నాటకములు కన్యాశుల్కము గురజాడ అప్పారావు
౬-వ స్థలము. సౌజన్యారావు పంతులుగారి యిల్లు.
(మేడపైని పంతులుగారి పడకగది. ఒక బల్లపైని సన్నని గాజుదీపము కొంచము వెలుతురు కలుగజేయును. గదిమధ్యను మెట్లవైపునున్న గుమ్మమునకు యెదురుగా దోమతెర మంచము ఉండును. దానిపైని సౌజన్యారావు పంతులు మేలుకుని పరుండియుండును. మంచము రెండవప్రక్కను చిన్న రౌనుబల్లపైని గిల్టు కవరూ అంచులూగల భగవద్గీతాపుస్తకము. పక్కని కుర్చీమీద గిరీశము కూర్చుని యుండును.)
గిరీశం నామనసు డైలెమ్మాలోపడి చాలా ఖేదిస్తూందండి. యేరీతినైనా నాఅన్నగారు యీ ఆపద దాటుదురా అని ఆతృత వొకపక్కా, అసత్యమునా కార్యసాధనంగా చేసుకోవడం అనే జిఘాస ఒక పక్కా, నన్ను పీడిస్తూన్నవండి. "అబద్ధపుసాక్ష్యం వొద్దు. నిజమైనసాక్ష్యం జాగ్రత చెయ్యండి" అని హెడ్డు కనిష్టీబుతో నేను అనేసరికి నాపైని కొండంత కోబ్బడ్డాడండి. నిజమైన సాక్ష్యం ప్రయత్నిస్తే దొరకదా అండి?
సౌజ నిజమైనసాక్ష్యం! యేంసత్యకాలం! నిజవాఁడేవాడు సాక్ష్యానికిరాడు. సాక్ష్యాని కొచ్చినవాడు నిజవాఁళ్లేడు.
గిరీ యెంచేత ఆళ్లేడండి?
సౌజ వాదిని బాధించే నిజం వాదితరపు వకీలుకి అక్కర్లేదు. ప్రతివాదిని బాధించే నిజం ప్రతివాది వకీలుకి అక్కర్లేదు. క్రాసెగ్జామినేషను ఆరంభం అయేసరికి యెంతటిసాక్షీ కవిత్వం ఆరంభిస్తాడు. అంచేతనే పెద్దమనుషులు బోనెక్కడానికి భయపడతారు.
గిరీ వకీళ్లు అబద్ధాలాడిస్తే న్యాయం కనుక్కోడానికి జీతం పుచ్చుకునే జడ్జీ యేం జేస్తాడండి?
సౌజ ఉభయపార్టీల వకీళ్లు ఆడించే అబద్ధాలూ చెయిపీకేటట్టు రాసుకుంటాడు.
గిరీ అయితే యెందుకండి యీకోర్ట్లు?
సౌజ నేను అదే చాలాకాలవాఁయి ఆలోచిస్తూవుంటిని. పెద్దపెద్ద వకీళ్లుకూడా సిగ్గుమాలి బరిపెట్టి దొంగసాక్ష్యాలు పాఠంచెబుతారు. కొందరు మృదువర్లు తిరగేసి కొట్టమంటారు. నావంటి చాదస్తులం యింకొక కొందరం అట్టి పాపానికి వొడిగట్టుకోంగాని, మాపార్టీల తరఫు సాక్ష్యులుకూడా అబద్ధం చెబుతున్నారని యెరిగిన్నీ వూరుకుంటాం. యిలాటి అసత్యానికి అంగీకరించవలసి వస్తుందనే, నేను ప్రాక్టిసు చాలా తగ్గించుకున్నాను. క్రమంగా యీవృత్తే మానుకోవడపు సంకల్పం కూడా వుంది.
గిరీ అందరూ తమవంటి వకీళ్లే అయితే, అసత్యం అన్నది వుండనే వుండదండి. వకాల్తీలో యింత అక్రమం వుందన్నమాట నే నెరగనండి. యేమైనా సహించగలనుగాని అసత్యం అన్నది సహించలేనండి.
సౌజ ఒక్క అసత్యంతో కుదరలేదు. సాధారణంగా వకాల్తీలో దురాచారాలు చాలావున్నాయి. ఆంటినాచ్‌ లాగనే, ఆంటీ వకీల్‌ అని వకమూవ్‌మెంటు మనదేశంలో స్టార్టు చెయ్యడపు ఆవశ్యకత కలిగేటట్టు కనపడుతుంది. హెడ్‌ కనిష్టీబుది తప్పుకాదు. దొంగసాక్ష్యం కలిగిస్తేనేగాని కేసులు గెలియవు. మీరు సత్యమార్గంలో తరిఫీదైన మనుష్యులు ఔటచేత, మీకు కేసులు నడిపించే మార్గాలు ఏహ్యంగా వున్నాయి.
గిరీ మరి మా అన్నగారి గతియేవిఁటండి?
సౌజ ఒక్కటే సాధనంవుంది. ఆగుంటూరు శాస్తుల్లు యెవరో పోల్చి పట్టుగుంటే, యితరసాక్ష్యం అవసరం వుండదు.
గిరీ పట్టుపడేమార్గం యేదో తమరు శలవిస్తే మూడులోకాలూ గాలించి అయినా పట్టుగుంటానండి.
సౌజ మీయోగ్యతకు నాకు చాలా సంతోషంగావుంది. మీలాంటి యెంగ్‌మెన్‌ లావుగావుంటే, మనదేశం బాగుపడును. మీ ప్రయత్నం సానుకూలం కాతగిన బందోబస్తు యావత్తూ నేను చేస్తాను. మీ స్వంత చిక్కులుకూడా వదిలినవి గనక మీరు వెంటనే బయలుదేరి వెతకడం ఆరంభించవచ్చును. యీ కారణంచేత మీ వివాహం పోస్ట్‌పోన్‌ కావలసి వొస్తుందిగదా అని మాత్రం విచారిస్తున్నాను.
