నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౩-వ స్థలము. సౌజన్యారావు పంతులుగారి కచేరీగది.
(సౌజన్యారావు పంతులుగారూ, పోలిశెట్టి ప్రవేశింతురు.)
సౌజ చూశారా శెట్టిగారూ. యిప్పటి రోజుల్లో దేవ బ్రాహ్మణభక్తి కోమట్లలోనే వున్నది. లుబ్ధావధాన్లుగారు బ్రాహ్మలు, వృద్ధులున్నూ - ఆయనను కాపాడితే మీకు చాలా సుకృతం వుంటుంది.
పోలిశెట్టి బాబు - తమశలవు కబ్బెంతరవేఁటి?
సౌజ చూశారా, మీరు సాక్ష్యంచెప్పి ఆయన్ని యీ ఆపదలోంచి తప్పించకపోతే, నిజం దాచినందువల్ల ఆయనకి యేమి ప్రమాదం వచ్చినా, ఆపాపం మిమ్మల్ని చుట్టుగుంటుంది.
పోలి అబ్బెంతరవేఁటి? బాబూ!
సౌజ నిజంగా కూనీ జరగలేదని మీనమ్మకవేఁకదూ?
పోలి అబ్బెంతరవేఁటి? బాబూ!
సౌజ ఆపిల్ల గోడదాటి పారిపోవడం మీరు చూశారుగదూ?
పోలి అబ్బెంతరవేఁటి బాబూ?
సౌజ మీరు అప్పుడు గుడ్డెమీదికి బాహ్యానికి వెళ్లివున్నారు?
పోలి అబ్బెంతరవేఁటి బాబూ?
సౌజ మీరు బాహ్యానికి వెళ్లినప్పుడు, సహాయానికి మీ నౌఖరునుకూడా తీసుకువెళ్లారు?
పోలి అబ్బెంతరవేఁటి బాబూ?
సౌజ (కలంకాగితంతీసి) యీ సంగతులే వ్రాస్తాను. చెప్పండి.
పోలి యేటి బాబూ?
సౌజ మీరు చెప్పబోయే సాక్ష్యానికి స్టేటుమెంటు కట్టుగుంటాను. జరిగినది అంతా చెప్పండి - వ్రాస్తాను.
పోలి మా యింట్లోళ్లకి ఉడ్డోలవైఁన జబ్బుగావుందని కబురెట్టారు, బాబూ. నాకు సేతులు కాళ్లు ఆడకుండున్నాయి. బండీ కుదుర్చుకొచ్చాను - శలవిప్పించండి - యీ సాచ్చీకాల్లో తిరిగితే పిల్లాపేకా బతుకుతారా బాబూ?
సౌజ యింతసేపూ చెప్పా`రుకారేమి? రుగ్మతనిజమే ఐతే చాలా విచారవైఁన సంగతి - మీకు సాక్ష్యం యెలాగా తప్పదు. చెప్పేమాటలు ముందు వ్రాసుకుంటే మంచిది. లేకుంటే బోనెక్కినతరవాత తత్తరపడిపోతారు. పదినిమిషములు పట్టదు. చెప్పండి వ్రాస్తాను.
పోలి సాచ్చీకం తప్పదు బాబూ?
సౌజ యలా తప్పుతుందీ? నిజంతెలిసినవారు సాక్ష్యం పలకకపోతే మరియవరు పలుకుతారు?
పోలి బాబూ - తమరు పెద్దవొకీళ్లూ, కోవఁటోడి మాటని కొట్టెయక, యింటారా?
సౌజ వినకేమి?
