నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౨-వ స్థలము. చెఱువుగట్టుతోట.
(అగ్నిహోత్రావధాన్లు, రామప్పంతులు, వెంకమ్మ, యితరులూ.)
అగ్ని గాడిదెకొడుకుని మాచెడ్డదెబ్బలు కొట్టేశాను; యేనుగులూ గుఱ్ఱాలూ తెచ్చాను వీడిశ్రాద్ధం మీదికి! తోవఖర్చయినా వొకదమ్మిడీ ఇయ్యడష.
వెంకమ్మ మనప్రాలుబ్ధం - నేన్నోచిన నోవుఁలు యిలా వుండగా, మరోలా యలా అవుతుంది? యీ సమ్మంధం వొద్దనిపోరితే విన్నారూ? నేను భయపడుతూనే వున్నాను. బయల్దేరేటప్పుడు పిల్లి యెదురుగుండా వొచ్చింది.
అగ్ని పింజారీ! వూరుకో - ఆడముండల కేంతెలుసును? అన్నగారూ, క్రిమినల్‌కేసు తావడానికి అవకాశంవుంటుందా? మాదగ్గిర అయ్యవారూ ఒకాయన వున్నారు. ఆయనకి లా బోగట్టా మా బాగాతెలుసును. ఆయన్నికూడా సలహాచేదాం.
రామ కోర్టు వ్యవహారాల్లో ఆరితీరిన మీకు ఒహడు సలహాయివ్వాలండీ? స్థలజ్ఞుణ్ణి గనక సాక్ష్యం గీక్ష్యం తేవడానికి నేను సాయంచేస్తానన్నానుగానీ, అయ్యవార్లూ గియ్యవార్లూ మీకూ నాకూ సలహా చెప్పేపాటివాళ్లా? గుంటకక్కగట్లు రెండు యింగిలీషుముక్కలు చదువుకున్నారు గనుక ముక్కస్యముక్కార్థః అని తర్జుమాలుమట్టుకు చేస్తారు; గాని యేదయినా యెత్తుయెత్తావఁంటే, తమలాంటి యోధులు యెత్తాలి, నాలాంటి నియ్యోగపాడు నడిపించాలి. క్రిమినలుకి అవకాశంవుందా అని అడుగుతా రేవిఁటి? మీకు తెలియదా యేవిఁటి! - అటుపైని సులభసాధ్యంగా మూడు నాలుగువేలు డా`మేజీకూడా సివిల్లో లాగేస్తారు.
అగ్ని అదే, నా ఆలోచన.
రామ తీరిపాయె; మళ్లీ యిహ సలహాకేవుఁంది. వెంటనే వెళ్లి ముక్క తగిలించేదాం. ఖర్చులికి సొమ్ముపట్టుకుని బయలుదేరండి.
అగ్ని నాదగ్గిర దమ్మిడీ లేదు; యేమి సాధనం? యీ గాడిదెకొడుకు రూపాయలిస్తాడని నమ్మి, నేనేమీ తేలేదు.
రామ యింటికివెళ్లి లెఖ్కపట్టుకు వొచ్చేటప్పటికి పుణ్యకాలం మించిపోతుంది. "శుభస్యశీఘ్రం" అన్నాడు - మీఆలోచనేవిఁటి?
అగ్ని యిదేదో అయితేనేగాని యింటిమొహం చూసేదిలేదు. మా అమ్మి సరుకేదయినా యీ వూళ్లో తాకట్టు పెడదాం.
రామ అయితే పట్టుకురండి; పోలిశెట్టి దగ్గిరతాకట్టు పెడదాం; పోలిశెట్టిని మనం కొంచం మంచి చేసుకోవడం ఆవస్యకం. మీరు లుబ్ధావధాన్లుని కొట్టినప్పుడు- పోలిశెట్టి వున్నాడు గనక, లుబ్ధావధాన్లు మీమీద ఛార్జిచేసినప్పుడు, పోలిశెట్టిని తప్పకుండా సాక్ష్యం వేస్తాడు. శెట్టిని మనం విడతియ్యడం జరూరు- యేవఁంటారు?
అగ్ని మీసలహా మా బాగావుంది. నాకూ అదే భయవేఁస్తూంది.
రామ చూశారా, ప్ర`తివాడికీ సలహాచెప్పడం చాతౌతుందండీ? అందులో యీ యింగిలీషు చదువుకున్న అయ్యవార్లని సలహా అడిగితే, కేసులే తేవొద్దంటారు. దొంగసాక్ష్యాలు తా`వొద్దంటారు. వాళ్లసొమ్మేం పోయింది? యే మాలకూడూ లేకపోతే కేసులు గెలవడం యలాగ?
