నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౫-వ స్థలము. కృష్ణారాయపురం అగ్రహారంలో.
(అగ్నిహోత్రావధాన్లు యింటిపెరటిలో గిరీశం పనివాళ్లచేత పందిరి వేయించుచుండును.)
[వెంకటేశం ప్రవేశించును.]
గిరీశం యేమివాయ్‌ బావా, యెడందవడ యెఱ్ఱబారింది?
వెంకటేశం నాన్న గూబగదలేశాడు.
గిరీ యేంజేశావు?
వెంక సంధ`వార్చలేదని.
గిరీ ఆమాత్రం వార్చినట్లు వేషం వెయ్యలేకపోతివో?
వెంక చూడ్డనుకున్నాను.
గిరీ అను కోడాలుపనికి రావోయి, బావా! మనం యేదైనా వేషం వేశావంటే, ఒకడు చూస్తున్నాడని అనుకున్నప్పుడూ, ఒకడు చూస్తూవుండలేదనుకున్నప్పుడూ కూడా, వొక్కమోస్తరుగా వేషం నడిపిస్తే సేఫ్‌ సైడ్‌. చూస్తున్నావుకావా, రోజూ నేను యెంతసేపు బక ధ్యానంచేస్తానో?
వెంక యేవఁని ధ్యానం చాస్తారు?
గిరీ యేం ధ్యానవాఁ? యీ చాదస్త బ్రాహ్మడు యంతట్లో దేవతార్చన చా`స్తాడు, యంతట్లో విస్తట్లో మెతుకులు పడతాయి అని తదేకధ్యానం చేస్తాను.
వెంక మంత్రాలు చదివి దేవుఁణ్ణి ధా`నం చెయ్యాలిగాని, అన్నంకోసం ధా`నంచేస్తే పాపంకాదా?
గిరీ ఇగ్నొరెన్స్‌! మతసంబంధమైన సంగతులు నీకేమీ తెలియవు. యీ పెళ్లి అయిపోయిన తరవాత నిన్ను మతంలో తరిఫీదు చెయ్యాలి. అన్నిమతాలూ పరిశీలించి వాటితాలూకు యపెన్స్‌, నిగ్గుతీసి ఓ కొత్తమతం యేర్పర్చాను. అది అమెరికా వెళ్లి ప్రజ్వలింపచేస్తాను. యిప్పడుమట్టుకు నీ సంశయం తీరుస్తాను. యేమన్నావ్‌? అన్నా`న్నా ధ్యానించడం, అని కదూ? యేవఁందోయి నీ ఉపనిషత్తు? "అన్నం బ్రహ్మేతి వ్యజానాత్‌" అన్నవేఁ, బ్రహ్మ. అని తెలుసుకోవోయి, వెధవాయా, అంది. తెల్లవాడు యేవఁని ధ్యానం చేస్తాడోయి రోజూనూ? "ఫాదర్‌, గివ్‌, అస్‌ అవర్‌, డెయిలీ బ్రెడ్‌" అనగా "నన్ను కన్నతండ్రీ, రోజూ ఒక రొట్టెముక్క ఇయ్యవోయి అని"- ఇక, మనవేఁవఁనాలి? "తండ్రీ రోజూ, కందిపప్పు, ధప్పళం ఇయ్యవయ్యా" అని ధ్యానించాలి. మన చమకంలో యేమన్నాడూ? "శ్యామాకాశ్చమే" "చామల అన్నం మామజాగా వుంటుంది, నాక్కావాలి, ఓ దేవుఁడా! అన్నాడు" ఆ చమకంలో యవడికి యిష్టవైఁన వస్తువులు వాడు కలపవచ్చును- "కందిగుండా చమే, యింగువ నూనా` చమే" దీనినే రిలిజియస్‌ రిఫార్ము అంటారు.
వెంక గేదెపెరుగూ చమే, చేగోడీ చమే.
గిరీ చబాష్‌! అదే ఒరిజినాలిటీ - అడిగితేగాని అమ్మ అయినా పెట్టదు. దేవుఁడు మాత్రం ముద్దిస్తాడనుకున్నావా యేమిటి? నీకు యెప్పుడు యేమి కావలిస్తే అప్పుడు ఆవస్తువులు సంపుటీచేసి చమకపారాయణ ఆరంభించేది.
వెంక అయితే రేపణ్ణించి నేను రోజూ చమకపారాయణ చేస్తాను.
