నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౩-వ స్థలము. లుబ్ధావధాన్లు యింటివాకలి.
లుభ్ధావధాన్లు (పచారుచేస్తూ) కనపడకపోతే యేవైఁనట్టు? నూతులోగానీ పడిందా? పోలీసువాళ్లు యిల్లుదోచేస్తారు. నూతులో పడలేదా? పడకపోతే యేవైఁనట్టు? - రావఁప్పంతులు యింటికి పోయుంటుంది. అంతే కావాలి - యంత అందవైఁన పిల్లా! నాదిగాక దురదృష్టం! యంతట్లో వెన్నెల చీకటైందీ! రేపో యెల్లుండో యెదిగొచ్చే పిల్లగదా అని సంబరపడ్డాను - ఒహవేళ, - అప్పుడే పెద్దమనిషైందేమో? - అందుకు సందేహవేఁలా? లా`కుంటే యింత యేపైన పిల్ల పెద్దపడుచు కాకుండావుంటుందా? యిలాంటివి యెన్నిపెళ్లిళ్లు చేసుకుని యందరు మొగుళ్లని కడతేర్చిందో! ఓరి కుంకపీనుగా, నీకళ్లు యేవైఁపోయినాయిరా? రజస్వలాముండని చూస్తూ, చూస్తూ, యలా పెళ్లాడావురా? మరి నీకు గతులు లేవు. రాజమహేంద్రవరంలో వెధవ ముండల్ని పెళ్లాడినవాళ్ల సామాజికంలో చేరా`వురా? అయ్యో! అయ్యో! దీనికి మరి ప్రాయశ్చిత్తం యక్కడిది? ఒహవేళ చేయించుకుందా వఁంటే, శంకరాచార్యులు పాదకట్ణం పెట్టమంటాడు. బ్రాహ్మలు యిల్లు తినేస్తారు. అంతకంటె పోలీసువాళ్లునయం. అల్లరికాకుండా హెడ్డుచేతులో పాతిక రూపాయలుపెట్టి, రేపురాత్రి బయల్దేరి కాశీపోయి, గంగలో ములిగా`నంటే అన్ని పాపాలూ పోతాయి. కాశీవాసవేఁ చేసుకుంటాను. భగవంతుడు బుద్ధొచ్చేటట్టు చేశాడు. లేకుంటే, ముసలివెధవకి పెళ్లిచేసుకోవడపు పోయీ కాలవేఁవిఁ? అన్నివిధాలా యీ రామప్పంతులు నాకొంప తీశాడు.
(రామప్పంతులు ప్రవేశించి.)
రామ యేవిఁటి మావాఁ రావఁప్పంతులంటున్నారూ?
లుబ్ధా యేవీఁలేదూ.
రామ యింతరాత్రివేళ పచారు చేస్తున్నారేవిఁ?
లుబ్ధా యేమీలేదు - నిద్దరపట్టక.
రామ మావఁగారూ, ఆకంటె యిప్పుడు తెమ్మని మధురవాణి భీష్మించుకు కూచుంది. శ్రమ అని ఆలోచించక యిప్పించాలి.
లుబ్ధా కంటేవిఁటి?
రామ మీభార్యాకి పెట్టిన కంటం`డీ.
లుబ్ధా నాభార్యాకి నేను పెట్టలేదు.
రామ మీరు పెట్టమంటే, నేను యెరువుతెచ్చానుకానా?
లుబ్ధా నేను పెట్టమన్లేదు.
రామ అయితే దొబ్బేస్తావా యేవిఁటి? మీభార్యామెళ్లో యిప్పుడా కంట`లేదూ?
లుబ్ధా నాభార్యా యెవరు? నాభార్యానాడే చచ్చింది.
రామ మొన్న మీరు పెళ్లిచేసుకున్న పిల్ల మీభార్యా కాదటయ్యా?
లుబ్ధా రెండో పెళ్లిముండ నాకుభార్యా యేవిఁటి?
రామ రెండో పెళ్లిముండేవిఁటి?
లుబ్ధా రెండో పెళ్లిముండ అని నువ్వే అన్నావు?
రామ మాటమీద మాటొచ్చి, వొట్టినే అంటే, అదో దెప్పా?
