నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౫-వ స్థలము. దేవాలయం గుమ్మందగ్గిర.
(హెడ్డుకనిష్టీబు, రామప్పంతులూ మాట్లాడుతుందురు. మరివక కనిష్టీబు, బైరాగి, దుకాణదారు కొంత యడముగా నిలుచుందురు.)
హెడ్డు నా నౌఖరీ పోగొట్టుకుంటానా భాయీ?
రామ కొంచం బెదిరిస్తే నౌఖరీ పోతుందా అన్నా? పోలీసుడూటీ అంటే బెదిరింపే గదా? మీరు అలా తప్పించుకుంటే నేనేం అనుకోను?
హెడ్డు (చేతిలో నులువుతున్న కాకితపుముక్కలు విసిరేసి) భాయీ, లుబ్ధావుధాన్లు చంటిపిల్లడా? దుక్కిముచ్చా? బెదిరించడానికి - కూనీకేసని నాకేవైఁనా ఆశవుంటే, పోలీసువాణ్ణి, నేను వూరుకుంటానా? పట్టుకుంటే నాకు యెంతకా`రక్టుకాదు? యీ జవాన్ని యీ చీకటిరాత్రిలో నూతిలోదింపానుకానా? కూనీ గీనీ అంటే యవరైనా నవ్వుతారు. మీనాక్షిచేతికి వెరచి, ఆపిల్ల యిరుగింట్లోనో పొరుగింట్లోనో పడుంది. మీయింట్లోనే వుందేమో ముసలాడు అన్నట్టు?
రామ దేవుఁడుతోడు మాయింటికిరాలేదు. యిరుగింటో, పొరుగింటో అని మీరు వూరుకుంటే యలాగ? మీధైర్యవేఁవిఁటో నాకు బోధపడదు. వెతికించవయ్యా అంటే, వెతికించారూకారు. ఆ యిరుగింటివాళ్లూ పొరుగింటివాళ్లూ, పిల్ల నిద్దరపోతూవుండగా కంటె చెపాయిస్తే నాగతేవిఁటి? కంటె యింటికి పట్టుకు వెళ్లకపోతే మధురవాణి గుమ్మంలోంచి గెంటుతుంది- అనగా, గెంటుతుందని కాదు - యేడుస్తుంది, ప్రాణం తినేస్తుంది. విన్నారా?
హెడ్డు అయితే నాసలహావిన్నారా?
రామ యేదో చెప్పండి మరి.
హెడ్డు ఆకంటె యిచ్చిందాకా, కదలకుండా, లుబ్ధావుధాన్లు యింటిమీద కూర్చోండి.
రామ యిదా సలహా? పీకమీద కూచున్నదాకా నాకేంపట్టింది? యింటికెళ్లి సుఖంగాపడుకుంటాను.
హెడ్‌ మధురవాణి బాధ పెడుతుందనికదూ?
రామ అని మీకు కనికారం కాబోలు? రేపుగానీ వాడు కంటెయివ్వకపోతే, అవుధాన్లుమీద సివిల్‌ దావాపడేస్తాను. మీదగ్గిర, కంటె మాట వొప్పుకున్నాడు గదా, మిమ్మల్ని సాక్ష్యంవేస్తాను.
హెడ్‌ ఓహో యిదా వేషం? పోలీసు ఆఫీసర్ని నేను, సాక్ష్యాలకీ సంపన్నాలకీ తిరిగితే నానౌఖరీ నిలుస్తుందా? కావలిస్తే లుబ్ధావుధాన్లు కంటె హరించాడని నాదగ్గిర ఫిరియాద్‌ చెయ్యండి. కేసుచేసి నా తమాషా చూపిస్తాను.
రామ కంటెమాట మీదగ్గిర అతడు వొప్పుకున్నతరవాత, మీరు బోనెక్కి యలా అబద్ధం ఆడగల్రో చూస్తానుగదా.
