నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౫-వ స్థలము. లుబ్ధావధాన్లు బస.
లుబ్ధా రామనామతారకం । భక్తిముక్తిదాయకం ॥
(గిరీశం ప్రవేశించి లుబ్ధావధాన్లును కౌగలించుకొని "అన్నయ్యా" అని యేడ్చును.)
లుబ్ధా యిదేవిఁట్రా?
గిరీశం నీమీద కూనీకేసు వొచ్చిందని తెలిసి నిద్రాహారం లేకుండా యకాయకీని వొచ్చాను. మా అన్నయ్యకీ వాళ్లకీ కబురు పంపించావు కావేవిఁ?
లుబ్ధా యెవడేంజెయ్యాలి? అన్నిటికీ సౌజన్యారావు పంతులుగారే వున్నారు. అయితే అబ్బీ, అగ్నిహోత్రావధాన్లుగాడి కూతుర్ని లేవదీసుకు పోయినావట్రా? వాడికి తగినశాస్తి చేశావు. దాన్నిగానీ పెళ్లిమాత్రం ఆడలేదుగద?
గిరీశం నేనంత తెలివితక్కువపని చేస్తాననుకున్నావా, అన్నయ్యా? నువ్వు నన్నేదో పెంచుకుంటావనీ, పెళ్లి చేస్తావనీ మావాళ్లు కొండంత ఆశపెట్టుకున్నారుగదా?
లుబ్ధా యీగండం గడిస్తే పెంపకంమాట ఆలోచించుకోవచ్చును.
గిరీశం (గద్గదస్వరంతో) సౌజన్యరావు పంతులుగారు చెప్పినమాటలుచూస్తే, యీగండం గడుస్తుందని నాకు ధైర్యం తాళకుండావుంది. నీకు కావలసినవాణ్ణీ, చదువుకున్నవాణ్ణీ, బుద్ధిమంతుణ్ణీ గనక నీకు మంచి సలహా చెప్పమని సౌజన్యారావు పంతులుగారు నాతో మరీమరీ చెప్పా`రు.
లుబ్ధా ఆయన్ని చూశావురా?
గిరీశం "చూశానా" అనా` అడుగుతున్నారు? ఆయనదగ్గిరికి పెద్దసిఫార్సు తీసుకువొచ్చాను. ఆయనకి నామీద పుత్రప్రేమ. ఆయనకేమీ పాలుపోకనే, నన్ను మీతోటీ, హెడ్డు కనిష్టీబుతోటీ మాట్లాడి, మంచి సలహా యిమ్మని పంపించారు. గనక నామాటవిను యెందుకైనా మంచిది, ఒక దత్తత పత్రికరాయి - కన్నకొడుకు లేనందుకు, ఉత్తరగతి చూసుకోవాలా` లేదా?
లుబ్ధా నాకువున్న బంధువులంతా నాదగ్గిర డబ్బులాగాలని చూసేవారేగాని, నాకష్టసుఖాలకి పనికివొచ్చేవాడు ఒక్కడయినా కనపడ్డు.
గిరీశం ఒహణ్ణెత్తినైనా యెన్నడైనా, ఓదమ్మిడీ కొట్టిన పాపాన్ని పోయినావూ? నేనొక్కణ్ణేగద, నీమీద అభిమానం పెట్టుకు దేవులాడుతున్నాను. మిగతా నీ బంధువులకి యెవరికైనా నీమీద పిసరంత అభిమానం వుందీ? చెప్పు.
లుబ్ధా లేకపోతే పీడానాడాకూడా పాయెను.
గిరీశం నేమట్టుకు నీదగ్గిర ఒక్కదమ్మిడీ యెన్నడూ ఆశించలేదు. నీపరంకోసం దత్తత చేసుకోమన్నాను. నన్ను కాకపోతే మరొకణ్ణి చేసుకో.
లుబ్ధా యిహం యింతబాగా వెలిగింది; పరంమాట బతికివుంటే ముందు చూసుకుందాం.
