నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౨-వ స్థలము. రామప్పంతులు యింట్లో కొట్టుగది.
(భుక్త, పోలిశెట్టి, సిద్ధాంతి, మధురవాణి పేకాడుచుందురు. పూజారి గవరయ్య ఆట చూచుచుండును.)
పోలిశెట్టి యేంభష్టాకారి ముక్కలు యేశావయ్యా! యెప్పుడూనువ్వింతేను.
భుక్త చూసివేశానా యేవిఁటి? నీ దరిద్రదేవతని తిట్టు.
పోలి గవరయ్యా, నీముణుకు నాదగ్గిర యిలా యెట్టకు. లేచిపో, నీపుణ్యవుఁంటుంది.
గవ నేను మా మధురవాణిదగ్గిర కూచుంటాను.
భక్త చూడూ, ముక్కతప్పు పడ్డట్టుంది.
పోలి ఆఁ! బాపనయ్య పంచాలని తప్పు పంచుతున్నావు. తప్పు పంచితే బేస్తుమీద కుదేలెట్టిస్తాను.
భుక్త ముక్కలు బాగా పడలేదన్నావే?
పోలి రెండో యేత నాలుగాసులడకూడదా?
భుక్త (పోలిశెట్టికి ముక్కలువేస్తూ,) యిదుగో నాలుగాసులేస్తున్నాను. జుఱ్ఱు.
పోలి నీయిషపచేత్తో యేస్తే, పొల్లుముక్కలే పడతాయి; మంచి ముక్కలడతాయా?
భుక్త తథాస్తు!
పోలి అలా అనకు. యెంతశెడ్డా బాపనాడి శాపనాకారం మాశెడ్డది. (చూచుకొని) శీ! భష్టాకారి ముక్కలు!
సిద్ధాం ఒకటి, రెండు.
పోలి అదుగో, అలాశెప్పితే నే వొప్పను, ఒక్కొకటి శెప్పాలి.
సిద్ధాం అయితేవకటి.
పోలి ఒక్కటీ.
మధురవాణి ఒకటి.
భుక్త వకటి.
(సిద్ధాంతి ఆలోచించును.)
పోలి యే టాలోసిస్తావు చే తరస! యెత్తవయ్యా.
సిద్ధాం నీదేంపోయింది! రెండు.
పోలి లాంతరేశావు. యేటెత్తను? రొండు.
మధు రెండు.
భుక్త రొండు.
(సిద్ధాంతి ఆలోచించును.)
పోలి యే టాలోసిస్తావు? చే తరస; యెత్తి బేస్తుగెలుసుకో.
సిద్ధాం నువు చెప్పా`వుగనక యెత్తుతాను.
పోలి ఆఁ! డబ్బక్కడెట్టి మరీయెత్తు. మూడో యెత్తడపుబేస్తు; గా`పకవుఁందా? బేస్తుమీద కుదేలెట్టిఁ బాకీ లెట్టి, యగెయడానికా?
సిద్ధాం (తనముక్కలు యెత్తుముక్కలమీదవేసి) కోవఁటాడి పిలక నిగుడుతూంది!
పోలి తంతావాయేటి?
సిద్ధాం తన్నడవఁంటే, ఒహలాగనా?
పోలి నా ఆట శెడగొట్టేశినావు, బాపనయ్యా!
భుక్త ముక్కలు పడలేదని యేడుస్తూ, మళ్లీ యేవిఁటి, ఆట చెడగొట్టా`డని యేడుస్తావు?
పోలి యీ ఆట బేస్తుచేయించకపోతే నా పేరు-
సిద్ధాం కోవఁటాడా, నోరు మూసుకుంటావా మూసుకోవా?
పోలి తెల్లాడిబావుటా యెగురుతుండగా, నీ జులువేఁటి? ముక్కల్తియ్యడం యింతసేపైతే, మరాటేటి?
సిద్ధాం నువ్వుగానీ మళ్లీ మాట్లా`డావంటే, ముక్కలు కలిపెస్తాను.
