నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౩-వ స్థలము. విశాఖపట్టణములో మధురవాణి బస యెదటివీధి.
(రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు, ప్రవేశింతురు.)
అగ్నిహో మనం పోలిశెట్టిదగ్గిర బదుల్తెచ్చిన రూపాయిలన్నీ అయిపోయినాయి; యప్పటికీ ఖర్చులు ఖర్చులే అంచారు; నాదగ్గిర వకదమ్మిడీలేదు.
రామప్ప ఖర్చుకానిదీ కార్యాలవుతాయిటయ్యా? మీకడియం యెక్కడైనా తాకట్టుపెట్టండి.
అగ్నిహో యీవూళ్లో మనం యెరిగినవాళ్లెవరున్నారు?
రామప్ప రండి మధురవాణిదగ్గిర తాకట్టుపెడదాం.
అగ్నిహో చేసేవి మాఘస్నానాలూ, దూరేవి దొమ్మరి కొంపలూ అని, జటాంత స్వాధ్యాయిని నన్ను ముండలిళ్లకి తీసుకువెళతావషయ్యా?
రామప్ప మరి యేకొంపలూ తిరక్కపోతే కేసులు గెలవడం యలాగ? అది అందరు ముండల్లాంటిదీ అనుకున్నారా యేమిటి? సంసారివంటిది. ఐనా మీకు రావడం ఇష్టంలేకపోతే నాచేతికివ్వండి, నేనే తాకట్టుపెట్టి సొమ్ము తీసుకొస్తాను.
అగ్నిహో అలాక్కాదు; నేనుకూడావస్తాను.
రామప్ప యేదీ కడియం ఇలాగివ్వండి.
అగ్నిహో యిది మాతాతగార్నాటిది. యిది యివ్వడమంటే నాకేమీ యిష్టం లేకుండావుంది. డబ్బు వూరికే ఖర్చు పెట్టించేస్తున్నారు; మీరు కుదిర్చినవకీలు తగినవాడుకాడష; యింగ్లీషూరాదు యేమీలేదూ.
రామప్ప ఆయన్లాంటిచెయ్యి యీ జిల్లాలో లేదు. ఆయన్నిచూస్తే డిప్టీకలక్టరుగారికిప్రాణం. ఇంతకీ మీరేదోపట్టుదల మనుషులనుకున్నానుగాని, మొదటున్న వుత్సాహమ్మీకు యిప్పుడులేదు. మీకు డబ్బు ఖర్చుపెట్టడం యిష్టంలేకపోతే మానేపాయెను. "యావత్తైలం, తావద్వ్యాఖ్యానం" అన్నాడు. మరి నాకు శలవిప్పించెయ్యండి.
అగ్నిహో (ఆలోచించి) అయితే తాకట్టుపెట్టండి. (అని నిమ్మళముగా కడియము తీసియిచ్చును.)
రామప్ప (తనచేత నెక్కించుచు) యీకేసుల్లో యిలాగు శ్రమపడుతున్నానుకదా? నాకొకదమ్మిడీ అయినా యిచ్చారుకారుగదా?
అగ్నిహో అయితే, నాకడియం వుడాయిస్తావాయేమిషి?
రామప్ప నేను మీకు యెలాంటి వకీల్ని కుదిర్చాను! ఆయన మీవిషయమై యంత శ్రమపడుతున్నాడు! ఇదుగో ఆయనవస్తున్నాడు.
(నాయడు ప్రవేశించును.)
రామప్ప (తనలో) యేమిటిచెప్మా వీడు మధురవాణి బసపెరటి దిడ్డీవేపునుంచి వస్తున్నాడు? వీడుకూడా మధురవాణిని మరిగాడాయేమిటి? వీణ్ణి యీ కేసులోనుంచి తప్పించెయ్యాలి.
నాయడు యేమండీ రామప్పంతులన్నా, మిగతాఫీజు యిప్పించారుకారుగదా?
అగ్నిహో మీరు రాసిన డిఫెన్సు బాగుందికాదని భుక్తగారన్నారష.
నాయడు ఎవడా అన్నవాడు? గుడ్లు పీకించేస్తాను. రామప్పంతులన్నగారూ చూశారండీ - డిఫెన్సు యెంతజాగ్రతగా తయార్‌ చేశానో. నాదగ్గిర హైకోర్టుక్కూడా ప్లయింట్లు రాసుకువెళ్లిపోతారు. యీకుళ్లు కేసనగా యేపాటి? నేచెప్పినట్టల్లా పార్టీనడిస్తే నేపట్టినకేసు పోవడమన్నమాట యెన్నడూలేదు. యీ డిఫెన్సు చిత్తగించండి. (చంకలోని రుమాల్‌ కట్టతీసివిప్పి అందులో ఒకకాగితముతీసి చదువును) "ఫిర్యాదీచెప్పిన సంగతులు యావత్తూ అబద్ధంకాని యెంతమాత్రం నిజంకావు." చూశారూ ఆవక్కమాటతోటే ఫిర్యాదీవాదం అంతా పడిపోతుంది. "ఫిర్యాదీ నామీదగిట్టక దురుద్దేశంతో కూహకంచేసి కేసు తెచ్చినాడుకాని యిందులో యెంతమాత్రం నిజంలేదు."
రామప్ప డిఫెన్సు మాటకేమండిగాని అవధాన్లుగారు పైసాలేదంటున్నారు.
నాయడు పైసాలేకపోతే పనెలాజరుగుతుంది?
రామప్ప ఒకసంగతి మనవిచేస్తాను యిలా రండి. (రామప్పంతులు, నాయుడు, వేరుగా మాటలాడుదురు.)
రామప్ప నాయుడుగారూ మీవకాల్తీ యీయనకేమీ సమాధానంలేదు. నేయెంత చెప్పినా వినక భీమారావుపంతులుగారికి వకాల్తీయిచ్చాడు. మీకు యింగ్లీష్‌ రాదనీ, లా రాదనీ, యెవడో దుర్బోధచేశాడు.
నాయడు స్మాలెట్‌ దొరగార్ని మెప్పించిన ముండాకొడుకుని నాకు లా రాకపోతే యీగుంటవెధవలకుటోయ్‌ లావస్తుంది. పాస్‌పీసని రెండు యింగ్లీషుముక్కలు మాట్లాడడంతోటేసరా` యేమిటి? అందులో మన డిప్టీకలక్టరుగారికి యింగ్లీషు వకీలంటేకోపం. అందులో బ్రాహ్మడంటే మరీని. ఆమాట ఆలందరికి బోధపర్చండి.
రామప్ప మరి కార్యంలేదండి. నేయెంతో దూరంచెప్పా`ను; తిక్కముండాకొడుకు విన్నాడుకాడు.
నాయడు అయితే నన్నిలాగు అమర్యాదచేస్తారూ? యీ బ్రాహ్మడియోగ్యత యిప్పుడే కలక్టరుగారి బసకువెళ్లి మనవిచేస్తాను.
(తెరదించవలెను.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)