నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౪-వ స్థలము. రామచంద్రపురం అగ్రహారంలో సారాదుకాణం వెనకతోట.
(ఆతోటలో కాళీమందిరం యెదటి మంటపం. మంటపంలో కాళీ విగ్రహానికి యెదురుగుండా ఒక పెద్దపీటమీద మూడు సీసాలతో సారాయి; చుట్టూ గళాసులు, పీటనిండా పువ్వులదండలు, మంటపంలో వకవైపు పులిచర్మంమీద యోగదండమును ఆనుకుని సమాధిలో వున్న వొకబైరాగి; యోగిని యొకతె సారాయి అందరికీ అందిచ్చును. గ్రామమునసబు సోమినాయుడు చిలుం పీల్చుచుండును. సాతాని మనవాళ్లయ్య, జంగం వీరేశ, దుకాణదారు రామందాసు చెదిరికూర్చుందురు.)
మునసబు ఆకాశం ముందుపుట్టిందా? బూవిఁ ముందుపుట్టిందా?
మనవాళ్లయ్య సుత్తిముందా కారు ముందా?
మునసబు పంగనావాఁలు ముందా పట్టెవొర్దనాలుముందా? నామాలోడా నాసవాలేటి? నీజవాబేటి? ఆకాశానికి మట్టా బూవిఁ? బూవిఁకి కప్పా ఆకాశం? సదువుకున్నోడెవడో సెప్పండొస్సి-
మనవాళ్లయ్య ఆకాశంబు సూన్యంబు అనగా యేమీ లేదన్నమాట.
మునస యేటీలేదా? గుడ్డోళ్లకి యేటీలేదు. తెల్లోడు యెర్రోడా? పట్టంలో, గొట్టావెఁట్టి అదేసూస్తాడే ఆకాశం కాసి?
మనవాళ్లయ్య శాస్త్రంబులలోని రహస్యంబులు మ్లేచ్ఛులకెట్లు తెలియును?
మునస అల్లాండం, బెల్లాండం, శక్కరపొంగలి తినడవఁనుకున్నావా, నామాలోడా? తెల్లోడి మహిమ నీకేటితెలుసును! తెల్లోడిసారాయికి, తెనుగోడిసారాయికి యెంతభేదంవుందో, తెల్లోడికీ నీకూ అంతబేధంవుంది.
మనవాళ్లయ్య గణితశాస్త్రంబునం దాకాశంబన సున్న- సున్నయన సూన్యంబు- యేమీ లేదన్నమాట.
వీరేశ చాత్రంలో మన్ను, మిన్ను, అని అన్నాడుకాడా? మన్నులేదా? మన్నుంటే మిన్నుండదా?
మునస యీరేచ మామేలయిన పలుకు పలికినాడు.
వీరేశ "ఆకాశం బొక్కడ్డది!" అంటురుగదా, ఆకాశం లేకుంటే బొక్కడ్డవెఁలాగ?
మునసబు శబాసు యీరేచ! నామాలోడు పలకడేం? నోరుకట్టడ్డది.
(వీరేశ శంఖం పూరించును.)
హెడ్డు (దుకాణదారునితో) యేవిఁటీ అల్లరిభాయి?
మునస యీరేచం గెల్చుకున్నాడుగదా, చంకం వోగించడా?
దుకాణదారు గురోజీగారి సమాదికి బంగంవొస్తే శపించిపోతారే?
బైరాగి (కళ్లుతెరిచి) శివబ్రహ్మం! శివబ్రహ్మం! శివోహం!
వీరేశ చూచావు నేస్తం, చివబ్రెమ్మం అన్నారు.
బైరాగి రామబ్రహ్మం! రామబ్రహ్మం! రామోహం!
మన మొదటిమాటను రెండవమాట రద్దుచేయును. రామానుజ! రామానుజ!
వీరేశ చివచివా! చివచివా!
దుకాణదారు

యెందుకు కాట్లాడతారు. నీశివుఁడూ నిజవేఁ. అడుగో ఆశీసాలో యెలుగుతున్నాడు. నీరాముడూ నిజవేఁ. అడుగో ఆశీసాలో యెలుగుతున్నాడు. వినలేదా తత్తం?

గాజుకుప్పెలోను గడగుచుదీపంబు ।
యెట్టులుండు గ్యానమట్టులుండు ।
తెలిశినట్టివారి ద్రేహంబులందును ।
యిశ్వదాభిరామ యినరవేమా ॥
బైరాగి సత్యం, సత్యం.
