నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
కన్యాశుల్కము - పంచమాంకము.
౧-వ స్థలము. లుబ్ధావధాన్లు పడకగది.
(లుబ్ధావధాన్లు మంచముమీద పరుండివుండును. నిద్రలో అరచి, కాళ్లూ చేతులూ కొట్టుకుని, లేచికూచుని వణకనారంభించును.)
లుబ్ధా అసిరిగా! అసిరిగా! అమ్మీ! చంపేశాడఱ్ఱోయి. రామనామతారకం । రామనామతారకం । రామనామతారకం । రామనామతారకం ॥ యిది రెండోపెళ్లి ముండే. దీనిమొగుడు పిశాచ వైఁనాడు - నాపీకపిసికి చంపేస్తాడు. యేవిఁటి సాధనం? రామనామతారకం । రామనామతారకం ॥
(తలుపు అవతలనుంచి) అసిరిగాడు- యేటిబాబూ? యేటిబాబూ? (తలుపుతట్టును.)
మీనా యేవిఁటినాన్నా, తలుపుతియ్యి.
లుబ్ధా (తనలో) కాళ్లు ఆడవు. చేతులు వొణుకుతున్నాయి. (తలుపుతీయును; అసిరిగాడితో) వెధవా నువ్వు లోపలికిరాకు.
అసిరి నాను పిలుస్తొస్సినాను (నిష్క్రమించును.)
(మీనాక్షి - శిష్యుడు ప్రవేశింతురు.)
లుబ్ధా (మీనాక్షితో) ఆముండని అవతలుండమను.
మీనా నువ్వు మనగదిలోకి వెళ్లిపో అమ్మా (శిష్యుడు గది అవతలకివెళ్లును) యేవిఁటినాన్నా?
లుబ్ధా యిహ, నేబతకను.
మీనా యేవొఁచ్చింది నాన్నా, కడుపునొప్పా` కాలునొప్పా`?
లుబ్ధా కడుపునొప్పీకాదు, కాలునొప్పీకాదు. వెధవముండని పెళ్లాడిన కుంకపీనుగ బతకడం యలాగ?
మీనా యేవిఁటా వోగాయిత్యం మాటలు, నాన్నా? మీకు యీలేనిపోని అనుమానం యవరుపెట్టా`రు?
లుబ్ధా అనుమానవేఁవిఁటి? నిజం, నిజం, నిజం - వూరంతా అదేమాట.
మీనా యీరావఁప్పంతులే యిలాంటి అపవాదులన్నీ వేస్తూవుంటాడు. కనపడ్డవాడితోఅల్లా వూసు పెడితే, వూరంతా అనుకోరూ? బంగారంలాంటి పిల్లని యిలాంటిమాటలని బెంబేరు పెట్టకండి. తండ్రి వెళ్లిపోయినాడని అది రాత్రీపొగలూ యేడుస్తూంది.
లుబ్ధా వెధవతండ్రీ, బోడితండ్రీని! గాడిద`కొడుకు రెండో పెళ్లిముండని నా పీకకి ముడేసి అమాంతంగా నాకొంప ముంచా`డు. యిహ బతకను యిహ బతకను.
మీనా "రెండో పెళ్లిముండ, రెండో పెళ్లిముండ," అని శుభమల్లే అనకండి. మీరే యిలా సాటుతూవుంటే వూరంతా అనడం ఆశ్చర్యవాఁ? మాట్లాడక వూరుకోండి.
లుబ్ధా వూరుకోవడ వెఁలాగే? మనవూరా, మనదేశవాఁ? రెండో పెళ్లి ముండ కాకపోతే ఆతండ్రి వెధవ, పేరయినా చెప్పకుండా పారిపోవడవేఁవిఁ?
మీనా సిద్ధాంతితో చెప్పా`ట్టే, పేరు?
లుబ్ధా వాడి శ్రాద్ధం చెప్పాడు. సిద్ధాంతి గడియకో పేరు చెబుతున్నాడు.