గిరీ అట్టి విచారం తాము పడనక్కరలేదు. మా గురువుగారి ఉపదేశం డ్యూటీముందూ, ప్లెజ`ర్‌ తరవాతానండి. అందులో నేను చిన్ననాటినుంచీ కొంచం కాన్‌సెన్‌ట్రేషనూ, ఇంద్రియనిగ్రహమూ అభ్యాసం చెయ్యడంచాతనూ, వొళ్లు మరిచి యెల్లప్పుడూ యేదో ఒక వ్యాపకంలో కొట్టుకుంటూ వుండడంచాతనూ, స్త్రీ సుఖముల యెడల నాకు విముఖత లావండి. అందుచేతనే మావాళ్లంతా నాకు నెపోలియన్‌ ఆఫ్‌ ఆం`టినాచ్‌ అని పేరుపెట్టా`రు. యీ జీవితకాలవఁంతా సోషల్‌ రిఫారమ్‌ కింద వినియోగపరుద్దావఁనే నిర్నయంతో వివాహంమాని మాగురువుగారిదగ్గిర లెఫ్టెనెంటుగా ప్రవేశించానండి. బుచ్చమ్మయొక్క హృదయనైర్మల్యమూ, ఆమె దురవస్థా చూచిన్నీ, నా శిష్యుడియందు నాకువుండే ప్రేమాతిశయం చేతానున్నూ, ఆమెయందు కూడా ప్రేమాతిశయం నాకు కలిగి, ఆమెను వివాహం కావడముకు వొప్పుకున్నానుగానండి, ఇంద్రియసుఖముల నపేక్షించి కాదు. ఆమెకూడా నన్ను ప్రేమించి, విధవా వివాహము కూడుననే నిశ్చయముతో నన్ను వివాహము కావడముకు అంగీకరించారండి. గనక మా` మారియేజి అనేది, ట్రూలవ్‌ మారియేజిగాని, సాధారణపు విడోమారియేజి కాదండి.
సౌజ మీగురువుగారూ అలాగే వ్రాశారు. గాని మీరు విడోమారియేజి చేసుకుంటే మీఅన్నగారు మిమ్మల్ని పెంచుకోరేమో?
గిరీ తమమాటను ఆయన అతిక్రమించబోరండి. ఒకవేళ ఆయన వప్పకపోతే, దత్తత వదులుకుంటానుగాని, ప్రాణసమానురాలైన బుచ్చమ్మను విడవనండి.
సౌజ ఆమె అదృష్టవంతురాలు.
గిరీ అట్టి స్త్రీరత్నము (చడిలేకుండా ఒకమనిషి మెట్లెక్కివచ్చి ద్వారముదగ్గిర తనకు యెదురుగా నిలిచివుండడము చూచి గిరీశం నిర్ఘాంతపోయి మాటమాని నోరు తెరచును. ఆవైఖరి సౌజన్యారావుపంతులు కనిపెట్టి)
సౌజ యేవిఁటి అలా చూస్తున్నారు? (గిరీశం చూస్తూవున్నవేపు తానును దృష్టితిప్పి, వచ్చినమనిషిని చూచును.)
గిరీ యిట్టి స్త్రీరత్నము దొరికిన కారణంచేత నేనే అదృష్టవంతుణ్ణి అని భావిస్తాను. అయితే "పరోపకారఃపుణ్యాయ । పాపాయపరపీడనం" అన్న న్యాయప్రకారం, ఒకర్నికాపాడి ఉపకారం చెయ్యడం ఉత్కృష్టమైనపుణ్యం. నిష్కారణంగా, వాడిమానాన్న వాడు బతుకుతున్నవాడికి అపకారంచెయ్యడం పాపానికి కారణం. గనుక మా అన్నయ్యని యెంతకష్టపడి అయినా నేను కాపాడడం విధిఅని యెరుగుదునండి.
సౌజ (కొత్తగావచ్చినమనిషితో) యెవరు మీరు?
కొత్తమనిషి జరూరు ప్రయోజనం కలిగివచ్చానండి - వర్తమానం చెయకుండా వచ్చినందుకు క్షమించవలెను - కింద నౌఖర్లు కానరాలేదండి.
సౌజ రండి - కూచోండి.
గిరీ (లేచివెళ్లి ఒక కుర్చీతెచ్చి తనకుర్చీ పక్కనువేసి) దయచెయ్యండి.
కొత్తమనిషి (కూచోక) అక్కర్లేదు.
సౌజ కూచోండి - (కొత్తమనిషి కూచొనును) తాము యెవరండి?
కొత్తమనిషి నేనెవరో మనవిచెయక తీరదా అండి?
సౌజ యేకారణం చేతనైనా పేరుచెప్పడం యిష్టంలేకపోతే, చెప్పనక్కరలేదండి.
కొత్తమనిషి నేవచ్చినపనికి, నాపేరుతో పనిలేదండి. కొన్ని కారణములచేత నాపేరు చెప్పడముకు వీలులేదండి. క్షమించవలెనని ప్రార్థన.
గిరీ షేక్‌స్పియర్‌ అన్నాడుకాడా అండి. "వాట్సినెనేమ్‌?" అని? దానిని నేను చిన్న గీతముక్కగా తర్జుమా చేశానండి "పేరులోననేమి పెన్నిధియున్నది." మన శాస్త్రాల్లోకూడా యెవరిపేరు వారుగట్టిగా ఉచ్చరించితే పాపవఁన్నారు. తమకు విశదమే.
కొత్తమనిషి మరివొకరితో అయితే కల్పించి మారుపేరు చెప్పుదును. తమచోట అబద్ధం ఆడజాలనండి.
గిరీ భోజరాజు ముఖంచూస్తే కవిత్వం పుట్టినట్టు, తమముఖంచూస్తే యెట్టివాడికైనా నిజవేఁ నోటంట వొస్తుందండి.