దుకాణదారు గురోజీ! తమకి అంతాయిశదవేఁ! ద్రేహం గాజుకుప్పె, ద్రేహంలో వుండేది పరవాఁత్వఁ, గాజుకుప్పెలో వుండేది అన్నసారం. యీఅన్నసారం ద్రేహంలో పడితేగాని పరవాఁత్వఁ పెజ్జలించదు. యేం శలవు?
బైరాగి యీ పరమరహశ్యం నీకు యెలా తెలిశింది తమ్ముడా?
దుకా తమవంటివారి ద్రయవల్లగురూ! (నలుగురివైపూచూసి) చూశారాబాయీ నేను యెప్పుడూ యీమాటేగదా చెపుతూవుంటాను? అఖాడాకి వొస్తేగాని పరబ్రెమ్మం పట్టుపడ్డం యెలాగు?
బైరాగి అమృతమనేది యేమిటి? సారాయే! నాడు యిదేగదా తాగడానికి దేవాసురులు తన్నుకుచచ్చారు?
వీరేశ చివచివా! చివచివా!
మనవాళ్ల రామనుజ - రామానుజ!
మునస కాట్లాటమాని ఘా`నం యినండొస్సి. యెఱ్ఱిగొల్లోళ్లు.
హెడ్డు గురూ, మరివొక రసలింగం చేయించి, శిష్యుడికి దయచెయ్యాలి.
బైరా అలాగె.
మున గురూ! బంగారం సేస్తారుగదా, అదెట్టి, హరిద్దొరంలో మటం కట్టించక మాలాటోళ్లని డబ్బెందుకడుగుతారు?
బైరా మేం చేశే స్వర్ణం మేవేఁ వాడుకచేస్తే తలపగిలిపోతుంది.
హెడ్‌ అవివేరే రహస్యాలు వూరుకొండి మావాఁ! గురోజీ! హరిద్వారంలో చలిలావుగాబోలు?
బైరాగి నరులక్కద్దు- మాబోటి సిద్ధులకు, చలీ, వేడీ, సుఖం, దుఃఖం, యెక్కడివి-
హెడ్‌ ఆహా! అదృష్టవఁంటె సిద్ధుల్దే అదృష్టం.
మునస గురు, హరిద్దోరంనించి యెప్పుడు బైలెళ్లేరు?
బైరా రెండురోజులయింది. మొన్న ఉదయం ప్రయాగ, నిన్న వుదయం జగన్నాధం శేవించాం. ఖేచరీగమనమ్మీద ఆకాశమార్గాన్న పోతూవుండగా మీవూరి అమ్మవారు వనందగ్గిర గమనం నిలిచిపోయింది. యేమిచెప్మా? అని యోగదృష్ఠిని చూచేసరికి అమ్మవారి విగ్రహముకింద ఆరు నిలువులలోతున, మహాయంత్రం వొకటి స్థాపితమై కనపడ్డది. అంతట భూమికిదిగి, అమ్మవారిని శేవించుకొని, ప్రచ్ఛన్నంగా పోదావఁంటూంటే, యీ భక్తుడు మమ్ముల్నిపోల్చి నిలిపేశాడు.
దుకా చూడగానే, నేను సిద్ధుల్ని పోలుస్తానుగురూ-
మునస సుక్కేసేవోళ్లని మాబాగా పోలుస్తావు. మావూరమ్మోరు జగజ్జనని! మా చల్లనితల్లి.
బైరాగి బ్రహ్మోహం! బ్రహ్మోహం!
హెడ్‌ ఆహా! యోగమహత్యం! స్తానాల్చేసి, ముక్కుబిగించే బ్రాహ్మలకి లేవుగదా యీ సిద్దులూ?
బైరా వేషానికీ - జ్ఞానానికీ దూరంకాదా తమ్ముడా? మాతాతగారు చెప్పలేదా? "ఆత్మశుద్ధిలేని యాచారమదియేల" అని?
హెడ్‌ వేమన్న - తమతాతా, గురూ?
బైరా అవును - వారు పరంపదించి ఆరువొందల సంవత్సరాలుకావొచ్చింది.
హెడ్‌ తమవయస్సెంతగురూ?
బైరాగి ఆదీ అంతూలేనిదానికి లెఖ్ఖేవిఁటి తమ్ముడా? పరమాత్మకెన్నేళ్లో అన్నేళ్లు.
మునస యేం యిలవైన మాటలింటున్నాం!