పోలి నిజవేఁటిబాబూ? అబద్దవేఁటి బాబూ? నేను చూసి నిజవాఁ చెప్పినాను? గుడ్డిమీదికేటి నిశిరాత్రేళ నేను బైటకెల్డవేఁటి? జువ్విచెట్టుమీద పిశాచం అమాంతంగా సంపేసిపోదా! బాబూ? యేటిబాబూ సాచ్చీకానికి ముండ పోలిశెట్టి పోలిశెట్టే సెప్పాలా సాచ్చికం బాబూ? తమంటి అధికార్లనిచూస్తే, పాణం యెగిరిపోతుందిగదా? తమరు తలిస్తే సాచ్చీకానిక్కొదవా? బాపనోళ్లు నచ్చాపనచ్చలు. కొంచం సెయితడిజేస్తే సాచ్చీకం చెప్పేసిపోతారు బాబూ -
సౌజ యీపాటి చాలించండి. దొంగసాక్ష్యాలు నాదగ్గిర పనికిరావు. నిజంతెలిసిన సాక్షులే నాకు కావాలి.
పోలి ఆపాటిమాట యెవరు సెప్పినారుకారు బాబూ; నిజం నాకేమీతెల్దు, యేదేవుఁడు నెత్తికొట్టమంటే ఆ దేవుఁడు నెత్తికొడతాను బాబూ.
సౌజ మరి యెరుగుదువఁని యెందుకు చెప్పారూ?
పోలి బాబూ, సెప్పనంటే కనిష్టీబోళ్లు ఊరుకున్నారా?
సౌజ యిప్పుడుమాత్రం వూరుకుంటారా?
పోలి చెప్పితే, యిన్నీసిపికటరు పీకపిసికెయ్డ బాబూ?
సౌజ చెప్పకపోతే హెడ్డుకనిష్టీబు పీకపిసకడా?
పోలి అధికార్లేటి చెయ్మంటే, మాలాటోళ్లు అదల్లా సెయ్యాలిగదా బాబూ - లేకుంటే పీక్కురిగదా? "పోలిశెట్టీ, సాచ్చీకం సెప్పాలి" అని హెడ్డుగారంటే, సిత్తం బాబూ అనాలి; "పోలిసెట్టీ, కబడదారు, సాచ్చీకంచెప్పితే సంపేస్తాను," అని యిన్నీసిపికటరుగారు అంటే, సిత్తం బాబూ అనాలి. "హెడ్డుగారిని బదిలీ చేస్తాం. మరి భయపడకు," అంటే, సిత్తం బాబూ అనాలి. ఆరాత్రి నేనూళ్లోవున్నానా బాబూ? లింగోరం సంతకి పోలేదా?
సౌజ మీసాక్ష్యాన్ని నమ్ముకుని, లుబ్ధావధాన్లుగారికి నేను ధైర్యం చెప్పా`నే?
పోలి గొప్పధికార్లు! తమరు తలిస్తే ఆరికి నోటేటి బాబూ? కోవిఁటాడి మాటకొట్టెయ్కండి బాబూ, తమవంటోరుతలిస్తే, బాపన సాచ్చీకాలు నచ్చాపనచ్చలు.
సౌజ మీయోగ్యత తెలిసింది. చాలు, యీపాటి వెళ్లండి.
పోలి (లేచినిలబడి) కోపవాఁబాబూ? మేం బతగ్గలవాఁ? ఆవునెయ్యి బాబూ గుమగుమలాడేది ప్రతోరం పంపించుకుందునా బాబూ?
సౌజ మీయినస్పెక్టరికి పంపండి.
పోలి (వెళ్లిపోతూ) ఆరంతోరు ఆరూ, తమంతోరు తమరూ. మాకిద్దరొహటిగాదా?
సౌజ చాలును వెళ్లండి, వెళ్లండి.
పోలి తమక్కోపవొఁస్తే, బతగ్గలవాఁ బాబూ. (గుమ్మందాటి) బతిగా`న్రా దేవుఁడా! పెందరకాళె యింటికిపోయి యెంకటేశ్శర్లుకి, అరశటాకునెయ్యి దివ్వెలిగిస్తాను.
(నిష్క్రమించును.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)