నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౨-వ స్థలము. డెప్యూటీకలెక్టర్‌ కచేరీ.
(డిప్టీకలక్టరు, వకీళ్లు, బంట్రౌతులు, మొదలైనవారు ప్రవేశింతురు.)
భీమారావు నాకు మునసబుకోర్టులో కేసున్నది, వొక అర్జీ దాఖలుచేసి శలవు పుచ్చుకుంటాను.
కలెక్టర్‌ కోర్టువారికి అవకాశం అయేవరకూ వుండలేని వకీళ్లు కేసు యెందుకు దాఖలుచేయవలె? ఇది చెప్పినట్టల్లావచ్చే కోర్టనా మీయభిప్రాయం.
భీమా చిత్తం, చిత్తం, తమ ప్రిడిశెసర్లు అలాగు గడుపుతూవచ్చేవారు.
కలె ఆఫీస్‌పనిచూసుకుని పిల్చేవరకూ ఉండండి.
అగ్నిహో (రామప్పంతులుతో) యేమండోయ్‌ మన కొత్తవకీల్ని కోప్పడుతున్నారే?
రామప్ప (అగ్నిహోత్రావధానులుతో) యీ అధికార్లనైజం యేమిటంటే యెవళ్లమీద దయవుండి యెవళ్లపక్షం కేస్‌చెయ్యాలంటే వాళ్లని కరవ్వొచ్చినట్టు కనపడతారు. మీరు కోరట్లసంగతంతా తెలుసునంటారే? యిదేనా మీఅనుభవం?
అగ్నిహో (గట్టిగా) అవునవున్నాకు తెలుసును.
కలె యెవరా మాట్లాడుతున్నమనిషి?
నాయడు (లేచి) తక్‌షీర్‌ మాఫ్‌చేస్తే మనవిచేస్తాను. యీయన కృష్ణారాయపురం అగ్రహారంకాపురస్తుడు, నులక అగ్నిహోత్రావధాన్లుగారు; మహా (అ)యోగ్యమైన బ్రాహ్మడు, జటాంతస్వాధ్యాయి, యీయనే లుబ్ధావధాన్లుగారికి తన కొమార్తెను పద్ధెనిమిదివందల రూపాయిలకు కన్యాదానం చేయడానికి బేరమాడుకుని, కాబోయే అల్లుడికి దేహశుద్ధిచేశారు; అందుకే యీమధ్య లుబ్ధావధాన్లుగారు యేలినవారి కోర్టులో ఛార్జీ దాఖలుచేశారు. అందులో ముద్దాయీ యీ మహానుభావుడే! మల్లవరంలో సహస్రమాసజీవైన వక బ్రాహ్మణశ్రేష్టుడుంటే, ఆయనకు తన పెద్దకుమార్తెను కన్యాదానంచేసి, రెండుపిల్లికూనలు స్వీకరించేటప్పటికి పెళ్లిలోనే ఆ బ్రాహ్మడిపుణ్యం అంతామూడి పరంపదం వీంచేశాడు. ఆపిల్లదాని తరఫున భూములకొరకు దావాతెచ్చారు. వీరు తమవంటి గవర్నమెంట్‌ ఆఫీసర్లకి తరుచుగా పనిగలుగచేసి ప్లీడర్లని పోషిస్తూవుంటారు, వీరి యోగ్యత లేమి, వీరి దయాంతఃకరణ లేమి, వీరి సరసత లేమి, మరియెన్నడమునకు శేషుడికైనా అలవికాదు. వారితరఫున కేసు దాఖలుచెయ్యడంకోసమే భీమారావు పంతులుగారు కోర్టుకు దయచేశారు. (విరసముగా నవ్వి కూరుచొనును.)
కలె బలే శాబాష్‌ (గుమాస్తాతో) ఏదీ భీమారావు పంతులుగార్ని ప్రియాదు అర్జీ దాఖలుచేయమను. (గుమాస్తా పుచ్చుకొని దాఖలుచేయును.)
కలె (కాగితమందుకొని) యేమిటయ్యా కేసుస్వభావం?
భీమా చిత్తం, యీయన వెధవకొమార్తెని, యీయన కొమారుడికి చదువుచెప్పే గిరీశం అనేఆయన అలంకారాలూ, ఆస్తితోకూడా లేవతీసుకు వెళ్లిపోయినాడు.
అగ్నిహో దస్తావేజులూ, కోర్టుకాయితాలూ కూడానండి.