మీనా అతగాడికి మాత్రం కొత్తవాడి పేరు జ్ఞాపకంవుంటుందా యేవిఁటి? మనపిల్ల మనయింట్లో వున్నతరవాత, అతగాడి పేరుతో మీకేంపని?
లుబ్ధా యీ పెళ్లాం ముండ నాయింట్లో వుంటే నేను చచ్చిపోతాను; మరిబతకను.
మీనా వెఱ్ఱి కేకలెయ్క నోరు మూసుకుని వూరుకోండి. యిరుగుపొరుగువారు నవ్వగల్రు. మీ మావఁగారు యంతపండితుడు, యంతదొడ్డమనిషి! లేనిపోని అనుమానాలు పెట్టుగోకండి. పసిపిల్ల బెంగెట్టుకోగల్దు.
లుబ్ధా ఓసి భ్రష్టా! వాడు నీకేవఁయినా యిచ్చాడా యేవిఁటే, వాణ్ణి వెనకేసుకు మాట్లాడుతున్నావు? నీకు నేను చచ్చిపోవాలని వుందికాబోలు!
మీనా యేవిఁటా మతిపోయిన మాటలు! అతగాడు రేపో నేడో వొచ్చి, యిలాంటి మాట్లన్నందుకు మన నోట్లో గడ్డిపెడతాడు.
లుబ్ధా అతగాడెవడు, వొల్లకాట్లో రావఁనాధాయ! మరెక్కడొస్తాడు వాడు! యిహ, నాకు చావుసిద్ధం.
మీనా మీకు చావేం వొచ్చింది యిప్పుడు? ఒహవేళ రెండోపెళ్లి పిల్ల అయితే మాత్రం, గుప్‌చప్‌ అని వూరుకోవాలిగాని, అల్లరి చేసుకుంటారా? యీరోజుల్లో యంతమంది రెండోపెళ్లి చేసుకుని సుఖంగా వున్నారుకారు? పిల్ల బుద్ధిమంతురాలు. మీ అదృష్టంవల్ల దొరికింది. మాట్లాడక వూరుకోండి.
లుబ్ధా నా అదృష్టం తగలబడ్డట్టేవుంది. నీకేం పోయీకాలం వొచ్చిందే! నువ్వుకూడా యీ కుట్రలోచేరి, నీతండ్రికి కళ్లుగప్పి వెధవపెళ్లి చేశావే? అయ్యో వెధవని పెళ్లి చేసుకున్న కుంకవెధవా నీ బుద్ధెక్కడికి పోయిందిరా? నీ చదువెక్కడికి పోయిందిరా? నీ వేదం తగలబడనూ - యిహ బతకను!
(మీనాక్షి నవ్వును.)
లుబ్ధా నవ్వుతావేవేఁ భ్రష్టాకారిముండా? నువ్వూ, నీసవిత్తల్లీ నన్ను చంపేసి రాజమహేంద్రం పారిపోయి, వెధవపెళ్లి చేసుకుంటారు. నాకు తెలుసును. గిరీశంగాడు అన్నమాట నిజం. వెధవని చెవిపెట్టా`నుకాను. నా సొమ్మంతా ఘటాశ్రాద్ధప వెధవల పాలవుతుంది. నువ్వుపో, నేను పడుకుంటాను. (పక్కమీద పడుకుంటూ) మళ్లీవొస్తాడు గాబోల్రా దేవుఁడా!
మీనా యవరు నాన్నా?
లుబ్ధా నువుపో, నీకెందుకు! ఆవెధవ నాపీకపిసికేస్తాడు. నీకోరిక తీరుతుంది.
మీనా మీరలా అంటే నాకు యేడుపొస్తుంది. నేనిక్కణ్ణించి కదలను. యవడాపీకపిసికేవాడు?
లుబ్ధా అయితే యిక్కడ పక్కేసుకుపడుకో.
మీనా పడుకుంటాను. యవడు మీపీకపిసుకుతాడు?
లుబ్ధా ఆముండ మొదటిమొగుడే. యిందాకా నువురాకముందు, నాగుండెలమీదెక్కి, పీకపిసికేటప్పటికి ప్రా`ణం పోయిందనుకున్నాను.