హెడ్డు పంతులూ, అక్కరమాలిన లౌక్యాలుచెయ్యకు. వాడు కంటెమాట తనకేవీఁ తెలియదన్నాడు. కావలిస్తే ఆమాట సాక్ష్యం పలుకుతాను.
రామ యిదా మీరు చేసినసాయం?
హెడ్డు యెందుకు అక్కరమాలిన ఆందోళన పడతావయ్యా- రేపు నీకంటె నీయింట్లోవుండకపోతే నన్ను అను.
రామ మధురవాణితో యిప్పుడు యేంజెప్పను?
హెడ్‌ అయితే నన్నేం జేయమంటారు?
రామ మళ్లీ లుబ్ధావధాన్లు యింటికిరండి. యీమాటు మనవిఁద్దరం వెళ్లి పీడిద్దాం.
హెడ్‌ రెడ్డొచ్చాడు, మొదలాడు అన్నాట్ట - నిరర్ధకంగా రాత్రల్లా నిద్దర్లేకుండా చంపా`వు - మరి నేను రాజాలను. నువ్వెళ్లి వాడియింటిమీద కూచోవయ్యా, అని చెప్పా`నుకానా? నామాటవిని అలా చెయ్యండి. అదేసలహా. పీసిరిగొట్టు ముండాకొడుకు మానలుగురికీ నాలుగుమూళ్లు పజ్యెండురాళ్లు పారేశాడు. యివి పెగిలేటప్పటికి నాతల ప్రాణం తోకకివొచ్చింది. నావొంతు మూడూ మీకిచ్చేస్తాను.
రామ కంటెపోయి యేడుస్తూవుంటే, యీవెధవ మూడురూపాయలూ నాకెందుకూ?
హెడ్డు మీకు అక్ఖర్లేకపోతే పోనియ్యండి. గురోజీగారికి యిద్దాం.
రామ కొంచం చిల్లరఖర్చుంది. యేంజెయ్యను? యిలా పారెయ్యండి. (పుచ్చుకొనును.)
హెడ్డు గురోజీ తమకో తులసిదళం.
బైరాగి తృణం, కణం యేవొఁచ్చినా మఠానికే అర్పణం.
హెడ్డు (దుకాణదారుతోనూ, కనిష్టీబుతోనూ) మీకోమూడు, నీకోమూడూ - (చేతులుదులిపి) సాఫ్‌ఝాడా - నాకు తిప్పటే మిగిలింది.
దుకాణదారు (బైరాగిని పక్కకిపిలిచి) యీవేళే చెన్నాపట్టంనించి ఫస్టురకం బ్రాందీ వొచ్చింది. చిత్తగించి మరీ కాశీ వెళుదురుగాని.
హెడ్డు గురోజీ రాం! రాం! పంతులూ, ముసలాణ్ణివెళ్లి పట్టుకోండి. భాయీ, స్టేషనుకుపోవాలి. (జవానుతో) రావోయి కావఁయ్యా.
(హెడ్డూ, జవానూ, ఒకవైపున్నూ, దుకాణదారూ, బైరాగీ మరి వొకవైపున్నూ వెళ్లుదురు.)