కొత్తమనిషి ఒకానొకరికితప్ప.
గిరీ "సచేమాన్‌ ఈజ్‌టుబి పిటీడ్‌." అనగా అట్టిమనిషివుంటే ఆమనిషియెడల మనం కనికరం కలుగజేసుకోవాలి - అంతే.
సౌజ అసత్యవఁనేది యెవరితోనూ ఆడకూడదు.
కొత్తమనిషి మంచివారియెడల మంచిగానూ, చెడ్డవారియెడల చెడ్డగానూ, వుండమని మాతల్లిగారు ఉపదేశంచేశారు. అంచేత తమతో అబద్ధవాఁడనన్నాను.
సౌజ మీతల్లిగారు పూజ్యులేగాని, వారి ఉపదేశంలో మీరు మొదటిసగమే అవలంబించి కడం సగమూ మార్చి, మనంచెడ్డవారని అనుకునే వారియెడలకూడా మంచిగా వుండుటకు ప్రయత్నముచేస్తే, దయాపరిపూర్ణుడైన భగవంతుడు సృజించిన యీలోకము మీకు మరింత యింపుగా కనపడుతుంది. మీకూ మీపరిచయం కలిగినవారికీ మరింత సౌఖ్యము కలుగుతుంది. కాక మంచిచెడ్డలు ఏర్పర్చగలిగినవాడు యెవడు? మంచిలోనూ చెడ్డవుంటుంది. చెడ్డలోనూ మంచివుంటుంది.
గిరీ యేమి విలవైనమాటలు! ఒక చెడ్డమనిషి వున్నాడనుకోండి. ఒకణ్ణి అనడవెఁందుకు? నేనే ఆచెడ్డవాణ్ణి అనుకోండి. అట్టి చెడ్డవాడనైన నాయెడల మంచిగా వుండడమే యోగ్యత. తమవంటి మంచివారియెడల అంతా మంచిగానే వుంటారు. "అపకారికి నుపకారము । నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ" అని కవి అన్నమాట పర్‌ఫెక్‌ట్‌ జెమ్‌ కాదాఅండి?
సౌజ నాభావం మా బాగా ఉపన్యశించారు.
కొత్తమనిషి (సౌజన్యారావు పంతులుతో) తమవాక్యం గురూపదేశంగా భావించి, యిటుమీదట చెడ్డవారియెడలకూడా మంచిగా వుండడముకు ప్రయత్నిస్తాను. తమశిష్యరికం లభించడం నాకు పెన్నిధి. సత్పురుషుల దర్శనం సద్యోఫలం కలది. తాము మంచిలో చెడ్డవుంటుందని శలవిస్తిరి. పరిపూర్ణమైన తమ మంచిలో చెడ్డలేదని వింటున్నాను.
సౌజ పరిపూర్ణమైన మంచి ఒక్క భగవంతుడియందేకలదు. నా చెడ్డ లోకవేఁ వెఁరుగును?
గిరీ మిషనరీ ఒరిజినల్‌సిన్‌ అంటాడండి. మనవాళ్లు దుష్కర్మ అంటారు. దాంతస్సాగొయ్యా (బెగ్‌ యువర్‌ పార్డన్‌) ఆ ఒరిజినల్‌సిన్‌, లేక కర్మ, అనేది యెంత మంచివాడినైనా, యెంత కట్టుదిట్టవైఁనవాడినైనా రెక్కపట్టుకుని తప్పుతోవలోకి లాగుతుందండి. తమకు విశదముకానిది యేమున్నది?
సౌజ "బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి" అని గీత చెబుతూంది. యెవడి చెడ్డ వాడు దాచుకుని, మంచినే పైకి కనపర్చుతాడు.
కొత్తమనిషి ఒకానొకరు లేని మంచినికూడా వున్నట్టు ప్రచురపరిచి లోకాన్ని భ్రమింప చేస్తారు.
సౌజ సత్యం. అందుచేతనే మంచి చెడ్డలు మనసే యెరగవలెగాని లోకమేవెఁరుగును అని అన్నాను.
కొత్తమనిషి నటనవల్ల కొద్దికాలవేఁ లోకానికి కళ్లు కప్పవచ్చునుగాని, నిడివిమీద బంగారాన్నీ, యిత్తడినీ లోకం యేర్చేస్తుందండి. (గిరీశంతో) యేమంటారు?
గిరీ పంతులుగారికి నిద్రభంగవౌఁతుంది. మీరు వచ్చినపనేదో-
కొత్తమనిషి (సౌజన్యారావు పంతులుతో) స్వాభావికంగా మంచికి లోకంగుడ్డి; చెడ్డవెతకడానికి చారెడుకళ్లు; గనక, చూస్చూసి, లోకం ఈయనమంచివారు, అని నిర్ధారణచేసిన తరవాత, వారు మంచివారు కాకతీరదండి - తమవంటి మంచివారు వలవేస్తే యెక్కడా కనపడడం కష్టం అండి. గనక తమదర్శనం నాకు కావడంవల్ల యీరోజు, నాజన్మానికల్లా సుదినంగా భావించి సంతోషిస్తున్నాను.
గిరీ సందేహవేఁవిఁటి!
సౌజ మంచిగావుందావఁని ప్రయత్నిస్తున్నాను. అంతకన్న నాయందు యోగ్యత యేమీలేదు. మీరు వచ్చినపని చెప్పారుకారు.
గిరీ నేను కనుక్కుని తమతో ఉదయం మనవిచేదునా?
సౌజ జరూరు పనిమీద వచ్చినవారూ, పేరు చెప్పనివారూ, మీతో వారికార్యం చెబుతారా? మీది యెంతసత్యకాలం!
గిరీ వారికి నేనేమైనా సాయంచెయడానికి అవకాశం వుంటుందేమో అనీ, తమకు నిద్రవేళైందనీ, మనవిచేశాను.
