నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౬-వ స్థలము. లుబ్ధావధాన్లు యింటినడవ.
(తలుపు జారవేసివుండును.)
(మీనాక్షి ప్రవిదతో దీపంతెచ్చి గూటిలోవుంచును. రామప్పంతులు వొత్తితగ్గించి, మీనాక్షిని ముద్దుబెట్టుకొనును.)
మీనాక్షి తోవతప్పొచ్చారో?
రామ బుద్ధితక్కువచేత, గడ్డితిని యిన్నాళ్లూ తోవమరచాను.
మీనా మధురవాణి యలా రానిచ్చింది?
రామ మధురవాణి శిగ్గోశిరి, దాన్ని వొదిలేస్తాను. ఆకలి దహించుకుపోతూంది. ఫలారం యేవైఁనావుందీ?
మీనా యేవుందీ?- వొడపప్పూ, కొబ్బిరిముక్కా కావాలా!
రామ యేదో ఒహటితెస్తూ.
(మీనాక్షి మూకుడుతో వడపప్పూ, కొబ్బరిముక్కలూ తెచ్చును. రామప్పంతులు తినుచుండును.)
మీనా మధురవాణిని వొదిలేస్తారో?
రామ వొదిలెయడం నిశ్చయవైఁపోయింది.
మీనా కనిష్టీబుమాట తెలిసిందో?
రామ తెలిసింది.
మీనా యవరుచెప్పారు?
రామ అసిరిగాడు.
మీనా మా అసిరిగాడా?
రామ మీ అసిరిగాడే.
(అసిరిగాడు వీధితలుపు కొంచంతీసి తొంగిచూసి.)
అసిరి దెయ్యానికెట్టింది తింతున్నావయ్యా?
రామ దెయ్యానికా పెట్టా`రు?
మీనా (అసిరిగాడితో) వూరుకో వెధవా.
రామ

నీకు న్యాయవేఁనా, దిగదుడుపు కూడుపెట్టడం?

(వీధులోకివెళ్లి వమనము చేసికొనుటకు ప్రయత్నముచేసి తిరిగీ ప్రవేశించి)

వమన వైఁందికాదు. యేం సాధనం?

