నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౪-వ స్థలము. వీధి.
(అగ్నిహోత్రావధాన్లు, నాయడు ప్రవేశింతురు.)
అగ్ని అషైతే కేసు మానుకొమ్మంఛారూ?
నాయడు లేకపోతే మీకు చాలా వుపద్రవం సంభవిస్తుంది. ఆ యింగిలీషు వకీలు అంతా పాడుచేశాడు.
అగ్ని అయితే రావఁప్పంతులు వుడాయించేసినట్టేనా?
నాయడు అందుకు సందేహవేఁవిఁటి?
అగ్ని నాకడియం, పట్టుకుపోయి తాకట్టుపెట్టా`డు?
నాయడు దానికి నీళ్లధారే.
అగ్ని అయ్యో! ఆకడియం మాతాతనాటిది. మీరు మొన్నదిడ్డీతోవంట వొచ్చారే, ఆ సాందాని యింట్లో తాకట్టుపెట్టా`డు.
నాయ రామ! రామ! ఆసరుకు దానిదగ్గిర వుంచేలేదు. మీది మిక్కిలి దానితాలూకుకంటె వకటి వాడే తీసుకుపోయి యక్కడో తాకట్టుపెట్టా`డు. ఆ తాగుబోతు మీకెలా దొరికాడు?
అగ్ని రావఁప్పంతులు తాగుఛాడా?
నాయ మరి కడియం, కంటెకూడా తాగేశాడుకాడా?
అగ్ని వీడిసిగతరగా!
నాయ అవునుగాని, మీమీద పోర్జరి కేసు ఖణాయించకుండా డిప్టీ కలక్టరుగారితో సిఫార్సు చేశానుగదా, నాకేమిస్తారు?
అగ్ని యేవిఁచ్చేది? నాభి కొనుక్కోడానికి దమ్మిడీ అయినా నాదగ్గిరలేదు. వూరికిచేరితేగాని డబ్బుపెగల్దు.
నాయ పోనియ్యండి. ఒక ప్రోమిసరీనోటు రాయండి; రూపాయలు యిప్పిస్తాను.
అగ్ని నా ప్రాణంపోతే నోటురాయను. అప్పుపత్రం రాయనని మాతండ్రి చచ్చిపోయేటప్పుడు నాచేత ప్రమాణంచేయించాడు.
నాయ అయితే మీతోకూడా మీవూరువస్తాను - వకబండెడు ధాన్యం యివ్వండి.
అగ్ని డబ్బూ, దినుస్సూకూడా వొకీళ్లనెత్తినికొడితే, యేటికేడాదీ బతకడం యలాగు? రెండుపుట్లు మిరపకాయలిస్తాను.
నాయ అదైనా యెంతకాదు. ఖరారేనా?
అగ్ని అగ్నిహోత్రావధాన్లు, అన్నమాట తప్పుఛాడా? లుబ్ధావధాన్లు నన్ను పకీర్నిచేశాడు - వాడికి సిక్షకాదేం?
నాయ అవునుగాని, సౌజన్యారావు పంతులుగారు అతడికి సాయం చేస్తున్నారు. అధికార్లంతా ఆపంతులుమాట వింటారు.
అగ్ని ఆపంతులు అవుధాన్లుకూతుర్ని పెళ్లా`డఛాడా యేమిషి?
నాయ ఆయన ప్రాలుబ్ధం, దాన్ని పెళ్లాడతాడా?
అగ్ని మరియెందుకు, లుబ్ధావుధాన్లు మీదపడి యేడుస్తాడు?
నాయ సౌజన్యారావు పంతులుగారు మహాదొడ్డవారు. కోట్లలో యెన్నవలిసిన మనుషులు. ఆపదలోవున్న యెవరికైనా ఆయ్న ఉపకారం చెయ్యవలసినవారే!
అగ్ని అషైతే, వెధవముండని పెళ్లాడిన చావాటుపీనుగును వెనకేసుకుని, నాపీక యెందుకు నొక్కుచున్నాడు?- అడుగో ఆ గాడిదకొడుకు!
(గిరీశం తొందరగా ప్రవేశించును. అగ్నిహోత్రావధాన్లు పక్కనుంచి గిరీశం మీదపడును. గిరీశం తప్పించుకుని కిందికిజారి, అగ్నిహోత్రావధాన్లు కాళ్లుబట్టిలాగి "మావఁగారికి నమస్కారం" అని పరుగుచ్చుకొనును. అగ్నిహోత్రావధాన్లు కిందపడును.)
నాయ అల్లుడుగారా యేవిఁటండి? (లేవదీసి వొళ్లుదులుపును.)
అగ్ని వీడిశ్రాద్ధం చెట్టుకిందబెట్టా! యేడీ, వెధవని చంపేస్తాను?
నాయ అల్లుణ్ణి హతవాఁరిస్తే, కూతురు డబ్బిల్‌ వెధవౌతుంది. శాంతించండి.
అగ్ని నీయింట కోడిగాల్చా!
నాయ అమోఘాశీర్వచనము! పదండి.
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)