కొత్తమనిషి గిరీశంగారు లోకోపకారపరులు.
సౌజ మీకు కృతపరిచితులా?
కొత్తమనిషి వారిని యెరుగనివారెవరండి?
గిరీ వారు నాయందువుండే దయచేత అలా శలవిస్తున్నారుగాని, నన్ను అంతా యెరగడానికి నేనేపాటివాణ్ణండి. అయినా తరుచుగా లెక్చర్లు యిస్తూవుండడంచాత, వీరివంటి సత్పురుషులు నన్ను యెరిగివుండడంకద్దు; సత్కరించడంకద్దు. వీరినికూడా నేను చూచివుందును. అందుచేతనే వీరు కనపడగానే, యెవరు చెప్మా చూచినట్టుందీ! అని కలవిలపడ్డాను. వారుకూడా ప్రచ్ఛన్నులై వుందామని నిశ్చయించుకున్నారు గనక, నేను జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నం చెయ్యను; నేనుపోయి పరుంటాను. తాము ఉభయులు మాట్లాడుకోవొచ్చును.
సౌజ అలాగే చెయ్యండి.
గిరీ (సౌజన్యారావు పంతులుతో) నమస్కారం. (కొత్త మనిషితో) మీరు బ్రాహ్మలా?
కొత్తమనిషి కాను.
గిరీ (కొత్తమనిషితో) అయితే, దాసోహం! - టుది అన్నోన్‌! (నిష్క్రమించుతూ గుమ్మము దగ్గరకువెళ్లి, తిరిగిచూసి కొత్తమనిషిని బతిమాలుకున్నట్లు అభినయించి, వెళ్లును.)
సౌజ గిరీశంగారుకవి - మహా యోగ్యవైఁన చిన్నవాడు.
కొత్తమనిషి వితంతువులను పెళ్లాడడం, యాంటీనాచీకూడా మంచికి ఆవశ్యకవేఁనా అండి?
సౌజ వితంతువులను, యిష్టమైతే పెళ్లాడవొచ్చును లేకుంటే మానవొచ్చును. మంచితో దానికి పనిలేదు. గాని వేశ్యాసంసర్గకలవాడు యెన్నడూ మంచివాడు కానేరడు.
కొత్తమనిషి అంతేనా అండి, లేక వేశ్యనుచూడరాదు; వేశ్యతో మాటాడరాదు; వేశ్యపాట వినరాదు; అని నిర్నయంకూడా వున్నదా అండి?
సౌజ అలాటి నిర్నయంవుంటే మరీ మంచిది.
కొత్తమనిషి తమరు యాంటినాచ్‌ అనుకుంటాను.
సౌజ ఔను.
కొత్తమనిషి (చిరునవ్వు నవ్వుతూ) గిరీశంగారూ యాంటీనాచేకదా అండి?
సౌజ మీకు తెలియదా? ఆయన యాంటీనాచికి గురువు.
కొత్తమనిషి ఆయన నాకుకూడా గురువులేనండి.
సౌజ అలాగనా? నాకు చాలా సంతోషం.
కొత్తమనిషి యీ విషయంలో చాలాకాలవాఁయి నాకు ఒక్కసందేహం వుండిపోయింది; క్షమిస్తే మనవిజేస్తాను.
సౌజ చెప్పండీ - తప్పేమి?
కొత్తమనిషి వేశ్యలను పాటకు పిలవకపోతే, వాళ్లు బతకడం యెలాగండి?
సౌజ పెళ్లిచేసుకుంటేసరి.
కొత్తమనిషి గిరీశంగారిలాంటివారిని అనా తమ అభిప్రాయం?
సౌజ యేమిమాట అన్నారు! రేపోనేడో ఆయ్న ఒక పవిత్రమైన వితంతువును పెళ్లికానైయున్నారు గదా, వేశ్యనా పెళ్లాడుతారు?
కొత్తమనిషి జపాన్‌దేశంలో గెయిషాలని వేశ్యలువున్నారనీ, వాళ్లని గొప్పగొప్ప వారు కూడా పెళ్లాడతారనీ యీ గిరీశంగారే కాబోలు చెప్పగావిన్నాను. జపాన్‌ దేశం గొప్పదేశం అని అంటారండి?
సౌజ ఔనుగాని, గొప్పదేశంలోవున్న చెడ్డనే మనం అవలంబించాలా? గిరీశంగారు అట్టి అపవిత్రమైన పనికి ఇయ్యకొనరు.
కొత్తమనిషి అయితే పెళ్లిచేసుకోగోరిన వేశ్యలకు కోరతగిన వరులు దొరకడం యెలాగండి? లేక యెట్టివారైనాసరే అని తమ అభిప్రాయమా అండి?
సౌజ యీసంగతి యింకా నేను బాగా ఆలోచించలేదు - వేశ్యలు విద్యలునేర్చి, ఇతరవృత్తులవల్ల సత్కాలక్షేపము చెయ్యరాదా?
కొత్తమనిషి అట్లా చేస్తే, తమవంటివారు వాళ్లను వివాహమౌదురా?
సౌజ యేంప్రశ్న? నేను యెన్నడూ వేశ్యను పెళ్లాడను. నాయెత్తు ధనంపోస్తే వేశ్యను ముట్టను.
కొత్తమనిషి ప్రమాదంవల్ల వేశ్యశరీరం తమకు తగిలితే?
సౌజ (నవ్వుతూ) తగిలినశరీరం కోసేసుకుంటాను. చిత్రమైన ప్రశ్నలడుగుతున్నారు!
కొత్తమనిషి వేశ్యజాతి చెడ్డకావచ్చును. గాని తాము శలవిచ్చినట్లు, చెడ్డలో మంచి వుండకూడదా? మంచి యెక్కడనున్నా గ్రాహ్యంకాదా అండి?
సౌజ మంచి యెక్కడనున్నా గ్రాహ్యమే. గాని మీరు వచ్చినపని చెప్పా`రుకారు?