అగ్ని మా అయ్యవారు మట్టుకు మంచి బుద్ధిమంతుడూ, తెలివైనవాడూ నండి- కోర్టు వ్యవహారాలలో అతనికి తెలియని సంగతిలేదండి. అంతబుద్ధిమంతుణ్ణి నేను యక్కడా చూడలేదు. ఆయన్ని చూస్తే మీరూ అలాగే అంటారు.
రామ యెంతబుద్ధిమంతుడైనా మీకొహడు సలహా చెప్పేవాడున్నాడండీ? (చెవులో) మరోమాట- మీ అయ్యవారు గిరీశంగాడు కాడండీ? వాడు లుబ్ధావధాన్లు పింతల్లికొడుకుగదా? మీకా వాడు, యీ కేసుల్లో సరైన సలహా చెబుతాడు?
అగ్ని అవునండోయి!
రామ నియ్యోగపాణ్ణి - నా మాట కొంచం ఖాతరీ చెయ్యండి. గనక, ఆ అయ్యవార్నితోడిచ్చి, పిల్లల్ని యింటికి పంపించెయ్యండి. యెకాయెకిని మనం తక్షణం వెళ్లిపోయి, లుబ్ధావధాన్లుకన్న ముందు ముక్క తగిలించెయ్యాలి. యేదో ఓసరుకు వేగిరం పట్టుకురండి.
అగ్ని యేదీ, అమ్మిని యిలా పిలువు.
వెంకమ్మ అమ్మేది చెప్మా? బద్ధకించి బండిలో పడుకుంది కాబోలు. పిలువమ్మా.
అగ్ని మనకి డా`మేజీ దిట్టంగా వొస్తుందా?
రామ వొస్తుందంటే, అలాగ యిలాగానా?
ఒకడు అమ్మన్నగారిబండీ యక్కడా కనపడదు; బండీ వెనకపడిపోయింది కాబోలు.
వెంకమ్మ అడుగో అబ్బివున్నాడే? వీడెలా వొచ్చాడు? అబ్బీ నువ్వు అక్కయ్య బండిలో కూచోలేదురా?
వెంకటేశం లేదు. నేను యేనుగెక్కా`ను.
అగ్ని దొంగగాడిద`కొడకా అయ్యవారేడ్రా?
వెంకటేశం యెక్కడా కనపడ్డు.
అగ్ని గుఱ్ఱం వొచ్చిందా? గుఱ్ఱపాడేడీ?
వెంకటేశం గుఱ్ఱపాడు చెప్పాడు-
అగ్ని యేవిఁట్రా`, వెధవా, చెప్పాడూ?
వెంకటేశం మా`ష్టరూ- రాత్రి-
అగ్ని నోటంటమాట పెగల్దేం?
వెంకటేశం గుఱ్ఱందిగి- బండీయెక్కా`ట్ట.
వెంకమ్మ అయ్యో దాన్ని లేవదీసుకు పోలేదుగద?
దగ్గిరనున్నవారు ఆఁ! ఆఁ!
వెంకమ్మ కొంప ములిగిపోయింది, మరేవిఁటి!
(చతికిలబడును.)
అగ్ని (కోపముచేతవణుకుచు) అయ్యవారు పకీరుముండని లేవతీసుకు పోయాడూ? నగలపెట్టె? నాకోర్టుకాగితాలో!
వెంకటేశం అక్కయ్యపెట్లో నాపుస్తకాలుకూడా పె`ట్టాను.
అగ్ని దొంగగాడిదె కొడకా! నువ్వే వాణ్ణి యింట్లోపెట్టా`వు. రవంత ఆచోకీ తెలిసిందికాదు. దొంగవెధవని చంపేసిపోదును. గాడిదెకొడుకును అమాంతంగా పాతిపెట్టేదును.
రామ (దగ్గిరకువచ్చి) అయ్యవారు మహా దొడ్డవాడని చెప్పారే? యేమి యెత్తుకు పోయినాడేమిటండి?
అగ్ని యేవిఁ యెత్తుకుపోయినాడా? నీశ్రాద్ధం యెత్తుకుపోయినాడు. పకీరుముండని యెత్తుకు పోయినాడు. యీ గాడిద`కొడుకు యింగిలీషు చదువు కొంపముంచింది.
(వెంకటేశం జుత్తుపట్టుకుని కొట్టబోవుచుండగా తెరదించవలెను.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)