గిరీ మనస్సులో చెయ్యి. పైకి పారాయణ చేశావంటే, నీతండ్రి ఎడ్యుకేషన్‌ లేకపోవడంచేతా, రీజన్‌ తెలియకా, యిదేవిఁటి చమకం పాడు చేస్తున్నాడని పెణతెక్కగొట్టి, తొమ్మిదో అష్టం ఘనం పారాయణచేస్తాడు.
వెంక మొన్న బుగతగారి యింట్లోంచి మీరు పొగాక్కట్ట యెత్తుకొచ్చారుగదా, పాపం చేశారని దేవుఁడు కోప్పడ్డా?
గినీ చిన్నతనంలో మాపింతండ్రి (నీ తండ్రిలాగే అగ్గిరావుఁడోయి) చెవినులిపి నాచేత ఉపనిషత్తులు చదివించాడు. దాం తస్సా గొయ్యా, పేరు మరిచిపోయినానుగాని, ఒక వుపనిషత్తులోను, శిష్యుడుప్రశ్న అడుగుతూవుంటే, గురువు సమాధానం చెబుతూంటాడు. ఆ వుపనిషత్తులో చెప్పిన శిష్యుళ్లాంటి శిష్యుడివి నువ్వు; ఆలాంటి గురువుని నేను. మన ప్రశ్నోత్తరాలు యవడైనా తాటా`కుమీదరాసి పారేశాడంటే, ఒక రెండువొందలేళ్లు అయినతరవాత 'టొబా`కోపనిషత్తు' అవుతుంది. పొగాకు కట్టకి పాప వేఁవిటోయి, కాల్చి పారేసేదానికి? అందులో పొడుంచేసే బుద్ధిహీనులదగ్గిర పొగాకు యెత్తుకురావడం లోకోపకారవఁని నమ్ము.
వెంక యలాగండి లోకోపకారం?
గిరీ యలాగా. యిదిగో, యిలా చుట్టకాలిస్తే, స్టీము యింజన్‌లాగ, భగ్‌, భగ్‌మని పొగ ఆకాశానికి పరిగెత్తి మేఘవైఁ వర్షం కురిపిస్తుంది. పొడుంగాని పీలుస్తే ఆఘాటుకి, ఆకాశం ఆర్చుకుపోతుంది. ముక్కంటమాత్రం చిరివర్షం కురిసి యిల్లూ వొళ్లూకూడా డర్టీ అవుతుంది. గనక పొడుంచేసే మూర్ఖుల యింట్లోవుండే పొగాకంతా దొంగిలించి చుట్టలుగట్టి, తగలెట్టవలిసినదే. ఒకవేళ, గిరీశంగారూ, తమరు దొంగతనంచేశారు, కొద్దిరోజులు నరకానికి విజయం చెయ్యండి, అని దేవుఁడుగానీ, అన్నట్టాయనా ఒక చిన్నలెక్చరుకొట్టి గభరాయింపజేస్తాను.
వెంక యేవఁని లెక్చరు కొడతారు?
గిరీశం యేవఁనా? ఓ దేవుఁడా! నామనస్సు యిండిపెండెంటుగా సృజించావా? లేక డిపెండెంటుగా సృజించావా? యిండిపెండెంటుగా అయితే, నా యిష్టవొఁచ్చినపనల్లా నేను చేశాను. నువ్వెవరు, అడగడానికి? యిలాంటి చిక్కులు పెట్టా`వంటే హేవెన్‌లో చిన్న నేషనల్‌ కాంగ్రెస్‌ వొకటి లేవదీస్తాను. లేక నన్ను డిపెండెంటుగా చేశావూ? అష్లాగయితే నువ్వే నాచేత పాపంచేయించావు గనక నీకే ఆశిక్ష కావలిసింది. దేర్‌పోర్‌ చలో, నరకానికి, చలో! అక్కణ్ణించి నువ్వు తిరిగీ వొచ్చేలోగా, ఆరుఘడియలు స్వర్గంలో నీ అధికారం, నాకిస్తివట్టాయనా, కొన్ని సృష్టిలో లోపాలు సవరణ చేస్తానంటాను.
వెంక యేవిఁటండి లోపాలు?
గిరీ లోపాలన్న లోపాలా! నీచేతే వొప్పిస్తాను. నెంబర్‌వన్‌ - నీ మేష్టరులాంటి అభాజనుణ్ణి పుట్టించడం లోపం అంటావా అనవా?