కొత్తమనిషి నాపనిమట్టుకు మిమ్మల్ని చూడడమే.
సౌజ చూడడానికి నిశీధవేళ రావలెనా?
కొత్తమనిషి మీపని మించిపోకూడదని అట్టివేళవచ్చాను.
సౌజ మించిపోయేపనులేవీ నాపనులులేవే?
కొత్తమనిషి దురవస్థలోవున్నవారి పనులల్లా తమ స్వంతపనులుగానే యోచింతురని లోకులవల్లవిన్నాను. మరేంలేదు, అవధాన్లుగారి కేసులోగట్టి సహాయం చెయ్యగలిగినవారి నొకరిని నేను యెరుగుదునండి.
సౌజ అలాగైతే మిమ్మల్ని మాపాలిట దేవుణ్ణిగా భావిస్తాం.
కొత్తమనిషి అంతమాట నాకు దక్కాలిగదా అండి?
సౌజ యేమి అలాగ అంటున్నారు?
కొత్తమనిషి మరేమీలేదు. ఆ కార్యసాధనము ఒకవేశ్యవల్ల కావలశివున్నది. అదీ చిక్కు.
సౌజ డబ్బు యిద్దాం.
కొత్తమనిషి ఆవేశ్య ద్రవ్యానికి సాధ్యురాలుకాదండి.
సౌజ అయితే మరేమి కోరుతుంది?
కొత్తమనిషి ఆమెకోరిక అసాధ్యవఁని తలుస్తానండి.
సౌజ అయినా యేమిటోచెప్పండి.
కొత్తమనిషి చెప్పితే మీకు ఆగ్రహం రావడమేకాని, కార్యం వుండదనుకుంటానండి.
సౌజ తనను వుంచుకోమంటుందా యేమిటి! అది యెన్నడూ జరిగేపనికాదు.
కొత్తమనిషి ఆ ముసలిబ్రాహ్మడి దురదృష్టం! మనవేఁంచెయ్యగలవండి?
సౌజ యెంత బుద్ధిహీనురాలు! అసందర్భమైన యిలాటికోరిక కోరతగునా? మీరెలా మోసుకొచ్చారు యింత అసంభావితమైనమాట?
కొత్తమనిషి వ్యవహారవిషయములు మాట్లాడతూన్నప్పుడు మంచైనా చెడ్డైనా ఉన్న మాటలు నాలుగూ అనుకోవడం విధాయకం గదండి. ఆమనిషి తలకి తగని వెఱ్ఱి కోరిక పెట్టుకుంది అనేమాట అన్నంతినే మనిషల్లా యెరగడాఅండి?
సౌజ నేను మన్మథుణ్ణనా నన్ను వలిచింది?
కొత్తమనిషి మిక్కిలీ మంచివారని కాబోలు.
సౌజ సానిదానికి మంచితో పనివుండదు. ఇదియేదో యెత్తైవుండాలి.
కొత్తమనిషి మృచ్ఛకటిక చదివిందేమోనండి.
సౌజ వసంతసేనలాంటి మనిషి వెఱ్ఱికవీశ్వర్ల కల్పనలో వుండాలిగాని లోకంలో వుండదు. యేదో యెత్తు. అందుకు సందేహం వుండదు - సాధనాంతరం లేదో?
కొత్తమనిషి తమరు ప్రశ్నలు అడుగుతారు. విన్నమాట మనవిచేస్తే ఆగ్రహిస్తారు. యేంసాధనం?
సౌజ శ్రీకృష్ణుడి అనుగ్రహంవల్ల ఆగ్రహమనే వస్తువను చంపుకోవడముకు సదా ప్రయత్నంచేస్తున్నాను. స్ఖాలిత్యం కనపర్చారు. కృతజ్ఞుడను. చెప్పవలసినది చెప్పండి.
కొత్తమనిషి తమకు వుంచుకోవడం మనస్కరించకపోతే, తనను వివాహము కావచ్చునని కూడా ఆమనిషి అభిప్రాయము.
సౌజ మంచివారిని హేళన చెయ్యవలసినదనికూడా మీతల్లిగారి ఉపదేశం కాబోలు?
కొత్తమనిషి మీ శ్రీకృష్ణునిమీద ఆన - మీయెడల నాకు అమాయకమైన భక్తికలదు. తమరియెడల తృణీకారభావము నాహృదయమందు యెన్నడూ పుట్టదు. నమ్మండి. రాయభారి మోసుకువచ్చేమాటలకు రాయభారిని తప్పు పట్టడం ధర్మంకాదు. యివి జరిగేమాటలని నేను మనవిచెయ్యలేదు. వున్నమాట మనవిచేస్తే, వకీళ్లు గనక వేశ్యపెట్టిన చిక్కు విప్పజాలకపోతారా అని మనవిచేశాను.
సౌజ వేశ్యలకు వకీళ్లు సమదంతాఅ`నా? (నవ్వి) నేనుమట్టుకు వోడిపోయినానని వొప్పుగుంటున్నాను. యెగతాళీలో దించకండి - వేశ్య డబ్బొల్లకపోదు. ద్రవ్యం కోరమనండి, ఆయనైనా యిస్తారు, నేనైనా యిస్తాను.
కొత్తమనిషి అందాకా యెందుకండి? తమదాకా అక్కరలేదు, ఆ బ్రాహ్మడికి ఉపకారార్థం నేనేయిస్తును. ఆమనిషి ద్రవ్యానికి సాధ్యురాలుకాదని మనవి చేశాను; నమ్మరా?
సౌజ అన్నట్టూ, మీరు గిరీశంగారి శిష్యులమంటిరిగదా? మీరు యాంటినాచ్‌ కారా? అయితే, వేశ్యవల్ల యీ భోగట్టా యావత్తూ మీకు యెలా వొచ్చింది? యిదంతా యెగతాళా? కుట్రా?