(వీరేశ శంఖం పూరించును.)
హెడ్‌ (శంఖంలాక్కొని పక్కనువుంచి) అట్టెపట్టెయ్యకండి భాయి.
దుకా అట్టే యక్కడభాయీ? పరవశవైఁందాకా తాక్కుంటే తాగడవేఁటి? వేమన్న చెప్పలేదా?
"తాగి, తాగి, తాగి, ధరణిపైబడుదాక ।
తాగెనేని తన్ను, తాను తెలియు ॥
తాగలేనివాడె, తాగుబోతరయంగ ।
యిశ్వదాభిరామ యినరవేమ" ॥-
బైరాగి కాశీలో రెండువందల యాబై సంవత్సరములక్రిందట ఆలంగీర్‌ పాదుషావారి హయాంలో, ఒకశేటు మాబోటి సిద్ధులనందరిని కూటానికి పిలిచాడు. గంగనడివిఁని పడవమీద పీపాలలో సారాయి భరాయించి, బంగారపుగిన్నెలతో అందిచ్చాడు. రెండుఝాములరాత్రి అయేసరికి పీపాలు కాలీ అయిపోయినాయి. అంతా పడిపోయినారు.
హెడ్డు యేమి ఆశ్చర్యం!
బైరా మేమూఁ ఒక్క నేపాళపు బ్రాహ్మడూ మిగిలాం. "తే! తే!" అన్నాడు ఆబ్రాహ్మడు. "తెస్తావా శపించేదా" అన్నాడు. శెట్టి యెక్కడ తెస్తాడూ? వాడు మాకాళ్లు పట్టుకునేటప్పటికి పర్వాలేదు నిలవమని చెప్పి, మేము ఒక పుణిక మంత్రించి, గంగ భరాయించినకొద్దీ ఆగంగ సారా అయిపోయింది. ఆ బ్రాహ్మడు సహస్ర పుణికలుతాగి జిఱ్ఱునతేన్చాడు. బ్రాహ్మల్లోకూడా మహాత్ములుంటారు. కనుక్కో గలిగినజ్ఞానికి గంగానది అంతా సారాయికాదా?
మునస రామందాసొహడు, గంగ బరాయించడానికి గురువు; ఒకదరావుఁకి పద్దరావుఁలు సేరుస్తాడు.
(హవల్దారు అచ్చన్న ప్రవేశించును.)
దుకా గురూ వీరు హవల్దార్‌ అచ్చన్నగారు. మంచిగ్యాని. మునసబుగారికి మేనల్లుడు.
హవల్దారు రామ్‌! రామ్‌!
బైరాగి రామ్‌! రామ్‌!
హవల్దారు (యోగినితో) పిల్లా హుక్కాలావ్‌. (హెడ్‌తో) భాయీ గుంటూరు శాస్తుల్లుగారి పత్తాయేమైనా తెలిశిందా?
హెడ్‌ లేదుభాయి.
దుకా రామప్పంతులంటాడు-పెళ్లికూతురు రెండోపెళ్లి పిల్ల- దాన్ని అమ్మి డబ్బు చెయ్యిచిక్కించుకుని-
హెడ్‌ ఆమాటలు మనకెందుకు భాయి?
మునస పోలీసొళ్లకీ అక్కర్లేక, బాపనోళ్లకీ అక్కర్లేక, యెదవముండని బాపనాడు పెళ్లిశేసుకుంటే లోకంఅంతా వూరుకోవడవేఁనా?
హెడ్‌ డబ్బు యిచ్చినవాడికీ, పెళ్లి ఆడినవాడికీ లేనిచింత మనకేలమావాఁ? కాక, యీరోజుల్లో బ్రామ్మణ్యం యెక్కడుంది యెక్కడచూశినా పిల్లల్ని ముసలాళ్లకి అమ్ముకోడాలు- రంఢా గర్భాలేకదా?
హవ కలికాలంగదాభాయీ? యెంతచెడ్డా బ్రాహ్మలు మనకి పూజ్యులు.
హెడ్‌ అన్నా, యవరంతవారు, వారు. జ్ఞానం, నీతిప్రధానంగాని, జాతిలో యేవుఁంది? వేమన్న యేవఁన్నాడు?
మునస యెవఁన్నాడా? నీతికి పోలీసొణ్ణి ఘా`నానికి సాతానోణ్ణి అడగమన్నాడు.