మీనా నిజంగానూ! - కలగన్నారు కాబోలు - నాన్నా.
లుబ్ధా కలెక్కడి కలే! పీక నులుచుకుపోతేనూ!
మీనా మొదటిమొగుణ్ణి మీకేం తెలుసును?
లుబ్ధా వాడే చెప్పాడే! "వెధవా! నాపెళ్లాన్ని పెళ్లాడా`వు; నిన్ను చంపేస్తా"నన్నాడే.
మీనా యలా వుంటాడు?
లుబ్ధా గిరీశంగాడి మూడు మూర్తులూనే.
మీనా కలగాబోలు నాన్నా. అదే తలుచుకు పడుకుంటే, చిన్నబాబు కల్లోకొచ్చాడు కాబోలు.
లుబ్ధా నేను చస్తే యవరికి విచారం!
మీనా ఆపిల్లని వెళ్లి అడుగుదునా?
లుబ్ధా వొద్దు, వొద్దు, తొందరపడకు.
మీనా నన్ను తిట్టేస్తున్నారు, దాని చచ్చినమొగుడు మిమ్మలిని చంపేస్తాడని భయపడుతున్నారు. యెందుకీతంబళ అనుమానం? ఓమాటు దాన్నేడిగేస్తే ఉన్ననిజం తెలిసిపోతుంది.
లుబ్ధా నిజం నీతో చెబుతుందీ?
మీనా నాతో నిజం చెబుతుంది. అది వొట్టి సత్యకాలప్పిల్ల. నాకు యంతో వుపచారం చేస్తుంది.
లుబ్ధా దాన్ని పాడుచేస్తున్నావూ?
మీనా యిలాంటి మాటలంటేనే నాకు అసయ్యం. మీరు యక్కడో దడుసుకున్నారు కాబోలు; అంచేత దుష్టుకల వొచ్చింది. అంతేగాని, రెండోపెళ్లీ, మూడోపెళ్లి, అని, వెఱ్ఱులు వోడకండి. పూజారి గవరయ్యని పిలుస్తాను; అతగాడు యింత మంత్రించి వీపూదియిస్తాడు రాసుకుపడుకొండి.
లుబ్ధా కొంపతీస్తావా యేవిఁటి? వాడొస్తే, వాడితో యేవఁని చెప్పడం? దాన్నే నిజం అడుగుదూ.
మీనా నే నడగను, నాన్నా, నన్ను అడ్డవైఁన మాటలూ అంటూంటే, నే నెందుకు అడుగుతానూ? నేం దాంతో యిగమాట్లే ఆణ్ణు.
లుబ్ధా నాతల్లివికాదూ, అడుగమ్మా.
(మీనాక్షి పైకివెళ్లును.)
లుబ్ధా ఓ పన్నం యాకర బెట్టేదా? గాయత్రీ స్మరణ చేసేదా? వేదాలూ, మహామంత్రాలూ, యీ దెయ్యాలకి పేలపిండి వొడియాలు. శాపరమంత్రాలు ఉపదేశం అవుదావఁంటే, బెడిసి గొడతాయేమో అని భయం. యేవిఁసాధనం? "రామనామతారకం" స్మరణ చేస్తాను. "రామనామతారకం । భక్తిముక్తిదాయకం । జానకీమనోహరం । సర్వలోకనాయకం । రామనామతారకం । రామనామతారకం" యీముండ యింట్లోవుంటే, నే బతకను. "రామనామతారకం । రామనామతారకం" ॥ రుద్రాక్షతావళంయేదీ? (మంచము అంచునకూచుని పరుపుకింద తడివిఁ, రుద్రాక్షతావళం తీయుచుండగా మీనాక్షి ప్రవేశించి.)
మీనాక్షి మీమాట నిజవేఁ నాన్నా!
లుబ్ధా నిజవేఁ!
(మంచముమీదినుంచి కింద కూలబడును.)