మీనా దిగదుడుపుకాదంటే నమ్మరుకదా?
రామ మూకుళ్లో తగలేశావు?
మీనా దెయ్యంతినిసచ్చిందా, యేవిఁటి?
రామ ఆడవాళ్లు దారుణం మనుషులు!
మీనా అసిరిగాడేంచెప్పా`డు మధురవాణిమాట?
అసిరిగాడు (తిరిగీ తొంగిచూచి) ఆ పారేసిందట్టుకు పోదునాబాబు?
రామ పట్టుకుపో.
(అసిరిగాడు పట్టుకుపోవును.)
మీనా వాడికి మీకంటె ధైర్యంవుంది.
రామ అపవిత్రం ముండాకొడుకు యేవైఁనాతింటాడు. బ్రాహ్మలం పవిత్రవైఁన వాళ్లంగదా?
మీనా పవిత్రం అంటే, మీదీ, నాదే!
రామ అదేం అలా అంటున్నావు?
మీనా నేను వెధవముండనీ, మీరు సరసులున్నూ. మనకంటే మరిపవిత్రం అయినవారు యవరుంటారు?
రామ ఆకళంకం తీసెయ్యడానికే యీవేళొచ్చాను.
మీనా యలా తీసేస్తారు?
రామ మనయిద్దరం పెళ్లాడితే మరి అపవిత్రత యెక్కడుంటుంది?
మీనా యేవిఁటీ!
రామ మనం పెళ్లాడదాం!
మీనా నిజంగాను?
రామ యేంవొట్టు వేసుకొమ్మన్నావు?
మీనా ఆదీపం ఆర్పెయ్యండీ.
రామ యీకాగితం ముక్కలు చదివి మరీ ఆర్పేస్తాను. (కాగితంముక్కలు జేబులోంచితీసి చదివి) గాడిద కొడుకు తనబాకీ తాలూకు నోటులాగి, నన్ను దగా చేశాడు; వీడితాళం పడతాను.
మీనా యవడు?
రామ అది వేరేకథ.
మీనా అసిరిగాడు కనిష్టీబుమాట యేం జెప్పా`డు?
రామ మధురవాణి హెడ్డుమీద కుక్కని వుసిగలిపిందని చెప్పా`డు.
మీనా యెందుకూ?
రామ నేను లేనప్పుడు వాడు యింట్లో చొరబడబోతేను.
మీనా అయ్యో తెలివా! అసిరిగా!
అసిరిగాడు (ప్రవేశించి) యేటమ్మా?
మీనా వెధవా, నిజంచెప్పూ. పంతులు యింట్లోలేనప్పుడల్లా కనిష్టీబు మధురవాణితో వుంటా`డని, నువ్వు నాతో చెప్పలేదూ?
అసిరి (బుఱ్ఱగోకుకుంటూ) సెప్పినాను.
రామ దొంగవెధవా! కుక్కని వుసిగలిపిందన్నావు?
అసిరి బాబు - నౌకరోడు నోరుమూసుకోవొద్దా బాబు? సానమ్మడిగితే, మీమాట సెప్పుతాన బాబు?
మీనా వెధవా, నువుచెబితే నాకు భయవఁనుకున్నావా యేవిఁటి?
రామ ఓరి అబద్ధపు వెధవా! యెవరితోనూ మామాటమాత్రం చెప్పకు. రూపాయి యిచ్చానుకానూ?
మీనా యందుకిచ్చారూ, రూపాయి?
అసిరి పిల్లలోణ్ణిగందా? (పైకివెళ్లును.)
రామ దొంగముండ ద్రోహంచేస్తూందేం?
మీనా తెలుసునన్నారు?
రామ యింతని యెరగను.
మీనా ఆడది నీతితప్పినతరవాత అంతేవిఁటి? యింతేవిఁటి? తెగించినదానికి సగుడు మోకాలుబంటి - అందులో సాంది ఖాయిదాగా వుండాలనుకోవడం మీదీ బుద్ధితక్కువ.
రామ బుద్ధితక్కువంటే బుద్ధితక్కువా? ముండనిబుఱ్ఱ చితకపొడిచెయ్యాలనివుంది. దీనికింద యంత సొమ్ము తగలెట్టా`నూ!
మీనా యెప్పుడుతోలేస్తారు?
రామ యెప్పుడోనా? రేపే. లంజ యంత పతివ్రతవేషం వేసిందీ?
మీనా మనవెఁప్పుడు వెళ్లిపోవడం?
రామ యక్కడికి?
మీనా మతి పోతూందా యేవిఁటి? రాజమేంద్రం?
రామ అవును. రేపు దాన్నితోలేస్తానా? యెల్లుండి మనం వుడాయిద్దాం. గాని నీసరుకులు తెచ్చుకుంటావా, ముసలాడికి వొదిలేస్తావా?
మీనా నాకున్నదల్లా నాసరుకులే; యెలా వొదిలేస్తాను? నా సరుకులపెట్టె తాళం మానాన్నదగ్గిరుందిగదా యేవిఁగతి?
రామ నాప్రయోజకత్వం నీకేం తెలుసును? యిదుగో యీ రింగునవున్న యినప ములికీతో నీచిత్తవొఁచ్చిన పెట్టెతాళం తీసేస్తాను. గాని నాకంటె యక్కడుంది?
మీనా గుంటకిపెట్టిందా? రాత్రివేళ, నాబట్టల పెట్లోపెట్టేది.
రామ నీపుణ్యవుంటుంది ఆ బట్టలపెట్టె వోమాటుతీసిచూతూ. రేపు దానికంటె మధురవాణికిచ్చి, ముండని తగిలేస్తాను.
మీనా ఆగుంట బట్టలపెట్టె తాళం పారేశింది.
రామ ములికితో తీసేస్తాను.
మీనా నా సరుకులపెట్టె తాళంకూడా తీసేసిపెడతారూ?
రామ అద్దే!
మీనా నన్ను పెళ్లాడతానని ప్రెమాణం చేశారుకారే?
రామ దీపం ఆర్పేస్తే పెట్టెతియ్యడం యలాగ?
మీనా అగ్గిపుల్లవుంది.
రామ ఐతే యిదిగో, నిన్ను తప్పకుండా పెళ్లా`డతానని యీ దీపం ఆర్పేస్తున్నాను.
(రామప్పంతులు దీపం ఆర్పి మీనాక్షిని కౌగలించుకొని యెత్తును.)
రామ యిలా యెత్తుకు తీసుకుపోతాను రాజమహేంద్రవరం.
(లుబ్ధావధాన్లు చీకటిలోవచ్చి కఱ్ఱతో రామప్పంతులు కాళ్లమీదకొట్టును. మీనాక్షి కిందపడును.)
లుబ్ధా బందిపోటు గాడిదెకొడకా!
రామ సచ్చాన్రా (వీధిలోకి కుంటుకుంటూపోవును.)
లుబ్ధా పో, ముండా నువుకూడా నాయింట్లోంచి. (మీనాక్షిని పైకితోసి తలుపు గడియవేయును.)