హెడ్‌ మావాఁ! వెక్కిరించండిగాని, నేను యెన్ని తాలూకాల్లో నౌఖరీచేశానో అన్ని తాలూకాల్లోనూ రండాగర్భాలు యెన్ననిచెప్పను? నన్నడిగితే వెధవలు పెళ్లిచేసుకోవడవేఁ ఉత్తమం అంటాను. మాసూపరెంటు పిల్లలతో వున్న రెండో పెళ్లి దొరసాన్ని పెళ్లాడి సుఖంగా వుండలేదా?
మునస మావఁగారి అబిప్పరాయం, పెయ్యతోటొచ్చిన ఆవు మేలుకాదా అని? అందకనే, ముసలిబాపనోడు యెధవగుంటని పెళ్లాడితే, మీనేస్తం కరణపోణ్ణి, ఆముసలాడి యెధవకూతుర్ని పెళ్లాడమని బోదసెయ్యరాదా?
హవ మనకేలమావాఁ? గవునర్‌మెంటూ, దేవుళ్లూ, బ్రాహ్మలూ- వారి నేరాలు వారివి- వాటితో మనకిపనిలేదు. మనభక్తి మనకుండాలి. (హెడ్‌తో) భాయీ, తెల్లానల్లా వొకటా?- తెల్లవాడికి క్రీస్తు వొకపద్ధతి పెట్టా`డు. ముసల్‌మాన్‌కి పైగంబరు వొకపద్ధతి పెట్టాడు, నల్లవాడికి రాముడు వొకపద్ధతి పెట్టాడు. భగవంతుడు తెల్లవాడితోయేవఁన్నాడూ? వెధవని పెళ్లాడు అన్నాడు. రాముడు తెనుగువాడితోయేవఁన్నాడూ? వెధవని పెళ్లాడొద్దన్నాడు. చెప్పన్న దేశాలూ చూశాను భాయీ. పరిపరివిధాలు ఆచారాలూ, వ్యవహారాలూ వున్నాయిగాని నీతివకటీ, భగవంతుడొకడూ, అంతటా వక్కటే.
మునస రాముడు యెదవముండల్ని కానిపనులు సెయమన్నాడూ? మన్లో మారుమనువులుండేవికావా?
హవ పిల్లా, చిలుం భరాయించి, తే.
మునస నామాలోడు మూలకి తీసికెళ్లి పిల్లని ముద్దెట్టుకుంటున్నాడు.
యోగినీ (చెయ్యి విడిపించుకొని సిగ్గుతో) ఏకాంత ఉపదేశం చేస్తున్నారు.
మునస యేటో ఆవుప్పుదేశం? తనెంట వాయు యేగంగా రమ్మనా?
దుకా యేవిఁటిభాయీ, అనరానిమాట్లు అంటున్నారు. మనయోగిని పరమభక్తురాలు.
మునస లెంపలోయించుకుంటాను. పిల్లా! ఆనామోలోడు సెప్పిన ఉప్పుదేశవేఁటో, నాసెవులో కొంచం సెప్పరాదా?
(యోగిని సారాగళాసు హవల్దార్‌ యెదటవుంచును.)
మునస నామాలోడి వుప్పుదేశంతో పిల్లకి మతోయింది.
బైరాగి హవల్దారుగారు అమృతం సేవించరా?
హవ (చిరునవ్వునవ్వి) తాక్క సోజరువాడు చెడ్డాడు. తాగి సిపాయివాడు చెడ్డాడు, జ్ఞానికి జ్ఞానపత్రి; తాగుబోతుకు సారాయి.
మునస పించను పుచ్చుకుంటివిగదా, యింకా సిపాయానా సెయ్యాల్నుందా అల్లుడోడా?
హవ కుంపిణీ నమ్మక్‌ తిన్నతరువాత, ప్రాణంవున్నంతకాలం కుంపిణీ బావుటాకి కొలువుచెయ్యాలి. రేపు రుషియాతో యుద్ధంవొస్తే పించను ఫిరకాయావత్తూ బుజాన్ని తుపాకీ వెయ్యవాఁ?
మునస రుస్సా`వోడివోడ నీట్లోములిగి నడుస్తాదిగదా, నువ్వు తుపాకుతో యవణ్ణి కొడతావు?
హవ మొన్నగాక మొన్న యింగిరీజ్‌ రుషియాదేశానికి దండెత్తిపోయి, రుషియాని తన్ని తగలలేదా? అప్పుడేవైఁందో, యిప్పుడూ అదే అవుతుంది. మారాణీ చల్లగావుండాలి.
