నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౭-వ స్థలము. సౌజన్యారావు పంతులుగారియింట్లో కచేరీగది.
(సౌజన్యారావు పంతులుగారు, అగ్నిహోత్రావధాన్లు ప్రవేశింతురు.)
సౌజన్యా ఇక మిమ్ములను జయించినవాడులేడు. పిల్లల్ని అమ్ముకోవడం శిష్టాచారం అంటారండీ?
అగ్ని అహా. మా మేనత్తల్ని అందరినీ కూడా అమ్మా`రండి. వాళ్లంతా పునిస్త్రీ చావే చచ్చారు. మాతండ్రి మేనత్తల్నికూడా అమ్మడవేఁ జరిగిందష. యిప్పుడు యీ వెధవ యింగీలీషు చదువునుంచి ఆ పకీరువెధవ దాన్ని లేవదీసుకుపోయినాడుగాని, వైధవ్యం అనుభవించినవాళ్లంతా పూర్వకాలంలో యెంతప్రతిష్ఠగా బతికా`రు కారు?
సౌజ పసిపిల్లల్ని కాలంగడిచినవాళ్లకి పెళ్లిచేస్తే వైధవ్యంరాక తప్పుతుందా? నింపాదిచేసి కొంచం యోచించండీ.
అగ్ని ప్రాలుబ్ధం చాలకపోతే ప్రతివాళ్లకీ వస్తుందండి - చిన్నవాళ్లకిచ్చినా, పెద్దవాళ్లకిచ్చినా, రాసినరాత యెవడైనా తప్పించగలడా?
సౌజ మీరు చదువుకున్నవారుగదా, ప్రారబ్ధమని పురుషప్రయత్నం యే వ్యవహారంలో మానేశారు? కేసు, "విధికృతం; యలావుంటే అలా అవుతుందని" వకీల్ని పెట్టడం మానేశారా? కన్యలని అమ్ముకోవడం శాస్త్రదూష్యంకాదా? డబ్బుకిలోభించి పిల్లల్ని ముసలివాళ్లకి కట్టబెట్టి విధికృతం అనడం న్యాయవేఁనా? శలవియ్యండి.
అగ్ని యిప్పుడు మీ లౌక్యుల్లో వెయ్యేసి, రెండేసివేలు, వరకట్నాలు పుచ్చుకుంచున్నారుకారండీ? గిరీశంగారు చెప్పినట్లు - వాడిపిండం పిల్లులికిపెట్టా! - మీలో ఆడపిల్లలికి యిన్నితులాలు బంగారం పెట్టాలి యిన్నితులాలు వెండిబెట్టాలి అని నిర్నయించుకోవడంలేదా? అదిమాత్రం కాదేం కన్యాశుల్కం?
సౌజ అలాచెయ్యడం నేను మంచిదన్నానా యేమిటండి? "గిరీశంగారు చెప్పినట్టు" అని అన్నారేవిఁటి?
అగ్ని ఆ వెధవపేరు నాయదట చెప్పకండి.
సౌజ కానీండిగాని - మీ రెండోపిల్లకి తగినవరుణ్ణిచూసి పెళ్లిచెయ్యండి. యేం సుఖపడుతుందని ముసలివాళ్లకి యివ్వడం? శలవియ్యండీ.
అగ్ని అదంతా మీకెందుకయ్యా? ఓహో యిందుకా నన్ను పిలిపించారు? మీగృహకృత్యాల వూసుకి నేవొచ్చానా యేవిఁటి? నాగృహకృత్యాల వూసు మీకెందుకూ?
సౌజ తొందరపడకండి అవుధాన్లుగారూ. దూరం ఆలోచించండి - మీకడుపున బుట్టిన పిల్లయొక్క సౌఖ్యం ఆలోచించి సలహాచెప్పానుగాని, నా స్వలాభం ఆలోచించి చెప్పలేదుగదా - పెద్దపిల్లకి సంభవించిన అవస్థ మీకళ్లతో చూడనేచూశారు. యికనైనా వృద్ధులకు పిల్లని కట్టబెట్టడపు ప్రయత్నము చాలించండి.
అగ్ని నా పిల్లభారం అంతా మీదైనట్టు మాట్లాడుతున్నారేమిటి? ఆసంత మీకెందుకూ?