మీనాక్షి (లేవదీసి) నాన్నా! నాన్నా! పడిపోయినావేవిఁ?
లుబ్ధా యేవీఁలేదూ. నిజవేఁ! నిజవేఁ!
మీనా నిజవేఁను. ఆమొగుడు యిప్పుడే దానిక్కూడా కనపడి, "ముండా, మళ్లీ పెళ్లాడావే? నీ కొత్తమొగుణ్ణి పీకపిసికేస్తాను చూడు" అన్నాట్ట.
లుబ్ధా అయ్యో! అయ్యో! రామప్పంతులు యిల్లు వొల్లకాడు కానూ! యక్కడ కల్పించాడే యీమాయపెళ్లి నాకోసం! వీడి పిండం పిల్లులికి పెట్టా! అయ్యో! అయ్యో! ఆమొగుడు వెధవయలా వున్నాడందే?
మీనా వాడు రోజూ దానికి కనపడతాట్ట నాన్నా. వాడికి మీసాలూ, గిరజాలూ వున్నాయట, చావఁం చాయట.
లుబ్ధా వాడేనే! వాడేనే! యేవిఁటే సాధనం? యిహ నేం దక్కను.
మీనా పూజారి గవరయ్యకి కబురుపెడతాను.
లుబ్ధా వొద్దు, వొద్దు, నామాటవిను. వాడొచ్చాడంటే, యిల్లు తినేస్తాడు.
మీనా తింటేతింటాడు. ప్రాణంకంటేనా యేవిఁటి?
లుబ్ధా

నాకొద్దంటూంటే వినవుగదా. నువ్వు నామంచం దగ్గిర పక్కేసుకుపడుకో; నువ్వు చదువుకునే భాగవతం పుస్తకం పట్రా; తలకిందపెట్టుకు పడుకుంటాను.

(మీనాక్షి వెళ్లును.)

యీముండ నాయింట్లోంచి విరగడైపోతేనేగాని, యీ పిశాచం వొదిలిపోడు. వేదం చదువుకున్న ముండాకొడుకుని, నామీదే పడ్డతరవాత, వీడు బ్రహ్మరాక్షసిగాని, వొట్టిదెయ్యంకాడు. పోనీ అతడికే ప్రార్ధనచేస్తాను - "నాపెళ్లాం మొదటిమొగుడా!" ఆఁ! నాపెళ్లాం కాదు. లెంపలు వాయించుకుంటాను. "యీపిల్ల మొగుడా! నువ్వే నిజవైఁన మొగుడివి - నేనుకాను. దాన్ని ముట్టను - తాకను - దాంచేత చాకిరీ అయినా చేయించను. నన్ను రక్షించి, పీకపిసికెయ్యకు; పీకపిసికెయ్యకు; యేపాపం చెయబట్టో దెయ్యానివైనావు. నన్ను చంపావంటె బ్రహ్మహత్య చుట్టుకుంటుంది. మరిజన్మం వుండదు. బాబూ! నాయనా! తండ్రీ! నాజోలికి రాకు. నీమావఁగారి పీకనులివెఁయ్యి! ఆరావఁప్పంతులుగాడి పీకనులివెఁయ్యి! లేకపోతే," (కేకలు, యేడ్పు వినబడును) ఓరిదేవుడా, మళ్లీ వొచ్చాడు కాబోలు (శిష్యుడు యేడుస్తూ పరిగెత్తివచ్చి లుబ్ధావధాన్లును గట్టిగా కౌగలించుకొనును. మీనాక్షి శిష్యుణ్ణి చీపురుగట్టతో కొట్టబోవును. శిష్యుడు తప్పించుకోగా, దెబ్బలు లుబ్ధావధాన్లకు తగులును.)

మీనా ముండా! నామొహురు అక్కడపడేస్తావా పడెయ్యవా? నాతాళం యేదేలంజా?
లుబ్ధా నన్ను కొట్టేశావేవిఁటే? (శిష్యుడితో) వొదులు, వొదులు. నన్ను ముట్టుకోకే తల్లీ (మీనాక్షితో) దీని అపవిత్రపు వొళ్లుతగిల్తే చచ్చిపోతాను. నన్ను వొదిలిపించెయ్యి.