లుబ్ధా వొట్టినే అనలేదు. గట్టే అన్నావు. యిదంతా, ఆగుంటూరు శాస్తుల్లూ నువ్వూచేసినకుట్ర; నాకు నిజం తెలిసిపోయింది. ఆముండ నీ యింటికేవెళ్లింది. మధురవాణిని వుంచుకున్నట్టు దాన్నికూడా నువ్వేవుంచుకో. నాజోలికిరాకు. నీకు పదివేల నమస్కారాలు.
రామ నాకంట` నాకియ్యమంటే, యీవెఱ్ఱి వెఱ్ఱిమాట లేవిఁటయ్యా?
లుబ్ధా నీమాయగుంటా, నీకంటా`, నీయింట్లోనే వున్నాయి.
రామ యీవేషాలు నాకు పనికిరావు. నిలబెట్టి నాకంట` పుచ్చుకుంటాను.
(తడిసినభాగవత పుస్తకంపట్టుకుని మీనాక్షీ, చేతులోకఱ్ఱా, నెత్తిమీద పసుపురాసినకుండా, అందుమీద అఖండంతో అసిరిగాడూ, చేతిలో సీసాపట్టుకుని, తడిబట్టలతో పూజారి గవరయ్యా ప్రవేశింతురు.)
పూజారి హ్రాం! హ్రీం! హ్రూం! ఓంకార భైరవీ!
(రామప్పంతులు భయమును కనపర్చును.)
మీనాక్షి యక్కడా కనపళ్లేదునాన్నా, యీపుస్తకం నూతులోపడేశింది.
(లుబ్ధావధాన్లు భయమును కనపర్చును.)
రామ కనపడకపోవడం యవరు?
మీనా

నాసవిత్తల్లి - గవరయ బాబు నూతులోదిగి అంతటా గాలించాడు. నూతులోమరేవీఁ కనపడలేదు.

(లుబ్ధావధాన్లు భయం తగ్గును.)

బ్రహ్మరాక్షసిని గవరయ బాబు యీసీసాలో బిగించాడు నాన్నా.

(రామప్పంతులు సీసాకి యడంగా నిలబడును.)
రామ బ్రహ్మరాక్షసి యేవిఁటి?
లుబ్ధా వేరే - ఓ బ్రహ్మరాక్షసి వొచ్చి - మా అమ్మిని భయపెట్టింది.
మీనా నన్నుకాదు - మా నాన్న పీకేపిసికింది.
రామ గవరయగారూ, పిల్ల యావైఁనట్టు?
గవర దాని మొగుడు యగరేసుకు పోయినాడు.
మీనా యక్కడికి యగరేసుకు పోయినాడు? వాడు యీ సీసాలోనే వున్నాడన్నారే?
గవర (కొంచం ఆలోచించి - చిరునవ్వునవ్వి) అదీ యీసీసాలోనే వుంది.
మీనా మనిషి సీసాలోకి యలా వొచ్చింది?
గవ అయ్యో సత్యకాలవాఁ! అది మనిషా అనుకున్నావు? అది కామినీ పిశాచం. అంచేతనే నేను మీయింటికొచ్చి నప్పుడల్లా దూరంగా వెళ్లిపోయేది. యేమి చెప్మా, అనుకునే వాణ్ణి.
మీనా యిద్దర్నీ ఓ సీసాలో పెడితే దెయ్యప్పిల్లల్ని పెడతారేమో?
గవర పంతులుగారూ చిత్తగించండీ, రెండుమనుషుల బలువుందోలేదో చూడండీ.
రామ మొఱ్ఱో! నాదగ్గిరకి తేకయ్యా.
గవర అసిరిగా నువ్వుపట్టుకో.
అసిరి నాకు బయవేఁటి? పైడితల్లి చల్లగుండోలి - (సీసాపట్టుకుని) ఓలమ్మ! యంత బలువుందోస్సి!
గవర సీసా, అఖండం, తులిసికోట దగ్గిరదించు.
లుబ్ధా బాబ్బాబు! సీసా నాయింట్లో పెట్టకు. మీయింట్లో పెట్టించండి.
గవర మాపిల్లలు తేనెసీసా అని బిరడా తీసినట్టాయనా, రెండు దెయ్యాలూ వొచ్చి మళ్లీ మీయింట్లోనే వుంటాయి.