(పోలిశెట్టి "నేను మాటాడను; నువ్వు ఆడు" అని సౌజ్ఞచేయును. సిద్ధాంతి ఆడును.)
పోలి మూడే తురుపులుపడ్డాయి బాపనాడా; "తమాషాదేఖో, లంకకేరాజా!"
సిద్ధాం ఆటపారెయనా?
పోలి బుద్ధొచ్చింది; బుద్ధొచ్చింది. లెంపలోయించుకుంటాను. మరి మాటాడితొట్టు.
పూజారి

మా మధురవాణిమీద ఆశుకవిత్వం చెబుతాను.

రాణా, డైమనురాణీ? ।
రాణా, యిస్పేటురాణి? రాణి కళావ ।
ఱ్ఱాణా, ఆఠీన్రాణీ? ।
రాణి యనన్మధురవాణె, రాజులరాణీ ॥
సిద్ధాం గవరయ్యా! యేంవిలవైన పద్యం చెప్పా`వోయి! నీమీద నేను పద్యంచెబుతాను - విను.
"గవరయ్యా! నీసరి మరి ।
యెవరయ్యా?"
పూజారి "యెవరు లేరు, యిచ్చోనయ్యా!"
సిద్ధాం యిదిగో రాజు.
పోలి యిదుగో పాల్తు.
(మధురవాణి తురుఫురాణీ వేయును.)
పోలి అదుగో, అదుగో, యీ బాపనాడు కపీశంశెప్పి, మధురవోణిదగ్గిర రాణీ వుందని శెప్పేశాడు. గోరం, గోరం. గవరయగానీ మాటాడితే నే ఆటాణ్ణు.
పూజారి పోలిశెట్టిమీద కవిత్వంచెప్పి చాలారోజులైంది. (పొడుంపీల్చి)
"పోలిశెట్టి ముఖము - పోలిరొట్టెను బోలు!
పోలిశెట్టిముక్కు పొడుముడొక్కు॥"
పోలి వొద్దు! వొద్దు! వొద్దు! నామాటిను. పా`సంపెట్టి సంపేస్తావాయేటి! ఊరుకుంటి వొట్టాయినా, యిన్నావా? యీ ఆట సిద్ధాంతి బేస్తెట్టి, నేను గెలిస్తే, నీక్కాండబ్బిస్తాను. మరూరుకో.
సిద్ధాం నీసొదతగలడా - తురుఫు మిగిలిపోయింది; బేస్తు. (ముక్కలు చూపించి పారవేయును.)
పోలి ఆఁ! మూడో యెత్తడబ్బేస్తు. గా`పకాలుంచుకొం డయ్యా, చేతివొరస, మంచిముక్కలెయి, బాపనాడా అంతసేపు కలపడవాఁ? గోరం, గోరం.
సిద్ధాం బులబులాగ్గాకలిపి, బేస్తు నీకిస్తాననుకున్నావా?
పోలి తోలుసేత్తో, ముక్కలేసినావు! "నరిసింవ్వ, నీదివ్వె నామమంతరముశాత! నరసింవ్వ నీదివ్వె-"
సిద్ధాం దివ్వేలేదు, దీపంలేదు ముక్కల్తియ్యి.
పోలి గవరయ్య ముక్కలమీద కన్నేసి సిల్లంగెట్టేస్తున్నాడు. నరిశింవ్వ నీదివ్వె- (ముక్కలు యెత్తిచూసి) సీ! భష్టాకారి ముక్కలేశావు.
సిద్ధాం (పంపకంముగించి తనముక్కలు తీసి చూచుకొని) మృత్తికాచమే!
పూజారి పోలిశెట్టికి అంత అలకైతే, నే నింటికిపోయి పరుంటాను.
(గవరయ్య నిష్క్రమించును. మధురవాణి వెంటవెళ్లి తిరిగివచ్చును.)
పోలి శని విరగడైపోయిందిరా, దేవుఁడా! - ఒట్టి భష్టాకారిముక్కలు. ఒహటీ.
మధు ఒకటి.
భుక్త ఒహటి.