వెంక లోపవేఁ.
గిరీ నీసిస్టర్‌లాంటి బ్యూటిఫుల్‌ యంగ్‌ గర్లుని, విడోని చెయ్యడం తప్పంటావా, ఒప్పంటావా?
వెంక తప్పే.
గిరీ యిలాంటి లోపాలు కోటానకోట్లు. ఇక రద్దుసృష్టి యంతుందనుకున్నావు? ఫరిన్‌స్టెన్స్‌, యెన్ని సముద్రాలు వున్నాయి?
వెంక యేడు.
గిరీ యేడూ, యేడిసినట్టేవున్నాయి. పాలసముద్రం వుంటూవుండగా మళ్లీ పెరుగుసముద్రం, నేతిసముద్రం యెందుకోయి? యిది ప్లియోనిజమ్‌, పునరుక్తి- మరో తెలివితక్కువ చూశావా? యెందుకూ పనికిమాలిన ఉప్పుసముద్రం మననెత్తినికొట్టి, పెరుగు, పాలు, నెయ్యి, చెరుకుపానకం యీ సముద్రాలన్నీ యవడికీ అందుకు రాకుండా దూరంగా విసిరేశాడోయి. ఒక సంవత్సరంగాని నాకు దేవుఁడు దివాన్గిరీ యిస్తే, భీమునిపట్ణానికి పాలసముద్రం, విశాఖపట్ణానికి మంచినీళ్ల సముద్రం, కళింగపట్ణానికి చెరుకుసముద్రం తెస్తాను. యీ యీస్టర్ను ఘాట్సు అంతా పొగాకు అరణ్యం చేస్తాను. యీ లెక్చరు నేను కొట్టే సరికి, దేవుఁడు యేవఁంటాడో తెలిసిందా? వీడు అసాధ్యుళ్లావున్నాడు. వెనకటికి "పాతయముడివా కొత్తయముడివా" అని అడిగిన పెద్దమనిషికంటే ఒక ఆకు యెక్కువ చదువుకున్నట్టు కనపడతాడు. గనక వీడికో జోడు గుఱ్ఱాలబండీ యిచ్చి, స్వర్గంలో వున్న యావత్తు మహలులు, బగీచాలూ చూపించి, యేం కావాలంటే అది యివ్వండని దేవదూతలతో చెబుతాడు. నా శిష్యుడు, వెంకటేశాన్నికూడా తీసుకొస్తేగాని, నాకేం తోచదని నే చెబుతాను. అప్పుడు నిన్ను విమానమ్మీద తీసుకొస్తారు. మన విఁద్దరం స్వర్గంలో మజా వుడాయిద్దాం. యీవేళకి మతంమీద యింతవరకు లెక్చరు చాలును. యిక వెళ్లి దేవాలయం తోటలో కోతిపిల్లిని కఱ్ఱ ఆడుకో. సాయంత్రానికి నీతండ్రి వొచ్చేసరికి మాత్రం, దీపంయదట కూచుని పుస్తకం తిరగేస్తూ పులు సటుకులు ధ్యానంచెయ్యి. యింగువవేసి బలేసొగుసుగా తయారుచేస్తాను (వెంకటేశం వెళ్లును.) రనెవే.
(బుచ్చమ్మ ప్రవేశించి.)
బుచ్చమ్మ యీ రుబ్బురోలునిండా తాటా`కుముక్కలు పడుతున్నాయి, యివతలకి లాగేసిపెడతారూ.
గిరీ అదెంతపని.
(గిరీశం రుబ్బురోలు, పందిరి అవతలకులాగును. బుచ్చమ్మ రుబ్బురోలు కడిగి మినపపప్పు రుబ్బును.)
గిరీ (పాడును) "భజగోవిందం. భజగోవిందం. గోవిందం భజమూఢమతే" యేం, వదినా, కంటనీరు పెడుతున్నారూ?
బుచ్చ యేవీఁలేదు.
గిరీ మీరు కంటనీరు పెడితే నామనసు కలిగిపోతూంది.
బుచ్చ మీకేం - మహరాజులు - మాకష్టాలు మమ్మల్నే బాధిస్తాయి.