రామ అసిరిగా. చంపేశాడ్రా - కాలెవిఁక విరిగిపోయిందిరా.
అసి (నిమ్మళంగా) దెయ్యానికెట్టింది తింతే యేటౌతదిబాబూ? (గట్టిగా) కానేళయిల్లు జొరబడితే, బుగత తన్నడా?
రామ (మీనాక్షితో) నువ్వు యింట్లోకి వెళ్లిపో.
మీనా మరి యింట్లో అడుగుపెట్టను. నాసరుకులు లేకపోతే పాయను. రండి రాజమేంద్రంపోదాం.
రామ తలిచినప్పుడేనా తాతకి పెళ్లి?
మీనా మీయిష్ట వొఁచ్చినప్పుడు పెళ్లాడుదురుగాని, యింట్లోంచి లేవదీసుకొచ్చారుగదా? యిహ నేను మీతో వుండవలసినదాన్నే; పదండి.
రామ వెఱ్ఱి కుదిరింది రోకలి తలకి చుట్టుకొమ్మన్నాట్ట! బతిమాలుకుంటాను యిప్పటికి యింట్లోకి వెళ్లిపో.
మీనా మరి యీజన్మంలో యీ యింట్లో అడుగుపెట్టను.
రామ అసిరిగా, మీనాక్షి వొక్కర్తావుంటుంది. కాపాడి, బుగత తలుపుతియ్యగానే లోపలికి తీసికెళ్లు - (పరిగెత్తును. మీనాక్షి వెంటపడును.)
(రామప్పంతులు యింటియదట.)
రామ (తలుపుతట్టి) వేగిరం, వేగిరంతియ్యి.
మధురవాణి (తలుపు అవతలనించి) యేవిఁటాతొందర?
రామ ఆకుచిట్టెడ వెంట తరువుఁతూంది.
మధు చిట్టెడ కనపడగానే తలుపుతీస్తాను.
రామ తలుపేసుకు కూచుంటే నీక్కనపడ్డం యలాగ? నువ్వు తలుపుతీసేలోగా నన్ను కాటేస్తుంది.
మధు నాకంటేదీ?
రామ కంటె, కంటె, అని తపిస్తున్నావేవిఁటి? నిలబడ్డపాటున నూరుకంటెలు కురిపిస్తాను.
మధు మీనూరుకంటెలూ మీరు వుంచుకుని, నావొక్కకంటె నాకిచ్చి, మరీ యింట్లో అడుగుబెట్టండి.
రామ రేపు పొగలుగాని కంటె యివ్వనన్నాడు లుబ్ధావధాన్లు.
మధు రేపే యింట్లో కొత్తురుగాని, మించిపోయిందేవీఁలేదు.
రామ యింతట్లో చిట్టెడ మీదపడితే?
మధు సకేశా? అకేశా?
రామ పిల్లికి చెలగాటం, యలక్కి ప్రాణపోకటా!
(మీనాక్షి ప్రవేశించి, రామప్పంతులు రెక్కపట్టుకొనును.)
మీనా దీపం ఆర్పి ప్రమాణం చేశావు - తప్పితే తలపగిలిపోతుంది.
రామ పో ముండా!
మీనా మీ కాగల పెళ్లాన్నిగదా యెక్కడికిపోతాను?
మధు కాగల పెళ్లావేఁవిఁటి?
మీనా నిన్ను వొదిలేసి, నన్ను రాజమేంద్రం తీసుకుపోయి పెళ్లాడతానన్నాడు - దీపవాఁర్పి ప్రమాణంచేశాడు - మరెలా తప్పుతాడు?
మధు యీవిడేనా ఆకుచిట్ట`డ?
రామ ముండా, నాచెయ్యొదిలెయ్‌ - నిన్ను నే పెళ్లాడతానన్నానే? కలగన్నావా యేవిఁటి? (మీనాక్షిని విడిపించుకొనగా మీనాక్షి కిందపడును.)
మధు ఆడదానిమీదా చెయిజేసుకుంటారు? యేమి పౌరుషం! అబద్ధవాఁడక అన్నమాట నిలబెట్టుకోండి. యేం? కులంతక్కువా? రూపంతక్కువా? ఆమెబతుకు భ్రష్టుచెయ్యనే చేశారు; పెళ్లాడి తప్పుదిద్దుకోండి - ఆవిణ్ణి పెళ్లాడివొస్తేనే నేను తలుపు తీస్తాను.
మీనా పంతులు నన్ను కౌగలించుకొని యెత్తుకుంటే మానాన్న చూసి, తన్ని, యిద్దర్నీ యింట్లోంచి తగిలేశాడు. నువ్వు హెడ్డు కనిష్టీబుతో పోతున్నావు, నిన్నొదిలేసి నన్ను పెళ్లాడతానని వొట్టేసుకున్నాడు. నన్ను లేవదీసుకొచ్చి, నన్ను పెళ్లాడక తప్పుతుందాయేమిటి?
మధు అవస్యం పెళ్లాడవలిసిందే - పెళ్లాడకపోతే నువ్వుమాత్రం వూరుకుంటావూ? దావా తెస్తావు - పంతులుగారికి దావాలంటే సరదానే!
రామ మధురవాణీ - నీకు మతిపోతూంది - నాయింటికి నువ్వా యజమానివి? తలుపు తియ్యి.
మధు నిలబడండి. కర్పూరంవెలిగించి మంగళహారతి పళ్లెంతెస్తాను. (తలుపుదగ్గిరనుంచి లోనికివెళ్లును.)
రామ (తలుపుసందులోనుంచి చూసి, తరవాత మీనాక్షిని ముద్దెట్టుకుని) యెంతపనిచేశావూ! దాంతో చెప్పేశావు! రహస్యంగా లేచిపోయి పెళ్లిచేసుకోవాలిగాని, అల్లరిచేసుకుంటే యలాగ?
మీనా యెప్పుడైనా అందరికీ తెలిసేదేగదా?
రామ నామాటవిని యిప్పుడు యింటికి వెళ్లిపో.
మీనా యిహ మాయింటికి వెళ్లను. యిదేమాయిల్లు; మధురవాణి తలుపుతీస్తుంది; లోపలికి వెళదాం.
రామ అయితే యిక్కడవుండు యిప్పుడే వొస్తాను (కొన్ని అడుగులు వీధంట నడచి, నిలచి) నిజంగా మంగళహార్తి తెస్తుంది కాబోలు పెంకెలంజ? అది తలుపు తియ్యకపోయెనా, మీనాక్షి నన్ను వెతకడానికి బయల్దేరుతుంది. తెల్లవారవచ్చింది - చెరువ్వేపుపోయి కాలకృత్యాలు తీర్చుకుని ఆపైచర్య ఆలోచిద్దాం. రెండ్రోజులు పైకి వుడాయించానంటే మళ్లీ వొచ్చేసరికి కొంత అల్లరి సద్దుకుంటుంది. తలుపుతీసినట్లు కానరాదు. యవడిల్లు? యవర్తె యిది నన్ను అడ్డడానికి? ఆశ్చర్యం!
 