సిద్ధాం ఒహటి.
పోలి రొండు.
మధు రెండు.
భుక్త రొండు.
(సిద్ధాంతి ఆలోచించును.)
పోలి యెందుకాయెఱ్ఱాలోశన? నామాటిను. మూడోబేస్తెట్టకు.
(వీధి తలుపు తట్టబడును.)
మధు పంతులు!
పోలి యీవాళరాడని సెప్పితివే?
మధు రారనుకున్నాను వొచ్చారు. యేంచేదాం?
సిద్ధాం ఆటతీసెయ్యండి. (ముక్కలుపడవేయును.)
పోలి బేస్తెగెయడానికా? నే నొప్పను. మధురోణి, ఆటాడి మరీ తలుపు తియ్యి.
మధు (ముక్కలుకిందబెట్టి, లేచి, సన్నని గొంతుకతో) గోడగెంతి పారిపోండి.
భుక్త దిడ్డితోవంట వెళ్లిపోతాం.
పోలి నేను పట్టనే? యేటి సాధనం?
భుక్త మేం దిడ్డితోవంట పోతాం. నువ్వు అటకెక్కు.
పోలి నన్నెక్కించి మరీ యెళ్లండి. కాలుజారితే యేటిసాధనం?
సిద్ధాం నీకొడుకుది, అదృష్టం.
(పెరటిలోకి వెళ్లును.)
పోలి గోరం! గోరం! గోరం! యవడిముక్కలు ఆడిదగ్గిరే! ఆట కలపకండి.
(తలుపు తిరిగీ తట్టబడును.)
పోలి నరిశింవ్వ, నీ దివ్వె-
(మధురవాణి ఊరుకొమ్మని కోపరసంగా సౌజ్ఞ చేయును.)
(సిద్ధాంతి ప్ర`వేశించును.)
సిద్ధాం దిడ్డీతలుపు కప్పతాళం వేశుంది. మన్నిపట్టుగుందావఁనే, పంతులు దిడ్డీతలుపు తాళవేఁశాడు.
పోలి నరిశింవ్వ, నీదివ్వె-
మధు (పోలిశెట్టి ఉద్దేశించి) చప్‌! (సన్నని గొంతుకతో) ఉలక్కుండా, పలక్కుండా యీగదిలో కూచోండి; ఆయన పరున్నతరవాత వచ్చి తలుపుతీసి వొదిలేస్తాను.
(మధురవాణి దీపములుఆర్పి, పైకివెళ్లి, గదితలుపువేసి గొళ్లెము బిగించును.)
(తలుపు తిరిగీ తట్టబడును.)
మధు యేవీఁ గవరయ్య చాదస్తం! అదే తట్టడవాఁ? (వీధితలుపుదగ్గిరకు వెళ్లి,) యెవరు!
తలుపవతల మనిషి యింతసేపేం?
మధు నిద్దరబోతున్నాను.
మనిషి పేక! పేక! పేక! నిన్నొదిలేస్తాను. నీ సంగతి నాకు తెలిసింది.
మధు మరి, మీ మానాన్న మీరు పోయి, నిశిరాత్రివేళ వొక్కర్తెనీ నన్ను వొదిలేస్తే యీ అడివి వూళ్లో నాకు భయంకాదా? అంచేత పబ్లిగ్గా నలుగుర్నీ పిలిచి పేకాడుతున్నాను. తప్పేవుఁందీ? మంచు పడుతూంది లోపలికిరండి. (తలుపు గడియతీసి) రండి. నా ఆట మీరాడండి, నేను పరుంటాను.
మనిషి సాందాన్ని యవడు నమ్మమన్నాడు? నీకిద్దావఁని సంతోషంతో వక సరుకు తెచ్చాను. నీచర్య చూసేటప్పటికి నామనస్సు చివుక్కుమని పోయింది.
మధు యెంత న్యాయంగా సంచరించినా, మీ హృదయంలో కాసింత కనికరం లేదుగదా? యీ నాటినుంచి మీరు యెక్కడికి కమాను వెళుతూవుంటే, అక్కడకల్లా నేనుకూడా మీతో వొస్తూవుంటాను.