కొత్తమనిషి నమ్మనివారితో యేమిచెప్పను? యిది కుట్రాకాదు; యెగతాళీకాదు. నేను అక్షరాలా యాంటీనాచ్‌నే. వివేకలేశంవున్నవారు యెవరు యాంటినాచ్‌ కారండి? గాని, విధికృతంచేత నాకు వేశ్యాసంసర్గ తప్పిందికాదు.
సౌజ యేమిటో ఆవిధికృతం?
కొత్తమనిషి ఇది! (కొత్తమనిషి నెత్తినివున్న పాగాతీసి జుత్తును జారవిడిచి; వెనకకు తిరిగి తొడుగుకున్న కోటువిడచి, కప్పుకున్నశాలువ వల్లెవాటుగావేసికొని సౌజన్యారావుపంతులు వేపుతిరిగి) నావూరూపేరూ అడిగితిరి. వూరు విజయనగరం; పేరు మధురవాణి!
సౌజ (మొదట ఆశ్చర్యమగ్నుడై, యోచనపైని కోపావేశము కలిగి నిలిచి) యేమి మోసము జరిగినది!
మధు గురువుల ఉపదేశం గురువులే మరవకూడదు. చెడ్డలోకూడా మంచి వుండవచ్చును. కాక మంచి చెడ్డలు యెంచేవారెవరు?
సౌజ యేమి దగా!
మధు నిర్మలమైన అంతఃకరణతో వస్తిని. నిజం దేముడెరగవలె. దగా అని తోచినది; యేమి చెయ్యగలను? వెళతాను.
సౌజ శీఘ్రంగా వెళ్లవచ్చును.
(మధురవాణి పాగా కోటూవిడిచి గుమ్మమువరకు వెళ్లును.)
సౌజ నిలు - నిలు -
(మధురవాణి తిరిగివచ్చి, కొంచము యెడముగా యెదట నిలుచును.)
సౌజ పాగా, కోటూ మరిచిపోయినావు.
మధు అంతేనా? మనసే మరచిపోయినాను; కొదవేవిఁటి? (తిరిగి రెండడుగులు వెళ్లును.)
సౌజ మాట!
మధు (తిరిగిచూసి) యీమాటు యేం మరిచానండి?
సౌజ నువ్వుమరవలేదు, నేనే మరిచాను. లుబ్ధావధాన్లుగారి మాటేమిటి?
మధు తమమంచి లోకప్రసిద్ధమైనప్పటికీ, ఆయనయందు తమకు అట్టే అభిమానం భగవంతుడు పుట్టించలేదు.
సౌజ ఆయనను కాపాడడముకు న్యాయవైఁనపని యేమిచెయ్యమన్నా చేస్తాను. అనేక సంవత్సరములాయ, వేశ్య అన్నది నాయింటికిరాలేదే? నేను వేశ్యతో యెన్నడూ మాట్లాడలేదే? యీనాటికి వ్రతభంగమైనదిగదా, అని అపారమైన విచారములో ములిగివున్నాను.
మధు తమరు ప్రాజ్ఞులు; వ్రతభంగమేది?
సౌజ నిశిరాత్రివేళ పడకింటిలో వేశ్యను పెట్టుకుని మాట్లాడటం కన్న యింకా యేమి కావలెను?
మధు తమరు నన్ను రప్పించలేదే? వేశ్యలు పార్టీలైతే, వకీళ్లు కేసులు పట్టరో?
సౌజ పడతాం, పట్టం; యేమైనా నువ్వు పార్టీవైనాకావే?
మధు కాను - గాని మీపాటీయని కాపాడేమనిషిని. నేను యెవతెనైతేనేమి - నను చూడకూడదా? అది అలా వుండగా వేశ్యలము దేవాలయములలో భగవంతుణ్ణి చూడడమునకు పోవచ్చునుగదా? సత్పురుషులైన తమవంటివారి దర్శనమునకు మాత్రం నిరోధమా?
సౌజ "మంచివారు, మంచివారు" అని పలుమారు అంటూవుంటే నాకు లజ్జగా వుంది. ఆమాట మరి అనకు - చూడరావచ్చునుగాని రాత్రివేళ పడకింట్లోనా!
మధు వేశ్యనని వర్తమానంచేస్తే పగటివేళ చూతురో?
సౌజ నా శత్రువులు యెవళ్లో నిన్ను నాదగ్గిరకు పంపా`రు. (నఖసిఖపర్యంతం నిదానించి) యెంతటివాళ్లైనా వుంటారు!
మధు అలాగైతే తమమంచే తమకు శత్రువై ఉండాలి. మీ కార్యం నిర్వహించి డబ్బు ఒల్లనప్పుడు కుట్రా కూహకంలేదని నమ్ముదురా?
సౌజ అంత మంచిమనిషిని అయితే, పాపము ఆ బ్రాహ్మడికి ఉపకారం నీవు చెయ్యరాదా? మధ్య నాకు గండగత్తెరేమి?
మధు నేను మంచిదాననని నమ్మగలరా?
సౌజ ఆబ్రాహ్మణ్ణి కాపాడితే నమ్మనా?
మధు అయితే, ఒకతుని తగువు మనవిచేస్తాను.
సౌజ అట్టేసేపు నువ్వు నాయెదటగానీ నిలిచివుంటే, నువ్వు యేతగువుతీరిస్తే ఆతగువుకు వొప్పుదల అవుతానేమో అని భయవేఁస్తూంది.
మధు (ముఖముపక్కకుతిప్పి) ఒక్క చిన్నముద్దుకు కరువో?
సౌజ అంతటితో కార్యం నిర్వహిస్తావా?
మధు యేంజెయనూ, మరి?
సౌజ నా వ్రతభంగం చెయ్యడవేఁనా నీపట్టుదల?