లుబ్ధా అయితే, సీసా భూస్థాపితం చెయ్యండి.
గవర భూస్థాపనం మజాకాలనుకున్నారా యేమిటి? భూస్థాపితం చెయ్యడానికి యంత తంతుంది! పునశ్చరణచెయ్యాలి, హోమంచెయ్యాలి, సంతర్పణచెయ్యాలి.
లుబ్ధా నాయిల్లు గుల్లచెయ్యాలి!
గవర మీకలా తోస్తే నాకేంపోయింది? యీ మూతతీసేసి, నామానాన్న నేను వెళ్లిపోతాను.
లుబ్ధా మూతెందుకు తీసెయ్యడం. నాకుకలిగినది తృణవోఁ కణవోఁ యిస్తాను. ఆమూత తియ్యకుండా ఆసీసా అలావుంచివెళ్లండి.
పూజా యేవీఁ అవధాన్లుగారి గడుస్తనం! నేపోగానే పాతిపెట్టడానికాయెత్తు? ఆసీసా తగిన శాంతిచెయ్యందీ భూస్థాపితం చేశారంటే, నేను రౌరవాది నరకాలకి పోనా? యిప్పుడె బిరడా తీసేస్తాను.
లుబ్ధా తియ్యకు, తియ్యకు. రేపు ఆశాంతేదో తగలేతుగాని.
గవ అష్లాగైతే, యీరాత్రల్లా యీసీసా దగ్గిరపెట్టుకు పెరట్లో పడుకుంటాను. మీరు వెళ్లి నిర్భయంగా పడుకుని నిద్రపోండి.
(నిష్క్రమించును.)
రామ మావాఁ! ఓ మాట.
(రామప్పంతులూ, లుబ్ధావధాన్లూ పక్కకు వెళ్లి మాట్లాడుదురు.)
రామ నాకంటె మాటేవిఁటి, మావాఁ?
లుబ్ధా మీకంటె మీయింట్లోనేవుంది.
రామ మీపెళ్లాం మాయింటికి వెళ్లిందని మీరంటున్నారుగాని, అక్కడికి ఆపిల్ల రాలేదు కంటా`తా`లేదు.
లుబ్ధా అయితే యేవైఁందో! నాకేం తెలుసును?
రామ వొద్దు సుమండీ - నాకంటె నాకిచ్చెయ్యండి - నేను మాకానివాణ్ణి.
లుబ్ధా కంటె, గింటె, నాకు తెలియదు.
రామ నీకు తెలియకపోతే మరెవరికి తెలుసును? గవరయ్య, నీపెళ్లాం దెయ్యవైఁందన్నాడుగదా? నువ్వూ నీకూతురూ కలిసి దాన్ని చంపేశారుకాబోలు.
లుబ్ధా ఓరి! గాడిద`కొడుకా (కఱ్ఱతో కొట్టబోవును.)
రామ నాకంటె అపహరించావుగదా? నీపని పట్టిస్తాను వుండు. (నిష్క్రమించును.)
లుబ్ధా (తనలో) కంటె యావైఁనట్టుచెప్మా? (పైకి) అమ్మీ!
మీనా యేం నాన్నా?
లుబ్ధా కంటె యేంజేసిందే?
మీనా యేంజేసిందో? పెట్లోదాచిందేవోఁ? దాని వొంటినే వుందిగాబోలు నాన్నా?
లుబ్ధా వొంటినుంటే - దెయ్యానికి కంటెందుకూ?
మీనా యేం? తీపుదిగదీసిందా యేవిఁటి? పెట్టుగుంటుంది.
లుబ్ధా నూతులోదిగి గవరయ్య నుయ్యంతా గాలించాడూ?
మీనా గడియసేపు గాలించాడు.
లుబ్ధా నువు చూశావూ?
మీనా చూశాను.
లుబ్ధా అది రావఁప్పంతులు యింటికే వెళ్లిందేమోనే?
మీనా గవరయ బాబు, సీసాలో బిగించాడుగదా యలా వెళుతుంది?
లుబ్ధా యేమో నాకేంపాలు పోకుండావుంది. రా పరుందాం - మనప్రారబ్ధం యిలావుంది.
(నిష్క్రమింతురు.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)