గిరీశం సౌజన్యరావు పంతులుగారు నీకు మంచిసలహా యిమ్మని శలవిచ్చారు గనక నీతో యీమాట చెప్పా`ను; అంతేగాని, ఆప్తులు చెప్పినమాట నువ్వు వినవన్న మాట నాకు బాగా తెలుసును - పోనియ్యి - మరోమాట చెబుతాను. అది ఐనా, చెవినిబెట్టు - నీకొకవేళ, సిక్ష అయితే, నీతరఫున, నీవ్యవహారాలూ సవహారాలూ, చూడడానికి యవడైనాఒకడు వుండాలా`లేదా? నీ బంధువుల్లోకల్లా యింగిలీషు వొచ్చినవాణ్ణీ వ్యవహారజ్ఞానం కలవాణ్ణీ నేను వొక్కణ్ణేగద? నాకో పవరాఫ్‌టర్నామా గొలికి యిచ్చెయ్యి.
లుబ్ధా నువ్వెందుకు నన్ను దుక్ఖంలోవున్నవాణ్ణి, మరింత దుక్ఖపెడతావు? అన్నిటికీ నాకు సౌజన్యారావు పంతులుగారు వొక్కరే వున్నారు. ఆయన యేలా చెబితే ఆలా చేస్తాను.
గిరీశం నేనన్నమాటా అదేకదూ? ఆయన చెప్పినట్టు నువ్వేవిఁటి, నేనేవిఁటి, యవరైనా వినవలసిందే. యీ రెండుసంగతుల విషయమయీ, ఆయన సలహా తప్పకుండా అడిగి, వారు యలా శలవిస్తే అలా చేదాం? యేవఁంటావు?
లుబ్ధా యిప్పటి నాచిక్కుకు పనికొచ్చేమాట ఒక్కటి లేదుగద.
గిరీ మరి యెందుకొచ్చా ననుకొన్నావు యింతదూరం? నేను నాడువ్రాసిన వుత్తరపు సంగతులు నువ్వు ఆలోచనలోకి తెచ్చివుంటే, యీచిక్కులు నీకు రాకపోనుగదా?
లుబ్ధా అప్పుడు గడ్డితిన్నాను.
(హెడ్డు కనిష్టీబు, దుకాణదారు ప్ర`వేశించి)
హెడ్డు అవుధాన్లూ - ఈయనెవరు?
లుబ్ధా నాతమ్ముడు.
హెడ్డు నాకేం తోచకుండావుంది బైరాగీ మాయవైఁపోయినాడు.
లుబ్ధా అయ్యో! మరేవిఁటి సాధనం?
హెడ్డు అదే ఆలోచిస్తున్నాను.
లుబ్ధా యెక్కడికి వెళ్లా`డో?
హెడ్డు శ్రీజగన్నాధస్వామివారి శలవౌతూందిఅని యీ వుదయంనుంచీ అంటూ వొచ్చాడు.
దుకా సారాదుకాణాల్లో యెతికితే, దొరుకుతాడు.
హెడ్డు అదేంమాట భాయీ. సిద్ధులు యేంజేసినా, వారికి తప్పులేదు. యేదుకాణంలోనూ కూడా కానరాలేదు.
దుకా ఆలాగైతే అనకాపల్లి రోడ్డుకాసి యెతకండి.
గిరీ బైరాగి యెందుకయ్యా?
హెడ్డు ఆయన అంజనంవేసి గుంటూరుశాస్తుల్లునీ, వాడికూతుర్నీ చూపించాడు.
గిరీ డామ్‌నాన్సెన్సు - గ్రోస్‌ సూపర్‌స్టిషన్‌ - యీ వెఱ్ఱికబుర్లు యేదొర నమ్ముతాడు?
హెడ్డు దొర్లు నమ్మకపోతే పోయేరు. ఆగుంట బతికివుందనీ, ఫలానాచోట వుందనీ మనకి ఆచోకీ తెలిస్తేచాలదా?
గిరీశం ఇగ్నోరెన్స్‌! యేమి ఆచోకీ తెలిసింది?
హెడ్డు ఆపిల్ల ఒక పూరియింట్లో కుక్కిమంచంమీద కూచుని యేడుస్తూన్నట్టు కనపడ్డది.
గిరీశం మీకే కనపడ్డదా?
హెడ్డు నాకెలా కనపడుతుంది? పాపంపుణ్యం యెరగని చిన్నపిల్లవాళ్లకే కనపడుతుంది.
గిరీశం లోకం అంతటా పూరియిళ్లూ కుక్కిమంచాలూ వుఁన్నవిగదా, యేవూరని పోల్చడం?