గిరీ యేమి కనికరం లేనిమాట అన్నారూ! మీరు అలా దుఃఖంలో ములిగివుంటే, యెందుకు నాకీ వెధవ బతుకు? మీకోసం యేం చెయ్యమంటే అది చాస్తానే? ప్రాణవిఁచ్చెయ్యమంటే యిచ్చేస్తానే? దాఖలా చూడండి యిదుగో కత్తిపీట!
బుచ్చ (కత్తిపీట దగ్గిరతీసుకుని) చెల్లికి యీ సమ్మంధం తప్పించారు కారుగదా?
గిరీ అదొక్కటిమట్టుకు నాకు సాధ్యవైఁందికాదు.
బుచ్చ అయితే మీతో నాకేం పనీ? యింత సందడిగా పెళ్లిపనులు చేయిస్తున్నారు. మానాన్నకి తోచకపోతే, మీకైనా తోచకూడదా, యీ సమ్మంధం కూడదని? మీకుకూడా దానిమీద యింత కనికరం లేకపోవాలా`? లుబ్ధావుఁధాన్లు మీకు అన్నగారని కాబోలు మీకు సంతోషం.
గిరీ నాకాసంతోషం? యంత క్రూరమైనమాట అన్నారు! యీ సంబంధం ఔతుందని, నా మనస్సులో యంత ఖేదిస్తున్నానో, ఆ భగవంతుడికి తెలుసును. యీ సంబంధం తప్పించాలని చెడచివాట్లుపెడుతూ మా అన్న పేర రెండు టావులు వుత్తరం రాశాను. చెవినిపెట్టా`డుకాడు. నేను యేంచేతును? వాడిని స్మరిస్తేనే పాపంవొస్తుంది. ఊరికే కూచుంటే, మీతండ్రి యేవఁనుకుంటాడో అని, మీయింట అరవ చాకిరీ చేస్తూ నీకు యేనాటికైనా కనికరం వొస్తుందేమో అని ఒక్కమనిషిని నూరుమంది చేసేపని చేస్తున్నాను. అంతేగాని, యీ నమ్మిన నౌఖరుమీద నీమనసు భారంగావుంటే, యవరికీ చెప్పకుండా యీరాత్రిలేచి మాదేశానికి వెళ్లిపోతాను.
బుచ్చ వెళ్లిపోకండి.
గిరీ నేనుమాత్రం పోయే సాధనం యలాగ? యెన్నోమాట్లు యేవఁనుకుంటాను? యీ పెళ్లి తప్పించ లేకపోయినానుగదా? నాప్రాణంకంటే యిష్టవైఁన యీ బంగారపు బొమ్మలాంటి బుచ్చమ్మని పునిస్త్రీని చెయ్య లేకపోయినానుగదా? అని విరక్తిపుట్టి, పోదాం అని నిశ్చయించే సరికి - కాలు ముందుకువేసినా, మనస్సు వెనక్కిలాగి యేమితోచేదీ? "పైకి పోతానని సందడి పడుతున్నాను. నాబుచ్చమ్మ కనపడకపోతే, పోయి బతకడం యలాగ? దానికి యంత కనికరం లేకపోయినా, యిక్కడేవుండి, చూశైనా సంతోషిద్దాం" అని వుండి పోతూ వొచ్చాను.
బుచ్చ మీరు చెబితే, లుబ్ధావుఁధాన్లుగారు పెళ్లి మానుకుంటాడని తమ్ముడుచెప్పా`డు?
గిరీ నే చెప్పినమాట, యీ భూప్రపంచంలో యవడూ కొట్టివెయ్యలేడు. అందుచేత, వెంకటేశం అలా అని వుంటాడుగాని, మీతండ్రి ఒకడు, మా అన్న వకడు లోకాతీతులు. వాళ్లు బ్రహ్మచెబితే వినరు. ఈయనకి వెఱ్ఱికోపం. అతగాడు శుద్ధపీసిరిగొట్టు. మాఅన్న సుఖపడ్డానికా యీపెళ్లి తలపెట్టా`డు? నీమొగుడు నిన్నుపెళ్లాడి యంతసుఖపెట్టాడో, మాఅన్న నీచెల్లెల్ని పెళ్లాడి, అంతే సుఖపెడతాడు. ఆఫ్రికాదేశంలో స్లేవరీ అనివుంది. అనగా మనుషుల్ని వట్టి పశువుల్లాగ బజార్లలో అమ్ముతారు. యవరు కొనుక్కుంటే వాళ్లయింట్లో అయామనిషి బతికినన్నాళ్లూ చాకిరీ చెయ్యాలి. అలాగ్గానే మా అన్న, మీచెల్లెలిని పెళ్లిఅనే మిషపెట్టి, కొంటున్నాడు. వాడింట యిది జీతంలేని బాపనక్కలాగ పనీపాటూ చేస్తుందని, వాడి ఆశ. నేను కూడదని యంత గడ్డిపెట్టినా విన్నాడుకాడు. యీ కష్టాలన్నీ యిలా వుండగా నాకు మరోభయం వేస్తూంది. చెబితే కోపంతెచ్చుకోవుగద?
