వచన సాహిత్యము | పీఠికలు | చక్కట్లదండ - దాసు శ్రీరాములు |
తెలుగులో వ్రాయాలి, అచ్చ తెలుగులోనే వ్రాయాలి అనే కోరికా పూనికా మధ్య మధ్య కొందరికి కలిగింది. అటువంటి రచనలవల్ల రచయిత పూనిక నెరవేరుతుంది. పాఠకులకు భాషాపరిజ్ఞానమూ కలుగుతుంది. కాని దానివల్ల చాలా కృతకమైన భాష ఏర్పడుతుంది కూడా. పుడమిదయ్యము, బొమ్మగ్రుడ్డు, కడలి మొలనూలు చేడియ కనినపడుచు, మంచిమెడ, యెకిమీడు మొదలైన పదాలకీ, ఈ పూనికకీ పేగు సంబంధం ఉంది. ఆయా పదాలు ఆయా కావ్యాలకు ముందూ లేవు; తర్వాత వాడుకలోకీ రాలేదు; అవి ఆయా కవుల కిట్టింపు ధోరణికీ, అతుకుల బుద్ధికీ పరిమితమయిపోయాయి; లోకానికి క్షేమం.
దాదాపు నూరేండ్ల క్రిందట అచ్చ తెలుగులో ఈ 'చక్కట్లదండ' వెలసింది. లౌకికనీతిమాలిక అన్న సంస్కృత సమాసానికి తెలుగులో ఏర్పడిన అతుకుల బొంత పేరు చక్కట్లదండ. అయితే, ఒక్కపేరులో తప్ప, సామాన్య పాఠకులకు సులభంగా అర్థంకాని పదాలు ఇందులో లేనట్లే; సంతోషం.
దాసువారు సంస్కృతసమాలను ఈ శతకంలో వాడలేదు. ఇది అచ్చ తెలుగు కావ్యాల పద్ధతియే. అచ్చ తెలుగులో అదృశ్యమైనది సంస్కృతసమం మాత్రమే కాని ఆంగ్లమూ, ఉర్దూ చొరబడ్డాయి. అవి తెలుగులో ప్రవేశించి వాడుకలోకి వచ్చాయికదా అని కవిగారి వాదం. సంస్కృత పదాలూ ప్రవేశించినాయి కదా? మరి వాటికిలేని స్థానం ఉర్దూ, ఇంగ్లీషులకు ఎల్లా దక్కింది?
దీనికి చారిత్రక కారణం వెదకాలి. తెలుగులో అచ్చ తెలుగు కావ్యాలు పుట్టేనాటికి సంస్కృతసమాలే ఎక్కువగా ప్రవేశించాయి. కనుక అచ్చ తెలుగు అనగానే సంస్కృత పదాలను పరిహరించవలసి వచ్చింది. అచ్చ అంటే 'సంస్కృతసమేతరంబయిన భాష' అని లక్షణవేత్తలు నిర్ణయించారు. దాసువారు ఈ సంప్రదాయాన్నే కొనసాగించారు. కాని అచ్చ తెలుగుమీద వల్లమాలిన వ్యామోహం లేకపోవడంవల్ల, దైనందిన వ్యవహారంలోని విదేశీ భాషాపదాలను వీరు వాడినారు. అస్తు.
నీతి పద్యాల్లో సుమతీశతకం మకుటాయమానమైనది; వేమన పద్యాలు అత్యంత సుందరాలు. అయితే సామాజిక పరిస్థితులనుబట్టి అనేక నీతి పద్యాల శతకాలూ (విశేషించి సీసపద్య శతకాలు), సంపుటులూ వెలువడ్డాయి. చక్కట్లదండ ఒక చక్కని పద్య శతకం. (తెలుగు శతకాలు సర్వసాధారణంగా అష్టోత్తరశత సంఖ్యా విస్తృతం, చక్కట్లదండ శతమాన పరిమితం.)
దాసు శ్రీరాములుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి; ప్రతిభా వ్యుత్పత్తులు సమపాళ్లలో రంగరించుకొన్న కవి, గొప్ప ధారాశుద్ధిగలిగిన రచయిత, న్యాయవాదిగా, సంఘ సంస్కర్తగా, జ్యోతిశ్శాస్త్రవేత్తగా ప్రసిద్ధులు. వారి లేఖిని నుంచి వెలువడిన ఈ చక్కట్లదండ క్రీ.శ. 1894వ సంవత్సరం ఆగష్టు నెలలో పూర్తి అయినదని కవి యిల్లా అంటున్నారు.
జయ సంవత్సరం (గెలుపు సాలున) వర్షర్తువునందు (వానకారు) శ్రావణ మాసంలో (మింటి నెలయందు) కృష్ణపక్షంలో (వెన్నెలతగ్గెడినాళ్ల) పంచమినాడు (పడగ తాల్చెడి రోజు) అశ్వనీ నక్షత్రమందు (జేజేల వెజ్జులు) వృశ్చిక లగ్నంలో (చెలగిన తేలు) అనగా అపరాహ్ణం 3-00 గంటలకు ఇది పూర్తి అయింది. (వృశ్చిక రాశియని పొరపాటున పడి ఉండవచ్చును.)
కవిగారు చక్కని ధారాశుద్ధిగలిగిన రచయిత అన్నాం. క్రింది పాదాల్లో అది ప్రస్ఫుటం.
కవిగారు హాస్యప్రియులు; ఉదాహరణకు
రంధ్రాన్వేషణ తత్పరులను హాస్యధోరణిలోనే మందలిస్తూ
సానితో నిచ్చ ముచ్చటలాడు విటగాఁడు - గుడిసెవేటును కూడు కోడెఁదూరు,
గొడ్డునంజుడు నెత్తికొనిపోయెడి గొడారి - పనికిమాలిన దెత్తుపాకిఁ దిట్టు,
తగునంచు గంజాయిదమ్ముఁ గొట్టు పినాసి - కల్లుఁ ద్రావెడి దోసకారిదెప్పు
ఏటేటి దెవసాలకేఁగు బాపఁడు పాడె - దాల్చు బాపని నెగతాళిసేయు ...
అని వ్రాశారు.
బరువు చేటగు అరువు సొమ్ము లనర్థకాలని హేళనచేశారు కవిగారు, క్రింది ధోరణిలో వ్రాశారు.
కవిగారికి కొన్ని మోజులున్నాయి, చూడండి.
ఇల్లా చూపించుకొంటూపోతే, పుస్తకమంతా ఉదాహరించాలి; ప్రతి పద్యంలోనూ, ప్రతి పాదంలోనూ ఏదో ఒక విశేషం ఉంటోంది మరి!
మరి సెలవు.
![]() |
![]() |