దుకా సీవఁరాణీ ఆకాళీమాయి అవుతారంకాదా?
హవ కాళీ, గీళీ, జాంతేనై- ఆరాముడి అవతారం.
దుకా గురూ- హవల్దారుగారు తత్తకీర్తనలు మాయింపుగా పాడతారు. (యోగినితో) తల్లీ, నా తంబూరాతెచ్చి భాయిగారికి ఇయ్యి.
మునస యీతూరి, యీరేచ వుప్పుదేశం చేస్తున్నాడు.
దుకా గొప్పవారున్నప్పుడు ఆస్యాలేటి భాయీ?
మునస వున్నమాటాడితే ఆస్సా`లా? నాకెవడూ సెయడేం వుప్పుదేశం? యీరేచ వుప్పుదేశం గట్టిగాబిగిసింది; మరిసెయ్యొదల్డు-
(యోగిని కష్టంమీద చెయ్యి వొదిలించుకొని తంబురా తెచ్చియిచ్చును.)
దుకా అవన్నీ గ్యానరహశ్శాలు. బ్రెమ్మానందవఁంటె యేటి? కడుపునిండా సారా; ముక్కునిండా పొగ; పక్కని పడుచుపిల్లా కదా?
మునస ఘా`నం యినండొస్సి-
హవ పామరం! పామరం! రాముడు పఠం కాళీ నెత్తిమీద పెట్టకపోతే కుంపిణీ సిపాయన్నవాడు యిక్కడికి వొచ్చునా?
హెడ్‌ భాయి! ఓకీర్తన శలవియ్యండి.
  (హవల్దారు పాడును.)
పింజర్మెరహకర్‌ ఛుప్‌నైరహ్న
క్యారేబుల్బుల్‌ కహొ ముల్కిసునా ॥క్యారె॥
యెక్కడికి వెళతావు? యేమి చెప్పవు, బోలో పింజర్మె ।
(వీరేశ శంఖం మనవాళ్లయ్య తీసి పూరించును.)
హవ (పాటమాని, తంబూరా క్రిందబెట్టి) గద్దా!
హెడ్‌ (శంఖంలాక్కొని) శంఖం అగ్గిలో పడేస్తాను. యెందుకు తా`నిస్తావు భాయి.
దుకా వొద్దంటే వినడు.
హెడ్‌ వినకపోతే దుకాణానికి రానియ్యకండి. అల్లరైతే మాకు మాటకదా?
దుకా పదిశంకాలు దాచేశాను; మళ్లీమళ్లీ తెస్తాడు. యేంజెయ్యను? బేరంగదా భాయీ?
మునస దిట్టంగా పట్టెయి. తత్తఘ్ఘా`నం తలకెక్కాలి!
దుకా (తంబురా తీసిపాడును.)
నాగా దిగురా । నాతండ్రి దిగురా ॥
దిగుదిగునాగన్న । దివ్యసుందరనాగ ।
ముదముతోరేపల్లె । ముద్దులనాగ ॥
ఊరికిఉత్తరాన । ఊడలమఱ్ఱికింద ।
కోమపుట్టలోని । కొడినాగన్నా ॥-
(పాడుచుండగా రామప్పంతులు ప్రవేశించి యెడంగా నిలచి యోగినికి సౌజ్ఞచేయును. యోగిని రామప్పంతులుతో మాటలాడివచ్చి హెడ్‌ చెవిలో రహస్యం చెప్పును.)
మునస పిల్ల, హెడ్డుగారికి వుప్పుదేశం సేస్తూంది. ముసలోణ్ణనా-
యోగిని (మునసబు చెవిదగ్గిర నోరుపెట్టి చెవిగిల్లును.)
మునస పిల్లా! సాల్రోజులైంది మునిసిబు నాయుడికి యీపాటి వుప్పుదేశం తగిలి-
(హెడ్డుకనిష్టీబు రామప్పంతులు దగ్గిరకువెళ్లి యడంగా యిద్దరూ మాట్లాడుదురు.)
హెడ్‌ కొత్తవారు యెవరూలేరే? బావాజీ గారు వుంటే మీకు భయవేఁవిఁటి?
రామ కొత్తా, పాతా, ఆలోచించుకోలేదు కొంపములిగింది. మీసాయం కావాలి.-
హెడ్‌ డబ్బేవైఁనా పేల్తుందా?
రామ మీ చాతైతే, పేల్తుంది.