మనిషి మెడపైకివుంచు (మధురవాణి అటులచేయును. ఆమనిషి మధురవాణి మెడలో కంటె వుంచును.)
మధు ఔరా! యింద్రజాలి! పంతులు గొంతుక యెలా పట్టా`వు? నన్నే మోసపుచ్చితివే? (రెక్కపట్టుకొని) గదులోకిరా (గదులోనికి తీసుకువెళ్లును) యీచిల్లంగి కళ్లు నీకే దేవుఁడిచ్చాడు? (ముద్దెట్టుకొనును) వాళ్లింట యేవేఁవిఁచిత్రాలు చేశావో చెప్పు.
శిష్యు ముద్దెట్టుకోనంటే చెబుతాను.
మధు నీకు తగనో?
శిష్యు ముద్దెట్టుకుంటే యెంగిలౌతుంది.
మధు నిజం. నీకున్నబుద్ధి నీ పెద్దలికిలేదు. నన్ను నిష్కారణంగా భయపెట్టా`వు. అందుకు నీ కేవిఁటిసిక్ష? బుగ్గకొరికేతునా?
శిష్యు పాలూ పంచదారావుంటే ఇయ్యి.
మధు తరవాత మేపుతాను. ముందు నీకు దాసరివేషం వేస్తాను. కొత్త అగ్రహారంపోయి నీగురువును చేరుకుందుగాని.
(తెరదించవలెను.)
(చీకటిగదిలో పోలిశెట్టి, భుక్త, సిద్ధాంతి వుందురు - తెర అవతలనుంచి రామప్పంతులు గొంతుకతో, శిష్యుడు "ఈగదులో యవణ్ణో దాచావు.")
మధు రామ ! రామ! యవ్వడూలేడు.
(పోలిశెట్టి నిచ్చెనయెక్కును. భుక్తకూడా యెక్కబోవును. నాలుగు మెట్లెక్కి యిద్దరూ కింద బడుదురు.)
పోలి సంపేశినావు, బాపనాడా!
భుక్త నామీద నువ్వుపడి, నేను వుక్కిరిబిక్కిరి ఔతూంటే నువ్వు సచ్చానంటావేవిఁటి? లేస్తావా కరిచేదా?
శిష్యు (రామప్పంతులు గొంతుకతో) అదుగో లోపల యెవళ్లోమాట్లాడుతున్నారు లంజా! అదికోవఁటాడి గొంతుకలావుంది. కప్పతాళంవేసి వూరందరినీ లేవదీసుకొస్తాను.
మధు కప్పతాళవెఁందుకు? లోపల యెవళ్లూలేరు దెయ్యాలకొంప - దెయ్యాలు దెబ్బలాడుతున్నాయి.
(మధురవాణి తలుపుతీసి గదిలో ప్రవేశించి అగ్గిపుల్ల వెలిగించును. శిష్యుడు పక్కకి తొలగిపోవును.)
మధు పోలిశెట్టియేమి, పడుకునిలేవడు - మేలుకొలుపులు పాడనా?
భుక్త రామప్పంతులేడీ?
మధు రామప్పంతులూలేరు, గీమప్పంతులూలేరు. యింట్లో పనిచేసేవాడు తలుపుకొట్టా`డు. బెంగెట్టుకోకండి.
భుక్త అతగాడిమాటలు వింటేనే?
మధు నేనే ఆయనగొంతుకు పెట్టిమాట్లాడాను. యేమిధైర్యం! యేమి మగతనం!
పోలి "నరశింవ్వ, నీ దివ్వె" (లేచి) "నామమంతరముసేత" - యవడిముక్కలాడి దగ్గిరున్నాయా?
(అంతా మళ్లీ ఆటకు కూచుందురు.)
సిద్ధాం ఆటకలిపేశాను.