బుచ్చ మీరేం చెప్పినా నాకు కోపంలేదు.
గిరీ ఆమాత్రం ధైర్యవిఁస్తే, నాక్కావలసిందేవిఁటి? రామచంద్రపురం అగ్రహారీకులు బహు దుర్మార్గులు - మాఅన్న చచ్చిపోయినతరవాత నీ చెల్లెల్ని తిన్నగా ఉండనియ్యరు. అదికూడా మా మీనాక్షి మోస్తరౌతుంది.
బుచ్చ మీనాక్షికేం లోపంవొచ్చింది?
గిరీ యేవఁనిచెప్పను? కడుపుచించుకుంటే కాళ్లమీద పడుతుంది. అయినా నీదగ్గిర నాకు దాపరికం యేవిఁటి? దానిమొగుడు పోయినతరవాత యేటేటా కడుపు అవుతూవుండడం. అయినప్పుడల్లా వొల్లమాలిన అల్లరిన్నీ. ఒకప్పుడు అది ప్రాణభయంకూడా చేస్తుంది. ఆవూళ్లో రావఁప్పంతులని వొక పరమదుర్మార్గుడు నియ్యోగప పంతులు వున్నాడు. వాడు ఒక సానిదాన్ని వుంచుకున్నాడు. యెందరినో సంసార్లని చెడగొట్డాడు. మా అన్న వ్యవహారాలన్నీ ఆపంతులే చూస్తాడు. మా అన్న చచ్చిన ఉత్తరక్షణం, నీ చెల్లెలికి వొల్లమాలిన ధనం చేతిలోకి వొస్తుంది. స్వాతంత్ర్యం కలుగుతుంది. "ఏమి ఇది?" అని అడిగేవాడుండడు. యిహ, చెడిపోవడానికి అభ్యంతరవేఁవిటి? "నేను కట్టుగావున్నానుకానా"? అని నువ్వు అనగలవు. నీ మొగుడితాలూకు ఆస్తి నీ చెయ్యి చిక్కలేదు. మొగుడి యింటికైనా నువ్వు వెళ్లలేదు.
బుచ్చ అవును.
గిరీ తల్లిదండ్రుల చాటున ఖాయిదాగా వున్నావు. పరాయివాడు యింట్లో అడుగుబెట్టలేడు. గాని యిలా యెంతకాలం వెళ్లుతుంది? నిన్ను తల్లితండ్రులు కలకాలం కాపాడలేరుగదా? వాళ్లు పోయినతరవాత నీకూ స్వాతంత్ర్యం వొస్తుంది. యేకాలానికి మనసు యలా వుండునో? అప్పుడు కాలుజారిన తరవాత, నువ్వు యేవఁనుకుంటావు? "అయ్యో నాడు గిరీశాన్ని శాస్త్రోక్తంగా పెళ్లాడి పునిస్త్రీనయిపోతే, పిల్లాపేకా కలిగి, అష్టైశ్వర్యంతో తులతూగుదునుగదా? యీ దురవస్థ నాకు రాకపోవునుగదా"? అని విచారిస్తావు. అప్పుడునే యెక్కడవుంటానూ? స్వర్గంలో మీకోసం యెదురుచూస్తూ వుంటాను. యీ పెళ్లి అయిపోయినతరవాత వెంకటేశమూ, నేనూ పట్ణానికి వెళ్లిపోతాం. నిన్ను, తలుచుకుంటూ నిద్రాహారం మానేసి, కొన్నిరోజులు వుంటాను. యెంతకాలవఁని మనిషన్నవాడు, నిద్రాహారంమాని వుండగలడు? నిన్ను తలుచుకుని తలుచుకుని నిద్దరపట్టక, రెండుఝాముల రాత్రప్పుడు నాగదిలో యీజీచెయిరుమీద కూచునివుండగా - యదట బల్లమీద మెరుపుదీపం, గోడని నిలువుటద్దం వున్నాయి - ఆ అద్దంలో నాముఖం చూసుకుని, యేమంటానూ? "యీ సొగుసైనముఖం, యీ తామరరేకులవంటి నేత్రాలు, యీ సోగమీసాలు. యివన్నీవృధాగదా? యవరు చూసి ఆనందించనూ? నాబుచ్చమ్మ, నన్ను పెళ్లాడక పోయినతరవాత నాబతుకు యెందుకు" అని, నిస్పృహాకలిగి ఛఱ్ఱున టేబిలు సొరుగుతీసి, అందులోవున్న జోడుగుళ్ల పిస్తోలు యెక్కుబెట్టి గుండె దూసిపోయేటట్టు కొట్టేసుకుంటాను.