హెడ్డు యీరాత్రి మళ్లీఅంజనంవేసి వూరుపేరు చెప్పిస్తానన్నారు.
గిరీశం యవిడెన్సు ఆక్టులో అంజనాలూ, పిశాచాలూ సాక్ష్యానికి పనికొస్తాయిటయ్యా.
హెడ్డు ఆబైరాగీని మీరెరగరు; ఆయన గొప్పసిద్ధుడు - యేంజెయ్యాలంటే అది చెయ్యగల్డు - అతడు పక్కనివుంటే నాకు కొండంత ధైర్యంవుండేది. జగన్నాధస్వామిని సేవించుకుని సాయంత్రానికి ఆయనవొస్తే, నేను అదృష్టవంతుణ్ణి.
గిరీశం పదిరోజులు ప్రయాణంగదా, ఒక్కరోజుకిపోవడం రావడం యలాగ?
హెడ్డు ఆయనకి వాయువేగంవుంది.
దుకా అప్పులాళ్లు అగుపడితే, వాయువేగంగా యెగేస్తాడు; నాబాకీ వొసూలు చేసుకోనిచ్చినారుకారు గదా భాయీ!
హెడ్డు వెధవబాకీ - యీగండంతప్పితే, నేను యిచ్చేస్తానుభాయీ.
దుకా గండంతప్పేదేటి, నాసొమ్ము నాచేతులో పడేదేటిభాయి?
హెడ్డు మీ అందరిసాయంవుంటే దాటకేంభాయి?
దుకా ప్రాణంపెడతానుభాయి, సాక్షెంమాటమాత్రం శలవియ్యకండి.
హెడ్డు సాక్ష్యంపలకరా యేవిఁటి?
దుకా దుకాణవేఁసుకు బతికేవాళ్లకి సాక్షికాలెందుకు భాయీ? యీ తిరగడం నించి బేరంచెడ్డాది. యీవేళ వూరికిపోకుంటే దుకాణం యెత్తిపెట్టాలి.
హెడ్డు యిదేనా మీస్నేహం, నేస్తం?
దుకా మీవెంట తిరిగితే, కొత్తహెడ్డుగారు.-
హెడ్డు కొత్తహెడ్డేవిఁటిభాయి?
దుకా యినసిపికటరుగారు, చెప్పినారు. నాసొమ్ము మాటేటిభాయి?
హెడ్డు యినస్పెక్టరుగాడు అన్నిందాలా నాకొంపతీశాడు!
దుకా ఆ బైరాగాడు నాకొంపతీసినాడు. యిహ నాడబ్బు నాచేతులో పడేదేటి?
(నిష్క్రమించును.)
(అసిరిగాడు ప్రవేశించి.)
అసిరి (బుఱ్ఱగోకుకుంటూ) బాబు, మా ముసల్దోనికి సాలొచ్చిందట - కబురెట్టింది బాబూ.
హెడ్డు వెధవా, సాక్ష్యంయివ్వందీ వెళ్లిపోతావా యేమిటి?
అసిరి సాచ్చీకం అయిందాకా బతికుంతాదా బాబు?
హెడ్డు ఓరి, వెధవా, దొంగమాటలాడుతున్నావు - గుండెపగలగొడతాను. నీకెవడ్రా కబురు తీసుకొచ్చాడు?
అసిరి మనవూరు బండోళ్లొచ్చినారుబాబు.
హెడ్డు గాడిద`కొడకా, యిల్లుకదిలా`వంటే వీపుపెట్లగొడతాను.
అసిరి యెళ్లితే మీరుతంతారు, యెళ్లకుంటే ఆరుతంతారు.
హెడ్డు ఆరెవఱ్ఱా?
అసిరి యినీసిపిక్కటోరు.
హెడ్డు యీ యినస్పెక్టరు మరి సాక్ష్యం రానివ్వడు!
గిరీశం అసిరీ - నాదెబ్బ నీకుతెలుసును - యినస్పెక్టరూ గినస్పెక్టరూ జాంతేనై. విన్నావా, తిన్నగాబోనెక్కి నిజవేఁదో సాక్ష్యం పలక్కపోతివట్టాయనా, పీకనులివేఁసి నిన్ను నూతులోపారేస్తాను.