కలె యేమిటి! ఆ, హా, హా, హా, హా, (నవ్వుచు బూట్సునేలపైతట్టును) బలే శాబాష్‌ (అర్జీచూచుకొని) యిన్నాళ్లేమి చేస్తున్నారు?
భీమా తహస్సీల్దార్‌గారిదగ్గిర నేరంజరిగిన మూడోరోజునే మున్సబుకోర్టు వకీలు వెంకట్రావుపంతులుగారు, ఛార్జీ దాఖలుచేస్తే ఆ తహస్సీల్‌దారుగారు కేస్‌ స్వభావం యేమిటని అడిగినారు. ఎబ్‌డక్‌షన్‌ అని వెంకట్రావు పంతులుగారు చెప్పేసరికి యింగ్లీషు రాకపోవడంచాత, తహస్సీల్దారుగారు ఆమాటయెప్పుడూ విన్లేదనిచెప్పారు. తరవాత కేస్‌ స్వభావం తెలుగునచెప్తే యీలాటినేరం మా జూరిస్‌ డిక్‌షన్‌లో జరగదు, తోవలో రోడ్డుమీద యేతాలూకా సరిహద్దులో యెత్తుకుపోయినాడో అని అర్జీ దాఖలుచేసుకున్నారుకారు. లుబ్దావదాన్లుగారి కూనీకేసు కామాప్‌చేసిన తహస్సీల్దారుగారే యీయనండి.
నాయుడు ఇంగ్లీష్‌రాకపోతేనేమండి? తహస్సీల్దారుగారు యెంతప్రాజ్ఞులు. పూర్వపు యూరోపియ\న్‌ అధికార్లని యెంతమందిని మెప్పించారు! ఆయన లుబ్ధావధాన్లుగారి కేసు కామాప్‌చేశారని భీమారావు పంతులుగారు అంటున్నారు. యింకా యిన్క్వైరీ అవుతూవున్న కేసులో అలా అన్నందుకు యీయనపైని తహస్సీల్దారుగారు పరువునష్టం ఛార్జీతేవడమునకు వీలువున్నది.
కలె (భీమారావువైపు జూచి) పిల్లకు పదహారు సంవత్సరములకు లోపుయీడని రుజువున్నదా?
భీమా జాతకంవుందండి.
నాయుడు కోర్టువారు ఆజాతకం దాఖలుచేసుకోవాలి.
భీమా యీకేసులో ఆయన మాట్లాడుతూవుంటే నే ఎంతమాత్రం వొప్పేదిలేదు.
నాయుడు యీకేసులో నాక్కూడా వకాల్తినామా వుందండి (అని దాఖలు చేయును.)
భీమా (అగ్నిహోత్రావధాన్లుగారితో) ఏమయ్యా యీయనక్కూడా వకాల్తీ యిచ్చావయ్యా.
అగ్నిహో మొదటా, రామప్పంతులు యీయన కిప్పించారు.
భీమా (అగ్నిహోత్రావధాన్లుగారితో) అయితే యేడువు.
(అగ్నిహోత్రావధాన్లు తెల్లపోయిచూచును.)
కలె యేదీ జాతకం దాఖలుచెయ్యండీ.
(భీమారావుపంతులు దాఖలు చేయును.)
నాయుడు కోర్టువారితో వకసంగతి మనవిచేసుకుంటాను. యీ జాతకం విశ్వామిత్రుడంత యోగ్యుడైన బ్రాహ్మడిచేత తయారుచెయ్యబడ్డది. అదుగో ఆమూల నిలబడ్డ రామప్పంతులుగారికి యీ జాతకంలో మంచిప్రవేశం వుందండి.
భీమా నేను పేస్‌డ్‌ వకీల్ని. కేసు హీరింగు నేనే చేయవలెనుగాని, నాయుడుగారు చేస్తే నేనెంతమాత్రం వొప్పేదిలేదు.
నాయ స్మాలెట్‌దొరగారి దగ్గిర్నుంచీ యేజన్సీ కోర్టులో వకాల్తీ చేస్తున్నాను. డబ్బుచ్చుకున్నందుకు నాపార్టీ తరఫున నాలుగుమాటలుచెప్పి తీరుతానుగాని యింగ్లీష్‌ చదువుకున్న కొందరువకీళ్లలాగ నోటంట మాట్రాకుండా కొయ్యలాగ నిలబడనండి.