హెడ్‌ యేమిటొచ్చిందో చెప్పు.
రామ లుబ్ధావుధాన్లు పెళ్లాడినగుంట మధురవాణి తాలూకుకంటె తీసుకుని యెక్కడికో పారిపోయింది.
హెడ్‌ యెందుకు పారిపోయిందో?
రామ మీనాక్షి చావగొడితే పారిపోయింది. యెక్కడవెతికినా కనపడలేదు. ముందు మీజవాన్లని దౌడాయించండి.
హెడ్‌ యీరాత్రవేళ మాజవాన్లుమాత్రం పట్టుకోగల్రా? పోలీసు జవానంటే పదికళ్లూ పదికాళ్లూ వుంటాయనుకున్నావా యేవిఁటి?
రామ దానిసిగ్గోసిరి; దాన్ని పట్టుకోవడం నాకెందుకు, నాకంటె నాకిప్పించెయ్యండి.
హెడ్‌ యేవిఁటి నీమాటలూ! ఆకంటెపట్టుకు ఆపిల్ల పరారీ అయిందని చెపితివి. నేనుకంటె యెలా యిప్పిస్తాను?
రామ ముసలాణ్ణి అడిగితే, అది పట్టుకుపోయిందంటాడు; గాని నిజంగావాడు పెట్టెలో దాచేశి యివ్వకుండా వున్నాడు.
హెడ్‌ నన్నేంచెయ్యమంటావు?
రామ కూనీకేసని ముసలాణ్ణి బెదిరిస్తే, నాకంటె నాకిచ్చేస్తాడు; మీచెయ్యికూడా తడౌతుంది.
హెడ్‌ అలాగనా- గాని నువ్వన్నట్టు ఆపిల్లగానీ, కంటెపట్టుకు పరారిఅయిపోయివుంటే-
రామ పోనీండి- దానిఖరీదు యిప్పించెయ్యండి.
హెడ్‌ వాడిస్తాడా?
రామ మరి మీసాయం యెందుకు కోరా`ను?
హెడ్‌ యిస్తాడని నాకు నమ్మకంలేదు. ఐనా చూస్తాను, కేసనియెత్తు యెత్తడానికి యిద్దరు ముగ్గురు సాక్షులుండాలి!
రామ మందిరంలో వున్నవాళ్లో?
హెడ్‌ వీరేశం, మనవాళ్లయ్యా, మూడోకాలంలో వున్నారు. హవల్దారు అబద్ధం ఆడమంటే తంతాడు. మునసబునాయుడు యింతరాత్రివేళ అంతదూరం నడిచిరాలేడు. యిహ ఆడనూ పాడనూ రామందాసు వొక్కడేగదా?
రామ ఆ బైరాగాడు సాక్ష్యం పలకడేం?
హెడ్‌ వేషంవేసుకు ముష్టెత్తుకునే బైరాగాడనుకున్నావా యేవిఁటి? ఆయన గొప్పసిద్ధుడు. నిలువెత్తు ధనంపోస్తే అబద్ధవాఁడ్డు.
రామ సాక్ష్యం పలకావొద్దు, యేవీఁవొద్దు, దగ్గిరనిలబడితే చాలును. పిల్చుకురండి!
(కనిష్టీబువెళ్లి దుకాణదారునూ బైరాగినీ తీసుకువచ్చును.)
బైరాగి సాక్ష్యంఅంటే మావంటివాళ్లే చెప్పాలి. యోగదృష్ఠివల్ల చూశావఁంటే, యెక్కడ జరిగినదీ యెప్పుడు జరిగినదీ కళ్లకి కట్టినట్టు అప్పుడు కనపడుతుంది. గనక మేంకూడావస్తాం. యెవైఁనా దొరికితే హరిద్వారంలో మఠానికి పనికొస్తుంది.
రామ జరిగినదాని ముండామోశిరి. కొంచం కల్పనుంటేగాని కథనడవదు. అంచేత హెడ్డుగారు ముసలాడితో చెప్పేమాటలు నిజంఅని మీరు శలవివ్వాలి.
బైరాగి వెఱ్ఱి! వెఱ్ఱి! నిజవేఁవిఁటి, అబద్ధవేఁవిఁటి! మేం సిద్ధులం అబద్ధం నిజం చేస్తాం. నిజం అబద్ధం చేస్తాం - లోకవేఁ పెద్ద అబద్ధం. పదండి.
(నిష్క్రమింతురు.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)