అసిరి యేటిబాబూ! మీరోతెన్నా, ఆరోతెన్నా, యీరోతెన్నా, నాకేటెరిక బాబు? మీనౌకరీకి దణ్ణం పోతాను, బాబూ. ఆయమ్మ గోడగెంతడం నాను సూపులేదు బాబూ. గవరయ్యగోరు దెయ్యాన్ని సీసాలోయెడితే, గోడగెంతడం యేటిబాబు? వొట్టిఅబద్దం! నాను సూపులేదు బాబు.
గిరీశం వాడుచూడందీ సాక్ష్యం యలా పలుకుతాడు, అన్నయ్యా?
లుబ్ధా నాప్రాలుబ్ధం. యేవని జెప్పను?
హెడ్డు యవరీయనా? కేసులమొహం అంటే యీయనకేమైనా తెలుసునా?
గిరీ కేసులమొహం నాకూతెలియదు, నిజంమొహం పోలీసువాళ్లకీ తెలియదు. అబద్ధ సాక్ష్యాలవల్ల తప్పించుకోవడంకన్న, జెయిల్లోకూచోడవేఁ ఉత్తమం. ధన ప్రాణాలు రొండూపోయినా మనిషిఅన్నవాడు అసత్యం ఆడకూడదు - ఆడించకూడదు.
హెడ్డు యేవిఁటండీ ఈయన శల్యసారధ్యం? - యవరితడు?
గిరీశం నేను లుబ్ధావధాన్లుగారి తమ్ముణ్ణి - నా పేరు గిరీశంఅంటారు. నేను పరిక్షలు పాసైనవాణ్ణి; తెలిసిందా?
హెడ్డు వెధవముండని తగులుకుపోయిన మహానుభావుడివి నువ్వేనా?
గిరీశం డిఫమేషన్‌ అంటే మీకేమో తెలుసునా? నేను సౌజన్యారావు పంతులుగారి స్నేహితుణ్ణి- సాక్ష్యాలు యేరీతిగావున్నాయో కనుక్కుని, అన్నయ్యగారికీ మీకూ సలహాచెప్పమని పంతులుగారు నన్ను పంపితే వచ్చాను.
హెడ్డు అలా అయితే మాకు మీరు సాయంచెయ్యాలిగాని, అబద్ధంలేకుండా సాక్ష్యం కావాలంటే యీ భూప్రపంచకమందు యెక్కడైనా సాక్ష్యంఅన్నది వుంటుందా? నానెత్తిమీద యెన్ని వెంట్రుకలువున్నాయో, అన్నిసాక్ష్యాలు చూశాను. పెద్దపెద్దవకీళ్లు తయారుచేసిన సాక్ష్యాలుకూడా చూశాను. మీరు అనుభవంలేక నీతులు చెబుతున్నారుగాని, హైకోర్టు వకీళ్లుకూడా తిరగేసికొట్టమంటారు. నీపుణ్యంవుంటుంది బాబూ, నిజం అబద్ధం అని తేలగొట్టక, యేదో ఒకతడక అల్లి తయారుచేస్తేగాని ఆబోరుదక్కదు.
గిరీశం అన్నయ్యకీ, మీకూ సహాయంచెయ్యడంకోసం కాకపోతే యింతదూరంనుంచి నేను యెందుకువచ్చాను? మీయిష్టవొఁచ్చినట్టల్లా మీకు పనికివొచ్చే అబద్ధాలు మీరు పలికించడముకు నా అభ్యంతరం యెంతమాత్రంలేదు. ఎబ్‌స్ట్రా`క్టు ట్రూత్‌ అనగా సుద్ధసత్యఁవనేది, సాక్షాత్తూ భగవంతుడితో సమానమైన వస్తువ అన్నమాటమాత్రం మరిచిపోకూడదని నాఅభిప్రాయము. నేనుమట్టుకు నిజంకోసం సమయంవొస్తే సంతోషముతో ప్రాణం యిచ్చేస్తాను. "లోకోభిన్నరుచిః" అన్నాడు. కొందరికి కందిపప్పు పచ్చడి రుచి; కొందరికి పెసరపప్పు పచ్చడి రుచి; కొందరు అదృష్టవంతులికి, రెండుపచ్చళ్లూ రుచి. అలాగనే కొందరికి అబద్ధం రుచి; కొందరికి నిజం రుచి; చాలామందికి రెండింటీ కలగలుపు రుచి. యిది లోకస్వభావం. గనక అవసరం కలిగినప్పుడు తణుకూబెణుకూలేకుండా, అబద్ధం ఆడవలసిందే - ప్రస్తుతాంశంలో, అసిరిగాడిచేత అబద్ధం ఆడించడం నాదిపూచీ. అసిరీ - నాతడాఖా జ్ఞాపకవుఁందా, కబడదార్‌ - సాక్ష్యం యివ్వకపోతే చంపేస్తాను.