బుచ్చ కొట్టుకోకండి. మీరు అలా అంటే నాకు యేడుపొస్తుంది.
గిరీ తక్షణం దేవతలు విమానం పంపించి నన్ను స్వర్గానికి తీసుకువెళతారు. స్వర్గానికి వెళ్లా`నని నాకు అక్కడమాత్రం సుఖవుఁంటుందనుకున్నావా వొదినా? నవాభరణభూషితురాలయి రంభతక్కుతూ తారుతూ వొచ్చి, "హా! ప్రియ! గిరీశ! నీలాటి సుందరుణ్ణి యన్నడూ నేను చూడలేదు. రమ్ము, నన్ను చేకొమ్ము," అని రెక్కబట్టుకు లాగుతుంది. నేనేవఁంటానూ? "చీ! అవతలికిపో! - నేను ఏం`టీనాచ్చి! సానిది తాకితే, పరమ అపవిత్రంగా తలుస్తాను. పియర్సు సబ్బురాసి కడిగితేనేగాని యీచేతికి కశ్మలంపోదు. నువ్వారంభవి? మాబుచ్చమ్మ సొగుసుకి నువ్వు వొడ్డీకి పనికిరావు. గోయెవే, డా`మ్‌, డర్టీ గూస్‌" అని అంటాను. అలాగే, మేనకా, ఊర్వసీ, తిలోత్తమా మొదలైన యావన్మంది అప్సరస్త్రీలనీ తన్ని తగలేస్తాను. తగిలేసి, కాషాయ వస్త్రాలు ధరించి కల్పవృక్షచ్ఛాయని "హా! బుచ్చమ్మా, బుచ్చమ్మా" అని నీపేరు జపంచేస్తూ అనేక సంవత్సరాలు పద్మాసనంమీద వుండిపోతాను. అంతట కొన్నాళ్లకి నాతపస్సు ఫలించి, నువ్వు నందనవనంలోకి చంద్రోదయంలాగ బయలుదేరి వస్తావు. నేను "ప్రియురాలా! యెన్నాళ్లకి వొచ్చావు!" అని, అమాంతంగా వెళ్లి నిన్ను కౌగలించుకుంటాను. అప్పుడు నీ మొదటి మొగుడు, ముసలివెధవ, గావంచా గుడ్డకట్టుకుని, పొడుంముక్కుతో, "బుచ్చమ్మ నా పెళ్లాం" అని అడ్డురాబోతాడు. "వెధవాయా, నువ్వు బుచ్చమ్మకి తగవు. నీ రూపాయలు నువ్వు పట్టుకుపో" అని, వొక్కతాపు తన్ని తగిలేస్తాను. మనం యిద్దరం సుఖంగా స్వర్గంలో శాశ్వతంగా వుండిపోతాం.
బుచ్చ యేడుస్తూన్న దాన్ని నవ్విస్తారు.
గిరీ నువ్వు నన్ను పెళ్లాడితే, మనం బతికున్నంతకాలం నవ్వుకుంటూ, ఆనందిస్తూ కాలం వెళ్లబుచ్చుతాం. అప్పుడు నిన్ను యిలా పప్పురుబ్బనిస్తానా? మనకి యెంతమంది నౌఖర్లువుంటారు! యెంతమంది చాకర్లు వుంటారు! తోటలు, దొడ్లు, గుఱ్ఱాలు, బళ్లు! నిన్ను నడవనిస్తానా? పుష్పంలాగ నెత్తిమీద పెట్టుకుంటాను. అప్పుడు నీకు కలిగే ఆనందం ఆలోచించుకో.
