద్ధం చెప్పాడా? నేను పాలెంనించి వొచ్చి కబురు పంపించిన తరవాత రాక, యిది తుఱ్ఱుమని యలాపరిగెత్తి వెళ్లిందీ పెళ్లిలోకి? తలుపు తలుపు! యప్పటికీరాదేం! (మధురవాణి తలుపుతీయును) యేం జేస్తున్నావు యింతసేపు?
మధు ఉదయంనుంచి రాత్రివరకూ చేసేపనులన్నీ, రేపటినుంచి వ్రాసివుంచుతాను రండి.
(ఉభయులూ నిష్క్రమింతురు.)
(కొండి భొట్లు ప్రవేశించి.)
కొండి పంతులుగారూ, పంతులుగారూ.
(రామప్పంతులు, మధురవాణీ ప్రవేశింతురు.)
రామ (మధురవాణితో) నువ్వు లోపలకివెళ్లు. (కొండిభొట్లుతో) యేవిఁటి?
కొండి మరేవచ్చి,- పట్టుకోలేదు.
రామ (తీక్షణంగా) యెందుకు పట్టుకున్నావుకావు?
కొండి చెప్పరానిదాన్ని యలా పట్టుకోవడం?
మధు చెప్పరానిదాన్ని యెందుకు పట్టుకోవడం?
కొండి దిడ్డీతోవంట యవరొచ్చినా పట్టుకొని, కా`కెయమని పంతులు చెప్పా`రు.
మధు యేవిఁచిత్రం! యేం అప్రతిష్టా! బ్రాహ్మడికి వెఱ్ఱెత్తుతూంది కాబోలు!
రామ (మధురవాణి వెనకనిలచి చేతితో వెళ్లిపొమ్మని కొండిభొట్లుకు సౌజ్ఞ చేసి) పేలుడుగాయ వైదీకప గుంటడి వెకాశ్యాలు నిజం అనుకుంటావేవిఁటి? (లోపలికి వెళ్లును.)
(రామప్పంతులు యింటిలోనికి వెళ్లగానే మధురవాణి సావిడివెనక తలుపు పైనుంచివేసి, కొండిభొట్లును లోపలికిరమ్మని సౌజ్ఞచేసి, ముద్దెట్టుకొనును.)
మధు (నిమ్మళంగా) బాగా, కాపాడా`వు!
కొండి మధురవాణీ, యిదిగో పంతులిచ్చిన బేడ. యిదిగో హెడ్డుగారిచ్చినపావలా. యింద వెండితొడిపొడికాయ. (యిచ్చును.)
మధు (పుచ్చుకొని) నువ్వు మంచివాడివి. యీవేళనుంచి, నీకూనాకూ నేస్తం. తెలిసిందా? (మరివకసారి ముద్దుపెట్టుకొని) యికవెళ్లు.
(కొండి భొట్లు చెంగున వీధిలోకి యెగిరి వీధినడుమ గెంతులువేయును.)
(కాంభొట్లు ప్రవేశించి.)
కాంభొ యెందుకురా యీగెంతులు?
కొండి ముద్దెట్టుకుందిరా!
కాంభొ వెఱ్ఱి వెఱ్ఱి వేషాలు వెయ్‌కు. యీ కోతి మొహాన్నే?
కొండి పోస్సి, వెఱ్ఱికుట్టా`! మేం జట్టుకట్టాం!
(నిష్క్రమింతురు.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)