శతకములు కుమార శతకము
1 11 21 31 41 51 61 71 81 91 101
క. శ్రీభామినీ మనోహర
సౌభాగ్యు దయాస్వభావు సారసనాభున్‌
లో భావించెద నీకున్‌
వైభవము లొసంగుచుండ వసుధ కుమారా!
1
క. ఆజ్ఞ యొనర్చెడి వృత్తుల
లో జ్ఞానము గలిగి మెలఁగు లోకులు మెచ్చన్‌
బ్రాజ్ఞతను గలిగి యున్నన్‌
బ్రాజ్ఞులలోఁ బ్రాజ్ఞుడవుగ ప్రబలు కుమారా!
2
క. అతి బాల్యములోనైనను
బ్రతికూలపు మార్గములఁ బ్రవర్తింపక స
ద్గతిమీఱ మెలఁగ నేర్చిన
నతనికి లోకమున సౌఖ్యమగును ముమారా!
3
క. వృద్ధజన సేవ చేసిన
బుద్ధి విశేషజ్ఞుఁడనుచుఁ బూతచరితుఁడున్‌
సద్ధర్మశాలి యని బుధు
లిద్ధరఁ బొగడెదరు ప్రేమ యెసఁగఁ గుమారా!
4
క. పెద్దలు వద్దని చెప్పిన
పద్దులఁ బోవంగరాదు పరకాంతల నే
ప్రొద్దే నెదఁ బరికించుట
కుద్దేశింపంగఁ గూడ దుర్విఁ గుమారా!
5
క. తనపై దయ నుల్కొనఁగను
గొన నేతెంచిన సుశీల గురుమతులను వం
దనముగఁ బూజింపఁ దగు
మనమలరఁగ నిదియ విబుధ మతము కుమారా!
6
క. ఉన్నను లేకున్నను పై
కెన్నఁడు మర్మంబుఁ దెలుప నేగకుమీ నీ
కన్న తలిదండ్రుల యశం
బెన్నఁబడెడు మాడ్కిఁ దిరుగు మెలమిఁ గుమారా!
7
క. పెద్దలు విచ్చేసినచో
బద్దకముననైన దుష్ట పద్ధతి నైనన్‌
హద్దెఱిఁగి లేవకున్నన్‌
మొద్దువలెం జూతు రతని ముద్దు కుమారా!
8
క. సతతముఁ బ్రాతఃకాలో
చిత విధులను జరుపు మరసి శీఘ్రముగ నహః
పతి పూర్వపర్వతాగ్రా
గతుఁడగుటకు మున్నె వెరపు గల్గి కుమారా!
9
క. పోషకుల మతముఁ గనుఁగొని
భూషింపక కాని ముదముఁ బొందఁడు మఱియున్‌
దోషముల నెంచుచుండును
దోషివయిన మిగులఁ గీడు దోఁచుఁ గుమారా!
10
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kumAra shatakamu - telugu Satakamulu tenugu andhra ( telugu andhra )