బుచ్చమ్మ నా జన్మానికి మరి ఆనంద వెఁక్కడిది?
గిరీ నేను, నీకు దాసుడనై "యిదుగో నన్ను స్వీకరించు. నన్ను పెళ్లాడి ఆజన్మం ఆనందం అనుభవించు. నన్ను ఆనందంలో ముంచు" అని బతిమాలుకుంటూంటే, నువ్వు అట్టి సులభసాధ్యమైన సుఖమును కాలున తన్నుకు వెళ్లిపోయి, నాబతుకు కూడా బుగ్గిని కలిపితే, నేనేమి చెయ్యగలను?
బుచ్చ మీ బతుక్కి లోపవేఁవిఁ? మీరు మహరాజులు.
గిరీ నువ్వు నన్ను పెళ్లాడితే నేను మహరాజునే అవుతాను. నీ నోటంట వచ్చిన మాట అమోఘం - వొట్టినే పోకూడదు. గనక నాతో వెళ్లిపోయిరా.
బుచ్చ అమ్మ నాయనా! నే మీతోరాను.
గిరీ సరే. రాకపోతే నేనేగదా ప్రాణత్యాగం చేస్తాను? పీడానాడాకూడా పాయె.
బుచ్చ అలాంటి మాటలు అనకండి.
గిరీ చేసేమాట, చెబితే తప్పేమిటి? నేనేమైతేనేంగాని, నీ చెల్లెలిమీదైనా నీకు కనికరం కద్దా?
బుచ్చ అదేం, అలా అడుగుతున్నారు?
గిరీ నిజంగా కనికరంవుందా?
బుచ్చ వుండకుండా వుంటుందా?
గిరీ వుంటే, యీ పెళ్లి తప్పించే సాధనం నీ చేతులోనేవుంది.
బుచ్చ నా చేతులోనా?
గిరీ అక్షరాలా.
బుచ్చ యేమి చిత్రమైన మాటలు చెబుతారు!
గిరీ యీ భూప్రపంచంమీద వుండుకున్న యావన్మంది స్త్రీలలోనూ, నిన్నొక్కర్తెనూ వలిసి, నేను నీకు సుతలామూ లొంగిపోబట్టిగదా, నాబతుకు హాస్యాలకింద ఐపోయింది.
బుచ్చ మీతోడు-అలా అనకండి.
గిరీ పోనియి - ఆమాత్రం భరవసాయిచ్చావు. ఒకమాట నాకు ప్ర`మాణ పూర్తిగాచెప్పు. నీ చెల్లెలు పెళ్లి తప్పించడం, నీచేత అయితే, చేస్తావా?
బుచ్చ చెయ్యనా?
గిరీ యేమో, చేస్తావో చెయ్యవో! చేస్తానని ప్ర`మాణంచేస్తేనే, ఆమాట నేను చెబుతాను.
బుచ్చ యాఁవఁని ప్ర`మాణం చెయ్మన్నారు?
గిరీ నామీద ప్ర`మాణం చెయ్యి.
బుచ్చ మీమీద ప్ర`మాణమే; చెప్పండి.
గిరీ అయితే విను. వొంటరిగా చూసి, యీమాటేనీతో రహస్యంగా చెప్పుదావఁని కాచి, కాచివుండగా, యీవేళ, మీతండ్రి వూరికి వెళ్లడం, మీతల్లి వాకట వుండడంనుంచి, సమయం చిక్కింది. చెవివొగ్గివిను. నీచెల్లెలి పెళ్లి తప్పడానికి ఒక్కటే సాధనంవుంది. అది యేవిఁటంటే, నువ్వు ముందూవెనకా ఆలోచించక, నాతో లేచివచ్చి నన్ను పెళ్లిచేసుకోవడవేఁ - లేకుంటే నీచెల్లెలి పెళ్లితప్పదు.
బుచ్చ (ముసిముసి నవ్వుతో) నేను మీతో లేచివొస్తే మాచెల్లెలు పెళ్లి ఆగిపోతుందీ? యేవిఁచిత్రాలు!