మధు అడుగుమెట్టుకు దిగా`నని మెప్పులేదుగదా? యిష్టంలేనిపని యేల చేయించవలె? శలవు. (రెండు అడుగులు వెళ్లును.)
సౌజ ఆగు (మంచముమీద కూర్చుని - దుప్పటీ కప్పుకుని) కూచో.
మధు కూచోను.
సౌజ వెయ్యిరూపాయలిస్తాను. తీసుకుని బ్రాహ్మణ్ణి కాపాడు.
(మధురవాణి తిరిగీ వెళ్లబోవును.)
సౌజ వెళ్లకు - నీకు ముద్దాకావాలి? యేం వెఱ్ఱిమనిషివి! యేమిలాభం?
మధు నాకుతెలియదు.
సౌజ తప్పదూ?
మధు తప్పదనుకుంటాను.
సౌజ అయితే విధిలేక వొప్పుకుంటున్నాను. చిత్రం! వెయ్యిరూపాయలకంటె వక ముద్దు యెక్కువ విలవా? - సరే - నువ్వుచేసే సాయఁవేదో చెప్పు.
మధు తెల్లబియ్యం, పాటిమానికా - లుబ్ధావదాన్లుగారు వివాహవైఁనపిల్ల ఆడపిల్లకాదు.
సౌజ (ఆశ్చర్యముతో) యేమిటీ!
మధు మరచితిని - అందుతో సంబంధించినవారికి యెవరికిన్నీ హానిరాకుండా కాపాడతావఁని శలవిస్తేనేకాని పేర్లు చెప్పజాలను.
సౌజ లేకుంటే చెప్పవా?
మధు చెప్పను.
సౌజ లుబ్ధావధాన్లుగారివల్ల యెవరికిన్నీ బాధలేకుండా కాస్తాను. ఆయనకు కాక ఇతరులు యెవరికైనా హానిచేసివుంటే, నావశంకాదు.
మధుర చాలును. యిహ చెబుతాను. కరటకశాస్తుల్లుగారు వారిశిష్యుడికి ఆడవేషం వేశి పెళ్లిచేశారు.
సౌజ కరటకశాస్తుల్లా గుంటూరు శాస్తుల్లు!
మధుర అవును. కొంచం చిరిగెడ్డం అంటించుకున్నారు; అంతేభేదం-
సౌజ ఔరా? అతగాడి దారుణం!
మధుర అతనివల్ల తప్పులేదండి; అగ్నిహోత్రావధాన్లుగారి కూతురు ఆయన మేనకోడలు. ఆపిల్లని లుబ్ధావధాన్లుగారికి యివ్వడానికి నిశ్చయమైన సంగతి తమకు విశదమే. ఆసమ్మంధం తప్పించుటకు కరటకశాస్తుల్లుగారు యీ యెత్తు యెత్తారు. ఆయనకు మాత్రం హానిరానీకండి.
సౌజ ఔరా? యేమి చిత్రము! మేలుకున్నానా నిద్రబోతున్నానా?
మధుర నాఫీజుయిచ్చి మరీ నిద్రపొండి.
సౌజ బీదవాణ్ణి యిచ్చుకోలేనే?
మధుర నాకు లోకంలో ధనవంతా అదే అనుకున్నానే?
సౌజ నీవు సొగసరివి. ముద్దుచేదని కాదు. వ్రతభంగం గదా అని దిగులు.(ముద్దుపెట్టుకొన బోవును.)
మధుర ఆగండి.
సౌజ ఏమి?
మధుర నావ్రతమో?
సౌజ యేమిటది?
మధుర చెడనివారని చెడగొట్టవద్దని మాతల్లిచెప్పింది.
సౌజ చెప్పితే?
మధుర అందుచేత, మిమ్మల్ని ముద్దుపెట్టుకో నివ్వను.
సౌజ కృతజ్ఞుడనైవున్నాను!
మధుర ఆపుస్తుకము నేను చూడవచ్చునా అండి!
సౌజ చూడు.
(మధురవాణి పుస్తుకమువిప్పి చదువును.)
మధుర భగవద్గీతలు. యిది మంచివారు చదివేపుస్తుకమా అండి?
సౌజ యిది చెడ్డవారిని మంచివారినిగా చేశేపుస్తకం.
మధుర దానిలో యేముందండి?
సౌజ అదిచదివిన వారికల్లా విలువలేని గొప్పస్నేహితు డొకడు దొరుకుతాడు.
మధుర యెవరండి ఆస్నేహితులు?
సౌజ శ్రీకృష్ణుడు.
మధుర శ్రీకృష్ణుడు సానిదానితోకూడా స్నేహంకడతాడా అండి?
సౌజ శ్రీకృష్ణుడు తన్ను నమ్మినవారితో అల్లా స్నేహం కడతాడు. పరమాత్మకు జాతిభేదంలేదు.
మధుర శ్రీకృష్ణుడు ఆంటీనాచికాడా అండి?
సౌజ యేమి పెంకెవు!
మధుర అయితే యీపుస్తుకం చదువుతాను. చదివి మంచిదానను అవుతాను.
సౌజ కావలిస్తే ఆపుస్తుకం తీసుకువెళ్లు.
మధుర కృతార్థురాలను - శలవా?
సౌజ (వెన్ను కుర్చీవేపుచూచి యోచించి) నువ్వు మంచిదానివి. యెవరో కాలుజారిన సత్పురుషుడిపిల్లవై వుంటావు. యీవృత్తి మానలేవో? స్థితిలోపమా?
మధు దైవానుగ్రహంవల్ల లోపంలేదు. నావృత్తియొక్క హైన్యత గుర్తెరుగుదును. సత్పురుషులదయ సంప్రాప్తమైన తరవాత దుర్వృత్తి యేలవుంటుంది?
సౌజ (భగవద్గీతాపుస్తకము మీదనున్న శ్రీకృష్ణుని విగ్రహమును వేలునజూపి) సత్పురుషుడనే నామము సార్థకముగాగల యీ సత్పురుషుణ్ణి నీకు యిచ్చాను ఆయన స్నేహం బలమైనకొలదీ మాబోంట్లను తలచవు.