హెడ్డు అలా తోవలోకిరండి భాయీ - చర్మం చెప్పులుకుట్టియిస్తాను. (లుబ్ధావధాన్లుతో) ఆ ఛండాలుడు రావఁప్పంతులుని నమ్మక, యిలాంటి కావలసినవాళ్ల మాట వింటే; మీకు యీగతి రాకపోవునుగదా?
గిరీశం మావాడు, కావలసినవాళ్ల సలహా వింటాడండీ. దత్తత చేసుకుంటానని యెన్నాళ్లాయో అంటున్నాడు; దత్తత చేసుకుంటే కనిపెట్టివుండనా? "పోనీ, ఓ పవరాఫ్‌ టర్నామా అయినా నా పేరవ్రాయి, నీ వ్యవహారాలు చూస్తాను" అంటే, చెవిపెట్టడు.
హెడ్డు యేవఁండీ, అవుఁధాన్లుగారూ అలా చెయరాదటయ్యా?
లుబ్ధా వెనకనుంచి ఆలోచించుకుందాం.
గిరీశం అధాత్తుగా, జెయిలులోకి లాక్కుపోతే, ఆపైని చేసేపనేవిఁటి?
హెడ్డు జయిలు సిద్ధపరిచారూ?
గిరీశం మాటవరసకన్నాను. కీడించిమేలించాలి - యినస్పెక్టరుకుట్ర బలంగావుంది. పోలిశెట్టి సాక్ష్యంపలకనని సౌజన్యారావు పంతులుగారితో చెప్పి వూరికి వెళ్లిపోయినాడు.
హెడ్డు అయ్యో, మరేమిటిగతి!
గిరీశం అదే పంతులుగారూ నేనూ, విచారిస్తున్నాం.
(పూజారి గవరయ్య ప్రవేశించును.)
హెడ్డు గవరయ్యగారూ, గురోజీ కనపడ్డారా?
గవర యిదుగో నాతో వొస్తూంటేనే! మీపెరటి అరుగుమీదే యింతసేపూ సమాధిలో వున్నారు.
హెడ్డు నాకు పెరటి అరుగుమీద కనపడలేదే? పోనీండి ఆయనవొచ్చారంటే బతికా`ను అన్నమాట - యేరీ?
గవర యేమి అలా అడుగుతున్నారు? యిరుగో మీయెదటా. (కాళీజాగా వేపు చూపును) మీకు కనపడలేదా యేమిటి? (కాళీజాగావైపు చూచి) యేం గురోజీ తిరస్కరిణీ విద్య అవలంబించారేమి? - ఓహో, మీగురువుగారి ఆజ్ఞ ఐందనా? - అయితే నాకెలా కనపడుతున్నారు? - నాకు మంత్రసిద్ధికలదనా`? - అయితే యెన్నాళ్లు యిలా కనపడకుండావుంటారు? - ఒక్కపక్షవాఁ? (హెడ్డుతో) అదీ వారు శలవిచ్చినమాట.
హెడ్డు యీలోగా మాపీకకి వురి అయిపోతుందే?
గవర (కాళీజాగావైపు చూచి) యేమిశలవు. గురూ? - (హెడ్డుతో) మీకేమీ పర్వాలేదన్నారు.
హెడ్డు యీరాత్రి అంజనం వేయిస్తావఁన్నారుగదా, యెలాగ?
గవర (కాళీవైపు చూచి) యేంశలవు? - (హెడ్డుతో) అన్నిపనులూ నాచేత చేయిస్తామన్నారు.
హెడ్డు వారు కనపడితే బాగుండును.
అసిరి అదేటిబాబూ, ఆరు నాకగుపడుతున్నారు!