సౌజ నన్ను తమస్నేహవర్గంలో చేర్చుకోండి - పరాయివాణ్ణిగా భావించకండి - దయచేసి నాసలహావినండి - మర్యాదగలయింట పుట్టిన బుద్ధిమంతుడగు కుఱ్ఱవాణ్ణి చూసి మీ చిన్నపిల్లని పెళ్లిచెయ్యండి. యిక పెద్దపిల్లమాట - ఆమెకు వితంతువుల మఠంలో, సంఘసంస్కారసభవారు విద్యాబుద్ధులు చెప్పించుతారు. మీకడుపున పుట్టినందుకు యెక్కడనయినా ఆమె సుఖంగావుండడంగదా తండ్రైనవారు కోరవలసినది. ఆమె తాలూకు కొంతఆస్తి తమవద్దవున్నది. మా స్నేహితులున్నూ, స్త్రీ పునర్వివాహసభ కార్యాధ్యక్షులున్నూ అయిన రామయ్యపంతులుగారు నాపేరవ్రాసినారు. ఆ ఆస్తి, చిక్కులుపెట్టక, తాము ఆపిల్లకి పంపించి వెయ్యడం మంచిది.
అగ్ని యేవిఁటీ ముండా యేడుపుసంత! వాడెవడు? వీడెవడు? మీరెవరు? అదెవర్త`? నాపిల్లేవిఁటి, పకీరుముండ! రేపు యింటికి వెళుతూనే ఘటాశ్రాద్ధం పెట్టేస్తాను.
సౌజ యిప్పటి ఆగ్రహంమీద మీరు అలా శలవిచ్చినా, నిడివిమీద మీకే కనికరం పుడుతుంది. యిప్పట్లోనే మీరు కనికరిస్తే కొంత మీకు నేను ఉపకారం చెయ్యగలను.
అగ్ని కనికరం గాకేం. కడుపులో యేడుస్తున్నానుకానూ? ఆస్తీగీస్తీ యిమ్మంటేమాత్రం యిచ్చేవాణ్ణికాను. ఆవెధవని పెళ్లిచేసుకోకుండా యిల్లుజేరితే, యింట్లో బెట్టుకుంటాను. అంతే.
సౌజ అది మరిజరగదు.
అగ్ని యిది అంతకన్న జరగదు.
సౌజ ఆమె ఆస్తి మీరు యిచ్చివెయ్యకపోతే దావాపడుతుంది. నిష్కారణం ఖర్చులు తగులుతవి.
అగ్ని నేను అగ్రహారపుచెయ్యిని - దావాగీవా అని బెదిరించితే భయపడేవాణ్ణి కాను.
సౌజ నామాటవిని ఆస్తియిచ్చివేసి, గిరీశంగారిమీద గ్రంధంచెయ్యడపు ప్రయత్నము మానుకుంటే, లుబ్ధావధాన్లుగారు మీమీద తెచ్చినకేసు తీయించివేస్తాను - మీ పిల్లమీద దయాదాక్షిణ్యాలు లేకపోతే, స్వలాభవైఁనా ఆలోచించుకోండి.
అగ్ని వెధవముండని లేవదీసుకుపోయిన పకీరువెధవపక్షం మాట్లాడుతావు; యేవిఁపెద్దమనిషివయ్యా? నేనా కేసు వొదులుకుంఛాను? ఆవెధవగానీ కంటికి కనపడితే, కూనీచేస్తాను. పెద్దప్లీడరు ప్రత్యుద్ధానంచేసి పిలిచాడంటే, కేసుల్లో యేవిఁసలహా చెబుతాడో అని భ్రమపడ్డాను. వెధవముండలకి పెళ్లిచెయ్యడపు పోయీ కాలంపట్టుకుందేవిఁ, పెద్దపెద్దవాళ్లకి కూడాను?
సౌజ లుబ్ధావధాన్లుగారి తరఫున మీమీద గ్రంధం నేనే నడిపించవలసివుంటుంది. మీకు వృధాగా డబ్బుతట్టుబడీ, సిక్షా, క్షూణతాకూడా సంభవిస్తాయిగదా అని యింతదూరం చెప్పా`ను. మంచికి మీరు మనుషులైనట్టు కనపడదు. గనక నా చాయశక్తులా పనిచేసి మీకు గట్టి సిక్ష అయేటట్టు గ్రంధంనడిపిస్తాను. పిల్లదాని ఆస్తి విషయమయి దావాకూడా నేనే పడేస్తాను.
అగ్ని నీయింట కోడికాల్చా!
సౌజ మీరు యేమన్నా, నాకు కోపంలేదు. యింటికివెళ్లి ఆలోచించుకొని, నా సహాయం కావలసివుంటే తిరిగీరండి.
అగ్నిహోత్రావధాన్లు (నిష్క్రమించుతూ తనలో) వీడికి వెఱ్ఱిగాబోలు!
(తెరదించవలెను.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)