(మీనాక్షి శిష్యుడి రెక్కలుపట్టిలాగి, బుగ్గగిల్లును. శిష్యుడు మీనాక్షి చెయ్యికరిచి పారిపోవును.)
మీనాక్షి దానమ్మ కడుపుకాలా, చెయ్యి కరిచేసింది నాన్నా - రక్తం బొటబొట కారుతూంది - దీన్ని హతవాఁరుస్తాను.
లుబ్ధా యంత దారుణప్పని చేసిందీ, ముండ! యేదమ్మా చెయ్యి (గుడ్డపీరికతో రక్తంతుడిచి) మొహురడిగావుగదా యెక్కడిదేవిఁటి?
మీనాక్షి ఆతండ్రివెధవ నాకిమ్మని యీముండచేతికి యిచ్చాడు. దీనినక్క వినయాలు చూసి నాపెట్టా`బా`డా దానికే వప్పజెప్పి, ఆమొహురు దాన్నే దాచమన్నాను. అనుమానవేఁసి యిప్పుడు నామోరుతెమ్మంటే, "బట్టలపెట్లో పెట్టా`ను తాళంపోయింది" అంది. తాళంతా`కపోతే రోకలితో బుఱ్ఱ చితకబొడుస్తాను.
లుబ్ధా చెయిజేసుకోకు. నీది వెఱ్ఱికోపం చావగొట్టగలవు జాగ్రత!
మీనా చస్తే యీడిచిపారేస్తాను. ముండయలా కరిచిందో చూడండీ. యింకా రక్తంకారుతూందీ. మనిషికాటుకి మందులేదన్నాడు.
లుబ్ధా కుంకం పెట్టమ్మా.
మీనా దానిబుఱ్ఱ చితకబొడిచి మరీ పెడతాను (మీనాక్షి వెళ్లును.)
లుబ్ధా గుండుగొమ్ముల అనుమానం తీరిపోయింది - పీకనులివిఁ, వాడైనా చంపేస్తాడు; కరిచి అదైనా చంపేస్తుంది. వీడిచేతో, దానిచేతో, చావుతప్పదు. యెంతడబ్బెట్టి కొనుక్కున్నాన్రా, యీచావుపెళ్లీ! అయ్యో! అయ్యో! దీన్ని పైకి తగిలేస్తే వాడుకూడా విరగడైపోతాడు. అదేసాధనం - యెక్కడికితోలెయ్యను? బండీమీద యెక్కించి పట్ణంతోలేస్తాను - అక్కడగానీ తండ్రి వెధవ కనపడకపోతే మళ్లీ దెయ్యాన్ని నెత్తినిపెట్టుకుని ప్రత్యక్షం అవుతుందే! బండి అద్దె యిచ్చుకోవడవేఁ మిగుల్తుంది - యేమి సాధనం? - యేమిసాధనం? - రావఁప్పంతుల్ని సలహా అడుగుదునా? ఆఁ! మంచి ఆలోచన తోచింది. - రామప్పంతులు నాకు కట్టిపెట్టిన యీ ముండని, వాడిదగ్గిరికే పంపించేస్తాను - సానిదాంతోపాటు దీన్ని కూడా వుంచుకుంటాడు. - కావలిస్తే పదిరూపాయలు దక్షిణతోకూడా యిచ్చేస్తాను.
(మీనాక్షి ప్రవేశించి.)
మీనా యక్కడా కనపడదు నాన్నా గుంట.
లుబ్ధా నూతులో పళ్లేదుగద?
మీనా యేమో!
లుబ్ధా పరిగెత్తెళ్లి గవరైని పిలవమను. దాన్ని నువ్వు చావగొట్టలేదుగద?
మీనా కనపడితేనా?
లుబ్ధా యేవిఁటినాయనా, యీకొత్త ఉపద్రం!
(నిష్క్రమింతురు.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)