కలె (అగ్నిహోత్రావధానుల వైపుజూచి) మీ కొమార్తె, యేసంవత్సరమందు పుట్టిందయ్యా?
అగ్ని ఆంగీరస.
కలె జాతకంలో భావవుందే? బ్రాహ్మణ్యం పరువంతా తీసేస్తిరే. గడ్డితిని పిల్లనమ్ముకున్నావు సరే కాని, యీలాటి ఫోర్జరీలుకూడా చేయిస్తావూ? బ్రాహ్మల్లో వున్నంత ఖంగాళీ, మాలకూడూ మరెక్కడాలేదు. నీదుర్మార్గతవల్ల నీకుమార్తెను యీ అవస్థలోకితెచ్చి మళ్లీ ఎబ్‌డక్‌షన్‌ కేసుకూడానా? నీపొట్ట కరిగించేస్తానుండు. (గుమాస్తాతో) కేసులో నోటీస్‌లు చెయ్యి.
గుమా (ఛార్జీకాగితముజూచి) యిందులో ముద్దాయీ యింటిపేరూ సాకీనూ లేదండి.
నాయ (లేచి) యీ అర్జి వల్లకాట్లో రామనాధాయ వ్యవహారం లాగుంది. ఇంగ్లీషు వకీళ్లు దాఖలుచేసే కాకితాలు యీరీతినే వుంటాయండి.
భీమా (గుమాస్తాతో రహస్యముగా) తరవాయీలు నింపించలేదుటయ్యా? (పైకి) యీలా నాయుడుగారు నన్ను తూలనాడుతూంటే కోర్టువారు ఊరుకోడం న్యాయంకాదు.
కలె నాయుడుగారు మిమ్ము నేమీ అన్లేదే?
భీమా (తనలో) యిక్కడికి నేనురావడం బుద్ధిపారపాటు.
క్లార్క్‌ (భీమారావు పంతులుగారితో) ఇంటిపేరూ, సాకీనూ యేమిటండీ?
భీమా (అగ్నిహోత్రావధాన్లుగారితో) ఏమిటయ్యా?
అగ్నిహో ఆయనపేరు గిరీశం, మరంతకంట నాకుతెలియదు.
కలె చాబాష్‌; బాగావుంది! అవధాన్లుగారి కొమార్తెని యెవడో తీసుకుపోయినాడు. కనక వాడి వూరూపేరూ యెరిగినవాళ్లు తెలియచెయ్యవలసినదని, దండోరాకొట్టించి గేజట్లో వేయించండి. పోలీసువారికి యెందుకు నోటీసివ్వలేదూ! సాకీనూ మొదలైనవి లేనిదే కేసు యడ్‌మిట్‌ చెయడానికి వీలులేదు. టిఫిన్‌కి వేళయింది లేదాము (అనిలేచి వెళ్లిపోవును.)
అగ్నిహో (భీమారావు పంతులుగారితో) ఏమండోయ్‌ కేసు అడ్డంగా తిరిగిందే?
(భీమారావు పంతులుగారు మాట్లాడరు.)
అగిహో యేమండోయి మీతోటి, మాట్లాడుతున్నాను.
భీమా ఇచ్చినఫీజుకు పనైపోయింది; మళ్లీ ఫీజిస్తేనేకాని మాట్లాడేదిలేదు.
అగ్నిహో యేంపనైంది అఘోరంపని? కలక్టరు చివాట్లు పెడతూంటే ముంగిలా మాట్లాడక వూరుకున్నావు!
భీమా బంట్రోత్‌! యితన్ని నాదగ్గిరికి రాకుండా గెంటేయ్‌.
అగ్నిహో ఓహో బాగుంది వ్యవహారం! రామప్పంతులేడీ?
నాయుడు (మెల్లగా వెనుకనుండివచ్చి) పోర్జరీమాటరాగానే సన్నసన్నంగా జారారు. యీపాటికి వారివూరికి సగంతోవలో వుంటారు.
అగ్ని అయ్యో కొంపతీశాడే!
నాయుడు ఇంగ్లీషువకీలు సరదాతీరిందా? పోర్జరీకి తమక్కూడా మఠప్రవేశం అవుతుంది.
అగ్ని అయ్యో నీయింట కోడికాల్చా.
నాయుడు రోజూ కాలుస్తూనేవుంటారు.
(తెరదించవలెను.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)