గిరీ ఆమాట నీచేతనే వొప్పిస్తానుకదూ - విను - పెళ్లికి తర్లి వెళ్లుతూన్నప్పుడు, రెండోనాడు రాత్రి బండీవాడి చేతులో నాలుగు రూపాయలుపెట్టి, నీబండీ తోవతప్పించి అనకా పిల్లి రోడ్డులో పెట్టిస్తాను. అక్కడనుంచి రామవరందాకా మా స్నేహితులు అంచీబళ్లు ఖణాయిస్తారు. ఆడుతూ పాడుతూ, మనం దౌడాయించి రామవరంలో పెళ్లాడేసుకుని సుఖంగావుందాం. యిక మీవాళ్ల సంగతి యేవౌఁతుందీ? మనం వుడాయించిన మన్నాడు తెల్లవారగట్ల, నీబండీ కనపడక, కలవిలపడి, మీవాళ్లు నెత్తీ నోరూ కొట్టుకుంటారు. నీచెల్లెలు పెళ్లి ఆగిపోతుంది. మరి రెండు రోజులికి మనం పెళ్లా`డా`వఁని తెలుస్తుంది. నిన్ను ముసలివాడికి కట్టిబెట్టినందువల్ల కలిగిన చిక్కులు చూస్తూ, నీతండ్రి నీచెల్లెలికి మళ్లీ ముసలిసంబంధం చెయ్యడు. నీతండ్రి ఒకవేళ మూర్ఖించి పెళ్లి చేస్తానన్నా, మన తమాషా విన్నతరవాత, నా అన్న నీ చెల్లెల్ని మరి పెళ్లి చేసుకోడు. యిది సిద్ధాంతం. అవునాకాదా?
బుచ్చ అవును కాబోలు.
గిరీ అయితే మరి అందుకు సమ్మతేనా?
బుచ్చ యెందుకు?
గిరీ నాతో వెళ్లిపోయి రావడానికి.
బుచ్చ అమ్మ నాయనా, నా ప్రా`ణంపోతే నేను మీతోరాను.
గిరీ రాకపోతే, మీచెల్లెలికి యీపెళ్లీ తప్పదూ, నాకు చావూ తప్పదూ.
బుచ్చ అలా అనకండి.
గిరీ అనకపోతేమాత్రం, చావు తప్పేదుందిగనకనా? నిన్ను వొదిలి బతకలేను, అది వకచావు. నువ్వు నామీద వొట్టువేసుకుని ఆమాట తప్పిపోతే, నన్ను దేవుఁడే చంపేస్తాడు. అది రెండోచావు. మరి నాకు చావు యెలా తప్పుతుంది?
బుచ్చ నానించి మీరు చచ్చిపోతే, నేనూ చచ్చిపోతాను. చచ్చిపోకండి.
గిరీ నావశవాఁ? అడుగో నీతమ్ముడు వొస్తున్నాడు. మరి మనం యీ కష్టసుఖాలు మాట్లాడుకోడానికి వీలుచిక్కదు. ఒక్కమాట చెప్పు. బతకమన్నావా? చావమన్నావా?
బుచ్చ వెయ్యేళ్లూ బతకండి.
గిరీ అలాగైతే, నాతోరావడం ఖాయవేఁనా?
బుచ్చ యేంజెయమంటే అది చాస్తాను.
(వెంకటేశం మిడతనుపట్టుకు ప్రవేశించును.)
వెంక యిదుగోనండోయి, గొల్లభావఁనిపట్టుకున్నాను.
గిరీ చూశావూ, వొదినా! నీతమ్ముడు చిన్నగుంటడయీ, అప్పుడే గొల్లభావఁల్ని పట్టు గుంటున్నాడు.
బుచ్చ (ముసిముసినవ్వు నవ్వుచు) మిడత!
గిరీ (బుచ్చమ్మతో) యిన్నాళ్లకి మిడతంభొట్లు చేతులో చిక్కా`డు. (వెంకటేశంతో) యిలాతే - మిడతల్ని పట్టుకోవడం మంచి ఎడ్యుకేషన్‌. యిదే, నాచురల్‌ హిస్టరీ, ప్రకృతిశాస్త్రం అంటారు.
వెంక అక్కయ్యా - కొంచం ఊరుబిండి!
బుచ్చ అమ్మ చూస్తే తంతుంది.
వెంక అమ్మచూడదులే. (ఊరుబిండి చేతులో వేసుకుని నాలుకతోనాకి గెంతును.)
(తెరదించవలెను.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)