నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
కన్యాశుల్కము - షష్ఠాంకము.
౧-వ స్థలము. రామచంద్రపురం అగ్రహారంలో.
(చెఱువుగట్టునవున్న తోటలోనికి పెళ్లివారి బళ్లువచ్చును. గట్టుమీద ఒకవైపు అగ్నిహోత్రావధాన్లు, రెండవవైపు పళ్లుతోమికొనుచు రామప్పంతులును.)
అగ్ని బళ్లుదింపండి. బళ్లుదింపండి. సాయేబూ యేనుక్కి కావలసినంత రొడ్డ. చెఱువు స్నానానికి బహుబాగావుంది. యెవరయా చెఱువుగట్టుమీద?
రామప్పంతులు (తనలో) అరే! మరిచితిని. యీవేళేకదా పెళ్లివారు రావలసిన రోజు? (పైకి) నా పేరు రామప్పంతులంటారు.
అగ్ని లుబ్ధావధాన్లుగారు మిమ్మల్ని పంపించారా యేమిషి?
రామ యెందుకండి?
అగ్ని మేవొఁస్తున్నావఁని యెదురుగా యవర్నీ పంపలేదా? నాపేరు అగ్నిహోత్రావధాన్లు అంటారు.
రామ మీరేనా అగ్నిహోత్రావధాన్లుగారు? యేంవచ్చారేఁవిటి?
అగ్ని పెళ్లిమాట మీకుతెలియదా యేమిషి?
రామ పెళ్లెవరికండి?
అగ్ని మీదీవూరుకాదా యేమిషండి? మాపిల్లని లుబ్ధావధాన్లుగారి కిస్తావుఁ.
రామ లుబ్ధావధాన్లుగారికి పెళ్లైపోయిందే?
అగ్ని తమరు హాస్యాలాడుతున్నారు- హాస్యాలకేంగాని, ప్రయత్నాలుయలా జరుగుతున్నాయి యేమిషండి?
రామ మీరే హాస్యాలాడుతున్నట్టుంది. పెళ్లిఅయి పదిరోజులైంది. లుబ్ధావధాన్లుగారి సంబంధం అక్కర్లేదని మీరు రాశారట. అందుపైని యవడో గుంటూరునుంచి వొచ్చిన ఓ శాస్తుల్లు కొమార్తెని పన్నెండువొందలిచ్చి పెళ్లా`డాడు.
అగ్ని అన్నగారూ - హాస్యం ఆడుతున్నారు. న్యాయంకాదు. మనకి బావగారి వరసా యేమిషండి?
రామ యేమిటి మీమాటలూ? నేను యెన్నడూ అబద్ధవాఁడి యెరుగను. నామాట నమ్మకపోవడం ధర్మవేఁనా?
అగ్ని ప్రమా`ణం చెయ్యండీ!
రామ గాయత్రీసాక్షి.
అగ్ని అయ్యో! అయ్యో! యేవీఁదురంతం! రండీ, వెళ్లి గాడిద`కొడుకు యెవిఁకలు విరగ్గొడతాను.
రామ నేనురానండి. ఆగుంటూరు సంబంధం చెయ్యవొద్దన్నానని నాతో మాట్లాడడం మానేశాడు. మీరు వెళ్లిరండి - మీరు తిరిగీ వొచ్చిందాకా యిక్కడే కూచుంటాను.
అగ్ని ఆగాడిదెకొడుకు యింటికి నాకు తోవతెలియదే?
శిష్యుడు

(చెఱువుగట్టు యెక్కుతూపాడును.)

"తా నెవ్వరో తనవారెవ్వరో? । మాయజీవికి తనువుకు తగులాయగాకా" ॥

(రామప్పంతులు నిలబడి భయము కనపర్చును.)
అగ్ని యేవిఁ అలా చూస్తున్నారు?
రామ శవాన్ని మోసుకుపోయే పాట!
శిష్యుడు "దినమూ, మరణమని తెలియూడీ"
రామ (శిష్యునితో) వూరుకో (అగ్నిహోత్రావధాన్లుతో) అన్నా ఓకానీ వుందా?
శిష్యుడు మిమ్మల్ని తీసుకురమ్మంది.
రామ చచ్చానే - వొస్తూందాయేవిఁటి?
శిష్యుడు కంటెపోతేపోయింది, రమ్మంది.
రామ బతికా`ను.
అగ్ని చావడం యెందుకు, బతకడం యెందుకు?
రామ అది వేరేకథ.
శిష్యు చిట్టపులి పిల్లని తండ్రొచ్చి వండకి తీసుకుపోయినాడట.
అగ్ని యీవూళ్లోకి పుల్లొస్తాయా యేమిషి?
రామ విరగడైపోయింది. (శిష్యునితో) యింద రూపాయి.
శిష్యుడు

(తీసుకుని) దాసుణ్ణి బాబూ!

(పాడును) "చిత్తాస్వాతివాన, జోడించికురియగ"

అగ్ని యేవిఁటీ వెధవపాట? వూరుకుంటావా వూరుకోవా? నీకు రూపాయి చాలదురా గుంటకక్కగట్టా?
శిష్యుడు తమరు దయచెయ్యరాబాబూ?
అగ్ని నేనివ్వను - అన్నా, తోవ యవరు చూపిస్తారు.
రామ (శిష్యుడితో) నీకు లుబ్ధావధాన్లు యిల్లు తెలుసునూ?
శిష్యుడు తెలుసును - తండ్రీ.
రామ అవధాన్లుగారు ఓకాని డబ్బిస్తారు. యిల్లు చూపించు.
శిష్యుడు ముందిస్తేగాని చూపించను.
అగ్ని యింద - యేడువు.
(శిష్యుడు ముందూ, అగ్నిహోత్రావధాన్లు వెనకా కొన్ని అడుగులు వెళ్లిన తరవాత, శిష్యుడుపాడును.)
శిష్యుడు "నీలాలకా యేల నీ యలుకా"?
అగ్ని యలకేవిఁటి నీశ్రాద్ధం?
శిష్యుడు

యలక్కాదు, పిల్లి.

(పాడును) "పిల్లన్న తెయితక్కలాడంగనూ । యలక లేరూగట్టి దున్నంగనూ"

అగ్ని యేవిఁటీ?
శిష్యు "మేకపిల్లల్రెండు మేళాంగట్టుకుని । మేరంగితీర్థాని కెళ్లంగనూ" ॥
అగ్ని యేవిఁటి నీశ్రాద్ధంపాట!
శిష్యు "తొండాయనేస్తూడు. దొనిగఱ్ఱబట్టుకుని । తోటమల్లీ పువ్వులేరంగను" ॥
అగ్ని పాడావంటే తంతాను.
శిష్యు అయితే నీకు మరి యిల్లు చూపించను.
అగ్ని పాడగట్టా - (కొట్టబోవును.)
శిష్యుడు (తప్పించుకు పారిపోతూ) "గట్టుకిందానున్న । పందా`యనేస్తూడు - మరిగబుకూ । మరిగుబుకూ" ॥
(నిష్క్రమించును.)
అగ్ని వీడిశ్రాద్ధం చెట్టుకింద బెట్టా! తోవయిటా? అటా?
(తెరదించవలెను.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)