నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
కన్యాశుల్కము - సప్తమాంకము.
౧-వ స్థలము. విశాఖపట్ణంలో వీధి.
(బైరాగీ, వెనుక పదిమంది శూద్రులూ ప్రవేశింతురు.)
రామన్న యెక్కణ్ణించి యిజయం సేస్తున్నారు గురూ?
బైరాగి కాశీనుంచిరా.
రామ యెన్నాళ్లైంది గురూ?
బైరాగి ప్రాతఃకాలం గంగసేవించి బయల్దేరామురా.
రామ యింత యేగిరం యెలాగొచ్చినారు గురూ?
బైరాగి పవనంబంధించి, వాయువేగం మీదవచ్చామురా.
బుచ్చన్న యోగులికి సిద్దులుండవురా? యీయనేంరా, ఉప్పాకలోనూ సింవాచలంలోనూ మొన్న సివరాత్రికి వొక్కమారే అగుపడ్డారు.
లక్ష్మన్న తెల్లోడు తీగిటపా యేసినాడు కాడ్రా? నిమేటికి వుత్తరం దేశదేశాలికి యెల్లదా?
బైరాగి పామరులు! పామరులు!
రామ వూరుకొస్సి - నీకేటెరిక - యెఱ్ఱినాకొడక.
బైరాగి యీవూళ్లో తీర్థపురాళ్లరేవున రెండుమైళ్లులోసబురున ధర్మరాజువారు ప్రతిష్ఠచేసిన శివాలయం, కంచుదేవాలయం ఒకటి వున్నది. రాత్రి ఆదేవుణ్ణి శేవించుకుని, రేపు రామేశ్వరం వెళ్లిపోతాం. సదావృత్తి యక్కడ దొరుకుతుంది?
రామ యీ ఊళ్లో మఠంలేదు గురూ. మేవంతుండగ తమకిలోపవేఁటి గురూ? కాశీ కబుర్లేటి గురూ?
బైరాగి నాలుగురోజులు కిందట విశ్వేశ్వరుడి కోవిలలో ఒక బంగారపు రేకు ఆకాశంమీంచి పడ్డది. దానిమీద వ్రాసినలిపి బ్రాహ్మలికి యవరికీ బోధ అయిందికాదు. మేం చిత్తగించాం. సిద్ధులభాషని దానిమీద బంగారంచేసే యోగం వకటి కలకాలంబతికే యోగం వకటి వ్రాసివున్నాయి.
రామ యేవాఁచ్చఱ్ఱెం! గురూ భోజినం యేటారగిస్తారు?
బైరాగి పాలూ, పంచదారా, అరిటిఫలములూ, యీప్రకారం ఒకపక్షం ఫలహారం చేస్తాము. మరి పదిహేనురోజులు వాయుభక్షణ చేస్తాము.
రామ ఒక్క మిట్టకాయలో పలారం జాగర్త చేస్తాం గురూ. మా రాంమందిరానికి దయసెయ్యాలి.
బైరాగి పద - యీవూరి వింతలేవిఁటి?
లక్ష్మన్న యేటీలేవ్‌ - రావఁశంద్రపురం అగ్ఘురోరంలో ముసలిబాపనోడు ఆల్నిసంపేసినాట్ట. ఆడికీ దొంగసాచ్చీకం పలికినోళ్లకీ తాసీలుగోరికీ సిచ్చైపోతాదిట.
బైరాగి యీవూరు పాపంతో నిండి వున్నట్టు కనపడుతూంది. యీ వూళ్లో మేము నిలవము.
రామ లచ్చువుఁడు వెఱ్ఱోడు గురూ. ఆడిమాట నమ్మకండి. మీరెళ్లిపోతే మాలాటోళ్లు తరించడం యలాగ్గురూ? ఆళ్లీవూరోళ్లుకారు.
బుచ్చన్న ఆవూరి దుకాణదారుగారు అదుగో వొస్తున్నారు.
బైరాగి యీవూళ్లో తాగడం లావుగావున్నట్టు కనపడుతుంది. మేము తాగుబోతులతో మాట్లాడం - ఆదుకాణదారు వచ్చేలోగా యీ సందులోకి మళ్లిపోదాం; రండి.