గవర సిద్ధులూ, పిశాచాలూ, మాలాంటి మాంత్రికులికి కనపడతారు. వాడిలాంటి మూఢభక్తులకు కనపడతారు; పాపంపుణ్యం యరగని, పసిపిల్లలికి కనపడతారు. ఇతరులకు కనపడరు.
గిరీశం డా`మ్‌, హంబగ్‌. (కఱ్ఱతో గవరయ్యపక్కని కాళీజాగాకొట్టి) యవడున్నాడిక్కడ? హెడ్డుగారూ, యిదంతా గ్రాండ్డచ్చీ ఆఫ్‌బేడెన్‌.
గవర నువ్వు రెండు యింగిలీషుముక్కలు చదువుకుని నాస్తికుడివి కాగానే, మాహాత్మ్యాలు పోతాయనుకున్నావా యేవిఁటి? నువ్వు సొట్టకఱ్ఱ తిప్పితే సిద్ధులికి తగుల్తుందా? నీలాగే పెద్దకబుర్లు చెప్పిన రిజస్టరికి, స్మశానంలోకి తీసికెళ్లి దెయ్యాన్ని చూపించేసరికి, ఆర్నెల్లు వూష్టంపెట్టుకున్నాడు. సిద్ధుల్ని నిందిస్తే బుఱ్ఱపగుల్తుంది.
అసిరి ఆరేటిబాబూ, బైరాగోరు!
గిరీశం (అసిరిగాడిపైని ఉరికి) వెధవా, యేడిరా?
అసిరి లేడుబాబూ, లేడుబాబూ, ఉత్తినన్నాను.
గిరీశం దొంగ గాడిద`కొడకా! (హెడ్డుతో) మీరు సాక్ష్యం కుదుర్చుకోవడం మానేసి, యీగవరయ్య మాయల్లోపడితే మరి తేల్తారా?
హెడ్డు అన్నా - అలా అనకండి. వీరి సాయంవల్లే మనం వొడ్డెక్కాలి. (చెవిలో) గవరయ్యగారు మనకి ముఖ్యమైనసాక్షి.
గవర కిరస్తానప భ్రష్టులు చేరినచోట మాంత్రికులూ, సిద్ధులూ వుండజనదు - (కాళీవైపుచూసి) రండి గురోజీ మనతోవని మనంపోదాం.
లుబ్ధా గవరయ్యన్నా, యెక్కడికి వెళతారు?
గవర నాకు తోచినచోటికి.
లుబ్ధా మరి సాక్ష్యవో?
గవర

అవధాన్లుగారు పెళ్లాడినది కామినీపిశాచం. "అది మనిషీ, గోడగెంతి పారిపోయిందీ" అని నేను అబద్దపు సాక్ష్యం చెప్పానంటే మరి మంత్రంఅన్నది నాకు మళ్లీ పలుకుతుందా? నావొంతు ఆ గిరీశాన్ని సాక్ష్యం పలకమను.

"నమ్మి చెడినవారు, లేరు ।
నమ్మక చెడిపోతే, పోయేరు ॥"

(గిరీశంతో) - యినసిపికటరుగారు నీకంటే యెక్కువ యింగిలీషు చదువుకున్నా ఆయనికి మనశాస్త్రాల్లో నమ్మకాలుపోలేదు.

హెడ్డు ఆయనదగ్గిరికి వెళతారా యేవిఁటి?
గవర (వెళ్లుతూ) కబురంపించారు.
హెడ్డు రండి, రండి, గవరయ్యగారూ చిన్నమాట.
గవర (వెళ్లుతూ) ఆచిన్నమాటేదో (గిరీశమునుచూపి) ఆ మహానుభావుడుతో చెప్పండి. (నిష్క్రమించును.)
హెడ్డు (గిరీశంతో) యీ సాక్ష్యం మీరు మాటదక్కించుకున్నారు - మరి సాక్ష్యవఁన్నదిలేదు.
గిరీశం ఆ మాటకొస్తే - నేనే సాక్ష్యానికి దిగి, కేసు నీళ్లు కారించేస్తాను. నాశక్తి చూతురుగాని - సౌజన్యారావు పంతులుతోమాత్రం ఆమాట యింకా చెప్పకండి.
(తెరదించవలెను.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)