పోలి గోరం! గోరం! నాకు యిసిపేటు ఆసు దాడదొచ్చిందిగదా, బేస్తులు గెలుసుకుపోదునే! గోరం! గోరం! మధురోణి, ఒట్టినే బెంబేరు పెట్టేశింది. అటకమీంచిపడి నడుంవిరిగిపోయిందిరా దేవుఁడా.
భుక్త నీకిందపడి నేను నలిగిపోయినాను. నీకేం తీపు దిగదీసింది?
పోలి కలిపియెయ్యెయ్యి - ముక్కలు.
సిద్ధాం నేను కలపను - నావొంతు అయిపోయింది - నువుకలుపు.
పోలి యేటైపోయింది?
(రామప్పంతులు వీధి తలుపుతట్టును.)
రామ లక్ష్మీ, లక్ష్మీ, తలుపు.
మధు యీ మాటు పంతులే.
పోలి యేటిసాధనం?
మధు గోడగెంతి వెళ్లిపోండి.
పోలిం నేను గెంతలేనే?
మధు నిన్ను యీగదిలో పెట్టి తాళవేఁస్తాను.
పోలి దీపం ఆరిపెయ్కు. నాకు బయవేఁస్తుంది.
సిద్ధాం గాజుపెంకులు గుచ్చుకుంటాయి; గోడదాటడం యెలాగ?
భుక్త నాకు కాళ్లు మేహవాతం నొప్పులు. నేనుగెంతలేనే?
మధు (దీపవాఁర్పి) యిలాగే వుండండి.
పోలి నరిశింవ్వ,-
మధు చప్‌!
పోలి సచ్చాను.
మధురవాణి (గది గొళ్లెంవేసి, వీధితలుపు గడియతీసి తలుపు ఓరగావుంచి) మాయగుంటని యెక్కడదాచారు?
రామ మాయగుంటయేమిటి?
మధు యేం నంగనాచే? లుబ్ధావధాన్లు మాయపెళ్లాన్ని వాళ్లయింట్లోంచి లేవదీసుకుపోయి యెక్కడపెట్టా`రు? యిదేకదూ, రాత్రల్లా మీరు చేస్తూవున్న లౌక్య వ్యవహారం?
రామ నీమాట నాకేవీఁ అర్థం కాకుండావుంది. యింట్లోంచి లేవదీసుకు పోవడవేఁవిఁటి? నేను దాచడవేఁవిఁటి?
మధు దాస్తే దాచారు. దాచకపోతే మానా`రు. నాకంటెయేదీ?
రామ నీకంటా`? మరిచిపోయినానుసుమా!
మధు యేమిచిత్రం! నన్ను మరిచారు - నావస్తువని మరిచారు. మరిచి, ఆగుంటకిచ్చారు. దాన్ని లేవదీసుకుపోయి యెక్కడోదాచి, నిశిరాత్రివేళ పెద్దమనిషిలా, యింటికివొచ్చారు!
రామ ఆగుంట కనపడ్డదా యేవిఁటి?
మధు యేవిఁనాటకం! మీకు కనపడకేం? మీరు పెట్టినచోటేవుంది.
రామ మీనాక్షి తన్నితగిలేశిందా యేవిఁటి? కంటెతో తగిలేస్తేచచ్చానే?
మధు యేమినాటకం! చావండి; బతకండి; ఆకంటెతాం`దీ, గడపలో కాలుపెట్టనివ్వను. (తలుపు వేయును.)
రామ నాలుగుకోసులు గుఱ్ఱపసవారీ అయి, యీదురోమని యిల్లుచేరుకుని, గుమ్మంలో అడుగుపెట్టేసరికి, మబ్బులేని పిడుగుపడ్డది. మీనాక్షి ఆగుంటని మన్ననిస్తుందని, నేను యెన్నడయినా అనుకున్నానా యేవిఁటి? ఆగుంట పోతేపోయింది, వుంటేవుంది; నాకంటె పోకుండావుంటే అదృష్టవంతుణ్ణి. కంటెఅడగడానికి వెళితే, "నువ్వే యీ పెళ్లి కుదిర్చావు" అని కఱ్ఱుచ్చు కుంటాడేమో!
(నిష్క్రమించును.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)