(దుకాణదారు పరుగునవచ్చి కలిసి బైరాగిమొలలో చెయివేసి పట్టుకొనును.)
దుకా రూపాయలుకక్కి మరీ కదలాలి!
బైరాగి యేమిటీవాళకం! వీడు తప్పతాగి పేలుతున్నాడు - నేను మొదటే చెప్పలేదా యీవూరి సంగతి? అంతా పాపంతో నిండివుంది! వేమన్న యేమన్నాడు. "తాగుబోతుతోడ! తగదెందునేస్తంబు"
రామ (దుకాణదారుతో) భాయీ! మీకేటి, మతోయిందా? గురువుగోరికి దణ్ణవెఁట్టి లెంపలోయించుకొండి.
దుకా గురువూలేదు, గుట్రాలేదు వూరుకోస్సి - యీడెక్కడ గురువు? నాదుకాణంలో సారా అంతా చెడతాగి డబ్బియ్యకుండా యెగేసినాడు.
రామ మీకు మతోయిందా భాయి? ఆరేటి మీదుకాణంలో తాగడవేఁటి. కాశీనించి యిప్పుడే ఒచ్చినారుగదా?
దుకా ఆకాశం బొక్కచేసుకుని వొచ్చాడుకాడూ? (బైరాగితో) డబ్బిచ్చి మరీ కదులు.
బైరాగి మావంటి సాధులతో నీకు వాదెందుకు అబ్బీ? యవర్నిచూసి మేవఁనుకున్నావో! మమ్మల్ని పోలిన దాసరివాడొకడు, బైరాగి వేషంవేసుకుని యీ దేశంలో తిరుగుతున్నాడు. కిందటిమాటు మేం దేశసంచారం చేసినప్పుడు చూసి చివాట్లుపెట్టాం`. నీకు డబ్బుమీద అంత కాపీనంవుంటే తులం రాగి తెచ్చుకో బంగారం చేసియిస్తాం. సంగోరు ధర్మఖర్చుచేసి సంగోరుతిను. లేకుంటే తల పగిలిపోతుంది.
రామ యేం యెఱ్ఱిముండాపని చేసినారు భాయీ! బంగారం చేసేసిద్దులికి డబ్బులచ్చంటోయి? ఆరికాళ్లమీదపడి అలకతీరుసుకొండి.
దుకా వుండోస్సి - యేడిసినట్టేవుంది. నీ సొమ్మేం పోయింది?
(హెడ్‌కనిష్టీబు ప్రవేశించును.)
హెడ్‌ యేమండోయి గురోజీ! మీరు దొరకడం నాకు దేవుఁడు దొరికినట్టుంది. ఇక బతికా`ను. మీతో కొన్ని జరూరు సంగతులు మాట్లాడాలి, రండి.
బైరాగి భాయీ - మీరు వెనక్కుండండి. (దుకాణదారు తప్ప తక్కినవారు దూరముగా వెళ్లుదురు.)
దుకా నాడబ్బిచ్చి మరీ మాట్లాడండి.
బైరాగి నలుగురిలోనూ మర్యాదతియ్యడం ధర్మవేఁనా తమ్ముడా? యోగరహస్యాలు పామరుల దగ్గిరా వెల్లడిచెయ్యడం?
దుకా డబ్బు యెగెయ్డపుయోగం నాదగ్గిరపారదు. రహస్యవేఁటి? ఆవిద్యకి అంతా గురువులే!
బైరాగి వెఱ్ఱినరుడా! బైరాగివాళ్లకి మాకు డబ్బుమీద తనువుంటుందటోయి? ఒకళ్లకి యిచ్చేదీకానం - పుచ్చుకున్నదీకానం.