రామ కంటె పోయిందంటే మూడురూపాయలా చేతులో బెడతాడు! (విరసంగా నవ్వును) వీడితాళం పడతాను. (హెడ్‌ పారేసిన కాకితపు ముక్కలుయేరి) యినస్‌పెకటరుకి వొకటి, తాసిల్దారుకి వొకటి, ఆకాశరామన్న అర్జీలు పంపుతాను. వెధవ, మధురవాణి దగ్గిరికి వెళతాడేమో? నేను యింటికిపోతే అరుగుమీద పడుకోవాలిగాని ఆతిక్కలంజ తలుపుతియ్యదు. లుబ్ధావధాన్లు యింటికివెళ్లితే వాడు కఱ్ఱుచ్చుకుంటాడు. యీ దేవాలయంలో పరుందునా?- పురుగూ బుట్రా కరిస్తే - కరిస్తే - ఛీ! ఈ సానిముండని వొదిలేస్తాను - ఆ గుంటయావైఁనట్టు? నా అదృష్టంవల్ల యవళ్లింట్లోనైనా దాగి రేపుగాని కళ్లబడితే, కంటెపోకూడదు - ఒకవేళ చస్తే? - చచ్చుండదు - నూతులో పడలేదు. గవరయ్యా, కావఁయ్యాకూడా గాలించారు - ఒకవేళ అది రెండోపెళ్లి పిల్ల అయి, దాని ఆతండ్రి కానికీగా వొచ్చి బండీ యెక్కించుకు దౌడాయించాడేమో? అలా ఐతే కంటెకూడా వుడాయించడా? - మీనాక్షిని పట్టుకుంటే కొంత ఆచోకీ తెలుస్తుంది - అది కనపడ్డవెఁలాగ? - తలుపుతట్టితేముసలాడే వొస్తాడేమో? - (రోడ్డుదాటి లుబ్ధావధాన్లు యింటిగుమ్మంయదట నిలుచుని) ఆకలి దహించేస్తూంది - మీనాక్షి దొరికితే యేవైఁనా ఫలహారం యిచ్చును - యవడు చెప్మా! రావిచెట్టుకింద చుట్ట కాలుస్తున్నాడూ? (నాలుగు అడుగులు ముందుకువెళ్లి) అసిరీ, నువ్వా?
అసిరిగాడు నానుబాబు (చుట్టపారవైచును.)
రామ నిమ్మళంగా వున్నావురా?
అసిరి యేట్నిమ్మళంబాబూ. సానమ్మొచ్చింది - ఈయమ్మకాసి సూడ్డం మానేసినారు. డబ్బిచ్చే దాతేడిబాబూ?
రామ అసిరి, అడక్కపోతే, అమ్మైనా పెడుతుందిరా?
అసిరి ఆసానమ్మ మాసెడ్డమనిషిబాబూ!
రామ యేవిఁటి? యేవిఁటి? చెప్పొరే. చాలారోజులైంది నీకు డబ్బిచ్చి - యింద యీ రూపాయి పుచ్చుకో.
అసిరి నూరు దండాలుబాబూ!
రామ మధురవాణి మాటయేవిఁట్రా చెప్పబోయినావు?
అసిరి మాసెడ్డమనిషిబాబూ.
రామ యవడెళ్తాడ్రా దాందగ్గిరికి? అసిరి - యవడెళ్తాడ్రా?
అసిరి యవడెళ్నా, యీపు పెట్లగొడతాది బాబూ.
రామ చెడ్డమనిషన్నావు?
అసిరి కాదా? మొన్న హెడ్డుగారెళ్తే, యేపికూన్ని ఉసు గలిపిందికాదా?
రామ నిజంచెప్పావు. నీమీద యెప్పుడైనా కోప్పడ్డదిట్రా?
అసిరి మాలాటోళ్లమీద యెందుక్కోప్పడతాదీ? బాపనాళ్లొస్తే తిడతాది.
రామ నువ్వు యెప్పుడూ నిజవేఁ చెబుతావురా అసిరిగా.
అసిరి సీ! అబద్దవాడితే బగమంతుడు ఒల్లకుంటాడా బాబూ?
రామ మీబుగత యేం జేస్తున్నాడ్రా?
అసిరి తొంగున్నాడుబాబూ.
రామ నీకు మరోరూపాయి యిస్తాను - మీనాక్షిని సావిట్లోకి పిలుస్తావురా?
అసిరి నాశక్కవాఁ, బాబూ? ఆయమ్మ అయ్యగదులో పక్కేసుకుతొంగున్నారు.
రామ నువ్వు చిటికేస్తే, యక్కడున్నా లేచొస్తుంది. నేనెరగనట్రా!
అసిరి తెండి బాబూ. సూస్తాను.
(రామప్పంతులు రూపాయి యిచ్చును. ఉభయులూ యింట్లో ప్రవేశింతురు.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)