(కొంతదూరంగా వీధిలో నిలబడి, దాసరివేషంతో శిష్యుడు చితారుమీటి పాడును.)

చరణం॥
"యిల్లుయిల్లనియేవు । యిల్లునాదనియేవు ।
        నీయిల్లుయెక్కడే చిలుకా?"

రామ యిది నాయిల్లుకాదా?
శిష్యుడు "ఊరికిఉత్తరాన । సమాధిపురములో ।
కట్టెయిల్లున్నదే చిలుకా ॥"
రామ వొల్లకాట్లోనా?
శిష్యుడు పల్లవి॥
"యెన్నాళ్లుబ్రతికినా । యేమిసామ్రాజ్యమే ।
        కొన్నాళ్లకోరామ చిలుకా?" ।
అనుపల్లవి॥
"మూణ్ణాళ్లబతుకునకు । మురిసేవు త్రుళ్లేవు ।
        ముందుగతికానవే చిలుకా"
రామ యేవిఁటీ అపశగునం పాటా!
శిష్యుడు "కఱ్ఱలే చుట్టాలు । కట్టెలేబంధువులు ।
కన్నతల్లెవ్వరే చిలుకా?"
రామ చుట్టాలా? వొక్క అప్పవుంది, అదియెప్పుడూ నాగుమ్మంలో అడుగుబెట్టలేదు. యిప్పుడు యింటికి యజమాని యెవరూ? తలుపవతల సానిలంజా! తలుపివతల సంసారి వెధవలంజానూ; యిద్దరూ కలిసి యిల్లుచేరకుండా నన్ను తగుల్తున్నారు.
శిష్యుడు "నిన్నుమోసేరు నలుగురు । వెంబడిని పదిమంది ।"
రామ వెఱ్ఱి ముండాపాటా! పోదాం. (గబగబ కొంతదూరము నడచి, నిలుచుని) యీతోవనే వొస్తున్నాడుకాబోలు - అదుగో పాట వినపడుతూంది.
శిష్యుడు (పాట)
"నువ్వుకాలిపోయేదాక ।
కావలుందురుగాని ।
కడకుతొలగొత్తురు ।
వెంటనెవరూరారు చిలుకా ॥"
రామ వెఱ్ఱి ముండాపాటా!
శిష్యుడు పంతులుగారూ! యక్కడున్నారు?
రామ పరుగుచ్చుకోకపోతే పట్టుగుంటుంది. (పరిగెత్తును.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)