మధు అప్పటప్పట తమదర్శనము చేసుకోవచ్చునా?
సౌజ (తటపటాయించును.)
మధు వృత్తిమానినా, మంచి-
సౌజ అయితే రావచ్చును.
మధు కృతార్థురాలను. (పుస్తకము వక్షమున ఆని చేతులు జోడించి) శలవు!
సౌజ మరోమాట! (మధురవాణి ప్రశ్నార్థకముగా కనుబొమలెత్తి చూచును) నీకు గిరీశంగారి పరిచయం యెక్కడ?
మధు క్షమించండి.
సౌజ చెప్పవా?
మధు తాము చెప్పకతీరదని ఆజ్ఞాపిస్తే దాటగలనా? పాపము ఆయనను బతకనియ్యండి.
సౌజ అతడి బతుకుమాట ఆలోచించుతున్నావు. వీడు అవ్యక్తుడైతే, పాపము ఆ బుచ్చమ్మ బతుకు చెడుతుంది. అది ఆలోచించావుకావు.
మధు (ఆలోచించి) అవును. ఆయన నాకు కొంతకాలం యింగిలీషు చదువు చెప్పేవారు. కొంతకాలం వుంచుకున్నారు కూడాను.
సౌజ యెన్నాళ్లకిందట?
మధు మొన్న మొన్నటి దాకా.
సౌజ చిత్రం! ఒక్క నిమిషము ఆగు (పైకివెళ్లి గిరీశమును వెంటబెట్టుకునివచ్చి) నెపోలియన్‌ ఆఫ్‌యాంటి నాచ్‌గారూ! యీమెను మీరు యెరుగుదురా?
గిరీ కొంతకాలంకింద గిరీశం అనే ఫూలిష్‌ యంగ్‌మా`న్‌ వొకడు వుండేవాడు. మధురవాణి అనే అ`బ్యూటిఫుల్‌ నాచిడెవిల్‌ ఒకతెవుండేది. వాడి దురదృష్టం వల్ల దానివలలలో చిక్కి, మైమరచి అంధకారంలో పడిపోయినమాట సత్యము. గురువుల ఉపదేశం కొంతకాలానికి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ అంధకారంలోంచి వెలువడి గురువుల పాదములు చేరుకుని గతం కలగాభావించి, మరిచి, మంచి తోవలో పడ్డాడు. ఆగిరీశవేఁ యీ గిరీశం - ఆ మధురవాణే యీ మధురవాణి! స్వర్గానికి ఒక్క చీడీ తరవాయిగా వున్న నన్ను నరకానికి లాగడానికి తిరిగీ యిక్కడ నాపురాకృతంవల్ల ఆవిర్భవించింది! ఐటర్నడ్‌ ఆల్టుగెదరే న్యూలీఫ్‌ - పాపంలో కాలుజారి, పశ్చాత్తాపపడి, రిఫార్ము అయినాను. నావంటి సిన్నర్సిని సహాయంచేసి మంచివాళ్లని చెయ్యడం తమ బిరుదుగాని, బ్రతుకుచెరచడం న్యాయంకాదు. ఐక్రేవ్‌ యువర్‌ మెర్సీ.
సౌజ యెన్నాళ్లైంది చీకట్లోంచి వెలుతురులోకి వురికి?
గిరీశం (వూరుకుండును.)
సౌజ (మధురవాణితో) నువు చెప్పగలవు.
గిరీశం యెన్నాళ్లైతేనేమండి? ట్రూరిపెంటెన్సు ట్వంటీఫోర్‌ అవర్సు చాలదా అండి?
సౌజ ఔరా! నీలాంటి ఆషాఢభూతులవల్ల నీ గురువుగారు యెంత సులభంగా దగాపడతారూ! అరె, నన్నుకూడా భ్రమింపజేస్తివే! నిన్ను మరి చేరనివ్వవద్దనీ, బుచ్చమ్మను పూనాలో విడోజుహోముకు పంపమనీ మీగురువుగారిపేర టెల్లిగ్రాంయిస్తాను. ఆమె చదువుకుని ప్రాజ్ఞురాలై తనయిష్ఠము వచ్చినవారిని పెళ్లిచేశుకుంటారు. లేకుంటే మానుతారు. రిఫారము అయితివనిగదా నీవు చెప్పితివి. నిజమైతే, కాలేజీలో ప్రవేశించి, పైపరిక్షలకు చదువుకో. నీ ప్రవర్తన బాగున్నంతవరకు ద్రవ్యసహాయం చేస్తాను. బుద్ధితెచ్చుకుని బతుకు. మధురవాణిని డెవిలంటివే? నీవే డెవిల్‌. ఆమె నీ అయోగ్యత అయినా నొక్కి అడిగితేగాని చెప్పిందికాదు. వక సత్యకాలపు బ్రాహ్మడిని కాపాడడమేకాకుండా, దుర్మార్గుడవైన నీచేతిలో పడకుండా బుచ్చమ్మను కాపాడింది. నాకు వక మహోపకారంకూడా చేసింది. గనుక, నాసంతోషమును తెలియచేయుటకు, యిదిగో ఆమెతో షేక్‌హాండ్‌ చేస్తున్నాను. (షేక్‌హాండ్‌ చేయును) నెపోలియ\న్‌! తక్షణం యింట్లోనుంచి పైకిపో!
గిరీ (గది గుమ్మందాటి) డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది.
(తెరదించవలెను.)
AndhraBharati AMdhra bhArati - nATakamulu - kanyASulkamu - kanyASulkaM - kanyAshulkamu kanyAshulkaM - gurajADa appArAvu - Kanyasulkam - kanyaasulkam kanyaasulkamu Gurajada AppaRao Gurajada Appa Rao ( telugu literature andhra literature)