హెడ్డు భాయీ! నీరూపాయలు నేనిస్తాను. తెలివిమాలిన మాటలాడకు. గురువుగారికి కళ్లుమొయ్యా ఆగ్రహవొఁస్తే మనం మండిపోతాం. మీరటుండా, వెళ్లండి. (బైరాగితో) గురోజీ! కూనీకేసు పీకలమీదికొచ్చింది. కేసూ, యేబుగ్గీ లేనిదే, ఆరాత్రి నాలుగురాళ్లు తడువుఁకుందావఁని మనం ఆ ముసలాణ్ణి అల్లరి పెట్టా`వాఁ? ఆతరవాత, తాసిల్దారొచ్చి "హాత్‌ హూత్‌" అని బెదిరించి పదిరాళ్లు లాగా`డు. తన తాలూకుకంటె పెగిలిందికాదని రావఁప్పంతులుగాడు, యినస్పెక్టరికీ, పోలీసు సూపరెంటుకీ అర్జీలుకొట్టా`డు. నిజంగా కూనీకేసు జరిగి వుండగా, మేవుఁ కామాపు చేశావఁని తాసిల్దారుమీదా, నామీదా యిప్పుడు పితూరీ చేస్తున్నారు.
బైరాగి మేవుఁండగా మీకేం భయం, భాయి?
హెడ్డు అందునేగదా, నాపాలిటి దేవుఁళ్లా మీరు దొరికారన్నాను.
బైరాగి మీశత్రువులకు వాగ్బంధం చేస్తాను. వాళ్లపేర్లు వ్రాసియివ్వండి. యినస్పెక్టరుకి మీమీద యిష్టవఁని చెప్పేవారే?
హెడ్డు యీపెద్ద వుద్యోగస్థులకి దయలూ దాక్షిణ్యాలూ యేవిఁటి గురూ? వాళ్లకి యంత మేపినా, వాళ్లకి కా`రక్టు వొస్తుందనిగాని, ప్రమోషను వొస్తుందనిగాని, ఆశపుట్టినప్పుడు, తెగనికత్తితో పీకలు తెగగోస్తారు. మా యినస్పెక్టరికి సూపరేంటుపని కావాలని ఆశుంది. తాసీల్దారికీ వాడికి బలవద్విరోధం వుంది. ఆవిరోధం మధ్య నన్ను కొట్టేస్తూంది.
బైరాగి చూస్తూవుండండి రేపటినుంచి పతకం తిరిగిపోతుంది.
హెడ్డు మీదయ, గురూ - సౌజన్యారావు పంతులుగారని ఓ గొప్పవకీలుగారున్నారు. ఆయన నాకు చాలాసాయం చేస్తున్నారు. కేసు తేలిపోయేసాధనం ఆయన వొకటి చెప్పారుగాని, అది కుదరక తల్లడిల్లుతున్నాం.
బైరాగి యెమిటండి, ఆసాధనం?
హెడ్డు పరారీ అయిపోయిన ఆపిల్లదాన్ని తండ్రి గుంటూరు శాస్తుల్లని ఒకడు వున్నాడు. అతగాడు దొరికితే, కేసు పోతుంది. వాడు యక్కడా కనపడ్డు.
బైరాగి యిదెంతపని, రాత్రి అంజనంవేసి ఒక్కక్షణంలో కనుక్కుంటాను.
హెడ్డు అలారక్షించు గురూ. ఆ కుఱ్ఱాడు - అనగా ఆచిన్నది - యిప్పుడు యెక్కడుందో కనుక్కోగలరూ, గురూ?
బైరాగి అదీ అంజనంలోనే కనపడుతుంది.
హెడ్డు అది మొగాడయినా, ఆడదయినా కూడా కనపడుతుందా గురూ?
బైరాగి ఆడది మొగాడెలా అవుతుంది భాయీ?
హెడ్డు (తనలో) చెబితే యేం ప్ర`మాదవో? (పైకి) యీ చిక్కుల్నించి మతిపోతూంది గురూ. దయచేండి, యింటికెళదాం.
బైరాగి యీశిష్యులకి కొంచం జ్ఞానోపదేశం చేసి మరీవస్తాను. మీరు ముందు నడవండి.
హెడ్డు యీకార్యం అయిందాకా మీపాదాలు వొదలను - కార్యవైఁతే తమరు హరిద్వారంలో కట్టిస్తూన్న మఠానికి నూటపదహార్లు దాఖలుచేస్తాను.
(అందరూ నిష్క్రమింతురు.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)